
భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
సోదరుడికి ఫోన్ చేయడమే శాపమైందా..?
విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యుల ఆందోళన
అదనపు కలెక్టర్, పోలీసుల జోక్యంతో విరమణ
మంచిర్యాలక్రైం: ఫోన్ కాల్ విషయమై జరిగిన రచ్చ ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగంపల్లి గోపాల్, నాగమ్మ దంపతుల రెండో కూతురు లక్ష్మీప్రసన్న మంచిర్యాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకింది.
కళాశాల విద్యార్థులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం చనిపోయింది. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు కళాశాల సిబ్బంది, నైట్‌వాచ్‌మెన్ మహేశ్ వేధింపులే కారణమంటూ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆస్పత్రికి చేరుకోగా.. విద్యార్థిని తండ్రి గోపాల్ ఆయన కాళ్లపై పడి న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు.
లక్ష్మీప్రసన్నమృతికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రూ. 20లక్షలు పరి హా రం, కుటుంబంలో ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇవ్వాలని అ న్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, నా యకులు పాల్గొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మా ట్లాడిన అదనపు కలెక్టర్.. న్యాయం చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వెల్లడించారు.
అసలేం జరిగింది..
ఈ నెల 23న రాత్రి 9.30గంటలకు లక్ష్మీప్రసన్న తన చిన్నమ్మ కొడుకు వెంకటేష్‌కు వాచ్‌మెన్ మహేశ్ సెల్‌ఫోన్ నుంచి ఫోన్ చేసింది. తర్వాత 9.45గంటలకు వెంకటేష్ వాచ్‌మెన్‌కు ఫోన్ చేసి ఇంత రాత్రి ఫోన్ ఎందుకు ఇచ్చావంటూ బెదిరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ మేనేజర్ మల్లేష్‌కు ఫోన్ ద్వారా వెంకటేష్ ఫిర్యాదు చేయడం, మహేశ్‌పై మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని బెదిరించడం, ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ అనూష దృష్టికి తీసుకెళ్లడం వరకు వెళ్లాయి. అయితే ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, వాచ్‌మెన్ మహేశ్ లక్ష్మీప్రసన్నపై ఒత్తిడి చేసి వేధించారని, భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, విద్యార్థిని చిన్నమ్మ కొడుకు వెంకటేష్ ఆరోపించారు.