
ఆదిలాబాద్ జిల్లా: వివాహం చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క చాలా మంది యువకులు ‘పెళ్లి కాని ప్రసాద్‌లు’గా మిగిలిపోతున్నారు. కొందరు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ఒక వైపు పరిస్థితులు ఇలా ఉంటే.. మరో వైపు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గిరిజన యువకుడు ఇద్దరు యువతులతో ప్రేమాయణం నడిపి, ఇద్దరినీ ఒకే మండపంలో వివాహం చేసుకున్నాడు.
జైనూర్ మండలం అడ్డెసరాకు చెందిన ఆత్రం రంభబాయి, భాద్రుషావ్ దంపతుల కుమారుడు ఆత్రం చత్రుషావ్.. అదే గ్రామానికి చెందిన సెడ్మకి సోమిత్రబాయి, భీంరావ్‌ల కుమార్తె జంగుబాయి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన గోడం రంభబాయి, యాదోరావ్ కుమార్తె సోన్‌దేవితో చత్రుషావ్‌కు పరిచయం ఏర్పడింది.
వీరిద్దరి మధ్య ఏడాదిగా ప్రేమాయణం సాగుతోంది. విషయం తెలుసుకున్న జంగుబాయి రాయిసెంటర్‌ను ఆశ్రయించింది. రాయిసెంటర్ పెద్దలు 15 రోజుల క్రితం మూడు కుటుంబాలతో చర్చించారు. యువతులిద్దరూ చత్రుషావ్‌తో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నారు. దీంతో గురువారం బంధువుల సమక్షంలో వరుడి స్వగృహంలో వీరికి వివాహం జరిపించారు. కాగా, ఇటీవల ఇదే జిల్లాలో సిర్పూర్(యూ) మండలం గుంనూర్ (కె)కు చెందిన ఓ యువకుడు కూడా ఇద్దరు యువతులను పెళ్లి చేసుకోవడం తెలిసిందే.