jathara
-
పుష్ప 2 'జాతర' సాంగ్ రిలీజ్ చేశారు!
'పుష్ప 2' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. అల్లు అర్జున్ యాక్టింగ్‌తో రప్పా రప్పా చేశాడు. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే జాతర ఎపిసోడ్ అయితే వేరే లెవల్ అనేలా ఉంది. ముందు నుంచి చెబుతున్నట్లే ఆ పార్ట్ వచ్చినప్పుడు.. చూస్తున్న ఆడియెన్స్‌కి పునకాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆ ఎపిసోడ్లో వచ్చే పాటని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ)'గంగో రేణుక తల్లి' అని సాగే ఈ పాటలో అల్లు అర్జున్ చేసిన డ్యాన్స్ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. చీరకట్టులో వేసిన స్టెప్పులు బాగున్నాయి. ప్రస్తుతానికైతే ఈ పాట లిరికల్ సాంగ్ మాత్రమే విడుదల చేశారు. ఒకవేళ వీడియో కావాలంటే కొన్నిరోజులు ఆగాలి. అప్పటివరకు ఆగాలేకపోతున్నామంటే బిగ్ స్క్రీన్‌పై మూవీ చూసి అనుభూతి చెందాల్సిందే.(ఇదీ చదవండి: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. బన్నీ టీమ్‌పై కేసు నమోదు) -
‘జాతర’ విజయం ప్రేక్షకులకి అంకింతం: సతీష్ బాబు
సతీష్ బాబు రాటకొండ నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘జాతర’. ఓ కొత్త పాయింట్‌ని టచ్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 8న విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. సక్సెస్ ఫుల్ రెండు వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతర సినిమా టీం సక్సెస్ మీట్ జరుపుకుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ , హీరో సతీష్ బాబు రాటకొండ మాట్లాడుతూ.. ఈ సినిమాని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఈ సినిమాకి పని చేసిన ప్రతి నటీనటులు, టెక్నిషియన్స్ సినిమా విజయానికి కారణం. నవంబర్ 8 న మా సినిమాతో పాటు ఇంకో పది సినిమాలు పైన రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకులు మాకు అందించిన విజయం మాకు చాల ఆనందాన్ని ఇచ్చింది’ అన్నారు.‘ఇంత చిన్న సినిమాకి అంత గుర్తింపు రావడం అంత ఈజీ కాదు. ఒక వారం పాటు ఎక్కడ ఆగకుండా మా జాతర సినిమా సక్సెస్ ఫుల్ గా ఆడి రెండో వారంలోకి కూడా అడుగుపెట్టింది. ఇది మేము చాల గర్వంగా ఫీల్ అవుతున్నాం’ అన్నారు నిర్మాత ద్వారంపూడి శివ శంకర్ రెడ్డి. విష్ణు గారు మాట్లాడుతూ.. ఈ మూవీ స్టోరీ విన్నప్పుడు నేను పల్లెటూరు, గ్రామా దేవత కాన్సెప్ట్ అన్నప్పుడే నేను ఈ సినిమాకి కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే మన రూట్స్ ని మనం మర్చిపోము కదా, ఆ విషయం లో నాకు ఈ సబ్జెక్టు బాగా కనెక్ట్ అయింది. అయితే డైరెక్టర్ సతీష్ గారే హీరోగా ఎలా చేస్తారో అనుకున్నాను, కానీ ఈ సినిమాకి అతని నటన ప్లస్ అయింది. మిగతా టెక్నిషియన్స్ ,ఆర్టిస్టులు కూడా చాల బాగా పర్ఫార్మ్ చేసారు. ఈ సినిమా చేసినందుకు నేను చాల గర్వపడుతున్నాను’ అన్నాను. -
రిషబ్ శెట్టిలా పెద్ద హీరో కావాలి: తమ్మారెడ్డి భరద్వాజ
‘‘జాతర’ సినిమా ట్రైలర్ ఆసక్తిగా ఉంది. మంచి కథ ఉంటే.. హీరో, దర్శకుల గురించి ప్రేక్షకులు పట్టించుకోరు. కొత్తగా వచ్చిన సతీష్ హీరో, రైటర్, డైరెక్టర్ అయ్యాడు. రిషబ్ శెట్టిలా తను కూడా పెద్ద హీరో, పెద్ద దర్శకుడు కావాలి. అలాగే ‘జాతర’ చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సతీష్ బాబు రాటకొండ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్గా నటించారు. గల్లా మంజునాథ్ సమర్పణలో రాధాకృష్ణా రెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ– ‘‘జాతర’ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘మంచి కథతో ఈ మూవీని చక్కగా తీశారాయన’’ అని శివ శంకర్ రెడ్డి చెప్పారు. ‘‘నటుడిగా, దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. మా చిత్రాన్ని ఆదరించాలి’’ అని సతీష్ బాబు రాటకొండ కోరారు. -
విప్లవ చిత్రాల దర్శకులు ధవళ సత్యంకు సతీవియోగం
విప్లవ చిత్రాల దర్శకునిగా ఎంతో పేరు సంపాదించారు దర్శకుడు ధవళ సత్యం. అక్టోబర్ 3న ఆయన సతీమణి శ్రీమతి సీతారత్నం అనారోగ్యంతో మరణించారు. జాతర, ఎరమల్లెలు, యువతరం కదిలింది వంటి పలు సూపర్ హిట్ చిత్రాలను టాలీవుడ్లో ఆయన తెరకెక్కించారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారి కుమారుడు అమెరికా నుంచి వచ్చిన తర్వాత 6వ తేదీన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. మరోక కుమారుడు నర్సాపూర్‌లో కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. -
TCSS ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర
‘తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండగ వేడుకలు ఆదివారం (21 జూలై 2024) మధ్యాహ్నం అత్యంత వైభవంగా జరిగాయి. భాగ్యనగరంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగిన రోజున సింగపూరులో కూడా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు. ఈ బోనాల వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్’ లోని శ్రీ అరసకేసరి శివాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో సింగపూర్‌లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా.. ఇతరులు తో కలిపి సుమారు 1000 మంది వరకు భక్తులు పాల్గొన్నారు. బోనాల ఊరేగింపులో చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆడిపాడారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ వేడుకల్లో పాల్గొన్న తెలుగింటి ఆడపడుచులకు జిఆర్టి జెవెల్లెర్స్ వారు తాంబూళంతో కూడిన గూడీ బ్యాగ్ అందజేసి అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రజలందరికి మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని టీసీఎస్ఎస్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. సింగపూర్ లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా అందరు తెలుగు వారితో పాటు ఇతరులు ఈ బోనాల జాతరలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా టీసీఎస్ఎస్ వారు తొలిసారి 2017 లో బోనాల పండుగను నిర్వహించి సింగపూర్ కు ఈ పండుగ ప్రాముఖ్యతని పరిచయం చేసిన రోజులను గుర్తు చేసుకొని సంతోషించారు. మన ఈ తెలంగాణ సంప్రదాయం లో ప్రధాన భూమిక పోషించే బోనాల పండుగతో ప్రేరణ పొంది తెలుగు వారందరు బోనాల వేడుకను జరుపుకోవడం సంతోషకరం అని బోనాల్లో పాల్గొన్న వారు అన్నారు.బోనాల జాతర లో పోతురాజు మరియు పులివేషాలతో జాతరకు కళ తెచ్చిన నేరెళ్ల శ్రీనాథ్, గౌడ లక్ష్మణ్, అయిట్ల లక్ష్మణ్ మరియు అరవింద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో గడప స్వాతి రమేశ్, గోనె రజిత నరేందర్ రెడ్డి, ఎర్రమ రెడ్డి దీప్తి శిశిధర్ రెడ్డి, అలేఖ్య దార, బండ శ్రీదేవి మాధవ రెడ్డి, బొందుగుల ఉమారాణి రాము , నడికట్ల కళ్యాణి భాస్కర్, కాశబోయిన హర్షిని (W/O ప్రవీణ్) , భూక్య మీనా శ్రీధర్ , గౌరీ శ్రీవాణి శ్రీనివాస్ , తడిసిన అలేఖ్య లక్ష్మినర్సింహ , మందాడి సులోచన అనిల్ కుమార్ , శ్వేతా కుంభం , చాడ అనిత వేణుగోపాల్ రెడ్డి , బెహరా మాధవి, అమిత్ సేథీ ఉన్నారు. బోనం సమర్పించిన భక్తులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు రిటర్న్ గిఫ్ట్ ను అందచేశారు. వీరితో పాటు గడప రమేశ్ అమ్మవారికి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకుకొచ్చారు.బోనాల పండుగలో పాల్గొని విజయవంతం చేసిన మరియు ఎల్లప్పుడూ సొసైటీ వెన్నంటే ఉండి సహకారం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి మరియు కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, శివ ప్రసాద్ ఆవుల, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిల్ల, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి ఎర్రమ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి చెన్నప్పగారి మరియు పెరుకు శివ రామ్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. అందరి పై ఉజ్జయిని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని సొసైటి సభ్యులు ఆకాంక్షించారు.ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ , GRT జువెల్లర్స్ , వీర ఫ్లేవర్స్ ఇండియన్ రెస్టారెంట్ , తందూర్ లౌంజ్ ఇండియన్ రెస్టారెంట్ ,ప్రాడ్ ఈవెంట్ మేనేజ్ మెంట్, GRT ఆర్ట్లాండ్, నిక్స్ గ్లోబల్ రియాలిటీ, మంచికంటి శ్రీధర్, రాము బొందుగుల, లాలంగర్ వేణుగోపాల్, రాధాకృష్ణ కవుటూరు, కొమాకుల సాయికృష్ణ, అజయ్ కుమార్ నందగిరి, చమిరాజ్ వెంకట రామాంజనేయులు (టింకర్ టాట్స్ మాంటిస్సోరి) గార్లకు మరియు దేవాలయ యాజమాన్యానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.తెలంగాణ బోనాల పండుగ ప్రాముఖ్యత మరియు విశిష్టతని సింగపూర్ వాసులకు తెలియపరిచే ప్రేరణతో ఫేస్బుక్ వేదికగా నిర్వహించిన పోటీలలో భాగంగా ఉత్తమ రచన విజేతలుగా నిలిచిన మొదటి ఐదుగురికి కల్వ లక్ష్మణ్ రాజ్ గిఫ్ట్ వౌచెర్స్ ని అందచేశారుఈ వేడుకలకు సునీత రెడ్డి మిర్యాల, సంతోష్ వర్మ మాదారపు, మణికంఠ రెడ్డి చెన్నప్పగారి , శశిధర్ రెడ్డి ఎర్రమ రెడ్డి , శివ ప్రసాద్ ఆవుల, గోనె నరేందర్ రెడ్డి, బొందుగుల రాము ,రవి కృష్ణ విజాపూర్, నంగునూరి వెంకట రమణ, పెరుకు శివరామ్ ప్రసాద్ మరియు కాసర్ల శ్రీనివాస రావు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.వీరితో పాటు పండుగ వేడుకలో సహాయపడిన సుగుణాకర్ రెడ్డి రావుల, మల్లేశ్ బరపతి,కల్వ లక్ష్మణ్ రాజ్ , ఫణి భూషన్ చకిలం మరియు సాయికృష్ణ కొమాకుల గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ణతలు తెలియజేశారు. -
ఓల్డ్ సిటీ మహంకాళి జాతర బోనాల సందర్భంగా ఘట్టాల ఊరేగింపు (ఫోటోలు)
-
అక్టోబర్ 31న పైడితల్లి సిరిమానోత్సవం
సాక్షి, విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, ఇలవేల్పు అయిన శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్ 31న నిర్వహించనున్నారు. ఈ మేరకు అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈవో కె.ఎల్. సుధారాణి పూర్తి వివరాలను గురువారం మీడియాకు తెలియజేశారు. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 11.00 గంటలకు పందిర రాట వేయటంతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో పైడితల్లి ఉత్సవ తేదీలను ఆమె ప్రకటించారు. తిథి, వార నక్షత్రాలను అనుసరించి నిర్ణయించిన ముహుర్తం ప్రకారం అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు నెల రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని ఈవో సుధారాణి వివరించారు. అక్టోబర్ 30న తొలేళ్ల ఉత్సవం ఉంటుందని, మరుసటి రోజు అక్టోబర్ 31న అంగరంగ వైభవంగా సిరిమానోత్సవం జరుగుతుందన్నారు. అలాగే నవంబర్ 7వ తేదీన పెద్దచెరువు వద్ద తెప్పోత్సవం, 14వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవం ఉంటుందని వివరించారు. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 8.00 గంటలకు చదురుగుడి వద్ద మండల దీక్షలు, అక్టోబర్ 25న అర్ధమండలి దీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. నవంబర్ 11వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు వనం గుడి నుంచి కలశ జ్యోతి ఊరేగింపు ఉంటుందని వివరించారు. నవంబర్ 15న ఛండీహోమం, పూర్ణాహుతితో వనంగుడి వద్ద దీక్ష విరమణతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈవో కె.ఎల్. సుధారాణి పేర్కొన్నారు. సిరిమాను పూజారి బి. వెంటకరావు, వేదపండితులు రాజేశ్ బాబు, ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణ, ఇతర ఏర్పాట్ల గురించి వివరాలు వెల్లడించారు. అనంతరం అందరూ కలిసి ఉత్సవ తేదీలతో కూడిన గోడపత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో సిరిమాను పూజారి బి. వెంకటరావు, వేద పండితులు తాతా రాజేశ్ బాబు, దూసి శివప్రసాద్, వి. నర్శింహమూర్తి, ట్రస్టు బోర్డు సభ్యులు పతివాడ వెంకటరావు, వెత్సా శ్రీనివాసరావు, గొర్లె ఉమ, ప్రత్యేక ఆహ్వానితులు ఎస్. అచ్చిరెడ్డి, గంధం లావణ్య, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: తిరుమల: పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 7 గంటల సమయం -
సంక్రాంతికి జాతర
కన్నడ నటుడు దేవరాజ్ పెద్ద కుమారుడు ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటించనున్న చిత్రం ‘జాతర’. ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో వర్ధమాన్, లోటస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై గోవర్ధన్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ–‘‘జాతర’కి మంచి కథ కుదిరింది. ప్రజ్వల్‌కి స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు. బి. వాసుదేవ్ రెడ్డి కథకు ఉదయ్ నందన వనమ్ ఇచ్చిన ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే ‘జాతర’ స్క్రిప్ట్‌ను మరింత కొత్తగా మార్చాయి. హైదరాబాద్, బళ్లారి లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ప్రేమ కథ ఎంత అందంగా ఉంటుందో, నేపథ్యం కూడా అంతే కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు ఉదయ్ నందనవనమ్. పాన్ ఇండియా చిత్రంగా రూపొందనున్న ఈ మూవీకి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
వైభవంగా ‘గంగమ్మ’ భక్తి చైతన్య యాత్ర
సాక్షి, తిరుపతి/తిరుపతి కల్చరల్: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరలో ఐదో రోజైన ఆదివారం భక్తి చైతన్య యాత్ర అంగరంగ వైభవంగా సాగింది. డప్పు దరువుల నడుమ గంధం, కుంకుమ బొట్లు ధరించి, వేపాకు చేతపట్టిన జనం భక్తి పారవశ్యంతో చిందులేస్తూ గంగమ్మ తల్లి నామస్మరణ చేశారు. అమ్మవారు, దేవతామూర్తులతో పాటు వివిధ వేషధారణల్లో తమ భక్తిని చాటుకున్నారు. తొలుత ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యుటీ మేయర్లు భూమన అభినయ్‌రెడ్డి, ముద్రనారాయణ, కార్పొరేటర్లు తదితరులు అనంతవీధికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తి చైతన్య యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి అనంతవీధి, పరసాలవీధి, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం, ఎస్పీ కార్యాలయం, గాందీరోడ్డు, కృష్ణాపురం ఠాణా, గాంధీ రోడ్డు, బండ్ల వీధి మీదుగా భక్తి చైతన్య యాత్ర గంగమ్మ తల్లి గుడికి చేరుకుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 30 విగ్రహాలతో.. వేలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి స్వయంగా పలువురికి గంధం పూసి, కుంకుమ బొట్లు పెట్టారు. మాతంగి వేషధారణలో ఉన్న ఎంపీ గురుమూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డప్పు దరువులు, కోలాటాలు, జానపద నృత్యాలతో నగరమంతా సందడిగా మారింది. సారె సమర్పించిన మంత్రి రోజా తాతయ్యగుంట గంగమ్మ తల్లికి మంత్రి ఆర్కే రోజా ఆదివారం సారె సమర్పించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రోజా అమ్మవారికి సారె సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోజా మాట్లాడుతూ.. గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వరి్ధల్లాలని ఆకాంక్షించారు. గంగమ్మతల్లి ఆలయానికి సీఎం జగన్‌ను తీసుకువచ్చి, ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ కట్టా గోపీయాదవ్, ఈఓ మునికృష్ణయ్య పాల్గొన్నారు. -
మకర తోరణం తరలింపుతో ముగిసిన పెద్దగట్టు జాతర
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలో కొలువైన శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ముగిసింది. గురువారం రాత్రి మకర తోరణాన్ని సూర్యాపేటలోని గొల్ల బజారుకు చెందిన వల్లపు, కోడి వంశస్తులు తీసుకువెళ్లడంతో జాతర ముగిసినట్లు పూజారులు ప్రకటించారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. చివరి రోజు కూడా భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు చేపట్టారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన 28 హుండీల ద్వారా రూ. 25.71 లక్షల ఆదాయం వచ్చింది. అదే విధంగా 550 గ్రాముల వెండి, రెండు గ్రాముల బంగారం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
ఓ..లింగా.. ఓ...లింగా..
సూర్యాపేట: తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరైన శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి ఆలయ ప్రాంతం ‘ఓ..లింగా.. ఓ...లింగా’ నామస్మరణతో మార్మోగింది. ఆదివారం అర్ధరాత్రి మంద గంపల ప్రదక్షిణలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు ట్రాక్టర్లు, ఆటోలు, డీసీఎంలలో వచ్చారు. అర్ధరాత్రి యాదవులు సంప్రదాయ దుస్తుల్లో డోలు వాయిద్యాలు, భేరీ చప్పుళ్లు, కటారు విన్యాసాలు చేస్తూ గట్టుపైకి వచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సూర్యాపేట మండలం కేసారంలో లింగమంతుల స్వామి అమ్మవార్లకు విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదివారం రాత్రి పట్టువస్త్రాలు సమర్పించారు. జాతరలో మొదటిరోజు సూర్యాపేట రూరల్ కేసారం గ్రామంనుంచి దేవరపెట్టెను యాదవ కులస్తులు కాలినడకన పెద్దగట్టుకు చేర్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దేవర పెట్టె గొల్లగట్టుకు చేరుకుంది. రెండోరోజు సోమవారం చౌడమ్మతల్లికి బోనాలు సమర్పించనున్నారు. జాతరకు సోమవారం రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వచ్చి ప్రత్యేక పూజలు చేయనున్నారు. -
నేటి నుంచి పెద్దగట్టు జాతర
సూర్యాపేట: తెలంగాణలో రెండో అతి పెద్దదైన శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఆదివారం గంపల ప్రదక్షిణతో ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ శివారులో ఐదురోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. ఇప్పటికే జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాదవుల ఆరాధ్య దైవంగా భావించే లింగమంతుల స్వామి జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సుమారు 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతర మొదటి రోజు అత్యంత కీలకమైన ఘట్టం గంపల ప్రదక్షిణ. కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవరపెట్టెను తీసుకొని యాదవ, రెడ్డి కులస్తులు కాలినడకన బయలుదేరి దురాజ్‌పల్లిలో ఉన్న గొల్లగట్టు (పెద్దగట్టు)కు చేరుకుంటారు. రెండో రోజు సోమవారం చౌడమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు. మూడో రోజు మంగళవారం స్వామివారి కల్యాణోత్సవంలో భాగంగా చంద్రపట్నం వేస్తారు. నాలుగో రోజు జరిగే కార్యక్రమం నెలవారం. కేసారం నుంచి పాలు తీసుకొచ్చి రెండు కొత్త బోనం కుండల్లో పాలు పొంగిస్తారు. జాతరలో ఐదోరోజైన గురువారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనార్థం ఉంచుతారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు జాతర సమయంలో పోలీసులు వాహనదారులకు దూరభారం తగ్గించేలా ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నారు. ఇందుకోసం ఇటీవల నిర్మించిన జాతీయ రహదారి 365 బీబీని ఉపయోగించుకుంటున్నారు. ►హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద జాతీయ రహదారి 365 బీబీ మీదుగా మళ్లించి రాఘవాపురం స్టేజీ, నామవరం నుంచి గుంజలూరు స్టేజీ మీదుగా విజయవాడ వైపు పంపనున్నారు. ►విజయవాడ వైపు వెళ్లే భారీ, ట్రాన్స్పోర్ట్ వాహనాలను టేకుమట్ల నుంచి జాతీయ రహదారి 365 బీబీ మీదుగా మళ్లించి నాయకన్‌గూడెం మీదుగా కోదాడ వైపు పంపనున్నారు. ►హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను స్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్ ఎదురుగా ఉన్న ఎస్ఆర్ఎస్పీ కెనాల్ రోడ్డు మీదుగా రోళ్లబండ తండాకు మళ్లించి రాయినిగూడెం వద్ద యూట ర్న్ చేసి హైదరాబాద్ వైపు పంపనున్నారు. nవిజయవాడ వైపు నుంచి హైదరా బాద్ వైపు వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్నగర్, నార్కట్‌పల్లి మీదుగా పంపనున్నారు. -
సింగరాయ జాతరకు పోటెత్తిన భక్తులు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీనరసింహస్వామి జాతరకు శనివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. భక్తులు తొలుత మోయతుమ్మెద వాగులో స్నానం చేసి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వాగు పక్కన చెలమను తోడి అందులో నుంచి తీసిన నీటితో వంకాయ కూర, చింతపండు చారు చేసుకొని అక్కడే భోజనాలు చేశారు. మరికొందరు వంకాయ, చిక్కుడు, టమాటాలను కలిపి కూర చేసుకోవడం గమనార్హం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు జాతర సాగింది. జాతరకోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. -
వంకాయ కూర..చింతపండు చారు!
సాక్షి, సిద్దిపేట: జాతర్లకు వెళ్లడం, పూజలు నిర్వహించడంతో పాటు అక్కడే వంటలు చేసుకుని తినడం సర్వసాధారణం. కొన్నిచోట్ల మాంసాహారంతో పాటు శాకాహారం వండుతారు. కొన్నిచోట్ల శాకాహారానికే పరిమితమవుతారు. కానీ శాకాహారం..అందులోనూ ‘ఆహా..ఏమి రుచి..అనరా మైమరచి..’ అంటూ ఓ సినీ కవి అభివర్ణించిన వంకాయ కూరతో పాటు చింతపండు చారు మాత్రమే చేసుకుని అన్నంతో కలిపి ఆరగించడం శ్రీ సింగరాయ లక్ష్మీనరసింహస్వామి జాతర స్పెషల్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలోని కోహెడ మండలం కూరెల్ల–తంగళ్లపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఈ శ్రీ సింగరాయ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. దీని వెనకో కథ కూడా ఉంది. కాకతీయుల కాలంలో ప్రారంభం కాకతీయుల కాలంలో రాజులు అనువైన చోటల్లా చెరువులు తవ్వించారు. అందులో భాగంగా కాకతీయ చివరిరాజు ప్రతాపరుద్రుడు కూరెల్ల–తంగళ్లపల్లి గ్రామాల వద్ద చెరువు తవ్వే విషయం పరిశీలించాల్సిందిగా సంబంధిత నిపుణుడైన సింగరాయుడుతో పాటు మరికొందర్ని పంపించాడు. వారంతా కొద్దిరోజులు అక్కడే మకాం వేసి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న క్రమంలో బృందంలో కొందరు అనారోగ్యంతో మరణించారు. దీంతో సింగరాయ మినహా మిగిలిన వారంతా తమ పని మధ్యలోనే వదిలేసి ఓరుగల్లుకు తిరిగివెళ్లిపోయారు. సింగరాయ అక్కడే అడవిలో తిరుగుతున్న క్రమంలో ఓ చోట సొరంగంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహానికి ఆయన భక్తి శ్రద్ధలలో పూజలు చేస్తూ వచ్చాడు. కొద్దిరోజుల తర్వాత సింగరాయుడు కూడా వెళ్లిపోయాడు. ఆ తర్వాత సమీప గ్రామాల ప్రజలు లక్ష్మీనరసింహ స్వామికి పూజలు చేయడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే అక్కడ శ్రీ సింగరాయ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఏర్పడింది. ఏటా పుష్య అమావాస్య రోజున పెద్ద సంఖ్యలో భక్తులు సింగరాయ జాతర నిర్వహించడం ఆనవాయితీగా మారింది. శనివారం అమావాస్య పురస్కరించుకుని జాతర నిర్వహణకు రెవెన్యూ, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. చెలిమ నీటిలో ఔషధ గుణాలు! కూరెల్ల–తంగళ్లపల్లి గ్రామాలను ఆనుకుని మోయతుమ్మెద వాగు తూర్పు నుంచి పడమటకు దట్టమైన వన మూలికల చెట్ల మధ్య నుంచి ప్రవహిస్తుంది. దీంతో ఆ నీటిలో ఔషధ గుణాలు ఉంటాయనేది భక్తుల నమ్మకం. దీంతో ఈ వాగులో స్నానం చేసిన తర్వాత భక్తులు సింగరాయ నరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. వాగు చెలిమల (నీటి గుంటలు) నుంచి తీసిన నీటితో వంకాయ కూర, చింతపండు చారు సిద్ధం చేస్తారు. అల్లం, వెల్లుల్లి, జిలకర లాంటి వేమీ ఉపయోగించరు. స్వామికి నైవేద్యంగా సమర్పించాక సహపంక్తి భోజనం చేస్తారు. మోయతుమ్మెద వాగు చెలిమ నీటితో చేసిన వంటలు రుచిగా ఉండటమే కాకుండా దివ్య ఔషధంలా పని చేస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఆరోగ్యానికి మంచిదనే స్థానికులు ఈ నీటిని వినియోగిస్తుంటారు. -
రైతన్నల సంబరం (ఫొటోలు)
-
నూనె తాగి.. మొక్కు తీర్చి
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా ఖందేవ్ జాతర శనివారం ప్రారంభమైంది. పక్షం పాటు జరగనున్న జాతరకు ఉమ్మడి జిల్లాలు సహా వివిధ రాష్ట్రాల నుంచి తొడసం వంశస్తులు భారీగా త రలి వచ్చారు. తమ ఆరాధ్య దైవమైన ఖందేవునికి ఏటా పు ష్య పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటా రు. ఇందుకోసం తమ ఇళ్లలో తయారుచేసిన నువ్వుల నూనె ను తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ప్రతి ఇంటి నుంచి సేకరించిన నూనెను తొడసం వంశ ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవడం అనవాయితీ. ఇందులో భాగంగా ఈ సారి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జివితి తాలుకా కొద్దిగూడ గ్రామానికి చెందిన మెస్రం నాగుబాయి శనివారం ఆల య సన్నిధిలో రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగి మొ క్కు తీర్చుకుంది. ఇలాచేస్తే సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. అనంతరం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ హాజరయ్యారు. కార్యక్రమంలో తొ డసం వంశ పెద్దలు బాపూరావ్ కటోడా, ఆనందరావ్ కటో డా, రాజు, యాదవ్రావ్, బండు, గోపాల్ పాల్గొన్నారు. -
Sirimanostavam 2022: సిరిమానోత్సవానికి పటిష్ట బందోబస్తు
విజయనగరం: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను విజయగవంతంగా నిర్వహించేందుకు మూడువేల మంది పోలీస్ బలగాలతో పటిష్టబందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ ఎం.దీపిక స్పష్టం చేశారు. ఈ నెల 10న జరిగే తొలేళ్ల ఉత్సవం, 11న జరిగే సిరిమానోత్సవానికి గట్టి బందోబస్తు ఏర్పాటుచేస్తామని చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ టి.త్రినాథ్, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావుతో కలిసి గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సిరిమానోత్సవం రోజున బందోబస్తును 22 సెక్టార్లుగా విభజించి, సుమారు మూడువేల మంది పోలీసులు రెండు షిఫ్ట్‌లుగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎస్పీ, అదనపు ఎస్పీ, 12 మంది డీఎస్పీలు, 63 మంది సీఐ/ఆర్ఐలు, 166 మంది ఎస్ఐ/ఆర్ఎస్ఐలు, 11 మంది మహిళా ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బందితో సహా సుమారు మూడువేలమంది పోలీస్ అధికారులను, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తారన్నారు. మహిళా పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్ల సేవలను వినియోగిస్తామని చెప్పారు. సమావేశంలో ఎస్బీ సీఐ జి.రాంబాబు, వన్‌టౌన్ సీఐ బి.వెంకటరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ అమ్మవారి చదురుగుడి ఎదురుగా తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేస్తామని ఎస్పీ దీపిక తెలిపారు. సిరిమాను తిరిగే ప్రాంతాలను, సిరిమాను తీసుకుని వచ్చే మార్గంలోనూ, ఇతర ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నట్టు వివరించారు. బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందికి బాడీ వార్న్ కెమెరాలను ధరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలను ఏర్పాటుచేశామన్నారు. వాటన్నంటినీ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. సిరిమాను తిరిగే ప్రాంతంలో ముందుగా గుర్తించిన 30 ప్రాంతాల్లో రూఫ్ టాప్లలో పోలీసులను నియమించి, నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. రూఫ్ టాప్లలో విధులు నిర్వహించే సిబ్బంది బైనాక్యూలర్స్‌తో సిరిమాను తిరిగే ప్రాంతాలను పరిశీలిస్తూ, అవసరమైన సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేసి పోలీసులను అప్రమత్తం చేస్తారన్నారు. 200 మందితో ప్రత్యేక నిఘా నేరాలను నియంత్రించేందుకు, నేరస్తులను గుర్తించడంలో అనుభవజ్ఞులైన 200 మంది క్రైమ్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ఈ బృందాలు ఆలయం రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో తిరుగుతూ జేబు దొంగతనాలు, గొలుసు దొంగతనాలు జరగకుండా చర్యలు చేపడతారన్నారు. రంగంలోకి బాంబ్ స్క్వాడ్ అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించేందుకు పోలీసు జాగిలాలతో పాటూ ప్రత్యేక బాంబ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపుతున్నట్టు ఎస్పీ స్పష్టం చేశారు. ఈ బృందాలు ఆలయాలు, బస్టాండ్ , రైల్వే స్టేషన్ , ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపడతారన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేందుకు ఏడు ప్రత్యేక పోలీస్ బృందాలు కమాండ్ కంట్రోల్ వద్ద సిద్ధంగా ఉంటాయన్నారు. పార్కింగ్ ఇలా.. ట్రాఫిక్ నియంత్రణకు వాహనాల పార్కింగ్‌కి సంబంధించి అయోధ్యా మైదానం, రాజీవ్‌స్టేడియం, రామానాయుడు రోడ్డు, పెద్దచెరువు గట్టు, అయ్యకోనేరు గట్టు, పోర్ట్ సిటీ స్కూల్ రోడ్డు, ఎస్వీఎన్ నగర్ రోడ్డు, ఐస్ ఫ్యాక్టరీ కూడలి నుంచి బాలాజీ కూడలి వరకూ గల రింగురోడ్డు ప్రాంతాల్లో ప్రజలు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు స్థలాలు ఏర్పాటుచేశామన్నారు. వీఐపీల వాహనాల పార్కింగ్‌కు బొంకులదిబ్బ, టీటీడీ కల్యాణమండపం, గురజాడ కళాక్షేత్రం, కోట ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటుచేసినట్టు వివరించారు. ప్రజలకు సూచనలు చేసేందుకు, సమాచారాన్నిచ్చేందుకు వాహనాలకు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశామన్నారు. సిరిమానోత్సవం రోజున ఫోర్ వీలర్స్ వాహనాలు ఎంఆర్ కళాశాల, కేపీ టెంపుల్, గంటస్తంభం, ట్యాక్సీ స్టాండ్, శివాలయం వీధి, ఘోష ఆస్పత్రి, గుమ్చీ రోడ్డు, సింహాచలం మేడ, సత్యా లాడ్జి ప్రాంతాల్లో ప్రవేసించేందుకు అనుమతి ఉండదన్నారు. సిరిమాను తిరిగే ప్రాంతంలో ఎటువంటి తోపులాటలు, అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలందరూ సిరిమాను తిలకించేలా అనుసంధాన రోడ్లలో బాక్స్ సిస్టమ్స్‌ను ఏర్పాటుచేస్తున్నామన్నారు. అధికారులు 200 వైర్లెస్ సెట్స్‌ను పోలీసుల వద్ద ఉంచి, ప్రజలకు సూచనలు చేస్తారు. పోలీసు సేవాదళ్ భక్తులకు సేవలందిస్తారు. బందోబస్తుకు వచ్చే మహిళా సిబ్బందికి దిశ మహిళా టాయిలెట్స్ ఏర్పాటుచేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పైడితల్లి అమ్మవారి పండగ శాంతియుతంగా భక్తి వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీసుశాఖకు సహకరించాలని, పోలీసుల సహాయాన్ని పొందాల్సిన వారు దేవాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన తాత్కాలిక కంట్రోల్‌రూమ్‌ను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. పోలీసులందరూ భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారికి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చూడాలని, దురుసుగా ప్రవర్తించరాదన్నారు. వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలందించాని ఆదేశించారు. సిరిమానోత్సవం రోజున డైవర్షన్స్ ఇలా.. పట్టణంలోని వాహనాలు సీఎంఆర్ జంక్షన్, గూడ్స్షెడ్ల మీదుగా పట్టణం బయటకు వెళ్లవచ్చు. బాలాజీ జంక్షన్, రామానాయుడు రోడ్డు, సీఎంఆర్ జంక్షన్, గూడ్స్‌షెడ్ మీదుగా పట్టణం బయటకు వెళ్లవచ్చు. ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, బాలాజీ కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, ఎత్తుబ్రిడ్జి మీదుగా పట్టణం బయటకు వెళ్లవచ్చు. కొత్తపేట జంక్షన్, దాసన్నపేట, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, ధర్మపురి రోడ్డు మీదుగా పట్టణం నుంచి వెళ్లేందుకు వాహనాలకు అనుమతిస్తారు. జేఎన్టీయూ, కలెక్టేరేట్, ఆర్అండ్బీ, ఎత్తుబ్రిడ్జి, ప్రదీప్‌నగర్ మీదుగా పట్టణ బయటకు వాహనాలకు అనుమతిస్తారు. ప్రదీప్‌నగర్ కూడలి, ధర్మపురి రోడ్డు, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, దాసన్నపేట మీదుగా బయటకు అనుమతిస్తారు. -
నల్లమలలో వైభవంగా చెంచుల జాతర
నాగర్‌కర్నూలు: నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం భౌరాపూర్‌పెంటలో చెంచుల ఆరాధ్య దైవం భ్రమరాంబిక, మల్లికార్జునస్వామి కల్యాణాన్ని గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహించింది. చెంచులు భౌరమ్మను ఆడబిడ్డగా, మల్లికార్జునస్వామిని అల్లుడిగా భావించి కల్యాణం నిర్వహించారు. ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు స్వామివారి తరపున, కలెక్టర్ ఉదయ్‌కుమార్ దంపతులు అమ్మవారి తరపున పెళ్లిపెద్దలుగా వ్యవహరించి స్వామివారికి తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించారు. చెంచుల గురువు గురువయ్య శివపార్వతుల కల్యాణం జరిపించారు. కాగా, సిద్ది పేటజిల్లా కొమురవెల్లిలో మంగళవారం రాత్రి పెద్దపట్నం వేశారు. -
నువ్వుల నూనె.. నైవేద్యంగా
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో తొడసం వంశస్తుల ఆరాధ్య దైవం ఖందేవ్ జాతర వైభవంగా జరుగుతోంది. పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా ఏటా తొడసం వంశస్తులు ఖందేవ్ జాతర నిర్వహిస్తారు. సంప్రదాయ డోలు వాయిద్యాలతో సోమవారం మహాపూజ నిర్వహించారు. నిష్టగా ఇళ్లలోనే తయారుచేసిన నువ్వుల నూనెను రెండో రోజైన మంగళవారం ఆలయానికి తీసుకువచ్చి ఖందేవ్‌కు నైవేద్యంగా సమర్పించారు. తర్వాత పూజలు నిర్వహించారు. తొడసం వంశానికి చెందిన ఆడపడుచు ఈ నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మండలంలోని చిత్తగూడ గ్రామానికి చెందిన మాడవి యోత్మాబాయి వరుసగా మూడోసారి రెండు కిలోల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. ఇలా మొక్కు చెల్లించుకోవడం వలన సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. వందేళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోందని ఖందేవ్ ఆలయ కమిటీ సభ్యుడు తొడసం నాగోరావు తెలిపారు. -
జనం చస్తుంటే.. జాతర చేస్తారా..
డోర్నకల్: కరోనా వైరస్ వ్యాప్తితో ఓవైపు ప్రజలు అల్లాడుతోంటే.. మీరు జాతర ఎలా చేస్తారని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని లింబ్యాతండాలోని వెంకటేశ్వరస్వామి(పుల్లు బాబోజీ) ఆలయంలో ప్రతీ సంవత్సరం మే నెలలో జాతర నిర్వహిస్తారు. శుక్రవారం జాతరలో పాల్గొనేందుకు భారీగా గిరిజనులు తరలి వచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ అమలును పట్టించుకోకుండా వివిధ ప్రాంతాల నుంచి గిరిజనులు జాతరకు తరలివచ్చారు. ఆలయంలో పూజలు నిర్వహిస్తూ జంతుబలి చేస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు తహసీల్దార్ జి.వివేక్, మండల ప్రత్యేక అధికారి సయ్యద్ ఖుర్షీద్, సీఐ ఇస్లావత్ శ్రీనివాస్, ఎస్ఐ భద్రునాయక్‌తో సహా పోలీసులు తండాకు చేరకున్నారు. ఆలయ పరిసరాల్లో గుంపులుగా చేరిన గిరిజనులను అక్కడి నుంచి పంపించారు. ఆలయ పూజారితో పాటు నిర్వాహక కమిటీలో ఒకరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈమేరకు అధికారులు మాట్లాడుతూ.. లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో నిబంధనలు అతిక్రమించి జాతరకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి వారిని అక్కడి నుంచి పంపించినట్లు తెలిపారు. ఆలయ నిర్వాహక కమిటీకి చెందిన 11 మందిపై కేసు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: కరోనా పేరు తెలియని అడవిబిడ్డలు చదవండి: చెరువులో విషప్రయోగం.. -
జాతరలో కందిరీగల దాడి
శామీర్‌పేట్: మూడుచింతలపల్లి మండలం ఉద్దె మర్రి గ్రామంలో నిర్వహిస్తున్న మల్లికార్జునస్వా మి జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. కందిరీ గలు దాడి చేయగా, వాటి బారినుండి తప్పించుకునేందుకు పరిగెడుతున్న వ్యక్తి కిందపడి గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. ఉద్దెమర్రి మల్లికార్జునస్వామి జాతరలో భాగంగా సోమవారం అగ్ని గుండాల కార్యక్రమం చేపట్టగా, భక్తులు పూజలు చేసి అగ్నిగుండాలు దాటుతున్నారు. ఈ క్రమంలో అగ్ని గుండాల నుంచి వచ్చిన పొగ సమీపంలో ఉన్న మర్రి చెట్టుపై ఉన్న కందిరీగల తుట్టెకు తాకింది. దీంతో కందిరీగలు భక్తులపై దాడి చేశాయి. ఒకరినొకరు తోసుకుంటూ భక్తులు పరిగెత్తారు. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన సొప్పరి శ్రీనివాస్ (50)పై కందిరీగలు విరుచుకుపడడంతో వాటి నుండి తప్పించుకునేందుకు శ్రీనివాస్ పరుగులు తీశాడు. కందిరీగలు అతడిని వదలకపోవడంతో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి శ్రీనివాస్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అనంతరం చికిత్స నిమిత్తం నాగారంలోని ఓ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కాగా, కందిరీగల దాడిలో గ్రామస్తులు సైతం గాయాలపాలయ్యారు. -
అమ్మ పండగ.. గుండె నిండుగా
ఎవరికైనా జనవరిలో ఒకటే పండగ వస్తుంది.. అదే సంక్రాంతి. శంబర గ్రామస్తులకు మాత్రం ప్రత్యేకం. రెండు పండగలు వస్తాయి. సంక్రాంతి పండగ అయ్యాక పది రోజులకు వచ్చే శంబర జాతర. జనవరి 27, 28, 29 తేదీల్లో జరగనున్న శంబర పోలమాంబ జాతరకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామస్తుల ఇళ్లల్లో అమ్మ పండగ పనులు చురుగ్గా సాగిపోతున్నాయి. మక్కువ: ఏటా శంబర పండగ, సంక్రాంతి పండగలను ఒకే నెలలో నిర్వహిస్తుంటారు. సాధారణంగా సంక్రాంతి పండగంటే పిండి వంటల తయారీ, నూతన వస్త్రాల కొనుగోలు, ఆడపిల్లలు, అల్లుళ్లు, ఆడపడుచులను పిలవడం, నూతన వస్త్రాలు, కానుకలు ఇవ్వడం ఆనవాయితీ. గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్లు, అయిదేళ్లకోసారి గ్రామదేవత పండగలను మార్చి, మే నెలల్లో జరుపుకొంటారు. శంబర గ్రామంలో మాత్రం ఏటా జనవరిలో రెండు పండగలు నిర్వహిస్తుంటారు. సంక్రాంతి పండగ జరిగిన 10 రోజుల తరువాత శంబర పోలమాంబ అమ్మవారి జాతర ఏటా నిర్వహిస్తుంటారు. జాతర కోసం గ్రామస్తులు ఎదురు చూస్తారు. ఏటా జాతర వల్ల మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదురైనా అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలిస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వవని వారి నమ్మకం.. విశ్వాసం. కూలోనాలో చేసి జాతర సమయానికి కొంతసొమ్మును కూడబెట్టుకుంటారు. మిగిలిన వారితో సమానంగా పిల్లలకు బట్టలు, పెద్దఅమ్మవారికి, రథంమానుకు చీరలు చూపించి, కోళ్లు మొక్కుబడులు చెల్లించుకుంటారు. చుట్టాలు, బంధువులను పండగకు ఆహ్వానిస్తారు. జనవరి 27 తొలేళ్లు, 28న సిరిమాను, 29న అనుపోత్సవం నిర్వహణకు గ్రామంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పుట్టింటి వారికిఆహ్వానం సంక్రాంతికి సుమారు రూ.10 వేల వరకు ఖర్చు చేస్తారు. శంబర పండగకు మాత్రం సుమారు రూ.30 వేల వరకు ఒక్కొక్క కుటుంబానికి ఖర్చవుతుంది. సంక్రాంతి పండగ మధ్యాహ్నం శంబర గ్రామస్తులు కన్నవారింటికి వెళ్లి, శంబర పండగకు కన్నవారిని ఆహ్వానిస్తారు. గ్రామానికి చెందిన యాదవులు అయిదేళ్లకోసారి గాబు సంబరాలు ఘనంగా జరుపుకొంటారు. మూడు, నాలుగు కుటుంబాలు కలిసి సుమారు రూ.లక్ష వరకు ఖర్చుచేసి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుతారు. పొదుపు చేస్తాం ఏడాది మొత్తం కష్టపడి శంబర పండగకు కొంతసొమ్మును దాచుకుంటాం. అందువల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా పండగను హాయిగా జరుపుతాం. పూర్వం నుంచి వచ్చిన సంప్రదాయాలను ఆచరిస్తున్నందుకు గర్వంగా ఉంది. – నైదాన పైడితల్లి, మహిళ, శంబర ఏటా జరుపుతాం ఏటా గ్రామంలో లక్షలాదిమంది భక్తుల మధ్య జాతర జరుపుకోవడం ఆనందంగా ఉంటుంది. జాతరకు చుట్టాలు, బంధువులతో గ్రామం, ఇళ్లు కళకళలాడతాయి. సంక్రాంతి పండగకంటే.. శంబర పండగకే ఇళ్లకు రంగులు వేయించుకుంటాం. శంబర పండగంటే మాకు అంత ఇష్టం. – మడ్డు మంగ, శంబర తల్లి పండగంటే ఎంతో ప్రీతి తల్లి పండగ వస్తుందంటే ఎంతో సంబరంగా ఉంటుంది. ఇంట్లో ఇబ్బందులున్నా, తల్లిని మొక్కుకుంటే అప్పులు పుడతాయి. ఏడాది మొత్తం ఖాళీ లేకుండా పనులు దొరకడంతో అప్పులు తీర్చుకునేందుకు అవకాశముంటుంది. బంధువుల్ని పిలిచి పండగను ఆనందంగా చేసుకుంటాం.– బెవర పోలమ్మ, మహిళ, శంబర జాతర ఏర్పాట్లు ముమ్మరం మక్కువ: ఈనెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు దేవాదాయ శాఖాధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. చదురుగుడి వద్ద క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వనంగుడి వద్ద, చదురుగుడి వద్ద మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. వనంగుడి వద్ద భక్తులు తాగునీటి కుళాయిలు నిర్మిస్తున్నారు. గోముఖినది ఒడ్డున రహదారికి ఇరువైపులా తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేశారు. ఒకవైపు మాత్రమే తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేయాలని, మరోవైపు ఏర్పాటుచేసి భక్తులు నడకకు ఇబ్బంది పెట్టరాదని సాలూరు సీఐ సింహాద్రినాయుడు హెచ్చరించారు. చదురుగుడి క్యూలైన్ల వద్ద భక్తుల తలనీలాలకు టెంట్లు ఏర్పాటు చేశారు. వినోద కార్యక్రమాలకు ఇతర జిల్లాల నుంచి వివిధ సర్కస్ కంపెనీలు గ్రామానికి చేరుకున్నాయి. సిరిమానోత్సవం రోజు పూజారి సిరిమాను అధిరోహించేందుకు అవసరమైన పక్కా భవనాన్ని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. పక్కా ప్రణాళికతోజాతర మక్కువ: భక్తులు ఇబ్బందులు పడకుండా పక్కా ప్రణాళికతో శంబర జాతర నిర్వహించాలని బొబ్బిలి ఏఎస్పీ గౌతమిశాలీ ఆదేశించారు. శంబర గ్రామంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లను బుధవారం ఆమె పరిశీలించారు. ముందుగా ప్రధానాలయం ముందు రహదారిని పరిశీలించి, ఎక్కడెక్కడ బారికేడ్లు ఏర్పాటుచేస్తున్నారు? భక్తులను ఏయే మార్గంలో అమ్మవారిని దర్శించుకునేందుకు తరలిస్తున్నారు అన్న అంశాలను సీఐ సింహాద్రినాయుడును అడిగి తెలుసుకున్నారు. అనంతరం చదురుగుడి వెనుకన ఉన్న క్యూలైన్లను ఆమె పరిశీలించారు. క్యూలైన్లు ఇరుగ్గా ఉన్నందున వాటి సంఖ్య పెంచాలని దేవదాయశాఖ సిబ్బందిని ఆదేశించారు. క్యూలైన్ సమీపంలో కాలువ వద్ద పలకలు లేకపోవడంతో భక్తులు ప్రమాదాల బారిన పడే అవకాశమున్నందున తక్షణమే కాలువ వద్ద చదును చేసి రెండు మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. తలనీలాలు, గోముఖి నదికి వెళ్లే మార్గం, క్యూలైన్‌కు వెళ్లే మార్గం రెండుగా విభజించాలన్నారు. క్యూలైను సమీపంలో కొబ్బరికాయలు కొట్టిన ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానాలయం ముందు వీవీఐపీలు, వీఐపీల సదుపాయం కోసం టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వనంగుడి వద్ద ఏర్పాట్లను ఆమె పరిశీలించి, భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సీఐ సింహాద్రినాయుడు, ఎస్ఐ రాజేశ్‌లను ఆదేశించారు. -
చెడుచూపు పడనీకు తల్లీ
భారతీయ పురాణాల్లోని ప్రతి దుష్టసంహారం స్త్రీ దేవతల చేతుల మీదుగా జరిగిందే. వారం రోజులుగాతిరుపతిలో జరుగుతున్న గంగమ్మ జాతర కూడా.. మోహోన్మత్తుడైన ఓ పాలెగాడిని గంగమ్మ హతమార్చిన ఇతిహాసమే. తప్పు చేసి, లోపల దాక్కున్న వాడిని బయటికి రప్పించి అతడి తలను తెగనరికిన గంగమ్మ అంశ.. ‘మీటూ’ ముల్లుగర్రతో ‘మర్యాదస్తుల’ ముసుగులను తొలగిస్తున్న నేటి మహిళలోనూ ఉంది. చూడవలసిన జాతర ఇది. చెడు చూపునకు పాతర ఇది. తిరుపతిలో గంగ జాతర జరిగినంత గొప్పగా రాయలసీమలో మరే జాతరా జరగదు. ఈ జాతర తిరుపతి గ్రామ దేవతలైన పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మల పేరున జరుగుతుంది. సాధారణంగా ప్రజలు తమ గ్రామంలో నెలకొన్న గ్రామ దేవతలకు జాతరలు జరిపిస్తుంటారు. ఆ గ్రామ దేవతలందరూ స్త్రీలే. స్త్రీలే గ్రామ దేవతలుగా ఉండటానికి కారణం లేకపోలేదు. ప్రాచీన మానవుల్లో పురుషుడు వేటకు, యుద్ధాలకు కేటాయింపబడ్డాడు. స్త్రీలకు వ్యవసాయం వదిలి వేయబడింది. అందుకే వ్యవసాయ సంబంధమైన దైవాలు స్త్రీ దేవతలు. వ్యవసాయం ప్రాధాన్యం పెరిగాక ఈ స్త్రీ దేవతలే గ్రామ దేవతలయ్యారు. గ్రామ దేవతలు తమ గ్రామాల్లో సంభవించే కలరా, అమ్మవారు, పశువ్యాధులు వ్యాపించకుండా అరికడతారని, సకాలంలో వర్షాలు పడేటట్టు చేస్తారని ప్రజల విశ్వాసం. అందుకే ఊరి పొలిమేరల్లోనే ఈ గ్రామ దేవతల్ని ప్రతిష్ఠిస్తారు. మానవుల చేత మొట్టమొదట పూజలందుకున్న దేవతలు గ్రామ దేవతలే. ప్రాచీన కాలం నుంచీ నేటి వరకు గ్రామ దేవతలే గ్రామాల్లో ఆధిక్యతను కలిగి ఉన్నారు. గ్రామ దేవత విగ్రహ రూపంలో ఉండాలనే నియమం ఏదీ లేదు. ఆమె ఓ చిన్నరాయి రూపంలో కూడా ఉండొచ్చు. ఆ రాతికి పసువు కుంకుమ బొట్లు పెడతారు. కానీ తిరుపతిలో ఉండే గ్రామ దేవతలందరికీ విగ్రహాలున్నాయి. ఒక్కో ఊరిలో ఒక్కో పేరుతో ఒక్కో చరిత్ర కలిగి ఉంటారు ఈ గ్రామ దేవతలు. ఏడుగురు అక్కాచెల్లెళ్లు తిరుపతిలోని గంగమ్మకు ఓ ఐతిహ్యం ఉంది. తిరుపతి పొలిమేరల్లో ఏడుగురు గ్రామ దేవతలు ఉన్నారు. ఈ ఏడు మందీ అక్కాచెల్లెళ్లు. వీరు.. పెద్ద గంగమ్మ, అంకాళమ్మ, ముత్యాలమ్మ, వేషాలమ్మ, మాతమ్మ, నేరేళమ్మ, చిన్న గంగమ్మ. అందరిలోకీ చిన్నదైన చిన్న గంగమ్మనే గంగమ్మ అంటారు. వీరందరికీ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సోదరుడు. అందుకేనేమో తిరుమల ఆలయం నుంచి ప్రతి సంవత్సరం పసుపు కుంకుమలు, చీరలు, గంప, చేటలు గంగమ్మకు పంపిస్తుంటారు. పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మలను తాళ్లపాక గంగమ్మ అని, తాతయ్యగుంట గంగమ్మ అని పిలుస్తుంటారు. ఇద్దరిలో చిన్న గంగమ్మే ప్రసిద్ధి. పెద్ద, చిన్న గంగమ్మలకు చెరో చోట ఆలయాలున్నాయి. చిన్న గంగమ్మ పెళ్లి కాని కన్నెపిల్ల. తరుపతిని ఏలే పాలెగాడు ఆమెను మోహించాడు. ఆమె పొందు కోసం పరితపించి ఒకనాడు బలాత్కరించబోయాడు. మహిమోన్నతురాలైన ఆమె, ఆ పాలెగాడిని వారం లోపల హతమారుస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. ఆమె మహిమలను తెలుసుకుని పాలెగాడు ప్రాణభీతితో ఆమెకు కనిపించకుండా దాక్కుంటాడు. ఆమె పాలెగాడి కోసం వేట ప్రారంభిస్తుంది. వేషంలో తిరిగితే తనను గుర్తు పట్టలేడని, ఎదురు పడ్డప్పుడు చంపొచ్చని భావిస్తుంది. మొదటి రోజైన బుధవారం నాడు ఉదయం బైరాగి వేషం, సాయంత్రం పాములోళ్ల వేషం వేస్తుంది. గురువారం ఉదయం గొల్లవాని వేషం, సాయంత్రం బండ వేషం వేస్తుంది. అయినా వాడు కనిపించడు. శుక్రవారం ఉదయం కోమటి వేషం, సాయంత్రం తోటి వేషం వేసుకుని ఆ పాలెగాడి కోసం వెదుకుతూ, బండ బూతులు తిడుతూ తిరుగుతుంది. పాలెగాడు బయటికి రాడు. ఇక లాభం లేదనుకుని శనివారం ఉదయం దొర వేషం వేసుకుని వస్తుంది. దొరకు పాలెగాడు సామంతుడవటం వల్ల తన ప్రభువొచ్చాడని భ్రమించి బయటికి వస్తాడు. పాలెగాడు బయటికి రావడంతోనే గంగమ్మ వాడి తలను నరికి హతమారుస్తుంది. ఆదివారం మాతంగి వేషం వేసుకుని వచ్చి పాలెగాడి భార్యకు ఊరట కలిగించి శాంతిస్తుంది. సోమవారం ఉదయం జంగం వేషంతోను, సాయంత్రం సున్నపు కుండలతోనూ వచ్చి, మంగళవారం రాత్రి విశ్వరూపం చూపిస్తుంది. ఇదీ ప్రచారంలో ఉన్న కథ. అవిలాలలో ఆరంభం గంగమ్మ తిరుపతికి మూడు మైళ్ల దూరంలో ఉన్న అవిలాల గ్రామంలో పుట్టిందట. అవిలాల గ్రామంలో గంగజాతర చేసిన తర్వాత అక్కణ్ణుంచి తిరుపతికి పసుపు కుంకుమలు తీసుకు వస్తారు. ఆ మంగళవారం రాత్రే తిరుపతిలో చాటింపు వేస్తారు. బుధవారం నుంచి జాతర ప్రారంభం అవుతుంది. ఆలయం తరఫున అధికారికంగా, వంశపారంపర్యంగా ‘కైకల’ కులస్థులు వేషాలను ధరిస్తారు. రజకులు కూడా వారికి తోడుగా వేషాలలో పాల్గొంటారు. తిరుపతి వాస్తవ్యులు, ముఖ్యంగా పిల్లలు బుధవారం తెల్లటి నామం కొమ్ములతో బైరాగి వేషం వేసి, మెడలో రాళ్ల కాయల దండలను ధరించి, దారిలో కనిపించే వారందరినీ ఒక రకపు బూతు మాటలతో తిడతారు. గురువారం ఎర్రటి కుంకుమ ఒంటినిండా పూసుకుని, బండపూలు కట్టుకుని, బండ వేషం వేసుకుని, బండ బూతులు తిడతారు. శుక్రవారం వేప మండలు ధరించి తోటి వేషంతో మరో రకమైన బూతులు తిడతారు. ఒకరోజు తిట్టిన బూతులు మరో రోజు తిట్టకపోవడం గమనించదగ్గ విషయం. గుంపులు గుంపులుగా వేషాలు వేసుకుని ఆడామగా తేడా లేకుండా చెవులు గింగురుమనేటట్లు తిడతారు. అలా తిట్టడం వల్ల పుణ్యం వస్తుందని భావిస్తారు. వేషాలు వేసుకుని వేషాలమ్మని కూడా దర్శిస్తారు. గంగమ్మ కథలో వాస్తవమెంతుందో తెలియదు కానీ, నిజానికి పూర్వం మన నాగరికతను పరిశీలిస్తే దేవాలయాల్లో సంభోగ పూజలు జరిగేవని, అనేక చోట్ల ‘బూతు ఉత్సవాలు’ జరిపించేవారని ఆధారాలున్నాయి. అవి వాస్తవాలన్నట్లు వాటి అవశేషాలు నేటికీ మిగిలే ఉన్నాయి. సంభోగ పూజలతో పాటు తిట్లను కూడా తిడుతూ తమ భక్తిని నిరూపించుకునేవారు నాటి మానవులు. ప్రతిచోట గ్రామ దేవతల ఉత్సవాల్లో వేషాల వాళ్లు బూతులు తిడతారని, రంకులరాటం.. అదే నేటి రంగుల రాట్నం.. దగ్గర మహా ఆవేశంతో స్త్రీ, పురుషులు బూతులు తిట్టేవారని, ఇవి అనాది నుండి వచ్చే ఆచారాలని తాపీ ధర్మారావు గారు తన ‘దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?’ అనే గ్రంథంలో చెప్పారు. అలాగే నేడు కూడా ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ రథం ఆగిపోయినప్పుడు జనం బండ బూతులు తిడతారు. తిట్టనివాడిని పాపాత్ముడిగా చూస్తారు అక్కడివారు! బూతు తిట్లు కూడా ఒక రకం పూజలుగా భావించేవారు. సమాజంలో నాగరికత అభివృద్ధి చెందే కొద్దీ అవన్నీ మనకు అసహ్యంగానే గోచరించవచ్చు. సమాజం ఎంత అభివృద్ధి చెందినా ఆనాటి ఆచారాలు ఎక్కడో ఒకచోట, ఏదో ఒక రూపంలో మనకు కన్పిస్తూనే ఉంటాయి. చివరిరోజు ప్రధానమైనది తిరుపతి గంగ జాతరలో మొదటి మూడు రోజులే తిట్లమయంగా ఉంటుంది. తర్వాత చాలా సభ్యతతో జాతర ఉత్సవాలు జరుగుతాయి. శనివారం నుంచి రకరకాలుగా జనం వేషాలు వేస్తుంటారు. మగవారు ఆడవేషంతో పాటు.. రాముడు, కృష్ణుడు వంటి అన్ని రకాల దేవుళ్ల వేషం వేస్తుంటారు. ఆదివారం రోజు మొక్కుబడి ఉన్న భక్తులు మాతంగి వేషాలు వేసుకుని వీధుల్లో చిందులు తొక్కుతారు. కైకలవారు వేసే మాతంగి వేషంలో నాలుకకు దబ్బనం గుచ్చుకుని ఊరంతా ప్రదర్శిస్తారు. అలాగే కైకలవారు ‘సున్నపు కుండలు’ వేషం వేసుకుని ఊరు మొత్తం చుడతారు. మంగళవారం ఉదయం భక్తులు తడి బట్టలతో ‘అడుగడుగుకు దండాలు’ పెడుతూ అంగ ప్రదక్షిణ చేస్తారు. ఈ గంగ జాతరలో చివరి రోజైన మంగళవారం చాలా ప్రధానమైనది. ముఖ్యమైనది. ఆ రోజు భక్తుల చప్పరాలు నెత్తిన పెట్టుకుని నాట్యం చేస్తారు. మంగళవారం రోజు పట్టణంలోని ప్రజలు పొట్టేళ్లను, కోళ్లను గంగమ్మకు బలి ఇస్తారు. గుడి ముందరే పొంగళ్లు పెట్టుకుని వస్తారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని స్త్రీలు చక్కగా అలంకరించుకుని ‘వెయ్యికండ్ల దుత్త’ (చిన్న కుండకు సన్న సన్న రంధ్రాలు పెట్టబడ్డ దుత్త) తీసుకుని, అందులోన ‘సలిబిండి ఉండ’ను పెట్టి, మధ్యలో నెయ్యి పోసి, దీపం వెలిగించుకుని, దుత్తను అరిచేతిలో పెట్టుకుని గుడికి వెళ్తారు. మంగళవారం రాత్రి ఓ స్తంభానికి గంగమ్మను బంకమట్టితో పెద్ద బొమ్మగా తయారు చేస్తారు. అర్ధరాత్రి అయ్యాక గంగమ్మ బొమ్మ చెంపను నరికి, ఆ మట్టిని ప్రజల పైకి విసురుతారు. దానిని జనం తొక్కిసలాడి తీసుకుంటారు. ఆ మట్టి వల్ల శుభం కలుగుతుందని ప్రతీతి. చివరికి పేరంటాళ్ల వేషంతో గంగమ్మ జాతర ముగుస్తుంది. ఇదే విధంగా పెద్ద గంగమ్మకు కూడా జరుగుతుంది. కాకపోతే చిన్న గంగమ్మకు ఉన్నంత ప్రాముఖ్యం ఉండదు. జనం ఉండరు. జాతర మొత్తం తాతయ్య గుంట గంగమ్మ అనబడే చిన్న గంగమ్మకే జరుగుతుంది. తిరుపతి గంగ జాతరకు వంద మైళ్ల పరిధి నుంచి జనం తండోపతండాలుగా లక్షమందికి పైగా వస్తారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వస్తుంటారు. ఆధునిక నాకరికత ప్రభావం వల్ల జాతర సందడి కాస్త తగ్గింది. నిజం చెప్పాలంటే భారతదేశంలో వారం రోజుల పాటు ఇంత వైవిధ్యభరితంగా జరిగే జాతర మరెక్కడా లేదు. ఎన్నో వేషాలు, కళారూపాలున్న ఈ జాతరను కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీదా ఉంది. – ప్రొఫెసర్ పేట శ్రీనివాసులు రెడ్డి డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు స్టడీస్శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ -
వైభవంగా నాగోబా జాతర ప్రారంభం
ఇంద్రవెల్లి (ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే మెస్రం వంశీయులు వారు బస చేసిన మర్రిచెట్టు (వడమర) నుంచి పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. మెస్రం వంశ పెద్దలు 22 కితల వారీగా కొత్త కుండలను ఇవ్వగా.. మహిళలు పెద్దల ఆశీర్వాదం తీసుకుని అందుకున్నారు. ఆ వంశ అల్లుళ్లు, ఆడపడుచులు వరుసగా వెళ్లి వడమర సమీపంలోని కోనేరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త కుండల్లో పవిత్ర జలం సేకరించి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం పక్కనే గల పాత మట్టి పుట్టలను అల్లుళ్లు తవ్వగా.. ఆ మట్టితో మహిళలు తిరిగి కొత్త పుట్టను తయారు చేశారు. తయారు చేసిన పుట్టల నుంచి మట్టిని ఉండల రూపంలో తీసుకుని ఏడు వరుసలతో బౌల దేవతను తయారు చేసి మొక్కుకున్నారు. అనంతరం ఏడు వరుసలతో తయారు చేసిన మట్టి ఉండలతో నాగోబా ఆలయం పక్కనే ఉన్న ఆలయంలో సతి దేవతల బౌలను తయారు చేసి సంప్రదాయ పూజలు చేశారు. పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని రాత్రి 9 నుంచి 11 గంటల వరకు గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేసి నాగోబాకు జలాభిషేకం చేసి మహాపూజ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు మెస్రం వంశీయులతో కలసి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు భేటింగ్ (పరిచయం) పూజలకు ఏర్పాటు చేశారు. కొత్తగా పెళ్లయిన వారు, ఇప్పటి వరకు నాగోబాను దర్శించుకోని 50 మందికి పైగా మెస్రం వంశం కోడళ్లు పాల్గొన్నారు. భేటింగ్‌తో వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్టు భావిస్తారు. -
జాతరకు పక్కాగా ఏర్పాట్లు
విజయనగరం, మక్కువ(సాలూరు): ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమాంబ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఏఎస్పీ గౌతమీశాలీ అధికారులను ఆదేశించారు. మండలంలోని శంబర గ్రామాన్ని గురువారం సందర్శించిన ఆమె ముందుగా గ్రామంలో కొలువైన అమ్మవారిని ఐపీఎస్ అధికారి సుమీత్‌తో కలసి దర్శించుకున్నారు. విశ్రాంత ఈవో నాగార్జున, ఉత్సవ కమిటీ సభ్యులు వారిని సాదరంగా స్వాగతించి, అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఏఎస్పీ గౌతమీశాలీ చదురుగుడి వెనుకన ఉన్న క్యూలైన్లను పరిశీలించారు. ఏటా ఉచితం, రూ. 10ల, రూ. 50ల క్యూలైన్లును ఒకేచోట ఏర్పాటు చేయడంతో, భక్తులు ఇబ్బందులు పడుతున్నందున, చదురుగుడి వెనుకన ఉన్న మరో రహదారి వద్ద రూ. 50లు క్యూలైన్ ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపట్టాలని విశ్రాంతి ఈవో నాగార్జునకు సూచించారు. అనంతరం గ్రామంలో సిరిమాను తిరిగే ప్రదేశాన్ని ఆమె పరిశీలించారు. సిరిమాను తిరిగే ప్రదేశాలలోని పలుకాలువలపై పలకలు లేకపోవడంతో, ఏటా భక్తులు ప్రమాదబారిన పడుతున్నారని, స్థానికులు ఆమె దృష్టికి తీసుకువెళ్లగా పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అలాగే సిరిమానును పూజారి అధిరోహించే ముందు, సుదూర ప్రాంతాలకు చెందిన వేలాది భక్తులు సిరిమాను వద్దకు వచ్చి మొక్కుబడులు చెల్లించడం ఆనవాయితీగా వస్తుందని, సిరిమాను వద్ద బారికేడ్లు, రోప్‌పార్టీ పోలీసులు ఉండటం వల్ల, భక్తుల మధ్య తోపులాటలు జరిగి, స్థానికులు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉండటం లేదని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల, వీఆర్ఎస్ ప్రాజెక్ట్ సమీపంలోని పార్కింగ్‌స్థలాలను పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులు అమ్మవారికి కోళ్లు మొక్కుబడులు చెల్లించిన అనంతరం, గోముఖీనది వద్ద కోళ్లను శుభ్రం చేయడంతోపాటు, మాంసం చేయడంతో వ్యర్ధప్రదార్ధాలు పేరుకుయి దుర్వాసర వెదజల్లి, భక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కల్గిస్తుందని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ గోముఖీనది, వనంగుడి వద్ద కోళ్లను శుభ్రంచేసేందుకు అవసరమైన ప్లాట్‌ఫాంలు ఏర్పాటుచేయడంతోపాటు, వ్యర్ధపదార్థాలు పోగుచేసేందుకు ఫిట్‌ను ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జాతరకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా, గట్టిబందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్సై షేక్‌శంకర్, ఉత్సవ కమిటీ సభ్యుడు తీళ్ల పోలినాయుడు, ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ గంజి కాశినాయుడు, ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు. శంబర జాతరపై 6న సమీక్ష పార్వతీపురం: శంబర పోలమాంబ జాతర ఏర్పాట్లకు సంబంధించి ఈ నెల ఆరోతేదీన సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు సబ్‌కలెక్టర్ టి.ఎస్.చేతన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఆరోజు ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించనున్న సమావేశానికి జాతరకు సంబంధించిన అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని ఆదేశించారు.