సాక్షి, ఆసిఫాబాద్: దాదాపు తొమ్మిది నెలల విరా మం తర్వాత జిల్లాలో మళ్లీ బెబ్బులి దాడులు మొదలయ్యాయి. పెద్దపులి సంచారంతో జిల్లాలోని అటవీ ప్రాంతాల సమీప గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా గత నెల రోజులుగా కాగజ్‌నగర్ మండల పరిసరాల్లో పులి సంచరిస్తోంది. మూడు రోజుల కిందట అంకుసాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో ఆవుపై దాడి చేసి చంపేసింది. పశువులు, మేకలను హతమారుస్తుండడంతో గ్రామీణులు భయంతో హడలెత్తిపోతున్నారు. పులి సంచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు దాని కదలికలపై నిఘా ఉంచారు.
జనావాసాల్లో సంచారం..
గత నాలుగైదేళ్లుగా జిల్లాలో పెద్దపులుల సంచారం పెరిగింది. జిల్లాలో వ్యాపించి ఉన్న అభయారణ్యాలు కూడా జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు కారిడార్‌గా పనిచేస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి ఆహారం, తోడును వెతుకుంటూ వలస వస్తున్నాయి. ఒక్కోసారి పులులు జనావాసాల్లోకి వస్తూ ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. గతేడాది నవంబర్‌లో కాగజ్‌నగర్ పట్టణంలోకి పెద్దపులి వచ్చింది. అటు నుంచి నజ్రూల్‌నగర్, ఈస్‌గాం సమీపంలోని అనుకోడ గ్రామ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది.
మళ్లీ అదే పులి రాస్పెల్లి గ్రామంలో పత్తి చేన్లలో నక్కి ఉండగా రైతుల కంట పడింది. ఈ క్రమంలో సిర్పూర్(టి) మండలం చీలపెల్లి గ్రామంలో ప్రత్యక్షమైంది. ఆ తరువాత చింతలమానెపల్లి మండలం బాబాసాగర్, బెజ్జూర్ మండలం కుకుడా గ్రామంలో పులి ప్రజల కంట పడింది. అప్పట్లో వాంకిడి మండలం చౌపన్‌గూడ పంచాయతీ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో పంట చేనులో పని చేసుకునేందుకు వెళ్లిన సిడాం భీము అనే గిరిజన రైతుపై దాడిచేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఆ పులే కాగజ్‌నగర్ డివిజన్ పరిసరాల వైపు వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవ్వడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
జత కట్టే సమయంలో మరింత జాగ్రత్త..
పెద్దపులులు సహజంగా చల్లటి వాతావరణ పరిస్థితుల్లోనే ఆడ పులులతో జత కట్టేందుకు ఇష్టపడతాయి. ముఖ్యంగా నవంబర్ నుంచి జనవరి మధ్య మూడు నెలల కాలంలో పులులు జతకట్టేందుకు(మేటింగ్) తహతహలాడుతాయని వన్యప్రాణి సంరక్షణ అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో ఆడ పులులను వెతుకుంటూ తిరిగే మగ పులి దూకుడుగా ఉంటుందని ఆ క్రమంలో ఆహారం నీరు దొరకని పరిస్థితుల్లో ఏది తారసపడినా(మనుషులైనా) దాడికి పాల్పడుతుందని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కసారి మనిషి రక్తాన్ని రుచి మరిగితే తరుచూ జనావాసాల పరిసరాల్లోనే సంచరిస్తుంటాయని చెబుతున్నారు. అంతేకాదు సులభంగా లక్ష్యంగా మారే పశు సంపదను కూడా చంపి తింటాయంటున్నారు. కాబట్టి పులులు జట్టు కట్టే సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు.
వరుస దాడులు..
కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులులు ఉన్నాయి. అవి కాగజ్‌నగర్, సిర్పూర్(టి), చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల్లోని గ్రామాల్లో ఎక్కువగా సంచరిస్తున్న సంగతి తెలిసిందే. గత గురువారం కాగజ్‌నగర్ మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన హన్మంతు తన అవును శివారు ప్రాంతంలో మేతకు వదలగా పులి దాడి చేసి హతమార్చింది. గత నెల రోజుల్లో పులి దాడిలో మూడు మేకలు, ఐదు ఎద్దులు మృతి చెందినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే జనావాసాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
అటవీ ప్రాంతాల్లోకి అవులు, మేకలను మేత కోసం తీసుకెళ్లే కాపరులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా అడవి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయొద్దు. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పులులు తిరుగుతున్నందున ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలి. పులి సంచరిస్తున్నందున గ్రామస్తులు రాత్రిపూట ఒంటరిగా బయట తిరగొద్దు.
– విజయ్‌కుమార్, ఎఫ్‌డీవో, కాగజ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment