peddagattu jathara
-
కనులపండువగా లింగమంతుల స్వామి కల్యాణం
సూర్యాపేట: దురాజ్‌పల్లి శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు మంగళవారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. మూడవ రోజు మంగళవారం యాదవ పూజారులు చంద్రపట్నం వేసి భక్తిశ్రద్ధలతో శ్రీ లింగమంతుల స్వామి, మాణిక్యమ్మల కల్యాణం జరిపించారు. చంద్రపట్నంపై లింగమంతుల స్వామి వారు ఉన్న పెట్టెను ఉంచి పూజలు చేశారు. చంద్రపట్నం ముందు మెంతబోయిన, మున్న, బైకాను వంశస్తులు బియ్యంతో పోలు పోసి తమలపాకులు, పోకలు, ఖర్జూరాలు ఉంచి స్వామివారి కథలతో కల్యాణ తంతు నిర్వహించారు. జాతరలో నాలుగో రోజు బుధవారం నెలవారం కార్యక్రమం నిర్వహించనున్నారు. -
లింగమంతుల జాతరకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, నల్గొండ: హైదరాబాద్– విజయవాడ హైవే(NH 65)పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా పోలీసులు ప్రకటించారు. సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి లింగమతుల స్వామి(పెద్దగట్టు) జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభమం కానుంది. ఫిబ్రవరి 9వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆదివారం నుంచి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట వద్ద ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 5న తెల్లవారుజాము నుంచి 9వ తేదీ సాయంత్రం వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు గమనించాలన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనదారులు..టేకుమట్ల నుంచి ఖమ్మం బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. ఈ వాహనాలన్నీ నామాపురం వద్ద జాతీయ రహదారి 65పై కలుస్తాయని పేర్కొన్నారు. భారీ, సరకు రవాణా వాహనాలు మాత్రం టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారి మీదుగా నాయకన్‌గూడెం నుంచి కోదాడకు వెళ్లేలా పోలీసులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనదారులను స్వామినారాయణ గురుకుల పాఠశాల ఎదురుగా ఉన్న ఎస్సారెస్పీ కాల్వకట్ట మీదుగా 365బీబీ ఖమ్మం జాతీయరహదారిపైకి రోళ్లబావి తండా మీదుగా మళ్లించనున్నారు. ఇక్కడి నుంచి వాహనాలు రాయినిగూడెం వద్దకు చేరుకొని హైదరాబాద్ వైపునకు వెళ్తాయి. హెవీ ట్రాన్స్‌పోర్టు వెహికల్స్‌ను మాత్రం కోదాడ, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారి 65పైకి చేరుకోవాలి. చదవండి: అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన -
ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు పెద్దగట్టు జాతర
చివ్వెంల (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర తేదీలు ఖరారయ్యాయి. సోమవారం ఆలయం వద్ద శ్రీ లింగమంతుల స్వామి ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశాక.. వీరి సమక్షంలో యాదవ పూజారులు జాతర తేదీలను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జాతర నిర్వహించనున్నట్లు చెప్పారు. వీటికి సంబంధించిన కరపత్రాలను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ జాతర రెండేళ్లకోసారి ఐదు రోజులపాటు జరుగుతుంది. ఫిబ్రవరి 5న గంపల ప్రదక్షిణ, 6న బోనాల సమర్పణ, 7న చంద్రపట్నం, 8న నెలవారం, దేవరపెట్టె కేసారం తరలింపు, 9న మకరతోరణం ఊరేగింపుతో జాతర ముగుస్తుందని చెప్పారు. జనవరి 22న దిష్టిపూజ నిర్వహించనున్నారు. జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని యాదవ పెద్దలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌చైర్మన్ పుట్ట కిశోర్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. -
28 నుంచి లింగమంతుల జాతర
సాక్షి, సూర్యాపేట: పెద్దగట్టు జాతరకు వేళయింది. యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతర ఈ నెల 28వ తేదీ రాత్రి ప్రారంభమై వచ్చే నెల 4వ తేదీన ముగియనుంది. జాతరకు ప్రధాన ఆలయం రంగులతో ముస్తాబైంది. ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, గట్టు కింద భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులు పూర్తయ్యాయి. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పక్కనే దురాజ్‌పల్లి వద్ద పెద్దగట్టుపై లింగమంతుల స్వామి ఆలయం ఉంది. భారీ ‘జన’జాతర.. సమ్మక్క, సారలమ్మల జాతర తర్వాత అతిపెద్దది.. లింగమంతుల స్వామి జాతర. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తారు. పెద్దగట్టు జాతర (ఫైల్) గంపల ప్రదక్షిణతో జాతర షురూ.. లింగమంతుల స్వామి జాతర తొలి ఘట్టం గంపల ప్రదక్షిణతో ప్రారంభం కానుంది. సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవరపెట్టెను తీసుకొని యాదవ కులస్తులు కాలినడకన బయలుదేరి దురాజ్‌పల్లిలో ఉన్న పెద్దగట్టుకు ఆదివారం రాత్రి చేరుకుంటారు. గంపలతో ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. మెంతబోయిన, గొర్ల, మున్న వంశస్తుల సమక్షంలో రెండు బోనాలు వండి పూజలు నిర్వహిస్తారు. రెండో రోజు బోనాలు, మూడో రోజు చంద్రపట్నం, నాలుగో రోజు నెలవారం, ఆతర్వాత ఐదోరోజు మకర తోరణం ఊరేగింపుతో జాతర ముగుస్తుంది. రూ.3.7 కోట్లతో అభివృద్ధి పనులు.. కాగా, జాతరలో ఏర్పాట్ల కోసం రూ.3.7 కోట్లను ఖర్చు చేశారు. జాతరకు ప్రభుత్వం ఈసారి ప్రత్యేకంగా రూ. 2 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పాటు సూర్యాపేట మున్సిపాలిటీ, ఇతర శాఖలు రూ.1.7 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశాయి. కోవిడ్ నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణకు మున్సిపల్ యంత్రాంగం 600 మంది సిబ్బందిని కేటాయించింది. జాతర ప్రాంతంలో ఏడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 200 మంది సిబ్బంది మూడు షిప్టుల్లో విధులు నిర్వహించనున్నారు. నల్లగొండ, కోదాడ మీదుగా విజయవాడకు.. ఈసారి జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో జాతీయ రహదారి 65పై ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. సూర్యాపేట మీదుగా హైదరాబాద్, విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి మీదుగా మళ్లించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్.. కోదాడ మీదుగా వెళ్లాలి. అలాగే విజయవాడ నుంచి వచ్చే వాహనాలు కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా నార్కట్‌పల్లి జాతీయ రహదారి 65కు చేరుకోవాలని ఎస్పీ ఆర్.భాస్కరన్ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. జాతరకోసం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 40 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ డిపోల నుంచి 70 బస్సులను జాతరకు ప్రత్యేకంగా నడపనున్నారు. -
పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తులు
సూర్యాపేట: పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. సోమవారం వేకువజామునుంచే వేలాది మంది భక్తులు తరలివచ్చి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువైంది. ఎక్కడివాహనాలు అక్కడ ఆగిపోయాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్ళించారు. నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడల మీదుగా వాహనాలను మళ్ళించారు. -
గట్టు జాతరకు సర్వం సిద్ధం
నేటి నుంచి ఐదు రోజుల పాటు జాతర ఆదివారం అర్ధరాత్రి గంపల ప్రదక్షిణతో ప్రారంభంకానున్న ఉత్సవాలు 30లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం రెండేళ్లకోమారు నిర్వహించే చివ్వెంల మండలం దురాజ్ పల్లి లింగమంతులస్వామి (గొల్లగట్టు) జాతరకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఆదివారం అర్ధరాత్రి గంపల ప్రదక్షి ణతో జాతర ప్రారంభంకానుంది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల కోసం దేవాదాయశాఖ, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.సూర్యాపేట/చివ్వెంల యాదవుల ఆరాధ్యదైవం దురాజ్‌పల్లిలోని లింమంతులస్వామి జాతరను ఘనంగా నిర్వహించనున్నారు. యాదవుల సంప్రదాయం ప్రకారం గుట్టపైన ఆదివారం అర్ధరాత్రి 12గంటలు దాటిన తర్వాత పూజలు నిర్వహిస్తారు. కేసారం నుంచి మెంతబోయిన పెద్దసౌడయ్య ఇంట్లో ఉన్న లింగమంతులస్వామి, సౌడమ్మతల్లి (దేవర విగ్రహాలు)ని వీరనాలు, కటార్లు, గజ్జెల లాగుల నృత్యాలతో గుట్టపైకి తీసుకొస్తారు. చంద్రపట్నం వేసి విగ్రహాలను గుట్టపైన ఉన్న రెండు గుళ్లల్లో ప్రతిష్టిస్తారు. చంద్రపట్నం.. దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత చౌడమ్మ గుడి ఎదుట చంద్రపట్నం వేస్తారు. దానికోసం పచ్చపిండి, తెల్లపిండి, పసుపు, కుంకుమ వినియోగిస్తారు. నూలు దారంతో కంకణాలు చేసి పూజారులైన మెంతబోయిన వంశస్తులు పూజలు నిర్వహిస్తారు. కంకణాలను రాజుస్థానంలో ఉండే గోళ్లవారి కుటుంబాలకు కట్టిన తర్వాత మూడు బోనాలు వండి సమర్పిస్తారు. అనంతరం గొర్రెలను బలిస్తారు. దీనినే పూజకట్టడం అంటారు. అప్పటితో జాతర ప్రారంభమైనట్లుగా పూజారులు ప్రకటిస్తారు. వాహనాల దారి మళ్లింపు.. శనివారం అర్ధరాత్రి నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలను సూర్యాపేట మీదుగా అనుమతించరు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై దురాజ్‌పల్లి జాతర జరుగనుండటంతో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వాహనాలు దారి మళ్లించనున్నారు. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సులను కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా నార్కెట్‌పల్లి వరకు దారి మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి వైపు నుంచి దారి మళ్లించనున్నారు. పాఠశాలలకు సెలవులు.. జాతర సందర్భంగా సోమ, మంగళవారాలు సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల పరిధిలో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలతో పాటు కళాశాలలకు కూడా స్థానిక సెలవులు ప్రకటించారు. విద్యార్థులు పెద్ద ఎత్తున జాతరకు తరలివచ్చే అవకాశం ఉంది. సౌకర్యాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధవహించాలి దురాజ్‌పల్లి(చివ్వెంల) : జాతరలో భక్తుల కోసం సౌకర్యాల కల్పనపై వివిధ శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధవహించాలని కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం మండల పరిధిలోని దురాజ్‌పల్లి శ్రీలింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతరలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే రెండవ అతి పెద్ద జాతర కావడంతో ఇతర రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర లనుంచి 30 లక్షల మంది హాజరుకానున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి 5రోజు పాటు జాతర జరగనున్నట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్ ఏర్పాటు చేశామన్నారు. స్వామి వారి దర్శనం సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 25 ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. జాతర పరిసర ప్రదేశాల్లో ఉన్న నీటి తొట్టీలకు 5 బోరు మోటార్ల ద్వారా 24 గంటలూ తాగునీరు సరఫరా చేస్తామన్నారు. స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రభావం లేకుండా భక్తులకు మాస్క్‌లు సరఫరా చేస్తామన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ టి.ప్రభాకర్ రావు మాట్లాడుతూ జాతరలో ఎటువ ంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ ప్రభాకర్, ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, డీఎల్పీఓ సురేష్ మోహన్, తహసీల్దార్ జి.గణేష్, ఎంపీడీఓ ఎం.సాంబశివరావు పాల్గొన్నారు. పూజగంప.. సూర్యాపేట మండలం కేసారం గ్రామానికి చెందిన పెద్దగొళ్ల మెంతబోయిన పెద్దసౌడయ్య, మెంతబోయిన భిక్షం, గోళ్ల గన్నారెడ్డి, చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరికి చెందిన మున్న వంశస్తులు పూజగంపలతో గుట్టపైకి చేరుకుంటారు. వెదురు, ఈత పుల్లలతో తయారు చేసిన కొత్తగంపను పూజగంపగా అలంకరిస్తారు. పసుపు, కుంకుమతో గంపను ప్రత్యేకంగా అలంకరిస్తారు. బోనానికి అవసరమైన శేరుంబావు బియ్యం, బెల్లం తోపాటు దేవతా విగ్రహాల పూజకోసం పసుపు, కుంకుమ, ఆవుపాలు, నెయ్యి, పూలు, పండ్లు, తెల్లపిండి, పచ్చపిండి, దారం తదితర సామగ్రిని గంపలో తీసుకొస్తారు. మొదటిరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. వారివెంట మూడు గొర్రెలను తోలుకువస్తారు. అనంతరం మిగిలిన గ్రామాల ప్రజలంతా గంపలు సమర్పిస్తారు. దీంతో జాతర ప్రారంభమవుతుంది. జాతరలో గంపల ప్రదక్షిణకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కోరిన కోర్కెలు నెరవేరితే వచ్చే జాతరకు గంపకడతామని భక్తులు మొక్కుకుంటారు. దేవరపెట్టె.. దేవరపెట్టెను వరంగల్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం నుంచి దిష్టిపూజ ముందురోజే సూర్యాపేట మండలం కేసారం గ్రామానికి తీసుకొస్తారు. దిష్టిపూజ రోజు గుట్టపైకి దేవరపెట్టెను తీసుకొచ్చి దిష్టిపూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం సుమారు 51రకాల దేవతా విగ్రహాలున్న దేవరపెట్టెను కేసారం తీసుకెళ్తారు. జాతర ప్రారంభమయ్యే ముందు పూజగంపతో దేవరపెట్టెను గుట్టపైకి తీసుకొస్తారు. స్వైన్‌ఫ్లూపై ఆందోళన వద్దు చివ్వెంల: స్వైన్‌ఫ్లూ వ్యాధిపై భక్తులు జాతరలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యాధికారి ఆమోస్ తెలిపారు. శనివారం జాతరలో ఏర్పాటు చేసిన ప్రాథమిక వైద్య కేంద్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో భక్తులకు ప్రథమ చికిత్స చేసేందుకు గాను 17 మంది వైద్యులను, 120 మంది పారా మెడికల్ సిబ్బందిని నియమించామన్నారు. అదేవిధంగా మాస్క్‌లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట సూర్యాపేట ఎస్పీహెచ్ఓ తండు మురళీ మోహన్, మండల వైద్యాధికారి శ్రీనివాస్ రాజు తదితరులు ఉన్నారు. జాతరకు మకరతోరణం దురాజ్‌పల్లి(చివ్వెంల) : సూర్యాపేటకు చెందిన యాదవ భక్తులు జాతరకు శనివారం మకరతోరణం తీసుకు వచ్చారు. జాతరకు ముందు రోజు సూర్యాపేట తీసుకు వచ్చిన తోరణాన్ని స్వామివారికి అలంకరించి తమ మొక్కు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ అధ్యక్షుడు పోలేబోయిన నర్సయ్య యాదవ్, కోడి సైదులు యాదవ్, యలయ్య, లక్ష్మయ్య, రఘు తదితరులు పాల్గొన్నారు. పటిష్టమైన బందోబస్తు గట్టు జాతరకు పటిష్టమైన పో లీస్ బందోబస్తు ఏర్పాటు చే శాం. ఈ బందోబస్తుకు ఒక ఏఎస్పీ, ఐదుగురు డీఎస్పీ లు, 25 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు, 140 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు హ్యాండ్ మెటల్ డిటెక్టర్స్ , ఫ్రేమ్మెటల్ డిటెక్టర్స్‌తో కలిపి వెయ్యిమంది సిబ్బందిని నియమించాం. జాతరలో అనుమానాస్పద వ్యక్తులు కన్పి స్తే భక్తులు వెంటనే గుట్ట సమీపంలోని మర్రిచెట్టు వద్ద గల పోలీసు కంట్రోల్ రూంకు సమాచారమందిం చాలి. రోడ్డు వెంట ప్రతి వందమీటర్ల దూరంలో వాహనాలు దిగేందుకు ర్యాంపులు ఏర్పాటు చేసి సూచిక బోర్డులు పెట్టాం. వాహనాలు అక్కడి నుంచి మాత్రమే కిందికి దిగాలి. ఆలయ ప్రాంగణంలో జంతుబలి, మద్యం అమ్మకాలను నిషేధించాం. ఆలయ ప్రాంగణం వద్దకు వాహనాల రాకపోకలు నిషేధం. జాతర ప్రాంగణంలో నేరస్తులను గుర్తిం చేందుకు క్రైంపార్టీలను రప్పించాం. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే మాకు ఫిర్యాదు చేయాలి. మహిళలు వెంట తెచ్చుకున్న వస్తువులు, బంగారు ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే గట్టుపైన సీసీ కెమెరాలను ఏర్పాటుచేశాం. - మహ్మద్ అబ్దుల్ రషీద్ , డీఎస్పీ