స్వైన్‌ఫ్లూ స్వైరవిహారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ వ్యాధి పంజా విసురుతోంది. రోజురోజుకూ విజృంభిస్తోంది. దీంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈ ఏడాది కూడా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ఆగస్టు ఒకటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3,590 మందికి రక్త నమూనా పరీక్షలు నిర్వహించగా, 556 మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్దారణ అయింది. అందులో 17 మంది చనిపోయారు. శీతాకాలంలో పగలూరాత్రిళ్లు చలి మరింత పెరుగుతుందని వాతావ రణ శాఖ ప్రకటిస్తున్న నేపథ్యంలో స్వైన్‌ఫ్లూ మరింత ప్రబలే ప్రమాదముందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది స్వైన్‌ఫ్లూపై విస్త్రృత ప్రచారం జరిపిన ప్రభుత్వ యంత్రాంగం ఈసారి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి.
గతంలో ముఖ్యమంత్రి ఏకంగా ప్రత్యేక మంత్రిమండలి సమావేశం నిర్వహించి స్వైన్‌ఫ్లూ నియంత్రణపై యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కానీ ఈసారి స్వైన్‌ఫ్లూ నియంత్రణకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇప్పటికీ కార్యక్రమాల రూపకల్పన చేయనేలేదు. హైదరాబాద్‌లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆసుపత్రులు, సినిమాహాళ్లు ఇలా అనేక రద్దీ ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలను చైతన్యం చేసేందుకు కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, సినిమా థియేటర్లల్లో స్లైడ్ల ద్వారా ప్రచారం చేయాలి. కానీ ఇటువంటి చర్యలేవీ లేవు.
సర్కారు ఆదేశాలు బేఖాతర్..!
‘ఎవరైనా స్వైన్‌ఫ్లూ అనుమానంతో కార్పొరేట్ లేదా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరితే వారికి చికిత్స ప్రారంభించాలి. స్వైన్‌ఫ్లూ ఉందో లేదో నిర్దారించే పరీక్షలను తప్పనిసరిగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లోనే చేయించాలి. ఈ పరీక్షలన్నీ కూడా ఉచితంగానే నిర్వహిస్తారు. అవసరమైన మం దులను ప్రభుత్వమే ఉచితంగా ఇస్తున్నందున ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు కూడా వారికి ఉచితంగా ఇవ్వాలి.’అని వైద్య, ఆరోగ్యశాఖ గతంలో ఆదేశాలు ఇచ్చింది.
కానీ ఆ ఆసుపత్రులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా నిలువు దోపిడీ చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. స్వైన్ ఫ్లూ నిర్దారణ పరీక్ష చేయాలంటే రూ.3,500 ఖర్చు అవుతుంది. రెండేళ్లలోపు చిన్నపిల్లలు, 65 ఏళ్ల పైబడి వయస్సున్న వారికి రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. అటువంటివారు జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్నీ, లివర్, షుగర్, బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధులున్నవారు అప్రమత్తంగా ఉండాలి. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఎక్కువ నీరు తాగాలి. శీతాకాలంలో ఫ్లూ అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులుంటే ఆసుపత్రిల్లో పరీక్షలు చేయించుకోవాలి. స్వైన్‌ఫ్లూ ఉన్నవారు మాస్కులు ధరించాలి.