ముప్పు ముంచుకొస్తున్నా.. మొద్దు నిద్రే!
కలెక్టర్లతో మంత్రి లక్ష్మారెడ్డి సమావేశమైనా అప్రమత్తం కాని వైద్యాధికారులు
రాష్ట్రంలో వ్యాధుల సీజన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో తాగునీరు కలుషితమయ్యే అవకాశాలున్నాయి. దోమల స్వైరవిహారానికి సమయం ఆసన్నమైంది. ప్రతియేటా వర్షకాలంలో మురుగు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నా అధికారులు అలసత్వం మాత్రం వీడడంలేదు. ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ అమాత్యుడు ఆదేశించినా.. పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు సైతం వెక్కిరిస్తున్నాయి.
– సాక్షి, హైదరాబాద్
డెంగీ హైరిస్క్ జిల్లాలు
పాత ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి,నిజామాబాద్, మహబూబ్‌నగర్
డెంగీ హైరిస్క్‌లో ఉండే ప్రజలు 54,23,000
మలేరియా హైరిస్క్ జిల్లాలు ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్
మలేరియా హైరిస్క్ గ్రామాలు 2,067
మలేరియా హైరిస్క్‌లో ఉండే ప్రజలు 9,57,000
ఈ సీజన్‌లో వచ్చే ముఖ్య వ్యాధులు...
తాగునీటి కాలుష్యంతో.. డయేరియా, టైఫాయిడ్
దోమల కారణంగా.. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా
చిన్నారులకు.. న్యూమోనియా
ఏజెన్సీ ప్రాంతాల్లో.. విషజ్వరాలు
ఏంచేయాలి..
సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను ఆదుకునేందుకు జిల్లాకో రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేయాలి. ఒకేచోట పెద్ద ఎత్తున సీజనల్ వ్యాధులు సంభవిస్తే జిల్లా టీంలు రంగంలోకి దిగుతాయి. అవసరమైతే రాష్ట్రస్థాయి టీం కూడా రంగంలోకి దిగాలి. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు 61 రకాల మందులను అందుబాటులో ఉంచాలి.
ఏం చేస్తున్నారు...
మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించినా.. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తం కాలేదు. రెస్పాన్స్ టీమ్ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. 61 రకాల మందులకుగాను కొన్నింటినే అందుబాటులో ఉంచారు.