వలస.. ఏదీ భరోసా? | - | Sakshi
Sakshi News home page

వలస.. ఏదీ భరోసా?

Published Mon, Dec 18 2023 12:22 AM | Last Updated on Mon, Dec 18 2023 8:57 AM

- - Sakshi

న్న ఊరిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతుండడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వాసులు వలసబాట పడుతున్నారు. ఉపాధి అవకాశంతో పాటు అధిక వేతనాలు, మరింత మెరుగైన జీవనం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం.. పల్లెల నుండి పట్టణాలకు, ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటారు. ఒకదేశం నుండి మరో దేశానికి వెళ్లడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారు. నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం...

నిర్మల్‌ జిల్లా సోన్‌ మండల కేంద్రానికి చెందిన గాండ్ల రమణ ఉపాధి నిమిత్తం దాదాపు 12 ఏళ్లక్రితం ఒమన్‌ దేశానికి వెళ్లి కొన్ని నెలలక్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడ స్వయం ఉపాధి పొందేందుకు బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా తనకు ఏదైనా రుణం మంజూరు చేయించాలని కొన్నిరోజులక్రితం కలెక్టరేట్‌, డీఆర్డీవో, తదితర కార్యాలయాల్లో విన్నవించుకున్నాడు. రుణం మంజూరు కోసం కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటికీ ఎలాంటి సాయం అందలేదని గాండ్ల రమణ పేర్కొంటున్నాడు. గల్ఫ్‌ నుండి వాసస్‌ వచ్చిన ఇలాంటి వారు ఎందరో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.

నిర్మల్‌ఖిల్లా: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వలసదారులు ఉజ్వల భవిష్యత్‌, తగిన గుర్తింపు కోసం తమ మాతృభూమిని వదిలి వేరొక దేశానికి వెళ్తుంటారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 80 వేలకు పైగా కా ర్మికులు వివిధ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లినట్లు గల్ఫ్‌ సంక్షేమ సంఘాలు పేర్కొంటున్నాయి. వీరే కాకుండా గల్ఫ్‌ దేశాల నుంచి తిరిగొచ్చిన జిల్లావాసులు దాదాపు 2 లక్షల వరకు ఉంటారని ప్రవాసీమిత్ర కార్మిక సంఘాల నాయకులు పేరొంటున్నారు. జిల్లా నుంచి గల్ఫ్‌కు వెళ్తున్న వ్యక్తులకు సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో ఎక్కువ మంది కూలీలు గానే పనులు చేస్తున్నారు. తిరిగొచ్చిన తర్వాత కూడా సరైన ప్రత్యామ్నాయ, ఉపాధి మార్గాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ నేపథ్యం..
వలస వెళ్తున్న పౌరులకోసం ఐక్యరాజ్య సమితి డిసెంబర్‌ 18ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం (ఇంటర్నేషనల్‌ మైగ్రంట్స్‌ డే)గా ప్రకటించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభ (యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ) 31 ఏళ్ల క్రితం 18 డిసెంబర్‌ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో ‘వలస కార్మికులు, కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఎంత స్వేచ్ఛా స్వతంత్రంగా విదేశాలకు వెళ్తున్నారో అంతే స్వేచ్ఛగా తిరిగిరావొచ్చని సభ తీర్మానం చేసింది.

ప్రధాన డిమాండ్లు

► తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రవేశపెట్టాలని, గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ చా లాకాలంగా అమలుకు నోచుకోవడంలేదు. తె లంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో 6 వేలకు పై గా తెలంగాణ ప్రవాసీయులు గల్ఫ్‌ దేశాలలో వి విధ కారణాలతో మృతి చెందగా రూ.5 లక్షల ఎ క్స్‌ గ్రేషియా కోసం కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని, రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్‌తో గల్ఫ్‌కార్మికుల సంక్షేమానికి, పునరావాసానికి కృషి చే యాలని ప్రవాసీమిత్ర లేబర్‌ యూనియన్‌, గల్ఫ్‌ కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.

► విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ముంబయిలో ఏర్పాటు చేసిన మాదిరి హైదరాబాద్‌లో ‘విదేశ్‌భవన్‌’ ఏర్పాటు చేయాలని, ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్‌లో పాస్‌పోర్టు ఆఫీసు, ప్రొటెక్టర్‌ ఆఫ్‌ ఎమిగ్రంట్స్‌ ఆఫీసు, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌(ఐసీసీఆర్‌) రీజినల్‌ ఆఫీసు, విదేశాంగ శాఖ బ్రాంచి సెక్రెటేరియట్లు ఉండాలని, ‘ప్రవాసీ తెలంగాణ దివస్‌’ అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం పరిధిలోనివి..

► హైదరాబాద్‌లో సౌదీ, యూఏఈ, కువైట్‌ దేశాల కాన్సులేట్‌లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటయ్యేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి.

► ప్రవాస భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణం కూడా చేర్చా లి. రూ.325 చెల్లిస్తే రెండు సంవత్సరాల కాలపరిమితితో ఇన్సూరెన్స్‌ ఇస్తారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

► ఎమిగ్రేషన్‌ యాక్టు–1983 ప్రకారం గల్ఫ్‌ దేశాలకు ఉద్యోగానికి వెళ్ళడానికి సర్వీస్‌ చార్జీగా అభ్యర్థి 45 రోజుల వేతనం (రూ.30 వేలకు మించకుండా) మాత్రమే ఏజెంటుకు చెల్లించాలి. దీనిపై 18 శాతం జీఎస్టీ రూ.5,400 చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి..

► అమాయకులైన వలస కార్మికుల రక్షణకు ఆరు అరబ్‌ గల్ఫ్‌ దేశాలతో సహా 18 దేశాలను ఈసీఆర్‌ దేశాలుగా వర్గీకరించిన 1983 లోని ఎమిగ్రేషన్‌ చట్టం యొక్క ప్రాతిపదిక ప్రకారం గల్ఫ్‌ బోర్డు ఏర్పా టు చేయాలి. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్‌ కేటాయించాలి. గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.

► జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్‌లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత (సోషల్‌ సెక్యూరిటీ) పథకం ప్రవేశ పెట్టాలి.

► గల్ఫ్‌కు వెళ్లిన సన్నకారు, చిన్నకారు రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకం వర్తింపజేయాలి.

వలసదారుల సంక్షేమానికి కృషి చేయాలి

వలస కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. కేరళ తరహా ప్రత్యేక గల్ఫ్‌ బోర్డు ఏర్పాటు చేయాలి. వార్షిక బడ్జెట్‌లో రూ.500 కోట్ల నిధులు కేటాయించాలి. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. గల్ఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేయాలి. తిరిగి వచ్చిన కార్మికులకు ఉపాధికోసం ఆయా వ్యక్తుల నైపుణ్యాలను బట్టి ప్రభుత్వాలు తగిన చేయూతనివ్వాలి.

– దొనికెన కృష్ణ, గల్ఫ్‌ జేఏసీ రాష్ట్ర నాయకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement