
ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బుర్కి ఆదివాసీ గ్రామానికి సరైన రోడ్డు లేదు. చిన్నపాటి మొరం రోడ్డు గుండానే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. వర్షాకాలంలో సమస్య మరీ అధ్వానం. ఆ గ్రామానికి చెందిన యువకుడు ఆనంద్‌రావుతో.. బుధవారం దొండారిగూడెంకు చెందిన అనితతో పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకోసం ఆడపెళ్లివారు పెళ్లికూతురితో కలిసి బయల్దేరారు. కోలాంగూడ సగం దూరం వరకు ఐషర్, ద్విచక్రవాహనంపై వచ్చారు.
అక్కడినుంచి బుర్కికి వెళ్లేందుకు రోడ్డు లేకపోవడంతో.. పెళ్లికూతురితో సహా బంధువులంతా కాలినడకన బయల్దేరారు. మండుటెండలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎట్టకేలకు పెళ్లి బృందం బుర్కికి చేరుకుంది. అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. బుర్కిని ఆదివాసీ గ్రామాభివృద్ధికి దత్తత తీసుకున్నారు. ఈ గ్రామ రహదారి దుస్థితిపై ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ కూడా ఇటీవల అధికారులను ఆరా తీశారు.
– చింతల అరుణ్ రెడ్డి, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ రూరల్