
సాక్షి, మంచిర్యాల: మది నిండా కోటి ఆశలతో అత్తారింట అడుగు పెట్టింది. కొత్త జీవితం సాఫీగా సాగిపోతుందని ఎన్నో కలలు కన్నది. అడిగిన కట్నం కంటే ఎక్కువే ముట్టజెప్పినా ఆ అత్తింటి వరకట్న దాహం తీరలేదు. కాళ్ల పారాణీ ఆరకముందే ఆ నవ వధువు కలలను కల్లలు చేస్తూ అదనపు కట్నం కోసం వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఉరేసుకుని ఊపిరి తీసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. హాజీపూర్ మండలం టీకానపల్లి గ్రామానికి చెందిన కంది కవిత, శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురు శృతికి ఇదే మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధి గొల్లపల్లికి చెందిన గర్షకుర్తి సాయితో గత నెల 16న వివాహం జరిపించారు. కట్నంగా రూ.5లక్షల నగదు, ఎనిమిదిన్నర తులాల బంగారం, వెండి ఆభరణాలు, వంటసామగ్రి, ఇతర కానుకలు అందజేశారు. అనుకున్న దాని కన్న ఎక్కువే ముట్టజెప్పి ఘనంగా పెళ్లి జరిపించారు.
అయితే, పెళ్లి జరిగిన వారం రోజులకే శృతికి కష్టాలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త సాయి, అత్తమామలు లక్ష్మి, శంకరయ్యలు.. తనను మానసిక, శారీరక వేధింపులకు గురి చేశారు. పెళ్లికే ఆరు లక్షలు ఖర్చయిందని, ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల నుంచి తీసుకురావాలని వేధించారు. వారం రోజుల క్రితం శృతి తండ్రి రూ.50వేలు సాయికి అందజేశాడు.
ఇంటికి వెళ్తే బతికేది..!
మరో రూ.2 లక్షల కోసం ఒత్తిడి చేయడంతో శృతి సోమవారం తండ్రికి ఫోన్ చేసింది. శృతి తల్లిదండ్రులు ఈ నెల 20న రూ.2లక్షలు ముట్టజెప్పుతామని అంగీకరించి.. తమ కూతురును ఇంటికి తీసుకెళ్తామంటే సాయి ఒప్పుకోలేదు. దీంతో ఆ రోజు రాత్రి శృతి తల్లిదండ్రులు టీకానపల్లికి వెళ్లిపోయారు. పెళ్లయిన వారం నుంచే వేధింపులు, అదనపు వరకట్నం కోసం తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసి శృతి వేదనకు గురైంది. మంగళవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో అత్తగారింట్లోనే స్నానాల గదిలో శృతి(21) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్నానాల గది నుంచి బయటకు రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా చనిపోయి ఉంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త సాయి, అత్తమామలు లక్ష్మి, శంకరయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపారు. తన కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.