స్వైన్‌ఫ్లూ పంజా | swineflu panja | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూ పంజా

Published Wed, Feb 15 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

స్వైన్‌ఫ్లూ పంజా

స్వైన్‌ఫ్లూ పంజా

జిల్లాలో పెరుగుతున్న కేసులు
- ఇప్పటికే నలుగురికి నిర్ధారణ
- డోన్‌లో ఒకరి మృతి
- మేల్కొనని వైద్య ఆరోగ్య శాఖ
- కేఎంసీలోనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు
 
కర్నూలు(హాస్పిటల్‌): స్వైన్‌ఫ్లూ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే కర్నూలు నగరంలో ప్రకాశ్‌నగర్‌కు చెందిన ఒకరు, నందికొట్కూరు మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన ఒకరు, మిడుతూరుకు చెందిన ఒకరు, డోన్‌ పట్టణానికి చెందిన ఒకరు ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరిలో డోన్‌కు చెందిన మహిళ ఇటీవల మరణించింది. ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌కు వెళ్లి రావడంతో ఇన్‌ఫెక‌్షన్‌కు లోనుకాగా.. ఒకరు చెన్నై నుంచి వచ్చిన సోదరుని కారణంగా ఈ వ్యాధి బారిన పడినట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ వ్యాధి జిల్లాలో 2010లో ఒకరికి, 2012లో ఆరుగురికి, 2014లో ఒకరికి సోకగా 2015లో ఏకంగా 32 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరిలో 9 మంది మృతి చెందారు. 32 మందిలో కర్నూలు నగరానికి చెందిన 11 మంది ఉండగా.. మిగిలిన వారిలో పెద్దతుంబళం, డోన్, దేవనకొండ, చిప్పగిరి, సి.బెళగల్, లద్దగిరి, ఆస్పరి, ఎమ్మిగనూరు, హుసేనాపురం గ్రామాలకు చెందిన వారున్నారు. గత సంవత్సరం కృష్ణానగర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకగా, ఈ సంవత్సరం నెల రోజుల్లోనే నలుగురు వ్యక్తులకు వ్యాధి సోకడం.. వీరిలో ఒకరు మృతి చెందడటం ఆందోళన కలిగిస్తోంది.
 
నిర్లక్ష్యం వీడని వైద్య ఆరోగ్యశాఖ
వ్యాధి విస్తరించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన వైద్య ఆరోగ్యశాఖ నిద్రపోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని కరపత్రాలు ఆశాలు, ఏఎన్‌ఎంలకు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. క్షేత్రస్థాయిలో అవి ప్రజలకు చేరుతున్నాయా లేదా అని పరిశీలించే వారు కరువయ్యారు. దీనికితోడు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన ఆ శాఖ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ చేపట్టని పరిస్థితి. ఇందుకు సంబంధించిన మాస్‌ మీడియా సైతం మొద్దు నిద్రపోతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీలలో స్వైన్‌ఫ్లూ మందులు, మాస్క్‌లు అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ కారణంగా వ్యాధి లక్షణాలతో వచ్చే రోగులను చూసి వైద్యులు, సిబ్బంది ఆందోళనకు లోనవుతున్నారు.
 
కేఎంసీలోనే వైద్య పరీక్షలు
స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణకు గతంలో పూణే ల్యాబ్‌కు గళ్లను సేకరించి పంపించేవారు. ఆ తర్వాత ఇలాంటి పరీక్షలు హైదరాబాద్‌లో నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రస్తుతం తిరుపతిలో ఈ పరీక్షలు చేస్తున్నారు. ఈ నెల 8వ తేది నుంచి కర్నూలు మెడికల్‌ కాలేజీలోనూ హెచ్‌ఎన్‌ ఎన్‌వన్‌ ఇన్‌ఫ్లూయంజా ఎ రియల్‌టైమ్‌ పీసీఆర్‌ టెస్ట్‌ మిషన్‌గా పిలిచే యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల వ్యాధి నిర్ధారణ తక్కువ సమయంలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ల్యాబ్‌లో ఇప్పటి వరకు ఇద్దరికి పరీక్షలు నిర్వహించగా, ఒకరికి పాజిటివ్‌ వచ్చింది.
 
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నంద్యాల జిల్లా ఆసుపత్రి, ఆదోని ఏరియా ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. అయితే స్వైన్‌ఫ్లూ వ్యాధి ఉందని తేలితే మాత్రం కేవలం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా నెం.95 మాస్క్‌లు అందుబాటులో ఉంచారు. కానీ వైద్యులకే తగినంతగా ఈ మాస్క్‌లు అందుబాటులో ఉంచలేదు. ఈ కారణంగా రెండు సాధారణ మాస్క్‌లను కలిపి రక్షణ పొందుతున్నారు.
 
అరకొరగా స్వైన్‌ఫ్లూ నివారణ వ్యాక్సిన్లు
జిల్లా వ్యాప్తంగా 85 పీహెచ్‌సీలు, 20 సీహెచ్‌సీలు, ఒక జిల్లా ఆసుపత్రి, రెండు ఏరియా ఆసుపత్రులు, ఒక బోధనాసుపత్రి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూ వ్యాధి నివారణకు కేవలం 100 వాయిల్స్‌ మాత్రమే అందుబాటులో ఉంచింది. ఇందులో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు 50 ఇవ్వగా.. నంద్యాల, ఆదోనికి 10 వాయిల్స్‌ చొప్పున పంపిణీ చేశారు. జిల్లా మొత్తంగా 1800 ఒసల్టమివిర్‌ 75 ఎంజి మాత్రలను అందుబాటులో ఉంచారు. ఈ మాత్రలను వ్యాధికి గురైన రోగికి రోజుకు రెండు పూటలా ఐదురోజులు, వ్యాధికి గురికాకుండా ఉండేందుకు పక్కనున్న వారికి, వ్యాధిగ్రస్తునికి వైద్యం చేసేవారికి రోజుకు ఒకటి చొప్పున 10 రోజుల పాటు వాడాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
 
మూడు వైరస్‌ల కలయిక స్వైన్‌ఫ్లూ
హెచ్‌వన్‌ ఎన్‌వన్‌ ఇన్‌ఫ్లూయింజా మూడు రకాల వైరస్‌ల కలయికతో స్వైన్‌ఫ్లూ వస్తుంది. పందులు, పక్షులు, మనుషుల నుంచి ఈ కొత్త వైరస్‌ ఉద్భవించింది. పందుల నుంచి ఎక్కువగా విస్తరించే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు ఈ వైరస్‌లు విజృంభిస్తుంది. సాధారణ జలుబు, దగ్గుతో పాటు ఆయాసం, ఊపిరి తీసుకోలేకపోవడం, వాంతులు, విరేచనాలు అధికంగా వస్తే స్వైన్‌ఫ్లూ లక్షణాలుగా భావించి సమీప ఆసుపత్రిలో చేరాలి. షేక్‌హ్యాండ్‌ ఇవ్వకపోవడం, దగ్గు, జలుబు ఉన్నప్పుడు కర్ఛీఫ్‌ అడ్డం పెట్టుకోవడం, చల్లగాలికి తిరగకపోవడం చేయాలి. ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్లు వాడినా ఫలితం ఉంటుంది.
– డాక్టర్‌ పి.అజయ్‌కుమార్, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement