రాష్ట్రానికి జ్వరం కాటు
- పంజా విసురుతున్న డెంగీ, టైఫాయిడ్, చికెన్ గున్యా,మలేరియా, డయేరియా
- ఆస్పత్రుల్లో వేలాది మంది బాధితులు
- ఏజెన్సీల్లో జ్వరాల కాటుకు పిట్టల్లా రాలుతున్న గిరిజనులు
- 4.3 లక్షలకు చేరిన డయేరియా బాధితుల సంఖ్య
- 8 నెలల్లో 51,256 డెంగీ కేసులు నమోదు...
- 1,206 మాత్రమే అంటున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. విష జ్వరాలు, కలుషిత నీటి జబ్బులు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యా వంటి ప్రమాదకరమైన జ్వరాలతో ఊళ్లకు ఊళ్లే మంచం పట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా వైరల్ జ్వరాల బారినపడ్డ వేలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీతో ఎంతమంది మరణించారనే గణాంకాలు ప్రభుత్వం వద్ద లేకపోవడం గమనార్హం. ప్రభుత్వాసుపత్రుల్లో డెంగీ జ్వరాలకు వైద్యం లభించకపోవడంతో బాధితులు మరో గత్యంతరం లేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి, అప్పుల పాలవ్వాల్సి వస్తోంది.
జ్వరాల కాటుకు పదుల సంఖ్యలో జనం బలైపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అధికార యంత్రాంగాన్ని తక్షణమే రంగంలోకి దింపి, బాధితులకు సాంత్వన కలిగించాల్సింది పోయి మీనమేషాలు లెక్కిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీలు, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అంతటా విష జ్వరాలు పంజా విసురుతున్నా ముందస్తు చర్యలు చేపట్టడంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైంది. రాష్ట్రంలో మలేరియా, డెంగీపై ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించి చేతులు దులుపుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు జ్వరాల బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నా పాలకుల్లో చలనం కనిపించడం లేదు. రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్న జ్వరాల కేసులు కొన్నేనని, బయటకు రానివి ఇంకా ఎన్నో రెట్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
డయేరియా కేసులు ఆల్‌టైం రికార్డు
డయేరియా (వాంతులు, విరేచనాలు) బాధితుల సంఖ్య ప్రస్తుతం ఆల్‌టైం రికార్డు అని వైద్యులు చెబుతున్నారు. అక్యూట్ డయేరియా డిసీజ్ (ఏడీడీ)గా చెప్పుకునే ఈ వ్యాధి బారినపడ్డ వారి సంఖ్య ఇప్పటికే 4.30 లక్షలకు చేరింది. గ్రామాల్లో సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేక కలుషిత నీటిని సేవిస్తున్న జనం డయేరియా బారినపడుతున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాల్లో 99,463 మంది డయేరియా కాటుకు గురయ్యారు. అనంతపురం జిల్లాలో 94,660 మంది డయేరియా బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
వణికిస్తున్న టైఫాయిడ్, డెంగీ
రాష్ట్రంలో టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఈ జ్వరాలతో మంచాన పడిన వారి సంఖ్య లక్ష దాటి ఉండొచ్చని అంచనా. 25 వేల మందికిపైగానే టైఫాయిడ్ సోకినట్టు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. 15,300కుపైగా మలేరియా కేసులు నమోదైనట్లు తేలింది. ఇక డెంగీపై ప్రభుత్వానికే స్పష్టత లేదు. ప్రభుత్వాసుపత్రుల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న మెడాల్ సంస్థ గత36 వారాల్లో 51 వేలకు పైగా డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. కానీ, 1,206 డెంగీ కేసులే నమోదైనట్లు ప్రభుత్వం చెబుతోంది. డెంగీ వల్ల రాష్ట్రంలో ఒక్కరు కూడా మరణించలేదని పేర్కొంటోంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో డెంగీ బాధితులే అధికంగా కనిపిస్తున్నారు. విశాఖ, తూర్పు గోదావరి, అనంతపురం, చిత్తూరు జిల్లాలో డెంగీ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది.
మొబైల్ యూనిట్లతో వైద్య సాయం
‘‘రాష్ట్రవ్యాప్తంగా మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, టైఫాయిడ్ బాధితులకు సత్వరం వైద్యసాయం అందించేందుకు లక్ష జనాభాకు ఒక మొబైల్ మెడికల్ యూనిట్ ఏర్పాటు చేశాం. ఈ యూనిట్ ప్రతి గ్రామానికీ వెళ్లి ఇంటింటి సర్వే చేసి, బాధితులను గుర్తిస్తుంది. వైద్య సాయం అందిస్తుం ది. ఇందులో కమ్యూనిటీ మెడికల్ ఆర్గనైజర్, నర్సు, ఫార్మసిస్ట్ తదితర ఐదుగురు సభ్యులు ఉంటారు. ఇప్పటికే జ్వరాల తీవ్రత ఉన్న ప్రాంతాల్లో దోమ తెరలు పంపిణీ చేశాం. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాం’’
- డా.గీతాప్రసాదిని, ఏడీ, ప్రజారోగ్య శాఖ