ఆరోగ్యశాఖలో అక్రమ డిప్యుటేషన్లు ! | Illegal Deputations in Health Department | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశాఖలో అక్రమ డిప్యుటేషన్లు !

Published Wed, Mar 6 2019 10:38 AM | Last Updated on Wed, Mar 6 2019 10:40 AM

Illegal Deputations in Health Department - Sakshi

నల్లగొండ టౌన్‌ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సిబ్బంది అక్రమ డిప్యుటేషన్లకు అధికారులు పెద్దపీట వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయాల్సిన ఉద్యోగులు డిప్యుటేషన్లపై పోస్టింగ్‌ మార్పించుకొని పట్టణాలకు పరిమితం అవుతున్నారు. కార్యాలయంలో పనిచేసే ఓ అధికారికి అడినంత ముట్టుచెప్పి డిప్యుటేషన్‌పై వచ్చి జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్నట్టు సమాచారం. ఈ కార్యాలయంలో రెగ్యులర్‌ సీనియర్‌ అసిస్టెంట్లు ఐదుగురు పనిచేస్తుండగా డిప్యుటేషన్‌పై ఏడుగురు సీనియర్‌ అసిస్టెంట్‌లు వచ్చి పనిచేస్తున్నారంటే డిప్యుటేషన్‌లకు కార్యాలయంలో పెద్దపీట వేస్తున్నారనడానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా ఇంతమంది సీనియర్‌ అసిస్టెంట్‌లు పనిచేసిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. 

జిల్లా కార్యాలయంలో అక్కర లేకున్నా..
చందంపేట, వీటినగర్, పెద్దవూర, గుర్రంపోడు, కనగల్, దేవరకొండ, నార్కట్‌పల్లి తదితర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయాల్సిన సీనియర్‌ అసిస్టెంట్లు సదరు అధికారికి నగదు ముట్టచెప్పి డిప్యుటేషన్‌ వేయించుకుని కార్యాలయంలో కాలం వెల్లదీస్తున్నారు. అదేవిధంగా ఐదుగురు పారామెడికల్‌ సిబ్బంది కూడా డిప్యుటేషన్‌పై జిల్లా కార్యాలయంలో పనిచేయడం విశేషం. ఐదుగురు సీనియర్‌ అసిస్టెంట్‌లతో పనిచేయించాల్సిన అధికారులు అక్కర లేకున్నా ఇష్టానుసారంగా ఉద్యోగులను డిప్యుటేషన్‌పై జిల్లా కార్యాలయానికి తీసుకువస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్న ఉద్యోగులకు చేతినిండా పనిలేక  ఖాళీగా కూర్చుంటుంటే అదనంగా డిప్యుటేషన్‌పై ఉద్యోగులను కార్యాలయానికి తీసుకురావడం ఏమిటని మిగతా ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 

నీకింత.. నాకింత!
కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి తనకు అనుకూలంగా ఉన్వారిని డిప్యుటేషన్‌పై నియమించుకుని ప్రతి పనికి ఓ రేటును నిర్ణయించి అక్రమ సంపాదనకు తెరలేపారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఏ చిన్న పని అయినా ఆ అధికారికి కాసులను ముట్టచెప్పాల్సిందేనని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని పూర్తి కావాలంటే ఆయన అనుచరులతో బేరం చేయించి వచ్చిన దాంట్లో నీకింత నాకింత అనే విధంగా పంపకాలు చేసుకుంటున్నారని సమాచారం. ఇంత తతంగం జరుగుతున్నా ఆ అధికారిని ప్రశ్నించే వారు లేకుండా పోయారు. రిటైర్డ్‌ ఉద్యోగులు, విధుల్లో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను కూడా వదలకుండా బెనిఫిట్స్‌ను ఇవ్వడానికి వారినుంచీ డబ్బులను వసూళ్లు చేస్తున్నారంటే వారి అక్రమ సంపాదన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నా పిరియడ్‌లో జరగలేదు 
ఇన్‌చార్జి బాధ్యతలను స్వీకరించిన తరువాత ఎలాంటి డిప్యుటేషన్‌లపై ఉద్యోగులను తీసుకురాలేదు. గత పిరియడ్‌లో జరిగింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. 
                                                                                                                                                                                                                        – డాక్టర్‌ వై.గంగవరప్రసాద్, డీఎంహెచ్‌ఓ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement