
జమ్మికుంట(హుజూరాబాద్): పరిపక్వతలేని ప్రేమ వ్యవహారం ఇద్దరి ప్రాణం తీసింది. ఇరు కుటుంబాల్లో ఎలాంటి నిర్బంధాలు లేవని, వారి ఫిర్యాదులతో తెలుస్తోంది. అయినా ఎందుకు ప్రాణాలు తీసుకున్నారో తేలాల్సి ఉందనే సందేహం కలుగుతోంది. జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్, పాపయ్యపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శనివారం రాత్రి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మంచిర్యాల రైల్వే పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన మెనుగు రాహుల్ (18)కు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఏరుచింతల గ్రామానికి చెందిన గోలేటి శ్వేత(20)తో పరిచయం ఏర్పడింది.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫెయిల్ అయిన రాహుల్ హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ బల్బస్ ఈవెంట్ వర్క్స్ చేస్తుంటాడు. ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి ఇంటికి వద్ద ఉంటున్నాడు. శ్వేత కరీంనగర్‌లోని ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. శివరాత్రి పండుగకు ఇంటికి వెళ్లిన శ్వేత ఇటీవల కరీంనగర్ కళాశాలకు వచ్చింది. కాగా శనివారం రాత్రి ఇద్దరూ జమ్మికుంట మండలం పాపయ్యపల్లి శివారులోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధపడ్డారు.
గూడ్స్ డ్రైవర్ హారన్ మోగించినా పట్టాల పైనుంచి జరగకుండా ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. వీరి మధ్య ప్రేమ ఎక్కడ, ఎలా చిగురించిందో తెలియదుగానీ, ఇద్దరూ ఏ నిర్బంధాలు లేకుండానే సున్నిత మనస్తత్వంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని రాహుల్ తండ్రి రాజు ఫిర్యాదు ఇవ్వగా.. ఏ కారణంతో చనిపోయిందో తెలియదని మృతురాలి తండ్రి రాజలింగు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఏదిఏమైనా ఇద్దరి ఆత్మహత్య ఘటన కారణాలు లేకుండా మిస్టరీగా మారింది. ఇద్దరి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఆత్మహత్యలపై రైల్వే పోలీస్ విచారణలో తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మంచిర్యాల రైల్వే పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మహేందర్, రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి ఆదివారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment