lingamanthula swamy
-
మకర తోరణం తరలింపుతో ముగిసిన పెద్దగట్టు జాతర
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలో కొలువైన శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ముగిసింది. గురువారం రాత్రి మకర తోరణాన్ని సూర్యాపేటలోని గొల్ల బజారుకు చెందిన వల్లపు, కోడి వంశస్తులు తీసుకువెళ్లడంతో జాతర ముగిసినట్లు పూజారులు ప్రకటించారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. చివరి రోజు కూడా భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు చేపట్టారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన 28 హుండీల ద్వారా రూ. 25.71 లక్షల ఆదాయం వచ్చింది. అదే విధంగా 550 గ్రాముల వెండి, రెండు గ్రాముల బంగారం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
కనులపండువగా లింగమంతుల స్వామి కల్యాణం
సూర్యాపేట: దురాజ్‌పల్లి శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు మంగళవారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. మూడవ రోజు మంగళవారం యాదవ పూజారులు చంద్రపట్నం వేసి భక్తిశ్రద్ధలతో శ్రీ లింగమంతుల స్వామి, మాణిక్యమ్మల కల్యాణం జరిపించారు. చంద్రపట్నంపై లింగమంతుల స్వామి వారు ఉన్న పెట్టెను ఉంచి పూజలు చేశారు. చంద్రపట్నం ముందు మెంతబోయిన, మున్న, బైకాను వంశస్తులు బియ్యంతో పోలు పోసి తమలపాకులు, పోకలు, ఖర్జూరాలు ఉంచి స్వామివారి కథలతో కల్యాణ తంతు నిర్వహించారు. జాతరలో నాలుగో రోజు బుధవారం నెలవారం కార్యక్రమం నిర్వహించనున్నారు. -
నల్గొండ జిల్లా : తెలంగాణలో రెండవ అతిపెద్ద లింగమంతుల స్వామి జాతర (ఫొటోలు)
-
ఓ..లింగా.. ఓ...లింగా..
సూర్యాపేట: తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరైన శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి ఆలయ ప్రాంతం ‘ఓ..లింగా.. ఓ...లింగా’ నామస్మరణతో మార్మోగింది. ఆదివారం అర్ధరాత్రి మంద గంపల ప్రదక్షిణలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు ట్రాక్టర్లు, ఆటోలు, డీసీఎంలలో వచ్చారు. అర్ధరాత్రి యాదవులు సంప్రదాయ దుస్తుల్లో డోలు వాయిద్యాలు, భేరీ చప్పుళ్లు, కటారు విన్యాసాలు చేస్తూ గట్టుపైకి వచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సూర్యాపేట మండలం కేసారంలో లింగమంతుల స్వామి అమ్మవార్లకు విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదివారం రాత్రి పట్టువస్త్రాలు సమర్పించారు. జాతరలో మొదటిరోజు సూర్యాపేట రూరల్ కేసారం గ్రామంనుంచి దేవరపెట్టెను యాదవ కులస్తులు కాలినడకన పెద్దగట్టుకు చేర్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దేవర పెట్టె గొల్లగట్టుకు చేరుకుంది. రెండోరోజు సోమవారం చౌడమ్మతల్లికి బోనాలు సమర్పించనున్నారు. జాతరకు సోమవారం రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వచ్చి ప్రత్యేక పూజలు చేయనున్నారు. -
ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు పెద్దగట్టు జాతర
చివ్వెంల (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర తేదీలు ఖరారయ్యాయి. సోమవారం ఆలయం వద్ద శ్రీ లింగమంతుల స్వామి ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశాక.. వీరి సమక్షంలో యాదవ పూజారులు జాతర తేదీలను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జాతర నిర్వహించనున్నట్లు చెప్పారు. వీటికి సంబంధించిన కరపత్రాలను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ జాతర రెండేళ్లకోసారి ఐదు రోజులపాటు జరుగుతుంది. ఫిబ్రవరి 5న గంపల ప్రదక్షిణ, 6న బోనాల సమర్పణ, 7న చంద్రపట్నం, 8న నెలవారం, దేవరపెట్టె కేసారం తరలింపు, 9న మకరతోరణం ఊరేగింపుతో జాతర ముగుస్తుందని చెప్పారు. జనవరి 22న దిష్టిపూజ నిర్వహించనున్నారు. జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని యాదవ పెద్దలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌చైర్మన్ పుట్ట కిశోర్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. -
పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తజనం
-
విజయవాడ-హైదరాబాద్ రహ‘దారి’ మళ్లింపు
నార్కెట్‌పల్లి: నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలో జరుగుతున్న లింగమంతుల స్వామి (గొల్లగట్టు) జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రించడంలో భాగంగా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి(65)ను దారి మళ్లించనున్నారు. నల్లగొండ జిల్లా సుర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి వద్ద నేటినుంచి మూడురోజుల పాటు లింగమంతుల స్వామి జాతర జరగనుండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండటంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి హైదరాబాద్ - విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి, మిర్యాలగూడ, కోదాడల మీదుగా దారి మళ్లించనున్నారు.