
పెద్దగట్టు జాతర కరపత్రాలు ఆవిష్కరిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి
చివ్వెంల (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర తేదీలు ఖరారయ్యాయి. సోమవారం ఆలయం వద్ద శ్రీ లింగమంతుల స్వామి ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశాక.. వీరి సమక్షంలో యాదవ పూజారులు జాతర తేదీలను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జాతర నిర్వహించనున్నట్లు చెప్పారు.
వీటికి సంబంధించిన కరపత్రాలను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ జాతర రెండేళ్లకోసారి ఐదు రోజులపాటు జరుగుతుంది. ఫిబ్రవరి 5న గంపల ప్రదక్షిణ, 6న బోనాల సమర్పణ, 7న చంద్రపట్నం, 8న నెలవారం, దేవరపెట్టె కేసారం తరలింపు, 9న మకరతోరణం ఊరేగింపుతో జాతర ముగుస్తుందని చెప్పారు.
జనవరి 22న దిష్టిపూజ నిర్వహించనున్నారు. జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని యాదవ పెద్దలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌చైర్మన్ పుట్ట కిశోర్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.