
భార్య పురిటి కోసం వచ్చి దుర్మరణం చెందిన ఆర్మీ జవాన్
తమ్ముడి అత్త అంత్యక్రియలకు వెళ్తూ మరో వ్యక్తి..
ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్ర వాహనాలు
మంచిర్యాల జిల్లా దొరగారిపల్లెలో ఘటన
రెండు కుటుంబాల్లో విషాదం నింపిన రోడ్డు ప్రమాదం
తండ్రిని కాబోతున్నాననే ఆనందంతో ఆర్మీ జవాన్ సెలవుపై వచ్చాడు. సోమవారం భార్య ప్రసవానికి వైద్యులు సమయం ఇచ్చారు. కానీ ఒక్క రోజు ముందే ఆదివారం రాత్రి మృత్యువు వెంటాడింది. నాన్న అనిపించుకోకుండానే ఆ ఆర్మీ జవాన్‌ను రోడ్డు ప్రమాదం కబళించింది. ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో అతడితోపాటు మరొకరు చనిపోయారు.
నస్పూర్: తెల్లవారితే తనకు పుట్టబోయే బిడ్డను ఎత్తుకుని మురిసిపోదామనుకున్న ఒకరు నాన్న అనే పిలుపునకు నోచుకోకుండానే, తన సోదరుని అత్త మరణ వార్త తెలుసుకుని అతన్ని ఓదార్చుదామనుకున్న మరోవ్యక్తిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్న సంఘటన మంచిర్యాల జిల్లాలోని దొరగారిపల్లెలో చోటు చేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని దొరగారి పల్లెకు చెందిన ముల్క ఉదయ్ ఆదివారం రాత్రి పని నిమిత్తం బైక్‌పై మంచిర్యాలకు వెళ్లి వస్తుండగా అదే గ్రామానికి చెందిన పత్తి నర్సింహ తన భార్య రమాదేవితో కలిసి ద్విచక్ర వాహనంపై గద్దెరాగడికి బయలుదేరాడు. దొరగారిపల్లె గ్రామ సమీపంలో 200 పీట్ల సర్వీస్ రోడ్డు వద్దకు రాగానే ఇరువురి వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఉదయ్, నర్సింహ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
భార్య డెలివరీకి వచ్చి...
ముల్క ఉదయ్ భోపాల్ రాష్ట్రంలో ఆర్మీ జవానుగా ఉద్యోగం చేస్తున్నాడు. మంచిర్యాలకు చెందిన పావనితో 2022లో వివాహమైంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. ఆమె డెలివరీ కోసం పదిరోజుల క్రితం ఇంటికి వచ్చాడు. వైద్యులు ఆమెకు సోమవారం డెలివరీ సమయం ఇచ్చినట్లు సమాచారం. తెల్లవారితే తనకు ముద్దులొలికే చిన్నారి జన్మిస్తుందని అతను కన్న కలలు నెరవేరకుండానే ఇలా మృత్యువు కబలించడం కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది.
సోదరుని పరామర్శించేందుకు వెళ్తూ...
నస్పూర్‌కాలనీలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న పత్తి నర్సింహకు 2014లో రమాదేవితో వివాహమైంది. గద్దెరాగడిలో నివాసం ఉండే తన సోదరుని అత్త మృతి చెందిన విషయం తెలుసుకున్న నర్సింహా ఆదివారం రాత్రి రమాదేవిని బైక్‌పై ఎక్కించుకుని గద్దెరాగడికి బయలుదేరాడు. నర్సింహను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడం, అతని భార్య గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.
గ్రామంలో విషాదం..
ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ఒకే ప్రమాదంలో మృతి చెందడంతో దొరగారి పల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment