దేవరపెట్టెను తరలిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల తదితరులు
సూర్యాపేట: తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరైన శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి ఆలయ ప్రాంతం ‘ఓ..లింగా.. ఓ...లింగా’ నామస్మరణతో మార్మోగింది. ఆదివారం అర్ధరాత్రి మంద గంపల ప్రదక్షిణలతో వేడుకలు ప్రారంభమయ్యాయి.
మొదటి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు ట్రాక్టర్లు, ఆటోలు, డీసీఎంలలో వచ్చారు. అర్ధరాత్రి యాదవులు సంప్రదాయ దుస్తుల్లో డోలు వాయిద్యాలు, భేరీ చప్పుళ్లు, కటారు విన్యాసాలు చేస్తూ గట్టుపైకి వచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి
సూర్యాపేట మండలం కేసారంలో లింగమంతుల స్వామి అమ్మవార్లకు విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదివారం రాత్రి పట్టువస్త్రాలు సమర్పించారు. జాతరలో మొదటిరోజు సూర్యాపేట రూరల్ కేసారం గ్రామంనుంచి దేవరపెట్టెను యాదవ కులస్తులు కాలినడకన పెద్దగట్టుకు చేర్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దేవర పెట్టె గొల్లగట్టుకు చేరుకుంది. రెండోరోజు సోమవారం చౌడమ్మతల్లికి బోనాలు సమర్పించనున్నారు. జాతరకు సోమవారం రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వచ్చి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment