Big tigers
-
హైవేపై పెద్దపులిని ఢీకొన్న కారు
మర్రిపాడు/ఆత్మకూరు రూరల్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి సమీపంలో నెల్లూరు–ముంబయి జాతీయ రహదారిపైకి ఒక్కసారిగా పెద్దపులి రావడం కలకలం రేగింది. ఆ పులిని ఓ కారు ఢీకొనడం.. ఆగ్రహంతో పెద్దపులి తిరిగి ఆ కారుపై దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఆకస్మిక ఘటనతో కారులో ప్రయాణిస్తున్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కారులో ఉన్న వ్యక్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఓ కారుకు కదిరినాయుడుపల్లి సమీపంలో వెలిగొండ అటవీ ప్రాంతం వద్ద ఒక్కసారిగా పెద్దపులి అడ్డువచ్చింది.పెద్దపులిని కారు ఢీకొని కొద్దిదూరం ముందుకు దూసుకువెళ్లింది. దీంతో పెద్దపులికి కోపం వచ్చి వాహనం ముందు భాగంపై తన పంజాతో దాడి చేసింది. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో లోపల ఉన్నవారికి ప్రమాదం తప్పింది. కారు ముందుభాగం ధ్వంసమైంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.పెద్దపులి కాలి ముద్రలు, కారు ఢీకొనడం వల్ల పులి గాయపడినట్లుగా ఆనవాలు కనుగొని ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. అటవీశాఖ అధికారులు కదిరినాయుడుపల్లి సమీపంలోని అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. పెద్దపులి సంచారంతో కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతం సమీపంలోని పడమటినాయుడుపల్లి, చుంచులూరు తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.శేషాచలం చేరిన పెద్దపులి!శ్రీశైలం–శేషాచలం మధ్య పెద్దపులుల కారిడార్ ఉంది. శ్రీశైలం–నాగార్జున సాగర్ అభయారణ్యం నుంచి శేషాచలం వరకు పులుల విస్తరణ కోసం అధికారులు పలు చర్యలు చేపట్టారు. అయితే, శేషాచలం వరకు పెద్దపులి వెళ్లిందా.. లేదా.. అని ఇప్పటికీ సంశయంగానే ఉండేది. ఆ అనుమానాలకు తెరదించుతూ శేషాచలం అటవీ ప్రాంతం వరకు పెద్దపులి చేరిందని కదిరి నాయునిపల్లె సమీపంలో సోమవారం జరిగిన ఘటనతో స్పష్టమైంది. -
కారుపై పెద్దపులి దాడి..
-
దడ పుట్టిస్తున్న బెబ్బులి
సాక్షి, ఆసిఫాబాద్: దాదాపు తొమ్మిది నెలల విరా మం తర్వాత జిల్లాలో మళ్లీ బెబ్బులి దాడులు మొదలయ్యాయి. పెద్దపులి సంచారంతో జిల్లాలోని అటవీ ప్రాంతాల సమీప గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా గత నెల రోజులుగా కాగజ్‌నగర్ మండల పరిసరాల్లో పులి సంచరిస్తోంది. మూడు రోజుల కిందట అంకుసాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో ఆవుపై దాడి చేసి చంపేసింది. పశువులు, మేకలను హతమారుస్తుండడంతో గ్రామీణులు భయంతో హడలెత్తిపోతున్నారు. పులి సంచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు దాని కదలికలపై నిఘా ఉంచారు. జనావాసాల్లో సంచారం.. గత నాలుగైదేళ్లుగా జిల్లాలో పెద్దపులుల సంచారం పెరిగింది. జిల్లాలో వ్యాపించి ఉన్న అభయారణ్యాలు కూడా జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు కారిడార్‌గా పనిచేస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి ఆహారం, తోడును వెతుకుంటూ వలస వస్తున్నాయి. ఒక్కోసారి పులులు జనావాసాల్లోకి వస్తూ ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. గతేడాది నవంబర్‌లో కాగజ్‌నగర్ పట్టణంలోకి పెద్దపులి వచ్చింది. అటు నుంచి నజ్రూల్‌నగర్, ఈస్గాం సమీపంలోని అనుకోడ గ్రామ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. మళ్లీ అదే పులి రాస్పెల్లి గ్రామంలో పత్తి చేన్లలో నక్కి ఉండగా రైతుల కంట పడింది. ఈ క్రమంలో సిర్పూర్(టి) మండలం చీలపెల్లి గ్రామంలో ప్రత్యక్షమైంది. ఆ తరువాత చింతలమానెపల్లి మండలం బాబాసాగర్, బెజ్జూర్ మండలం కుకుడా గ్రామంలో పులి ప్రజల కంట పడింది. అప్పట్లో వాంకిడి మండలం చౌపన్‌గూడ పంచాయతీ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో పంట చేనులో పని చేసుకునేందుకు వెళ్లిన సిడాం భీము అనే గిరిజన రైతుపై దాడిచేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఆ పులే కాగజ్‌నగర్ డివిజన్ పరిసరాల వైపు వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవ్వడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జత కట్టే సమయంలో మరింత జాగ్రత్త.. పెద్దపులులు సహజంగా చల్లటి వాతావరణ పరిస్థితుల్లోనే ఆడ పులులతో జత కట్టేందుకు ఇష్టపడతాయి. ముఖ్యంగా నవంబర్ నుంచి జనవరి మధ్య మూడు నెలల కాలంలో పులులు జతకట్టేందుకు(మేటింగ్) తహతహలాడుతాయని వన్యప్రాణి సంరక్షణ అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో ఆడ పులులను వెతుకుంటూ తిరిగే మగ పులి దూకుడుగా ఉంటుందని ఆ క్రమంలో ఆహారం నీరు దొరకని పరిస్థితుల్లో ఏది తారసపడినా(మనుషులైనా) దాడికి పాల్పడుతుందని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కసారి మనిషి రక్తాన్ని రుచి మరిగితే తరుచూ జనావాసాల పరిసరాల్లోనే సంచరిస్తుంటాయని చెబుతున్నారు. అంతేకాదు సులభంగా లక్ష్యంగా మారే పశు సంపదను కూడా చంపి తింటాయంటున్నారు. కాబట్టి పులులు జట్టు కట్టే సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. వరుస దాడులు.. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులులు ఉన్నాయి. అవి కాగజ్‌నగర్, సిర్పూర్(టి), చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల్లోని గ్రామాల్లో ఎక్కువగా సంచరిస్తున్న సంగతి తెలిసిందే. గత గురువారం కాగజ్‌నగర్ మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన హన్మంతు తన అవును శివారు ప్రాంతంలో మేతకు వదలగా పులి దాడి చేసి హతమార్చింది. గత నెల రోజుల్లో పులి దాడిలో మూడు మేకలు, ఐదు ఎద్దులు మృతి చెందినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే జనావాసాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అప్రమత్తంగా ఉండాలి.. అటవీ ప్రాంతాల్లోకి అవులు, మేకలను మేత కోసం తీసుకెళ్లే కాపరులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా అడవి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయొద్దు. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పులులు తిరుగుతున్నందున ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలి. పులి సంచరిస్తున్నందున గ్రామస్తులు రాత్రిపూట ఒంటరిగా బయట తిరగొద్దు. – విజయ్‌కుమార్, ఎఫ్‌డీవో, కాగజ్‌నగర్ -
వైజాగ్ జూపార్క్‌లో "టైగర్ జానకి" మృతి
విశాఖపట్నం: జూ పార్కులో జానకి(22) అనే ఆడ పెద్ద పులి వృద్ధాప్యంతో శనివారం మృతి చెందింది. జూలో ఎన్‌క్లోజర్‌లో హుషారుగా తిరుగుతూ సందర్శకులను అలరించే జానకి కొన్ని నెలలుగా ఆనారోగ్యానికి గురైంది. జూ వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించినా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. వృద్ధాప్య కారణంగా అనారోగ్యానికి గురై కొన్ని రోజులుగా ఆహారం కూడా తినలేదని జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. ప్రస్తుతం జూలో మూడు పెద్ద పులులున్నట్లు పేర్కొన్నారు. -
రాష్ట్రంలో పెద్ద పులుల గాండ్రింపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద పులులు సందడి చేస్తున్నాయి. తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లు కలిపి 2018 టైగర్ సెన్సస్‌లో 26 పులుల జనాభాతో పోల్చితే తాజాగా 2022లో చేసిన సెన్సెస్‌లో వాటి సంఖ్య 30కు పైగా చేరుకుని ఉంటుందని అంచనా వేస్తున్నారు. సంఖ్యాపరంగా ఇది ఎంతో వృద్ధి చెందినట్టుగా భావించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ప్రాజెక్ట్ టైగర్’ను ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం మైసూరులో ప్రధాని మోదీ ‘50 ఇయర్స్ ఆఫ్ టైగర్ ప్రాజెక్ట్’పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022’సర్వే రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఈ సర్వేలో ‘పులుల ఉనికి’, అవి స్థిరనివాసం ఏర్పరుచుకోడానికి అమ్రాబాద్‌లో అత్యంత సానుకూల పరిస్థితులున్నట్టు వెల్లడైంది. పులుల కదలికలు, ఇతర అంశాలను తెలియజేసే మ్యాప్‌ల్లోనూ అమ్రాబాద్‌లో పులుల మనుగడ, సంరక్షణకు ఆరోగ్యకరమైన వాతావరణమున్నట్టు స్పష్టమైంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్న పులులు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. అమ్రాబాద్ వెరీగుడ్లోకి.. గతంలో గుడ్ కేటగిరీలో ఉన్న అమ్రాబాద్ వెరీగుడ్లోకి, కవ్వాల్ గుడ్ కేటగిరిలోనే కొనసాగినట్టు వెల్లడైంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ నిర్వహణకు సంబంధించిన మరి కొన్ని పాయింట్లు సాధించి ఉంటే వెరీగుడ్ కేటగిరిలోకి వెళ్లి ఉండేదని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. 2018లో అమ్రాబాద్‌లో 18, కవ్వాల్‌లో 8 పులులు ఉన్నట్టుగా అప్పటి నివేదిక ద్వారా తెలిసింది. 2022 నాటికి ఒక్క అమ్రాబాద్‌లోనే 26కు పైగా పెద్దపులులు (4 పులి పిల్లలతో సహా), కవ్వాల్‌లో, టైగర్ కారిడార్ ఏరియాలు కలిపి ఆరేడు పెద్దపులులు ఉండొచ్చునని అధికారులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తంగా చూస్తే పులుల సంఖ్య వృద్ధితో పాటు వాటికి పరిరక్షణకు అనుకూల వాతావరణముందని సాక్షికి అటవీశాఖ వైల్డ్ లైఫ్ ఓఎస్డీ ఎ.శంకరన్ తెలిపారు. కాగా, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వెరీగుడ్ నుంచి ఎక్స్లెంట్ కేటగిరీలోకి వెళ్లేందుకు బేస్‌క్యాంప్‌ల సంఖ్యను గణనీయంగా పెంచాల్సి ఉందని డీఎఫ్‌వో రోహిత్ గొప్పిడి అభిప్రాయపడ్డారు. -
కట్టెల కోసం వెళ్తే కబళించిన పులి.. అటవీ సిబ్బంది క్వార్టర్స్ వద్దే ఘోరం!
సాక్షి, కర్ణాటక: మైసూరు జిల్లాలో ఇప్పటికే చిరుత పులులు అనేకమందిని పొట్టనపెట్టుకుంటూ ఉంటే, మరోవైపు పెద్ద పులులు కూడా జనం మీద పడుతున్నాయి. ఓ పులి యువకున్ని చంపిన సంఘటన మైసూరు జిల్లాలో హెచ్డీ కోటె పరిధిలో డీబీ కుప్ప వద్ద నాగరహోళె అడవుల్లోని బళ్ళె ప్రాంతంలో ఆదివారం జరిగింది. మరణించిన యువకుడిని మంజుగా (18) గుర్తించారు. వివరాలు... అటవీ శాఖకు చెందిన వసతి గృహాల వెనుక భాగంలో ఉన్న అడవిలో మంజు స్నేహితులతో కలిసి కట్టెల కోసం వెళ్లాడు. అటువైపు వచ్చిన పులి మంజు పైన దాడి చేసింది. తల వెనుకాల భాగంలో కొరికి, పంజాలతో చీల్చడంతో తీవ్రగాయాలై ప్రాణాలు వదిలాడు. అతని వెంట వచ్చిన మరికొంత మంది యువకులు అక్కడినుంచి పరుగులు పెట్టారు. అంతకుముందు మంజు అరుపులకు సమీపంలోని అటవీ సిబ్బంది వచ్చారు. వారిని చూసిన పులి మంజును వదిలి వెళ్ళిపోయింది. అటవీ సిబ్బంది వెంటనే మంజు మృతదేహాన్ని అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. అంతరసంత పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. స్థానికుల ధర్నా.. క్వార్టర్స్ వెనుకలే పులి తిరుగుతున్నా అటవీ సిబ్బంది పట్టించుకోలేదని, అందుకే యువకుడు బలయ్యాడని స్థానిక ప్రజలు అటవీ అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరు– చామరాజనగర రహదారిపై రాస్తారోకో చేయడంతో వాహనాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో పోలీసు, అటవీ ఉన్నతాధికారులు చేరుకుని రూ. 15 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. -
Amrabad: అడవిపై ఈ–కన్ను.. ఎక్కడి నుంచైనా లైవ్‌లో వీక్షించే అవకాశం
►పగటి వేళ చెరువులో కొంతసేపు జలకాలాటలు ఆడిన ఓ పెద్దపులి, ఆ తర్వాత ఒడ్డునే ఉన్న ఓ చెట్టుకు శరీరం, తల రుద్దుకుంటూ సేదతీరింది. ►ఓ నీటిగుంటలో ఒక సాంబార్ జింక నిద్రిస్తుండగా అడవి కుక్కలు దాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేశాయి. క్షణాల్లోనే అప్రమత్తమైన ఆ జింక వేగంగా తప్పించుకోవడంతో అడవి కుక్కలు నిరాశగా వెళ్లిపోయాయి. ►ఒకచోట రెండు, మూడు పులులు తమ పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేశాయి. ►ఎఫ్–6 (పులి) రాత్రి వేళ స్వేచ్ఛగా సంచరించడం స్పష్టంగా కన్పించింది. ►కొన్ని జంతువులు ఇతర జంతువులపై దాడికి దిగి, ఆకలి తీరాక పక్క నుంచి బలహీనమైన ఇతర వన్యప్రాణులు వెళుతున్నా పట్టించుకోలేదు. ►ఇలాంటి అనేక వీడియోలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో కెమెరాల్లో రికార్డయ్యాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2,611 చ.కి.మీ పరిధిలో విస్తరించి పెద్దపులుల అభయారణ్యంగా పేరుగాంచిన ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో పటిష్ట పరిచిన ఎల్క్ట్రానిక్–ఐ (ఈ–కన్ను) నిఘా వ్యవస్థ సత్ఫలితాలనిస్తోంది. పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల కదలికలు తెలుసుకునేందుకు, వాటి సంరక్షణకు.. అటవీ ఆక్రమణలు, జంతువుల వేట, కలప స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు బాగా ఉపయోగపడుతోంది. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కొంతకాలం క్రితమే ప్రయోగాత్మకంగా ఏటీఆర్‌లో అధికారులు ప్రారంభించారు. ప్రస్తుతానికి పది కెమెరాలను వినియోగంలోకి తీసుకురాగా.. పులులు, ఇతర జంతువులకు సంబంధించి వచ్చిన లైవ్ వీడియోలు, ఫొటోలు అబ్బురపరిచే విధంగా ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఎక్కడినుంచైనా పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో పెద్దసంఖ్యలో అటవీ సిబ్బందిని నియమించాల్సిన అవసరం లేకుండా, కీలకమైన, క్లిష్టమైన ప్రదేశాల్లో వారానికి ఏడు రోజులు 24 గంటల పాటు (24/7) కచ్చితత్వంతో అటవీ ప్రాంతాన్ని పర్యవేక్షించేందుకు దీని ద్వారా వీలు కలిగింది. సాఫ్ట్వేర్ ఆధారిత వ్యవస్థ ద్వారా పనిచేసే ఈ విధానంలో... వివిధ సెన్సిటివ్ జోన్లలో హై రెజల్యూషన్ థర్మల్, ఇన్ఫ్రారెడ్ కెమెరాల ద్వారా మనుషులు, పులుల కదలికలను రికార్డ్ చేశారు. ఉన్నతా«దికారుల సెల్‌ఫోన్‌కు జంతువుల కదలికలు, ఇతర ఘటనలకు సంబంధించిన అలర్ట్‌లు, నోటిఫికేషన్లు వచ్చే సాంకేతికతను ఏర్పాటు చేశారు. రేడియో ఫ్రీక్వెన్సీతో ఇంటర్నెట్ అనుసంధానం అడవిలో ఇంటర్నెట్ నెట్వర్క్ కవర్ కాని చోట్ల రేడియో ఫ్రీక్వెన్సీతో 360 డిగ్రీల పరిధిలో 24 గంటల సర్వైలెన్స్ ద్వారా పులులు, వన్యప్రాణుల కదలికల్ని గమనిస్తూ పర్యవేక్షించగలుగుతున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ నెట్వర్క్ నుంచి ఇంటర్నెట్కు దృశ్యాలు కన్వర్టయ్యే స్ట్రీమింగ్‌తో ఎక్కడి నుంచైనా లైవ్‌లో మానిటర్ చేసే అవకాశాలుండడం అధికారులకు ఉపకరిస్తోంది. అడవుల్లో మొబైల్ టవర్లు నెలకొల్పలేని మారుమూల అటవీ ప్రాంతాల్లో, సిగ్నల్స్ లేనిచోట రేడియో వేవ్ కమ్యూనికేషన్ ద్వారా...ఇంటర్నెట్ ఓవర్ రేడియా (ఐవోఆర్ఏ) విధానం ద్వారా వాకీటాకీలు పనిచేసేలా వ్యవస్థను రూపొందించారు. ఐటీ శాఖతో చర్చలు ఫారెస్ట్ కోడ్ ప్రకారం బీట్ ఆఫీసర్లు నెలలో 26 రోజుల పాటు రాత్రి వేళ అడవిలో తిరగాలి. టేకు చెట్లను కొట్టినా, అడవి నరికినా వాటిని వారు గుర్తించిపై అధికారులను అలర్ట్ చేయాలి. ప్రస్తుతం ఈ–ఐ ఏర్పాటుతో వీరి పని సులభంగా మారింది. ప్రస్తుతం ఏటీఆర్‌లో ఈ వ్యవస్థను మరింత విస్తృతం చేసే ఆలోచనతో అధికారులున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ స్థాయిలో చేసేందుకు తెలంగాణ ఐటీశాఖతో ఏటీఆర్ అధికారులు చర్చలు జరిపినట్టు సమాచారం. ప్రస్తుతం పది కెమెరాలతోఏర్పాటు చేసిన విధానం వల్ల పరిమితంగానే అడవి కవర్ అవుతోంది. దీనిని మరింత విస్తృత పరచడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వంద నుంచి రెండువందల దాకా కెమెరాలు ఏర్పాటు చేస్తే బావుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వాచ్ టవర్‌కు అడ్వాన్స్డ్ కెమెరా కోసం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ కోసం రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఏటీఆర్కు దాదాపు వంద ఎంట్రీ పాయింట్లు ఉన్నందున, రెండువందల కీలక ప్రదేశాల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తే దేశంలోనే పటిష్టమైన నిఘా వ్యవస్థ కలిగిన టైగర్ రిజర్వ్‌గా దీనిని తీర్చిదిద్దవచ్చునని చెబుతున్నారు. అడవిలో కదలికలన్నీ తెలిసిపోతున్నాయ్.. వన్యప్రాణుల సంరక్షణకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ–ఐ కెమెరాలతో అడవిలో ఏం జరుగుతోందో తెలిసిపోతోంది. జంతువుల కదలికలను స్పష్టంగా చూడగలుగుతున్నాం. లోతైన లోయలు, కొన్ని ఇతర ప్రాంతాల్లో పర్యవేక్షణ చాలా కష్టంగా ఉంటుంది. వాకీటాకీలు పనిచేయని పరిస్థితులుంటాయి. ఇంటర్నెట్ ఓవర్ రేడియో విధానం ద్వారా మొబైల్ సిగ్నల్స్ లేకపోయినా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. – రోహిత్ గొప్పిడి, డీఎఫ్‌వో, నాగర్‌కర్నూల్ జిల్లా -
మనిషికి, మృగానికి మధ్య పెరుగుతున్న ఘర్షణలు
కంచర్ల యాదగిరిరెడ్డి దేశంలో ఒక పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే.. మరోపక్క పోడు వ్యవసాయం, ఇతరత్రా కారణాలతో అటవీ ప్రాంతం కుంచించుకుపోవడం కొత్త సమస్య తెచ్చిపెడుతోంది. మనిషికీ, వన్య మృగానికీ మధ్య ఘర్షణకు దారితీస్తోంది. పులులు అడవులను దాటి సమీపంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. పదేళ్లలో 100% పెరుగుదల దేశంలో గత పదేళ్ల కాలంలో చిరుతలు, పెద్ద పులుల సంఖ్య అనూహ్యంగా 100 శాతం పెరిగిందని తాజాగా చేపట్టిన గణన ద్వారా వెల్లడైంది. దాదాపు నాలుగు వేల మంది అటవీ శాఖ సిబ్బంది 54 టైగర్ రిజర్వు ప్రాంతాల్లోని 14,500 చదరపు కి.మీ. మేర అడవుల్ని గాలించి మరీ 4,500 పైచిలుకు పెద్ద పులులు, 2,300 చిరుతలు ఉన్నాయని లెక్క తేల్చారు. దేశంలో మిజోరం మినహా అన్ని రాష్ట్రాల్లో పులుల జాడ కనిపించడం విశేషం. వన్యమృగ సంరక్షణ చరిత్రలో ఇది గుర్తుంచుకోదగిన విశేషమని కజిరంగ నేషనల్ పార్క్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి రమేశ్ గగోయ్ అన్నారు. ప్రస్తుతం అక్కడ అనేక రకాల వందల కొద్దీ జంతువులతో పాటు 125కు పైగా పులులు ఉన్నాయి. పులుల సంఖ్య పెరగడం శుభసూచకమే అయినా మనుషులకు, మృగాలకు మధ్య కొనసాగుతున్న ఘర్షణ దేశంలో కొన్నిచోట్ల రక్తసిక్తం కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పులుల దాడుల నేపథ్యంలో వాటి నుంచి రక్షణ కోసం ఒకరకంగా యుద్ధమే చేయాల్సి వస్తోంది. గత ఏడాది మనుషులకు, వన్య మృగాలకు మధ్య ఘర్షణలకు సంబంధించిన ఘటనలు దాదాపు 500కు పైగా నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సరిహద్దుల్లో 33,309 హెక్టార్లకు విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం పెద్ద పులులకు ఆవాసంగా మారింది. ఆ ప్రమాదకరమైన ప్రదేశాలకు ప్రజలను దూరంగా ఉంచడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో మనిషి రక్తం మరిగిన ఓ పులి మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో నెల వ్యవధిలోనే 8 మందిని చంపి తిని కనిపించకుండా పోయిన ఘటన ఆ రాష్ట్ర అధికారయంత్రాంగానికి నిద్ర లేకుండా చేసింది. మరో పులి చంద్రాపూర్ జిల్లాలో ఆరుగురిని బలితీసుకుంది. కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఇటీవల పులి ఐదుగురిపై దాడి చేసిచంపింది. తాజాగా గురువారం కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ రైతుపై అతని ఇంటి వద్దనే దాడి చేసిన పులి తీవ్రంగా గాయపరచడం కలకలం రేపింది. ఆ తర్వాత అతను చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు. గతేడాది మహారాష్ట్రలో 105 మంది పులుల చేతిలో హతమయ్యారని అటవీ శాఖ మంత్రి ఎం.సుధీర్ శాసనసభకు చెప్పారు. అంతకుముందు 2020–21లో 86 మంది, 2019–20లో 80 మంది, 2018–19లో 47 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వివరించారు. తెలంగాణలో వారం వ్యవధిలో ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రంభీం జిల్లా వాంకిడి ప్రాంతంలో సంచరి స్తున్న పులి వారం వ్యవధిలోనే ఇద్దరిని బలి తీసుకుంది. గతేడాది ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పులులు 170 పశువులపై దాడి చేసి హతమార్చా యి. ‘మేము అటవీ ప్రాంతాల పరిసరాలకు వెళ్లకుండా ఉండలేము. ఎందుకంటే అక్కడ పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్నాం. వెళితే ప్రమాదమని తెలిసినా వెళ్లక తప్పడం లేదు..’అని కుమ్రంభీం జిల్లా దిగడ గ్రామానికి చెందిన కళావతి వాపోయారు. పులులు ఎక్కువ ఉన్న చోట్లే.. పులులు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. తగ్గిపోతున్న అడవుల్లో పులుల సంఖ్య పెరగడంతో అవి జనావాసాలకు రావడం అధికమైంది. ధ్వని కాలుష్యంతో పాటు దీపాల వెలుగులు, గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల వాతావరణం వంటి అంశాల వల్ల ఏర్పడే గందరగోళంతోనే ఇతర జంతువుల లాగే పెద్ద పులులు భయాందోళనలతో దాడులు చేయడం, చంపడం వంటివి చేస్తున్నాయని ఆ నివేదిక వివరించింది. పులులు ఉన్నాయని తెలిసినా మనుషులు పోడు వ్యవసాయం, ఇతరత్రా అవసరాల కోసం అటవీ ప్రాంతాల పరిసరాలకు వెళ్లక తప్పడం లేదు. గత ఏడాది నవంబర్ 15న కుమ్రంభీం జిల్లా వాంకిడి సమీపంలో పత్తి చేనుకు కాపలా కాస్తున్న సీడాం భీము (69)ని పెద్ద పులి దాడి చేసి చంపేసింది. అదే జిల్లా దహేగం మండలం దిగిడ గ్రామానికి చెందిన 19 ఏళ్ల విఘ్నేష్‌పై దాడి చేసి చంపింది. ఏటా 20 శాతంపెరుగుదల పులుల సంఖ్య పెరుగుతున్న ప్రాంతాల్లో సాధారణంగా ఈ పెరుగుదల ఏడాదికి 20% కంటే ఎక్కువగా ఉందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఇటీవల పార్లమెంట్‌కు సమరి్పంచిన నివేదికలో తెలిపింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా 2020 వెల్లడించిన నివేదికను బట్టి చూస్తే 2016–20 మధ్య దేశవ్యాప్తంగా పులుల స్వా«దీనంలో ఉన్న ప్రదేశం 10 వేల చ.కి.మీ. మేర కుంచించుకుపోయింది. ఒక్క యూపీలోనే గత పదేళ్లలో అటవీ ప్రాంతం వంద చ.కి.మీ. మేర హరించుకుపోయిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. పులులు పెరుగుతున్న చోట అటవీ భూములు కుంచించుకుపోకుండా చూడాలని ఫారెస్ట్ సర్వే అఫ్ ఇండియా గత అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. కాగా, పులులు, ఇతర వన్యప్రాణులు రోడ్లు, రైల్వే ట్రాక్‌లపైకి చేరి చనిపోతున్నాయని ఎఫ్ఎస్ఐ ఆందోళన వ్యక్తం చేసింది. 2017–18 నుంచి 2020–21 మధ్య దేశవ్యాప్తంగా 63 వేల వన్యప్రాణులు రైళ్ల కింద పడి మరణించాయని, వాటిలో నాలుగు సింహాలు, 73 ఏనుగులు సహా 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఉన్న జంతువులు ఉన్నట్లు కాగ్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో100 దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలకు తీసిపోని విధంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులుల సంఖ్య 100కు పెరిగింది. 2014లో వీటి సంఖ్య 46 మాత్రమే. తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఏపీలోని ఉభయగోదావరి, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల అటవీ ప్రాంతాలే మొదటి నుంచి పెద్ద పులులకు ఆవాసాలుగా పేరొందాయి. పులుల సంఖ్య పెరుగుతున్న కారణంగానే కేంద్ర ప్రభుత్వం 1983లోనే ఉమ్మడి ఏపీ ఐదు జిల్లాల పరిధిలో పది వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతాల్లో నాగార్జునసాగర్– శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది. అయితే అడవుల్లోకి నక్సలైట్ల ప్రవేశంతో 2005 వరకూ పులుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వచ్చిది. ఆ తర్వాత నక్సలైట్ల ఉద్యమం తగ్గుముఖం పట్టడంతో 2008 నుంచి పులుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో కాగజ్‌నగర్, చెన్నూరు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్లలో పులుల సంచారం అధికమైంది. ప్రస్తుతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పెద్ద పులుల అభయారణ్యంగా పేరుగాంచింది. ►దేశంలో పెద్ద పులులు 4,500 పైచిలుకు.. ►దేశంలో చిరుతలు 2,300 -
ఉచ్చుకు మరో పెద్ద పులి బలి..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ జంతువు పులి వరుసగా వేటగాళ్ల ఉచ్చుకు బలైపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండు నెలల్లో మూడు పులులు మృత్యువాతపడటం.. వన్యప్రాణుల సంరక్షణలో నిఘా, పర్యవేక్షణ లోపాలను బట్టబయలుచేస్తోంది. ఈ వరుస ఘటనల పట్ల పర్యావరణవేత్తలు, పరిశోధకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొంతకాలంగా ‘వన్యప్రాణి సంరక్షణ’ ప్రత్యేక విభాగం పనిచేయడం లేదు. దానికి ప్రత్యేకంగా ఒక ఉన్నతాధికారిని నియమించలేదు. దాదాపు పదేళ్లు గడుస్తున్నా కవ్వాల్ టైగర్ రిజర్వ్ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. అక్కడ యూనిఫైడ్ కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు కాలేదు. వీటికి తోడు వన్యప్రాణుల సంరక్షణపై నిఘా పెట్టాల్సిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నామమాత్రంగానే పనిచేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. కాగజ్‌నగర్‌లో ఒకటి.. గత శనివారం (అక్టోబర్ 30న) కాగజ్‌నగర్‌లో అక్రమంగా పులిచర్మం కలిగి ఉన్న ఇద్దరు పట్టుబడ్డారు. దీనిపై విచారణ చేయగా.. పత్తి చేలోకి అడవిపందులు రాకుండా బిగించిన ఉచ్చులకు చిక్కి గత నవంబర్, డిసెంబర్లోనే పులి హతమైనట్టుగా తెలిసింది. పులి కింది దవడ, ఇతర ఎముకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతం పూర్వాపరాలు, ఇతర అంశాలపై అటవీశాఖ వివరణ, స్పష్టీకరణ ను ‘సాక్షి’ఫోన్‌ద్వారా తీసుకునే ప్రయత్నం చేస్తే పీసీసీఎఫ్ ఆర్.శోభ, అదనపు పీసీసీఎఫ్ సిదానంద్ కుక్రేటీ, ఇతర అటవీ అధికారులు స్పందించలేదు. సెప్టెంబర్‌లో ములుగు జిల్లాలో రెండు! ఇక సెప్టెంబర్‌లో ములుగు జిల్లాలోని తాడ్వాయి అటవీ ప్రాంతంలో... చత్తీస్‌గఢ్ నుంచి వచి్చనట్టుగా భావిస్తున్న ఓ పులి గుత్తికోయ వేటగాళ్లు పెట్టిన ఉచ్చుకు బలైంది. అధికారులు ఒకటే పులి అని చెప్పి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశారు. కానీ రెండు పెద్ద పులులు బలై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ సందర్భంగానే పులుల పర్యవేక్షణ, ట్రాకింగ్, రక్షణ ఏర్పాట్లకు సంబంధించిన లోటుపాట్లు, వైఫల్యాలు బయటపడ్డాయి. వేటగాళ్లు ఏ ఒక్క చోటో, ఒక్క రోజో పెట్టిన ఉచ్చుకే పెద్దపులులు బలైపోయే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. మెప్పుకోసం అధికారుల తిప్పలు... పర్యావరణానికి మూలాధారమైన వన్యప్రాణులు ముఖ్యంగా పులుల సంరక్షణను రాష్ట్రం ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదన్న పర్యావరణవేత్తల వాదనకు ఈ వరుస ఘటనలు బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో అటవీశాఖ అధికారులు అడవులు, వన్యప్రాణుల సంరక్షణ పక్కనపెట్టి.. హరితహారం పనుల్లోనే బిజీగా గడుపుతున్నారని, ఉన్నతాధికారులు, రాజకీయ నేతల మెప్పుకోసం ప్రయతి్నస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో వెంటనే వైల్డ్‌లైఫ్ వింగ్, డివిజన్‌ను పూరి్థస్థాయిలో ఏర్పాటుచేయాలి. టైగర్ రిజర్వ్‌లో క్షేత్రస్థాయిల్లో ఈ బేస్క్యాంప్లతో పెట్రోలింగ్, ట్రాకింగ్ కార్యకలాపాలు సాగేలా చర్యలు తీసుకోవాలి. కొంత డబ్బుకే జంతువులను చంపేందుకు సిద్ధమయ్యే స్థానిక వేటగాళ్లకు అడ్డుకట్ట వేయాలి. ఈ దిశలో అటవీశాఖ కట్టుదిట్టమైన కార్యాచరణ అమలు చేయాలి. పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తున్నామంటున్నారే తప్ప వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నట్టు కనిపించడం లేదు. – కె.సందీప్‌రెడ్డి, వన్యప్రాణి సంరక్షణ కార్యకర్త, ఎన్విరాన్మెంట్ సైన్స్ టీచర్ రాష్ట్రంలో వేటగాళ్ల ఉచ్చులకు మరో పెద్దపులి బలి కావడం ఎంతో వేదన కలిగిస్తోంది. పులుల పర్యవేక్షణ కోసం నిఘా ఉండాలి. ఆనుపానులు గ్రహించి అది సాగే దారిలో ప్రమాదానికి గురికాకుండా నియంత్రించాలి. జాగ్రత్త చర్య తీసుకోవాలి. ఫుట్ పెట్రోలింగ్, ట్రాకింగ్ తదితరాలను సీరియస్‌గా చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఫీల్డ్‌లోనే ఉంటూ అడవులకు దగ్గరగా ఉన్న స్థానిక సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, లోకల్‌గా సమాచార సేకరణ వంటివి జరుగుతున్నట్టు లేదు. – రాష్ట్ర అటవీ శాఖ, రిటైర్డ్ అధికారి -
పెద్ద పులిని కాపాడుకుందామా !
సాక్షి, నిర్మల్ : బెబ్బులిని చూస్తే అడవి భయపడుతుంది. అలాంటి పులి ఇప్పుడు మనిషిని చూసి బెదురుతోంది. జాతీయ జంతువు అన్న భయం.. కనికరం కూడా లేకుండా.. ఎక్కడ కరెంటు షాక్ పెట్టి చంపుతాడో.. ఎందులో విషం కలిపి ఉసురు తీస్తాడో.. అని దట్టమైన అడవిలో గుండె దిటవు చేసుకుని బతుకు జీవుడా.. అంటోంది. గత కొన్నేళ్లుగా అడవుల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్‌లో పదుల సంఖ్యలో పులులు వేటగాళ్ల ఉచ్చులకు, స్మగ్లర్ల స్కెచ్లకు బలయ్యాయి. 2018 చివరలోనే వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాపై దృష్టిపెట్టి అటవీశాఖ ప్రక్షాళన చేపట్టారు. అప్పటి నుంచి కొంతలో కొంత మార్పు కనిపిస్తోంది. వనంతో వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నారు. నేడు(మార్చి–3) ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా కవ్వాల్ పులులపై కథనం. పెరుగుతున్న పులుల సంఖ్య రాష్ట్రంలోని రెండు అభయారణ్యాల్లో ఒకటైన మన కవ్వాల్ పులుల అభయారణ్యంలో వాటి సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్రం చెబుతోంది. ప్రతీ నాలుగేళ్లకోసారి కేంద్ర అటవీ శాఖ పరిధిలోని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) రాష్ట్రాల్లోని పులుల సంఖ్యను లెక్కిస్తుంటుంది. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన వివరాల ప్రకారం తెలంగాణలో 26 పులులు ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి పోలిస్తే వీటి సంఖ్య మరింత పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలో 10–12 పులులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గతంతో పోలిస్తే పెరిగిన పులులను కాపాడేందుకు చర్యలు చేపడుతున్నానీ చెబుతున్నారు. నాలుగేళ్లలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) ప్రతి నాలుగేళ్లకోసా పులుల సంఖ్యను వెల్లడిస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక గతేడాది తొలిసారి ఈ వివరాలు వెల్లడయ్యాయి. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, టైగర్ రిజర్వ్‌లు ఇలా అటవీ ప్రాంతాలన్నింటిలో పులులను అంచనా వేసేందుకు 2018 జూన్‌లో ఓ వారంపాటు అధ్యయనం జరిపారు. పులి పాదాల గుర్తులు, అడవుల్లో పెట్టిన కెమెరాలు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం లెక్కించారు. ఏడాదిపాటు శాస్త్రీయ సర్వే చేసిన తర్వాత వివరాలు వెల్లడించారు. వాటి ప్రకారం.. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో పులుల సంఖ్య 68 ఉండగా, అప్పుడు తెలంగాణలో 20 ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని కవ్వాల్ అభయారణ్యంలో 3 పులులు ఉన్నట్లు అంచనా వేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం కవ్వాల్‌లో 10–12వరకు పులులు ఉండొచ్చని అటవీ అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఖతం కవ్వాల్ అభయారణ్యానికి గతంలో వచ్చిన పులి.. వచ్చినట్లే ఖతమైంది. వేటగాళ్ల ఉచ్చులతో, స్మగ్లర్లు వేసిన స్కెచ్‌లతో పెద్దపులులు ప్రాణాలు కోల్పోయాయి. రెండేళ్లక్రితం వరుసగా కవ్వాల్ అభయారణ్యంలోని పులులను హతమార్చారు. వైల్డ్ లైఫ్ క్రైం సెంట్రల్ టీమ్ సభ్యులు ఇచ్చోడలో పులిచర్మం పట్టుకోవడం అప్పట్లో సంచలనమైంది. ఈ కేసులో కూపీ లాగగా, పెంబి మండలం తాటిగూడకు చెందిన గుగ్లావత్ ప్రకాశ్ అదే మండలంలోని పుల్గంపాండ్రి అడవుల్లో ఆ పులిని చంపినట్లు తేలింది. పుల్గంపాండ్రి గ్రామానికి చెందిన హలావత్ మున్యాతో కలిసి విద్యుత్ ఉచ్చుతో పులిని హతమార్చాడు. మాంసాన్ని కాల్చివేసి, దాని చర్మాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయాడు. ఆ తర్వాత పాత మంచిర్యాల బీట్‌లో చిరుతను హతమార్చడం, అదే క్రమంలో శివ్వారం బీట్‌లో ఏకంగా రాయల్ బెంగాల్ టైగర్‌ను మట్టుబెట్టడం తీవ్ర సంచలనం సృష్టించింది. కవ్వాల్ అడవుల్లోకి వచ్చిన పులిని వచ్చినట్లే చంపుతుండటంపై సర్కారు సీరియస్ అయ్యింది. ఏకంగా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీఎఫ్)తో పాటు నాలుగు జిల్లాల్లోని పలువురు డీఎఫ్ఓలు, ఎఫ్ఆర్ఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలను బదిలీ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కవ్వాల్ ‘గుడ్’ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు అంటే..నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోకి వస్తోంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో భాగంగా ఉండే కొండలు, దట్టమైన అడవులతో ఉంటుంది. 2012లో కేంద్రంలో దేశంలో 41వ, రాష్ట్రంలో రెండో పులుల అభయారణ్యంగా ప్రకటించింది. దాదాపు 2,020 చదరపు కిలోమీటర్ మేర విస్తరించి ఉంది. ఇందులో 897 చ.కిలోమీటర్లు పెద్ద పులి సంచరించే కోర్ ఏరియాగా, 1,123 చ. కి. వేటాడే బఫర్ ఏరియాగా విభజించారు. తెలంగాణ ఏర్పడక ముందు ఇక్కడ పులులు శాతం చాలా తక్కువ. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మెరుగైన నిర్వహణ పద్ధతులను అవలంబిస్తుండటంతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. గతంతో పోలిస్తే ఎన్టీసీఏ జాబితాలో 60.16 శాతంతో కవ్వాల్ రేటింగ్ ‘ఫెయిర్’నుంచి ‘గుడ్’స్థానానికి పెరిగింది. గతంతో పోలిస్తే.. ప్రస్తుతం అనువైన వాతా వరణం కారణంగా క్రమంగా పులుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలు ఫలిస్తున్నాయి. గతంలో కవ్వాల్కు వచ్చిన ఒక్క ఫాల్గుణ పులి ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తిప్పేశ్వర్, తాడోబా తదితర ఏరియాల నుంచి పులులు కవ్వాల్ వైపు వస్తున్నాయి. ‘బచావో’లో భాగంగా అడవులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఏళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై బదిలీ వేటు వేసిన సర్కారు వారి స్థానాల్లో కఠినంగా వ్యవహరించే వారిని నియమించింది. ‘జంగిల్ బచావో– జంగిల్ బడావో’నినాదంతో అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపడుతోంది. సీఎం సీరియస్‌గా ఇచ్చి న ఆదేశాలతో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సంస్కరణలు కొనసాగుతున్నాయి. అడవులతో పాటు ఇప్పుడు జాతీయ జంతువైన పులిని కూడా రక్షించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా సీఎఫ్ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో అభయారణ్యంలో పలు చర్యలు చేపడుతున్నారు. అభయారణ్యంలోకి పులి రాకకు అడ్డంకులుగా మారుతున్న వాటిపై దృష్టిపెట్టారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో అభయారణ్యం పరిధిలో ఉన్న రాంపూర్, మైసంపేట్ గ్రామాలను మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇప్పటికే ఈ గ్రామాల పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తనవంతు నిధులు ఇవ్వాల్సి ఉంది. -
రాష్ట్రంలో పెద్ద పులులెన్ని?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో ఎన్ని పెద్ద పులులున్నాయి? గతంతో పోల్చితే పులుల సంఖ్య పెరిగిందా లేక తగ్గిందా? దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని ఉన్నాయి? జాతీయస్థాయిలో చూస్తే గతంలో మాదిరిగానే వాటి సంఖ్యలో వృద్ధి జరిగిందా లేదా అన్న ప్రశ్నలకు ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పనున్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న సోమవారం ఇందుకు సంబంధించిన అధికారిక లెక్కలు విడుదల చేయనున్నారు. ప్రతి నాలుగేళ్లకూ ఓసారి పులుల గణన చేపడతారు. 2006లో తొలిసారిగా దేశవ్యాప్తంగా టైగర్ సెన్సెస్‌ను విడుదల చేయగా.. మళ్లీ 2010లో, ఆ తర్వాత 2014లో ఈ వివరాలను ప్రకటించారు. 2014లో ఏపీ, తెలంగాణలను కలిపి ఒకటిగానే సమాచారం వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారిగా ఇక్కడ ఎన్ని పులులున్నాయనేది అధికారికంగా వెల్లడి కానుంది. 2014 లెక్కల ప్రకారం ఉమ్మడి ఏపీ లో 68 పులులుండగా వాటిలో 20 పులులు తెలంగాణలో ఉన్నట్టుగా (ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో17, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో 3) ఇక్కడి అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం తెలంగాణలో వీటి సంఖ్య 28 నుంచి 30 వరకు పెరిగినట్టు అనధికార లెక్కలను బట్టి తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చూస్తే 2006లో 1,411 పులులు ఉండగా.. 2010లో 1,706కు, 2014లో 2,226కు వాటి సంఖ్య పెరిగింది. -
పట్టుబడిన నరహంతక పులి
కర్ణాటక, మైసూరు : ముగ్గురు వ్యక్తులను బలి తీసుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పెద్దపులిని శుక్రవారం అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. జిల్లాలోని హెచ్డీ కోటె తాలూకా నాగరహొళె జాతీయ ఉద్యానవనంలో వేటాడడానికి సాధ్యపడకపోవడంతో ఎనిమిదేళ్ల వయసున్న ఓ పెద్దపులి కొద్ది రోజులుగా ఆహారం కోసం తాలూకాలోని డీబీ కుప్ప గ్రాపం పరిధిలో గ్రామాల్లోకి చొరబడి పశువులను చంపి తింటోంది. కాగా కొద్ది కాలం క్రితం ఒక గ్రామస్థుడిని చంపిన పులి అప్పటి నుంచి మనుషుల రక్తానికి అలవాటు పడింది. దీంతో తరచూ గ్రామాల్లో చొరబడి పొలాల్లో ఒంటరిగా ఉండే మనుషులను వేటాడడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో రోజుల వ్యవధిలో గ్రామాలకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులను పెద్దపులి చంపింది. దీనిపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో మేల్కొన్న అధికారులు పులిని బంధించాలని సాధ్యం కాకపోతే చంపేయాలంటూ సిబ్బందికి ఆదేశించారు. దీంతో శుక్రవారం పెద్దపులిని పట్టుకోవడానికి కార్యాచరణ ప్రారంభించిన అటవీశాఖ అధికారులు,సిబ్బంది దసరా ఏనుగులు అర్జున, అభిమన్యు, కృష్ణ,గోపాలస్వామి, భీమ ఏనుగుల సహాయంతో బెంగళూరు నుంచి షార్ప్ షూటర్స్‌ను రప్పించి పెద్దపులి కోసం వేట సాగించారు. ఈ క్రమంలో నాగరహొళె జాతీయ ఉద్యానవనం బళ్లె పరిధిలోని మచ్చూరు సమీపంలోని హుసూరులో వేట కొనసాగిస్తున్న అధికారులకు పెద్దపులి కంటబడింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా షూటర్స్ మత్తు మందును పులికి ఇంజెక్ట్ చేయడంతో పులి స్పృహ కోల్పోగా వెంటనే పులిని మైసూరు జంతుప్రదర్శనశాలకు తరలించారు.పెద్దపులి ఎట్టకేలకు చిక్కడంతో గ్రామస్థులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
పెద్దపులి ప్రత్యక్షం
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్లో పెద్దపులుల సంఖ్య బాగా పెరిగిందని ఇటీవల జరిగిన పులుల అంచనా సర్వే తెలియజేస్తోంది. దీనికి నిదర్శనమా అన్నట్లుగా ఇంతకుముందు పులుల సంచారం అసలే లేని వెలుగోడు సౌత్ బీట్, నార్త్ బీట్లలో ఇటీవల తరచూ ప్రత్యక్షమవుతున్నాయి. వెలుగోడు – నల్లకాల్వ కనుమ ప్రధాన రహదారిపై రాత్రి పూట పలుమార్లు వాహనదారులకు కన్పిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో లాల్మాన్ కుంట సమీపాన పెద్దపులి ఒకటి రోడ్డుదాటుతూ కనిపించింది. తొలుత రోడ్డు పక్కన పొదల్లో పొంచి ఉన్న పులి.. ఆ తరువాత మెల్లిగా రోడ్డు దాటింది. తన వాహనంలో ఉండి గమనించిన పాములపాడుకు చెందిన ఆర్ఎస్ గోపాల్ అనే వ్యక్తి దాని కదలికలను సెల్ఫోన్లో బంధించాడు. -
తెలుగు రాష్ట్రాల్లోని పెద్దపులుల సంఖ్య 104
కర్నూలు, గుంటూరు, ప్రకాశం. నల్లగొండ, మహబూబ్‌నగర్, ఉభయగోదావరి, ఆదిలాబాద్ జిల్లాల అటవీ ప్రాంతాలే ఆరంభం నుంచీ పెద్దపులులకు ఆవాసం. 1991 నాటికి 92 ఉన్న పులులు 1995 వరకు 34కు తగ్గిపోయాయి. నల్లమల అటవీ ప్రాంతంలో అనూహ్యంగా పెరిగిన మావోయిస్టుల కార్యకలాపాలే దీనికి ప్రధాన కారణం. సాక్షి ప్రతినిధి, హైదరాబాద్: భారతదేశంలో ఏ రాష్ట్రానికి తీసిపోని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల పరిధుల్లో పెద్ద పులుల సంఖ్య వందకు పైగా పెరిగింది. అటవీ శాఖ వర్గాలు అందించిన తాజా సమాచారం ప్రకారం వీటి సంఖ్య 104. కర్నూలు, గుంటూరు, ప్రకాశం. నల్లగొండ, మహబూబ్‌నగర్, ఉభయగోదావరి, ఆదిలాబాద్ జిల్లాల అటవీ ప్రాంతాలే ఆరంభం నుంచి పెద్దపులులకు ఆవాసం. 70వ దశకానికి వచ్చేసరికి ఉభయగోదావరి, ఆదిలాబాద్ జిల్లాల కన్నా ఇతర ఐదు జిల్లాల్లో పులుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అప్పట్లో అటవీ ప్రాంతాల్లో నక్సలైట్ల సంచారం పెద్దగా లేకపోవడం, పోడు వ్యవసాయం తక్కువగా ఉండటమే దీనికి కారణం. 1989-90 మొదలు 2004 వరకూ రాష్ట్రంలో పోలీసులకూ, నక్సలైట్లకూ మధ్య జరిగిన విధ్వంసకర ఘటనల్లో పులులు కూడా బలయ్యాయి. 92 నుంచి 34కు... కేంద్ర ప్రభుత్వం 1983లో ఆంధ్రప్రదేశ్‌లోని 5 జిల్లాల పరిధిలో 10,000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతాల్లో నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. అప్పుడు తీసుకున్న సంరక్షణ చర్యల ఫలితంగా 1980 ఆరంభం వరకూ 40 వరకు ఉన్న పులుల సంఖ్య 1991 నాటికి 92కి చేరింది. 1995 నాటికి ప్రాజెక్టు పరిధిలోని పులుల సంఖ్య 34కు తగ్గిపోయింది. నల్లమల అటవీ ప్రాంతంలో అనూ హ్యంగా పెరిగిన మావోయిస్టు కార్యకలాపాలే దీనికి ప్రధాన కారణం. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భీకరపోరు కారణంగా పులులు చెల్లాచెదుర య్యాయి. తమకు అడ్డు వస్తున్నాయనీ, రాకపోక లకు ఇబ్బందిగా మారిందనీ నక్సలైట్లు కొన్నింటికి విషం పెట్టి చంపారని అటవీ అధికారులు తమ రికార్డుల్లో నమోదు చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించారు. 2006 నుంచి ఏటా పది చొప్పున పెరిగాయి 1995 తరువాత నక్సలైట్లు తమ శిబిరాలను నల్లమల నుంచి ఆంధ్రప్రదేశ్-ఒరిస్సా (ఏవోబీ) సరిహద్దు ప్రాంతానికి మార్చడంతో నల్లమలలో 80 శాతం మేర వారి కార్యకలాపాలు తగ్గాయి. 2005 నాటికి పూర్తిగా నిలిచిపోయాయి. అటవీ సిబ్బంది స్వేచ్ఛగా అడవిలో తిరుగాడటం మొదలుపెట్టారు. అందుబాటులో ఉన్న పరిజ్ఞానంతో పులుల సంర క్షణకు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ఫలితంగా 2006 నుంచి 2015 మార్చి దాకా ఏడాదికి పది చొప్పున పెరుగుతూ వచ్చాయి. ‘వాటి సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. దాంతో మేము తీసుకున్న చర్యలు మంచి ఫలితాలిచ్చాయి. ఇప్పుడు నల్లమలలో వాటి సంఖ్య వంద దాటింది’ అని అటవీ శాఖ సీనియర్ అధికారి ఒకరు గర్వంగా చెప్పారు. ఉభయగోదావరి, ఆదిలాబాద్‌లో నిల్ ఉభయగోదావరి అటవీ ప్రాంతాల్లో ఒకప్పుడు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న పులులు దాదాపుగా కనుమరుగయ్యాయి. పాపికొండల్లో 2 నుంచి 3 పులులు ఉన్నాయని స్థానికులు చెపుతున్నప్పటికీ అటవీ శాఖ ఇంకా నిర్ధారణకు రాలేదు. ఆదిలాబాద్ జిల్లాలో 2000 చదరపు కిలోమీపటర్ల పరిధిలో విస్తరించిన కవాల్ అటవీ ప్రాంతంలో కూడా ఒక్క పులి కూడా కనిపించడం లేదు. ఇక్కడ పులుల సంచారం ఉన్నదని గిరిజనులు చెబుతున్నా తమకు వాటి ఆనవాళ్లు కనిపించలేదని అటవీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.