chicken gunya
-
విజృంభిస్తున్న విషజ్వరాలు: డెంగీ..మలేరియా..టైఫాయిడ్!
అంబర్‌పేట: సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీకి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. నిత్యం 40 నుంచి 50 ఉండే ఓపీ.. ప్రస్తుత సీజన్లో 70 నుంచి 80కి పెరిగింది. నియోజకవర్గంలోని ఐదు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు నాలుగు బస్తీ దవాఖానాలకు సామాన్య రోగుల సంఖ్య తాకిడి ఎక్కువైంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు జ్వరాల భారిన పడిన ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకూ పరుగులు తీస్తున్నారు. ఈ సీజన్లో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత 20 రోజులుగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దోమల నివారణ, పారిశుధ్య నిర్వహణలో జరుగుతున్న వైఫల్యంతోనే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని ప్రజలు కోరుతున్నారు. అండగా బస్తీ దవాఖానాలు సీజన్ వ్యాధులు ప్రబలుతుండటంతో బస్తీ దవాఖానాలు పేదలకు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు బస్తీ దవాఖానాల్లో వైద్యులు ఓపీ చూస్తున్నారు. సాధారణ జనంతో పాటు ఇతర జ్వరాలను గుర్తించి చికిత్స అందించడంతో పాటు మెరుగైన చికిత్సకు సిఫార్సు చేస్తున్నారు. నియోజకవర్గంలో అంబర్‌పేట మున్సిపల్ కాలనీ, బాగ్ అంబర్‌పేట అయ్యప్ప కాలనీ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెహ్రూనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఫీవర్ ఆసుపత్రిలో వెనుకాల ఉన్న తిలక్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యానగర్ డీడీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఓపీతో పాటు వైద్య పరీక్షల శాంపిళ్లు సేకరించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఆయా డివిజన్లలో ఉన్న బస్తీ దవాఖానాల్లో సైతం వైద్య పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రానికి పంపిస్తున్నారు. వైద్య పరీక్షల్లో తేలిన ఫలితాన్ని బట్టి కోవిడ్‌కు చికిత్సను అందిస్తున్నారు. దోమల నియంత్రణలో విఫలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిసినా దోమలను నియంత్రించడంలో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం విఫలమవుతున్నది. దోమల లార్వా, దోమల విజృంభణలను నివారించడంలో ఎంటమాలజీ విభాగం నిర్లక్ష్యం చేస్తున్నదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూ.. తూ.. మంత్రంగా ఫాగింగ్ చేపట్టి చేతులు దులుపు కుంటున్నారే తప్ప వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. లార్వా నిర్మూలనలో సైతం పై పై చర్యలు తీసుకొని మిన్నకుండి పోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వైద్య విభాగాన్ని సమాయత్తం చేశాం సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు కృషి చేస్తున్నాం. నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో సరిపడా మందులను అందుబాటులో ఉంచాం. సీజనల్ వ్యాధులను అరికడుతూనే విస్తృతంగా వ్యాక్సిన్ ప్రక్రియను చేపడుతున్నాం. సీజనల్ వ్యాధులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. – డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ హేమలత -
కేవలం 36 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా వైరస్!
సాక్షి, న్యూఢిల్లీ : సరిగ్గా వందేళ్ల క్రితం అంటే, 1919లో ‘స్పానిష్ ఫ్లూ’ మూడొంతుల ప్రపంచాన్ని చుట్టుముట్టడంతో దాదాపు ఐదు కోట్ల మంది మరణించారు. అలాంటి వైరస్ ఇప్పుడు ప్రపంచానికి సోకితే కనీసం ఎనిమది కోట్ల మంది ప్రజలు మరణిస్తారు. ఒకప్పుడు మెల్లగా విస్తరించిన ఈ ఫ్లూ, ఓ దేశానికి చెందిన ప్రజలు, మరో దేశానికి నిరంతరంగా ప్రయాణిస్తున్న నేటి వేగవంతమైన యుగంలో కేవలం 36 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలదు. అదే గనుక జరిగితే అపార జన నష్టంతోపాటు దేశ దేశాల జాతీయ భద్రత అస్తవ్యస్తం అవుతుంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ నాయకత్వంలోని ‘గ్లోబల్ ప్రిపేర్డ్నెస్ మానిటరింగ్ బోర్డ్’ సభ్యుల బందం ఈ హెచ్చరికలను చేసింది. ఈ మేరకు ‘ఏ వరల్డ్ ఎట్ రిస్క్’ శీర్షికతో రూపొందించిన ఓ నివేదికను బుధవారం అమెరికాలో విడుదల చేసింది. ‘ఎబోలా’ లాంటి వైరస్లు వేగంగా సోకుతున్న నేటి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఫ్లూలు ప్రపంచానికి సోకే ప్రమాదం ఉందని, అలాంటి వైరస్‌లను ఇప్పటి నుంచి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ డైరెక్టర్ –జనరల్, నార్వే మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ గో ఆర్లెం బ్రుండట్లాండ్ నాయకత్వంలోని జీపీఎంబీ బృందం హెచ్చరికలను జారీ చేస్తోంది. ఏ వైరస్ ఏ ప్రాంతాన్నీ, ఏ దేశాన్ని సోకే అవకాశం ఉందో కూడా ప్రపంచ పటంపై మార్కు చేసి చూపించింది. 1918లో స్పానిష్ ఫ్లూ అమెరికాలో విస్తరించినప్పుడు చికిత్స కేంద్రాల్లో పనిచేస్తున్న రెడ్‌క్రాస్ కార్యకర్తలు అంటే నిఫా వైరస్ ఏ దేశాన్ని చుట్టు ముడుతుందో, కలరా ఏ దేశాన్ని చికెన్ గున్యా, డెంగ్యూలాంటి వైరస్లు ఏయే దేశాలు చుట్టుముడుతాయో మ్యాప్‌లో సూచించింది. వాటికి సంబంధించి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు ఏమిటో కూడా సూచించింది. ఇంతకుముందు విడుదలు చేసిన తమ నివేదికను దేశాధినేతలు సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా అరకొరగానే అమలు చేసినందువల్లనే ఈ రోజు మళ్లీ ఒక నివేదికను విడుదల చేయాల్సి వచ్చిందని బోర్డు వివరించింది. ఎబోలా, జికా, నిపా వైరస్‌లతోపాటు వెస్ట్ నైల్ వైరస్, డెంగ్యూ, ప్లేగ్, హ్యూమన్ మంకీపాక్స్‌ల గురించి హెచ్చరికలు చేసింది. -
దోమల నివారణ అంటే...ఆ వ్యాధుల నివారణే!
ఇటీవల మన తెలుగు రాష్ట్రాలలో దోమల వల్ల వ్యాప్తి చెందే డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. ఆయా వ్యాధులు వచ్చాక చికిత్స తీసుకోవడం కంటే వాటి నివారణ ఎంతో మేలు. అయితే మన రాష్ట్రాల వాతావరణం కూడా ఇందుకు దోహదపడేలా ఉంటుంది. ఒక ప్రదేశంలో తీవ్రమైన వేడిమి, చాలా ఎక్కువగా తేమ, అదేపనిగా నీళ్లు నిల్వ ఉండే పరిసితులు ఉంటే అక్కడ దోమలు విపరీతంగా పెరుగుతుంటాయి. మనం ట్రాపికల్ ప్రాంతాల్లో ఉండటం వల్ల ఇక్కడి వాతావరాణ్ని బట్టి ఎక్కువ వేడి, తేమ, నీళ్లు ఉంటాయి. ఇదే వాతావరణం వరి పెరగడానికి అనువైనది. దురదృష్టవశాత్తు ఇదే వాతావరణం దోమ పెరగడానికి కూడా అనువైనది. ఒక దోమ జీవించే కాలం (ఆయుఃప్రమాణం) దాదాపు 30 రోజులు. ఈ కాలంలో అది రోజు విడిచి రోజు 150 నుంచి 200 వరకు గుడ్లు పెడుతుంది. అది గుడ్లు పెట్టడానికి చిన్న కొబ్బరి చిప్ప పరిమాణంలో 50 ఎం.ఎల్. నీళ్లు చాలు. దాంతో ఇలా చిన్న పాటి గుంటలూ, కొబ్బరి చిప్పలూ, చెడిపోయిన టైర్లు, వాడి ఆపేసిన కూలర్లు వంటి చోట్ల దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని అభివృద్ధి చేసుకుంటాయి. వాటిని నిర్మూలించడానికి మనం ఎన్ని దార్లు వాడుతుంటామో, వాటి పట్ల తమ నిరోధకతను పెంపొందించుకోడానికీ అవి అన్ని దార్లూ వెతుకుతుంటాయి. ఇలా తమ మనుగడను సాగిస్తుంటాయి. ఇలా అవి బలపడటానికి పరోక్షంగా మనమూ దోహదపడుతున్నామన్నమాట. అయితే ఒక్క మాట... పారే నీరు ఉన్న చోట అవి గుడ్లు పెట్టలేవు. అందుకే వాటిని నివారించాలంటే వారంలో ఏదో ఒక రోజు నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవడంతో పాటు, మురుగుకాల్వల వంటి చోట్ల నీరు పారేలా శుభ్రంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవడం మంచి మార్గం. నివారణ మార్గాలివి... ⇔ దోమల నివారణే వాటి ద్వారా వచ్చే డెంగ్యూ, చికన్‌గున్యా, మలేరియా వంటి వ్యాధుల నివారణకు మంచి మార్గం. దోమ కాటు నుంచి మనల్ని మనం ఎంతగా రక్షించుకుంటే ఆ వ్యాధుల నుంచి మనల్ని మనం అంత సమర్థంగా కాపాడుకోవచ్చు. ⇔ మనం ఉండే ఇంటిలో, గదిలో దోమలు రాకుండా చూసుకోడానికి అవసరమైన రిపెల్లెంట్లు, దోమతెరలు వాడాలి. ⇔దోమలు కుట్టకుండా పొడువు చేతుల చొక్కాలు ధరించడం, ఒంటినిండా బట్టలు ఉండినా, ఒంటినంతా అవి కప్పి ఉంచేలా చూసుకోవడం అవసరం. ⇔ దోమలు కుట్టకుండా ఉండేందుకు శరీరంపైన పూత మందులు వాడటం కూడా ఒక మార్గం. ⇔ దోమలు మురికిగా ఉండే దుస్తులకు వెంటనే ఆకర్షితమవుతాయి. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రమైన దుస్తులు వేసుకోవాలి. ఇక కొంతవరకు లేత రంగుల దుస్తులను ధరించడం మేలు. ⇔ అలాగే ఘాటైన వాసనలున్న పెర్ఫ్యూమ్స్కీ దూరంగా ఉండాలి. ⇔ దోమలను తరిమివేసే మస్కిటో కాయిల్స్ ఉపయోగించవచ్చు. అయితే ఆరోగ్యానికి వాటి వాసన సరిపడని వాళ్లు, పిల్లలు, వృద్ధులు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి పూట దోమ తెరల్ని వాడాలి. వేపాకులతో పొగవేయడం వంటి సంప్రదాయ మార్గాలను కూడా చేపట్టవచ్చు. ⇔ ఇక సామాజిక నివారణలో భాగంగా మన ఇళ్ల సరిసరాల్లో మురుగు నీరు లేకుండా, నిల్వ నీరు లేకుండా చూసుకోవడం మంచిది. దీనితో పాటు కాల్వల్లో నీరు ఒకేచోట చేరి ఉండకుండా నిత్యం పారేలా వాటిని శుభ్రం చేసుకోవడం అవసరం. -
రాష్ట్రానికి జ్వరం కాటు
-
రాష్ట్రానికి జ్వరం కాటు
- పంజా విసురుతున్న డెంగీ, టైఫాయిడ్, చికెన్ గున్యా,మలేరియా, డయేరియా - ఆస్పత్రుల్లో వేలాది మంది బాధితులు - ఏజెన్సీల్లో జ్వరాల కాటుకు పిట్టల్లా రాలుతున్న గిరిజనులు - 4.3 లక్షలకు చేరిన డయేరియా బాధితుల సంఖ్య - 8 నెలల్లో 51,256 డెంగీ కేసులు నమోదు... - 1,206 మాత్రమే అంటున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. విష జ్వరాలు, కలుషిత నీటి జబ్బులు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యా వంటి ప్రమాదకరమైన జ్వరాలతో ఊళ్లకు ఊళ్లే మంచం పట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా వైరల్ జ్వరాల బారినపడ్డ వేలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీతో ఎంతమంది మరణించారనే గణాంకాలు ప్రభుత్వం వద్ద లేకపోవడం గమనార్హం. ప్రభుత్వాసుపత్రుల్లో డెంగీ జ్వరాలకు వైద్యం లభించకపోవడంతో బాధితులు మరో గత్యంతరం లేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి, అప్పుల పాలవ్వాల్సి వస్తోంది. జ్వరాల కాటుకు పదుల సంఖ్యలో జనం బలైపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అధికార యంత్రాంగాన్ని తక్షణమే రంగంలోకి దింపి, బాధితులకు సాంత్వన కలిగించాల్సింది పోయి మీనమేషాలు లెక్కిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీలు, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అంతటా విష జ్వరాలు పంజా విసురుతున్నా ముందస్తు చర్యలు చేపట్టడంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైంది. రాష్ట్రంలో మలేరియా, డెంగీపై ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించి చేతులు దులుపుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు జ్వరాల బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నా పాలకుల్లో చలనం కనిపించడం లేదు. రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్న జ్వరాల కేసులు కొన్నేనని, బయటకు రానివి ఇంకా ఎన్నో రెట్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. డయేరియా కేసులు ఆల్‌టైం రికార్డు డయేరియా (వాంతులు, విరేచనాలు) బాధితుల సంఖ్య ప్రస్తుతం ఆల్‌టైం రికార్డు అని వైద్యులు చెబుతున్నారు. అక్యూట్ డయేరియా డిసీజ్ (ఏడీడీ)గా చెప్పుకునే ఈ వ్యాధి బారినపడ్డ వారి సంఖ్య ఇప్పటికే 4.30 లక్షలకు చేరింది. గ్రామాల్లో సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేక కలుషిత నీటిని సేవిస్తున్న జనం డయేరియా బారినపడుతున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాల్లో 99,463 మంది డయేరియా కాటుకు గురయ్యారు. అనంతపురం జిల్లాలో 94,660 మంది డయేరియా బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వణికిస్తున్న టైఫాయిడ్, డెంగీ రాష్ట్రంలో టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఈ జ్వరాలతో మంచాన పడిన వారి సంఖ్య లక్ష దాటి ఉండొచ్చని అంచనా. 25 వేల మందికిపైగానే టైఫాయిడ్ సోకినట్టు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. 15,300కుపైగా మలేరియా కేసులు నమోదైనట్లు తేలింది. ఇక డెంగీపై ప్రభుత్వానికే స్పష్టత లేదు. ప్రభుత్వాసుపత్రుల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న మెడాల్ సంస్థ గత36 వారాల్లో 51 వేలకు పైగా డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. కానీ, 1,206 డెంగీ కేసులే నమోదైనట్లు ప్రభుత్వం చెబుతోంది. డెంగీ వల్ల రాష్ట్రంలో ఒక్కరు కూడా మరణించలేదని పేర్కొంటోంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో డెంగీ బాధితులే అధికంగా కనిపిస్తున్నారు. విశాఖ, తూర్పు గోదావరి, అనంతపురం, చిత్తూరు జిల్లాలో డెంగీ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. మొబైల్ యూనిట్లతో వైద్య సాయం ‘‘రాష్ట్రవ్యాప్తంగా మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, టైఫాయిడ్ బాధితులకు సత్వరం వైద్యసాయం అందించేందుకు లక్ష జనాభాకు ఒక మొబైల్ మెడికల్ యూనిట్ ఏర్పాటు చేశాం. ఈ యూనిట్ ప్రతి గ్రామానికీ వెళ్లి ఇంటింటి సర్వే చేసి, బాధితులను గుర్తిస్తుంది. వైద్య సాయం అందిస్తుం ది. ఇందులో కమ్యూనిటీ మెడికల్ ఆర్గనైజర్, నర్సు, ఫార్మసిస్ట్ తదితర ఐదుగురు సభ్యులు ఉంటారు. ఇప్పటికే జ్వరాల తీవ్రత ఉన్న ప్రాంతాల్లో దోమ తెరలు పంపిణీ చేశాం. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాం’’ - డా.గీతాప్రసాదిని, ఏడీ, ప్రజారోగ్య శాఖ -
దోమలు లేకుండా చేసిన గ్రామం
ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలకు ప్రస్తుతం దోమల వల్ల సోకే డెంగ్యూ, చికెన్ గున్యా, ఇప్పుడు దక్షిణ అమెరికా దేశాలను వణికిస్తున్న జికా వైరస్ వ్యాధుల గురించి అసలు భయం లేదు. కారణం ఆ గ్రామాల్లో దోమలు లేకపోవడమే. దోమల బ్రీడింగ్‌కు అసలు అవకాశం లేకుండా వారు మురుగునీరు పారుదల వ్యవస్థను చక్చదిద్దుకోవడమే. ముఖ్యంగా నాందేడ్ జిల్లా, హిమాయత్‌నగర్ తాలూకా, తెంబూర్ణి గ్రామ ప్రజలు దోమలను నిర్మూలించడంలో సంపూర్ణ విజయం సాధించారు. ఇంటి నుంచి ముందు పారే మురుగునీరు కాల్వ కింద, ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతను నిర్మించారు. ఇంటి నుంచి పారే వృధా నీరును ఎప్పటికప్పుడు ఇంకుడు గుంతలు పీల్చుకుంటున్నాయి. ఎక్కడా దోమల బ్రీడింగ్‌కు అవకాశమే ఉండడం లేదు. ఈ గ్రామంలో తాము అనేక సార్లు సర్వే జరిపామని, తమకు గ్రామంలో ఒక్క దోమల బ్రీడింగ్ చోటు కూడా కనిపించలేదని, పైగా గ్రామస్థులకు వచ్చే రోగాలు కూడా 75 శాతం తగ్గిపోయాయని నాందేడ్ జిల్లా ఆరోగ్య శాఖాధికారి బాలాజీ షిండే తెలిపారు. ఇంకుడు గుంతల విధానం వల్ల భూగర్భ జలాల శాతం కూడా పెరిగిందని, ఫలితంగా ఈ గ్రామానికి నీటి కరవు కూడా లేకుండా పోయిందని ఆయన వివరించారు. దశాబ్దం క్రితమే గ్రామ సర్పంచ్ ప్రహ్లాద్ పాటిల్ ఈ ఇంకుడు గుంతల విధానానికి దశాబ్దం క్రితమే చేపట్టారు. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఉంది. ఈ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకున్న జిల్లా అధికారులు స్వయం ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని పలు గ్రామాల్లో ఇంకుడు గుంతల మురుగునీరు పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. నాందేడ్‌లో ఇంకుడు గుంతల నిర్మాణానికి వరుసగా నాలుగు రంధ్రాలు చేసిన సిమ్మెంట్ పైపును, ఇసుకను ఉపయోగిస్తున్నారు. ఇటుక ముక్కలు, కంకర రాళ్లు, ఇసుకను ఉపయోగించి ఇంకుడు గుంతలను నిర్మించవచ్చు. ఈ రెండో విధానాన్ని హర్యానాలోని ముందాక, సర్కారిపురి గ్రామాలు అమలు చేస్తూ ఆ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. అక్కడి పథకానికి ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసర్చ్ అండ్ రూరల్ డెవలప్మెంట్’ శాస్త్రవిజ్ఞాన సహకారాన్ని అందిస్తోంది. జికా లాంటి వైరస్‌కు ప్రస్తుతానికి వ్యాక్సిన్లు లేనందున దోమల బ్రీడింగ్‌ను నిర్మూలించడమే ప్రజలకు అందుబాటులో ఉన్న ఉత్తమ మార్గం. -
డోన్ట్‌వర్రీ... బీ రెడీ జికా
రేండేళ్ల క్రితం వరకూ ఎబోలా! అంతకుముందు చికెన్‌గున్యా, బర్డ్‌ఫ్లూ, డెంగ్యూ!! ఇప్పుడు జికా వైరస్!!! క్యూ కట్టినట్టుగా ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఎందరినో చుట్టుముడుతున్నాయి. ఎంతో మంది ఉసురు తీసుకుంటున్నాయి.అయితే ఊరట కలిగించే అంశం ఏమిటంటే... ఇప్పటికింకా భారత్‌లో జికా వైరస్‌కు సంబంధించి ఒక్క కేసూ నమోదు కాలేదు. అయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది కాబట్టి మనమూ అప్రమత్తం కావాలి. అవగాహన కలిగి ఉండాలి. జికావైరస్పై అవగాహన కోసం ఈ కథనం. జికా వైరస్‌కు సంబంధించిన మొదటి కేసు గత మేలో బ్రెజిల్లో నమోదయ్యింది. అప్పట్నుంచీ అది దక్షిణ, మధ్య అమెరికా ప్రాంతాల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందింది. ఒక ఉపద్రవంలా విస్తరించింది. ఆ ప్రదేశాల్లో అది మహమ్మారిలా మారడంతో ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. జికా తెచ్చే ముప్పు ఇది జికా వైరస్... దోమల ద్వారా వ్యాపిస్తుంది. గర్భిణులకు ఈ వైరస్ సోకితే, అది వారి గర్భంలోని పిండం మెదడును కుంచించుకుపోయేలా చేస్తుందని భావిస్తున్నారు. దాంతో కుంచించుకుపోయిన మెదడుతో పసిపాపలు పుడతారని అనుకుంటున్నారు. ఇక మరికొన్ని సందర్భాల్లో అది కాలక్రమంలో అవయవాలన్నింటిపైనా మెదడు అదుపు తప్పిపోయే గులియన్ బ్యారీ సిండ్రోమ్ వంటి ఆటోఇమ్యూన్ జబ్బులకు దారి తీసి, నవజాత శిశువులకు ప్రాణాంతకమూ కావచ్చని అంచనా. ఇలా మన సొంత రోగ నిరోధక వ్యవస్థే మనపై దెబ్బతీసేలా చేస్తుందది. ఇదీ విస్తృతి... దాదాపు 15 లక్షల మంది బ్రెజిలియన్లకు జికా వైరస్ సోకింది. అందులో మెదడు కుంచించుకుపోయిన కేసులు 3,700. ఇలా మెదడు కుంచించుకుపోవడాన్ని వైద్య పరిభాషలో ‘మైక్రోసెఫాలీ’ అంటారు. తల్లికి వ్యాధి సోకితే పుట్టే పిల్లల తల చాలా చిన్నదిగా ఉంటుంది. మెదడు అభివృద్ధి, వికాసం... ఈ రెండు అంశాలూ చాలా తక్కువ. ఇది జికా వైరస్ కలగజేసే దుష్ర్పభావమని వైద్య, పరిశోధన వర్గాల అంచనా. ఈ లక్షణాలను చూశాక... దక్షిణ అమెరికా, మధ్య అమెరికా ప్రాంతాల్లోని అనేక భాగాల్లో మెడికల్ అత్యవసర స్థితిని ప్రకటించారు. దోమలను అదుపు చేయడానికి జరుగుతున్న యుద్ధంలో సాక్షాత్తూ సైనిక బలగాలు పాలుపంచుకుంటున్నాయి. కనిపించని ఉపద్రవం... ఈ ఫిబ్రవరిలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొదటి కేసు నమోదయ్యింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి యూఎస్‌కూ, యూఎస్ నుంచి ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకూ ప్రయాణాలు నిత్యం ముమ్మరంగా జరుగుతుంటాయి. దాంతో కొద్ది వ్యవధిలోనే ఇతర ప్రాంతాలకూ వ్యాపించవచ్చనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఇక మరో భయం ఏమిటంటే... ఈ వైరస్ సోకినప్పుడు తొలి దశల్లో ఎలాంటి లక్షణాలూ బయటకు కనిపించవు. దాంతో అంతర్గతంగా జరుగుతున్న నష్టం గురించి అంచనా ఉండదు. ఫలితంగా నష్టనివారణ చర్యలు చేపడదామన్నా అవకాశమే ఉండదు. అప్పట్లో పరిమిత ప్రాంతాల్లోనే... మొదట్లో జికా వైరస్ ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకూ, కొన్ని పసిఫిక్ సముద్ర భూభాగాలకు మాత్రమే పరిమితిమైంది. ఈ వైరస్ కలిగించే ఉత్పాతాలనూ, స్వరూప స్వభావాలనూ అధ్యయనం చేసి, దానికి కారణమైన ‘జికా’ అనే ఈ వైరస్‌ను 1947లో తొలిసారి కనుగొన్నారు. ‘ఈడిస్ ఈజిప్టై’ అనే దోమ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇదే దోమ డెంగ్యూ వ్యాధినీ, చికన్గున్యానూ వ్యాప్తి చేస్తుంది. ఇది పగటివేళల్లో కుట్టే దోమ. ఎక్కువ ఎత్తులో ఎగరలేదు. సాధారణంగా ఇళ్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మంచి నీళ్లలో గుడ్లు పెట్టి, అక్కడ అభివృద్ధి చెందుతుంటుంది. దోమ కుట్టాక వైరస్ చేరితే... ఈ దోమకాటు వల్ల ఒంట్లోకి వైరస్ చేరితే... కొద్దిగా జ్వరం, ఒంటి మీద దద్దుర్లు (ర్యాష్), కళ్లు కొద్దిగా ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తొలి 14 రోజులు (రెండు వారాల పాటు) ఉంటాయి. ఇప్పటికైతే మన దేశంలో లేదు... మన భారత భూభాగంపై ఇప్పటివరకూ జికా వైరస్ సోకిన ఏ కేసూ నమోదు కాలేదు. అయితే మన దేశంలోని చాలా ప్రదేశాల్లో నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలుంటాయి. అలాంటి చోట్ల నీళ్లు నిల్వ పెట్టుకోడానికి అవకాశాలు ఎక్కువ. దాంతో ఈ వైరస్‌ను వ్యాప్తి చేసే ఈడిస్ ఈజిప్టై రకం దోమలు అక్కడ పెరిగేందుకు అన్ని రకాల అనుకూల పరిస్థితులు ఉంటాయి. అందుకే నీటి ఎద్దడి వల్ల నీళ్లను నిల్వ చేసుకునే భారతీయ ప్రాంతాల్లో ఉండే గర్భిణులను అక్కడి స్థానిక ఆరోగ్య సంస్థలు అప్రమత్తం చేస్తున్నాయి. పొరుగుదేశాలలో ఉన్న పరిస్థితులను వివరించి, సమస్యపై అవగాహన కలిగిస్తున్నాయి. ఇలా నివారణకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నివారణ కోసం తీసుకోవాల్సిన మార్గదర్శకాలను రూపొందించి వారికి వివరిస్తున్నాయి. కొన్ని చోట్ల వ్యాధి నిర్ధారణకు అవసరమైన ‘కిట్లు’ అందుబాటులో ఉంచుతున్నాయి. ఒకసారి వ్యాధి సోకితే మాత్రం దాన్ని తగ్గించడానికి చికిత్స లేదు. కానీ నివారణ టీకాలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఈ ఆగష్టు నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకూ ఈ టీకాను అందుబాటులోకి తేవాలని సంకల్పించినట్లు పూణేలోని కొలంబియా ఆసియా హాస్పిటల్‌కు చెందిన నిపుణుడు మహేశ్ లాఖే తెలిపారు. అయితే ఈలోపు ప్రజలందరూ తామే అప్రమత్తం అయి నివారణ చర్యలు తీసుకోవడం ప్రధానమని మరో నిపుణులు ఓమ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఆయన తన ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా ప్రజలకు జికావైరస్ పట్ల ఉన్న ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. అపోహలను దూరం చేస్తున్నారు. సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ‘ప్రజల్లో ఈ వైరస్ పట్ల ఆందోళన ఉండటం చాలా సహేతుకమైనదే. ఎందుకంటే డెంగ్యూను వ్యాప్తి చేసే దోమే, దీన్ని వ్యాప్తి చేస్తుంది కాబట్టి వాళ్ల భయాలు అర్థవంతమైనవే’ అంటారాయన. అదృష్టవశాత్తూ మన దేశంలో జికా వైరస్ లేకపోయినా... ముందుజాగ్రత్త కోసం అవగాహన కలిగి ఉండటం చాలా మంచిది. లక్షణాలు చాలా మందిలో బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించవచ్చు. కాకపోతే కొద్దిపాటి జ్వరం, ఒంటిపై దద్దుర్లు, కీళ్లనొప్పులు, కళ్లకలక (కళ్లు ఎర్రబారడం) వంటివి కనిపిస్తాయి.కొంతమందికి కండరాల నొప్పులూ కనిపించవచ్చు. మరికొందరిలో తలనొప్పి ఉంటుంది. ఒకసారి వైరస్ సోకాక, లక్షణాలు కనిపించడానికి కొద్ది రోజులు మొదలుకొని, వారం, రెండు వారాల వరకూ వ్యవధి పట్టవచ్చు.వైరస్ సోకితే, అది వ్యాధికి గురైన వారి రక్తంలో కొన్ని రోజులు మొదలుకొని, కొన్నాళ్ల వరకూ ఉండవచ్చు. అంటే లక్షణాలు బయటకు కనిపించకపోయినా, వ్యాధి వ్యాప్తి చేసే పరిస్థితిలో వారు ఉంటారు. చికిత్స వ్యాధి సోకిన తర్వాత నిర్దిష్ట చికిత్స ప్రక్రియ లేదు. ఇతర వైరల్ జబ్బుల విషయంలో ఇచ్చే మందులే దీనికీ ఇస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ దీనికి టీకా (వ్యాక్సిన్)ను రూపొందించినట్లు పేర్కొంది. అయితే అది ఇంకా ప్రీ-క్లినికల్ ప్రయోగదశల్లో ఉందనీ, చాలా త్వరలోనే అందుబాటులోకి రానుందని చెప్పింది. ఇది ప్రాణాంతకమా? వ్యాధి సోకినప్పుడు కనిపించే లక్షణాలు ప్రాణాంతకం కాదు. అవి సాధారణ ఒళ్లునొప్పులూ, తలనొప్పులే. కానీ వ్యాధి సోకిన తర్వాత కలిగే దశలు చాలా ప్రమాదం. అవి మన రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ వ్యాధులను కలగజేయవచ్చు. ఆ తర్వాత రోగికి గులియన్ బ్యారీ సిండ్రోమ్, మెదడు కుంచించుకుపోయే మైక్రోసెఫాలీ వంటి ప్రమాదకరమైన కండిషన్స్ రావచ్చు. డెంగ్యూ, చికన్గున్యాలతో పోల్చినప్పుడు తేడా... సాధారణంగా డెంగ్యూ, చికన్‌గున్యా, జికా... ఈ మూడు వైరల్ వ్యాధుల లక్షణాల్లోని చాలా అంశాలు ఒకదానితో మరొకటి పోలి ఉంటాయి. ఉదాహరణకు దద్దుర్లు, కళ్లు ఎర్రబారడం, కంటి ఇన్ఫెక్షన్లు, కండరాల నొప్పులు అన్ని వ్యాధుల్లోనూ కనిపిస్తాయి. వ్యాధి కనిపిస్తున్న దేశాలు దక్షిణ అమెరికా ఖండానికి చెందిన చాలా దేశాలు. {బెజిల్లో దీని దుష్ర్పభావం చాలా ఎక్కువ. పోర్టారికో, కొలంబియా, బార్బడోస్, బొలీవియా, అమెరికన్ సమోవా లాంటి చోట్ల కూడా జికా వైరస్ విస్తృతంగానే ఉంది. ఇప్పుడిప్పుడే మెక్సికో, యూఎస్ఏలోనూ కేసులు కనిపిస్తున్నాయి.ఇది ఈడిస్ ఈజిప్టై అనే దోమతో వ్యాప్తి చెందుతుంది. ఇవే దోమలు డెంగ్యూ, చికన్గున్యాలనూ వ్యాప్తి చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 23 దేశాలలో జికా వైరస్ ఉత్పాతాన్ని సృష్టిస్తోంది. గర్భవతులు పాటించాల్సిన నివారణ చర్యలివి... గర్భవతుల రక్తంలోకి ఈ వైరస్ చేరితే అది కడుపులోని శిశువుకూ సోకి ప్రమాదం కలిగించవచ్చు. అందుకే గర్భిణులు దోమలు కుట్టకుండా ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలి.ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు, పొడవు చేతుల కుర్తాలు ధరించాలి.దోమలను పారదోలే ‘మస్కిటో రెపెల్లెంట్స్’ ఉపయోగించాలి. ఈ దోమలు పగలూ కుడతాయి... కాబట్టి పగటి వేళ కూడా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ శివరాజు సీనియర్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ జికా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన భారత్! దేశీయంగా టీకా రూపకల్పన మన దేశ వ్యాక్సిన్ రూపకర్తలలో ఒకటైన భారత్ బయోటిక్ సంస్థ జికా వైరస్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ రెండు ‘వ్యాక్సిన్ క్యాండిడేట్స్’ను రూపొందించి, ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపింది. ఇందులో ఒకటి వైరస్‌ను నిర్వీర్యం చేసి రూపొందించే ‘ఇనాక్టివేటెడ్ క్యాండిడేట్’ కాగా, మరొకటి కొన్నింటి సమ్మేళనం అయిన ‘రీకాంబినెంట్’. ఇక ఇవి చికిత్సకు మందులా ఇచ్చే ముందర నిర్వహించే ‘ప్రీ-క్లినికల్’ దశలో ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. రాబోయే ఐదు నెలల్లో ఈ ప్రీ-క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తామని రూపకర్తలు వివరించారు. ఆ తర్వాత నియంత్రణ అధికారుల నుంచి తగిన అనుమతులు వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము రూపొందించిన వ్యాక్సిన్స్ వివరాలన్నీ భారతీయ ఔషధాలు, ఇతర చికిత్స ప్రక్రియలను నియంత్రించే అత్యున్నత సంస్థ అయిన ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ సంస్థకు కొద్ది రోజుల క్రితమే నివేదించినట్లు భారత్ బయోటెక్ సంస్థకు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. త్వరలోనే తాము ప్రధాని నరేంద్రమోడీకి సైతం విషయాలను విడమరచి చెప్పి, తమ టీకాకు తగిన అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు వివరించారు. ‘‘ఎబోలా వ్యాక్సిన్ గురించి చర్చలు జరుగుతున్న సమయంలో తాము రెండో దశ ప్రయోగాలను అధిగమించి, మూడో దశకు నేరుగా వెళ్లామనీ, ఇప్పుడు కొద్ది మందిలో (శాంపుల్) నమూనా ప్రయోగాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ కృష్ణ ఎల్లా చెప్పారు. తమ ప్రయోగాల ద్వారా రూపొందిన వ్యాక్సిన్ పూర్తి స్థాయి అనుమతులు లభించడానికి దాదాపు 6-8 నెలల సమయం పట్టవచ్చని డాక్టర్ ఎల్లా అంచనా. ఎలా రూపొందిస్తారీ వ్యాక్సిన్లు... ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్‌లో కొన్ని రసాయనాలు, ఉష్ణోగ్రత, రేడియేషన్ వంటి అంశాలతో వ్యాధిని కలిగించే వైరస్ మైక్రోబ్ను మృతిచెందేలా చేస్తారు. ఇక రీకాంబినెంట్ వైరస్‌లో మన పరిజ్ఞానం సహాయంతో కొన్ని డీఎన్ఏలను సమ్మిళితం చేస్తారు. ‘జికా’ విశేషాలు ఉగాండాలో దోమల బెడద ఎక్కువగా ఉండే ‘జికా అరణ్యం’ పేరిట జికా వైరస్‌కు ఆ పేరు పెట్టారు. ఊళ్లలో తిరిగే కోతులకు జికా వైరస్ సోకినట్లుగా తొలినాళ్లలో గుర్తించారు. అప్పట్లో ఈ వైరస్ మనుషులపై పెద్దగా ప్రభావం చూపిన దాఖలాల్లేవు. 1950లలో భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే కొద్ది ప్రాంతాల్లో మాత్రమే మనుషుల్లో జికా వైరస్ జాడ కనిపించేది.ఇటీవలి కాలంలో జికా వైరస్ భూమధ్యరేఖకు దూరంగా ఉండే ఆయన ప్రాంతాలైన లాటిన్ అమెరికన్ దేశాలు, అమెరికా, యూరోప్‌లోని కొద్ది ప్రాంతాల్లో మనుషులకు సోకినట్లు బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దాదాపు ఏడు దశాబ్దాల కిందట గుర్తించిన ఈ వ్యాధి ఇటీవలే ఎందుకు ఎక్కువగా వ్యాపిస్తోందనే దానికి కచ్చితమైన కారణాలేవీ బయటపడలేదు. అయితే, వాతావరణ మార్పుల వల్ల... ముఖ్యంగా భూతాపోన్నతి (గ్లోబల్ వార్మింగ్) వల్ల ఈ వ్యాధి ఆయన ప్రాంత దేశాల్లోనూ విస్తరిస్తోందని భావిస్తున్నారు. -
ప్రబలుతున్న చికెన్ గున్యా
నెల్లూరు: జిల్లాలో ప్రజలు చికెన్ గున్యా వ్యాధితో తీవ్ర అవస్థలు పడుతున్నారు. మనుబోలు మండలం బద్దివోలు గ్రామంలోనే సుమారు 100 మందికి చికెన్ గున్యా సోకినట్లు వ్యాధి నిర్ధారణ అయింది. బాధితులు నెల్లూరు, గూడూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నారు. సంబంధిత అధికారులు ప్రజల్లో వ్యాధి పట్ల అవగాహన కల్పించకపోవడం, సరైన చర్యలు తీసుకోకపోవడం మూలంగానే బాధితుల సంఖ్య పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
సంగారెడ్డి అర్బన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు తప్పని సరిగా విధి నిర్వహణలో సమయ పాలన పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే మెడికల్ ఆఫీసర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా వైద్య సేవలందించేందుకు అందుబాటులో ఉండాలన్నారు. వైద్య వృత్తి చాలా పవిత్రమైందని, ఈ వృత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మెడికల్ ఆఫీసర్లపై ఉందని ఆయన తెలిపారు. వైద్యాధికారుల్ని బట్టి మిగిలిన సిబ్బంది కూడా సమయపాలన పాటిస్తారన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్ పేషంట్లకు చికిత్సలు అందించడం కోసం ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఆరోగ్య కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు రోగం నయం చేయడానికి మేమున్నామన్న నమ్మకాన్ని సిబ్బంది కలిగించాలని, వారిని అధైర్యపర్చరాదని సూచించారు. జిల్లాలో జ్వరాలతో ఏ ఒక్కరూ మరణించకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ప్రతీ కేసును డయగ్నైస్ చేయకుండా డెంగ్యూ, చికెన్‌గున్యా అని నిర్థారించవద్దని ఆయన మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. ప్రతి మెడికల్ ఆఫీసర్ పనిచే సే కేంద్ర స్థానంలోనే నివసించాలని అలా ఉండటం వల్ల తమ పరిధిలో గల రోగులకు ఏ సమయంలోనైనా వైద్యసేవలు అందించగలుగుతారన్నారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్య మెరుగుపర్చాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే మెడికల్ ఆఫీసర్లపై ఫిర్యాదులు వస్తున్నాయని ఇక ముందు అలాంటివి రాకుండా జాగ్రత్త వహించాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదనపు జే సీ మూర్తి, డీఎంఅండ్ హెచ్‌వో బాలాజీ పవార్, డీపీవో జగన్నాథ్‌రెడ్డి, డీసీహెచ్ఎస్ డా.నరేంద్ర బాబు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
నిర్లక్ష్య రోగం!
విజయనగరం ఆరోగ్యం:ప్రభుత్వం సరఫరా చేసిన దోమల నివారణ మందును ఇప్పటికే గ్రామాల్లో పిచికారీ చేయాలి. అయితే అలా జరగలేదు. ఆ మందు ఇంకా పీహెచ్‌సీల్లో మూలుగుతోంది. తాము ఎప్పుడో మందును సరఫరా చేశామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈనెలలోనే వచ్చినట్టు వైద్యాధికారులు అంటున్నారు. ఏది నిజయో తెలియని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్‌లోనే మందు సరఫరా సీజనల్‌గా వచ్చే మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, ఫైలేరియా వంటి వ్యాధులును వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రభుత్వం ఈఏడాది ముందుస్తు చర్యలు చేపట్టింది. వ్యాధులను కలగజేసే దోమల ను సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశ్యంతో ప్రతీ పల్లె, పట్టణాల్లో పిచికారీ చేయడం కోసం దోమల నివారణకు ఉపయోగించే లార్విసెడ్, మలథీయాన్‌మందును ఏప్రిల్ నెలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సరఫరా చేసింది. వీటిని పీహెచ్‌సీలు ద్వారా గ్రామాలకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఆ మందులు ఇంకా పీహెచ్‌సీల్లోనే మూలుగుతున్నా యి. వైద్య ఆరోగ్యశాఖ సరఫరా చేసినమూటలను కూడా సబంధిత సిబ్బంది ఇంకా చాలా గ్రామాల్లో విప్పినట్టు లేదు. గంట్యాడ మండలంలోని పరిధిలోని పెదవేమలి, మురపాక, సిరిపురం, గ్రామాలను పరిశీలించగా ఇంకా ఆయా పంచాయతీలకు మందు చేరలేదు. అదేవిధంగా విజయనగరం మండలంలోని జొన్నవలస, పినవేమలి, రాకోడు గ్రామాలకు కూడా మందు చేరలేదు. జిల్లాకు సరఫరా అయిన మందు వివరాలు గ్రామాల్లో పిచికారీ చేయడానికి 1200 లీటర్లు లార్విసెడ్ కెమికల్, పట్టణాలకు 840 లీటర్లు మలాథి యాన్ , 330 లీటర్ల లార్విసెడ్ కెమికల్‌ను సరఫరా చేశారు. మందును జిల్లాలో ఉన్న 68 పీహెచ్‌సీలు ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు సరఫరాచేయాలి. మున్సిపాల్టీలకు మలేరియా సబ్ యూని ట్ సిబ్బంది అందజేయాలి. మందు సరఫరా అయి రెండు నెలలు అవుతున్న ఇంతవరకు మూటలు కూడా విప్పని పరిస్థితి. దీంతో గ్రామాల్లో మందును పిచకారీ చేయకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. జిల్లా వాసులకు మలేరియా, వైరల్,డెంగీ వంటి వ్యాధులు సోకుతున్నాయి. వారానికి ఒకసారి పిచికారీ చేయాలి గ్రామాలు, పట్టణాల్లో లార్విసెడ్, మలథీయా న్ మందును కాల్వల్లో వారానికి ఒకసారిపిచికారీ చేయాలి. ఇప్పటికే ఈకార్యక్రమాన్ని ప్రారంభిం చాల్సి ఉంది. కాని ఇంతవరకు ప్రారంభం కాలేదు. జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో పారిశుధ్యం ఆధ్వాన్నంగా ఉంది. దీంతో దోమల వ్యాప్తి అధికంగా ఉంది. మందు పిచికారీ చేసి ఉంటే దోమల తగ్గేవి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు వల్ల దోమలు మరింత అధికమయ్యే ప్రమాదం ఉంది. ఏప్రిల్‌లోనే సరఫరా చేశాం... లార్విసెడ్, మలాథియాన్ మందులను ఏప్రిల్ నెలలోనే పీహెచ్‌సీలకు సరఫరా చేసేశాం. వాటిని గ్రామాలకు అందజేయమని ఆదేశాలు కూడా జారీ చేశాం. గ్రామాలకు సరఫరా కాని విషయం ఇంతవరకు నాకు తెలియదు. తక్షణమే గ్రామాలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. - యు.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్. ఈ నెలలోనే మందు వచ్చింది మా పీహెచ్సీ పరిధిలో 19 పంచాయతీలున్నాయి. మాకు ఈనెల 5వతేదీన 5 లీటర్లు లార్విసెడ్ మందు ఇచ్చారు. మందు పూర్తి స్థాయిలో సరిపోతుందో లేదోనని తర్జన భర్జన పడ్డాం. ఒకటి రెండు రోజుల్లో పంచాయతీలకు పంపిస్తాం - డాక్టర్ రాజశేఖర్, గంట్యాడ పీహెచ్సీ వైద్యాధికారి -
జ్వరాలతో నలుగురు మృతి
అనిగండ్లపాడు (పెనుగంచిప్రోలు), న్యూస్‌లైన్ : వైరల్ జ్వరాలు, చికెన్ గున్యా లక్షణాలతో మండలంలోని అనిగండ్లపాడులో గంటల వ్యవధిలో నలుగురు మృత్యువాతపడ్డారు. గ్రామానికి చెందిన అత్తలూరి కోటేశ్వరరావు (65), దండా రామారావు (70) బుధవారం రాత్రి, కనకపూడి జగన్నాధం (70), నెలకుర్తి సీతారావమ్మ (69) గురువారం మృతిచెందారు. కొన్ని రోజులుగా గ్రామంలో వైరల్, చికెన్ గున్యా లక్షణాలతో జ్వరాలు వ్యాపించాయి. గ్రామంలో ఏ ఇంట్లో చూసినా జ్వరపీడితులు ఇద్దరికి పైగా ఉన్నారు. తీవ్ర శారీరక నొప్పులతో నడవలేని, మంచంలో నుంచి లేవలేని స్థితిలో గ్రామస్తులు అల్లాడుతున్నారు. మృతిచెందిన నలుగురూ కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపారు. వీరంతా వృద్ధులు కాగా, ఒకేసారి నలుగురు మృతిచెందడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే జ్వరపీడితులు, నొప్పులతో బాధపడుతున్నవారు ఆర్ఎంపీల వద్ద వందల సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. మరోపక్క కొందరు ఆర్ఎంపీలు కూడా జ్వరాల బారిన పడటం గమనార్హం. దీంతో జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, మధిర ఆస్పత్రుల్లో అనిగండ్లపాడు వాసులు పెద్ద సంఖ్యలో చికిత్సలు చేయించుకుంటున్నారు. అనిగండ్లపాడు పేరు చెబితేనే భయపడుతున్నారని, గ్రామానికి బయటవారు రావటానికి ఇష్ట పడటం లేదని, వచ్చినా వెంటనే వెళ్లి పోతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు, శివాలయం మాజీ చైర్మన్ నెలకుర్తి సాంబశివరావు తల్లి సీతారావమ్మ మృతదేహాన్ని పార్టీ మండల నేత వూట్ల నాగేశ్వరరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు లగడపాటి మోహనరావు, మండల ఉపాధ్యక్షుడు కురువెళ్ల రాయప్ప, కాంగ్రెస్ నాయకులు పాటిబండ్ల వెంకట్రావు, వాసిరెడ్డి బెనర్జీ, లగడపాటి నాగేశ్వరరావు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. మంచం పట్టిన బలుసుపాడు జగ్గయ్యపేట : మండల పరిధిలోని బలుసుపాడులో విషజ్వరాలు ప్రబలాయి. ఏ ఇంట్లో చూసినా జ్వరపీడితులే కనబడుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, బీసీ కాలనీల్లో జ్వరాలతో మంచం పట్టారు. గ్రామంలో పలు ప్రాంతాలలో మురికివాడల్లో అపరిశుభ్రత నెలకొంది. గ్రామంలో వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా సమైక్యాంధ్ర సమ్మెలో ఉండటంతో జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. సోమ, మంగళ, బుధవారాలు మూడురోజుల్లోనే పదుల సంఖ్యలో జ్వరంతో బాధపడుతూ జనం ఆస్పత్రులపాలయ్యారు. అధిక జ్వరంతో పాటు కీళ్లనొప్పులు విపరీతంగా ఉండటంతో మంచానికే పరిమితమవుతున్నారు. ఇంట్లో ఒకరికి జ్వరం వ్యాపిస్తే కుటుంబ సభ్యులందరికీ జ్వరాలు వస్తున్నాయి. గ్రామంలో వైద్యులు లేకపోవడంతో పేట పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే తీవ్ర జ్వరంతో గ్రామంలోని బండ్ల నాగరత్నం, ప్రకాశరావు, అమ్మనబోయిన గోపయ్య, రాజు, కొరివి వెంకమ్మ, మేరుగ వజ్రం, మదారమ్మ, రోశమ్మ, కంబాల మణమ్మ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో పారిశుధ్యం అధ్వానం.. గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. డ్రెయినేజీల పూడిక తీయకపోవడంతో పాటు తాగునీటి కుళాయిల వద్ద అపరిశుభ్రత నెలకొంది. కొన్ని నెలలుగా తాగునీటి ట్యాంకు కూడా శుభ్రం చేయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ అధికారులు పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు.