ఇటు స్వైన్‌ఫ్లూ.. అటు డెంగీ | Both dengue and the swine flu | Sakshi
Sakshi News home page

ఇటు స్వైన్‌ఫ్లూ.. అటు డెంగీ

Published Fri, Sep 11 2015 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

ఇటు స్వైన్‌ఫ్లూ.. అటు డెంగీ

ఇటు స్వైన్‌ఫ్లూ.. అటు డెంగీ

మళ్లీ విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు
 తాజాగా ఐదు స్వైన్ పాజిటివ్ కేసులు నమోదు
 చికిత్సల పేరుతో రోగుల నిలువు దోపిడీ
 ఆందోళనలో గ్రేటర్ వాసులు

 
సిటీబ్యూరో: గ్రేటర్‌పై మళ్లీ వ్యాధులు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా స్వైన్ ఫ్లూ... డెంగీ విజృంభిస్తున్నాయి. స్వైన్ ఫ్లూ వైరస్ స్వైర విహారం చేస్తోంది. గ్రేటర్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు 1082 స్వైన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముషీరాబాద్‌కు చెందిన అక్తర్‌బేగం(52) ఇటీవల మృతి చెందడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా గురువారం మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్ కేర్‌లో మహిళ(62), ఆర్‌కేపురంలోని సుప్రజ ఆస్పత్రిలో పురుషుడు(31), ముషీరాబాద్ కేర్‌లో పురుషుడు(36), రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు (22,28) గాంధీలో చికిత్స పొందుతున్నారు. వీరి నుంచి నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపగా... స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. మరోవైపు కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యం పేరుతో రోగుల నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి.

 మృతి చెందిన 3 రోజుల తర్వాత ...
 స్వైన్ ఫ్లూ బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో  నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో రోగులను చేర్చుకోవడం లేదు. గాంధీలో రోగులను చేర్పించుకొని... అనుమానిత కేసుగా భావించి చికిత్స చేస్తున్నారు. బాధితుల నుంచి నమూనాలు సేకరించి... ఐపీఎంకు పంపడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అటు నుంచి రిపోర్టు వచ్చే సమయానికే రోగులు మృత్యువాత పడుతున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇటీవల గాంధీలో చేరిన అక్తర్‌బేగం నుంచి సకాలంలోనే న మూనాలు సేకరించి పరీక్ష కోసం ఐపీఎంకు పంపినట్లు వైద్యులు చెబుతున్నారు. బాధితురాలు చనిపోయిన మూడు రోజుల తర్వాత ఐపీఎంకు నమూనాలు చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

 డెంగీ పేరుతో నిలువు దోపిడీ
 స్వైన్ ఫ్లూతో పాటు డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 111 డెంగీ కేసులు నమోద య్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు స్వయంగా జిల్లా వైద్యాధికారులే అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం ‘ఐజీఎం ఎలిసా’ టెస్టును డెంగీ నిర్ధారణకు ప్రామాణికంగా ప్రకటించింది. కానీ నగరంలోని కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు ‘ఎన్‌ఎస్ 1’ టెస్టులో పాజిటివ్ వచ్చిన కేసులను సైతం డెంగీ జ్వరాలుగా చూపుతున్నారు. శరీరంలో తెల్లరక్త కణాల సంఖ్య తగ్గిందనే పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు రోగులను దోచుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడు. సాధారణ జ్వరాలను సైతం డెంగీగా చూపిస్తూ రోగులను మోసగిస్తున్న ఆస్పత్రులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement