టౌన్స్‌విల్, ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియాలోని ఓ నగరంలో గత నాలుగేళ్లుగా ఒక్క డెంగీ వ్యాధి కేసు నమోదు కాలేదు. దోమలకు దోమల్నే ప్రత్యర్థులుగా వినియోగించిన శాస్త్రవేత్తలు ఈ విజయాన్ని సాధించగలిగారు. కొన్ని దోమల్లోకి వోల్‌బాచియా బ్యాక్టీరియాను చొప్పించడం ద్వారా డెంగీ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలను నాశనం చేశారు. ఈ పద్దతిని తొలిసారిగా ఆస్ట్రేలియాలోని టౌన్స్‌విల్ పట్టణంలో ప్రవేశపెట్టారు. ఇది విజయం సాధించడంతో జికా, మలేరియా దోమలను కూడా హతమార్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు.
బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో జికా దోమలను చంపడమే లక్ష్యంగా అతి త్వరలో కొన్ని ప్రత్యేక దోమలను(వోల్‌బాచియా బ్యాక్టీరియా ప్రభావితమైనవి) వదలనున్నారు. కొలంబియాలోని మెడ్లిన్, ఇండోనేషియాలోని యోగ్యకార్టాల్లో సైతం ఈ మేరకు సన్నహకాలు జరుగుతున్నాయి. టౌన్స్‌విల్‌లో డెంగీపై విజయం సాధించడానికి ప్రధాన కారణం. చిన్నపెద్ద తేడా లేకుండా అందులో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవడమే. విద్యార్థులు సైతం వోల్‌బాచియా దోమలను వదిలేందుకు ఆసక్తిని కనబర్చారు. దోమలను వదిలిన నాటి నుంచి టౌన్స్‌విల్‌లో ఒక్కటంటే ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఈ దోమలను ప్రపంచవ్యాప్తంగా అందించడం ద్వారా డెంగీ వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చనే భావన వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment