Public health department
-
అధి‘కార్ల’ బాగోతం.. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా కక్కుర్తి పోలేదు!
ఇక్కడ కనిపిస్తున్న వాహనాన్ని ఓ ఐసీడీఎస్ అధికారి వినియోగిస్తున్నారు. కారుపైన ‘ఆన్ గౌట్ డ్యూటీ’ అని రాసి ఉంది. నిబంధనల ప్రకారం ఎల్లో ప్లేట్ వాహనం వినియోగించాలి. కానీ ఇందులోనే సదరు అధికారి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. ఈయనొక్కరే కాదు.. ఆర్అండ్బీ, ఐటీడీఏ ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, వైద్యారోగ్యశాఖ, వయోజన విద్య, బీసీ వెల్ఫేర్, ఇరిగేషన్, పశుసంవర్ధక శాఖ, ఆర్డబ్ల్యూఎస్, డీపీఓ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు చాలా వరకు వైట్‌ప్లేట్ వాహనాల్లోనే తిరుగుతూ ఎల్లో ప్లేట్ పేరిట బిల్లులు డ్రా చేసుకుంటుండడం గమనార్హం. సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో కొంతమంది అధికారులు వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా ఇంకా కక్కుర్తి పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా స్థాయితో పాటు కొంతమంది క్షేత్రస్థాయి పరిశీలన కోసం వెళ్లే అధికారులకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. ప్రభుత్వ వాహనాలు అందుబాటులో లేని చోట అద్దె వాహనాల వెసులుబాటు కల్పించింది. అయితే ఈ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తమ సొంత వాహనాల్లోనే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ‘అద్దె’ను సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో చాలా మంది వైట్ ప్లేట్ వాహనాల్లో వెళ్తూ ఇతరుల పేరిట బిల్లులు తీసుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో.. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయా శాఖల్లో ప్రభుత్వ వాహనాలు లేని అధికారులకు ట్యాక్స్ ప్లేట్ వాహనాలు అద్దెకు తీసుకునే అవకాశం కల్పించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర శాఖల నుంచి నిరుద్యోగులకు ఓనర్ కమ్ డ్రైవర్ వంటి స్కీమ్‌లను ప్రవేశపెట్టి వాహనాలను సబ్సిడీ రూపంలో అందించింది. ఆయా శాఖల్లో వాహనాలు అద్దెకు పెట్టేందుకు అనుమతినిచ్చింది. అయితే కొంతమంది అధికారులు ఎల్లో ప్లేట్‌కు బదులు వైట్ ప్లేట్ వాహనాలనే వినియోగిస్తూ నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారు. బిల్లులు తీసుకునే సమయంలో ఇతరుల వాహనాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులకు విషయం తెలిసినప్పటికీ ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెలకు 2,500 కిలో మీటర్లు వాహనం తిరగాల్సి ఉంటుంది. ఇందుకు గాను రూ.33వేలను ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే కొంతమంది అధికారులు తమ వాహనాల్లో తక్కువ కిలో మీటర్లు తిరుగుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వాహనాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లకపోయినా టూర్ డైరీలో మాత్రం వెళ్లినట్లు చూపిస్తున్నారనే విమర్శలున్నాయి. చదవండి: పాతబస్తీలో బిర్యానీ ఫైట్ కలకలం.. అర్ధరాత్రి హోంమంత్రికి ఫోన్ చేసి సర్కారు ఆదాయానికి గండి.. ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యక్తిగత వాహనాలను వినియోగించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. వైట్ ప్లేట్ వాహనాలను సొంత పనులకు మాత్రమే వినియోగించాలి. వీటికి పన్ను చెల్లింపు ఉండదు. ఎల్లో ప్లేట్ ట్యాక్స్ వాహనాలను ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర అద్దె కోసం వినియోగించాల్సి ఉంటుంది. వీటికి మాత్రం ఫిట్నెస్, ఏడాదికి ఇన్సూరెన్స్ రూ.20వేల నుంచి రూ.25వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రం దాటితే టీపీ తీయాలి. అయితే ఇలాంటివి పన్నులు లేకుండా కొందరు అధికారులు తమ సొంత వాహనాలనే వినియోగిస్తూ బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. ఇతర వ్యక్తులకు సంబంధించిన వాహనాలుగా చూపుతూ వారికి నెలకు రూ.1500 నుంచి రూ.2వేలు వరకు చెల్లిస్తున్నారు. అదే బాటలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు.. జిల్లాలో 18 మండలాలున్నాయి. క్షేత్రస్థాయిలో ప ర్యటించే తహసీల్దార్లు, ఎంపీడీఓలకు ప్రభుత్వం అద్దె వాహన సౌకర్యం కల్పించింది. కొంతమంది మాత్రం దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. అద్దె వాహనాలు వినియోగించాల్సి ఉన్నా కాసులకోసం కక్కుర్తి పడుతూ తమ సొంత వాహనాలనే విని యోగిస్తూ బిల్లులు కాజేస్తున్నారు. రోజు కార్యాలయానికి వచ్చేది వైట్ ప్లేట్ వాహనంలోనే అయినా.. బిల్లులు మాత్రం ఎల్లో ప్లేట్‌కు సంబంధించి తీసుకుంటున్నారు. ఈ విషయమై అదనపు కలెక్టర్ నటరాజ్, డీఆర్డీవో కిషన్‌ను ఫోన్లో సంప్రదించగా వారు సమావేశంలో ఉన్నామని తెలిపారు. వివరాలు తెలిపేందుకు అందుబాటులోకి రాలేదు. -
కరోనా రికవరీ రేటు 99%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి రికవరీ రేటు 99 శాతంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకుడు జి.శ్రీనివాసరావు వెల్లడించారు. కేవలం ఒక శాతం మాత్రమే డెత్‌రేట్ ఉందని, జాతీయ స్థాయిలో కోవిడ్–19 డెత్ రేట్ 2.7 శాతంగా ఉందని ఆయన వివరించారు. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో తీవ్రత తక్కువగానే ఉందని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డితో కలసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మంగళవారం ఉదయం వరకు 36,221 పాజిటివ్ కేసులున్నాయని, 365 మంది మరణించారని చెప్పారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నట్లు వెల్లడించారు. పాజిటివ్ కేసుల్లో 80 శాతం మందికి లక్షణాలు లేవని, కరోనా వైరస్ నిర్ధారణ కోసం జీహెచ్ఎంసీలో 300 ల్యాబ్‌లలో పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 97,786 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కూడా కోవిడ్ చికిత్స ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 98 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు అనుమతి ఉందని, ప్రస్తుతం 54 ఆస్పత్రుల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైందని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లోనే గాంధీలో చికిత్స రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం గాంధీలోనే చికిత్స అందిస్తామన్నారు. పలు సందర్భాల్లో ప్రైవేటు ఆస్పత్రులు చివరి నిమిషాల్లో రోగులను గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నారన్నారు. లక్షణాలు లేని వారు గాంధీలో అడ్మిట్ కావడం వల్ల ఇతరుల ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముందని తెలిపారు. ప్లాస్మా థెరఫీ అందరికీ సరికాదని.. ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది ఈ సమయంలో ఆందోళన చేయడం సరికాదని సూచించారు. జీతాలు పెంచుతామని, ఉద్యోగ క్రమబద్ధీకరణ అంశం కోర్టు పరిధిలో ఉందని వివరించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని కోరారు. -
ఏ తరహా వైద్యం అందుతోంది?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు బోధనాస్పత్రులను కరోనా వైద్యం కోసం వినియోగించుకునేందుకు జీవో ఇచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. రాష్ట్రంలో కరోనా కట్టడికి వైద్యసేవలు అందించే ఆస్పత్రుల్లో ఏ తరహా వైద్యం అందజేస్తున్నారో మంగళవారం జరిగే విచారణలో స్వయంగా తెలియజేయాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావును ఆదేశించింది. బోధనాస్పత్రులను కరోనా వైద్యం కోసం వినియోగించుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ డాక్టర్ ఆర్.శ్రీవాత్సవన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ జరిపింది. కరోనా వైద్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రులను ప్రభుత్వం ఎంపిక చేసినా చాలా మంది బాధితులు గాంధీకే వస్తున్నారని, వచ్చిన వారందరికీ వైద్యం అందక నానాకష్టాలు పడుతున్నారని, గేటు వద్ద మరణిస్తున్నారని పిటిషనర్ న్యాయవాది వసుధా నాగరాజ్ చెప్పారు. గాంధీలో యాంటీ ర్యాపిడ్ టెస్ట్‌లు లేకపోతే ఎలాగని, జిల్లాల్లోని ఆస్పత్రులకు వెళ్తే గాంధీకి వెళ్లాలని చెబుతున్నారని, అందుకే కరోనా ఆస్పత్రుల్లో ఏ తరహా వైద్యం అందిస్తున్నారో తాము తెలుసుకోవాలని భావిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా బాధితుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేయడాన్ని ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతోందని ప్రశ్నించింది. వేణుధర్‌రెడ్డి దాఖలు చేసిన మరో పిల్‌ను విచారించిన ధర్మాసనం.. ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా ఖాతరు చేయని కార్పొరేట్ ఆస్పత్రులపై తీసుకున్న చర్యలు వివరించాలని కోరింది. విచారణ ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. -
మస్తరు.. మాయాజాలం
పటమట(విజయవాడ తూర్పు): వీఐపీలు తిరుగాడే బందరురోడ్డు, ఏలూరు రోడ్డును వీఎంసీ లిట్టర్‌ఫ్రీజోన్‌గా ప్రకటించింది. ఈ రోడ్లలో వ్యర్థపదార్థాలు, చెత్త, దుమ్మును నిత్యం శుభ్రం చేయటానికి కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు షిఫ్టులవారీగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో లిట్టర్ ఫ్రీ జోన్లో 150 మంది విధులు నిర్వహించేవారు. అయితే కార్మికుల సంఖ్యను 150 నుంచి 200 మందికి పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో కౌన్సిల్ తీర్మానం కూడా అయ్యింది. మార్చి నుంచి ఆగస్టు వరకు ఆరునెలలపాటు కాంట్రాక్టు నిర్వాహణను కృష్ణలంకకు చెందిన ఓ కాంట్రాక్టరు చేపట్టారు. రూ.1.75 కోట్ల కాంట్రాక్టును టెండర్ ప్రాతిపదికన కాకుండా అత్యవసర సేవలుగా నామినేడెట్ పద్ధతిలో కాంట్రాక్టు పొందారు. గతంలో కంటే 50 మంది మగ వర్కర్లను నియమించుకుని రోడ్డు–ఎండ్–టూ ఎండ్ ఊడ్చేందుకు, ఫూట్పాత్లను శుభ్రం చేసేందుకు, యూనిఫాం, పారిశుద్ధ్య పరికరాలతోపాటు, చెత్తను వేయటానికి ప్రత్యేక కవరును ఏర్పాటు చేసుకునేలా సదరు సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. అయితే మార్చి నుంచి ఇప్పటి వరకు కేవలం ప్రతినిత్యం 150 మందితోనే పనిచేయించి 200 మంది దొంగ హాజరు చూపించి, ఏప్రిల్ – మే నెలలకు సంబంధించి బిల్లుపెట్టడంతో ఆడిట్ అభ్యంతరాలతో విషయం బయటకు పొక్కింది. దీనికి వీఎంసీ ప్రజారోగ్య కీలక అధికారి కూడా సహకరించారని, హాజరును బట్టి కాంట్రాక్టు బిల్లులు చెల్లించాలని కమిషనర్ ఆదేశించినప్పటికీ ఈ విభాగం అధికారులు బేఖాతరు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. కోవిడ్ ప్రభావంతో మ్యాన్యువల్‌గా హాజరు.. గతంలో బయోమెట్రిక్ విధానంతో మస్తరు నమోదు జరిగేది. మార్చి నుంచి నగరంలో కోవిడ్–19 ప్రభావం ఉండటంతో బయోమెట్రిక్ విధానం రద్దుచేసి ఫేస్ రికగ్నైజేషన్ లేదా సంతకాలతో మ్యాన్యువల్‌గా హాజరు నమోదు చేయటం వల్ల తక్కువ మంది హాజరైనా ఎక్కువమంది అయ్యినట్లు క్షేత్రస్థాయి సిబ్బంది కాంట్రాక్టరుకు సహకరించినట్లు విమర్శలకు విన వస్తున్నాయి. దీనిపై విచారణకు ఆదేశించినప్పటికీ శనివారం సదరు కాంట్రాక్టు సంస్థ నుంచి రూ. 50 లక్షల బిల్లును ప్రజారోగ్య విభాగం నుంచి అప్రూవల్ పొంది ఆడిట్‌కు రాగా అధికారులు హాజరుపట్టీని సమర్పించాలని, షిప్టులవారీ డ్యూటీ షీట్‌ను సమర్పించాలని ఆదేశించటం వివాదాస్పదమయ్యింది. పరికరాలూ వీఎంసీవే.. ఒప్పందం ప్రకారం పారిశుద్ధ్య సిబ్బంది వినియోగించే పరికరాలు, యూనిఫాం, ఇతర యంత్రాలు కాంట్రాక్టర్లే సమకూర్చుకోవాల్సి ఉంది. అయితే కొంతమంది శానిటరీ ఇన్స్పెక్టర్లు సీఎంఈవై, డ్వాక్రా సిబ్బందిచే వీఎంసీ తయారు చేయిస్తున్న పరికరాలు, యూనిఫాం, గ్లౌజులు, బ్యాక్‌ప్యాక్‌లను ఆయా కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన తరలిస్తున్నారని, ఇందుకుగాను ఒక్కో కాంట్రాక్టర్ నుంచి నెలవారీ మామూళ్లు పొందుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. లిట్టర్ ఫ్రీ జోన్లో మ్యాన్యువల్ హాజరే.. లిట్టర్‌ఫ్రీ జోన్లో మ్యాన్యువల్‌గానే మస్తరు వేస్తున్నాం. మస్తర్ల ప్రకారమే వేతనాలను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కారి్మకులకు ఏప్రిల్–మే వేతనాలకు బిల్లులు వచ్చాయి. పరిశీలన జరిగాకే చెల్లింపులకు సిఫారసు చేశాం. – వెంకటరమణ, సీఎంఓహెచ్, వీఎంసీ -
‘కాసు’క్కూర్చున్నారు!
కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించిన విధులు నిర్వహిస్తున్న వారిలో పారిశుద్ధ్య కార్మికులు ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుత పరిస్థితిలో వీరి అవసరం చాలా ఉంది. సరిగ్గా దీనినే తమకు అనుకూలంగా మార్చుకున్నారు విజయవాడ కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బంది. కాంటాక్ట్ ముగిసిన గ్రూపులు కొనసాగాలన్నా.. కొత్త గ్రూపులను తీసుకోవాలన్నా కమీషన్లు దండుకుంటూ కార్మికుల పొట్టగొడుతున్నారు. పటమట(విజయవాడ తూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అవినీతి కంపు కొడుతోంది. నగరాన్ని శుభ్రం చేసేందుకు నియమించుకున్న పారిశుద్ధ్య కారి్మకుల నుంచి ఈ విభాగంలోని శానిటరీ మేస్త్రీ, ఇన్స్పెక్టర్ల నుంచి ఉన్నతాధికారుల వరకు అందినకాడికి దండుకుంటూ వారిని నిలువుదోపిడీ చేస్తున్నారు. కరోనా కట్టడిలో తొలి వరుసలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల నియామక గడువు ముగిసిందని వారిని కొనసాగించాలంటే తమకు సొమ్ములు ముట్టజెప్పాలని లేదంటే తొలగిస్తామంటూ వార్డులో విధులు నిర్వహించే క్షేత్రస్థాయి సిబ్బంది నిత్యం బెదిరింపులకు పాల్పడుతున్నారని కారి్మకులు ఆరోపిస్తున్నారు. పాత గ్రూపు కొనసాగింపునకు ఒక్కో గ్రూపుకు రూ. 50 వేలు, కొత్త గ్రూపు రిజి్రస్టేషన్‌కు ఒక్కో గ్రూపునకు రూ. లక్ష వరకు డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అదనపు సిబ్బంది నియామకంలోనూ.. ►కోవిడ్ నియంత్రణకు అదనంగా 20 శాతం వర్కర్లను నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటంతో నూతన వర్కర్ల నియామకానికీ భారీ స్థాయిలో ముడుపులు సేకరించినట్లు ఆరోపణలున్నాయి. ►నగరంలో ఇటీవల 20 గ్రూపుల ద్వారా 200 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికుల నియామకం జరిగింది. ►ఇవన్నీ సీఎంఈవై, డ్వాక్రా గ్రూపుల ద్వారా నియమించాలని మార్గదర్శకాలుండగా కొంత మంది అత్యుత్సాహ శానిటరీ మేస్త్రీలు, ఇన్స్పెక్టర్లు మనుగడలో లేని గ్రూపుల ద్వారా నియామకాన్ని చేపట్టి అందుకు కార్మికుల నుంచి రూ. లక్షల్లో వసూళ్లు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ►మరోవైపు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి వీఎంసీ ప్రత్యేకంగా టీఎల్ఎఫ్(టౌన్ లెవల్ ఫెడరేషన్)లకు నిర్వహణ బాధ్యతలు ఇస్తోందన్న సమాచారంతో శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు మరింత దూకుడు పెంచి నిర్ణీత గడువు విధించి మరీ వసూళ్లు చేస్తున్నారని, గడువులోగా ఇవ్వకపోతే పొదుపు సంఘాల రిజిస్ట్రేషన్ వాయిదా వేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ►కొంతమంది శానిటరీ ఇన్స్పెక్టర్లైతే బినామీ గ్రూపులు నిర్వహిస్తున్నారని, గ్రూపులకు సంబంధించి ఎలాంటి రికార్డులైనా, లావాదేవీలైనా, తీర్మానాలైనా వారి నియత్రణలోనే ఉంటున్నాయని తెలుస్తోంది. అవినీతి రాజ్యమేలుతోంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగంలో అవినీతి రాజ్యమేలుతుంది. జలగల్లా కొంత మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు పారిశుద్ధ్య కార్మికులను వేధిస్తున్నారు. చాలా మంది ఇన్స్పె క్టర్లు పొదుపు సంఘాల తీర్మానాల పుస్తకాలు, రిజిస్ట్రార్లు, బ్యాంకు పాసుపుస్తకాలు, చెక్‌బుక్‌లను స్వా«దీనం చేసుకుని వాటిని నాశనం చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. టీఎల్‌ఎఫ్‌లకు బాధ్యతలు ఇస్తే కొంతమేర నష్టనివారణ జరగే అవకాశం ఉంది. – ఎం.డేవిడ్, సీఐటీయూ నాయకుడు చర్యలు తీసుకుంటాం.. పారిశుద్ధ్య కార్మికుల కొనసాగింపు, కొత్త గ్రూపుల నియామకంలో అవినీతి జరుగుతుందని ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – షాలినీదేవి, సీఎంవోహెచ్–వీఎంసీ -
చికెన్ ముక్క.. రోగం పక్కా!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉంచిన నాసిరకం కోడి మాంసం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు యథేచ్ఛగా దిగుమతి అవుతోంది. ఆగస్టు 26వ తేదీన నెల్లూరులోని చికెన్ స్టాళ్లను ప్రజారోగ్య శాఖ అధికారులు తనిఖీ చేయగా.. దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కోడి లివర్, కందనకాయ, కోడి వెనుక భాగం, కాళ్ల భాగాలను పూర్తిగా తినడానికి వినియోగించరు. కొన్నేళ్ల క్రితం వరకు వాటిని డంపింగ్ యార్డుకు తరలించేవారు. ఇప్పుడు ఆయా భాగాలను పొరుగు రాష్ట్రాలకు తరలించి, సొమ్ము చేసుకుంటున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి తొలుత చెన్నై హోల్‌సేల్ మార్కెట్‌కు, అక్కడి నుంచి మినీ ఆటోల ద్వారా నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు పనికిరాని కోడి మాంసాన్ని సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చెన్నై మార్కెట్లో కిలో రూ.50కి కొనుగోలు చేసి, ఏపీలోని పలు ప్రాంతాల్లో రూ.120 నుంచి రూ.180 వరకు విక్రయిస్తున్నారు. కోయంబత్తూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చేరేసరికి కనీసం మూడు రోజుల సమయం పడుతుండటంతో చికెన్ పాడైపోతోంది. దానిని స్థానిక వ్యాపారులు ఇక్కడ సిద్ధం చేసిన చికెన్‌లో కలిపి వినియోగదారులకు అంట గడుతున్నారు. నెల్లూరు నగరంలో మూడు చికెన్ స్టాళ్లు ఈ అక్రమ దందాకు అడ్డాగా మారినట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి ఏపీకి నిత్యం 8 టన్నుల దాకా నాసిరకం చికెన్ వస్తున్నట్లు సమాచారం. ఇలాంటి చికెన్‌ను ప్రధానంగా బార్లు, రెస్టారెంట్లు, రోడ్ల వెంబడి ఉండే చికెన్ పకోడి బండ్లకు, ధాబాలకు విక్రయించి, సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలాగటం ఆడుతున్నారు. వాస్తవానికి కోడిని కోసిన తర్వాత మూడు గంటలు దాటితే ఆ మాంసంలో ఎలాంటి పోషక విలువలు ఉండవు. అలాంటి చికెన్ తింటే రోగాలు తప్పవు. 24 గంటల పాటు ఫ్రిజ్‌లో నిల్వ చేసి చికెన్ తిన్నా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. -
ఆరోగ్యశాఖలో అక్రమ డిప్యుటేషన్లు !
నల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సిబ్బంది అక్రమ డిప్యుటేషన్లకు అధికారులు పెద్దపీట వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయాల్సిన ఉద్యోగులు డిప్యుటేషన్లపై పోస్టింగ్ మార్పించుకొని పట్టణాలకు పరిమితం అవుతున్నారు. కార్యాలయంలో పనిచేసే ఓ అధికారికి అడినంత ముట్టుచెప్పి డిప్యుటేషన్‌పై వచ్చి జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్నట్టు సమాచారం. ఈ కార్యాలయంలో రెగ్యులర్ సీనియర్ అసిస్టెంట్లు ఐదుగురు పనిచేస్తుండగా డిప్యుటేషన్‌పై ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లు వచ్చి పనిచేస్తున్నారంటే డిప్యుటేషన్లకు కార్యాలయంలో పెద్దపీట వేస్తున్నారనడానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా ఇంతమంది సీనియర్ అసిస్టెంట్లు పనిచేసిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. జిల్లా కార్యాలయంలో అక్కర లేకున్నా.. చందంపేట, వీటినగర్, పెద్దవూర, గుర్రంపోడు, కనగల్, దేవరకొండ, నార్కట్‌పల్లి తదితర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయాల్సిన సీనియర్ అసిస్టెంట్లు సదరు అధికారికి నగదు ముట్టచెప్పి డిప్యుటేషన్ వేయించుకుని కార్యాలయంలో కాలం వెల్లదీస్తున్నారు. అదేవిధంగా ఐదుగురు పారామెడికల్ సిబ్బంది కూడా డిప్యుటేషన్‌పై జిల్లా కార్యాలయంలో పనిచేయడం విశేషం. ఐదుగురు సీనియర్ అసిస్టెంట్లతో పనిచేయించాల్సిన అధికారులు అక్కర లేకున్నా ఇష్టానుసారంగా ఉద్యోగులను డిప్యుటేషన్‌పై జిల్లా కార్యాలయానికి తీసుకువస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్న ఉద్యోగులకు చేతినిండా పనిలేక ఖాళీగా కూర్చుంటుంటే అదనంగా డిప్యుటేషన్‌పై ఉద్యోగులను కార్యాలయానికి తీసుకురావడం ఏమిటని మిగతా ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. నీకింత.. నాకింత! కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి తనకు అనుకూలంగా ఉన్వారిని డిప్యుటేషన్‌పై నియమించుకుని ప్రతి పనికి ఓ రేటును నిర్ణయించి అక్రమ సంపాదనకు తెరలేపారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఏ చిన్న పని అయినా ఆ అధికారికి కాసులను ముట్టచెప్పాల్సిందేనని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని పూర్తి కావాలంటే ఆయన అనుచరులతో బేరం చేయించి వచ్చిన దాంట్లో నీకింత నాకింత అనే విధంగా పంపకాలు చేసుకుంటున్నారని సమాచారం. ఇంత తతంగం జరుగుతున్నా ఆ అధికారిని ప్రశ్నించే వారు లేకుండా పోయారు. రిటైర్డ్ ఉద్యోగులు, విధుల్లో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను కూడా వదలకుండా బెనిఫిట్స్‌ను ఇవ్వడానికి వారినుంచీ డబ్బులను వసూళ్లు చేస్తున్నారంటే వారి అక్రమ సంపాదన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నా పిరియడ్‌లో జరగలేదు ఇన్చార్జి బాధ్యతలను స్వీకరించిన తరువాత ఎలాంటి డిప్యుటేషన్లపై ఉద్యోగులను తీసుకురాలేదు. గత పిరియడ్‌లో జరిగింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. – డాక్టర్ వై.గంగవరప్రసాద్, డీఎంహెచ్ఓ -
‘ప్రజారోగ్య’ విభాగంలో ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకుల విభాగాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. ఈ విభాగంలో ప్రతి దానికి లంచాలు ముట్టజెప్పనిదే పనులు జరగడంలేదన్న ఆరోపణలు రావడం, ఒక ఉద్యోగిపై ఏకంగా ఏసీబీ దాడి జరగడంతో ఆ విభాగ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇటీవల ఏకంగా 16 మంది సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. వీరిలో సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరంతా వరంగల్, హైదరాబాద్ జోనల్ ఆఫీసు పరిధిలో పనిచేస్తున్నవారే. ఒకేచోట ఏళ్లుగా తిష్టవేసిన వారికి స్థానచలనం కల్పించారు. ఇటీవల ఆ విభాగానికి చెందిన ఒక సీనియర్ అసిస్టెంట్ రూ.7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. దీంతో ఒక్కసారిగా అవినీతి, అక్రమాలపై వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫైళ్లను కావాలనే తొక్కిపెట్టడం, ఆదే శాలను పట్టించుకోకపోవడం, వ్యక్తిగత రిజిస్టర్లను సరిగా నిర్వహించకపోవడాన్ని సంచాలకులు గుర్తించారు. రోజూ కార్యాలయానికి వివిధ పనులకు వచ్చేవారి నుంచి చిన్నచిన్న పనుల కోసం లంచాలు తీసుకోవడం ఆయన దృష్టికి వచ్చాయి. సంచాలకుల పరిధిలో ఏకంగా వైద్యులు, నర్సులు సిబ్బంది అంతా కలిపి 12వేలమంది ఉంటారు. వీరిలో అనేక మంది నుంచి ఫిర్యాదులు రావడంతో సంచాలకులు తీవ్రమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. అందుకే ఒకేసారి మూకుమ్మడిగా చర్యలు తీసుకుంటూ బదిలీలు చేశారు. ఇంకా ప్రక్షాళన చేయాల్సి ఉందని శ్రీనివాసరావు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ కోఠిలోనే ఉన్న వరంగల్, హైదరాబాద్ ప్రాంతీయ సంచాలకుల కార్యాలయాలను కూడా హెడ్ ఆఫీసులోనే విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. -
ఆరోగ్య ‘భారతం’..ఇదిగో మార్గదర్శనం
- భారతదేశం ‘ఆరోగ్యమస్తు’అనిపించుకోవాలంటే దేశంలో అమలవుతున్న వైద్య విధానాలు, వైద్య విద్య తీరు మారాలని, అది సేవారంగమన్న భావనను ప్రోది చేయాలని ‘ఇండిపెండెంట్ కమిషన్ ఆన్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ ఇండియా’భావిస్తోంది. ఈ మేరకు ఆరోగ్య భారతానికి కొన్ని మార్గదర్శక సూచనలు చేసింది. – సాక్షి, హైదరాబాద్ మార్కెట్ చట్రంలో చిక్కుకున్నందునే.. దేశంలో ప్రైవేటు వైద్యరంగం మార్కెట్ చట్రంలోకి వెళ్లిపోయింది.విస్తృత ప్రచారం చేసుకుంటూ లాభార్జనే ధ్యేయంగా అవి పనిచేస్తున్నాయి. ప్రైవేటు వైద్యం విస్తృతమై ప్రజారోగ్యం విఫలమైంది. దీంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు వైద్యమంటే హడలెత్తిపోతున్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలు పెద్ద ఎత్తున క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో వాటిలో చదివిన వారు తాము చెల్లించిన ఫీజుకు అనేక రెట్లు రాబట్టుకోవాలని భావిస్తున్నారు. దీనికోసం అనవసర వైద్య పరీక్షలు చేయించడం, అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలని ‘ఇండిపెండెంట్ కమిషన్ ఆన్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ ఇండియా’సిఫార్సు చేస్తూ రోడ్ మ్యాప్ టూ ఇండియాస్ హెల్త్ అనే నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఆ నివేదికను తెలంగాణ రాష్ట్రానికి పంపించింది. దీన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అధ్యయనం చేస్తున్నాయి. 25% 30% మంది ఆరోగ్య బీమా ద్వారానే ప్రైవేటుకు వెళ్తున్న రోగులు ఆరోగ్య బీమా విస్తృతి పెరిగిపోవడంతో ఇది మారింది. కేవలం వైద్య బీమాతోనే ఆసుపత్రులకు 25% రోగులు వస్తున్నారు.గత ఐదేళ్లలో గ్రూపు ఇన్సూరెన్స్ కూడా 30 శాతానికి పెరిగింది. వైద్య బీమా ప్రైవేటు ఆసుపత్రులకు లాభాల పంట పండిస్తోంది.మరోవైపు ప్రైవేటు మందుల కంపెనీలు కూడా పెద్ద ఎత్తున లాభాల బాట పట్టాయి.వాటి మధ్య పోటీ కూడా అనైతిక, అక్రమ వ్యాపారానికి దోహదపడుతోంది. బహుమతులు, ఇతరత్రా ప్రోత్సాహకాలిస్తూ వైద్యులను బుట్టలో వేసుకుంటున్నాయి. ప్రపంచ ఫార్మా రంగంలో 10% ఔషధాల ఉత్పత్తి భారత్‌లోనే అవుతున్నాయి. ఇక డయాగ్నోస్టిక్ వ్యాపారం విస్తరించింది. ఆధునిక సాంకేతికతతో ఎదుగుతోంది. నియంత్రణ కరువవ్వడం వల్లే... పైవేటు రంగంపై సరైన నియంత్రణ వ్యవస్థ లేదు. అనేక ఆసుపత్రులు అనర్హులైన, సరైన శిక్షణలేని వారిని నియమించుకుంటున్నాయి. విచ్చలవిడి మందుల వాడకం ఇతర దుష్ప్రభావాలకు దారితీస్తోంది.అనర్హులైన వారు తప్పుడు మందులు ఇస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. వివిధ సంప్రదాయ వైద్య కోర్సుల్లో అర్హత పొందినవారిలో 80 శాతం మంది అల్లోపతి వైద్యం చేస్తుండటం గమనార్హం. వైద్యులు, నర్సులు తాము చదువుకున్న తర్వాత ప్రైవే టు ఆసుపత్రుల్లో పనిచేయడం లేదా విదేశాల కు వెళ్లిపోవడాన్ని నియంత్రించాలి. ఒక్కో ఎంబీబీఎస్ వైద్యుడిపై ప్రభుత్వం రూ.30 లక్షలు, స్పెషలిస్టు తయారీకి రూ. 50 లక్షలు ఖర్చు చేస్తోంది. అంటే ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యను పూర్తి చేసేలా సర్కారు వారిపై రూ. 80 లక్షలు ఖర్చు చేస్తుంది. కాబట్టి రెండేళ్లు తప్పనిసరి వైద్య సేవలు చేయాలన్న నిబంధన ఉండాలి. వైద్య నారాయణులు ఏరీ.. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఆసుపత్రులను వైద్యులు వ్యక్తిగతంగా నడిపించేవారు. కొన్ని ఆసుపత్రులు ట్రస్టులు, పరిశోధన సంస్థల ద్వారా అవి నడిచేవి. అలా పేదలకు ఉచిత వైద్యాన్ని అందించి ‘వైద్యో నారాయణో హరిః’అనిపించుకునేవారు.ఇప్పుడు పరి స్థితి మారింది. ప్రైవేటు ఆసుపత్రులది లాభార్జనదే లక్ష్యం. అవి 20% మంది పేదలకు ఉచితంగా సేవ చేయాలన్న నిబంధనలున్నా పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు మహారాష్ట్రలో ఇలా 5వేల పడకల్లో పేదలకు ఉచిత వైద్యం అందజేయాలి.కానీ ఏ ఆసుపత్రీ అది చేయడంలేదు. ఏడాదికి ప్రతీ పడకపై రూ.20 లక్షలు వసూలు చేస్తున్నాయి.ఏటా ఆ రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులు రూ. వెయ్యి కోట్లు దండుకుంటున్నాయి. ఉచిత వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులకు ఉచిత భూమి, పన్ను రాయితీ, వైద్య పరికరాలను పన్ను రాయితీతో దిగుమతికి అవకాశం కల్పిస్తున్నారు. ఫలితం పేదలకు దక్కడం లేదు. ప్రైవేటు నియంత్రణ నుంచి బయటపడడానికి మరికొన్ని సిఫార్సులు... - క్లినికల్ స్థాపన యాక్టు (సీఈఏ)ను అమలుచేయాలి. ప్రైవేటు వైద్యరంగంపై ఆధిపత్యమున్న కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఈ చట్టం అమలుకు ముందుకు రావడంలేదు. అందుకే వాటిని నియంత్రించలేకపోతున్నాయి. - వైద్య వృత్తి అనేది దైవంతో సమానమని, మానవత్వం తప్పనిసరని వైద్య విద్యార్థులు, డాక్టర్లలో నూరిపోయాలి. వైద్యం వ్యాపారం కాదని, సేవ అని వారిలో చైతన్యం నింపాలి. - ఔషధాల ధరలను నియంత్రించాలి. ఇతరత్రా కన్సల్టెంటు చార్జీలు, ఆపరేషన్లు, ఆసుపత్రుల చార్జీలు తదితరాలను కూడా నియంత్రించాలి. - ప్రైవేటు వైద్య రంగానికి రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలను రద్దు చేయాలి.అవి కావాలంటే ప్రజారోగ్య వ్యవస్థతో కలసి పనిచేయాలని లేకుంటే రాయితీలు రావని స్పష్టం చేయాలి. - ఆరోగ్యరంగం మార్కెట్ చట్రం నుంచి బయటపడాలి. ప్రజారోగ్య వ్యవస్థగా అది మారాలి. అప్పుడే దేశంలో ఆరోగ్య వ్యవస్థ బాగుపడుతుంది. -
రాష్ట్రానికి జ్వరం కాటు
-
రాష్ట్రానికి జ్వరం కాటు
- పంజా విసురుతున్న డెంగీ, టైఫాయిడ్, చికెన్ గున్యా,మలేరియా, డయేరియా - ఆస్పత్రుల్లో వేలాది మంది బాధితులు - ఏజెన్సీల్లో జ్వరాల కాటుకు పిట్టల్లా రాలుతున్న గిరిజనులు - 4.3 లక్షలకు చేరిన డయేరియా బాధితుల సంఖ్య - 8 నెలల్లో 51,256 డెంగీ కేసులు నమోదు... - 1,206 మాత్రమే అంటున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. విష జ్వరాలు, కలుషిత నీటి జబ్బులు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యా వంటి ప్రమాదకరమైన జ్వరాలతో ఊళ్లకు ఊళ్లే మంచం పట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా వైరల్ జ్వరాల బారినపడ్డ వేలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీతో ఎంతమంది మరణించారనే గణాంకాలు ప్రభుత్వం వద్ద లేకపోవడం గమనార్హం. ప్రభుత్వాసుపత్రుల్లో డెంగీ జ్వరాలకు వైద్యం లభించకపోవడంతో బాధితులు మరో గత్యంతరం లేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి, అప్పుల పాలవ్వాల్సి వస్తోంది. జ్వరాల కాటుకు పదుల సంఖ్యలో జనం బలైపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అధికార యంత్రాంగాన్ని తక్షణమే రంగంలోకి దింపి, బాధితులకు సాంత్వన కలిగించాల్సింది పోయి మీనమేషాలు లెక్కిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీలు, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అంతటా విష జ్వరాలు పంజా విసురుతున్నా ముందస్తు చర్యలు చేపట్టడంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైంది. రాష్ట్రంలో మలేరియా, డెంగీపై ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించి చేతులు దులుపుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు జ్వరాల బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నా పాలకుల్లో చలనం కనిపించడం లేదు. రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్న జ్వరాల కేసులు కొన్నేనని, బయటకు రానివి ఇంకా ఎన్నో రెట్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. డయేరియా కేసులు ఆల్‌టైం రికార్డు డయేరియా (వాంతులు, విరేచనాలు) బాధితుల సంఖ్య ప్రస్తుతం ఆల్‌టైం రికార్డు అని వైద్యులు చెబుతున్నారు. అక్యూట్ డయేరియా డిసీజ్ (ఏడీడీ)గా చెప్పుకునే ఈ వ్యాధి బారినపడ్డ వారి సంఖ్య ఇప్పటికే 4.30 లక్షలకు చేరింది. గ్రామాల్లో సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేక కలుషిత నీటిని సేవిస్తున్న జనం డయేరియా బారినపడుతున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాల్లో 99,463 మంది డయేరియా కాటుకు గురయ్యారు. అనంతపురం జిల్లాలో 94,660 మంది డయేరియా బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వణికిస్తున్న టైఫాయిడ్, డెంగీ రాష్ట్రంలో టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఈ జ్వరాలతో మంచాన పడిన వారి సంఖ్య లక్ష దాటి ఉండొచ్చని అంచనా. 25 వేల మందికిపైగానే టైఫాయిడ్ సోకినట్టు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. 15,300కుపైగా మలేరియా కేసులు నమోదైనట్లు తేలింది. ఇక డెంగీపై ప్రభుత్వానికే స్పష్టత లేదు. ప్రభుత్వాసుపత్రుల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న మెడాల్ సంస్థ గత36 వారాల్లో 51 వేలకు పైగా డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. కానీ, 1,206 డెంగీ కేసులే నమోదైనట్లు ప్రభుత్వం చెబుతోంది. డెంగీ వల్ల రాష్ట్రంలో ఒక్కరు కూడా మరణించలేదని పేర్కొంటోంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో డెంగీ బాధితులే అధికంగా కనిపిస్తున్నారు. విశాఖ, తూర్పు గోదావరి, అనంతపురం, చిత్తూరు జిల్లాలో డెంగీ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. మొబైల్ యూనిట్లతో వైద్య సాయం ‘‘రాష్ట్రవ్యాప్తంగా మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, టైఫాయిడ్ బాధితులకు సత్వరం వైద్యసాయం అందించేందుకు లక్ష జనాభాకు ఒక మొబైల్ మెడికల్ యూనిట్ ఏర్పాటు చేశాం. ఈ యూనిట్ ప్రతి గ్రామానికీ వెళ్లి ఇంటింటి సర్వే చేసి, బాధితులను గుర్తిస్తుంది. వైద్య సాయం అందిస్తుం ది. ఇందులో కమ్యూనిటీ మెడికల్ ఆర్గనైజర్, నర్సు, ఫార్మసిస్ట్ తదితర ఐదుగురు సభ్యులు ఉంటారు. ఇప్పటికే జ్వరాల తీవ్రత ఉన్న ప్రాంతాల్లో దోమ తెరలు పంపిణీ చేశాం. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాం’’ - డా.గీతాప్రసాదిని, ఏడీ, ప్రజారోగ్య శాఖ