దోమల నివారణ అంటే...ఆ వ్యాధుల నివారణే!
ఇటీవల మన తెలుగు రాష్ట్రాలలో దోమల వల్ల వ్యాప్తి చెందే డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. ఆయా వ్యాధులు వచ్చాక చికిత్స తీసుకోవడం కంటే వాటి నివారణ ఎంతో మేలు.
అయితే మన రాష్ట్రాల వాతావరణం కూడా ఇందుకు దోహదపడేలా ఉంటుంది. ఒక ప్రదేశంలో తీవ్రమైన వేడిమి, చాలా ఎక్కువగా తేమ, అదేపనిగా నీళ్లు నిల్వ ఉండే పరిసితులు ఉంటే అక్కడ దోమలు విపరీతంగా పెరుగుతుంటాయి. మనం ట్రాపికల్ ప్రాంతాల్లో ఉండటం వల్ల ఇక్కడి వాతావరాణ్ని బట్టి ఎక్కువ వేడి, తేమ, నీళ్లు ఉంటాయి. ఇదే వాతావరణం వరి పెరగడానికి అనువైనది. దురదృష్టవశాత్తు ఇదే వాతావరణం దోమ పెరగడానికి కూడా అనువైనది.
ఒక దోమ జీవించే కాలం (ఆయుఃప్రమాణం) దాదాపు 30 రోజులు. ఈ కాలంలో అది రోజు విడిచి రోజు 150 నుంచి 200 వరకు గుడ్లు పెడుతుంది. అది గుడ్లు పెట్టడానికి చిన్న కొబ్బరి చిప్ప పరిమాణంలో 50 ఎం.ఎల్. నీళ్లు చాలు. దాంతో ఇలా చిన్న పాటి గుంటలూ, కొబ్బరి చిప్పలూ, చెడిపోయిన టైర్లు, వాడి ఆపేసిన కూలర్లు వంటి చోట్ల దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని అభివృద్ధి చేసుకుంటాయి. వాటిని నిర్మూలించడానికి మనం ఎన్ని దార్లు వాడుతుంటామో, వాటి పట్ల తమ నిరోధకతను పెంపొందించుకోడానికీ అవి అన్ని దార్లూ వెతుకుతుంటాయి. ఇలా తమ మనుగడను సాగిస్తుంటాయి. ఇలా అవి బలపడటానికి పరోక్షంగా మనమూ దోహదపడుతున్నామన్నమాట. అయితే ఒక్క మాట... పారే నీరు ఉన్న చోట అవి గుడ్లు పెట్టలేవు. అందుకే వాటిని నివారించాలంటే వారంలో ఏదో ఒక రోజు నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవడంతో పాటు, మురుగుకాల్వల వంటి చోట్ల నీరు పారేలా శుభ్రంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవడం మంచి మార్గం.
నివారణ మార్గాలివి...
⇔ దోమల నివారణే వాటి ద్వారా వచ్చే డెంగ్యూ, చికన్‌గున్యా, మలేరియా వంటి వ్యాధుల నివారణకు మంచి మార్గం. దోమ కాటు నుంచి మనల్ని మనం ఎంతగా రక్షించుకుంటే ఆ వ్యాధుల నుంచి మనల్ని మనం అంత సమర్థంగా కాపాడుకోవచ్చు.
⇔ మనం ఉండే ఇంటిలో, గదిలో దోమలు రాకుండా చూసుకోడానికి అవసరమైన రిపెల్లెంట్లు, దోమతెరలు వాడాలి.
⇔దోమలు కుట్టకుండా పొడువు చేతుల చొక్కాలు ధరించడం, ఒంటినిండా బట్టలు ఉండినా, ఒంటినంతా అవి కప్పి ఉంచేలా చూసుకోవడం అవసరం.
⇔ దోమలు కుట్టకుండా ఉండేందుకు శరీరంపైన పూత మందులు వాడటం కూడా ఒక మార్గం.
⇔ దోమలు మురికిగా ఉండే దుస్తులకు వెంటనే ఆకర్షితమవుతాయి. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రమైన దుస్తులు వేసుకోవాలి. ఇక కొంతవరకు లేత రంగుల దుస్తులను ధరించడం మేలు.
⇔ అలాగే ఘాటైన వాసనలున్న పెర్‌ఫ్యూమ్స్‌కీ దూరంగా ఉండాలి.
⇔ దోమలను తరిమివేసే మస్కిటో కాయిల్స్ ఉపయోగించవచ్చు. అయితే ఆరోగ్యానికి వాటి వాసన సరిపడని వాళ్లు, పిల్లలు, వృద్ధులు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి పూట దోమ తెరల్ని వాడాలి. వేపాకులతో పొగవేయడం వంటి సంప్రదాయ మార్గాలను కూడా చేపట్టవచ్చు.
⇔ ఇక సామాజిక నివారణలో భాగంగా మన ఇళ్ల సరిసరాల్లో మురుగు నీరు లేకుండా, నిల్వ నీరు లేకుండా చూసుకోవడం మంచిది. దీనితో పాటు కాల్వల్లో నీరు ఒకేచోట చేరి ఉండకుండా నిత్యం పారేలా వాటిని శుభ్రం చేసుకోవడం అవసరం.