లక్ష్మిపై దాడిచేసిన పులి అక్కడికి కొత్తగా వచ్చింది: కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్
పులి దాడితో అడవి సమీప గ్రామాల్లో భయాందోళన
చేలల్లోకి వెళ్లలేకపోతున్నామని రైతుల ఆవేదన
నాలుగేళ్లలో పులుల దాడిలో నలుగురు మృతి
ఏటా నవంబర్‌లోనే దాడులు చేస్తున్న పులులు.. పత్తి చేలో పత్తి తీసే కూలీలపైనే అధిక దాడులు
కూలీలపై పులి దాడి అవకాశాలు, జాగ్రత్తలపై ఇటీవలే ‘సాక్షి’ కథనాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ కాగజ్‌నగర్ రూరల్: పులి పంజాకు ఓ యువతి బలైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి (21) శుక్రవారం నజ్రుల్ నగర్ విలేజ్ నంబర్ 13–11 మధ్య తన సొంత పత్తి చేలో పత్తి తీస్తుండగా.. ఉదయం 7 గంటల సమయంలో అడవి నుంచి వచ్చిన పులి ఆమెపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మిని స్థానికులు దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందింది. లక్ష్మిపై పులి దాడి చేయటాన్ని గుర్తించిన తోటి కూలీలు.. గట్టిగా కేకలు వేసి సమీప గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో కొందరు వ్యక్తులు కర్రలతో వచ్చి పులిని బెదిరించటంతో లక్ష్మిని వదిలి అది అడవిలోకి పారిపోయింది.
లక్ష్మికి గన్నారం గ్రామానికి చెందిన వాసుదేవ్‌తో ఏడాది క్రితమే వివాహం అయ్యింది. లక్ష్మి మృతితో ఆగ్రహించిన ఆమె బంధువులు కాగజ్‌నగర్ అటవీశాఖ కార్యాలయం ముందు నాలుగు గంటలపాటు ఆందోళనకు దిగారు. లక్ష్మి కుటుంబానికి రూ.పది లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కలి ్పస్తామని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్ హామీ ఇవ్వటంతోఆందోళన విరమించారు. లక్ష్మిపై దాడిచేయటానికి ముందే విలేజ్ నం.9 ప్రాంతంలో బిజన్ బర్మెన్‌కు చెందిన ఆవును పులి హతమార్చింది. గ్రామాలకు సమీపంలో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
నాలుగేళ్లలో నలుగురు మృతి
మహారాష్ట్ర అడవుల నుంచి వస్తున్న పెద్ద పులులు మనుషులపై దాడులుచేస్తూ చంపేస్తున్నాయి. గత నాలుగేళ్లలో పులుల దాడిలో నలుగురు మరణించారు. మృతులంతా కూలీలు, రైతులే కావటం గమనార్హం. అదికూడా పత్తి చేలు కోతకొచి్చన సమయంలోనే పులులు దాడులు చేస్తున్నాయి. 2020 నవంబర్ 11న ఓ మగపులి దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్ (21)పై దాడిచేసి చంపేసింది. ఈ ఘటన జరిగిన 18 రోజులకే అదే నెల 29న పెంచికల్‌పేట్ మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల (18) పత్తి చేలో పత్తి తీస్తుండగా పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఇద్దరిని చంపిన పులిని బంధించే ప్రయత్నం చేసినా చిక్కలేదు. మరో పులి 2022 నవంబర్ 15న వాంకిడి మండలం ఖానాపూర్‌కు చెందిన సిడాం భీము (69)పై దాడి చేసి ప్రాణాలు తీసింది. తాజాగా మోర్లె లక్ష్మి (21)పైనా నవంబర్ నెలలోనే దాడి జరిగింది. లక్ష్మిపై దాడిచేసిన పులి ఇటీవలే మహారాష్ట్ర అడవుల నుంచి ఇక్కడికి వచి్చనట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
పత్తి కూలీలపైనే అధిక దాడులు
పత్తి చేలకు ఉదయం పూటే కూలీలు వెళ్తుంటారు. కూలీలుఒకే చోట గుంపుగా కాకుండా ఎక్కువగా పత్తి ఉన్న చోట్లకు వేరుపడి పత్తి తీస్తుంటారు. ఏపుగా పెరిగిన మొక్కల మధ్య కూలీలు వంగి పని చేస్తారు కాబట్టి.. పులి సమీపానికి వచ్చేవరకు గుర్తించలేకపోతున్నారు. గతంలో జరిగిన దాడులన్నీ వెనకవైపు నుంచి జరిగినవే. పులి వెనుకనుంచి వచ్చి పంజాతో బలంగా కొట్టడంతో ఎవరూ ప్రాణాలతో బయటపడడం లేదు. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు గతంలో కూలీలకు తల వెనకభాగంలోనూ మనిషి తల మాదిరి ఉండే మాస్కులు ఇచ్చారు. డప్పు చప్పుళ్లతో శబ్దాలు చేసేవారు.
‘వామ్మో.. పులి చంపిందే’
పత్తి తీయడానికి 12 మందిమి వెళ్లాం. ఉదయం 7గంటల సమయంలో పత్తి తీస్తుండగానే చప్పుడు లేకుండా పులి ఒక్కసారిగా లక్ష్మిపై దాడి చేసింది. లక్ష్మి ఒక్కసారిగా ‘వామ్మో.. పులి చంపిందే’అంటూ అరిచింది. మేము అటువైపు చూస్తుండగానే పంజా విసిరి లక్ష్మి మెడను కొరికింది. రక్తాన్ని పేల్చివేసింది. మేం పక్కనే ఉన్న విలేజ్ నం.11కు వెళ్లి విషయం చెప్పటంతో కొందరు కర్రలు తీసుకుని వచ్చి పులిని తరిమేశారు.
– వడాయి లక్ష్మి, ప్రత్యక్ష సాక్షి, గన్నారం
గందరగోళంతోనే చేన్ల వైపు...
సాధారణంగా పులులు మనుషులపై దాడులు చేయవు. కొన్ని పరిస్థితుల్లోనే దాడి చేస్తాయి. మహిళపై దాడి చేసింది కొత్త పులి. రెండు రోజులుగా ఇక్కడే తిరుగుతోంది. దీనిపై స్థానికులను అప్రమత్తం చేశాం. కానీ కొందరు పులిని ఫొటోలు, వీడియోలు తీశారు. గందరగోళంలోనే చేన్ల వైపు వెళ్లి దాడి చేసి ఉండొచ్చని అనుకుంటున్నాం. బాధిత కుటుంబానికి రూ.పది లక్షల పరిహారం, ఉద్యోగం కల్పస్తాం.
–శాంతారామ్, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్టు టైగర్, కవ్వాల్ టైగర్ రిజర్వు
Comments
Please login to add a commentAdd a comment