
ఖందేవ్ సన్నిధిలో నువ్వుల నూనె తాగుతున్న మాడవి యోత్మాబాయి
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో తొడసం వంశస్తుల ఆరాధ్య దైవం ఖందేవ్ జాతర వైభవంగా జరుగుతోంది. పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా ఏటా తొడసం వంశస్తులు ఖందేవ్ జాతర నిర్వహిస్తారు. సంప్రదాయ డోలు వాయిద్యాలతో సోమవారం మహాపూజ నిర్వహించారు. నిష్టగా ఇళ్లలోనే తయారుచేసిన నువ్వుల నూనెను రెండో రోజైన మంగళవారం ఆలయానికి తీసుకువచ్చి ఖందేవ్‌కు నైవేద్యంగా సమర్పించారు.
తర్వాత పూజలు నిర్వహించారు. తొడసం వంశానికి చెందిన ఆడపడుచు ఈ నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మండలంలోని చిత్తగూడ గ్రామానికి చెందిన మాడవి యోత్మాబాయి వరుసగా మూడోసారి రెండు కిలోల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. ఇలా మొక్కు చెల్లించుకోవడం వలన సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. వందేళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోందని ఖందేవ్ ఆలయ కమిటీ సభ్యుడు తొడసం నాగోరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment