
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు కారణాలతో నలుగురు బలవన్మరణం చెందారు. అప్పుల బాధతో ఆటోడ్రైవర్, అనారోగ్యంతో ఒకరు, భార్య కాపురానికి రావడం లేదని మరొకరు ఉరేసుకున్నారు. మానసిక పరిస్థితి బాగా లేక వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
మానసిక పరిస్థితి బాగా లేక వివాహిత..
మంచిర్యాలక్రైం: మానసిక పరిస్థితి బాగాలేక వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ కిరణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని గోపాలవాడకు చెందిన కనవేణి సతీశ్, రాజమణి(35) భార్యాభర్తలు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. రాజమణి గత కొంతకాలంగా మానసికంగా బాధపడుతుంది. ఆస్పత్రుల్లో చూయించినా నయం కాలేదు. ప్రతీరోజు భయం, భయంగా ఉంటుంది. తమ్ముడు రఘువర్ధన్ గమనించి అక్క రాజమణికి ధైర్యం చెప్పేవాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. మృతురాలి తమ్ముడు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అప్పుల బాధతో ఆటోడ్రైవర్
బజార్‌హత్నూర్: అప్పుల బాధతో ఆటోడ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అప్పారావ్ తెలిపారు. ఎస్సై, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు..మండలంలోని జాతర్ల పంచాయతీ పరిధి రాంనగర్ గ్రామానికి చెందిన భగత్ సంతోష్ (36) ఆటో నడుపుకుని జీవనం కొనసాగిస్తుండేవాడు. కుటుంబ పోషణకు, ఆటో కొనుగోలుకు రూ.4 లక్షలు ప్రైవేటు అప్పులు చేయగా వడ్డీలు పెరిగాయి. ఆదాయం అంతంత మాత్రమే ఉండటంతో అప్పు ఎలా తీర్చాలో మదనపడేవాడు. గురువారం ఉదయం గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. భార్య రోజా ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అనారోగ్యంతో ఒకరు, భార్య కాపురానికి రాలేదని మరొకరు
భైంసాటౌన్: భైంసా రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ నైలునాయక్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. ఇలేగాం గ్రామానికి చెందిన అవదూత్ పెద్ద పోశెట్టి(60) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బుధవారం సాయంత్రం తన ఇంట్లో ఉరేసుకున్నాడు. అలాగే దేగాంకు చెందిన ఇరగదెండ్ల ప్రవీణ్ (27) భార్య కాపురానికి రావడం లేదని బుధవారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment