ఆయుర్వేదం కౌన్సెలింగ్
డెంగీ జ్వరానికి, స్తైన్‌ఫ్లూకి నివారణ, చికిత్స ఆయుర్వేదంలో ఉన్నాయా? తెలుపగలరు.
- ఎ.పార్వతీశం, బి.హెచ్.ఇ.ఎల్, హైదరాబాద్
కొన్ని జ్వరాలను సాంక్రమిక వ్యాధులుగా వర్ణించి, జనపదోధ్వంసానికి దారితీస్తాయని వక్కాణించింది ఆయుర్వేదం. సాధారణంగా త్రిదోషాల కలయికతో వచ్చే రోగాలలో చికిత్స కష్టతరమవుతుంది. డెంగీ, స్తైన్‌ఫ్లూలు ఈ కోవ కు చెందినవే.
డెంగీ: ఈ జ్వరంలో ఉన్న లక్షణాలను పరిశీలిస్తే, ఆయుర్వేద సూత్రాల రీత్యా వాత శ్లేష్మాలు అధికంగా ఉంటూ, పిత్తానుబంధంగా ఉండే సన్నిపాత జ్వరాన్ని పోలి ఉంటుంది. ఈ వ్యాధిలో, రక్తంలో ప్లేట్‌లెట్లు బాగా తగ్గిపోవడం ఒక అంశం. దీనివల్ల రక్తస్రావం బహిర్గతమై, రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది.
నివారణ: దోమల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలి. వేపాకులు, ఆవాలు, ఇంగువ కలిపి పొగబెడితే (ధూపనకర్మ), క్రిమిహరంగానూ, దోమల నాశనానికీ ఉపకరిస్తుంది.
చికిత్స: ప్రత్యేకించి డెంగీ వ్యాధి మీద ఆయుర్వేద ఔషధాలను పరిశోధన జరిపి, కచ్చితంగా ఫలానా ఫలితాలు వచ్చాయని నిరూపణ జరిగిన దాఖలాలేమీ లేవు. అలాంటి ప్రకటనలు చేసే కువైద్యులు, సాధువులు, బాబాల చిట్కాలకు మోసపోకూడదు. జ్వరహర మూలికలు, కషాయాలు, ఇతర మందులను ఆయుర్వేద శాస్త్రంలో కూలంకషంగా వర్ణించారు. దోషప్రాబల్యాన్ని బట్టి ఈ ఔషధులు మారుతుంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన మందుల ప్రస్తావన మాత్రమే ఉంది. అవి... 1. తిప్పతీగ (గుడూచి), పిప్పలీమూలం, శుంఠి కషాయం 30 మి.లీ. రెండుపూటలా తాగాలి. 2. తిప్పతేగ, కరక్కాయ కషాయం.
మందుల షాపుల్లో లభించేవి: మృత్యుంజయ రస మాత్రలు ఉదయం 1, రాత్రి 1 (5రోజులు) అమృతారిష్ట ద్రావకాన్ని నాలుగు చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి మూడుపూటలా తాగాలి. చంద్రకళారస మాత్రలు ఉదయం 1, రాత్రికి 1 మోతాదులో 5 రోజులు వాడితే ప్లేట్‌లెట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పైన చెప్పిన కషాయాలు, నివారణార్థం వాడినా తప్పులేదు.
స్తైన్‌ఫ్లూ: ఈ లక్షణాలు, ఆయుర్వేద సూచనల రీత్యా, శ్లేష్మ వాత ప్రధానంగా, పిత్తానుబంధంగా ఉన్న సన్నిపాతజ జ్వరాన్ని పోలి ఉంటుంది.
చికిత్స: అల్లం, వెల్లుల్లి, పసుపు, దాల్చిన చెక్కల కషాయాన్ని 30 మి.లీ. రోజూ మూడుసార్లు తాగాలి.
త్రిభువన కీర్తరస మాత్రలు ఉదయం 1, రాత్రి 1. ఐదు రోజులు. వ్యోషాది వటి మాత్రలు పూటకి రెండు, 3 పూటలా.
నివారణ: పైన చెప్పిన కషాయం, వ్యోషాదివటి మాత్రలు వాడుకుంటే ప్రయోజనకరం. నష్టం లేదు. (కాకపోతే ఈ వ్యాధిపై ప్రత్యేకంగా పరిశోధన జరిపి తెల్పిన ఫలితం కాదు).
గమనిక: చిన్న పిల్లలకు పెద్దవారికిచ్చే మోతాదులో సగం ఇస్తే చాలు.
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 32. గత ఐదేళ్లుగా మార్కెటింగ్ రంగంలో పనిచేస్తున్నాను. మా టార్గెట్ పూర్తి కాకపోతే తీవ్ర ఒత్తిడికి గురువుతుంటాను. ఇటీవల అప్పుడప్పుడూ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటోంది. గుండెదడతో పాటు కళ్లు తిరిగినట్లు అనిపిస్తోంది. నాకు గుండెజబ్బు ఉందా అని అనుమానం కలుగుతోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపండి.
- మదన్‌రెడ్డి, హైదరాబాద్
మీరు తెలిపిన వివరాలను బట్టి మీరు చాలా ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉండటం వల్ల గుండె స్పందన తీరులో మార్పులు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. మీరు ఎక్కువగా మీ లక్ష్యాల గురించి ఆలోచించడం వల్ల, అది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలా తీవ్రంగా ఒత్తిడికి గురికావడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలోగానీ, మీ వంశంలోగానీ ఎవరికైనా గుండెజబ్బులు ఉంటే మరింత త్వరగా మీకు గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే వైద్యులను సంప్రదించండి. వారు సూచించిన వైద్యపరీక్షలు చేయించుకొని, ఏదైనా వ్యాధి ఉంటే దాన్ని త్వరగా నిర్ధారణ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే గుండె రక్తనాళాలు పూడుకుపోతే నడుస్తున్నప్పుడు ఆయాసం, ఛాతీలో నొప్పి, కళ్లుతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిసేపు విరామం తీసుకుంటే మళ్లీ సాధారణంగా మారతారు. అయితే రక్తనాళాలు పూర్తిగా పూడుకుపోతే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే జబ్బును మొదటి దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స తీసుకుని, ఆరోగ్యంగా జీవించవచ్చు. మీరు సాధ్యమైనంత వరకు ప్రశాతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ లక్ష్యాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మానసిక ఒత్తిళ్లకు లోనుకావద్దు. రోజుకు కనీసం అరగంట పాటైనా వ్యాయామం, వాకింగ్ చేయడం గుండెకు చాలా మంచిది. యోగా, ధ్యానం వంటి మానసిక ప్రశాంతత చేకూర్చే ప్రక్రియలను అవలంబించండి.
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 46. చాలా ఏళ్లుగా ఎసిడిటీతో బాధపడుతున్నాను. 3 నెలల నుంచి మందులు వాడుతున్నాను. అయినా కడుపునొప్పి తగ్గడం లేదు. దీనికి తోడు మలబద్ధకం, తలనొప్పి సమస్యలూ ఉన్నాయి. తగిన పరిష్కారం చెప్పండి.
- నితీశ్, విజయవాడ
మీ లేఖలో మీరు ఎండోస్కోపీ చేయించారా లేదా అన్న విషయం రాయలేదు. ఇక రెండో అంశం మలబద్ధకం పాటు కడుపునొప్పి ఉంటోందని రాశారు. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీ సమస్య ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కావచ్చని అనిపిస్తోంది. ఆ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి. మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం, యాంగ్జైటీ, ఒత్తిడి వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. మీ సమస్య అదుపులోకి వస్తుంది.
నా వయసు 28. నాకు కడుపులో నొప్పి వచ్చి, నా బరువు తగ్గింది. డాక్టర్‌ను కలిస్తే చిన్న పేగుల్లో టీబీ వచ్చిందని చెప్పారు. ఆర్నెల్లు మందులు వాడాను. అయితే టీబీ పూర్తిగా తగ్గిందా లేదా అనే సందేహం ఉంది. చిన్నపేగులకు టీబీ వస్తే మందులతో తగ్గుతుందా?
- రవికుమార్, నిడదవోలు
మందులు తీసుకోవడం వల్ల టీబీ పూర్తిగా నయమవుతుంది. ఒక్కోసారి టీబీ అదుపులోకి వచ్చినా కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆందోళన వద్దు. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న పేగుల టీబీ వల్ల పేగుల్లో పుండ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన సూచనలు తీసుకోండి.
మా బాబు వయసు పదేళ్లు. ఎనిమిదేళ్ల వయసులో పచ్చకామెర్లు వచ్చాయి. నెల రోజుల్లో వాటంతట అవే తగ్గిపోయాయి. మళ్లీ రెండు వారాల క్రితం మళ్లీ కళ్లు రెండు పచ్చగా కనిపిస్తున్నాయి. తగిన సలహా ఇవ్వండి.
- సంతోష్‌రెడ్డి, కర్నూలు
ఈ వయసులో పచ్చకామెర్లు రావడానికి ముఖ్యంగా హెపటైటిస్ ఎ, ఈ అనే వైరస్‌లు కారణం కావచ్చు. ఇంతకుముందు ఒకసారి కామెర్లు వచ్చాయంటున్నారు కాబట్టి అదే వైరస్ మళ్లీ సోకే అవకాశం చాలా అరుదు. కారణం... ఒకసారి ఏదైనా వైరస్ సోకినప్పుడు మన శరీరంలో దాని పట్ల రోగనిరోధక శక్తి వృద్ధిచెందుతుంది. కాబట్టి మీ బాబుకు కామెర్లు వచ్చాయంటే దానికి ఇతర కారణాలు (అంటే విల్సన్స్ డిసీజ్ లాంటివి) ఏవైనా ఉన్నాయా అని చూడాలి. మీ బాబుకు దురద, రక్తహీనత వంటి ఇతర లక్షణాలు ఏవైనా ఉన్నాయా అన్న వివరాలు రాయలేదు. మీరు నిపుణులైన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌కు చూపించి, తగిన పరీక్షలు చేయించుకుంటే బాబు త్వరగా కోలుకునే అవకాశం ఉంది.
మానసిక ఒత్తిడితో గుండెజబ్బులు వస్తాయా?
Published Wed, Oct 7 2015 10:46 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM
Advertisement