దోమల దండయాత్ర! | Increased pollution of ponds around the Greater | Sakshi
Sakshi News home page

దోమల దండయాత్ర!

Published Mon, Feb 20 2017 2:34 AM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

దోమల దండయాత్ర!

దోమల దండయాత్ర!

గ్రేటర్‌ చుట్టూ చెరువుల్లో పెరిగిన కాలుష్యం
విపరీతంగా బ్యాక్టీరియా,  కోలిఫాం ఉనికి
వేగవంతంగా దోమ లార్వాల వృద్ధి..
పొంచిఉన్న డెంగీ, మలేరియా ముప్పు
పీసీబీ తాజా పరిశీలనలో వెల్లడి

సిటీబ్యూరో: డెంగీ..మలేరియా..స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులతో అల్లాడుతున్న సిటీపై ఇప్పుడు దోమలు దండయాత్ర చేస్తున్నాయి. చెరువుల కాలుష్యం శాపంగా మారుతోంది.  ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలవాల్సిన పలు జలాశయాలు కాలుష్య కాసారమవుతుండడంతో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. గ్రేటర్‌ వాసులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి చేరుతున్న వ్యర్థజలాలతో నగరం చుట్టూ ఉన్న చెరువులు దుర్గంధభరితంగా మారుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తాజా పరిశీలనలో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే ఆయా చెరువుల్లో కోలిఫాం, హానికారక  బ్యాక్టీరియా ఉనికి అనూహ్యంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు పలు జలాశయాల్లో గుర్రపుడెక్క పెరగడంతోపాటు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దోమ లార్వాలు భారీగా వృద్ధిచెందేందుకు అనుకూలంగా ఉండి.. మహానగరంలో దోమలు విజృంభిస్తున్నాయి. ఈ దుస్థితి కారణంగా సిటీజన్లకు మలేరియా, డెంగీ వ్యాధుల ముప్పు పొంచిఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

నిలువెల్లా కాలుష్యమే..
నగరానికి మణిహారంలా ఉన్న పలు చెరువులు రోజురోజుకూ కాలుష్యకాసారాలుగా మారుతున్నాయి. వీటి ప్రక్షాళనకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం విఫలంకావడం శాపంగా పరిణమిస్తోంది.  పలు చెరువుల్లో గుర్రపుడెక్క ఉధృతి అనూహ్యంగా పెరిగింది. మరోవైపు సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతుండడంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గంధభరితంగా మార్చేస్తున్నాయి. ప్రధానంగా డ్రైనేజీ నీరు, వ్యర్థజలాల్లో ఉండే ఫేకల్‌ కోలిఫాం, టోటల్‌ కోలిఫాం మోతాదు అధికంగా పెరిగినట్లు పీసీబీ పరిశీలనలో తేలింది. దీంతో ఆయా చెరువుల్లో హానికారక షిగెల్లా, స్టెఫైలోకోకస్, ఇ.కోలి వంటి బ్యాక్టీరియా ఉనికి పెరిగినట్లు స్పష్టమైంది. దీనికి తోడు ప్రస్తుతం కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణస్థాయిలో నమోదవుతుండడంతో పలు చెరువుల్లో దోమల లార్వాలు ఉధృతంగా వృద్ధిచెందుతున్నాయి.

ఈ దుస్థితికి కారణాలివే..
కూకట్‌పల్లి ప్రగతి నగర్‌ చెరువులో 2015తో పోలిస్తే 2016 సంవత్సరంలో ప్రతి వంద మి.లీ నీటిలో 406 మైక్రోగ్రాముల మేర కోలిఫాం ఉనికి పెరిగింది. సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరకుండా మినీ మురుగు శుద్ధికేంద్రాలను నిర్మించడంలో జీహెచ్‌ఎంసీ విఫలం కావడంతో పరిస్థితి విషమిస్తోంది. గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాకు గురవడం..చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో మురుగు పెరిగింది.  చాలా వరకు చెరువులు వాటి ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని సగం భూములను కోల్పోయి చిక్కి శల్యమై కనిపిస్తున్నాయి.చెరువుల్లో కనీసం గుర్రపు డెక్కను, దోమల లార్వాలను కూడా పూర్తిస్థాయిలో తొలగించడంలేదు.

కూకట్‌పల్లి అంబీర్‌ చెరువులోకి సమీప ప్రాంతాల నుంచి భారీగా మురుగు నీరు నేరుగా వచ్చి చేరుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఈ చెరువు చుట్టూ భారీగా అక్రమ నిర్మాణాలు వెలిసినా బల్దియా యంత్రాంగం ప్రేక్షకపాత్రకే పరిమితమైంది. చెరువులు, మూసీ పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం నగరంలోని అంబర్‌ చెర్వు, ప్రగతినగర్, కాప్రా, పెద్ద చెర్వు, సాయిచెర్వు, దుర్గంచెర్వు, నల్లచెర్వు, లక్ష్మీనారాయణ చెర్వులకు సమీపంలో ఉన్న కూకట్‌పల్లి, కెపిహెచ్‌బీ, మూసాపేట్, శేరిలింగపల్లి, మణికొండ, జిల్లెలగూడా, బాలాపూర్, బాలానగర్‌ ప్రాంతాలతోపాటు మూసీ పరివాహక ప్రాంతంలోని మెహిదీపట్నం, మసాబ్‌ట్యాంక్, చాదర్‌ఘాట్, కోఠి, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, అంబర్‌పేట్, ముషీరాబాద్, ఉప్పల్, బోడుప్పల్, రామంతాపూర్, రాజేంద్రనగర్, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణస్థాయిలో అంటే కనిష్టంగా 18, గరిష్టంగా 33 డిగ్రీల మేర నమోదవుతుండడంతో దోమ లార్వాలు గణనీయంగా వృద్ధిచెంది ఆయా ప్రాంతాలను దోమలు ముంచెత్తుతున్నాయి. లార్వాల వృద్ధిని నిరోధించేందుకు యాంటీ లార్వా స్ప్రే చేయడంలోనూ జీహెచ్‌ఎంసీ యంత్రాంగం విఫలమవుతోంది. మరోవైపు రోజువారీగా గ్రేటర్‌వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్‌ లీటర్ల వ్యర్థజలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్‌ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement