డెంగీ సైరన్..
►విజృంభిస్తున్న మలేరియా
►పదిరోజుల్లో 17 మలేరియా, 6 డెంగీ కేసులు నమోదు
►అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యశాఖ
సిటీబ్యూరో: ఇటీవల నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖాళీ కొబ్బరి బొండాలు, టైర్లలోకి నీరు చేరడంతో దోమలు వ్యాపించి బస్తీవాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. యాంటిలార్వా, ఫాగింగ్ నిర్వహించి ఎప్పటికపుడు దోమలను నియంత్రించి, సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ఎంటమాలజీ విభాగం అధికారులు పట్టించుకోలేదు. గ్రేటర్‌లో కేవలం పది రోజుల్లో 17 మలేరియా, 15 డెంగీ కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదైన డెంగీ, మలేరియా కేసుల వివరాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చేరడం లేదు. ప్రభుత్వం ఐజీఎం ఎలీసా టెస్టులో పాజిటివ్ వచ్చిన కేసులను మాత్రమే డెంగీగా పరిగణిస్తుంది.
కానీ ప్రైవేట్ ఆస్పత్రులు ఎన్‌ఎస్–1 టెస్టు చేస్తున్నాయి. వీటిలో పాజిటివ్ వచ్చిన వాటిని డెంగీ జ్వరంగా నిర్థారిస్తున్నారు. నిజానికి రోగి నుంచి రెండో శాంపిల్స్ సేకరించి నిర్ధారణ కోసం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)కు పంపాలి. కానీ ప్రభుత్వ ఆస్పత్రులు మినహా నగరంలో ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా ఐపీఎంకు రెండో శాంపిల్‌ను పంపడం లేదు. సీజనల్ వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ఎపిడమిక్ సెల్‌కు తెలియజేయాల్సి ఉన్నా చాలా ఆస్పత్రులు సస్పెక్టెడ్ డెంగీగా పేర్కొంటూ చికిత్స చేసి పంపుతుండడం గమనార్హం.
టైగర్ దోమతోనే డెంగీ..
ఈడిస్ ఈజిప్ట్(టైగర్)దోమ కుట్టడం వల్ల డెంగీ వస్తుంది. ఒంటిపై తెల్లని చారలతో కనిపించే ఈ నల్లని దోమ పగటిపూట కుడుతుంది. కుట్టిన 7–8 రోజుల తర్వాత డెంగీ లక్షణాలు బయటపడుతాయి. కళ్లమంట, అధిక జ్వరం, చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. రక్తంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ కౌంట్ 20 వేలలోపునకు పడిపోయి రక్తస్రావం అవుతుంటే ప్లేట్‌లెట్స్ ఎక్కించాలి.
– డాక్టర్ రాజన్న, చిన్నపిల్లల వైద్యుడు
నీరు నిల్వలేకుండా చూడాలి
డెంగీ బారిన పడుకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఇంటి పరిసరాల్లో మురుగు, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు నిల్వ ఉండకుండా చూడాలి. నీటి ట్యాంకులు, క్యాన్లు వారానికోసారి శుభ్రం చేసుకోవాలి. గదుల్లో వెలుతురు ఎక్కువగా ఉండేలా చూడాలి. పిల్లలకు పగటిపూట దోమ తెరలు వాడాలి. ఓవర్‌హెడ్ ట్యాంక్‌లపై మూతలు విధిగా ఉంచాలి. – డాక్టర్ రమేష్ దంపూరి, నిలోఫర్