క్షుద్రపూజలు చేస్తున్న దృశ్యం
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో క్షుద్రపూజలు వికటించి ఓ యువకుడు మృతిచెందాడు. చెన్నూర్ పట్టణం బొక్కగూడెం కాలనీకి చెందిన దంపతులు దాసరి లచ్చన్న, లక్ష్మి కుమారుడు మధు (33) గత 20 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంచిర్యాలలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఆరోగ్యం కుదుటపడలేదు. మధుకు చేతబడి అయిందని బంధువులు చెప్పడంతో శనివారం సాయంత్రం సీసీసీ నస్పూర్ ప్రాంతానికి చెందిన క్షుద్ర మాంత్రికుడిని ఆశ్రయించారు.
ఇంటి వద్ద పూజల్లో భాగంగా మధుపైనుంచి కోడిని తిప్పడంతో అది చనిపోయింది. దీంతో దెయ్యం పట్టిందని, పెద్ద పూజలు చేయాలంటూ చెప్పడంతో ఆదివారం చెన్నూర్ గోదావరి ఒడ్డున మేకతోపాటు పలు క్షుద్రపూజలకు సంబంధించిన సామగ్రితో వెళ్లారు. పూజలు చేసే క్రమంలో మాంత్రికుడు మధుకు గుగ్గిలం (సాంబ్రాణి) పొగ వేసి పైనుంచి దుప్పటి కప్పినట్లు తెలిసింది. పొగతో మధు స్పృహ కోల్పోయి కాసేపటికే మృతిచెందాడు.
దీంతో సదరు మాంత్రికుడు పారిపోయాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని రాత్రి ఇంటికి తీసుకొచ్చి సోమవారం అంత్యక్రియల కోసం గోదావరి నదికి తీసుకెళ్లారు. పోలీసులకు విషయం తెలియడంతో నది వద్దే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీఐ వాసుదేవరావును సంప్రదించగా.. క్షుద్రపూజలతో మృతిచెందాడన్న సమాచారం మేరకు పోస్టుమార్టం చేయించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని వివరించారు.
చదవండి: చాక్లెట్ కోసమని ఫ్రిడ్జ్ తెరిస్తే.. షాక్‌తో చిన్నారి మృతి
Comments
Please login to add a commentAdd a comment