
మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు
కౌటాల(సిర్పూర్): ‘మమ్మల్ని బతకనివ్వండి’ అంటూ కౌటాల మండల కేంద్రంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ఆదివాసీ యువజన సంఘం పేరుతో పోస్టర్లు వెలిశాయి. కౌటాలలో పలుచోట్ల గోడలపై గురువారం అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు వీటిని అతికించారు. ‘నిత్యం ఆదివాసీ ప్రజలపై ఆధారపడి బతికే మీరు అడవుల్లో విచ్చలవిడిగా మందుపాతరలు పెట్టడం సరికాదు.. ఇదేనా మీ సిద్ధాంతం అంటూ’ ఆదివాసీ సంఘాల పేరుతో ప్రశ్నలు సంధించారు.
మందుపాతరలతో అమాయకు లు మృతిచెందారని, కొంతమంది ఆదివాసీలు శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారని పేర్కొన్నారు. ‘మేము అడవుల్లోకి వెళ్లకుండా ఇంకెక్కడి కి వెళ్లాలి.. మీరు తలదాచుకోవడానికి మా ప్రాంతాలే దొరికాయా.? భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను నియంత్రించే అధికారం మీకెక్కడిది, ఆదివాసీలు బతికేదెలా..’ ‘మా ప్రాంతాలపై మీ పెత్తనం ఏంటి, తరతరాలుగా ఆదివాసీలకు మావోయిస్టులకు జరుగుతున్న నష్టాలను ముక్తకంఠంతో ప్రశ్నిద్దాం’ అని రాశారు. కాగా ఈ పోస్టర్లు ఎవరు అతికించారనే కోణంలో జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.