
మంచిర్యాల జిల్లా: ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతుందని ఆ మహిళ ఎంతో ఆశపెట్టుకుంది. శిథిలావస్థకు చేరిన ఇంటిని తొలగించి ప్రస్తుతం నాలుగు వైపులా కర్రలు పాతి ప్లాస్టిక్ కవర్లతో గూడు ఏర్పాటు చేసుకుని ఉంటోంది. తీరా ఇల్లు మంజూరు కాకపోవడంతో ఆందోళన చెందుతోంది. మంచిర్యాల జిల్లా భీమారం మండలం మద్దికల్ గ్రామంలో బండారు లక్ష్మి ఒంటరిగా నివసిస్తోంది. ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకుంది.
శిథిలమైన ఇంటిని తొలగించి 4 నెలల క్రితం తాత్కాలిక ఆవాసం ఏర్పాటు చేసుకుంది. గ్రామంలో మొత్తం 104 మందికి ఇళ్లు మంజూరైనట్లు ప్రజాపాలన సభలో ప్రకటించారు. ఇందులో నుంచి 34 మందికి నిర్మాణాలకు అనుమతి ఇస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ జాబితాలో లక్ష్మి పేరు లేకపోవడంతో ఆమె తీవ్రంగా ఆందోళన చెందుతోంది. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలే గానీ ఆర్థికంగా ఉన్న వాళ్లకి ఎందుకు మంజూరు చేస్తున్నారని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.