
మాణిక్యమ్మ, ఆకుమచ్చమ్మ, శ్రీ లింగమంతులస్వామి ఉత్సవమూర్తులు
సాక్షి, సూర్యాపేట: పెద్దగట్టు జాతరకు వేళయింది. యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతర ఈ నెల 28వ తేదీ రాత్రి ప్రారంభమై వచ్చే నెల 4వ తేదీన ముగియనుంది. జాతరకు ప్రధాన ఆలయం రంగులతో ముస్తాబైంది. ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, గట్టు కింద భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులు పూర్తయ్యాయి. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పక్కనే దురాజ్‌పల్లి వద్ద పెద్దగట్టుపై లింగమంతుల స్వామి ఆలయం ఉంది.
భారీ ‘జన’జాతర..
సమ్మక్క, సారలమ్మల జాతర తర్వాత అతిపెద్దది.. లింగమంతుల స్వామి జాతర. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తారు.
పెద్దగట్టు జాతర (ఫైల్)
గంపల ప్రదక్షిణతో జాతర షురూ..
లింగమంతుల స్వామి జాతర తొలి ఘట్టం గంపల ప్రదక్షిణతో ప్రారంభం కానుంది. సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవరపెట్టెను తీసుకొని యాదవ కులస్తులు కాలినడకన బయలుదేరి దురాజ్‌పల్లిలో ఉన్న పెద్దగట్టుకు ఆదివారం రాత్రి చేరుకుంటారు. గంపలతో ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. మెంతబోయిన, గొర్ల, మున్న వంశస్తుల సమక్షంలో రెండు బోనాలు వండి పూజలు నిర్వహిస్తారు. రెండో రోజు బోనాలు, మూడో రోజు చంద్రపట్నం, నాలుగో రోజు నెలవారం, ఆతర్వాత ఐదోరోజు మకర తోరణం ఊరేగింపుతో జాతర ముగుస్తుంది.
రూ.3.7 కోట్లతో అభివృద్ధి పనులు..
కాగా, జాతరలో ఏర్పాట్ల కోసం రూ.3.7 కోట్లను ఖర్చు చేశారు. జాతరకు ప్రభుత్వం ఈసారి ప్రత్యేకంగా రూ. 2 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పాటు సూర్యాపేట మున్సిపాలిటీ, ఇతర శాఖలు రూ.1.7 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశాయి. కోవిడ్ నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణకు మున్సిపల్ యంత్రాంగం 600 మంది సిబ్బందిని కేటాయించింది. జాతర ప్రాంతంలో ఏడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 200 మంది సిబ్బంది మూడు షిప్టుల్లో విధులు నిర్వహించనున్నారు.
నల్లగొండ, కోదాడ మీదుగా విజయవాడకు..
ఈసారి జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో జాతీయ రహదారి 65పై ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. సూర్యాపేట మీదుగా హైదరాబాద్, విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి మీదుగా మళ్లించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్.. కోదాడ మీదుగా వెళ్లాలి.
అలాగే విజయవాడ నుంచి వచ్చే వాహనాలు కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా నార్కట్‌పల్లి జాతీయ రహదారి 65కు చేరుకోవాలని ఎస్పీ ఆర్.భాస్కరన్ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. జాతరకోసం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 40 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ డిపోల నుంచి 70 బస్సులను జాతరకు ప్రత్యేకంగా నడపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment