
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఈనెల 20 వరకు జాతర జరగనుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ఆదివారం అర్ధరాత్రి గంపల ప్రదక్షిణలతో ప్రారంభం కానుంది. ఈ జాతరకు సుమారు 20లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జాతరకు తెలంగాణ, ఏపీ, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ నుంచి యాదవ భక్తులు పెద్ద ఎత్తున రానున్నారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలో లింగమంతుల స్వామి జాతర నేటి నుంచి ఈనెల 20వరకు జరగనుంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో పెద్ద జాతర ఇది. జాతర కోసం అన్ని శాఖల సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. భక్తులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చారు. ఈ జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు వచ్చే భక్తులకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు. సూర్యాపేట నుంచి 60 కోదాడ నుంచి 15 బస్సులు జాతరకు ప్రయాణికులను తరలించనున్నాయి. జాతర కోసం సుమారు 2000 మందితో పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు.
జాతర విశేషాలు...
మొదటి రోజు: జాతర ప్రారంభం సందర్భంగా ఆదివారం రాత్రి సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి దేవరపెట్టె(అందనపు సౌడమ్మ)ను గట్టుపైకి చేర్చుతారు. అనంతరం అక్కడకు చేరుకున్న భక్తుల పూజా సామగ్రితో ఉన్న గంపల ప్రదక్షిణ చేపడుతారు.
రెండో రోజు: సోమవారం తెల్లవారుజామున స్వామి వారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. సౌడమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు.
మూడో రోజు: గట్టుపైన ఆలయ ప్రాంగణంలో మంగళవారం చంద్రపట్నం వేస్తారు. లింగమంతుల స్వామి(శివుడు) మాణిక్యమ్మ(పార్వతి) కల్యాణ మహోత్సవం జరిపిస్తారు.
నాలుగో రోజు: ఆలయం వద్ద సంప్రదాయబద్ధంగా బుధవారం నెలవారం నిర్వహిస్తారు. దేవరపెట్టెను తిరిగి కేసారం గ్రామానికి తరలిస్తారు.
ఐదో రోజు: జాతర చివరి రోజు దేవతల విగ్రహాల వద్ద ప్రత్యేక పూజల అనంతరం జాతర ముగుస్తుంది.

ట్రాఫిక్ ఆంక్షలు..
పెద్దగట్టు జాతర సందర్భంగా విజయవాడ-హైదరాబాద్ 65వ జాతీయ రహదారి వాహనాలు మళ్లించనున్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద నల్లగొండ మీదుగా మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ వైపు మళ్లించనున్నారు.
విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను కోదాడ వద్ద హుజూర్‌నగర్, నల్లగొండ మీదుగా మళ్లించనున్నారు.
హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళే వాహనాలను జాతీయ రహదారి 365 బీబీగూడెం మీదగా మళ్లించారు.
సూర్యాపేట-కోదాడ వెళ్ళే వాహనాలను కోదాడ, మునగాల, గుంపుల నుంచి ఎస్సార్‌ఎస్పీ కెనాల్ మీదుగా బీబీగూడెం, సూర్యాపేటకు డైవర్ట్ చేశారు.
సూర్యాపేట నుంచి కోదాడ వెళ్ళే ఆర్టీసీ బస్సులు కుడకుడ, ఐలాపురం, రాఘవపురం, నామవరం నుంచి కోదాడకు మళ్లింపు.
Comments
Please login to add a commentAdd a comment