Gulf News
-
గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా: పొన్నం
లక్డీకాపూల్ (హైదరాబాద్): గల్ఫ్ దేశాల్లో ప్రమాదాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందన్నారు. గల్ఫ్‌లో పనిచేసే కార్మికుల కుటుంబాల పిల్లల చదువుకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కలి్పస్తున్నామని చెప్పారు. శుక్రవారం బేగంపేట్‌లోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రవాసీ ప్రజావాణి కౌంటర్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం.. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న షేక్ హుస్సేన్ కుటుంబం నుంచి మొదటి అభ్యర్థనను స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో గల్ఫ్ కార్మికుల కోసం సలహా కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, ఎన్నారై విభాగం సలహాదారుడు బొజ్జ అమరేందర్‌రెడ్డి, ప్రతినిధులు భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, నరేశ్‌రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్ రావు, తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు మహ్మద్ జబ్బార్, ఉపాధ్యక్షుడు మహ్మద్ మిస్రీ తదితరులు పాల్గొన్నారు. పగటి వేషగాళ్ల మాటలు నమ్మొద్దుసాక్షి, హైదరాబాద్: హైడ్రాపై పగటి వేషగాళ్ల మాటలు నమ్మొద్దని, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట...అధికారం కోల్పోయిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. సచివాలయంలో శుక్రవారం పొన్నం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో అక్రమ కట్టడం కడితే కూల్చేస్తామని నాడు కేసీఆర్ అన్నారా లేదా అని పొన్నం ప్రశ్నించారు. మూసీలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని స్వయంగా నాటి మంత్రి కేటీఆర్ చెప్పిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని, మూసీ మీద ఉన్న ఇళ్లను మాత్రమే తొలగిస్తున్నామని, వాళ్లకు సొంత ఇళ్లు వచ్చేలా, మెప్మా ద్వారా ఉపాధి అవకాశాలు కలి్పంచడానికి కార్యాచరణ చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. -
ఉపాధికి గల్ఫ్ వెళ్లి.. శవంలా తిరిగొచ్చి..
జన్నారం: ఉన్న ఊరిని.. కట్టుకున్న భార్యను.. కనిపెంచిన తల్లీదండ్రులను వదిలి ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన యువకుడు శవమై తిరిగొచ్చాడు. బ్రేన్ స్టోక్‌తో 24 రోజుల క్రితం మృతిచెందగా అప్పటి నుంచి చివరి చూపు కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. జన్నారం మండలం దేవునిగూడ గ్రామానికి చెందిన కునారపు వెంకటేశ్(24) ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. ఉన్న ఊరిలో ఉపాధి లేక ఆరు నెలల క్రితం ఏజెంట్‌కు డబ్బులు పెట్టి ఇరాక్ దేశంలోని ఇబ్రహిల్ పట్టణానికి వెళ్లాడు. విధులు నిర్వహిస్తుండగా జనవరి 30న బ్రేన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే కంపెనీ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పటి నుంచి భర్త మృతదేహం కోసం కంటిలో నీరు కడుపులో దాచుకుని భార్య ఎదురుచూస్తోంది. శుక్రవారం పెట్టెలో భర్త మృతదేహం స్వగ్రామానికి రావడంతో భార్య రోదన ఎవరు ఆపలేకపోయారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కల్లెడ భూమన్న, వర్కింగ్ ప్రసిడెంట్ తిరుపతి, సంఘం నాయకులు ఎల్లయ్య, కునారపు భీమరాజు మృతదేహం వద్ద నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా అప్పుల పాలైనా వెంకటేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతదేహం స్వగ్రామం రావడానికి సహకరించిన ఎమిగ్రేట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంద భీంరెడ్డి, అంబులెన్స్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. -
కేటీఆర్ కడుపు సల్లగుండాలి...
మల్యాల(చొప్పదండి): పెళ్లైన ఏడాదికే ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి.. అక్కడ హత్యకేసులో ఇరుక్కుని జైలుకెళ్లి 18 ఏళ్ల తర్వాత ఇంటికి చేరాడు జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతు. గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతుకు బుగ్గారం మండలం గోపులాపురానికి చెందిన పద్మతో 20ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన ఏడాదికే ఉపాధి కోసం హనుమంతు దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పాప పుట్టిన తర్వాత పురుడు చేసిన మరునాడే దుబాయ్ వెళ్లాడు. మూడు నెలలకే హత్య కేసులో జైలుకెళ్లాడు. అప్పటి నుంచి ఆయన భార్య పద్మ భర్త కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఆమె 18ఏళ్ల నిరీక్షణ ఫలించాయి. దుబాయ్ జైలు నుంచి విడుదలై ఇంటికి చేరిన భర్త హనుమంతును చూసి కడుపులో దాచుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. ‘మాది రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద వడ్డెర కుటుంబం. ఉపాధి కోసం ఆయన (హనుమంతు) దుబాయ్ పోయిండు. అక్కడ జైలులో పడ్డడు. పద్దెనిమిదేళ్లుగా భర్త కోసం ఎదురుచూసిన. నా ఐదుగురు అన్నలు, ఇద్దరు తమ్ముళ్ల సహకారంతో తల్లిగారింట్లో ఉంటూ.. బీడీలు చేస్తూ, వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ కాలం వెళ్లదీసిన. మూడు, నాలుగు నెలలకు ఒకసారి భర్తతో ఫోన్లో మాట్లాడిన. భర్తను తలుచుకుని ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడిపిన. కూతురు గౌతమిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన. హనుమంతును ఇంటికి రప్పించేందుకు కేటీఆర్ సారును కలిసినం. కేటీఆర్ సారు కడుపు సల్లగుండ ఆయన చేసిన మేలుతో దుబాయ్ జైలు నుంచి నా భర్త బయటపడి ఇంటికి చేరిండు. ఆయన చేసిన మేలు జీవితకాలం మరిచిపోను..’ అని తన భర్త జైలు నుండి విడుదల కోసం కృషి చేసిన మాజీ మంత్రి కేటీఆర్‌కు హనుమంతు భార్య పద్మ కృతజ్ఞతలు తెలిపింది. -
వలస.. ఏదీ భరోసా?
ఉన్న ఊరిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతుండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు వలసబాట పడుతున్నారు. ఉపాధి అవకాశంతో పాటు అధిక వేతనాలు, మరింత మెరుగైన జీవనం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం.. పల్లెల నుండి పట్టణాలకు, ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటారు. ఒకదేశం నుండి మరో దేశానికి వెళ్లడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారు. నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం... నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన గాండ్ల రమణ ఉపాధి నిమిత్తం దాదాపు 12 ఏళ్లక్రితం ఒమన్ దేశానికి వెళ్లి కొన్ని నెలలక్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడ స్వయం ఉపాధి పొందేందుకు బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా తనకు ఏదైనా రుణం మంజూరు చేయించాలని కొన్నిరోజులక్రితం కలెక్టరేట్, డీఆర్డీవో, తదితర కార్యాలయాల్లో విన్నవించుకున్నాడు. రుణం మంజూరు కోసం కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటికీ ఎలాంటి సాయం అందలేదని గాండ్ల రమణ పేర్కొంటున్నాడు. గల్ఫ్ నుండి వాసస్ వచ్చిన ఇలాంటి వారు ఎందరో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. నిర్మల్‌ఖిల్లా: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వలసదారులు ఉజ్వల భవిష్యత్, తగిన గుర్తింపు కోసం తమ మాతృభూమిని వదిలి వేరొక దేశానికి వెళ్తుంటారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 80 వేలకు పైగా కా ర్మికులు వివిధ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లినట్లు గల్ఫ్ సంక్షేమ సంఘాలు పేర్కొంటున్నాయి. వీరే కాకుండా గల్ఫ్ దేశాల నుంచి తిరిగొచ్చిన జిల్లావాసులు దాదాపు 2 లక్షల వరకు ఉంటారని ప్రవాసీమిత్ర కార్మిక సంఘాల నాయకులు పేరొంటున్నారు. జిల్లా నుంచి గల్ఫ్‌కు వెళ్తున్న వ్యక్తులకు సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో ఎక్కువ మంది కూలీలు గానే పనులు చేస్తున్నారు. తిరిగొచ్చిన తర్వాత కూడా సరైన ప్రత్యామ్నాయ, ఉపాధి మార్గాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదీ నేపథ్యం.. వలస వెళ్తున్న పౌరులకోసం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 18ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం (ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే)గా ప్రకటించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 31 ఏళ్ల క్రితం 18 డిసెంబర్ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో ‘వలస కార్మికులు, కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఎంత స్వేచ్ఛా స్వతంత్రంగా విదేశాలకు వెళ్తున్నారో అంతే స్వేచ్ఛగా తిరిగిరావొచ్చని సభ తీర్మానం చేసింది. ప్రధాన డిమాండ్లు ► తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రవేశపెట్టాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చా లాకాలంగా అమలుకు నోచుకోవడంలేదు. తె లంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో 6 వేలకు పై గా తెలంగాణ ప్రవాసీయులు గల్ఫ్ దేశాలలో వి విధ కారణాలతో మృతి చెందగా రూ.5 లక్షల ఎ క్స్ గ్రేషియా కోసం కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని, రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్‌తో గల్ఫ్‌కార్మికుల సంక్షేమానికి, పునరావాసానికి కృషి చే యాలని ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్, గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. ► విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ముంబయిలో ఏర్పాటు చేసిన మాదిరి హైదరాబాద్‌లో ‘విదేశ్‌భవన్’ ఏర్పాటు చేయాలని, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లో పాస్‌పోర్టు ఆఫీసు, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ ఆఫీసు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) రీజినల్ ఆఫీసు, విదేశాంగ శాఖ బ్రాంచి సెక్రెటేరియట్లు ఉండాలని, ‘ప్రవాసీ తెలంగాణ దివస్’ అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోనివి.. ► హైదరాబాద్‌లో సౌదీ, యూఏఈ, కువైట్ దేశాల కాన్సులేట్లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటయ్యేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ► ప్రవాస భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణం కూడా చేర్చా లి. రూ.325 చెల్లిస్తే రెండు సంవత్సరాల కాలపరిమితితో ఇన్సూరెన్స్ ఇస్తారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ► ఎమిగ్రేషన్ యాక్టు–1983 ప్రకారం గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్ళడానికి సర్వీస్ చార్జీగా అభ్యర్థి 45 రోజుల వేతనం (రూ.30 వేలకు మించకుండా) మాత్రమే ఏజెంటుకు చెల్లించాలి. దీనిపై 18 శాతం జీఎస్టీ రూ.5,400 చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి.. ► అమాయకులైన వలస కార్మికుల రక్షణకు ఆరు అరబ్ గల్ఫ్ దేశాలతో సహా 18 దేశాలను ఈసీఆర్ దేశాలుగా వర్గీకరించిన 1983 లోని ఎమిగ్రేషన్ చట్టం యొక్క ప్రాతిపదిక ప్రకారం గల్ఫ్ బోర్డు ఏర్పా టు చేయాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలి. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ► జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత (సోషల్ సెక్యూరిటీ) పథకం ప్రవేశ పెట్టాలి. ► గల్ఫ్‌కు వెళ్లిన సన్నకారు, చిన్నకారు రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకం వర్తింపజేయాలి. వలసదారుల సంక్షేమానికి కృషి చేయాలి వలస కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. కేరళ తరహా ప్రత్యేక గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి. వార్షిక బడ్జెట్లో రూ.500 కోట్ల నిధులు కేటాయించాలి. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. గల్ఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలి. తిరిగి వచ్చిన కార్మికులకు ఉపాధికోసం ఆయా వ్యక్తుల నైపుణ్యాలను బట్టి ప్రభుత్వాలు తగిన చేయూతనివ్వాలి. – దొనికెన కృష్ణ, గల్ఫ్ జేఏసీ రాష్ట్ర నాయకుడు -
పోటీ చేస్తాం.. వలస గోస వినిపిస్తాం
మోర్తాడ్ (బాల్కొండ): ఎన్నికల ద్వారానే తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని గల్ఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను వేదికగా చేసుకుని గల్ఫ్ బోర్డు, సమగ్ర ప్రవాసీ విధానాన్ని (ఎన్ఆర్ఐ పాలసీ) సాధించాలని, అందుకోసం పోటీయే మార్గమని ఇటీవల సమావేశమై నిర్ణయించింది. 2019 పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 175 మంది పసుపు రైతులు నామినేషన్లు వేసి దేశం దృష్టిని ఆకర్షించిన విషయం విదితమే. ఇదే తరహాలో గల్ఫ్ ప్రభావం ఉన్న 32 అసెంబ్లీ నియోజకవర్గాలలో గల్ఫ్ బాధితులతో పెద్దసంఖ్యలో నామినేషన్లు వేయించి తమ డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలపాలని భావిస్తోంది. గల్ఫ్ జేఏసీ కార్యాచరణపై ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు సమాచారం సేకరిస్తున్నట్టు సమాచారం. 32 నియోజకవర్గాల్లో ప్రభావం! దాదాపు 15 లక్షల మంది తెలంగాణవాసులు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. మూడు దశాబ్దాలుగా మరో 30 లక్షల మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి తిరిగి వచ్చారు. గల్ఫ్ కార్మికుల కుటుంబసభ్యుల ఓట్లను లెక్కలోకి తీసుకుంటే సుమారు కోటి వరకు ఉంటుందని జేఏసీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల బరిలోకి దిగి తమ ప్రభావం చూపాలని జేఏసీ భావిస్తోంది. గల్ఫ్ వలసలు ఎక్కువగా ఉన్న బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి, కోరుట్ల, జగిత్యాల్, ధర్మపురి, ఎల్లారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు, బోధన్, పెద్దపల్లి, మక్తల్, దేవరకద్ర, మెదక్, సిద్దిపేట, దుబ్బాక, నల్లగొండ, మిర్యాలగూడ, భువనగిరి, పరిగి నియోజకవర్గాలను తాము ప్రభావితం చేయగలమని జేఏసీ చెబుతోంది. పోటీకి పలువురు సిద్ధం! గోవిందుల అఖిల, మండలోజు సుచరిత, నారుకుల్ల అనిత (జగిత్యాల జిల్లా గోపాల్పూర్, ఇబ్రహీంపట్నం, తిప్పాయిపల్లి), ముడా లక్ష్మి (నిర్మల్ జిల్లా కౌట్ల(కే) గల్ఫ్ జేఏసీ మద్దతుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ భర్తలు వివిధ కారణాలతో గల్ఫ్ దేశాల్లో మరణించగా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందలేదని, తమ గోడు వినిపించేందుకే పోటీకి దిగుతున్నట్టు వీరు చెబుతున్నారు. ఇంకా పలు నియోజకవర్గాల్లో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో మూకుమ్మడిగా నామినేషన్లు వేసే యోచనలో ఉన్నారు. ప్రభుత్వాలు మాట తప్పడంతోనే.. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు మాట తప్పడంతోనే ఎన్నికల్లో పోటీకి జేఏసీ సిద్ధమవుతోంది. – మంద భీంరెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు సత్తా చూపిస్తాం.. ఎన్నికల్లో పోటీ చేసి గల్ఫ్ వలస కార్మికుల సత్తా ఏమిటో చూపిస్తాం. ఎన్నికల బరిలో నిలిచి మా బలాన్ని నిరూపిస్తాం. –గుగ్గిల్ల రవిగౌడ్, గల్ఫ్ జేఏసీ చైర్మన్ -
గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న మనోళ్లు
మోర్తాడ్(బాల్కొండ): ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన మన దేశస్తులు పరాయి దేశాల చట్టాలపై అవగాహన లేక చేసిన చిన్నచిన్న తప్పులకు ఆయా దే శాల జైళ్లలోనే మగ్గిపోతున్నారు. రాయబార కా ర్యాలయాల ద్వారా న్యాయసాయం పొందే అవకాశా లు తక్కువగా ఉండడంతో ఏళ్ల తరబడి జైలు పక్షులుగానే ఉండిపోతున్నారు. విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల సంఖ్య, వారికి అందుతున్న న్యాయ సహాయంపై పలువురు ఎంపీలు పార్లమెంట్లో చర్చ లేవనెత్తారు. దీనిపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ఇచ్చిన సమాధానం ప్రకారం 82 దేశాల్లో అండర్ ట్రయల్ ఖైదీలతో పాటు వివిధ కేసుల్లో శిక్షపడి జైళ్లలో ఉన్న భారతీయుల సంఖ్య 8,343 మంది అని తేలింది. ఇందులో 4,755 మంది కేవలం ఆరు గల్ఫ్ దేశాల్లోని జైళ్లలో బంధించబడి ఉన్నారు. ఆరు దేశాల జైళ్లలో ఉన్న భారతీయులతో పోలిస్తే ఇతర 76 దేశాల జైళ్లలో ఉన్న వారి సంఖ్య తక్కువగా ఉంది. గల్ఫ్ దేశాలతో పాటు మలేషి యా జైళ్లలోనూ భారతీయులు ఎక్కువగానే ఉన్నా రు. అంటే కేవలం ఉపాధి కోసం వెళ్లినవారు వీసా నిబంధనలను అతిక్రమించి జైలు పాలైనట్లు వెల్లమవుతుంది. కంపెనీల వీసాలపై వెళ్లి ఆ కంపెనీల్లో పని నచ్చకపోతే కల్లివెల్లి కార్మికులుగా మారి పనిచేయడం చివరకు పోలీసులకు దొరికిపోవడంతో జైలు పాలయ్యారు. మరికొందరు విజిట్ వీసాలపై వెళ్లి వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోవడంతో కటకటాల పాలయ్యారు. ఇదిలా ఉండగా 31 దేశాలతో శిక్షార్హమైన వ్యక్తుల బదిలీపై మన విదేశాంగ శాఖ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందు లో గల్ఫ్ దేశాల్లోని ఒమాన్ మినహా మిగిలిన ఐదు దేశాలున్నాయి. అయినా ఖైదు చేయబడ్డ భారతీయులకు విముక్తి లభించడం లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి వివిధ దేశా ల్లోని జైల్లో మగ్గుతున్న భారతీయులను మాతృదేశానికి చేరి్పంచాలని పలువురు కోరుతున్నారు. న్యాయసాయం అందించాలి గల్ఫ్ దేశాల్లో అండర్ ట్రయల్ ఖైదీలతో పాటు శిక్షపడిన ఖైదీల సంఖ్యను కేంద్రం వెల్లడించిన సంఖ్య కన్నా ఎక్కువ మందే జైళ్లలో ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మరో ఐదువేల మంది ఔట్ జైళ్లలో ఉన్నారని సమాచారం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయసాయం అందించాలి. – మంద భీంరెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకులు -
నిజామాబాద్ ఫస్ట్.. హైదరాబాద్ సెకండ్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటికీ గల్ఫ్ దేశాలకు భారీగా వలసలు కొనసాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది. వలస వెళ్లిన వారిలో అత్యధికులు నిజామాబాద్ జిల్లా వారు కాగా... హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. కేంద్రం అధీనంలోని విదేశాంగశాఖ ఇటీవల వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2021లో రాష్ట్రం నుంచి మొత్తం 4,375 మంది గల్ఫ్ దేశాల బాట పట్టారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికే ఈ సంఖ్య 8,547కు చేరింది. ప్రభావం చూపని ఆ వృత్తులు.. హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు తూర్పు మండలంలోని కొన్ని ప్రాంతాల నుంచి యువకులు ఖతర్, యూఏఈ, సౌదీ, ఒమన్, కువైట్, బర్హేన్‌లకు వలస వెళ్లడం ఏళ్లుగా సాగుతోంది. ఇలా అత్యధికులు అసంఘటిత రంగ కార్మికులుగానే వెళ్తున్నారు. ఆయా దేశాలకు వెళ్లిన వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తుంటుంది. ఇటీవల కాలంలో వివిధ రకాలైన డెలివరీ యాప్‌లకు డెలివరీ బాయ్స్‌గా, బైక్ ట్యాక్సీలు నిర్వహిస్తున్న వాళ్లు కూడా నగరంలో ఉంటూనే ఈ మొత్తాన్ని ఆర్జిస్తున్నారు. దీని ప్రభావంతో వలసల సంఖ్య నానాటికీ తగ్గాల్సి ఉంది. అయినప్పటికీ వలస వెళ్లే వారి సంఖ్య గతేడాది కంటే ఈ ఏడాది పెరగడం గమనార్హం. గతేడాది ఖతర్‌కే అత్యధికులు.. ఈసారి ఫిఫా వరల్డ్ కప్‌నకు ఖతర్ ఆతిథ్యమిచ్చింది. దీనికోసం దాదాపు రెండు మూడేళ్లుగా అక్కడ భారీ ఫుట్‌బాల్ స్టేడియాలు, క్రీడాకారులకు అవసరమైన బస కోసం ప్రాంగణాలు తదితరాలను నిర్మించారు. వీటిలో పని చేయడానికి అక్కడి వారితో పాటు పెద్ద ఎత్తున వలస కూలీలు అవసరమయ్యారు. ఈ కారణంగానే ఆయా కాంట్రాక్టర్లు దళారుల సాయంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మందిని ఆకర్షించారు. గతేడాది రాష్ట్రం నుంచి ఖతర్‌కు వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నాటికే ఆయా నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో ఆ దేశానికి వెళ్లే వారి సంఖ్య ఈ ఏడాది తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. గణనీయంగా పెరిగిన పుష్పింగ్.. ఆయా దేశాలకు అసంఘటిత, సెమీ స్కిల్డ్ లేబర్‌గా వెళ్లే వారు విమానాశ్రయంతో కచ్చితంగా తమ పాస్‌పోర్టు, వీసాలపై ఇమ్మిగ్రేషన్ స్టాంప్ వేయించుకోవాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ స్టాంప్ రిక్వైర్డ్గా (ఈసీఆర్) దీనికి అనేక నిబంధనలు ఉంటాయి. దీంతో అనేక మంది వలసదారులు ఇమ్మిగ్రేషన్ స్టాంప్ నాట్ రిక్వైర్డ్ (ఈసీఎన్ఆర్) విధానంలో దేశం దాటాలని భావిస్తుంటారు. ఇలాంటి వారికి సహకరించడానికి విమానాశ్రయం కేంద్రంగా కొందరు పని చేస్తుంటారు. విజిట్, టూరిస్ట్ వీసాలపై వెళ్తున్న వీరిని తనిఖీలు దాటించి విమానం ఎక్కించడాన్నే ‘పుష్పింగ్’ అని పిలుస్తుంటారు. ప్రతి నిత్యం శంషాబాద్ విమానాశ్రయం నుంచి అనేక మంది ఈ విధానంలో బయటకు వెళ్లిపోతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అక్రమంగా వెళ్లి అష్టకష్టాలు.. సాధారణంగా విదేశాల్లో పని చేయడానికి వెళ్లే వాళ్లు వర్క్ పర్మిట్ తీసుకుని వెళ్లాలి. ఇలా చేస్తే వారికి ఉద్యోగ, వ్యక్తిగత భద్రతతో పాటు ఇతరు సదుపాయాలు లభిస్తాయి. అయితే పుష్ఫింగ్ ద్వారా దేశం దానికి అక్రమ వలసదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్లు గల్ఫ్ దేశాల్లో చిక్కుక్కుపోయి ఇబ్బందులు ఎదుర్కోవడం, కొన్నిసార్లు డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పి పంపడం) ప్రక్రియను ఎదుర్కోవాల్సి వస్తోంది. కొందరు అక్రమ వలసదారులు ఆ దేశాల్లోని జైళ్లలోనూ మగ్గుతున్నారు. అక్కడ ఉండగా ఏదైనా జరగరానిది జరిగితే వారి కుటుంబీకులు, బంధువులకు కడసారి చూపులు దక్కడమూ గగనంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: ముంబై, బెంగళూరులను మించిపోయిన రంగారెడ్డి జిల్లా) -
గల్ఫ్ దేశాల్లో వలస కార్మికుల రక్షణే ధ్యేయంగా
-
గల్ఫ్ దేశాల్లో వలస కార్మికుల రక్షణే ధ్యేయంగా
గల్ఫ్ వలసలు - ఘర్ వాపసీ, కార్మికుల పునరావాసం గురించి ఐఎల్ఓ (ఇంటర్నేషనల్ లేబర్ మైగ్రేషన్) ప్రతినిధులతో గల్ఫ్ జేఏసీ ప్రతినిధులు చర్చించారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఐఎల్ఓ దక్షిణ ఆసియా దేశాల ఇంచార్జి, కార్మికుల వలస వ్యవహారాల నిపుణుడు డినో కోరెల్, సాంకేతిక నిపుణుడు అమిష్ కర్కి హైదరాబాద్‌లో వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల నుండి వివిధ కారణాల వలన తిరిగి వచ్చిన వలస కార్మికులకు స్వగ్రామాలలో పునరావాసం కల్పించడం, వారు సమాజంతో, కుటుంబంతో మమేకమవ్వడం వంటి అంశాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు భీం రెడ్డి తెలిపారు. అంతకు ముందు ఐఎల్ఓ ప్రతినిధి సంజయ్ అవస్థి, ఐఓఎం (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్) ప్రతినిధి డగ్మార్ వాల్టర్ ల ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిలతో సమావేశమయ్యారు. -
భారత్ జోడో యాత్ర: గల్ఫ్ కార్మిక హక్కుల ఉద్యమకారులకు దక్కిన గౌరవం
పున:ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో పాల్గొనేందుకు పౌర సమాజ సంస్థల ప్రతినిధులతో పాటు, గల్ఫ్ వలస కార్మిక హక్కుల ఉద్యమకారులు స్వదేశ్ పరికిపండ్ల, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ఉమ్మడి నాగరాజు పాల్గొన్నారు. భారత్ జోడో యాత్రలో ఉదయం నడక ముగిసిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం బొందల్‌కుంట తాత్కాలిక శిబిరంలో 'యాత్రీస్' ఇతర ప్రముఖులకు వసతి ఏర్పాటు చేశారు. శిబిరంలో మధ్యాహ్న భోజనం సందర్భంగా కొందరు సహ యాత్రికులతో గల్ఫ్ కార్మిక నాయకులు ముచ్చటించారు. రాజ్య సభ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్, తెలంగాణ శాసన సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీలు మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్, సామాజిక ఉద్యమకారిణి సజయ కాకరాల, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి లను గల్ఫ్ జేఏసీ నాయకులు స్వదేశ్ పరికిపండ్ల, సింగిరెడ్డి నరేష్ రెడ్డిలు కలిశారు. గల్ఫ్ కార్మికుల సమస్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్ళడానికి, ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ పాదయాత్ర ద్వారా తమకు ఒక అవకాశం లభించిందని సింగిరెడ్డి నరేష్ రెడ్డి తెలిపారు. గల్ఫ్ కార్మిక నాయకుల రెండవ బృందం నవంబర్ 1 నుంచి యాత్రలో పాల్గొంటుందని ఆయన తెలిపారు. -
గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి.. గోస
సిరిసిల్ల: గల్ఫ్ ఏజెంట్ల చేతిలో కొందరు తెలంగాణ యువకులు మోసపోయారు. దుబాయ్ ఎయిర్ పోర్టులో చిక్కిన యువకులు ఆదివారం తమ గోడును వీడియో ద్వారా మీడియాకు పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లికి చెందిన గుగులోత్ అరవింద్, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన పెద్దోళ్ల స్వామి, కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన గొల్లపెల్లి రాము, చందుర్తి మండలం ఎన్గల్‌కు చెందిన అనిల్, నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్‌పల్లికి చెందిన నరేందర్‌లు ఐదు నెలల క్రితం కంపెనీ వీసాలపై దుబాయ్ వెళ్లారు. గల్ఫ్ ఏజెంట్లు ఇండియాలో వీసాకు ఇంటర్వ్యూలు చేసినప్పుడు చెప్పిన పని కాకుండా.. వేరే లేబర్ పని చేయిస్తున్నారని, చెప్పిన విధంగా జీతం ఇవ్వడం లేదని బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై కంపెనీలో గొడవ జరిగిందని, ఇటీవల కంపెనీ హెచ్ఆర్ అధికారులు ‘మీరు క్యాంపు నుంచి వెళ్లిపోండి’అంటూ.. పాస్‌పోర్టులు ఇచ్చారని బాధితులు తెలిపారు. పాస్‌పోర్టులు చేతికి రావడంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విమాన టికెట్‌కు డబ్బులు తెప్పించుకున్నామని వివరించారు. స్వస్థలాలకు వచ్చేందుకు విమాన టికెట్లు కొనుక్కొని ఎయిర్ పోర్టుకు వస్తే.. బోర్డింగ్ అయిన తరువాత ఎయిర్ పోర్టు అధికారులు ‘మీ మీద కేసులు ఉన్నాయి.. మీరు తాగి క్యాంపులో గొడవ చేశారట.. వాటిని పరిష్కరించుకుని రావాలి’అని విమాన టికెట్లు చింపేసి, వెనక్కి పంపించారని వెల్లడించారు. తమ అందరి లగేజీ ఎయిర్ పోర్టులోనే ఉందని వాపోయారు. మూడురోజులుగా ఎయిర్ పోర్టులోనే.. ఎయిర్ పోర్టులోనే మూడు రోజులుగా ఉంటున్నామని బాధి తులు తెలిపారు. అయితే ఎవరూ స్పందించడం లేదని, తిండి, నీళ్లు లేక ఎయిర్ పోర్టు పరిసరాల్లో కట్టుబట్టలతో గడుపు తున్నట్లు వివరించారు. పోలీసులు వస్తే.. పక్కకు తప్పుకుంటూ.. భయం భయంగా ఉంటున్నామని వాపోయారు. మంత్రి కేటీఆర్‌కు వినతి ఏజెంట్ల మాటలతో మోసపోయామని, తమను ఇండియాకు రప్పించేందుకు మంత్రి కేటీఆర్ సహకరించాలని వీర్నపల్లికి చెందిన యువకుడు అరవింద్ వీడియోలో కోరారు. దయచేసి తమను ఇంటికి చేరేలా చూడాలని, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నామని బాధితులు మంత్రిని వేడుకున్నారు. దుబాయ్‌లో చిక్కిన తెలంగాణ యువకుల గోడు సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
మస్కట్‌లో తెలుగు మహిళకు వేధింపులు, ఏపీ మహిళా కమిషన్ సీరియస్
తిరుపతి: తిరుపతి జిల్లా నుంచి ఉపాధికి గల్ఫ్ దేశానికి వెళ్లిన మహిళను అక్కడి ఏజెంట్లు వేధిస్తున్న వైనంపై 'ఏపీ మహిళా కమిషన్' తీవ్రంగా స్పందించింది. తక్షణమే బాధితురాలిని రక్షించి దేశం తీసుకొచ్చేందుకు కమిషన్ కసరత్తు ప్రారంభించింది. మహిళా కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి స్వయంగా రంగంలోకి దిగి బాధితురాలిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వివరాల్లోకొస్తే... తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం బోడెవడ్లపల్లి పంచాయతీలోని చెట్టి హరిజనవాడకు చెందిన కె.సులోచన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తన బాధలను అదే మండలానికి చెందిన ఏజెంట్ రత్నమ్మ చెప్పుకోగా ఆమె తన పరిచయ సంబంధాలతో గల్ఫ్ ఏజెంట్ లను కుదిర్చింది. సులోచన మస్కట్ దేశానికి వెళ్లాక, అక్కడ ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో ఆమె మరలా ఇక్కడికొచ్చేందుకు ప్రయత్నం చేసింది. అయితే, మస్కట్ విడిచి పోవాలంటే తమకు రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ బెదరిరిస్తూ...తీవ్రంగా శారీరక, మానసిక వేధింపులకు గురిచేశారని, ఈ క్రమంలో కాలు గాయపడటంతో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లు వైరల్ వీడియోలో బాధితురాలు కె.సులోచన చెప్పింది. దీనిపై సులోచన బంధువులు స్థానిక పోలీసులకు ఫిర్యాదిచ్చారు. ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు, రాయలసీమ జిల్లాల పర్యవేక్షకులు గజ్జల లక్ష్మి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటో కేసుగా స్వీకరిస్తుందని... తక్షణమే బాధితురాలిని రక్షించే ఏర్పాట్లకు పూనుకోవాలని గురువారం ఏపీ ఎన్.ఆర్.టీ కార్యాలయానికి వెళ్లి లేఖను అందించి సీఈవో మాట్లాడారు. అదేవిధంగా విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు, ఏపీ ఎన్.ఆర్.టీ అధ్యక్షులు మేడపాటి ఎస్. వెంకట్ తో కూడా ఆమె ఫోన్ లో మాట్లాడి మస్కట్ బాధితురాలు కె. సులోచన విషయం వివరించారు. ఆమెను స్వగ్రామం రప్పించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటర్ పోల్ తో పాటు భారత రాయబార కార్యాలయంతో మాట్లాడించేందుకు గజ్జల లక్ష్మి ప్రయత్నించారు. బాధితురాలి వీడియో వైరల్ అనంతరం ఆమె సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ అవ్వడానికి తీవ్రంగా పరిగణలోకి తీసుకుని సత్వరమే భారత రాయబార కార్యాలయం టీమ్ రంగంలో దిగాలని ఆమె కోరారు. ఏపీ ఎన్.ఆర్.టి అధికారుల హామీమేరకు గజ్జల లక్ష్మి బాధితురాలి బంధువులకు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితురాలు సులోచనను దేశానికి రప్పించే కసరత్తును వివరించారు. భవిష్యత్తులోనూ గల్ఫ్ దేశాలలో ఉపాధికి వెళ్లిన మహిళల భద్రత, రక్షణ పర్యవేక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ తగిన ప్రణాళికను అమలు చేస్తుందని మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి స్పష్టం చేశారు. -
వేతన పోరులో గెలిచిన గల్ఫ్ కార్మికులు
భారత ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు 30 నుండి 50 శాతం కనీస వేతనాలు (మినిమం రెఫరల్ వేజెస్) తగ్గిస్తూ గత సంవత్సరం సెప్టెంబర్ లో జారీ చేసిన రెండు సర్కులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కోరుతూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) పై బుధవారం (28.07.2021) తుది విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి. విజయసేన్ రెడ్డిల ధర్మాసనం జరిపిన విచారణకు పిటిషనర్ తరఫున న్యాయవాది బి. రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు కొత్తగా ఉద్యోగానికి వెళ్లేవారితో సహా ప్రస్తుతం గల్ఫ్ లో పనిచేస్తున్న 88 లక్షల మంది భారతీయుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే సర్కులర్లను రద్దు చేయాలని న్యాయవాది రచనారెడ్డి తన వాదనలు వినిపించారు. వేతనాలు తగ్గిస్తూ జారీ చేసిన సర్కులర్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని వాదించారు. వేతనాలను తగ్గిస్తూ సెప్టెంబర్ 2020 లో జారీ చేసిన సర్కులర్లను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకున్నదని, పాత వేతనాలను కొనసాగించాలని నిర్ణయించిందని ఈమేరకు ఈనెల 15న ఉత్తర్వులను జారీ చేసిందని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నామవరపు రాజేశ్వర్ రావు హైకోర్టుకు నివేదించారు. సమస్య పరిష్కారం అయినందున భీంరెడ్డి దాఖలు చేసిన 'పిల్' ను ముగిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
గల్ఫ్ కార్మికులకు శుభవార్త !
గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాల తగ్గింపుపై కేంద్రం తన పంథాను మార్చుకుంది. గత సెప్టెంబరులో జారీ చేసిన సర్క్యులర్లను రద్దు చేసింది. 2019-20లో ఉన్నట్టుగానే కనీస వేతనాలు ఉంటాయంటూ పార్లమెంటులో ప్రకటన చేసింది. మంత్రి ప్రకటన ప్రస్తుతం ఆరు గల్ఫ్ దేశాలలో కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 2019-20 లో ఉన్నట్లుగానే ఉన్నాయి. గల్ఫ్‌లో ఉన్న భారతీయుల ఉపాధిని కాపాడటానికి 10 నెలల స్వల్ప కాలానికి... కనీస వేతనాలను తక్కువ స్థాయికి సర్దుబాటు చేయడం జరిగింది. లేబర్ మార్కెట్ స్థిరీకరించబడినందున, మునుపటి కనీస వేతనాలను మరోసారి వర్తింపజేస్తామ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ రాజ్యసభకు తెలిపారు. కేరళకు చెందిన ఎంపీ ఎంవీ శ్రేయాన్స్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గత సెప్టెంబరులో ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు కనీస వేతనాలు (మినిమం రెఫరల్ వేజెస్)ను 30 నుంచి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం గత సెప్టెంబర్ లో సర్కులర్లను జారీ చేసింది. తాజాగా వాటిని రద్దు చేసి పాత వేతనాలను కొనసాగించాలన్న కార్మికులు, ఉద్యోగుల డిమాండును ఎట్టకేలకు కేంద్రం అంగీకరించింది. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 88 లక్షల మంది భారతీయ కార్మికులు, ఉద్యోగుల ఆదాయంపై తీవ్రమైన ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతో గల్ఫ్ ప్రవాసుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. కేంద్రంపై ఒత్తిడి కనీస వేతనాల తగ్గింపు సర్కులర్ల రద్దు చేయాలని కోరుతూ గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ జెఏసీ చేసిన ఉద్యమానికి కేంద్రం తల ఒగ్గింది. కనీస వేతనాల తగ్గింపుపరై తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఈ సమస్యపై ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. మరోవైపు గల్ఫ్ కార్మికనేత మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో పిల్ వేశారు. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి కొనసాగించడంతో వేతన తగ్గింపు నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకుంది. 29న హైకోర్టులో విచారణ గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబర్ లో జారీ చేసిన రెండు సర్కులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కోరుతూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి ఫిబ్రవరిలో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డిల ధర్మాసనం ఈ కేసును ఈనెల 29న విచారించనున్నది. గల్ఫ్ జేఏసీ శ్రమతో మార్చిలో జరిగిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్‌తో పాటు అన్ని పార్టీల ఎంపీలకు గల్ఫ్ జేఏసీ బృందం వినతిపత్రాలు సమర్పించింది. గల్ఫ్ జెఏసి బృందంలో గుగ్గిళ్ల రవిగౌడ్, స్వదేశ్ పరికిపండ్ల, తోట ధర్మేందర్, మెంగు అనిల్, పంది రంజిత్, పొన్నం రాజశేఖర్, బద్దం వినయ్, దాసరి మల్లిఖార్జున్, గన్నారం ప్రశాంత్, పట్కూరి బసంత్ రెడ్డి, కోటపాటి నరసింహ నాయుడు ఉన్నారు. -
అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించిన ప్రవాసి సంఘం
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో జారీ చేసిన రెండు సర్క్యులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కోరుతూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. వేతనాలు తగ్గిస్తూ జారీచేసిన సర్క్యులర్లు రాజ్యాంగ విరుద్ధం, ఏకపక్షం, అసమంజసం, విచిత్రం, అహేతుకం, జీవించే ప్రాథమిక హక్కును ఉల్లంఘించే విధంగా ఉన్నందున ప్రేరేపించబడి జారీచేయబడ్డ ఆ సర్కులర్లను చెల్లుబాటు లేనివిగా (క్వాష్) ప్రకటించాలని పిటిషనర్ భీంరెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డిల ధర్మాసనం కేసును గురువారం విచారణకు స్వీకరించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి కేసు వాదించారు. భారత ప్రభుత్వ విదేశాంగ కార్యదర్శి, హైదరాబాద్ లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. కేసు తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం 29 జులై కి వాయిదా వేశారు. ఇలాంటి మరొక కేసును కలిపి విచారించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా మంద భీంరెడ్డి మాట్లాడుతూ తగ్గించిన కనీస వేతనాల వలన గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 88 లక్షల మంది భారతీయుల ఆదాయంపై భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావం పడుతుందని, వారు మరింత పేదరికంలోకి జారిపోనున్నారన్నారు. గత మూడు నెలలుగా గల్ఫ్ కార్మిక సంఘాలు పాత వేతనాలను కొనసాగించాలని, కనీస వేతనాలను తగ్గిస్తూ జారీచేసిన సర్క్యులర్లను రద్దు చేయాలని ఉద్యమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల గల్ఫ్ జేఏసీ ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్లి ఎంపీలు, కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించారని, కేంద్రం ఈ విషయాన్ని మానవతా దృక్ఫథంతో ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 2020 లో సర్క్యులర్ల జారీ కంటే ముందు... బహ్రెయిన్ లో కనీస వేతనాలు హెల్పర్ కు 318 డాలర్లు, ఫోర్మాన్ కు 662 డాలర్లు, ఒమాన్ లో క్లినర్ కు 208 డాలర్లు, ఫోర్మాన్ కు 520 డాలర్లు, యుఏఇ లో క్లినర్ కు 259 డాలర్లు, హెవీ డ్రైవర్‌కు 637 డాలర్లు కనీస వేతనాలుగా ఉండేవి. అందరినీ ఒకేగాటన కట్టి అన్ని వృత్తులకు, అన్ని కేటగిరీల కార్మికులకు కనీస వేతనం 200 డాలర్లుగా తగ్గిస్తూ సర్క్యులర్లు జారీ చేశారు. ఖతార్‌లో పనిచేసే అన్ని దేశాల కార్మికులకు ఎలాంటి వివక్ష లేకుండా కనీస వేతనం 1,000 రియాళ్ళు, అకామడేషన్ (వసతి)కి 500 రియాళ్ళు, భోజనానికి 300 రియాళ్ళు చెల్లించాలనే చట్టం 20 మార్చి 2021 నుండి అమలులోకి వచ్చింది. భారత ప్రభుత్వం మాత్రం తమ కార్మికులను 728 రియాళ్ళ కనీస వేతనానికి పంపిస్తామని సర్కులర్లు జారీ చేయడం ఆశ్చర్యకరమని మంద భీంరెడ్డి అన్నారు. తగ్గించిన వేతనాలతో గల్ఫ్ దేశాలలో కనీస జీవన ప్రమాణాలను కొనసాగించడం కష్టమని, సర్క్యులర్లత జారీ కంటే ముందు ఉన్న వేతనాలను పునరుద్ధరించాలని ఆయన కోరారు. చదవండి: నాడు-నేడుకి తానా ఫౌండేషన్ రూ.50 లక్షల విరాళం ఆ ఎన్నారై భర్తలపై జూలైలో విచారణ -
గల్ఫ్ ఏజెన్సీపై సీబీఐ విచారణకు డిమాండ్
-
గల్ఫ్ ఏజెన్సీపై సీబీఐ విచారణకు డిమాండ్
లైసెన్సు ముసుగులో అమాయకులైన కార్మికులను గల్ఫ్ దేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తూ మానవ అక్రమ రవాణా చేస్తున్న ఏజెన్సీపై తాను చేసిన ఫిర్యాదుపై ఏమి చర్యలు తీసుకున్నారో తెలుపాలని ఒక గల్ఫ్ బాధితుడి భార్య ఈనెల 20న సమాచార హక్కు చట్టం క్రింద జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించిన సంఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాలకు చెందిన తంగెళ్ల గంగారాం, తంగెళ్ల సత్యం అనే ఇద్దరు గల్ఫ్ ఏజెంట్లు కార్తీక్ ఇంటర్నేషనల్ అనే పేరుతో గల్ఫ్ ఉద్యోగాల రిక్రూటింగ్ ఏజెన్సీ లైసెన్సును అడ్డంపెట్టుకొని కార్మికులను విజిట్ వీసాలతో దుబాయికి పంపిస్తూ మోసానికి పాల్పడుతున్నారని జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన కొక్కెరకాని గంగజల సంవత్సర కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతూ పోరాటం చేస్తున్నది. గల్ఫ్ ఉద్యోగ వీసా కోసం తమ వద్ద రూ.68 వేలు తీసుకొని తన భర్త కొక్కెరకాని పోశన్నను విజిట్ వీసాలో దుబాయికి పంపారని, పక్షవాతానికి గురై దుబాయి నుండి వాపస్ వచ్చిన పోశన్నకు ఒక లక్ష రూపాయల విలువైన ఆరోగ్య బీమా అందకపోవడానికి ఏజెంట్ల అక్రమదందా కారణమని గంగజల ఆరోపించారు. ఇసిఆర్ పాస్ పోర్టు కలిగిన పోశన్నకు చట్టబద్దంగా రూ.10 లక్షల విలువైన 'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే ప్రమాద బీమా పాలసీ, ఒక లక్ష రూపాయల ఆరోగ్య బీమా పొందడానికి అర్హత ఉన్నదని ఆమె అన్నారు. ఒప్పుకున్న ప్రకారం బీమా పాలసీ జారీ చేయలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. -
గల్ఫ్ కార్మికునిపై కరోనా కాటు
జన్నారం(ఖానాపూర్): కరోనా వైరస్ ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. కొందరు పనుల్లేక ఇబ్బందులు పడుతుంటే మరికొందరు ఇంటికి రాలేక పస్తులుండి కానరాని లోకాలకు వెళ్తున్నారు. జన్నారం మండలం మహ్మదబాద్కు చెందిన కొండగొర్ల శంకర్ (42) కరోనా వైరస్ కారణంగా పనుల్లేక 20 రోజులుగా పస్తులున్నాడు. అనారోగ్యం బారిన పడి మృత్యువాత పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శంకర్ ఏడాది క్రితం విజిట్ వీసాపై ఇరాక్ దేశం వెళ్లాడు. ఎర్బిల్ ప్రాంతంలో పనికి కుదిరాడు. కరోనా కారణంగా ఏప్రిల్‌లో ఇరాక్‌లో లాక్డౌన్ ప్రకటించారు. దీంతో పనిలేక రోడ్డున పడ్డాడు. తెలిసిన వారు లేకపోవడంతో ఆకలికి అలమటిస్తూ రోడ్డుపక్కన పడిపోయాడు. గమనించిన కొందరు అతన్ని అక్కడి ఆసుపత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న జగిత్యాల జిల్లాకు చెందిన కొందరు అతన్ని చేరదీశారు. అప్పటికే అనారోగ్యం బారిన పడ్డ శంకర్ బుధవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతదేహాన్ని అక్కడి తెలుగు గల్ఫ్ అసోసియేషన్ సభ్యులు ఎలగొండ దక్షణమూర్తి, రాయలవారి రాంచందర్‌లు ఎర్బిల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి భార్య సత్తవ్వతో పాటు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని సత్తవ్వ ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి... ఇరాక్‌లోని ఎర్బిల్‌లో పనిచేస్తున్న కొండగొర్ల శంకర్ అనారోగ్యంతో మంచం పట్టిన విషయాన్ని ఈనెల 21న సాక్షిలో ‘ఉపాధి వేటలో జీవచ్ఛవాలు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమురయ్య విషయాన్ని ఎన్ఆర్ఐ శాఖ ప్రభుత్వ అధికారి చిట్టిబాబు దృష్టికి తీసుకెళ్లాడు. కానీ ఆయన స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకునే లోపే శంకర్ మృతి చెందడం దురదృష్టకరం. కరోనా సమయంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదని పలువురుఆరోపిస్తున్నారు. -
గల్ఫ్ జీవితాలపై కరోనా దెబ్బ
కోహెడరూరల్(హుస్నాబాద్): పొట్ట నింపుకోవడానికి పని చేస్తున్నామా.. పని చేయడానికే తింటున్నామా..అని తెలియని గల్ఫ్ బతుకులు ఆందోళనలో పడ్డాయి. తల్లిదండ్రుల గోస తీర్చడానికి కాసుల వేటకు వెళ్లిన జీవితాలు ఆగమయ్యాయి. ఖర్చు పేట్టే ప్రతీ పైసా విలువ తెలిసిన గల్ఫ్ బతుకుల్లో కరోనా మహమ్మరి నీళ్లు చల్లింది. ఉన్న ఊరిని, అయిన వారిని వదిలి పెట్టి ఎడారి దేశాలకు ప్రయాణమైన బిడ్డలకు గల్ఫ్‌లో తిండి తిప్పలు లేక కంటి మీద కునుకులేకుండా పోయింది. క్షణ క్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు. నాలుగు నెలల నుంచి తినడానికి తిండిలేక పస్తులుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఉన్న ఊరికి వచ్చి కన్నోళ్లను, కట్టుకున్న వారిని చూడాలని కళ్లు కాయలు కాసేలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎడారి దేశంలో ప్రతి రోజు కరోనాతో యుద్ధం చేస్తున్న గల్ఫ్ అన్నలు పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనం.. పేదరికం, ఆడబిడ్డల పెళ్లి కోసం అప్పులు చేసి కొందరు.. ఇల్లు కట్టి అప్పు అయిందని మరికొందరు.. ఎంత చదివినా సరిపడా వేతనం వచ్చే ఉద్యోగం రాక విద్యార్థులు ఇలా చాలా మంది వివిధ కారణాలతో నాలుగు రాళ్లు సంపాదించి కుటుంబ కష్టాలు తిరుద్దామని అప్పులు చేసి అరబ్ దేశాలకు వెళ్లిన బతుకుల ఆశలు కరోనా సమాధి చేసింది. అప్పటికే అందరిని వదిలి పరాయి దేశాలకు వెళ్లిన వలస జీవుల బతుకులను కరోనా రూపంలో కష్టాలు చుట్టుముట్టాయి. చేతిలో చిల్లి గవ్వ లేక ఆకలితో అల్లాడుతూ..ఇరుకు గదుల్లో బిక్కుబిక్కుమంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు స్థానికులను తప్ప ప్రవాసులను పట్టించుకోకపోవడంతో భయం గుప్పిట్లో వలస కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 80 వేల మంది.. ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 80 వేల మంది వలస కార్మికులు విదేశాల్లో ఉన్నారు. దీంతో ఆ కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఇక్కడి ప్రాంతం నుంచి ఎక్కువగా సౌది, ఓమన్, కత్తర్, కువైట్, మస్కట్, బెహరన్ దేశాలకు ఉపాధి కోసం ఎంతో మంది వెళ్లారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తో ఇక్కడి కుటుంబాల్లో ఆందోళన నిండింది. తమ వారు ఎలా ఉన్నారో తెలియక ఆందోళన చెందుతున్నారు. మా బతుకుల్లో వెలుగు నింపడానికి వెళ్లిన బతుకులు ఎలా ఉన్నాయో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమ వారు అక్కడ ఎలా ఉన్నారో అని ఫోన్లలో వీడియే కాల్ చేసి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. తినడానికి డబ్బులు లేకపోతే చెప్పు బిడ్డ అప్పోసప్పో చేసి పంపిస్తా అని ఓతల్లి తన బిడ్డకు చేప్తూ గుండెలు పగిలేలా రోధించింది. ఇక్కడికి నువ్వు మంచిగా వస్తే కూలీనాలి చేసి బతుకుదాం రా బిడ్డ అని కూమారుడికి ధైర్యం చెప్పింది. గల్ఫ్‌లో పరిస్థితి ఇలా... గల్ఫ్‌లో ఉన్న వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. చేయడానికి పని లేదు. చేతిలో చిల్లి గవ్వ లేదు. సుమారు 3నెలల నుంచి పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో పనులు లేక తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడుతున్నారు. ఉన్న ఊరిలో ఉపాధి లేక తాత్కాలిక వీసాలపై విదేశాలకు వెళ్లినవారు అక్కడ బిల్డింగ్ వర్క్, ప్లంబర్, లేబర్ కూలీ, డ్రైవర్, హోటళ్లు, ఐటీపరిశ్రమ, చమురు, గ్యాస్ స్టేషన్లు తదితర రంగాల్లో పనులు చేస్తున్నారు. కరోనా వైరస్‌తో అక్కడ అన్ని కంపేనీలు మూసి వేశారు. దీంతో అక్కడ ఉపాధి పొందుతున్న భారతీయులు భారీగా నష్టపోతున్నారు. అలాగే ఇరుకు గదుల్లో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ఉంచుతున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దేశాలకు వద్దామంటే విమానాలు లేవని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి అనారోగ్యంతో మరణించగా ఐన వారు తోడు లేక కుటుంబ సభ్యుల చివరి చూపుకు నోచుకోక గల్ఫ్ కారి్మకుల రక్షణ సమితి సభ్యులు కుటుంబ సభ్యులుగా అండగా నిలబడి అంత్యక్రియలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి 2 సంవత్సరాల క్రితం దూబాయ్ వెళ్లాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నెల రోజుల క్రితం మరణించాడు. కరోనా నేపథ్యంలో విమానాలు లేకపోవడంతో మృతదేహాన్ని స్వదేశానికి పంపలేక దూబాయ్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. భయం భయంగా బతుకుతున్నాం... ప్రతీ క్షణం భయం భయంగా బతుకుతున్నాం. ఫిబ్రవరి నుంచి ఇక్కడ పనులు లేక కంపెనీలు మూత పడ్డాయి. మేము పని చేసిన చివరి నెల జీతం కూడా కంపెనీ చెల్లించలేదు. ఒక్క గదిలో పరిమితికి మించి ఉంటున్నాం. ఇక్కడ ఉండటానికి ఇంటి నుంచే పైసలు పంపుతున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు కొంచెం ఆదుకుంటున్నాయి. ప్రభుత్వం స్పందించి దేశానికి రప్పించాలి. – నాయిని అనిల్, దుబాయ్‌లో ఉన్న యువకుడు స్వదేశానికి రప్పించండి... కరోనాతో పని లేక ఇబ్బంది పడుతున్న గల్ఫ్ కార్మికులను స్వదేశానికి రప్పించాలి. గల్ఫ్ కారి్మకులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దేశం కాని దేశంలో కార్మికులు తిండిలేక పరిగడుపున నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ఇండియాకు రప్పించాలి. ఉన్నత కుటుంబాలకు చెందిన వారిని ప్రత్యేక విమానాల ద్వారా రప్పిస్తున్న మోదీ వలస కారి్మకులను పట్టించుకోవడం లేదు. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ కార్మికులను రప్పించాలి. – మంద పవన్, సీపీఐ జల్లా కార్యదర్శి, సిద్దిపేట -
ఉచితమని.. డబ్బులు కట్టమంటున్నారు !
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): ‘గల్ఫ్ నుంచి స్వదేశానికి వచ్చే వారికి ఉచితంగా క్వారంటైన్ సౌకర్యం కల్పిస్తామన్న ప్రభుత్వం.. తీర ఇక్కడికొచ్చాక డబ్బులు చెల్లించమంటుంది’ అని ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన మోహన్, అబ్బ రాకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వీరు కువైట్ నుంచి హైదరాబాద్‌కు చేరుకోగానే ప్రభుత్వం బేగంపేటలోని ఓ హోటల్లో క్వారంటైన్ చేసింది. వీరిద్దరితోపాటు నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లికి చెందిన పలువురు గల్ఫ్ వాపసీలు అక్కడే క్వారంటైన్లో ఉంటున్నారు. అయితే వీరందరినీ అధికారులు క్వారంటైన్లో ఉన్నందుకు ఒక్కొక్కరు రూ.15 వేలు చెల్లించాలంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి గల్ఫ్ బాట ఉన్న ఊరిలో ఉపాధి కరువై గల్ఫ్ దేశాల బాట పట్టిన వారు రూ.4లక్షల నుంచి రూ.4.50 లక్షల వరకు అప్పు చేశారు. అయితే కరోనా ప్రభావంతో అక్కడ కంపెనీల్లో పనులు సరిగ్గా లేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్లో ఉంచేందుకు ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందని తాము తిరిగి వచ్చినట్లు వారంత పేర్కొంటున్నారు. ఇబ్రహీంపట్నంకు చెందిన అబ్బ రాకేశ్, మండలంలోని వేములకుర్తికి చెందిన మోహన్‌తోపాటు నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లికి చెందిన ముగ్గురు, కమ్మర్పల్లి మండలం ఆశకొత్తూర్‌కు చెందిన ఇద్దరు, భీంగల్‌కు చెందిన ముగ్గురు, కోనసముందర్ గ్రామానికి చెందిన ఒకరు, వెల్పూర్‌కు చెందిన ఒకరు కువైట్ నుంచి ఈ నెల 10న హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరందరినీ బేగంపేటలోని కామత్ హోటల్లోని క్వారంటైన్‌కు తరలించారు. ప్యాకేజీలతో బెంబేలు కువైట్ నుంచి బయలుదేరే సమయంలో హైదరాబాద్‌లో హోటల్లో ఉండేందుకు రూ.5 వేలు, రూ.15 వేలు, రూ.30 వేలు ప్యాకేజీ చూపించారని, ఇక్కడికొచ్చాక రూ.15 వేలు, రూ.30 వేలు ప్యాకేజీలు అని చెప్పి ఒక్కొక్కరు రూ.15 వేలు చెల్లించాలని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద డబ్బులు లేవని, అప్పు చేసి కువైట్ పోయామని, ఎక్కడి నుంచి కట్టాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు. క్వారంటైన్లో మంచిగానే చూసుకుంటున్నారని, నిత్యం వైద్యులు వచ్చి పరీక్షిస్తున్నారని వారు తెలిపారు. ఉదయం టీ, టిఫిన్‌తోపాటు రెండు పూటల భోజనం పెడుతున్నారని తెలిపారు. అయితే డబ్బుల విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నారు. -
అమ్మను సర్ప్రైజ్ చేస్తానని.. అనంత లోకాలకు
రాజమహేంద్రవరం క్రైం: గల్ఫ్ దేశం వెళ్లి అప్పుల పాలయ్యాడు. స్వదేశం వచ్చి ఆటో నడుపుకొంటూ జీవిద్దామంటే అప్పుల వాళ్ల వేధింపులు ఎక్కువయ్యాయి. మరోసారి ఇతర దేశం వెళ్లి సంపాదించిన సొమ్ము తో అప్పులు తీర్చాలనుకున్నా డు. ఈ నేపథ్యంలో బహ్రెయిన్ దేశం వెళ్లి ఎలక్ట్రికల్ పనిలో కుదిరాడు. సవ్యంగా సాగుతున్న అతడి జీవితాన్ని కరోనా అర్ధాంతరంగా అతడి జీవితం ముగిసేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని ఉల్లితోట వీధి, బంగారయ్య స్కూల్లో నివశిస్తున్న వనపర్తి లక్ష్మి, వనపర్తి వెంకటేశ్వరరావుల ఇద్దరు సంతానంలో కుమారుడు వనపర్తి మహేష్ కాగా, కుమార్తె రత్నం. కుమార్తెకు వివాహం చేశారు. మహేష్ కొంతకాలం క్రితం అప్పు చేసి గల్ఫ్ దేశం వెళ్లి వచ్చాడు. అయినప్పటికీ చేసిన అప్పులు తీర్చకపోవడంతో రుణదాతల నుంచి అతడిపై ఒత్తిడి ఎక్కువైంది. ఉన్న ఆటో అమ్ముకొని, మరికొంత అప్పు చేసి బహ్రెయిన్ దేశం వెళ్లాడు. అక్కడికి వెళ్లాక మహేష్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. దాంతో తిరిగి ఇండియా వచ్చేసేందుకు మార్చి 22న అతడు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. అదే రోజు అతడు తన చెల్లెలికి ఫోన్ చేసి తాను వస్తున్న విషయం చెప్పాడు. తల్లికి చెప్పవద్దని సర్ప్రైజ్గా వస్తానని చెప్పాడు. తీరా చూస్తే మార్చి 22న అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. దాంతో మహేష్ తీవ్రంగా కలత చెందాడు. ఇక ఇప్పట్లో స్వదేశం వెళ్లలేననే బెంగతో రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల పాలిట ఈ వార్త ఆశనిపాతంలా మారింది. సర్ప్రైజ్గా వస్తాడని చెప్పి అనంత లోకాలకు వెళ్లిపోయాడంటూ మహేష్ తల్లి లక్ష్మి, తండ్రి వెంకటేశ్వరరావు, చెల్లెలు రత్నం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కడసారి చూపునకు నోచుకోని వైనం ఒక్కగానొక్క కొడుకు కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వదేశానికి మృతదేహం తీసుకురావాలంటే కనీసం రెండు నెలలు పడుతుందని, అప్పటి వరకూ మృతదేహాన్ని భద్రపరిచేందుకు మార్చరీలు ఖాళీగా లేవని ఇండియన్ ఎంబసీ వారు తెలిపారని వారు చెప్పారు. కరోనా వైరస్ విజృంభించడంతో మృతదేహాలు భద్రపరిచేందుకు ఒప్పుకోవడం లేదని పేర్కొంటున్నారు. అంత్యక్రియలు నిర్వహించినట్లు వాట్సాప్ ద్వారా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఏజెంట్ పేర్కొన్నారు. -
ఉపాధికి వెళ్తే.. అప్పులే మిగిలాయి!
మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): కంపెనీ యజమాని చేసిన పనికి వేతనం ఇవ్వకపోగా వీసా రెన్యూవల్ చేయకపోవడంతో పలువురు తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు అష్టకష్టాలు పడి స్వస్థలాలకు చేరుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) దేశం షార్జాలోని ఏఓజీఎం కంపెనీ యజమాని బిచానా ఎత్తివేయడంతో 16 మంది కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. షార్జాలో కేరళకు చెందిన వ్యక్తి కంపెనీ ఏర్పాటు చేసి భవన నిర్మాణ పనులు, ఇతర కాంట్రాక్టులు చేపట్టి మన దేశం నుంచి కార్మికులను రప్పించుకున్నాడు. అలా తెలంగాణ రాష్ట్రానికి చెందిన 16 మందితో పాటు ఇతర రాష్ట్రాల కార్మికులు కూడా ఈ కంపెనీలో పనిచేయడానికి వీసాలు పొందారు. అయితే కొంత కాలం బాగానే ఉన్నప్పటికీ ఆరు నెలల నుంచి కంపెనీ యజమానికి జీతాలు ఇవ్వడం లేదు. ఒక్కో కార్మికునికి రూ.1.80లక్షల చొప్పున వేతన బకాయి చెల్లించాల్సి ఉంది. డబ్బు కోసం ఇంటికి వెళుతున్నా అని చెప్పిన యజమాని తన సొంత రాష్ట్రమైన కేరళకు వెళ్లిపోయాడు. కంపెనీ యజమాని ఎప్పుడైనా షార్జాకు వస్తాడనే ఆశతో కార్మికులు మూడు నెలల పాటు కంపెనీ క్యాంపులోనే ఉండిపోయారు. అయినా యజమాని నుంచి స్పందన లేకపోవడంతో సొంత ఖర్చులతోనే కార్మికులు ఇంటికి చేరుకున్నారు. జరిమానా చెల్లించి.. వీసాల రెన్యూవల్ గడువు ముగిసిపోవడం, కంపెనీ యజమాని పత్తా లేకపోవడంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు కార్మికులు జరిమానా భారం మోయాల్సి వచ్చింది. వీసా గడువు తీరిపోయి షార్జాలో చట్ట విరుద్ధంగా ఉన్నందుకు ఆర్మూర్ మండలం ఇస్సాపల్లికి చెందిన ముత్తెన్న, మోర్తాడ్ మండల తిమ్మాపూర్‌కు చెందిన జయరాజ్‌లు రూ.50వేల చొప్పున అక్కడి ప్రభుత్వానికి జరిమానా చెల్లించారు. అయితే 16 మంది కార్మికుల్లో 14 మంది కార్మికులకు వీసా గడువు ఉండటంతో వారికి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. కాగా, 14 మంది కార్మికులు ఒక్కొక్కరు రూ.14వేల చొప్పున విమాన చార్జీలను చెల్లించడానికి ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకున్నారు. ముత్తెన్న, జయరాజ్‌లు మాత్రం జరిమానా, విమాన చార్జీల కోసం అందరికంటే ఎక్కువ సొమ్ము ఇంటి నుంచి తెప్పించుకోవాల్సి వచ్చింది. ఏఓజీఎం కంపెనీ యజమానిపై షార్జాలోని మన విదేశాంగ శాఖ కార్యాలయంలో కార్మికులు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. విదేశాంగ శాఖ అధికారులు తమకు ఏ విధంగానూ సహకరించలేదని దీంతో షార్జా ప్రభుత్వానికి జరిమానా తప్పనిసరిగా చెల్లించాల్సి వచ్చిందని ఇద్దరు కార్మికులు వాపోయారు. అప్పు చేసి డబ్బులు పంపించారు.. షార్జా ప్రభుత్వానికి జరిమానా చెల్లించడానికి, విమాన చార్జీల కోసం మా ఇంటి వద్ద రూ.75వేలు అప్పు తీసుకుని షార్జాకు పంపిస్తేనే నేను ఇటీవల ఇంటికి వచ్చాను. కంపెనీ యజమానిపై షార్జాలోని మన విదేశాంగ కార్యాలయంలో ఫిర్యాదు చేశాం. కానీ, అధికారులు పట్టించుకోకపోవడంతో మాకు దిక్కులేకుండా పోయింది.– ముత్తెన్న, ఇస్సాపల్లి(ఆర్మూర్ మండలం) ప్రభుత్వం ఆదుకోవాలి... షార్జాలో కంపెనీ యజమాని వంచనతో అవస్థలు పడుతూ ఇంటికి చేరుకున్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. చేసిన పనికి వేతనం రాలేదు. వీసా గడువు ముగిసిపోయినందుకు జరిమానా మీద పడింది. మా పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వం స్పందించి మాకు ఆర్థిక సహాయం అందించాలి.– జయరాజ్, తిమ్మాపూర్(మోర్తాడ్ మండలం) -
ఎన్నారై పాలసీ రావాలి
కొండవీటి సురేష్, ఆర్మూర్: ఉపాధి వేటలో కుటుంబ సభ్యులను విడిచి గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు వెళ్లి కష్టపడుతున్న ప్రవాస భారతీయులకు మేమున్నామనే భరోసా కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీని రూపొందించి అమలు చేయాలని వలసదారుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నర్సింహ నాయుడు కోరారు. గల్ఫ్ బాధితుల పక్షాన దశాబ్ద కాలంగా ఉద్యమాలు చేస్తున్న కోటపాటి నర్సింహ నాయుడు ఎన్ఆర్ఐ పాలసీ ఆవశ్యకతపై, అందులో ఏ అంశాలు ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 20 – 25 లక్షల మంది వివిధ దేశాలకు వలస వెళ్లినట్లు వివిధ సంస్థలు సర్వేల్లో అంచనా వేశాయి. వీరిలో అత్యధికంగా గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఒమాన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్‌తో పాటు మలేషియా, సింగపూర్, అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు సైతం ఉపాధి కోసం వలస వెళ్లారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు అత్యధికంగా భవన నిర్మాణ కార్మికులుగా, ఇళ్లలో పని వారిగా చేరారు. వీరికి ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించుకోవడానికి ఎవరిని సంప్రదించాలో కూడా కనీస అవగాహన లేని దుస్థితిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి విదేశాల్లో.. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ప్రతీ ఎంబసీలో ఒక తెలుగు మాట్లాడగలిగే అధికారిని నియమించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతీ దేశంలో ఒక తెలుగు అధికారిని నియమించాలి. గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాలతో అక్రమ నివాసం ఉంటున్న వేలాది మందిని ఎలాంటి జరిమానాలూ, జైలు శిక్షలు లేకుండా స్వస్థలాలకు వెళ్లిపోవడానికి ఆ దేశాల ప్రభుత్వాలు అవకాశమిచ్చిన సందర్భాలలో వారిని ఆదుకొని స్వరాష్ట్రానికి తీసుకురావడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధంగా, సంబంధిత ఎన్ఆర్ఐ విభాగం మంత్రికి జవాబుదారీగా ఉండే విధంగా 25 మంది సభ్యులతో కూడిన తెలంగాణ ప్రవాసీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ప్రతి గల్ఫ్ దేశానికి ఒక డైరెక్టర్, ఎనిమిది అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఒక్కొక్క సభ్యుడు, దేశంలోని వివిధ రాష్ట్రాలలో తెలంగాణ ప్రవాసీల నుంచి నలుగురు, విదేశాల నుంచి తిరిగి వచ్చిన ప్రవాసీలు, సామాజిక సంస్థల నుంచి నలుగురు సభ్యులతో కేరళ మాదిరి నాన్ రెసిడెంట్స్ తెలంగాణనైట్స్ వెల్ఫేర్ యాక్ట్ ద్వారా ప్రవాసీ తెలంగాణీయుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రతీ కార్మికుడిని సభ్యుడిగా చేర్చుకోవాలి ప్రతి వలస కార్మికుడిని ప్రవాసీ సంక్షేమ బోర్డులో సభ్యుడిగా చేర్చుకొని వారి నుంచి ప్రతీ సంవత్సరం వారి స్థాయిని బట్టి కొంత మొత్తాన్ని వసూలు చేయాలి. ఈ నిధికి సంక్షేమ బోర్డు ద్వారా అంతే మొత్తాన్ని జమ చేయాలి. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారికి సంక్షేమ బోర్డు పరిధిలో సేవింగ్స్ ఖాతా తెరిచి వారు తిరిగి వచ్చిన తర్వాత వారికి చెల్లింపులు జరిపి వారిని ఇక్కడే స్థిరపడే విధంగా ఉపాధి అవకాశాలలో ఆ నిధిని ఉపయోగించుకోవడం లేదా వారికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత వారు కూడబెట్టుకున్న స్థాయిలో పింఛన్ వచ్చే విధంగా చూడాలి. విదేశాలకు వెళ్లి ఏజెంట్ల కారణంగా లేదా అక్కడి యాజమాన్యాల కారణంగా మోసపోయి.. నష్టపోయి తిరిగివచ్చిన వారిని ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రుణాలను ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పించాలి. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారిని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని బోర్డులో సభ్యత్వం తీసుకొనే విధంగా ప్రోత్స హించాలి. వారికి తగిన నైపుణ్య, శిక్షణ ఇవ్వడంతో పాటు వారు వెళ్లే దేశం, కంపెనీ, నివాసం ఉండే అడ్రస్‌తో సహా సమాచారం సేకరించాలి. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) శిక్షణ కేంద్రాలను ప్రతీ డివిజన్, నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయాలి. ప్రవాసీ బీమా.. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బీమా తరహాలో వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసీలకు వర్తించే విధంగా ఐదు లక్షల రూపాయల ప్రవాసీ బీమా పాలసీని ప్రవేశపెట్టాలి. సాంకేతిక కారణాలతో బీమా సౌకర్యం పొందలేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎక్స్ గ్రేషియా అందించాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పది లక్షల రూపాయల ప్రమాద బీమా ‘ప్రవాసీ భారతీయ బీమా యోజన’ను కార్మికులందరికీ చేయించాలి. బీమా పాలసీని ఆన్ లైన్లో రెన్యూవల్ చేయించుకోవడానికి రాష్ట్రంలోని కొన్ని ‘మీ సేవా’ కేంద్రాలను ప్రత్యేకంగా కేటాయించాలి. విదేశాల్లో ఆత్మహత్య చేసుకున్న, సహజంగా, ప్రమాదవశాత్తు తదితర కారణాలతో మరణించిన వారి మృతదేహాలను వెంటనే స్వగ్రామాలకు తెప్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అందుకు ప్రతీ దేశంలో ఒక అధికారి లేదా స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి.వివిధ కారణాలతో విదేశీ జైళ్లలో మగ్గుతున్న వారికిన్యాయ సహాయం అందేవిధంగా ఎంబసీతోఅనుసంధానం చేయాలి. తెలంగాణ ప్రవాసీ దివస్.. ప్రవాసీ భారతీయ దివస్ తరహాలో తెలంగాణ ప్రవాసీ దివస్ నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన ప్రవాసీలకు ప్రతీ సంవత్సరం ఒక సదస్సు ఏర్పాటు చేసి అన్ని దేశాలలోని సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ, స్వచ్ఛంద సంస్థల సభ్యులను ఆహ్వానించి రెండు రోజులకు తక్కువ కాకుండా సమావేశాలు నిర్వహించాలి. తద్వారా వారి భావాలను, సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది. పెట్టుబడులను ఆహ్వానించవచ్చు, ప్రవాసీలు సత్కరించవచ్చు. మోసకారి ఏజెంట్లపైచర్యలు తీసుకోవాలి తప్పుడు వీసాలతో మోసం చేస్తున్న ఏజెంట్ల ఆటకట్టించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. లైసెన్స్ కలిగిన కొందరు ఏజెంట్లు కూడా విజిట్ వీసాలతో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. కొందరు విదేశాలకు వెళ్లాక అక్కడ ఏజెంట్లుగా అవతారమెత్తి వీసాలు పంపిస్తున్నారు. ఇలాంటి వీసాలపై వెళ్లినవారు రెండు, మూడు నెలలకే తిరిగి వచ్చిన సందర్భాలున్నాయి. స్థానిక ఉపాధిపై దృష్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చేవారు స్వగ్రామాలలో స్థిరపడటానికి ప్రయత్నించాలి. విజిట్ వీసాపై వెళ్లిన వారు, కల్లివెళ్లిగా ఉన్నవారు, తక్కువ జీతాలతో ఇబ్బందిపడేవారు స్వరాష్ట్రానికి రావడం మంచిది. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఎందరో ఉపాధి పొందుతున్నారు. మన ప్రాంతం వారు ఇక్కడే ఉపాధి చూసుకోవచ్చు. -
మా అమ్మను స్వదేశానికి రప్పించరూ !
బతుకుదెరువు కోసం, నాలుగు రాళ్లు సంపాదించుకుని కుటుంబానికి ఆధారమవుదామని గల్ఫ్ దేశాలకు వెళ్లిన జిల్లా వాసుల కలలు కల్లవుతున్నాయి. అక్కడ పనిచేసే ఇళ్లల్లో చిత్రహింసలకు గురై నరకం చవిచూస్తున్నారు. ఏజెంట్ల మోసాలకు తాము బలైపోతున్నామని గ్రహించేసరికి జీవచ్ఛవాలై పోతున్న దయనీయమైన పరిస్థితి. మరికొందరు ప్రాణాలే కోల్పోయి శవాలై మోసుకొస్తున్న దీనగాథలెన్నో!! మదనపల్లె : గల్ఫ్ జీవితాలు ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. కన్నవారిని, కట్టుకున్నవారిని, బంధువులను దూరం చేస్తున్నాయి. పుట్టిన ఊర్లో బతుకుదెరువు లేక ఎడారి దేశాల బాట పట్టి కష్టాల్లో ఇరుకున్న వారి కన్నీటిగాథలకు కొదువ లేదు. మొన్న రాణి, నిన్న మల్లిక.. రేపు మరెవరో.? రుణాల ఊబిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సగటుజీవుల కష్టాలే నకిలీ ఏజెంట్లకు కల్పతరువుగా మారుతున్నాయి. కష్టాల సుడిగుండం నుంచి కుటుంబాన్ని గట్టెక్కించాలన్న ఆశలు అనధికార ఏజెంట్ల చెరలో సమాధి అవుతున్నాయి. అందమైన భవితను ఊహించుకుంటూ ఎన్నో ఆకాంక్షలతో పరాయిగడ్డపై కాలుమోపిన క్షణం నుంచే వారికి కష్టాలు మొదలవుతున్నాయి. పర్యాటక వీసా, పని, ఒప్పంద పత్రాలు లేకుండా అనధికారకంగా గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ చిక్కుల్లో పడి, వాటి నుంచి బయటకు వచ్చే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. పలువురు జైళ్లలో మగ్గడమో లేదా అక్కడే మృత్యువాత పడటమో జరుగుతోంది. పొట్టకూటి కోసం ఊళ్లు వదిలిన సొంతమనుషులు చిక్కి శల్యమై జీవచ్ఛవాలుగా వస్తుండటంతో కుటుంబ సభ్యుల శోకానికి అంతులేకుండా పోతోంది. అనధికార ఏజెంట్ల వలలో.. గ్రామ, పట్టణ ప్రాంతాలకు చెందిన పలువురు నకిలీ ఏజెంట్లు కొంతమంది దళారుల సాయంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని, నిరుద్యోగులను గుర్తించి విదేశాలకు వెళితే రూ.లక్షలు సంపాదించవచ్చని నమ్మిస్తున్నారు. వీసా, విమాన చార్జీలు తదితర వాటికి వేలల్లో వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో గల్ఫ్ వెళ్లే మహిళలకు అక్కడ యజమానులు ఉచితంగానే వీసాలు జారీ చేస్తున్నారు. అక్కడే స్థిరపడిన వారు ఇక్కడ వారికి ఆ వీసాలను అమ్ముకుంటున్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికి చివరకి వెట్టిచాకిరీ వెతలే మిగులుతున్నాయి. అక్కడి షేక్‌లు సకాలంలో జీతాలు ఇవ్వకుండా, చాలీచాలని తిండి పెడుతూ దాష్టీకం చేస్తున్నారు. మదనపల్లె ప్రాంతంలోనిగత సంఘటనలు మదనపల్లె మండలం కొత్త ఇండ్లుకు చెందిన రాణి(50)ని కురబలకోటకు చెందిన ఇద్దరు ఏజెంట్లు సౌదీకి పంపించారు. 10 రోజుల వ్యవధిలోనే అక్కడి షేక్‌లు పెట్టే చిత్రహింసలకు తట్టుకోలేక ఆమె అక్కడే అనుమానాస్పదంగా చనిపోయింది. నెల రోజుల తర్వాత గల్ఫ్‌లోని ఇండియన్ ఎంబసీ సాయంతో ఆమె మృతదేహం ఇంటికి చేరింది. నీరుగట్టుపల్లెకు చెందిన చేనేత కార్మికుడు రామిశెట్టి మంజునాథ భార్య హేమలత(25)ఇక్కడ చేనేత రంగం కుదేలు కావడం, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఇల్లు గడవడం కష్టంగా మారడంతో ఉపాధి కోసం సౌదీ వెళ్లింది. అక్కడ యజమానిక పెట్టే చిత్రహింసలకు తాళలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శవాన్ని ఇండియాకు పంపించేందుకు రూ1.50 లక్షలు చెల్లిస్తేనే పంపుతానని షేక్ చెప్పడంతో చివరకు చేసేదిలేక ఎదురు డబ్బులు చెల్లించి నెల తర్వాత మృతదేహాన్ని తెచ్చుకోవాల్సి వచ్చింది. షేక్‌లు తనను చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారని.. ఎలాగైనా తనను తీసుకువెళ్లాలని, లేకుంటే చనిపోయేలా ఉన్నానంటూ.. పట్టణానికి చెందిన ఓ మహిళ ఉదంతంపై పత్రికల్లో కథనాలు రావడంతో అప్పటి జిల్లా జడ్జి జయరాజ్ స్పందించి ఎంబసీతో మాట్లాడారు. ఆమెకు నాలుగు నెలల తర్వాత విముక్తి కల్పించేలా చేశారు. విదేశాలకు వెళ్లాలంటే.. అనుమతి ఉన్న ఏజెంటు ద్వారానే విదేశాలకు వెళ్లాలి. అక్కడ యజమాని వద్ద చేయాల్సిన పని ఒప్పంద పత్రం తప్పనిసరిగా ఉండాలి. అలా వెళ్తే పనులు చేసుకునే సమయంలో ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనా చట్టపరంగా రక్షణ ఉంటుంది. యజమానులు ఇబ్బందులకు గురిచేసినా, వేతనాలు చెల్లించకున్నా వారిపై చట్టపరంగా చర్య తీసుకునే వీలుంటుంది. శిక్షణ కోసం హోంకేప్.. పలువురు కార్మికులు ఎలాంటి శిక్షణ లేకుండానే విదేశాల్లో ఉద్యోగం కోసం వెళుతున్నా అక్కడ పనిపై అవగాహన లేక మళ్లీ తిరుగుముఖం పడుతున్నారు. ఏజెంట్లు ఫలానా పని అని చెపితే ఆ పనిపై ప్రత్యేక శిక్షణ పొందాలి. శిక్షణ పొంది విదేశాలకు వెళ్తే నష్టం ఉండదు. కార్మికులు కచ్చితంగా ఉపాధి పొందే రంగంలో శిక్షణ పొంది ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి శిక్షణ ఇచ్చేందుకు హోంకేప్(ఓవర్సీస్ మేన్‌పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) సంస్థను ఏర్పాటుచేసింది. జిల్లా ఉపాధి కార్యాలయంలో దుబాయ్, సౌదీ అరేబియా ఇతర దేశాల్లో ఉద్యోగాలకు ఉపాధి కార్యాలయం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. వీసాలు పొందిన తరువాత అవి నకిలీవా లేక సరైనవా? అని నిర్ధారించుకోవడానికి వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే వీసాల కోసం ప్రయత్నం చేయాలి. ఉపాధికి వెళ్లి గుండెపోటుతో మృతి తిరుపతి సమీపంలోని దామినేడులోని అర్బన్ గృహ సముదాయంలో ఉంటున్న బాలాజీ(51) 13 ఏళ్ల కిత్రం భార్యతో సహా బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లా డు. ఆర్థికంగా నాలుగు డబ్బులు వెనకేసుకున్నా విపరీతమైన పనిఒత్తిడితో అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స నిమి త్తం సొంత ఊరికి తిరిగివస్తూ జనవరి 30న గుండెపోటుతో విమానంలోనే మృతి చెందాడు. చెన్నై విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మా అమ్మను స్వదేశానికి రప్పించరూ ప్లీజ్! మూడున్నరేళ్ల క్రితం తన తల్లిని ఇద్దరు ఏజెంట్లు మాయమాటలు చెప్పి సౌదీకి పంపేశారని, ఆమెను స్వదేశానికి పిలిపించాలని పెద్దమండ్యం మండలం గోపిదిన్నెకు చెందిన సుకన్య ఆమె అవ్వ నరసమ్మ ఇటీవల మదనపల్లె డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. రెండేళ్లపాటు తమతో మాట్లాడుతూ వచ్చిన రాధమ్మ ఏడాదిగా డబ్బు పంపడం, ఫోన్లో మాట్లాడకపోవడంతో ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు. సౌదీకి పంపిన ఏజెంటును వెళ్లి ప్రశ్నిస్తే హీనంగా మాట్లాడుతున్నాడని వాపోయారు. దీంతో ఏమిచేయాలో తెలియనిస్థితిలో డీఎస్పీని ఆశ్రయించారు. పోలీసులు ఏజెంట్ నూర్‌ను స్టేషన్‌కు పిలిపించి నెలరోజుల్లో రాధమ్మ స్వగ్రామానికి వచ్చేలా చేయాలని లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏజెంట్ల ఇంటి ముందు ఆందోళన మదనపల్లెలోని బసినికొండకు చెందిన కె.మల్లిక(35)కు 13 ఏళ్ల క్రితం ఎస్టేట్‌కు చెందిన ఆనంద్‌తో వివాహమైంది. నాలుగేళ్లకే అతను మల్లికను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె ముదివేడులోని తండ్రి వద్ద ఉండేది. ఏడేళ్ల క్రితం కురబలకోటకు చెందిన ఏజెంట్లు మల్లికకు మాయమాటలు చెప్పి సౌదీకి పంపేశారు. మల్లిక కనిపించకుండా పోయిందని 2014లో కుటుంబసభ్యులు ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థానికుల ద్వారా ముగ్గురు ఏజెంట్లు ఆమెను సౌదీకి పంపారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను స్వదేశానికి పిలిపించాలని కోరారు. వెళ్లినప్పటి నుంచి మల్లిక ఫోన్ చేయలేదని, ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 24న సౌదీ ఎయిర్‌పోర్టు నుంచి ఎవరో ఫోన్ చేసి ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైందని, ఆమె వద్ద మదనపల్లె చిరునామాతో పాటు ఇండియాకు వచ్చే టికెట్టు ఉందని చెప్పారు. దీంతో బెంగళూరు ఎయిర్‌పోర్టుకు పంపితే తాము వెళ్లి తెచ్చుకుంటామని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుడు వెళ్లిపోయిన మల్లిక డిసెంబర్ 25న నడవలేని స్థితిలో చిక్కి శల్యమై బెంగళూరుకు చేరుకుంది. కుటుంబసభ్యులు జిల్లా ఆస్పత్రిలో చేర్పిస్తే వైద్యులు ఆమెను పరీక్షించి చాలా కాలంగా భోజనం తినకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురికావడం, జీర్ణవ్యవస్థ దెబ్బతిందని నిర్ధారించారు. తిరుపతిలో ట్రీట్మెంట్ అనంతరం స్వగ్రామానికి వచ్చిన మల్లిక జనవరి 13న కన్నుమూసింది. తనను విదేశాల్లో షేక్‌లకు అమ్మేసిన ఏజెంట్లు చివరకు తనకు రావాల్సిన డబ్బును కూడా తీసేసుకున్నారని మల్లిక చెప్పడంతో ఆమె మరణాంతరం ఏజెంట్లు ఇంటిముందు మృతదేహంతో ఆందోళన చేశారు. మల్లిక మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ ఏజెంట్లపై నిఘా లైసెన్స్ ఉన్న ఏజెంట్ల ద్వారా మాత్రమే గల్ఫ్ దేశాలకు వెళ్లాలి. నకిలీ ఏజెంట్ల బారిన పడి అన్నివిధాలా నష్టపోకండి. నకిలీ ఏజెంట్ల వ్యవహారాలపై నిఘా పెట్టాం. బాధితుల కోసం నిత్యం భారత ఎంబసీ కార్యాలయ అధికారులతో సంప్రదిస్తున్నాం. విదేశాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉంటూ అన్ని పత్రాలు పరిశీలించుకోవాలి. ఏమైనా అనుమానాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి.– రవిమనోహరాచారి, డీఎస్పీ, మదనపల్లె -
ఉపాధి వేటలో ఓడిన నిరుపేద
బాయికాడి శివకుమార్, నవాబ్‌పేట (వికారాబాద్ జిల్లా): బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లిన వ్యక్తి ఉపాధి వేటలో అక్కడే తుదిశ్వాస విడిచాడు. కుటుంబ పెద్ద మృతిచెందడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎత్రాజ్పల్లి గ్రామానికి చెందిన మల్గారి అనంత్‌రెడ్డికి భార్య బిచ్చమ్మతో పాటు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అనంత్‌రెడ్డికి పెద్దగా ఆస్తులు లేకపోవడంతో పెద్ద కొడుకు మల్రెడ్డి వేరే ఊరికి ఇళ్లరికం వెళ్లాడు. కాగా, అనంత్‌రెడ్డి పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి వరకు పదో తరగతి వరకు చదివి ఖాళీగా ఉన్న చిన్న కుమారుడు పాండురంగారెడ్డిపై కుటుంబ భారం పడింది. అయితే, గల్ఫ్ దేశాలకు వెళ్లి మెరుగైన ఉపాధి పొందాలని భావించిన పాండురంగారెడ్డి తెలిసిన వారి సహాయంతో 2004లో దుబాయికి వెళ్లాడు. అక్కడ కొన్ని రోజులు ఉండి 2007లో తిరిగి ఇంటికి వచ్చి హోటల్ పెట్టుకున్నాడు. 2010లో వివాహం చేసుకున్నాడు. హోటల్ వ్యాపారంలో నష్టం రావడంతో అప్పుల పాలయ్యాడు. దాంతో హోటల్ మూసివేశాడు. ఆ తర్వాత 8 గేదెలను కొనుగోలు చేసి పాల వ్యాపారం ప్రారంభించాడు. అది కూడా అతనికి కలిసి రాలేదు. పెట్టుబడులు కూడా చేతికి రాకపోవడంతో మరింత అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించక ఉన్న ఎకరంన్నర పొలాన్ని అమ్మి కొంత మేరకు అప్పులు చెల్లించాడు. అనంతరం కొంత డబ్బు కట్టి రెండు డీసీఎం వ్యాన్లను ఫైనాన్స్‌లో కొనుగోలు చేశాడు. ఆ వాహనాలను సరుకు రవాణా కిరాయిలకు నడిపాడు. అందులో కూడా పాండురంగారెడ్డికి నష్టం వచ్చింది. ఫైనాన్స్‌లో తీసుకున్న డబ్బులు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ వారు రెండు డీసీఎంలను తీసుకెళ్లారు. అప్పటికి రూ.4లక్షలు అప్పులు ఉన్నాయి. ఇక ఇక్కడ ఉంటే బతకడం కష్టమని భావించి.. మరో రూ.3 లక్షలు అప్పులు చేసి గతేడాది సెప్టెంబర్ 25న దుబాయికి వెళ్లాడు. అక్కడ ఓ సోలార్ కంపెనీలో పనికి కుదిరాడు. అయితే, పాండురంగారెడ్డికి డిసెంబర్ 24న ఉదయం 6.30 గంటలకు గుండెనొప్పి వచ్చింది. గమనించిన తోటి కార్మికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు ఉదయం 8.30 గంటలకు మృతి చెందాడు. అతనితో పాటు పని చేసే వారు విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపారు. భార్య జమున అక్కడికి పోలేని పరిస్థితి ఉండటంతో అతను పని చేసే కంపెనీ వారు ఒక వ్యక్తిని ఇచ్చి మృత దేహాన్ని ఈ నెల 7న ఇంటికి పంపారు. కుటుంబాన్ని పోషించాల్సిన వ్యక్తి మృతిచెందడంతో.. ఆయననే నమ్ముకొని ఉన్న భార్య జమున, కొడుకు అభిలాష్‌రెడ్డి(4ఏళ్లు), కూతురు అన్షిత(రెండేళ్లు), తల్లి బిచ్చమ్మ దిక్కులేని వారయ్యారు. ఇప్పుడు కుటుంబ పోషణే కష్టమైన తరుణంలో రూ.7లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని పాండురంగారెడ్డి కుటుంబం కోరుతోంది. -
నైపుణ్యం ఉంటేనే రాణిస్తారు
వూరడి మల్లికార్జున్, సిరిసిల్ల: ‘కంపెనీలో పనిలేదు.. మిమ్మల్నిభరించే శక్తి కంపెనీకి లేదు.. ఇప్పటికే ఆరు నెలలుగా పనిలేకున్నా జీతాలు ఇస్తున్నాం.. ఇంకా ఇవ్వడం సాధ్యం కాదు. ఎవరి దేశానికి వారు వెళ్లిపోండి.. అని ఖతార్‌లోని కంపెనీ యాజమాన్యం చెప్పినప్పుడు 2200 మంది కార్మికుల గుండెల్లో ఒక్కసారిగా పిడుగు పడినట్లయింది. అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఉన్న పళంగా ఇంటికి పొమ్మంటే ఎలా అని అందరం బాధపడ్డాం. ఒక్క ఇండియా వాళ్లే కాదు.. బంగ్లాదేశ్, పాకిస్థాన్, పిలిప్పీన్ దేశాలకు చెందిన కార్మికులు కూడా ఉన్నారు. అందరిదీ అదే పరిస్థితి. ఖతార్‌లోని చట్టాలపై అవగాహన ఉన్న వారిని ఆశ్రయించాం. ఆ దేశంలో ఉపాధి అవకాశాలను అధ్యయనం చేశాం. ఓ పరిష్కారం దొరికింది. మా వద్ద పని లేదని.. మా కార్మికులు ఎక్కడ పనిచేసినా మాకు అభ్యంతరం లేదని మేం పనిచేస్తున్న కంపెనీ ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇస్తే చాలు. బయట పని దొరుకుతుందనే విషయం తెలిసింది. ఆ విషయాన్ని కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాం. వారం రోజుల్లో ఎన్ఓసీ లభించింది. అందరికీ ఆ దేశంలోనే మరో కంపెనీలో ఉద్యోగాలు దొరికాయి’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన తోట ధర్మేందర్ చెప్పారు. ధర్మేందర్ ప్రస్తుతం ఖతార్‌లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఓఎఫ్‌డబ్ల్యూఏ)కు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే క్రమంలో కార్మికులు మోసాలకు, కష్టాలకు గురికాకుండా వలస జీవుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఖతార్‌లో ఉండే ధర్మేందర్ అక్కడి పరిస్థితులు.. ఓఎఫ్‌డబ్ల్యూఏ చేపడుతున్న కార్యక్రమాలను గురించి వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... గల్ఫ్‌కు వెళ్తే చాలు.. బతికేయవచ్చనే భావన వీడాలి. ఆ దేశాల్లో సంపాదన అంత సులువుకాదు. ఇండియాలో ఉండగానే ఏదో ఒక పనిలో నైపుణ్యం సాధించాలి. అది ఏ పని అయినా సరే. ఆ పనిలో పూర్తి పట్టు సాధించాలి. పనిలో నైపుణ్యం లేకుండా ఏదో ఒక పని చేస్తాంలే అనుకుని గల్ఫ్‌కు వెళ్తే చేతులారా కష్టాలను కొనితెచ్చుకున్నట్లే. సులువైన పనికావాలని ఏజెంట్లతో చెప్తారు. దీనిని అలుసుగా తీసుకుని ఏజెంట్లు సులువైన పనే దొరుకుతుందని పంపిస్తారు. ఆ దేశాల్లో కష్టమైన పని ఎదురైతే తట్టుకోలేక ఇబ్బందులు పడతారు. ఏ దేశం వెళ్తున్నామో.. ఆ దేశ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండాలి. అక్కడి భాష, చట్టాలు తెలిసి ఉండాలి. ఆ దేశాల్లోని పరిస్థితులపై పట్టు సాధిస్తే నైపుణ్యంతో రాణిస్తారు. నేనూ కష్టాలు అనుభవించా.. నేను పదో తరగతి వరకే చదువుకున్నా. 2007లో తొలిసారి మస్కట్ వెళ్లాను. రూ.1.20 లక్షలు వీసాకు వెచ్చించి డీజిల్ పంప్ ఆపరేటర్‌గా పనిలో కుదిరాను. ఏజెంట్ 120 రియాళ్లు జీతం అన్నాడు. ఆయన మాటలు నమ్మి పోతే.. అక్కడికి వెళ్లాక రూ.60 రియాళ్లు ఇచ్చారు. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.10 వేలు మిగిలేవి. వీసాకు చేసిన అప్పులు తీర్చడానికే ఏడాదిన్నర పట్టింది. ఖాళీ సమయంలో అక్కడే టవర్ క్రేన్ ఆపరేటింగ్ నేర్చుకున్నా. అక్కడే లైసెన్స్ పొందాను. మళ్లీ ఖతార్ వెళ్లాక మంచి వేతనంతో స్థిరపడ్డా. హక్కులు, చట్టాలగురించి తెలుసుకున్నా.. ఢిల్లీకి చెందిన రాజీవ్‌శర్మ ఖతార్లోకలిశాడు. ఆయన కలిసిన తరువాత అక్కడ పనిచేసే వలస కార్మికుల హక్కులు.. కనీస వేతన చట్టాల గురించి తెలిసింది. బిల్డింగ్అండ్ వుడ్ వర్కర్ ఇంటర్నేషనల్ (బీడబ్ల్యూఐ)లో చేరాం. వలస కార్మికుల కోసం ఈ సంస్థ పనిచేస్తోంది. ఆయన భారత రాయబార కార్యాలయం అధికారులతోనూ మాట్లాడి మన వారికి న్యాయ సహాయం అందిస్తారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇండియాలోని అన్ని రాష్ట్రాల వారితో కలిసి ఓవర్సీస్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఓఎఫ్‌డబ్ల్యూఏ)ను ఏర్పాటు చేశాం. తెలంగాణలోని పలు జిల్లాల వారు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఖతార్‌లోని ఎంబసీ అధికారులతో కలిసి పనిచేస్తాం. ఎవరికైనా కంపెనీ జీతాలు సక్రమంగా ఇవ్వకుంటే మాట్లాడి ఇప్పిస్తాం. వలస కార్మికులకు హెల్త్‌కార్డులు ఇప్పించాం. కార్పొరేట్ వైద్యసేవలు, అదనపు పని గంటలకు అదనపు వేతనం, కంపనీలో లాండ్రి వసతులు కల్పించాం. ఇలా వలస కార్మికుల సంక్షేమం కోసం మా సంస్థ పనిచేస్తుంది. వివిధ కంపనీల్లో మా సంస్థ చొరవతో పది వేల మందికి జీతాలు పెరిగాయి. రెండేళ్లకోసారి స్వస్థలాలకు వచ్చే వారికి జీతంతో కూడిన సెలవులు ఇప్పించడం, విమాన టిక్కెట్లు ఇప్పించడం వంటి సదుపాయాలు కల్పించాం. ఎవరైనా కార్మికులు చనిపోతే వారి మృతదేహాలను స్వగ్రామాలకు పంపడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేశాం. ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్లతో కలిసి వలస కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. గల్ఫ్‌కు కొత్తగా వెళ్లే వారికి.. వెళ్లాలని ఆలోచనలో ఉన్న వారికి నేను చెప్పేది ఒక్కటే.. ఏ నైపుణ్యమూ లేకుండా ఇక్కడైనా.. ఎక్కడైనా రాణించలేరు. పని నేర్చుకోండి.. పైసలు సంపాదించుకోండి. సబ్ ఏజెంట్లను ఆశ్రయించవద్దు గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే వారు సబ్ ఏజెంట్లను ఆశ్రయించవద్దు. వారు కమీషన్ కోసం పనిచేసే బ్రోకర్లు మాత్రమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70కి పైగా లైసెన్స్డ్ ఏజెన్సీలు, బ్రాంచీలు ఉన్నాయి. తప్పని సరిగా లైసెన్స్ కలిగి ఉన్న రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారానే వెళ్లాలి. గల్ఫ్‌లోని ఏ దేశానికి వెళ్లాలన్నా వీసాకు మన కరెన్సీలో రూ.30వేలు గానీ, 45 రోజుల వేతనంగానీ మాత్రమే చెల్లించాలి. వీసా డబ్బులను విధిగా ఏజెంట్ బ్యాంకు ఖాతాలోనే వేయాలి. నేరుగా నగదు చేతికి ఇవ్వవద్దు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక రిక్రూటింగ్ ఏజన్సీ ‘టాంకాం’ కూడా ఉంది. దాని ద్వారా కూడా గల్ఫ్ దేశాలకు వెళ్లవచ్చు. ఏ దేశానికి వెళ్లినా.. వీసా కాపీ, కంపెనీ వివరాలు, ఫోన్ నంబరు తప్పని సరిగా ఇంటి వద్ద ఉంచాలి. -
లైసెన్స్డ్ ఏజెన్సీల ద్వారానే వీసా పొందాలి
సిరిసిల్ల: విదేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందేందుకు వెళ్లే వారు ఎవరైనా భారత ప్రభుత్వం ద్వారా లైసెన్స్ కలిగిన ఏజెన్సీల ద్వారానే వీసా పొందాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఏఆర్ఆర్ మ్యాన్‌పవర్ కన్సల్టెంట్ మేనేజర్ మహ్మద్ రఫీ చెప్పారు. దేశ వ్యాప్తంగా 1419, తెలంగాణ రాష్ట్రంలో 64 లైసెన్స్డ్ ఏజెన్సీలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల జరుగుతున్న మోసాల నేపథ్యంలో.. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గల్ఫ్‌కు ఉపాధి కోసం వెళ్లే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ విజిట్ వీసాలపై వెళ్లవద్దు. ఈ మధ్య కాలంలో విజిటింగ్ కం, ఎంప్లాయ్మెంట్ అంటూ కొందరు మోసం చేస్తున్నారు. విజిట్ వీసా ఖరీదు రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు, విమాన టిక్కెట్ ధర రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. కానీ గ్రామీణుల వద్ద రూ.50వేల నుంచి రూ.80వేల వరకు వసూలు చేస్తున్నారు. గల్ఫ్‌కు వెళ్లాక అక్కడే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం. దీని మూలంగా గల్ఫ్‌కు వెళ్లే వ్యక్తికి భారత ప్రభుత్వం కల్పించే ప్రవాసీ భారతీయ బీమా యోజన(పీబీబీవై) వర్తించకుండా పోతుంది. అక్కడ జరిగే ఇంటర్వ్యూల మూలంగా కొందరికి ఎంప్లాయ్మెంట్ లభిస్తుండగా.. చాలా మందికి కంపెనీ వీసాలు లభించక నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. తెలంగాణ నుంచి నెలకు 200 నుంచి 300 మంది విజిటింగ్ కం ఎంప్లాయ్మెంట్ వీసాలపై వెళ్తున్నట్లు సమాచారం. కంపెనీ వీసా పొందితే.. పని గంటలు, జీతం, ఇతర సదుపాయాలు ముందే చెబుతారు. నచ్చితేనే వెళ్లవచ్చు. వీసాకు ఇంత చెల్లించాలని నిర్ధిష్టంగా ఉంటుంది. ఇమిగ్రేషన్ ద్వారా రక్షణ లభిస్తుంది. బీమా సదుపాయాలు ఉంటాయి. వీసాలు వెబ్సైట్లో ఉండవు.. ఎయిర్‌పోర్టులో క్లీనింగ్, పెట్రోల్ బంక్‌లో పని, హాస్పిటల్లో, హోటల్లో పని అని.. జీతం రూ.30వేలు రూ.50 వేలు అంటూ.. ఊరు పేరు లేని వారు వాట్సప్‌లో, ఫేస్బుక్లో ప్రచారం చేస్తున్నారు. దీన్ని నమ్మవద్దు. వీసాలు ఎప్పుడూ వెబ్సైట్లో ఉండవు. గ్రామీణులను నమ్మించేందుకు ఇలాంటి మోసాలు చేస్తారు. లైసెన్స్ ఉన్న ఏజన్సీల ద్వారానే గల్ఫ్ దేశాలకు వెళ్లాలి. లైసెన్స్ కలిగిన ఏజన్సీలు చాలా ఉన్నాయి. వారి ద్వారానే వీసా పొందితే రక్షణ ఉంటుంది. మోసాలకు ఆస్కారం ఉండదు. వీసాల సమాచారం హైదరాబాద్‌లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ (పీవోఈ) ఆఫీస్‌లో లభిస్తుంది. వీసా నకిలీదా.. అసలైనదా.. అక్కడ తెలుసుకోవచ్చు. ఏదైనా ఒక్క పనిలో నైపుణ్యం సంపాదించి గల్ఫ్ దేశాలకు వెళ్తే మెరుగైన ఉపాధి ఉంటుంది. ఏ దేశం వెళ్తున్నామో.. ఆ దేశంలోని చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. గల్ఫ్ ఏజంట్లను నిలదీయాలి కోరుట్ల: అధిక లాభాల కోసం అడ్డదారిలో కార్మికులను దేశం దాటిస్తున్న గల్ఫ్ ఏజంట్లను నిలదీయాలి. విజిట్ కం ఎంప్లాయ్మెంట్ పద్ధతిలో కార్మికులను అక్రమంగా తరలిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే కార్మికులకు ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరిగా ఉండాలి. ఈ పాలసీని ఈ–మైగ్రేట్ సిస్టమ్‌లో నమోదు చేసుకుని క్లియరెన్స్ పొందాలి. ఈ బీమా పాలసీతో రూ.10లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కార్మికులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏజంట్లు అక్రమ పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహించి గల్ఫ్‌కు పంపుతున్నారు. ముంబాయి ఏజంట్ల ద్వారా స్కైప్ పద్ధతిన రహస్య ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలను పోలీసులు అడ్డుకోవాలి. ఎమిగ్రేషన్ చట్టంపై పోలీసులకు సరైన అవగాహన లేకపోవడంతో గల్ఫ్ ఏజంట్ల మోసాలు కొనసాగుతున్నాయి. కార్మికులు వలస వెళ్లే సమయంలో సాయం, సలహాలు కావాలన్నా 9866853116 నంబర్‌కు, ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబరు 1800113090కు కాల్ చేయవచ్చు. ఏజెంట్లపై నేరుగా ఫిర్యాదు చేయొచ్చు గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు నేరుగా వారి పరిధిలోని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చు. విచారణ జరిపి కేసులు నమోదు చేస్తారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు ముందుగా వీసాలపై అవగాహన పెంచుకోవాలి. లైసెన్స్ కలిగిన ఏజెంట్ల ద్వారానే వీసా పొందాలి. సబ్ ఏజెంట్లు, గుర్తింపు లేని ఏజెంట్లను నమ్మవద్దు. ముందుగా అన్నీ నిర్ధారించుకోకుండా.. ఎవరికీ డబ్బులు కట్టవద్దు. పాస్‌పోర్టు ఇవ్వద్దు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంతో పోలిస్తే గల్ఫ్ మోసాలు తగ్గాయి. గల్ఫ్ బాధితుల కోసం జిల్లా కేంద్రంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. -
మోసాలకుఅడ్డుకట్ట వేయలేమా..
మోర్తాడ్: మోసపోయేవారు ఉన్నంత కాలం.. మోసగించేవారు ఉంటారు అనే నానుడికి గల్ఫ్ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే వారు ఎక్కడో ఏదో విధంగా మోసపోతూనే ఉన్నారు. ఇటీవల పలు ఘటనలు వెలుగుచూశాయి. షార్జాలోని బల్దియాలో ఉద్యోగ అవకాశాలు ఉన్నా యని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి దాదాపు 300 మంది నిరుద్యోగులను నమ్మించి రూ.5 కోట్లతో ఉడాయించిన ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలో జరిగింది. నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించిన ఆ యువకుడు నకిలీ వీసాలను నిరుద్యోగులకు అంటగట్టాడు. ఆ వీసాలతో కార్మికులు షార్జాకు వెళ్లే ప్రయత్నంలో ఎయిర్‌పోర్టులో అధికారులు గుర్తించి తిప్పిపంచారు. అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి వీసాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి రూ.3 కోట్లు వసూలు చేసిన ఓ ఏజెంటు బాగోతాన్ని వరంగల్ జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. ఇవే కాకుండా.. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం అనధికారికంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న కొందరిని నిజామాబాద్, కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. గల్ఫ్ వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిరుద్యోగుల అవసరాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న మోసగాళ్లు అమాయకులను వంచనకు గురిచేస్తున్నారు. ఇదిలావుండగా.. కొందరు లైసెన్స్డ్ ఏజెంట్లు గల్ఫ్ దేశాలకు మొదట విజిట్ వీసాలపై మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిట్ వీసాలపై వెళ్లి గల్ఫ్ దేశాల్లో పనులుచేస్తే ఎన్నో విధాలుగా నష్టపోతారు. నిరుద్యోగులకు అవగాహన లేకపోవడంతో విజిట్ వీసాలపైనే గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. ఎస్ఓపీపై పోలీసులకు అవగాహన.. విదేశాల్లో ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించే వారికి అండగా విదేశాంగ శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ)ని రూపొందించింది. ఈ ఎస్ఓపీపై రాష్ట్ర పోలీసులు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులను మోసం చేసిన ఏజెంట్లపై నామమాత్రపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో బాధితులకు ప్రయోజనం కలుగడం లేదు. వీసా మోసాలపై కఠినంగా వ్యవహరిస్తే బాధితులకు న్యాయం జరగడంతో పాటు మోసాలను అరికట్టడానికి అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీసా మోసాలపై అవగాహన కల్పిస్తున్నాం.. విదేశాలకు వెళ్లాలనుకునే వారు వీసాలను పొందే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. వలసలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మా టామ్‌కామ్ సంస్థ ఆధ్వర్యంలో, ఉపాధి కల్పన శాఖల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వీసాలు పొందిన తరువాత అవి నకిలీవా లేక సరైనవా అని నిర్ధారించుకోవడానికి వలసదారులకు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్లలో పరిశీలించి వీసాలను నిర్ధారించుకోవాలి. వలసదారులు రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే వీసాల కోసం ప్రయత్నం చేయాలి. లైసెన్స్ లేని ఏజెంట్లను వీసాల కోసం సంప్రదించవద్దు. జాగ్రత్తగా వ్యవహరిస్తే మోసపోకుండా ఉంటారు. వలస వెళ్లాలనుకునేవారికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అండగా ఉంటుంది. సాధారణ కేసుల నమోదుతో ప్రయోజనం లేదు వీసా మోసాలపై పోలీసులు నామమాత్రంగా కేసులు నమోదు చేస్తే ప్రయోజనం లేదు. వలస వెళ్లే వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉన్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు 420 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం వల్ల ఏజెంట్లు సులభంగా తప్పించుకుంటున్నారు. ఎమిగ్రేషన్ యాక్ట్ 1983తో పాటు ఐపీసీ 370 (మానవ అక్రమ రవాణా) కింద కేసులు పెట్టాలి. నకిలీ ఏజెంట్లు, మోసగించిన ఏజెంట్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుంది. మోసాలను అరికట్టడానికి అవకాశం కలుగుతుంది. వీసా రాకెట్లో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఉన్న చైన్ మొత్తాన్ని కేసు పరిధిలోకి తీసుకురావాలి. వలస వెళ్లే కార్మికులకు శిక్షణ ఇస్తున్నాం.. విదేశాలకు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికులకు శిక్షణ ఇస్తున్నాం. అనేక మంది కార్మికులు ఎలాంటి శిక్షణ లేకుండానే విదేశాల్లో ఉద్యోగం కోసం వెళుతున్నారు. అక్కడ పనిపై అవగాహన లేకపోవడంతో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఏజెంట్లు ఫలానా పని అని చెబితే ఆ పనిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం. శిక్షణ పొంది విదేశాలకు వెళ్తే ఎలాంటి నష్టమూ ఉండదు. కార్మికులు కచ్చితంగా తాము ఉపాధి పొందే రంగంలో శిక్షణ పొంది ఉండాలి. అవగాహన కల్పించాలి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న చాలామంది యువత అవగాహన లోపంతోనే మోసపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్కామ్పైనా అవగాహన లేకపోవడంతో ప్రైవేటు ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. చదువుకున్న యువత కూడా ముందువెనకా ఆలోచించకుండా వెళ్లి బలవుతున్నారు. గల్ఫ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత ఎలా వెళ్తే బాగుంటుందనేది తెలుసుకోవాలి. -
వృత్తి నైపుణ్యం పెంపునకు శిక్షణ
గల్ఫ్ డెస్క్: తమ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందిలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఖతార్‌లోని అల్ మిస్నాద్ కంపెనీ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సిబ్బంది తమ కార్యకలాపాలలో రాణించాలనే తపనను ప్రోత్సహిస్తూ కంపెనీ యాజమాన్యం ఈ నెలంతా శిక్షణ కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించనుంది. -
సంక్షేమమే లక్ష్యం కావాలి
గల్ఫ్ కార్మికుల విషయంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలపై వలస జీవుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటున్న వారిని ఇంటి బాట పట్టించి రాష్ట్ర రాజధాని పరిసరాల్లో ఉపాధి చూపుతామని, ఇందుకు తాను స్వయంగా రంగంలోకి దిగుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించిన విషయం విదితమే. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించడం ఆహా్వనించదగ్గ పరిణామమేనని, అయితే వలస కార్మికులను స్వగ్రామాలకు రప్పించి ఇక్కడే ఉపాధి చూపుతామనే అంశంపై భిన్నాబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న కార్మికులు ఎందరు అనేది ప్రభుత్వం వద్ద నిర్ధిష్టమైన సంఖ్య లేదని, అది తేలకపోతే ఉపాధి అవకాశాలు ఎలా కలి్పస్తారని పలువురు ప్రశి్నస్తున్నారు. వలస కార్మికులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న ప్రవాసీ సంక్షేమ విధానం(ఎన్ఆర్ఐ పాలసీ) అమలు కాలేదని, కార్మికుల సంక్షేమానికి కార్యాచరణ చేపట్టాలని పలు స్వచ్ఛంద సంఘాలు సూచిస్తున్నాయి. గత హామీలను అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై పాలసీ అమలు చేస్తే లక్షల మంది గల్ఫ్ కారి్మకుల బతుకులు బాగుపడుతాయి. గల్ఫ్ కారి్మకుల సంక్షేమానికి గతంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుంది. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి వివరాలు ప్రభుత్వం వద్ద, కారి్మకుల ఊళ్లలోని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఉండాలి. మోస పూరిత ఏజెంట్ల వ్యవస్థను తుడిచిపెట్టాలి. బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లి నష్టపోయిన, మోసపోయిన వారికి ప్రభుత్వం వారి స్వగ్రామాల్లో ఉపాధి చూపాలి. వారికి పునరేకీకరణ కల్పించి మనోధైర్యం నింపాలి. గల్ఫ్ దేశాల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఆరి్థక సాయం చేయాలి. అవయవాలు కోల్పోయిన కారి్మకులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. భారత రాయబార కార్యాలయంలో తెలుగు మాట్లాడే అధికారులను ఏర్పాటు చేస్తే వలస కార్మికులకు సమస్యలు చెప్పుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తెలుగు భాష వచ్చిన అధికారులు లేకపోవడంతో కార్మికులు సమస్యలు చెప్పుకోలేక కూడా నష్టపోతున్నారు. జీతాలు ఇవ్వని గల్ఫ్ కంపనీలు యజమానుల నుంచి వేతాలు రాబట్టడానికి విదేశాంగ శాఖ ద్వారా చర్యలు చేపట్టాలి. గల్ఫ్‌కు వెళ్లిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారు. వారి రేషన్‌కార్డుల కూడా కట్ చేస్తున్నారు. ఇలా తొలగించడం వల్ల వలసజీవులు ఎంతో నష్టపోతున్నారు. గల్ఫ్ నుంచి తిరిగివచ్చి ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి వారి నైపుణ్యం ప్రకారం వారి జిల్లాల్లో ఉద్యోగం కలి్పంచాలి. ఆచరణలో చూపితేనే నమ్మకం ఆయన ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లోని వివిధ దేశాలకు వెళ్లాడు. అక్కడ దశాబ్దం పాటు పనిచేసి తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. అక్కడి కారి్మకుల కష్టాలపై అవగాహన ఉన్న ఆయన.. సుఖీభవ సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా వారికి సేవలందిస్తున్నాడు. ఆయనే బొక్కెనపల్లి నాగరాజు. గల్ఫ్ కారి్మకుల సంక్షేమం అంశాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చర్చకు తీసుకురావడం.. కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్ఆర్ఐ పాలసీని అధ్యయనం చేయడానికి త్వరలోనే ఓ బృందాన్ని అక్కడికి పంపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన ఈ నేపథ్యంలో గల్ఫ్ కారి్మకుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై నాగరాజు‘సాక్షి’కి తెలిపారు. గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి కేరళలో అమలు చేస్తున్న విధానంపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపనుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. తెలంగాణ ఏర్పడక ముందు ఉద్యమంలో గల్ఫ్ కారి్మకులకు టీఆర్ఎస్ ఎన్నో ఆశలు కల్పించింది. రాష్ట్రం ఆవిర్బవించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ఆర్ఐ శాఖను పర్యవేక్షించిన మంత్రి కేటీఆర్ గల్ఫ్ కార్మికుల కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమయంలో సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. కానీ, ఇంతవరకు వాటి అమలు దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం కేరళలో అమలు చేస్తున్న విధానంపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక బృందాన్ని పంపాలని నిర్ణయించిన ప్రభుత్వం.. దానిని ఇక్కడ అమలు చేయడానికి చిత్తశుద్ధితో వ్యవహరించాలి. గతంలో మాదిరిగానే మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపాలి. ముఖ్యంగా ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవాస భారత బీమా యోజన పథకం ద్వారా గల్ఫ్ దేశాల్లో ప్రమాదంలో మరణించిన కారి్మకుల కుటుంబాలకు రూ.10లక్షల ఆరి్థక సహాయం చేస్తుంది. కారి్మకులు ఎలా మరణించినా.. వారి కుటుంబానికి రూ.పది లక్షల ఆర్థిక సహాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీని రూపొందించాలి. గల్ప్‌లో చనిపోయిన వారి మృతదేహాలు స్వగ్రామాలకు చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించాలి. ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి. దీని ద్వారా గల్ఫ్‌లో ఉపాధి కోల్పోయి ఇక్కడకు వచి్చన కారి్మకులు స్వయం ఉపాధి పొందడానికి తగిన శిక్షణ ఇచ్చి రుణాలు అందజేయాలి. గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారిలో ఎక్కువ మందికి వృత్తి నైపుణ్యత లేకపోవడం వల్ల కూలీలుగా తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. ప్రభుత్వం వివిధ వృత్తుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి పంపితే అధిక వేతనాలు పొందడానికి అవకాశముంటుంది. వలసలు ఆపడం, కార్మికులను రప్పించడం కష్టమే.. గల్ఫ్ దేశాలకు వలసలను ఆపడం, అక్కడ ఉన్న మన కార్మికులను రప్పించడం కష్టమేనని జగిత్యాలకు చెందిన ఓ రిక్రూటింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు, గల్ఫ్ రిటర్నీ అయిన చిట్ల రమణ ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు. మన దగ్గర వ్యవసాయంలో, ఇతర పనుల్లో యాంత్రీకరణ జరగడంతో స్థానికంగా ఉపాధి తగ్గిపోయింది. గతంలో కార్మికులకు వేతనం చేతికి అందించేవారు. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో విధానం మారిపోయింది. కార్మికుల ఖాతాల్లోనే వేతనాలను జమ చేస్తున్నారు. అందువల్ల కార్మికులను మోసగించే చర్యలకు బ్రేక్ పడింది. గల్ఫ్‌కు చట్టబద్ధంగా వెళ్తే ఎలాంటి ఇబ్బందీ లేదు. -
బాధ్యత విస్మరించొద్దు
గల్ఫ్ డెస్క్: ‘వలస అనేది అభివృద్ధికి మార్గం కావాలి. విషాదం, జీవన విధ్వంసానికి ప్రతీక కాకూడదు. ప్రభుత్వాలు చట్టబద్ధమైన, సురక్షితమైన వలసలను ప్రోత్సహిస్తూ, అక్రమ వలసలను నిరోధించాలి’ అని పలు సంఘాల ప్రతినిధులు కోరారు. వలస కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు ఉపాధికి అవకాశం ఇచ్చే విదేశీ ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ‘వలస కార్మికుల హక్కులు, సంక్షేమం – ప్రభుత్వాల బాధ్యత’ అంశంపై జాగో తెలంగాణ, ప్రవాసీ మిత్ర సంయుక్తంగా జగిత్యాల పట్టణంలో ఇటీవల నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు గల్ఫ్ కార్మికుల సమస్యలపై తమ వాణి వినిపించారు. వలసలు అత్యధికంగా ఉన్న ప్రాంతమైన జగిత్యాల జిల్లా కేంద్రాన్ని తొలిసారిగా రౌండ్ టేబుల్ సమావేశ నిర్వహణకు వేదికగా ఎంపిక చేయడం విశేషం. వలసల నేపథ్యం మొదలుకుని ఎమిగ్రేషన్ యాక్టు, వలస కార్మికుల గణాంకాలు, ఖల్లివెల్లి కార్మికుల కష్టాలు, ఆమ్నెస్టీ(క్షమాభిక్ష) పథకం, కేరళ తరహా ప్రవాసీ విధానం, గల్ఫ్ దేశాల్లో వైద్య సదుపాయాలు అందకపోవడంతో ఆరోగ్యం క్షీణించడం, చనిపోయిన వారి మృతదేహాలను తరలింపులో జాప్యం.. తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం గల్ఫ్‌లో ఉన్న రైతులకు అందించడం, రూ.5లక్షల బీమా వర్తింప చేయడం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా వలస కార్మికులు కోరుతున్న ప్రవాసీ విధానం(ఎన్ఆర్ఐ పాలసీ) అమలు చేయాలని వక్తలు రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశారు. ప్రభుత్వాలకు వలస కార్మికుల ప్రయోజనాల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలో సూచించారు. అన్ని పథకాల్లో గల్ఫ్ కార్మికులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలి గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు అన్ని సంక్షేమ పథకాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఇవి అమలైతేనే వారి కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. – టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ గల్ఫ్ కార్మికుల సంఖ్యను తేల్చాలి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల సంఖ్యను మొదట తేల్చాలి. ఇప్పటి వరకు వలస వెళ్లిన కార్మికులకు సంబంధించి నిర్ధిష్టమైన సంఖ్య లేదు. క్షేత్ర స్థాయిలో సర్వేను పకడ్బందీగా నిర్వహించి వలస కార్మికుల సంఖ్యను తేలిస్తే వారి కోసం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. – డాక్టర్ పుల్లూరి సంపత్‌రావు, గల్ఫ్ వలసల పరిశోధకుడు రూ.500 కోట్లు కేటాయించాలి గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా రూ.500 కోట్లు కేటాయించాలి. వలస కార్మికులు తమ శ్రమతో ఏటా విదేశీ మారకద్రవ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్నారు. అందువల్ల వారి సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి సంక్షేమ పథకాలను అమలు చేయాలి.– స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసీ మిత్ర కార్మిక యూనియన్ అధ్యక్షుడు తెలంగాణ ప్రవాసీ విధానం అమలు చేయాలి తెలంగాణ ప్రవాసీ విధానం(ఎన్ఆర్ఐ పాలసీ) వెంటనే అమలు చేయాలి. ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తేనే వలస కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయి. ముసాయిదా రూపొందించినా ఇంత వరకు ప్రభుత్వం అమలు చేయలేదు. వెంటనే తెలంగాణ ప్రవాసీ విధానం అమలు చేసి కార్మికులకు మేలు చేకూర్చాలి. – గుల్లె రాజేశ్వర్, జడ్పీటీసీ సభ్యుడు, ఏర్గట్ల మృతిచెందిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షలు ఇవ్వాలి గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ఎంతో మంది గల్ఫ్ మృతుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. అలాగే గల్ఫ్ నుంచి స్వగ్రామానికి వచ్చిన ఏడాదిలోపు ఏ కారణం చేతనైనా మరణించిన వారికి కూడా ఎక్స్‌గ్రేషియా వర్తింపజేయాలి. – గుగ్గిళ్ల రవిగౌడ్, తెలంగాణ గల్ఫ్ ఉద్యమ సమితి కన్వీనర్ వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించకూడదు గల్ఫ్ వలస కార్మికుల పేర్లను రేషన్‌కార్డులలో కొనసాగించాలి. ఉపాధి కోసం వెళ్లిన వారి పేర్లు కార్డుల నుంచి తొలగించడం అన్యాయం. అలాగే గల్ఫ్ వలస కార్మికులు అందరికీ ఆరోగ్యశ్రీతో పాటు అన్ని రకాల సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి.– నరేష్‌రెడ్డి, జగిత్యాల జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జైళ్లలో మగ్గుతున్న కార్మికులకు న్యాయ సహాయం అందించాలి గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న కార్మికులకు న్యాయ సహాయం అందించాలి. కార్మికులు జైళ్ల నుంచి విడుదలై ఇంటికి చేరుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. గల్ఫ్ దేశాల నుంచి స్వగ్రామానికి చేరుకున్న కార్మికులకు పునరావాసం, పునరేకీకరణ కార్యక్రమాలను అమలు చేయాలి. కార్మికులు మానసికంగా కృంగిపోకుండా కౌన్సిలింగ్ నిర్వహించాలి.– చుక్క గంగారెడ్డి, టీజేఎఫ్ అధ్యక్షుడు -
గల్ఫ్ నుంచి వచ్చి.. కులవృత్తిలో రాణించి..
వూశకొయ్యల గంగాకిషన్, నవీపేట (నిజామాబాద్ జిల్లా): గల్ఫ్ దేశాలలో సంపాదన బాగుంటుందని తలచిన ఆ యువకుడు ఉపాధి కోసం దుబాయికి వెళ్లాడు. కానీ, విజిట్ వీసాపై వెళ్లడంతో ఆశలు ఆవిరయ్యాయి. యేడాదిలోపే అక్కడి పోలీసులు స్వగ్రామానికి పంపించేశారు. అయితే, అప్పుల బాధలు అతడిని మళ్లీ గల్ఫ్ వైపు మళ్లించాయి. రెండోసారి ఖతార్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి సౌదీ అరేబియాకు బదిలీపై వెళ్లి స్థిరపడుతున్న సమయంలోనే కంపెనీ మూతపడింది. దీంతో గల్ఫ్‌పై మక్కువ చంపుకుని స్వగ్రామంలోనే ఉపాధి పొందాలనుకున్నాడు. కులవృత్తి అయిన వడ్రంగి పనిలో మెళకువలను నేర్చుకుని గల్ఫ్‌లో సంపాదించే డబ్బులకు సమానంగా ప్రస్తుతం ఇక్కడే సంపాదిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని నాగేపూర్ గ్రామానికి చెందిన గన్నోజి రాజన్న, సక్కుబాయిల రెండో కుమారుడు రమేష్ పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఉన్నత చదువులు చదవాలని తలంచినా.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు చదువుకు దూరం చేశాయి. తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని తలచి 2006లో దుబాయికి వెళ్లాడు. అందరూ విజిట్ వీసాపై వెళ్లి పనులు చేయడంతో ఆకర్షితుడైన రమేష్ అక్కడికి వెళ్లాడు. అక్కడిక్కడ కూలీ పనులు చేస్తున్న రమేష్‌ను పోలీసులు పట్టుకుని 2007లో ఇండియాకు పంపించేశారు. ఆశగా వెళ్లి ఆవేదనతో వచ్చిన రమేష్‌కు గ్రామానికి రాగానే మళ్లీ అప్పుల బాధలు వెంటాడాయి. 2009లో జేఅండ్‌పీ కంపెనీ వీసాపై ఖతార్‌కు వెళ్లాడు. వడ్రంగి వృత్తిలో ప్రావీణ్యుడైన రమేష్ ఫర్నిచర్ తయారీ ఉద్యోగంలో స్థిర పడ్డాడు. 2011లో అదే కంపెనీకి చెందిన సౌదీ అరేబియా బ్రాంచ్‌కు బదిలీపై వెళ్లాడు. 2015లో ఫోర్‌మెన్‌గా ఉద్యోగోన్నతి కల్పించడంతో ఆనందంగా గడిపాడు. నాలుగుపైసలు సంపాదిస్తున్నానన్న ఆనందంలో ఉండగా.. పిడుగులాంటి వార్త వినబడింది. కంపెనీ దివాలా తీసిందని 2018లో మూసివేశారు. ఆరు నెలల జీతం..ఏడు నెలల సర్వీస్ డబ్బులు ఇవ్వకుండానే రమేష్‌ను కంపెనీ యాజమాన్యం ఇంటికి పంపించింది. మనోధైర్యంతో.. రమేష్ ఉద్యోగం కోల్పోయి ఇంటికి చేరిన సమయంలో ఆయనకు ఇద్దరు పిల్లలు. ఆ దశలో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అని అతను కుంగిపోలేదు. వడ్రంగి వృత్తిలో మరింతగా రాణించి సొంతూళ్లోనే ఉపాధి పొందాలని సంకల్పించాడు. ఫర్నిచర్ తయారీలో మరిన్ని మెళకువలు నేర్చుకున్నాడు. దుబాయి, ఖతార్, సౌదీలలో ఫర్నిచర్ పనిచేయడంతో పలు రకాల వస్తువులను తయారు చేయడం సులువుగా నేర్చుకున్నాడు. రూ. లక్షన్నర అప్పు చేసి ఫర్నిచర్ తయారీకి ఉపయోగపడే యంత్రాలను, సామగ్రిని సమకూర్చుకున్నాడు. గృహాలకు అవసరమయ్యే ఫర్నిచర్‌ను తయారు చేస్తూ.. గల్ఫ్‌లో నెలకు సంపాదించే డబ్బులను సొంతూళ్లోనే సంపాదిస్తున్నాడు. స్వగ్రామమే బెటర్: రమేష్ కష్టపడే గుణముంటే ప్రతి ఒక్కరికీ సొంతూరే ఒక గల్ఫ్ దేశం అవుతుంది. అమ్మా, నాన్న, భార్యాపిల్లలకు దగ్గరగా ఉంటూ ఉపాధి పొందడం ఆనందంగా ఉంది. అక్కడ సంపాదించే డబ్బులను ఇక్కడే సంపాదిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. గల్ఫ్ దేశాలపై మోజు తగ్గించుకుని ఇక్కడే పనులు చేసుకుంటే అందరూ హాయిగా ఉంటారు. -
షార్జాలో మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు
గల్ఫ్ : షార్జాలో ఇండియన్ పీపుల్స్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి మురళీధరన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. షార్జాలోని ఇండియన్ అసోసియేషన్ ఆడిటోరియంలో నిర్వహించిన ఉత్సవాల్లో కాన్సుల్ జనరల్ విపుల్, ఇండియన్ పీపుల్స్ ఫోరం జాతీయ కన్వీనర్ భూపేందర్, ఉపాధ్యక్షుడు జనగామ శ్రీనివాస్, సభ్యులు రమేష్, మహేందర్‌రెడ్డి, బాలకిషన్, గిరీష్ పంత్, విజయ్, ఐపీఎఫ్ అల్ ఎమిరేట్స్ సభ్యులు, ఇండియన్ కమిటీ సభ్యులు, ఇండియన్ అసోసియేషన్ షార్జా సభ్యులు, ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. కాగా, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీజేపీ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ కన్వీనర్ వంశీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. -
అక్కడి నుంచి ఎలా వచ్చేది..!
‘గల్ఫ్‌లో ఉన్న మనోళ్లంతా ఇంటికి తిరిగి రావాలె. ఇక్కడ ఎన్నో అవకాశాలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నిర్మాణరంగం వేగంగా నడుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వచ్చి పనులు చేస్తున్నారు. గల్ఫ్‌లో ఉన్న మనోళ్లంతా వస్తే ఇక్కడే మస్తు పని దొరుకుతుంది. అవసరమైతే నేనే స్వయంగా గల్ఫ్ దేశాలకు వెళ్లి మనోళ్లతోని మాట్లాడుతా’ అని సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన ప్రకటన గల్ఫ్ వలస కార్మికుల్లో చర్చనీయాంశమైంది. తొలిసారి గల్ఫ్ వలస కార్మికుల విషయంపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో వలస కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం అనుసరించబోయే తీరు ఎలా ఉండబోతుందోననే అంశంపై సర్వత్రా చర్చజరుగుతోంది. సీఎం ప్రకటనపై కార్మికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు కార్మికులు సానుకూలంగా స్పందించగా, మరి కొందరు ఇది సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. ముఖ్యమంత్రి కేవలం భవన నిర్మాణ రంగంలోనే ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ, గల్ఫ్ దేశాల్లో ఎంతో మంది కార్మికులు ఇతర రంగాల్లోనూ ఉపాధి పొందుతున్నారని పలువురు తెలిపారు. అంతేకాకుండా వలస కార్మికుల సంఖ్య అత్యధికంగా ఉండగా.. వారందరికి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి చూపుతుందా అనే సంశయం వ్యక్తం చేస్తున్నారు. గల్ఫ్‌లో ఏదో ఒక పనిచేసుకుని బతుకుతున్న వలస జీవులు ఇంటికొచ్చి స్థానికంగా ఉపాధి చూసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఏళ్ల తరబడి గల్ఫ్‌లో పనులు చేస్తూ.. అక్కడ కొంత మెరుగైన జీవనం గడుపుతున్న వారు ఇంటికి తిరిగి వచ్చి సంపాదనకు దూరం కాలేమంటున్నారు. ఇదే సమయంలో అరకొర వేతనాలతో నెట్టుకొస్తున్నవారు సైతం.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేరళ విధానం గురించి చెప్పిందని, తరువాత దాన్ని మరిచిపోయిందని, ఇప్పుడు రమ్మంటుంటే నమ్మకం కలగడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గల్ఫ్ వలస జీవుల పట్ల స్పష్టమైన వైఖరిని ప్రకటించి ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అప్పుడే నమ్మకం కుదిరి చాలా మంది స్వస్థలాలకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న ఉపాధి ఇదే... గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్తున్న తెలంగాణ కార్మికుల్లో ఎక్కువ మంది నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. భవనాల నిర్మాణంతో పాటు ఎలక్రీషియన్, ఫ్లంబర్, డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కొందరు మాల్స్, ఇతర కంపెనీల్లో క్లీనింగ్, స్టోర్ కీపర్లుగా, సూపర్వైజర్లుగా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేయడానికి వెళ్తున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ ప్రాంతం లోని నిర్మాణ రంగంలో ఉపాధి కల్పించడానికి ఏర్పాట్లు చేస్తామని ప్రకటించింది. మన ప్రాంతం వారు వలస వెళ్లడంతో స్థానికంగా జరిగే నిర్మాణాలకు కార్మికుల కొరత ఏర్పడి పొరుగు రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పించుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం పేర్కొంటోంది. అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లో వలస కార్మికులకు ఆశించిన విధంగా వేతనం లభించడం లేదని ఈ కారణంగా కార్మికులు అవస్థలు పడుతున్నారని ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల హైదరాబాద్ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాల్లో వలస కార్మికులకు ఉపాధి కల్పించడానికి బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతామని ప్రకటించింది. అంతేగాక హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్)లో కార్మికులకు అవసరమైన శిక్షణ ఇప్పిస్తామని కూడా ప్రభుత్వం వెల్లడించింది. మూడు తరాలు గల్ఫ్‌లోనే.. ఐదు దశాబ్దాలుగా గల్ఫ్‌కు వలసలు కొనసాగుతున్నాయి. మూడు తరాల వాళ్లు ఎడారి దేశాల బాట పట్టారు. ఇటీవలి కాలంలో చాలా మంది యువకులు గల్ఫ్ బాట పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలం కల్వరాల్, పద్మాజివాడీ, మాచారెడ్డి మండలంలోని పాల్వంచ, గన్పూర్ (ఎం), రామారెడ్డి మండలం రెడ్డిపేట, అన్నారం.. ఇలా కొన్ని గ్రామాల్లో ఒకే ఇంట్లో తండ్రి, కొడుకు గల్ఫ్‌లో ఇప్పటికీ ఉంటున్నారు. అంతకుముందు వారి తాతలు కూడా వెళ్లివచ్చారు. గల్ఫ్‌లో తెలంగాణ వాసులు 13 లక్షలకు పైగానే.. గల్ఫ్ దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్, ఇరాక్లలో వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికుల సంఖ్య 13లక్షలకు పైగా ఉంటుందని అంచనా. 1970 నుంచి ఈ ప్రాంత వాసులు గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్నారు. మొదట తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వలసలు సాగాయి. ఆ తర్వాత వలసలు దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించాయి. ప్రవాసీ సంక్షేమ విధానంపై ఆశలు.. విదేశాలకు ఉపాధి, ఉద్యోగాల కోసం వలస వెళ్లిన కార్మికుల సంక్షేమం కోసం ప్రవాసీ సంక్షేమ విధానం(ఎన్ఆర్ఐ పాలసీ) అమలు చేయాలని వలసదారులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదాను సిద్ధం చేసినా మళ్లీ అధ్యయనం కోసం అధికారుల బృందాన్ని కేరళకు పంపించాలని నిర్ణయించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముసాయిదా సిద్ధం చేసిన తరువాత అధ్య యనం కోసం అధికారులను కేరళకు పంపిం చడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది కాలయాపన చేయడమేనని గల్ఫ్ ప్రవాసుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు అంటున్నారు. అయితే, గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పడం హర్షణీయమని పలువురు పేర్కొంటున్నారు. కార్మికుల సంఖ్య తేల్చడానికి సర్వే.. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల సంఖ్య ఎంత ఉంటుందో తేల్చడానికి అంతర్గతంగా సర్వే జరుగుతోంది. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో యంత్రాంగం వివరాలు సేకరిస్తోంది. గల్ఫ్ వలస కార్మికులను స్వరాష్ట్రానికి రప్పించి వారికి స్థానికంగానే ఉపాధి చూపుతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో వలస కార్మికుల సంఖ్యను తేల్చడానికి ప్రత్యేక సర్వే ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
వలస కార్మిక కుటుంబాల ఉద్యమ బాట
సాక్షి, నెట్వర్క్: ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయడానికి అవసరమైన ప్రవాసీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన ఉద్యమం పల్లెలకు విస్తరిస్తోంది. దీనిపై ఇప్పటికే వలస కార్మికులు సామాజిక మాధ్యమాల ద్వారా నినదిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికులకు అండగా ఇప్పుడు వారి కుటుంబాలు కూడా ప్రవాసీ సంక్షేమ బోర్డు సాధన ఉద్యమంలో భాగస్వాములయ్యాయి. ఇటీవల నిర్వహించిన సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వం ప్రవాసీల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేస్తే తమ కుటుంబాలకు లాభం కలుగుతుందని వలసదారుల కుటుంబాల సభ్యులు భావిస్తున్నారు. అందుకే సద్దుల బతుకమ్మ రోజున ఉద్యమ స్ఫూర్తిని చాటారు. అంతేకాకుండా బతుకమ్మ పాటల్లో తెలంగాణ ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను వ్యక్తపరుస్తూ పాటలు పాడారు. తాము అధికారంలోకి వస్తే వలస కార్మికుల కోసం కేరళ తరహాలో ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేస్తామని 2014 ఎన్నికల సందర్భంగా పలు పార్టీలు హామీ ఇచ్చాయి. అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పాటుపై దృష్టి సారించలేకపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వివిధ రాజకీయ పక్షాలు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తామని హామీ ఇచ్చాయి. అయితే, మరోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎన్ఆర్ఐ పాలసీ లేదా తెలంగాణ ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ అధికంగా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2018–2019 బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అయితే. ఈ నిధులను వినియోగించడానికి నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోవడంతో ఎంత మేరకు నిధులు వినియోగమయ్యాయో తేలలేకపోయింది. గల్ఫ్ వలస కార్మికులద్వారా దండిగా ఆదాయం.. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దండిగా ఆదాయం సమకూరుతోంది. గల్ఫ్ దేశాల్లో కార్మికులు తమ చెమటను చిందించి సంపాదించిన సొమ్మును తమ కుటుంబాలకు పంపుతున్నారు. తద్వారా ప్రభుత్వానికి విదేశీ మారకద్రవ్యం వస్తోంది. తాము తెచ్చిపెట్టిన ఆదాయంలో కొంత మొత్తాన్ని తమ సంక్షేమం కోసం ఖర్చుచేయాలని కార్మికులు కోరుతున్నారు. కేరళ ప్రభుత్వం వలస కార్మికుల కోసం ప్రత్యేక చట్టం రూపొందించింది. దాని ద్వారా బోర్డు ఏర్పాటు చేసి కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. బోర్డు ఏర్పడితే కలిగే ప్రయోజనాలు ఇవీ.. ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పడితే వలస కార్మికులకు బహుళ ప్రయోజనాలుకలుగనున్నాయి. వలస కార్మికులకు బీమా లేదా ఫించన్ అందుతుంది. స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందించడానికి అవకాశం ఉంది.గల్ఫ్ లేదా ఇతర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లాలనుకునే కార్మికులకు తాముఎంచుకున్న రంగంలో నైపుణ్య శిక్షణ లభించే అవకాశం ఉంది. కౌషల్ వికాస్యోజన పథకం ద్వారా వలస కార్మికులు వృత్తి నైపుణ్యం పొందవచ్చు. అలాగేగల్ఫ్ దేశాల్లో జైళ్లో మగ్గుతున్న వారికి న్యాయ సహాయం అందడం, మరణించినవారి మృతదేహాలను స్వగ్రామాలకు చేర్చడానికి ఉచిత అంబులెన్స్ సౌకర్యంకల్పించడం, బీమా వల్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు వలస కార్మికులకు ప్రవాసీ సంక్షేమ బోర్డు ద్వారాఅందనున్నాయి. -
అబుదాబిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
అబుదాబి : తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తెలంగాణవాసులు ఆదేశ రాజధాని అబుదాబిలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. అక్కడి తెలంగాణ సంఘం గత నెలరోజులుగా ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది. ఈ అద్భుత కార్యక్రమానికి స్థానిక ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదికైంది. అయితే ఎడారి ప్రాంతం కావడం వల్ల పూలు దొరకడం చాలా కష్టం. కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో నిర్వాహకులు ఇండియా నుంచి రకరకాల పూలను, వందల కిలోల్లో తెప్పించి అబుదాబిని పూలవనంగా మార్చారు. శనివారం ఉదయం ఇండియా నుంచి తెచ్చిన తీరొక్క పూలతో, పల్లె వాతావరణాన్ని తలపించేలా ముస్తాబు చేశారు. ఈ వేడుక కోసం వందలాది మహిళలు, చిన్నారులు నెల రోజులు కష్టపడి రూపొందించిన నృత్య ప్రదర్శనలతో, బతుకమ్మ పాటలతో ప్రాంగణాన్ని మార్మోగించారు. ఇండియా నుంచి వచ్చిన ప్రమఖ కవి గాయకులు కోకిల నాగరాజు, సాయిచంద్‌లతో పాటు టీన్యూస్లోని ధూమ్‌ధామ్ ముచ్చట్లు యాంకర్ కుమారి ఉదయ శ్రీలు వివిధ రకాల ఆటపాటలతో ప్రేక్షకులను అలరించారు. అనంతరం తెలంగాణ సాంప్రదాయం ప్రతిబింబించేలా డప్పు వాయిద్యం, కోలాటాల సందడి మధ్యలో అన్ని బతుకమ్మలను ప్రాంగణానికి తోడ్కొని వెళ్లారు. ఈ కార్యక్రమంలో జంటల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ నుంచి తెప్పించిన పిండి వంటలు అందరినీ విశేషంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యుఏఈలోని భారత రాయబార కార్యాలయంలో ఫస్ట్ సెక్రటరీ శ్రీమతి పూజ వెర్నెకర్, ఐఎఫ్ఎస్ అధికారిణి హాజరయ్యారు. వారుకూడా తెలంగాణ మహిళలతో బతుకమ్మ ఆడిపాడారు. తదనంతరం కార్యక్రమ నిర్వాహకులు 10 అందమైన బతుకమ్మలకు, ప్రాంగణానికి మొదటగా వచ్చిన 5 బతుకమ్మలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు, చక్కగా బతుకమ్మ నాట్యం చేసిన మహిళలకు, జంటలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదాతలైన బూర్జిల్ హాస్పిటల్, పే ఇట్, రాయల్ రెజిస్, ఎస్పాకో, ఎన్ఎంసి, యుఏఈ ఎక్సేంజ్, ఆసమ్ సలోన్, రోచన గ్రూప్ వారిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. చివరగా గౌరీపూజ చేసి బతుకమ్మను కృతిమ కొలనులో నిమజ్జనం చేశారు. అనంతరం ప్రసాదాలు తీసుకుని, విందు భోజనం చేశారు. ఈ కార్యక్రమాన్నిగోపాల్, వంశీ, కమలాకర్, శ్రీనివాస్, సాగర్, గంగన్న, సంతోష్, జగదీష్, రాజశ్రీనివాస రావు, అశోక్ , శ్రీనివాస్ రెడ్డి, పావని, అర్చన, వనిత, మంజు, సౌజన్య , లక్ష్మి, సుధ తదితరులు దగ్గరుండి నడిపించారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలను విదేశాలలో ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని నిర్వాహకులు తెలియజేశారు. -
మస్కట్‌లో ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ ఆవిష్కరణ
గల్ఫ్ డెస్క్ : గల్ఫ్ వలస జీవితాలు, కష్టసుఖాలు, హక్కులు, అభివృద్ధి.. ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ ప్రతివారం జిల్లా పేజీల్లో ‘గల్ఫ్ జిందగీ’ ప్రచురించడం తెలుగు జర్నలిజంలో కొత్త ప్రయోగం. ఇటువంటి ప్రయోగాన్ని చేపట్టింది ‘సాక్షి’ దినపత్రిక. 2017 నవంబర్ 11న ప్రారంభమై ఇప్పటి వరకు 83 వారాలుగా కొనసాగుతూ... వలస కార్మికులకు, ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు మధ్య వారధిలా ఉపయోగపడుతోంది. సమగ్ర సమాచారాన్ని ఇస్తూ గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు నేనున్నాననే భరోసా కల్పిస్తూ ముందుకెళ్తోంది. ఒమాన్ రాజధాని మస్కట్‌లో నేడు(అక్టోబర్ 4న) నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఇప్పటివరకు ప్రచురితమైన పేజీలను అన్నింటినీ కలిపి ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ అవిష్కరించారు. మొదట్లో ప్రతి శనివారం ప్రచురితమైన ఈ పేజీ, పాఠకుల కోరిక మేరకు 2018 జూన్ 15 నుంచి గల్ఫ్ దేశాల్లో సెలవు దినమైన శుక్రవారానికి మార్చడమైనది. ఈ పేజీలో గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడే సమాచారం, ఎంబసీలు నిర్వహించే సమావేశాలవివరాలతో పాటు ఆయా దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న కార్మికుల గురించి, వారి జీవన విధానాలు, సక్సెస్‌పై ప్రత్యేక కథనాలు ప్రచురించడం జరిగింది. ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మస్కట్‌లో ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ ఆవిష్కరణ
-
నేడు మస్కట్‌లో ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ ఆవిష్కరణ
గల్ఫ్ డెస్క్: గల్ఫ్ వలస జీవితాలు, కష్టసుఖాలు, హక్కులు, అభివృద్ధి.. ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ ప్రతివారం జిల్లా పేజీల్లో ‘గల్ఫ్ జిందగీ’ ప్రచురించడం తెలుగు జర్నలిజంలో కొత్త ప్రయోగం. 2017 నవంబర్ 11న ప్రారంభమై ఇప్పటి వరకు 83 వారాలుగా కొనసాగుతూ... వలస కార్మికులకు, ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు మధ్య వారధిలా ఉపయోగపడుతోంది. సమగ్ర సమాచారాన్ని ఇస్తూ గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు నేనున్నాననే భరోసా కల్పిస్తూ ముందుకెళ్తోంది. మొదట్లో ప్రతి శనివారం ప్రచురితమైన ఈ పేజీ, పాఠకుల కోరిక మేరకు 2018 జూన్ 15 నుంచి గల్ఫ్ దేశాల్లో సెలవు దినమైన శుక్రవారానికి మార్చడమైనది. ఈ పేజీలో గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడే సమాచారం, ఎంబసీలు నిర్వహించే సమావేశాలవివరాలతో పాటు ఆయా దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న కార్మికుల గురించి, వారి జీవన విధానాలు, సక్సెస్‌పై ప్రత్యేక కథనాలు ప్రచురించాం. ఒమాన్ రాజధానిమస్కట్లో నేడు (అక్టోబర్ 4) నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఇప్పటి వరకు ప్రచురిచిత మైన పేజీలను అన్నింటినీ కలిపి‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ ఆవిష్కరించబడనుంది. -
ఎడారి దేశాల్లోపూల జాతర
సాక్షి, నెట్వర్క్: ‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో... నా నోము పండింది ఉయ్యాలో... నీ నోము పండిందా ఉయ్యాలో... మా వారు వచ్చిరి ఉయ్యాలో... మీ వారు వచ్చిరా ఉయ్యాలో... అంటూ గల్ఫ్ గడ్డపై తెలంగాణ ఆడపడుచులు మన సంస్కృతిని చాటుతున్నారు. బతుకమ్మ పండుగను ప్రతి ఏటా గల్ఫ్ దేశాల్లో ఎంతో వైభంగా నిర్వహిస్తున్నారు. ఉపాధి కోసం ఆయా దేశాలకు వెళ్లిన తెలంగాణ వాసులు అక్కడ కూడా మన సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఎడారి దేశాల్లో బతుకమ్మ పండుగ నిర్వహణకు ప్రవాసీ సంఘాలు ఏర్పాట్లు చేశాయి. సాధారణంగా తెలంగాణలో పితృ అమావాస్యతో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే, గల్ఫ్ దేశాల్లో మాత్రం మన వాళ్లు ఒక రోజును ఎంపిక చేసుకుని ఆ రోజు బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకొంటారు. ఈసారి దాదాపు అన్ని గల్ఫ్ దేశాల్లో 4వ తేదీన (శుక్రవారం) నిర్వహిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయి, అబుదాబీలలో గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహిస్తున్నారు. షార్జాలో ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ జరుపుతున్నారు. ఖతార్‌లో తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జాగృతి సంస్థలు వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. కువైట్‌లో తెలంగాణ చైతన్య స్రవంతి, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేర్వేరు ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు. గతంలో కువైట్ తెలంగాణ సమితి కూడా సంబరాలను నిర్వహించింది. బహ్రెయిన్‌లో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్, తెలంగాణ జాగృతి సంస్థలు విడివిడిగా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నాయి. ఒమాన్‌లోని మస్కట్‌లో ఒమాన్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో సంబరాలను కొనసాగిస్తున్నారు. అలాగే ఇండియన్ సోషియల్ క్లబ్ ఆధ్వర్యంలోనూ సోహార్ ప్రాంతంలో తెలుగు కమ్యునిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు. ఐదేళ్లుగా నిర్వహిస్తున్నాం ఒమాన్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో మ స్కట్‌లో ఐదేళ్ల నుంచి బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నాం. గతేడాది ఐదు వేల మంది పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్నా మన సంస్కృతిని మరిచిపోకూడదు. సంబరాల కోసం పది రోజుల ముందు నుంచి రిహార్సల్స్ కూడా చేశాం. బతుకమ్మ రోజు న అందరికీ ప్రసాదాలు అందిస్తాం. – పన్నీరు వసుంధరా దేవి, ఒమాన్ (జగిత్యాల జిల్లా) విదేశాల్లో జరుపుకోవడం సంతోషంగా ఉంది మేము కొన్నేళ్ల నుంచి కువైట్‌లో నివాసం ఉంటున్నాం. విదేశంలో కూడా బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కువైట్‌లో నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ వాసులే కాకుండా మన దేశంలోని ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు కూడా పాల్గొనడం విశేషం.– అనిత గార్లపాటి,కువైట్ (మిర్యాలగూడ, నల్లగొండ జిల్లా) బతుకమ్మను మరువలేం... పుట్టిన ఊరుకు ఉన్నా ప్రతి ఏటా బతుకమ్మ పండుగ జరుపుకొంటున్నాం. మేము మస్కట్‌లో పదేళ్ల నుంచి ఉం టున్నాం. మొదట రెండు, మూడు కుటుంబాలే బతుకమ్మను నిర్వహించేవి. ఇప్పుడు వేలాది మంది ఈ ఉత్సవాలకు హాజరవుతుండటం విశేషం. చిన్నారులకు మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయడానికి బతుకమ్మ పండుగ ఎంతో దోహదపడుతుంది.– శానగొండ పద్మజ, మస్కట్ (వరంగల్ జిల్లా) సంబరాల కోసం ఎదురుచూస్తుంటాం.. సంవత్సరానికి ఒకసారి నిర్వహించే బతుకమ్మ సంబరాల కోసం దోహా లోని తెలంగాణ ప్రాం తానికి చెందిన వారందరం ఎదురుచూస్తుం టాం. సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటాం. విదేశంలోనూ మన సంస్కృతి, సంప్రదాయాలను పాటించడం హర్షించదగ్గ విషయం.– మారుతి వేలూర్, దోహా,ఖతార్ (హైదరాబాద్) వేడుకల్లో..అందరూ పాల్గొంటారు ఖతార్‌లో నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ ప్రాంతం వారంతా ఎంతో సంతోషంగా పా ల్గొంటారు. సెలవు రోజులను దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ నిర్వహణ తేదీని నిర్ణయిస్తాం. పెద్దా, చిన్న తేడా లేకుండా బతుకమ్మ సంబరాల్లో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. బతుకమ్మకు వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తాం. – అనుపమ సంగిశెట్టి, ఖతార్ (జనగామ జిల్లా) తెలంగాణ ఉద్యమంతోమొదలైన సంబరాలు కువైట్‌లో చాలా కాలం నుంచి నివాసం ఉంటున్నాం. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి కువైట్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలో బతుకమ్మను ఎలా నిర్వహిస్తారో.. అదే తీరుగా కువైట్‌లోనూ నిర్వహిస్తున్నాం. నేను పలుమార్లు బతుకమ్మ పండుగ నిర్వహణకు ఆర్గనైజర్‌గా వ్యవహరించాను.– అభిలాష గొడిషాల, కువైట్ (వరంగల్ జిల్లా) దశాబ్ద కాలంగా జరుపుకొంటున్నాం.. దశాబ్ద కాలంగా దుబాయిలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. పుట్టి పెరిగిన ఊరికి దూరంగా ఉంటున్నా మన సంస్కృతిని మరిచిపోకుండా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ ఆడబిడ్డల పండుగను ఇక్కడ ఆత్మీయుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉంది. 12వ సారి ఇప్పుడు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాం.– ఎలిశెట్టి శ్రీదేవి, మంథని. మన పండుగను మర్చిపోకుండా... మాది జగిత్యాల జిల్లా ధర్మపురి. దుబాయిలో స్థిరపడ్డాం. మన పండుగలను మర్చిపోకుండా మా పిల్లలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా బతుకమ్మ పండుగను జరుపుకొంటున్నాం. తెలంగాణ ఆడపడుచులంతా ఒక్క చోట చేరి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడుకోవడం ఎంతో సంతోషాన్నిస్తుంది. – దీపిక, ధర్మపురి సొంత ఊరిలో ఉన్నట్లుంది.. అబుదాబీలో ఉంటున్నా.. ఏటా బతుకమ్మ వేడుకలు జరుపుకొంటున్నాం. దీంతో సొంత ఊరిలోనే ఉన్నట్లనిపిస్తోంది. దేశం కాని దేశం వచ్చినా సంప్రదాయాలను మరువలేం. బతుకమ్మ నిర్వహించే రోజున అందరం ఎంతో ఉత్సాహంగా ముస్తాబై బతుకమ్మలను పేర్చుతాం. అందరం ఒకే చోటకు చేరి ఆడిపాడుతాం. తెలంగాణ పల్లెల్లో బతుకమ్మకు నైవేద్యం పెట్టినట్లుగానే ఇక్కడా చేస్తున్నాం.– రోజా, అబుదాబీ (ఆర్మూర్, నిజామాబాద్) ఎక్కడ ఉన్నా మరచిపోం.. ఏ దేశంలో ఉన్నా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక గా నిలిచిన బతుకమ్మను మరచిపోం. బతుకమ్మ పండు గను అందరూ ఎంతో సంబరంగా జరు పుకొంటున్నారు. అబుదాబీలో ఇందుకోసం ఏటా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ గల్ఫ్ దేశంలోనే కాకుండా ఇతర పాశ్చాత్య దేశాల్లోను బతుకమ్మను సంబరంగా జరుపుకొంటున్నారు.– లత, అబుదాబీ(పడగల్, వేల్పూర్ మండలం, నిజామాబాద్) ఊర్లో ఆడినట్టే... మన ఊర్లో ఆడినట్టే ఇక్కడ కూడా బతుకమ్మ ఆడుతాం. దోహాలో ఉన్న తెలంగాణ మహిళలమంతా కలుస్తాం. బతుకమ్మ పేర్చేందుకు ఇండియన్ సూపర్ మార్కెట్లలో రకరకాల పూలు అందుబాటులో ఉంటాయి. వాటిని కొనుగోలు చేస్తాం. ఏటా జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు జరుగుతాయి. – గట్టుపల్లి వాసవి,సిలాల్, దోహ (నల్లగొండ జిల్లా) -
గల్ఫ్‌కు వెళ్లే ముందు..
గల్ఫ్ డెస్క్: ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన పథకంలో భాగంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నైపుణ్య అభివృద్ధి పారిశ్రామిక మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అరబ్ గల్ఫ్ దేశాలు, మలేషియా తదితర 18 దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్‌లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టాంకాం) కార్యాలయంలోని శిక్షణ కేంద్రంలో ఒకరోజు శిక్షణ ఇస్తున్నారు. 18 ఇసీఆర్ (ఎమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వైర్డ్ – విదేశీ ఉద్యోగానికి వెళ్లడానికి అనుమతి అవసరమైన) దేశాలకు ఉద్యోగానికి వెళ్లదలచిన వారి కోసం భారత ప్రభుత్వం ఒక రోజు ఉచిత పీడీఓటీ (ప్రీ డిపార్చర్ ఓరియెంటేషన్ ట్రైనింగ్) సదుపాయం కల్పిస్తోంది. సురక్షితమైన, చట్టబద్ధమైన వలసలకు మార్గాల గురించి విషయ పరిజ్ఞానం, అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేయడంతో పాటు ఆయా దేశాల సం స్కృతి, భాష, ఆచార వ్యవహారాలు, స్థానిక నియమాలు, నిబంధనల గురించి వలస వెళ్లే కార్మికులకు అవగాహన కల్పించడం ఈ శిక్షణ ఉద్దేశం. రిక్రూట్మెంట్ నుంచి గల్ఫ్‌లో ఉద్యోగంలో చేరేంత వరకు వివిధ దశల్లో ఎలా మెలగాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో శిక్షకులు కార్మికులకు వివరిస్తారు. గల్ఫ్ దేశాల్లో చట్టాలు, వాటిని అతిక్రమిస్తే అక్కడి శిక్షలను కూడా తెలియజేస్తున్నారు. అంతే కాకుండా ఏ రంగంలో పనిచేస్తే ఎంత జీతం వస్తుంది, దానిని ఎలా ఖర్చు పెట్టుకోవాలి, పొదుపు చేసిన డబ్బును కుటుంబ సభ్యులకు ఎలా చేరవేయాలి తదితర విషయలను వివరిస్తున్నారు. నాటకం, పాటల ద్వారా శిక్షకులతో బోధన అందిస్తున్నారు. ప్రతీ వారం హైదరాబాద్‌లో ఈ శిక్షణ ఇస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్‌లో కూడా అవసరాన్ని బట్టి క్లాసులు నిర్వహిస్తున్నారు. 18 ఇసీఆర్ దేశాలు ఇవీ.. ఎమిగ్రేషన్ యాక్టు–1983 ప్రకారం 18 దేశాలను ఈసీఆర్ కేటగిరీ దేశాలుగా గుర్తించారు. బహ్రెయిన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమాన్, యూఏఈ, ఆఫ్గనిస్తాన్, ఇరాక్,జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేషియా, నార్త్ సుడాన్,సౌత్ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్. శిక్షణ ఎంతో అవసరం.. గల్ఫ్ దేశాలకు పని కోసం వెళ్లే వారికి శిక్షణ ఎంతో అవసరం. ముఖ్యంగా దళారుల చేతుల్లో పడి మోసపోకుండా.. ప్రభుత్వం గుర్తించిన ఏజెన్సీల ద్వారా వెళ్తేనే ప్రయోజనం ఉంటుంది. శిక్షణలో ప్రతి విషయాన్ని వివరిస్తాం. ఎలా వెళ్లాలి, ఆ దేశాల్లో ఎలా మసలుకోవాలి తదితర విషయాలపై అవగాహన కల్పిస్తున్నాం. – మహ్మద్ బషీర్ అహ్మద్, ట్రైనర్ జిల్లాల్లో శిక్షణ ఇవ్వాలి ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్‌లలో పీడీఓటీ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లోనే శిక్షణ ఇవ్వాలి. ప్రైవేటు స్కిల్ టెస్టింగ్ సెంటర్లను కూడా ఇందుకు వినియోగించుకోవచ్చు. రిక్రూటింగ్ ఏజెన్సీల అసోసియేషన్ లను ఇందులో భాగస్వాములను చేయాలి. పీడీఓటీ శిక్షణను తప్పనిసరి చేస్తే ఈ పథకం ఉద్దేశం నెరవేరుతుంది. అవగాహనే అన్ని సమస్యలకు పరిష్కారం. – చౌటుపల్లి శ్రీను, ఎస్ఎల్ ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ, మెట్పల్లి బతుకుదెరువు కోసం బహ్రెయిన్ వెళ్తున్నా.. నేను ఐదవ తరగతి వరకు చదువుకున్నా. నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బతుకు దెరువు కోసం బహ్రెయిన్ వెళ్తున్నా. అక్కడ కూలి పని చేయడానికి వీసా లభించింది. జీతం అక్కడి కరెన్సీలో 105 దినార్లు ఇస్తామన్నారు. మూడేళ్లు పనిచేసి మళ్లీ స్వదేశానికి వస్తా.– సుదర్శన్, నిజామాబాద్ విదేశాల్లో ఎలా నడుచుకోవాలో చెప్పారు దేశంకాని దేశం వెళ్తున్నాం. అక్కడి భాష రాదు. ఆ దేశంలో ఎలా నడుచుకోవాలో మాకు శిక్షణలో వివరించారు. గల్ఫ్ దేశాల్లోని నియమ, నిబంధనలను వివరించారు. ఈ శిక్షణ నాకెంతో దోహదపడుతుందని భావిస్తున్నా. – యు.శ్రీనివాస్, జన్నారం జాగ్రత్తలు తెలుసుకున్నాం.. ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి విదేశంలో కాలుమోపే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను శిక్షణలో తెలుసుకున్నాం. పాస్‌పోర్టు, వీసా వంటి విలువైన ధ్రువీకరణ పత్రాలు పోగొట్టుకుంటే ఎవరిని సంప్రదించాలి. మన దగ్గర ఉంచుకోవాల్సిన ఫోన్ నంబర్లు ఏమిటి.? రాయబార కార్యాలయంచిరునామా వంటి ప్రాథమిక సమాచారం గురించి బాగా విశ్లేషించారు. టామ్‌కామ్ అధికారులు ఇచ్చిన శిక్షణ మాకెంతో మేలు చేస్తుంది. – రవి, సిద్దిపేట ఇప్పటి వరకు 176 మందికి శిక్షణ ఇచ్చాం.. మే నెల నుంచి ఇప్పటి వరకు 176 మందికి శిక్షణ ఇచ్చాం. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించి శిక్షణ ఇస్తున్నాం. ఏపీ, తెలంగాణతో పాటుగా ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన యువత శిక్షణకు వచ్చారు. నైపుణ్యంతో పాటు మెళకువలు నేర్పిస్తున్నాం. ఒక్కో బ్యాచ్‌లో కనీసం పది మంది ఉండేలా చూసుకుని శిక్షణ ఇస్తున్నాం.– నాగ భారతి, జనరల్ మేనేజర్, టాంకాం పీడీఓటీ శిక్షణ పొందాలనుకునే వారు‘టాంకాం’ మొబైల్ నం. 7997973358,ఫోన్ నం. 04023342040, ఇ–మెయిల్: tomcom.gmts@gmail.com లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవచ్చు. -
నేటి నుంచి ప్రధాని గల్ఫ్ పర్యటన
గల్ఫ్ డెస్క్: మన ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), బహ్రెయిన్ దేశాల్లో పర్యటించనున్నారు. 23న యూఏఈలోని అబుదాబిలో, 24న బహ్రెయిన్‌లో మోదీ పర్యటనకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేసింది. యూఏఈ, బహ్రెయిన్‌లో మన దేశ పారిశ్రామికవేత్తల కోసం జారీ చేయనున్న రూపే కార్డును ప్రధాని ఆవిష్కరించనున్నారు. యూఏఈ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీకి ‘ఫాదర్ ఆఫ్ ఫౌండర్ యూఏఈ’ పురస్కారాన్ని అందజేయనుంది. కాగా, బహ్రెయిన్‌లో పర్యటించనున్న మొదటి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు మన దేశానికి చెందిన విదేశాంగ మంత్రులు, ఇతర శాఖల మంత్రులు మాత్రమే బహ్రెయిన్‌లో పర్యటించారు. -
కశ్మీర్, గల్ఫ్ దేశాలకు పోలికలెన్నో..
గల్ఫ్ డెస్క్: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35(ఏ)ను రద్దుచేసి ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించిన నేపథ్యంలో ఈ అంశంపై సర్వత్రా చర్చజరుగుతోంది. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు కూడా ఈ వార్తల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటి వరకు కశ్మీర్లో అమలైన విధానాలే గల్ఫ్‌లో ఉన్నాయని చర్చించుకుంటున్నారు. కశ్మీర్‌కు, గల్ఫ్ దేశాలకు పోలికలు ఇలా.. ♦ ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకశ్మీర్‌లో ఇతర రాష్ట్రాల వారు భూములు, ఆస్తులూ కొనలేరు. ఈ విధానం గల్ఫ్‌లో కూడా ఉంది. ♦ కశ్మీర్‌కు చెందిన యువతి ఆ రాష్ట్రంలో శాశ్వత నివాసికాని వ్యక్తిని పెళ్లిచేసుకుంటే, ఆమెతోపాటు తన సంతానం కూడా శాశ్వత నివాస హక్కు కోల్పోయి, వారసత్వ స్థిరాస్తులను పొందలేరు. గల్ఫ్ దేశాల్లో కూడా ఇదే పద్ధతి కొనసాగుతోంది. ♦ రాష్ట్ర సర్వీసుల్లో నియామకాలకు అక్కడి శాశ్వత నివాసులు మాత్రమే అర్హులు. ♦ కశ్మీర్లో శాశ్వత నివాసులు మాత్రమే స్థిరాస్తులు కొనుగోలు చేయాలి. ఇతరులు కొనుగోలు చేయరాదు. అయితే, గల్ఫ్ దేశాల్లో ఇటీవల సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు ఇతర దేశస్తులకు భూమి, భవనాలను లీజుకు ఇస్తున్నాయి. -
ఎన్నారైలకు ఆధార్ తిప్పలు తప్పినట్లే..
విదేశాల్లో ఉంటున్న భారతీయులకు ఆధార్ కార్డు పొందడానికి ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ప్రవాస భారతీయులు కనీసం 180 రోజులు స్వదేశంలో ఉంటేనే ఆధార్ అనే నిబంధన గతంలో అమలయ్యేది. అయితే, విదేశాల్లోని కంపెనీల్లో సెలవులు దొరకకపోవడం, తక్కువ కాలమే స్వగ్రామాల్లో ఉండే పరిస్థితి ఏర్పడటంతో ఆధార్ కార్డు కోసం ఈ నిబంధన సవరించాలని ప్రవాస భారతీయులు అనేక మార్లు ప్రభుత్వాన్ని కోరారు. మన దేశంలో ప్రతి పనికి ఆధార్‌తో లింకు పెట్టడంతో ఆధార్ కార్డు అవసరం తప్పనిసరైంది. ప్రవాసులకు మాత్రం ఆధార్ కార్డు జారీ కావాలంటే స్వదేశంలో కనీసం 180 రోజులు ఉండాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన సవరించాలనే డిమాండ్ ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే, ఆధార్ నిబంధనలను సవరించిన ఆంశంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంది. -
మలేషియాలో క్షమాభిక్ష
పర్యాటకుల స్వర్గధామమైన మలేషియాలో అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష(ఆమ్నెస్టీ)ని అమలు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులు జరిమానా, శిక్ష లేకుండా వారి దేశాలకు వెళ్లిపోవడానికి క్షమాభిక్ష అమలు చేస్తుంటాయి. ఇదే విధానాన్ని మలేషియా దేశం అమలు చేస్తోంది. ఈనెల ఒకటో తేదిన క్షమాభిక్ష అమలులోకి వచ్చింది. డిసెంబర్ 31 వరకు ఇది అమలులో ఉంటుంది. తెలంగాణ జిల్లాలకు చెందిన ఎంతో మంది ఆ దేశంలో అక్రమంగా ఉంటున్నారని అంచనా. గల్ఫ్ దేశాల్లో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, గతంలో మాదిరిగా జీతాలు లేకపోవడంతో అనేక మంది మలేషియా బాట పట్టారు. ఎక్కువ మంది వర్క్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నా ఏజెంట్లు మాత్రం విజిట్ వీసాలతో మలేషియాకు పంపించారు. వారికి సరైన అవగాహన లేక అవస్థలు పడుతున్నారు. మలేషియా ప్రభు త్వం అమలు చేస్తున్న క్షమాభిక్షను వినియోగించుకుని వారంతా స్వగ్రామాలకు చేరుకునే అవకాశం ఉంది. -
సుష్మా స్వరాజ్‌కు గల్ఫ్ ఎజెంట్ల నివాళి
కేంద్ర విదేశాంగ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతిపై గల్ఫ్‌లో ఉన్న భారతీయులు గురువారం సంతాపం తెలిపారు. సుష్మాస్వరాజ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణవార్త తెలిసి గల్ఫ్‌లోని రిక్రూటింగ్ ఎజెంట్లు సుష్మా స్వరాజ్‌కు నివాళులర్పించి, ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. రిక్రూటింగ్ ఎజెంట్ అధ్యక్షుడు డీఎస్ రెడ్డి, రైసుద్దీన్, ప్రశాంత్, ఖలీల్ పాషా తదితరులు పాల్లొన్నారు. -
'కార్మికుల కష్టాలు నన్ను కదిలించాయి'
రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండుగ.. దూర దేశం బోయిన మా అన్న చంద్రుడా.. రాఖీట్ల పున్నానికి వస్తవని వాకిట్ల కూసున్నరో మాయన్న.. అని జానపద గాయని అంకుల గంగాదేవి పాడిన పాట గల్ఫ్‌లో ఉన్న వలస కార్మికులతో పాటు ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులను కన్నీళ్లు పెట్టించింది. జానపద పాటలకు ఆదరణ లభించేలా తన గానంతో విశేష కృషి చేసిన ‘రేలా రె రేలా ఫేం’ గంగాదేవి గల్ఫ్ దేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఆయా సందర్భాల్లో అక్కడి కార్మికుల క్యాంపులను ఆమె సందర్శించి వారి జీవనశైలిని పరిశీలించారు. సంవత్సరాల కాలంగా కన్న తల్లిదండ్రులకు, కట్టుకున్న భార్యకు, రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలకు దూరంగా ఉంటూ కార్మికులు అనుభవిస్తున్న కష్టాలు తనను చలింపజేశాయని, అనేక మంది దుర్భర జీవితం గడుపుతున్నారని చెప్పారు. ఎడారి దేశాల్లో మన కార్మికుల జీవనంపై గంగాదేవి ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నిజామాబాద్ జిల్లా ముల్లంగిలో జన్మించిన నాకు చిన్నతనంలోనే తండ్రి దూరమయ్యాడు. తల్లి, అమ్మమ్మ, అక్క ఆప్యాయతను పంచుకుని పెరిగిన నేను చిన్ననాటి నుంచి కష్టాలనే అనుభవించాను. జానపదాలను అందరికి వినిపిస్తూ గాయనిగా ఒక్కో మెట్టు ఎక్కాను. పల్లె పాట ద్వారా అందరి అభిమానం చూరగొన్న నేను గల్ఫ్ కార్మికుల కష్టాల గురించి చిన్ననాటి నుంచి వింటూనే ఉన్నా. జానపద గాయకురాలిగా స్వరాష్ట్రంలోనే కాకుండా గల్ఫ్ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చే అవకాశం వచ్చింది. తద్వారా కార్మికుల జీవన విధానాన్ని పరిశీలించే అవకాశం కూడా లభించింది. యూఏఈ, కువైట్, ఖతార్, ఒమాన్ దేశాల్లో ఇప్పటి వరకు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాల్లో మాత్రం ప్రదర్శనలు ఇవ్వడానికి అవకాశం రాలేదు. ప్రధానంగా తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా, బతుకమ్మ సంబరాల సమయంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి పాటలు పాడుతుంటా. గల్ఫ్‌లో ప్రదర్శనల అనంతరం కార్మికుల క్యాంపులకు వెళ్లి వారితో మాట్లాడాను. ప్రధానంగా దుబాయి లోని సోనాపూర్ క్యాంపు, షార్జాలోని కార్మికుల క్యాంపులకు వెళ్లి తెలుగు రాష్ట్రాల కార్మికులను కలుసుకున్నా. కార్మికులు ఏజెంట్ల చేతుల్లో మోసపోవడం, కంపెనీ యాజమాన్యాల ద్వారా వంచనకు గురికావడం ఇలా ఎన్నో రకాలుగా కార్మికులు అవస్థలు పడటాన్ని తెలుసుకున్నా. ఖల్లివెళ్లి అయిన కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కార్మికులు గల్ఫ్ దేశాల్లో మరణిస్తే వారి మృతదేహాలు ఇళ్లకు చేరుకోవడానికి కాలయాపన జరుగుతోంది. మరికొందరి మృతదేహాలు మార్చురీలలోనే మగ్గిపోతున్నాయి. ఇలా ఎన్నో సమస్యలు నా దృష్టికి వచ్చాయి. గల్ఫ్ కార్మికుల అంశాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాను. వారిలో మనోధైర్యం కలిగించేందుకు కృషిచేస్తున్నా. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. గల్ఫ్‌లో ఏ కార్మికుడిని కదిలించినా మాతో ఒకే ఒక్కమాట చెప్పారు అదే.. ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని. ఎన్ఆర్ఐ పాలసీ అమలైతేనే గల్ఫ్ కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని ఎంతో మందికి విశ్వాసం ఉంది. అలాగే ఎడారి దేశాల్లో నష్టపోయిన కార్మికులకు పునరావాస కార్యక్రమాలు అమలు చేయాలి. వారి జీవితాలపై ఆల్బమ్ చేయాలని ఉంది.. జానపద గాయనిగా ఎన్నో పాట లను ఆలపించిన నేను.. గల్ఫ్ కార్మికుల జీవితాలపై ఆల్బమ్ రూపొందించాలనుకుంటున్నా. అవకాశం వస్తే కచ్చితంగా కాల్బమ్ చేస్తా. ఆ ఆల్బమ్‌ను గల్ఫ్ కార్మికులకే అంకితం ఇస్తాం. మున్ముందు గల్ఫ్ కార్మికుల జీవితాలకు అద్దం పట్టే పాటలను ఆలపిస్తా. -
ప్రవాసులను ఆలోచింపజేస్తున్న ‘గల్ఫ్ బాబాయ్’
సాక్షి, కడప : కడప జిల్లా రాజంపేటకు చెందిన గిరిప్రసాద్ కాస కువైట్ కేంద్రంగా ‘గల్ఫ్ బాబాయి’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ గల్ఫ్ సమస్యలపై తెలుగులో విషయాత్మక లఘు చిత్రాలు ప్రసారం చేస్తూ ప్రవాసులకు అవగాహన కల్పిస్తున్నారు. గిరిప్రసాద్ 20 ఏళ్లుగా కువైట్‌లో ఓ మీడియా కంపెనీలో ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, గల్ఫ్ జీవితాల పట్ల ఉన్న అవగాహనతో నాలుగేళ్ల క్రితం ‘గల్ఫ్ బాబాయి’ యూట్యూబ్ ఛానల్‌ను స్థాపించారు. కువైట్‌లోని 20 మంది తెలుగువారితో ఒక టీమ్ ఏర్పాటు చేసి వారినే ఆర్టిస్టులుగా చేసి అవగాహన, సందేశాత్మక, వినోదాత్మక షార్ట్ ఫిల్మ్‌లను రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన 18 నిమిషాల నిడివిగల ‘సారాయి’ షార్ట్ ఫిల్మ్ నిజ జీవితాన్ని ఆవిష్కరించింది. గిరిప్రసాద్ కాస కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అందించిన ఈ ష్టార్ట్ మూవీ ‘గల్ఫ్బాబాయ్’ యూట్యూబ్ఛానల్లో ఉంది.https://www.youtube.com/ watch? v=63U5Ek_l9tM_ feature=youtu.be లింక్‌పై క్లిక్ చేసి ఈ మూవీని చూడవచ్చు. గల్ఫ్‌కు వెళ్లే ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది. గతంలో విడుదల చేసిన చీటి పాటల మోసం, గల్ఫ్‌లో కొత్త కుర్రోడు లాంటి సందేశాత్మక షార్ట్ ఫిల్మ్‌లను కూడా ఈ ఛానల్లో చూడవచ్చు. -
రాలిన ఆశలు
ఎడారి దేశంలో ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లిన ఆ వ్యక్తి తన ఆశలు నెరవేరకుండానే కానరాని లోకాలకు వెళ్లాడు. గంట ముందు ఫోన్లో తనతో మాట్లాడి బాగున్నావా.. కొడుకులను మంచిగా చదివించు నేను దసరాకు వస్తా అని చెప్పిన భర్త.. ఇక శాశ్వతంగా రాడని తెలిసి భార్య తల్లడిల్లుతోంది. కుటుంబాన్ని పోషించాల్సిన పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం అనాథ అయింది. అమరగొండ సతీష్‌గౌడ్, జన్నారం : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామానికి చెందిన ఉప్పు మల్లేశ్(42) తనకున్న ఎకరం భూమిని సాగుచేసుకోవడంతో పాటు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య భాగ్య, కుమారులు రాకేశ్, వినయ్ ఉన్నారు. కొంతకాలం క్రితం భార్య అనారోగ్యం బారిన పడగా చికిత్స కోసం రూ.2 లక్షల వరకు అప్పు చేశాడు. గ్రామంలో ఉండి పనులు చేస్తే పిల్లల చదువులకు, కుటుంబ పోషణకు డబ్బులు సరిపోవడం లేదని మెరుగైన ఉపాధి కోసం 2016 సెప్టెంబర్ 11న సౌదీ అరేబియా దేశానికి వెళ్లాడు. అందుకు రూ.1.50 లక్షలు అప్పు చేసి ఓ ఏజెంట్‌కు చెల్లించాడు. అయితే, మల్లేష్ అక్కడ మూడు సంవత్సరాలు పనిచేసినా అప్పులు తీర్చలేకపోయాడు. అడపా దడపా డబ్బులు ఇంటికి పంపినా కుటుంబ పోషణకే సరిపోయాయి. కాగా, ఈనెల 21న తన స్నేహితుడు దండెపల్లి మండలం గుడిరేవుకు చెందిన రాజుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సౌదీ రాజధాని రియాద్‌లో కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మల్లేష్ మరణంతో అతని కుటుంబం దిక్కులేనిదైంది. ఆయన కుమారులు చదువుకుంటున్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న భార్య పనిచేసే పరిస్థితిలో లేదు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, తన భర్త మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని మల్లేష్ భార్య భాగ్య అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటోంది. ఇంటి వద్ద దీనంగా కూర్చున్న రాజు తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు తల్లిదండ్రుల కష్టాలు చూడలేక.. ఉపాధి కోసం ఊరును వదిలి గల్ఫ్ బాట పట్టిన ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. దీంతో ఆ కుటుంబీకులు అతనిపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. కుటుంబానికి అండగా నిలుస్తాడనుకున్న కొడుకు అనంతలోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. కడసారి చూపుకోసం ఎదురుచూస్తున్నారు. మోదంపురం వెంకటేష్, దండేపల్లి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవుకు చెందిన నాంపల్లి సత్తయ్య, రాజవ్వకు ముగ్గురు సంతానం. వారి కులవృత్తి(రజక)తో కుటుంబ పోషణ అంతంతమాత్రంగానే సాగుతోంది. అయితే తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను దూరం చేసేందుకు పెద్దకుమారుడైన రాజు(24) మూడేళ్ల క్రితం సౌదీకి వెళ్లాడు. అక్కడ కారు డ్రైవింగ్ పనిలో కుదిరాడు. రాజుకు సోదరి మౌనిక, సోదరుడు వెంకటేష్ ఉన్నారు. తాను సాదీకి నుంచి డబ్బులు పంపిస్తానని, మీరు బాగా చదువుకోండని తన సోదరి, సోదరుడికి చెప్పి వెళ్లాడు. వారి చదువుకు అవసరమయ్యే ఖర్చులకు డబ్బులు పంపించడంతో పాటు, ఇంటి అవసరాలకు కూడా డబ్బులు పంపిస్తున్నాడు. రాజు చెల్లెలు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా.. తమ్ముడు ఇటీవలే బీటెక్‌లో జాయిన్ అయ్యాడు. విధి వక్రించి.. రాజు సౌదీ నుంచి డబ్బులు పంపిస్తుండడంతో ఆ కుటుంబానికి కొండంత అండ దొరికినట్లయింది. కానీ, విధి వక్రించింది. అతను ఈ నెల 21న రియాద్‌లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తమను ఆదుకుంటాడనుకున్న కుమారుడు విగత జీవిగా ఇంటికి వస్తున్నాడని తెలిసి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన తమ సోదరుడు ఇక లేడని తెలిసి.. రాజు తమ్ముడు, చెల్లెలు రోదన చూసిన ప్రజలు కూడా కన్నీటిపర్యంతమవుతున్నారు. దీపావళికి ఇంటికి వస్తానని.. మూడేళ్ల క్రితం వెళ్లిన రాజు దీపావళి పండుగకు ఇంటికి వచ్చి చెల్లికి పెళ్లి చేసి, తాను కూడా పెళ్లి చేసుకుంటానని ఇటీవల తల్లిదండ్రులకు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పినట్లు స్థానికులు తెలిపారు. ప్రతి నిత్యం ఇంట్లో తమతో ఫోన్లో మాట్లాడేవాడని, చనిపోయే రోజు కూడా మాట్లాడాడని కుటుంబీకులు రోదిస్తూ చెప్పారు. తమ కొడుకును కడసారి చూసేందుకు సౌదీ నుంచి మృతదేహాన్ని త్వరగా స్వ గ్రామానికి తెప్పించాలని, ప్రభుత్వం సహకరించాలని రాజు తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
యూఏఈలో ఆర్థిక సంస్కరణలు
వూరడి మల్లికార్జున్, సిరిసిల్ల :గల్ఫ్ దేశాల్లో ప్రముఖమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఆర్థిక సంస్కరణలు అమలవుతు న్నాయి. ఆ దేశంలోని 1500 రకాల ప్రభుత్వ సేవలపై ప్రస్తుతం విధిస్తున్న పన్నులను తగ్గించాలని, కొన్నింటిని రద్దుచేయాలని దుబాయి ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు యూఏఈ ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ కేబినెట్ నిర్ణయాన్ని వెల్లడించింది. అక్కడ అన్ని పన్నులు వసూలు.. యునైటెడ్ అరబ్ దేశాల్లో ప్రభుత్వం విధించే అన్ని పన్నులు కచ్చితంగా వసూలవుతాయి. అయితే, యూఏఈ ప్రభుత్వంలోని అంతర్గత వ్యవహారాల శాఖ 1500 రకాల సేవలపై పన్నుల్లో కొన్నింటిని రద్దు చేసింది. మరికొన్నింటిని తగ్గించేందుకు నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాల శాఖ 80 రకాల సేవల పన్నులను, మానవ వనరులు, ఉపాధి కల్పన శాఖ 200 రకాల అంశాలపై విధిస్తున్న సేవల పన్నులు ఇందులో ఉన్నాయి. ఈ నెల నుంచే అమలు.. దేశంలో కొత్త పన్నుల విధానాన్ని జూలై 1 నుంచి అమలు చేస్తోంది. అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర పన్నుల విధానాన్ని, ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి యూనిస్ హేజీ అల్ ఖూరీ తెలిపారు. ఈ చర్యల ఫలితాలను విశ్లేషించుకుని భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సంస్కరణలు చేపడతామని ఆయన వెల్లడించారు. ప్రవాసులపై సానుకూల ప్రభావం.. యూఏఈలో కొత్తగా అమలుకానున్న ఆర్థిక సంస్కరణలతో అక్కడ ఉపాధి పొందుతున్న వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. యూఏఈలో మన రాష్ట్రానికి చెందిన కార్మికులు సుమారు 4లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు మరో 4లక్షల మంది ఉన్నారు. వీరంతా ఆ దేశ నిబంధనల మేరకు పన్నులు చెల్లిస్తున్నారు. అలాంటి వారికి ఆ దేశం అమలు చేయనున్న ఆర్థిక సంస్కరణలతో మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఇటీవలే నైపుణ్యం కలిగిన కార్మికులకు మెరుగైన వేతనాలు ఇవ్వాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. యూఏఈలో అమలులో ఉన్న 1500 రకాల సేవల పన్నులను సంస్కరించడం ఆ దేశ చరిత్రలో ఇదే ప్రథమమని ప్రవాసులు పేర్కొంటున్నారు. -
అవగాహన లోపంతోనే..
రాసం శ్రీధర్, నిర్మల్ :గల్ఫ్ దేశాల్లో వివిధ ప్రమాదాల్లో తెలంగాణ కార్మికులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏడాదికి దాదాపు 200 శవపేటికలు శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుతున్నాయని అంచనా. చాలామంది అక్కడి చట్టాలు, నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదాల బారిన పడుతున్నారు. కొందరు అనారోగ్యంతో మృతిచెందుతుండగా, మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ♦ మనదేశంలో రోడ్లపై ఎడమవైపు ప్రయాణిస్తాం.అదే గల్ఫ్ దేశాల్లో రోడ్డుకు కుడిపక్కన వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసినా ఒక్కోసారి మనవాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదానికి గురవుతున్నారు. ♦ మన దేశంలో ఏ రోడ్డుపైనైనా(కొన్ని మినహా) అన్ని రకాల వాహనాలు వెళ్లొచ్చు. కానీ, సౌదీ వంటి గల్ఫ్ దేశాలలో రోడ్లను బట్టి వాహనాలను అనుమతిస్తారు. ఇటీవల మంచిర్యాల జిల్లావాసులు ప్రమాదానికి గురైన రోడ్డుపై బైక్‌లను నడపడం నిషేధం. ♦ రోడ్డు క్రాసింగ్‌ల వద్ద అవగాహన లేకపోవడమూ ప్రాణాలు తీస్తోంది. ♦ సీటు బెల్టు పెట్టుకోకున్నా.. హెల్మెట్ ధరించకున్నా.. ఆ దేశాల్లో కఠిన శిక్షలు ఉంటాయి. ♦ పని ప్రదేశాల్లోనూ హెల్మెట్లు వాడకపోవడం, రసాయనాలకు సంబంధించిన పనుల్లో షూ, మాస్కులు ధరించకపోవడం ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ♦ రోజంతా 40–45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పనిచేసి, తర్వాత 20–25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే ఏసీ గదుల్లోకి రావడం కూడా మనవాళ్లపై ప్రభావం చూపుతోంది. చాలా మంది ఈ ఉష్ణోగ్రతల వ్యత్యాసాలతో అనారోగ్యం బాడినపడి కన్నుమూస్తున్నారు. ♦ ఉపాధి కోసం వెళ్లినవారిలో కొందరు అక్కడ ఒంటరితనాన్ని భరించలేక మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ‘దియా’ ఉన్నా.. గల్ఫ్ దేశాల్లో చట్టాలు, నిబంధనలపై కనీస అవగాహన లేకపోతే మనిషితో పాటు ఆర్థికసాయం కూడా కోల్పోవాల్సి వస్తుంది. సౌదీలో ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ఇస్లామిక్ షరియా ప్రకారం వారు ‘దియా’ (బ్లడ్ మనీ) చెల్లిస్తారు. ఇది లక్ష నుంచి 2లక్షల సౌదీ రియాళ్ల వరకు ఉంటుంది. మన కరెన్సీ ప్రకారం రూ.18లక్షల నుంచి రూ.36లక్షల వరకు ఇస్తారు. కానీ, ఈదియాను పొందాలంటే ఓ నిబంధన ఉంది. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి తప్పులేదని నిరూపించాల్సి ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నా, మద్యం సేవించి నడిపినా, రెడ్ సిగ్నల్ క్రాస్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, వాహనం ఫిట్నెస్ లేకున్నా.. దియా వర్తించదు. అక్కడి చట్టాలు, నిబంధనలకు లోబడి ఉండి, సదరు వ్యక్తి తప్పులేకపోతేనే బ్లడ్‌మనీ ప్రమాదస్థాయిని బట్టి చెల్లిస్తారు. సౌదీలో మనిషిని బట్టి.. రోడ్డు ప్రమాదాలతో పాటు అన్ని రకాల ప్రమాదాలకు దియా అందిస్తారు. అయితే, సౌదీ అరేబియా దేశంలో మనిషిని బట్టి పరిహారం చెల్లింపులు ఉంటాయి. మృతుడు ముస్లిం పురుషుడైతే 100శాతం పరిహారం అందుతుంది. ముస్లిం మహిళకు అందులో 50శాతం, క్రిస్టియన్ పురుషుడైతే 50శాతం, క్రిస్టియన్ మహిళ ఉంటే అందులో సగం పరిహారం చెల్లిస్తారు. ఇక ముస్లిం, క్రిస్టియన్లుకాని వారందరికీ కేవ లం 6.6శాతం మాత్రమే పరిహారం అందిస్తారు. ఈ లెక్కన ముస్లిం పురుషుడికి రూ.లక్ష వస్తే, క్రైస్తవ పురుషుడికి రూ.50వేలు.. మిగతా వర్గాలకు చెందిన పురుషుడికి రూ.6,600 మాత్రమే వస్తాయి. అన్ని వర్గాల మహిళలకు అందులో సగమే చెల్లిస్తారు. బీమా చేసుకోవడం ఉత్తమం గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవడంతో పాటు కనీస పరిహారం కూడా పొందలేని బాధిత కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. గల్ఫ్‌కు వెళ్లేవారిలో చాలామంది జీవిత బీమా కూడా చేయించుకోవడం లేదు. ఏడాదికి కేవలం రూ.వెయ్యి చెల్లిస్తే రూ.లక్ష విలువైన జీవిత బీమా వర్తించే పాలసీలనూ తీసుకోవడం లేదు. ఇక.. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రవాసీ భారతీయ బీమా యోజనను సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రమాద బీమా రూ.10లక్షలు ఉంటుంది. ఇది కొత్తగా వెళ్లే వారికి మాత్రమే వర్తిసుంది. అందులో పదోతరగతి కంటే తక్కువ చదివిన వారికి అంటే.. అక్షరాస్యత పరంగా వెనుకబడిన వారికి వర్తిస్తుంది. ఇందులో రూ.275 చెల్లిస్తే రెండేళ్లు, రూ.375 చెల్లిస్తే మూడేళ్లు కవరేజీ ఉంటుంది. ఈ చెల్లింపులపైన జీఎస్టీ 18శాతం వసూలు చేస్తుండటం గమనార్హం. ఇది కాకుండా ఎల్ఐసీ, ఇతర బీమా కంపెనీలలో జీవిత, ప్రమాద బీమాలు చేయించుకోవడం ఉత్తమం. -
ఆదుకునేవారేరీ..
బొమ్మెన భూమేశ్వర్, బాల్కొండ : ఉపాధి కోసం షార్జా వెళ్లిన ఆ వ్యక్తి తోటి కార్మికునితో జరిగిన ఘర్షణలో చనిపోవడంతో అతని కుటుంబం దిక్కులేనిదైంది. అతని భార్య పెద్ద దిక్కును కోల్పోయి బాధను దిగమింగుకుంటూనే కుటుంబ భారాన్ని మోసింది. నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌కు చెందిన గోవర్దన్, జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట్‌కు చెందిన ధరూరి బుచ్చన్న ఒకే కంపెనీలో పనిచేస్తూ ఒకే గదిలో నివాసం ఉండేవారు. 2001లో నివాస గదిలో ఇద్దరి మధ్య క్షణికావేశంలో జరిగిన ఘర్షణలో గోవర్దన్ మరణించాడు. గోవర్దన్ మరణానికి బుచ్చన్నను కారకునిగా గుర్తించిన షార్జా పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరుచగా అతనికి అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది. బుచ్చన్న 18 ఏళ్ల నుంచి షార్జా జైలులోనే మగ్గిపోతున్నాడు. కడసారి చూపు కూడా దక్కలేదు.. షార్జాలో మరణించిన గోవర్దన్ మృతదేహాన్ని ఆర్థిక, సాంకేతిక కారణాలతో భారత్‌కు పంపలేదు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. అతని కుటుంబ సభ్యులు కడసారి చూపునకు కూడా నోచుకోలేదు. గోవర్దన్‌పై ఆధారపడిన భార్య రాధ, కొడుకు నవీన్, కూతురు రవళిలు పెద్ద దిక్కును కోల్పోయారు. రాధ బీడీలు చుడుతూనే తన పిల్లలను పోషించింది. తన రెక్కల కష్టంతో కూతురును, కొడుకును చదివించి పెంచి పెద్ద చేసింది. వారి పెళ్లిళ్లను జరిపించి తన బాధ్యతను నెరవేర్చుకున్న ఆమె.. ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గోవర్దన్ కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. పెద్ద మనసుతో క్షమాభిక్ష.. షార్జా జైలులో మగ్గుతున్న బుచ్చన్న కొంత కాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. షరియా చట్టం ప్రకారం మృతుని కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే బుచ్చన్న షార్జా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. బుచ్చన్న సోదరులు లక్ష్మణ్, లింగన్న, మేనల్లుడు రాజేష్ ఇటీవల ముప్కాల్ గ్రామానికి వెళ్లి గ్రామపెద్దల సమక్షంలో గోవర్దన్ కుటుంబ సభ్యులను కలిసి క్షమాబిక్ష కోసం ప్రాధేయపడ్డారు. పెద్దమనసు చేసుకుని బుచ్చన్నకు క్షమాబిక్ష లేఖ ఇచ్చి, శిక్ష రద్దుకు సహకరించాలని వేడుకోగా.. ఎట్టకేలకు గోవర్దన్ భార్య రాధ ఒప్పుకుంది. పరిహారం కోసం ప్రయత్నాలు.. క్షమాభిక్ష లేఖతో సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు జైల్లో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులు కొంత పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆ డబ్బును షార్జా న్యాయస్థానంలో జమచేయడం గానీ, బాధిత కుటుంబ సభ్యులకు నేరుగా గానీ ఇవ్వాలి. అయితే, బుచ్చన్న కుటుంబ సభ్యులకు అంత ఆర్థిక స్థోమతలేదు. విరాళాలు సేకరించి గోవర్దన్ కుటుంబానికి చెల్లించి బుచ్చన్నను విడిపించడానికి కొన్ని దళిత సంఘాలు, కొందరు ప్రవాసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వలసదారుల హక్కుల మండలి అధ్యక్షుడు పి.నారాయణ స్వామి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం 2011 డిసెంబర్లో షార్జా జైలును సందర్శించి బుచ్చన్నను కలిసి వచ్చారు. గోవర్దన్ కుటుంబాన్ని ఆదుకోవాలని, బుచ్చన్నను జైలు నుంచి విడుదల చేయాలని నారాయణ స్వామి గతంలో హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. -
ఉపాధి వేటలో విజేత
గల్ఫ్ డెస్క్: ఒమాన్‌లో సొంతంగా వ్యాపారం నిర్వహిస్తూనే సేవా రంగంలోనూ రాణిస్తున్నారు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన నరేంద్ర పన్నీరు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన తన తండ్రి ఎల్లయ్య బాటలోనే గల్ఫ్‌కు పయనమయ్యాడు. గల్ఫ్ దేశాల్లో టెలికం రంగం ప్రైవేటీకరణ ఆరంభమైన మొదట్లోనే సర్వీస్ ప్రొవైడర్‌గా సబ్ కాంట్రాక్టును దక్కించుకున్న ఎల్లయ్య తక్కువ సమయంలోనే ఖతార్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు. టెలికం రంగంలో ఉపాధి పొందడానికి గల్ఫ్ దేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని గుర్తించిన ఎల్లయ్య తన కుమారునికి అదే రంగంలో శిక్షణ ఇప్పించి నైపుణ్యం ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దారు. ఖతార్ మంత్రితో తండ్రికి స్నేహం.. నరేందర్ తండ్రి ఎల్లయ్య ఉపాధి కోసం ఖతార్‌కు 1980లో వెళ్లాడు. అక్కడ ఆయన వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. బట్టలు కుట్టి అమ్ముతున్న ఎల్లయ్య వద్దకు అప్పట్లో ఖతార్ సమాచార శాఖ మంత్రి వచ్చి వెళ్లేవారు. 1984లో ఖతర్ టెలికం రంగాన్ని ప్రైవేటీకరించడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో సర్వీస్ ప్రొవైడర్(కాంట్రాక్టర్)ల సేవలు అవసరం అయ్యాయి. మంత్రి ప్రోత్సాహంతో ఎల్లయ్య కొత్తగా టెలికం వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆయన 2010 వరకు ఖతార్‌లో టెలికం వ్యాపారాన్ని కొనసాగించారు. ఒమాన్‌లో సొంతంగా వ్యాపారం.. ఇండియాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఫైబర్ టెక్నాలజీని పూర్తిచేసిన నరేంద్ర మొదట ఉపాధి కోసం టెలికం రంగంలో పనిచేశారు. అయితే ఇక్కడ టెలికం రంగంలో పనిచేస్తే వేతనాలు తక్కువగా ఉండటంతో నరేందర్ ఖతార్‌లో ఉన్న తండ్రి వద్దకు 2002లో వెళ్లారు. తండ్రికి సొంతంగా వ్యాపారం ఉన్నా నరేందర్ మాత్రం ఖతార్‌లోని ఒరిడో అనే టెలికం కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. 2012లో స్వదేశానికి తిరిగివచ్చిన నరేందర్.. ఖతార్ కంటే ఒమాన్‌లో అవకాశాలు మెండుగా ఉన్నాయని గుర్తించి 2013లో ఒమాన్‌కు వెళ్లి అక్కడ టెలికం వ్యాపారాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నరేందర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఒమాన్‌లోని అల్ కువైర్ పట్టణంలో టెలికం వ్యాపారాన్ని నిర్వహిస్తూ కుటుంబ సమేతంగా నివసిస్తున్నారు. సేవా కార్యక్రమాలు.. నరేంద్ర ఒమాన్‌లో వ్యాపారం నిర్వహిస్తూనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి చేయూతనందిస్తున్నారు. ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అనే సంస్థను ఆరంభించి ఆ సంస్థ ద్వారా ఖల్లివెల్లి కార్మికులకు స్వదేశానికి వెళ్లడానికి టిక్కెట్లను సమకూర్చడం, ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలను ఇంటికి పంపించడం, కంపెనీ యజమానుల చేతుల్లో మోసపోయిన వారికి న్యాయ సహాయం అందించడం తదితర సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఒమాన్‌లోని అధికారులతో ఉన్న సంబంధాలతో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులకు సహాయ సహకారాలను నరేంద్ర అందిస్తున్నారు. కళలు, సాహస క్రీడలు.. ఒక వైపు వ్యాపారం, మరో వైపు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న నరేందర్ సమయం చిక్కినప్పుడు కళలు, సాహస క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణ జానపద గాయకుడైన నరేంద్ర ఉత్సాహవంతులైన వారిని గుర్తించి వారిని మంచి గాయకులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ జానపద గీతాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున, ఉగాది పర్వదినం సందర్భంగా ఆలపించడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బతుకమ్మ సంబరాలను, అంతర్జాతీయ యోగా దినోత్సవాలను కూడా ఒమాన్‌లో నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కళల పట్ల ఎంత మక్కువ చూపుతున్నాడో.. సాహస క్రీడల పట్ల అంతే ఆసక్తిని కనబరుస్తున్నారు. స్విమ్మింగ్‌తో పాటు పారాగ్లైడింగ్ లాంటి సాహస క్రీడలో నరేందర్ ప్రత్యేకతే వేరు. పారాగ్లైడింగ్‌లో కమర్షియల్ లైసెన్స్ పొంది ఇటీవలే 3,700 ఫీట్ల ఎత్తు నుంచి దూకి తన సాహసాన్ని చాటాడు. నాన్నే గురువు ఒమాన్‌లో సొంతంగా టెలికం వ్యాపారం నిర్వహించడానికి నాకు మా నాన్నే మార్గదర్శి. నాన్న చెప్పినట్లు టెలికం రంగాన్ని ఎంచుకున్నా. సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా స్ఫూర్తి మా నాన్ననే. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మన సహాయం కోసం ఎదురు చూసేవారికి కచ్చితంగా తోడుగా ఉండాలని నాన్న ఎప్పుడు చెబుతుండేవారు. అందువల్లే సేవా కార్యక్రమాలను బాధ్యతగా కొనసాగిస్తున్నా.– నరేంద్ర పన్నీరు -
బహ్రెయిన్‌లో 26న ఓపెన్ హౌస్
గల్ఫ్ డెస్క్: బహ్రెయిన్‌లోని భారతీయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఈనెల 26న సీఫ్ పట్టణంలోని రాయబార కార్యాలయంలో ‘ఓపెన్ హౌస్’ నిర్వహిస్తున్నారు. బహ్రెయిన్‌లోని భారతీయులు తమకు ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే ఈ ఓపెన్ హౌస్‌కు హాజరై నివేదించవచ్చని, కార్మికులు తమ సమస్యలపై సంబంధిత డాక్యుమెంట్లను తీసుకుని రావాలని అధికారులు సూచించారు. ఓపెన్ హౌస్‌లో రాయబార కార్యాలయం ప్రధాన అధికారితో పాటు సిబ్బంది పాల్గొంటారు. -
రైతుబంధును గల్ఫ్ కార్మికులకు కూడా వర్తింపచేయండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతుబంధు పథకాన్ని గల్ఫ్ వెళ్లిన రైతులకు కూడా వర్తింప చేయాలని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాలలో ఉన్న సుమారు ఒక లక్షమంది సన్నకారు, చిన్నకారు రైతులకు వర్తింపచేయాలని మాజీ దౌత్యవేత్త, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి డా. బీ.ఎం.వినోద్ కుమార్, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ (ప్రవాసి సంక్షేమ వేదిక) అధ్యక్షులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి ఆదివారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. దీనిపై గతంలోనే ముఖ్యమంత్రి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. వలస వెళ్లిన వారిలో వ్యవసాయం దెబ్బతిని, బోర్లు తవ్వించి అప్పులపాలై పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లినవారే ఉన్నారని వారు అన్నారు. భూమిని నమ్ముకుని బతికిన బక్క రైతులు వ్యవసాయం దెబ్బతినడం మూలంగానే విదేశాలకు వెళ్లారని, అలాంటి వారిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి కోరారు. ‘‘ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి రైతులందరికీ కొత్త పాసుపుస్తకాలు, ఎకరాకు పంటకు రూ.4 వేల చొప్పున పెట్టుబడిసాయం, ప్రతీ రైతుకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. కానీ విదేశాలకు వలస వెళ్లిన బడుగు రైతులకు ఈ సాయం అందక ముఖ్యంగా గల్ఫ్‌కు వెళ్లిన వలసకార్మికులు నష్టపోతున్నారు. స్వయంగా భూ యజమాని వచ్చి తమ పేరిట ఉన్న పాసుపుస్తకాన్ని, రైతుబంధు చెక్కు అందుకోవాలని, బీమా ఫారంపై సంతకం చేయాలనే నిబంధన వలసరైతుల పాలిట శాపమైంది. గల్ఫ్ దేశాల నుండి ప్రత్యేకంగా ఇందుకోసం రావాయాలంటే ఎంతో వ్యయంతో కూడుకున్న పని’’అని వారు అభిప్రాయపడ్డారు. ఈమేరకు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ‘‘రైతుబంధు పెట్టుబడిసాయం చెక్కులను గల్ఫ్ వెళ్లిన రైతుల ఎన్ఆర్ఓ (నాన్ రెసిడెంట్ ఆర్డినరీ) బ్యాంకు అకౌంట్లలో లేదా వారి కుటుంబ సభ్యుల అకౌంట్లలో జమచేయాలి. మండల వ్యవసాయ అధికారి లేదా తహసీల్దార్ ఎన్నారై రైతుల నుండి ఇ-మెయిల్ ద్వారా ఒక అంగీకార పత్రాన్ని తెప్పించుకోవాలి. ఎన్నారై రైతుల వ్యవహారాలను చూడటానికి వ్యవసాయ శాఖ కమిషనరేట్ లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి’’ అని పేర్కొన్నారు. -
గల్ఫ్ రిక్రూట్మెంట్ చార్జీలు కంపెనీలు భరించాలి
కోరుట్ల: వలస కార్మికుల రిక్రూట్మెంట్ చార్జీలు గల్ఫ్‌లో ఉండే యాజమాన్యాలే భరించాలని వలస కార్మిక సంఘాల నాయకులు మంద భీంరెడ్డి కోరారు. బుధ, గురువారాల్లో థాయిలాండ్ రాజ«ధాని బ్యాంకాక్‌లో నిర్వహించిన ‘ది గ్లోబల్ ఫోరం ఫర్ రెస్పాన్సిబుల్ రిక్రూట్మెంట్’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. సదస్సులో చర్చించిన అంశాలను ఈ సందర్భంగా వెల్లడించారు. ఆసియా దేశాల నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు అధికంగా ఉన్నాయని, రిక్రూట్మెంట్ చార్జీలను కంపెనీలు భరించాలని సదస్సులో తీర్మానించినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వాలను సమీకరించడం–ఆకాంక్షలు అవకాశాలు అన్న అంశంపై చర్చాగోష్టి జరిగినట్లు వెల్లడించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్‌రైట్స్ అండ్ బిజినెస్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, మైగ్రేషన్ ఫోరం ఇన్ ఆసియా, హ్యుమానిటీ యునైటెడ్ సంస్థలు సంయుక్తంగా బ్యాంకాక్‌లో నిర్వహించిన ఈ సదస్సులో సుమారు 100 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నట్లు చెప్పారు. ప్రఖ్యాత బ్రాండెడ్ కంపెనీల ప్రతినిధులు, కార్మిక సంఘాలు, పౌరసమాజ సంస్థలు, ప్రభుత్వాలు, ఎంబసీలు, అంతర్జాతీయసంస్థల ప్రతినిధులు గల్ఫ్ వలస కార్మికుల చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను చెప్పినట్లు వివరిం చారు. విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెడుతున్న వలస కార్మికులకు సంక్షేమ పథకాలు దేశంలో అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. గల్ఫ్ రిక్రూట్మెంట్ వ్యవస్థ, గల్ఫ్ వలసలకు ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి మెడికల్, టికెట్, నైపుణ్య శిక్షణ ఇస్తూ వాటికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. గల్ఫ్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ కోసం ఏజెన్సీలకు ఒక్కొక్కరికి రూ.30–40వేలు ఫీజుగా తీసుకోవాలని భారత ప్రభుత్వం అనుమతిచ్చిందని దీనికి బదులుగా ఫీజులేని విధానం అవసరమన్నారు. వలస కార్మికులకు అవగాహన కల్పించి సమగ్ర సంక్షేమానికి పథకాలు రూపొందించాలని కోరామన్నారు. -
సౌరశక్తి ప్లాంట్లలో అబూదాబి రికార్డు!
వాతావరణ మార్పుల ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తి లాంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఏర్పాటు చేసుకోవడం ఎక్కువ అవుతున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ పరిణామం కాస్తా గల్ఫ్ దేశాల్లో ఒకరకమైన పోటీకి కూడా దారితీస్తోంది. ఈ క్రమంలో అబూదాబి ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. నూర్ అబూదాబీ అని పిలుస్తున్న ఈ సోలార్ ఫామ్‌లో ఏకంగా 1.177 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. దుబాయిలోని మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోలార్ పార్కులో సామర్థ్యం ఒక గిగావాట్ కంటే ఇది కొంచెం ఎక్కువన్నమాట. నూర్ అబూదాబీని స్థానిక ప్రభుత్వంతోపాటు జపాన్‌కు చెందిన మారుబెని కార్పొరేషన్, చైనాకు చెందిన జింకో సోలార్ హోల్డింగ్‌లు సంయుక్తంగా నిర్మించాయి. మొత్తం ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు 32 లక్షల సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దేశంలోని సహజవాయువు నిక్షేపాలను మరింత కాలం వాడుకునేందుకు వీలుగా తాము ఈ ప్రాజెక్టును చేపట్టనట్లు ప్రభుత్వం చెబుతోంది. సుమారు రెండు లక్షల పెట్రోలు, డీజిల్ కార్ల నుంచివ ఎలువడే కాలుష్యాన్ని ఈ సోలార్ ప్లాంట్ ద్వారా వాతావరణంలో కలవకుండా అడ్డుకోవచ్చునని చెబుతోంది. -
ఆశల పాలసీ అమలెప్పుడో..
సాక్షి, నెట్వర్క్: ప్రవాసుల రక్షణ, సంక్షేమం కోసం ఎన్నారై పాలసీ(ప్రవాసీ విధానం)ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందోనని ప్రవాసులు ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా గల్ఫ్ ప్రవాస కార్మికులు ఈ పాలసీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకున్న గల్ఫ్ ప్రవాస కార్మికులు ఎన్నారై పాలసీ అమలు కోసం చర్చను సాగిస్తున్నారు. ఫేస్బుక్, వాట్సప్, ఐఎంవో(ఇమో), టెలిగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు బాగుపడుతాయని భావించిన గల్ఫ్ కార్మి కులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమానికి గల్ఫ్ కార్మికులు అండగా నిలువడంతో 2014లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఎన్నారై పాలసీ అమలును ప్రధానాంశంగా చేర్చింది. టీఆర్ఎస్ అధికారం చేపట్టాక అప్పటి ఎన్నారై మంత్రి కేటీఆర్ 2016 జూలై 27న హైదరాబాద్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ముసాయిదాను సైతం రూపొందించగా సాధారణ పరిపాలన శాఖ, హోం, పరిశ్రమలు, ఐటీ, కార్మిక ఉపాధి, ఆర్థిక, నైపుణ్య అభివృద్ధి, సాంస్కృతిక పర్యాటక శాఖ, టామ్‌కామ్‌లకు ప్రభుత్వం పంపించింది. ఆయా శాఖల సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆ ముసాయిదా మంత్రి మండలి ఆమోదం పొందాల్సి ఉంది. ఎన్నారై పాలసీ అమలైతే తమ జీవితాలు బాగుపడటానికి ఒక మార్గం ఏర్పడుతుందని ప్రవాసీలు భావిస్తున్నారు. ముసాయిదాలో ఉన్న అంశాలు ఇవీ.. ♦ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు వీసా చార్జీ లు, రిక్రూట్మెంట్ ఫీజులు తదితర ఖర్చు ల కోసం పావలా వడ్డీ రుణాలు లభిస్తాయి. ♦ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్ర పథకంతో అనుసంధానం. అల్పాదాయ కార్మికులను ఆదుకోవడానికి తెలంగాణ స్టేట్ ఎన్నారై వెల్ఫేర్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ♦ ప్రభుత్వం, వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు తదితరుల నుంచి విరాళాలను సేకరించి తెలంగాణ స్టేట్ ఎన్నారై వెల్ఫేర్ ఫండ్‌లో జమ చేస్తారు. ♦ కేంద్ర ప్రభుత్వ పథకాలలో లబ్ది పొందని పేద కార్మికులను ఆదుకోవడానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించడానికి ఈ నిధిని వినియోగిస్తారు. ♦ విదేశాల్లో మరణించిన వారి శవపేటికలను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వారి స్వగ్రామాలకు తరలించడానికి ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తారు. రేషన్‌కార్డు విధానంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల కుటుంబాలకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం వర్తింపజేస్తారు. ♦ విదేశీ జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం అందిస్తారు. ♦ హైదరాబాద్‌లో ఎన్నారై భవన్‌ను ఏర్పాటు చేస్తారు ♦ గల్ఫ్ దేశాల నుంచి ఇంటికి చేరిన వారికి పునరావాసం, పునరేకీకరణకు ప్రత్యేక పథకం రూపకల్పన జరుగుతుంది. కొత్తగా వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకోవడానికి రుణ సదుపాయం కల్పిస్తారు. ♦ గల్ఫ్ ప్రవాస కార్మికుల కుటుంబాలకు తెల్ల రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీకి రుణాలు, గృహ నిర్మాణం కోసం ఆర్థిక సహాయం వంటి పథకాలను అమలు చేస్తారు. ♦ 24 గంటల పాటు హెల్ప్‌లైన్ ♦ విదేశాల్లో ఉన్న వలస కార్మికులు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ కోసం ‘ప్రవాసీ తెలంగాణ’ వెబ్ పోర్టల్ ఏర్పాటు ♦ ధనవంతులైన ఎన్నారైలు గ్రామాలను దత్తత తీసుకునేలా ప్రోత్సాహం అందించడం. ♦ ప్రవాసుల సంక్షేమానికి తగిన బడ్జెట్‌ను కేటాయించడం. ఎన్నారై పాలసీని సాధించుకోవాలి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన లక్ష రూపాయల మృతధన సహాయం ఇప్పుడెందుకు ఆగిపోయింది. ప్రవాసులకు రూ.500 కోట్ల కేటాయింపు ఏమైంది. గల్ఫ్‌లోని ఎంబసీలలో తెలుగు మాట్లాడే సిబ్బందిని నియమించాలి. మనమంతా ఒక్కటై ఎన్నారై పాలసీని సాధించుకోవాలి.–మెట్టా హేమలత, దుబాయి హామీ ఇచ్చి ఆరేళ్లు.. ఎన్ఆర్ఐ పాలసీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నారైలు అంతా కలిసి రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశారు. కేటీఆర్ దుబాయిలో పర్యటించినప్పుడు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆరేళ్లు గడుస్తున్నప్పటికీ ఆ ఊసే లేదు. ఎన్నారై పాలసీ అమలైతే గల్ఫ్‌లోని కార్మికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. మోసపోయిన కార్మికులను న్యాయపరంగా ఆదుకునే అవకాశం ఉంటుంది. – కట్కం రవి, తెలంగాణ గల్ఫ్కల్చరల్ అసోసియేషన్ కోశాధికారి, దుబాయి నకిలీ ఏజెంట్లను అరికట్టవచ్చు ఎన్ఆర్ఐ పాలసీ అమలైతే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులను మోసం చేసే ఏజెంట్లను అరికట్టవచ్చు. అంతేకాకుండా ఎన్ఆర్ఐ పాలసీ అమలు వల్ల కార్మికులు వెళ్లే దేశాల నియమ నిబంధనలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో వారికి ఒక చట్టబద్దత కల్పించే అవకాశం ఉంది. అంతేకాకుండా కార్మికులకు చట్టపరంగా రక్షణ ఉంటుంది. ఇన్సూరెన్స్ కల్పించే అవకాశం ఉంది. – రఘుపతిరెడ్డి, రాయికల్ వెంటనే అమలు చేయాలి ఎన్ఆర్ఐలు.. ప్రధానంగా గల్ఫ్ కార్మికులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎన్ఆర్ఐ పాలసీని వెంటనే అమలు చేయాలి. ఎన్ఆర్ఐ పాలసీ అమలులో కాలయాపన తగదు. ఎన్ఆర్ఐలకు పెన్షన్ పథకం అమలు చేయాలి. ప్రత్యేక బీమా పథకం కూడా అమలు చేయాలి. ఎన్ఆర్ఐలకు రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలి. వారి పిల్లలకు ఉచిత విద్య అందించే ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ ఎన్ఆర్ఐ పాలసీ ద్వారానే సాధ్యమవుతుంది. ఎన్ఆర్ఐ పాలసీ అమలులో నిర్లక్ష్యం సరైంది కాదు. – స్వర్ణ సుధాకర్, బహ్రెయిన్ వలస కార్మికుల జీవితానికి భరోసా కల్పించాలి వలస కార్మికులకు ముఖ్యంగా గల్ఫ్ ప్రవాసీలకు వారి జీవితాలపై భరోసా కల్పించాలి. ఇది ఎన్ఆర్ఐ పాలసీతోనే సాధ్యమవుతుంది. వలస కార్మికులకు ఆర్థిక భద్రత, ఆరోగ్య పరిరక్షణ, ఉద్యోగ భద్రత లభించడానికి ఎన్ఆర్ఐ పాలసీ ఒక్కటే మార్గం. ఎన్ఆర్ఐ పాలసీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు. ఎంతో కాలంగా ఎన్ఆర్ఐ పాలసీ కోసం ఎదురుచూస్తున్నారు. అందరి ఆశలను నిలబెట్టడానికి ప్రభుత్వం చొరవ చూపాలి. – చింతకింది స్వాతి, ఒమన్ ఆచరణలో ముందడుగు పడాలి నాలుగేళ్ల క్రితం ప్రవాసీ పాలసీ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. దీనికి కార్యాచరణ రూపొందించినా అమలులో ఆలస్యం జరుగుతోంది. వచ్చే బడ్జెట్లో ప్రవాసీల సంక్షేమానికి రూ.500కోట్లు కేటాయించాలి. ప్రవాసీ మంత్రిత్వ శాఖ, సచివాలయంతో పాటు జిల్లాలు, మండలాల వారీగాఎన్నారై సెల్ ఏర్పాటు చేయాలి. విదేశాల్లో చనిపోయిన వారికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఎయిర్‌పోర్టులో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలి. ప్రవాసీల వివరాల కోసం సమగ్ర సర్వే నిర్వహించాలి. వలసలకు కారణాలను వి శ్లేషించి తదనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది. ప్రవాసీలకు పింఛన్, ప్రమాద బీమా, పునరావాసం కల్పించాలి. – బొలిశెట్టి వెంకటేశ్, ఎన్నారై, బహ్రెయిన్ పాలసీతో భరోసా ఇవ్వాలి.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నారై పాలసీపై దృష్టిపెట్టాలి. మా వేదిక తరఫున చాలాసార్లు నిరసనలు, ఆందోళన తెలిపాం. పలు డిమాండ్లను ప్రభుత్వానికి తెలిపాం. ఉపాధి కోసం వచ్చి విదేశాల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.15లక్షలు ఇవ్వాలి. నకిలీ ఏజెంట్లపై చర్యలు చేపట్టాలి. విదేశాల్లో నివసించే అర్హులకూ కూడా పథకాలు అందేలా చూడాలి. మండలాల వారీగా యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు చేపట్టాలి. విదేశాల్లో చనిపోయినవారిని తీసుకురావడానికి ఆర్థికసాయం చేయాలి. వారి ఇంటి వరకూ మృతదేహం చేరేందుకు అయ్యే ఖర్చులు భరించాలి. గల్ఫ్ దేశాల్లో సహాయ కేంద్రాలు, హైదరాబాద్‌లో ఎన్ఆర్ఐ భవన్ ఏర్పాటు చేయాలి. జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయ సహాయం చేయాలి. – దొంతుల శివాజీ, గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక కన్వీనర్, సౌదీ అరేబియా పాదయాత్రకు సిద్ధం.. ఇప్పటికీ తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు కొనసాగుతునే ఉన్నాయి. అవగాహన లేక ఏజెంట్ల, కంపెనీల మోసాలకు వందలాది మంది బలవుతున్నారు. ఇక్కడి చట్టాలపైనా అవగాహన లేకపోవడంతో ఎంతోమంది గల్ఫ్ దేశాల జైళ్లలో మగ్గుతున్నారు. వాళ్ల కుటుంబాలు స్వదేశంలో అనాథలుగా మిగిలాయి. ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఏడాదికి దాదాపు రూ.1200 కోట్ల రాబడి మా నుంచి తెలంగాణ ప్రభుత్వానికి వెళ్తోంది. దాన్నుంచే గల్ఫ్ బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం. ఇక ఎన్నారై పాలసీ కోసం రెండున్నరేళ్ల నుంచి గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ద్వారా పోరాడుతూనే ఉన్నాం. ఎన్నో నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే.. గల్ఫ్ వలస ప్రాంతాలైన ఖానాపూర్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్ల తదితర ప్రాంతాల మీదుగా హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపడతాం. ఇందులో భాగంగా ప్రతీ ఊరిలో బాధితుల కష్టాలను తెలుసుకుంటాం. ఎన్నారై పాలసీ అమలు కోసం ఆమరణదీక్ష చేసేందుకైనా సిద్ధంగా ఉన్నా. – దొనికెన కృష్ణ, గల్ఫ్‌కార్మికుల అవగాహన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, యూఏఈ -
నైపుణ్యం ఉంటేనే మెరుగైన ఉపాధి
గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందాలనుకునేవారు వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్యతసంపాదిస్తేనే మెరుగైన ఉపాధికి అవకాశం ఉందని తెలంగాణ గల్ఫ్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జువ్వాడి శ్రీనివాస్‌రావు చెప్పారు. రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా వస్తేనే ఉద్యోగ రక్షణ ఉంటుందన్నారు. దుబాయిలోని మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న జువ్వాడి శ్రీనివాస్‌రావు ‘తెలంగాణ గల్ఫ్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్’ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగువారిని జాగృతం చేస్తున్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. గల్ఫ్‌కు వచ్చే కార్మికులకు పలు సూచనలు చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గల్ఫ్ డెస్క్: గల్ఫ్‌లో ఉద్యోగం, ఉపాధి అనగానే.. కార్మికులు కంపెనీ గురించి, వేతన ఒప్పందాన్ని పూర్తిగా తెలుసుకోకుండానే వీసాల కోసం రూ.వేలు కుమ్మరిస్తున్నారు. చేసే పనిలో నైపుణ్యం ఉన్నా లేకపోయినా వీసా దొరికిందనే భావనతో వస్తున్నారు. పనిలో కుదిరిన తరువాత పని విధానం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. తమను ఏజెంట్ మోసం చేశాడని, ఒక పనిచెప్పి మరోపని ఇచ్చారని కార్మికులు అంటుంటారు. జీతం కూడా ఏజెంట్ చెప్పినంత ఇవ్వడం లేదని చెబుతుంటారు. ముందే పని అగ్రిమెంట్ చూసుకుంటే ఈ కష్టాలు ఉండవు. చదువు రాకున్నా.. ఎవరితోనైనా అగ్రిమెంట్ చదివించుకోవాలి. మన తెలంగాణ జిల్లాల నుంచి అనేక ప్రాంతాల నుంచి ఇప్పటికే గల్ఫ్‌లో పనిచేస్తున్న వారు ఉన్నారు. తెలిసిన వారితో తాము వెళ్లే కంపెనీ గురించి ఆరాతీయాలి. యూఏఈలో ఒక్కో కార్మికునికి 950 ధరమ్స్ చెల్లిస్తారు. మన కరెన్సీలో సుమారు రూ.20వేలు. రూమ్ అద్దె, తిండి ఖర్చులు పోతే మిగిలేది తక్కువే. కానీ, మన కార్మికులకు వీసాను ఎలాగైనా అంటగట్టాలనే ఉద్దేశంతో ఏజెంట్లు నెలకు రూ.30వేలు సంపాదించుకోవచ్చని నమ్మిస్తుంటారు. నిర్మాణ రంగంలో ఇప్పుడు పనులు చాలా వరకు తగ్గిపోయాయి. అన్ని గల్ఫ్ దేశాల్లో నిర్మాణ రంగం మందగించింది. కేవలం మెయింటెనెన్స్ వర్క్ మాత్రమే ఉంది. క్లీనింగ్, గార్డెనింగ్ తదితర పనులు మాత్రమే ఉన్నాయి. విజిట్ వీసాలపై వచ్చి.. ఏదో ఒక పనిలో కుదిరిపోవచ్చని భావిస్తుంటారు. కానీ, వీసా గడువు తీరిపోయే సమయానికి పని దొరకకపోతే అక్రమంగా నివాసం ఉండాల్సి వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఇక్కడి అధికారులకు దొరికితే జైలు శిక్షకు గురికావాల్సి ఉంటుంది. కొందరు కార్మికుల రహస్యంగా పనులు చేస్తుంటారు. వారితో పనిచేయించుకున్న కంపెనీలు జీతాలు ఇవ్వకపోవడంతో మోసపోతున్నారు. అక్రమంగా నివాసం ఉంటున్న కార్మికులు పనుల్లో గాయపడితే.. చికిత్స చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలాంటి వారిని ఆస్పత్రులలో చేర్చుకోరు. అలా అస్వస్థతకు గురైన కార్మికులు చికిత్స చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా ఉన్నాయి. గల్ఫ్ వీసాలు పొందేవారు సోషల్ ఏజెన్సీల ద్వారా లేదా రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారానే తమ ఉద్యోగ ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే సురక్షితం. గల్ఫ్ దేశాల్లో నిర్మాణ రంగంలో పనులు లేని దష్ట్యా.. కార్యాలయాల్లో ఆఫీస్ బాయ్స్‌గా వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఇంగ్లిష్ భాషపై పట్టు ఉంటే పదోన్నతులకు అవకాశం ఉంది. అలాగే, చేసే పనిలో సక్సెస్ కావచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలకైనా అనుమతి తప్పనిసరి గల్ఫ్ దేశాల్లో ఎలాంటి నిరసన కార్యక్రమాలనూ నిర్వహించే హక్కు లేదు. అలాగే సోషల్ మీడియాలో కూడా రెచ్చగొట్టే పదాలను వినియోగించడం నేరం. మంచిపని కోసమైనా బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదు. మన సాంస్కతిక కార్యక్రమాలు అంటే.. బతుకమ్మ ఇతర కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు. దానికి కూడా ఇక్కడి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సి ఉంది. దుబాయిలో సాంస్కతిక కార్యక్రమాలకు కమ్యునిటీ డెవలప్మెంట్ అథారిటీ(సీడీఏ) అనుమతి తీసుకోవాల్సి ఉంది. సాంస్కతిక కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవల పేరిట చందాలు వసూలు చేయడం నేరం. ఎలాంటి వసూళ్లకు పాల్పడినా గల్ఫ్ చట్టాల ద్వారా కఠిన శిక్షలకు గురవుతారు. దుబాయ్‌లో మల్టీనేషనల్ కంపెనీలో 16 ఏళ్ల నుంచి మేనేజర్‌గా పనిచేస్తున్నా. 2007లో తెలంగాణగల్ఫ్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మద్దతుగా దుబాయిలో ధూంధాంనిర్వహించాం. మా అసోసియేషన్ ద్వారా పలు స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.– జువ్వాడి శ్రీనివాసరావు -
ఏటేటా పెరుగుతున్న ప్రవాసుల ఆదాయం
ఎన్.చంద్రశేఖర్,మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా) :విదేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారితో పాటు ఉద్యోగ బాధ్యతలను చేపట్టిన మన దేశ పౌరులు పంపిస్తున్న విదేశీ మారక ద్రవ్యం విలువ రూ.5లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. విదేశాల నుంచి మన దేశానికి చేరుతున్న ప్రవాసీయుల ఆదాయం ఏటేటా పెరుగుతూనే ఉంది. మన దేశానికి వివిధ దేశాల నుంచి వస్తున్న ఆదాయంలో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు పంపిస్తున్న సొమ్ము అధికంగా ఉంటుందని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో స్థిరపడిన మన దేశస్థులు అక్కడే స్థిరాస్థులను కూడబెట్టుకోవడం వల్ల మన దేశానికి ఎక్కువగా సొమ్మును పంపించే అవకాశం లేదు. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, వ్యాపారాలను నిర్వహిస్తున్నవారు మాత్రం అక్కడ లభించిన ఆదాయాన్ని వారు దాచి ఉంచుకునే అవకాశం లేదు. అందువల్ల గల్ఫ్‌లో పనిచేస్తున్న వారు తమ ఖర్చులకు అవసరమైనంత సొమ్మును దాచుకుని మిగిలిన మొత్తాన్ని స్వగ్రామాలకు పంపిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణ వాసులు 13లక్షలకు పైగానే.. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం, వ్యాపారం చేస్తూ స్థిరపడిన తెలంగాణ వాసుల సంఖ్య 13లక్షలకు మించింది. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, ఖతార్, కువైట్, ఇరాక్లలో ఉపాధి పొందుతున్న తెలంగాణ జిల్లాల వారు ఒక్కొక్కరు నెలకు కనీసం రూ.20వేల చొప్పున ఇంటికి పంపించినా.. ఆ సొమ్ము రూ.2వేల కోట్లకు మించిపోతుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.24వేల కోట్ల ఆదాయం కేవలం గల్ఫ్ దేశాల నుంచి లభిస్తుంది. గల్ఫ్‌లో కార్మికులతో పాటు ఉన్నత ఉద్యోగాల్లోనూ స్థిరపడిన వారు ఉన్నారు. ఉద్యోగాల్లో స్థిరపడిన వారికి నెలకు ఆదాయం మన కరెన్సీలో రూ.లక్ష వరకు ఉంటుంది. అలాగే వ్యాపార రంగాల్లో స్థిరపడిన వారి ఆదాయం ఇంకా ఎక్కువే ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో తెలంగాణ వాసులతో పాటు కేరళ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల వాసులు ఉపాధి పొందుతున్నారు. అయితే, కేరళ తరువాత తెలుగు రాష్ట్రాల వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా. సంక్షేమంపై చిన్నచూపు.. ప్రవాసులు మన దేశానికి ప్రతి ఏటా గణనీయమైన ఆదాయాన్ని సమకూరుస్తున్నా వారి సంక్షేమంపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా గల్ఫ్ కార్మికు లు ఎన్నో ఏళ్లుగా ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాము రెక్కలు ముక్కలు చేసుకుని రూ.వేల కోట్ల ఆదాయం అందిస్తున్నా తమ సంక్షేమానికి ప్రభుత్వాలు ఎలాంటి కార్యక్రమాలూ రూపొందించలేదని ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ కోసం సంపాదించుకుంటున్నా పరోక్షంగా స్వదేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తున్నామని గల్ఫ్ కార్మికులు వివరిస్తున్నారు. కానీ, ప్రభుత్వాలు తమ పట్ల కనికరం చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రవాసులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి ప్రవాసుల కోసం మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేయాలి. ఏటా రూ.లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుతున్న ప్రవాస భారతీయుల కోసం ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయకపోవడం వల్ల వారు ఎంతో నష్టపోతున్నారు. విదేశాల్లో ఉపాధి పొందుతూ ఏ కారణం చేతనైనా మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలి. అలాగే ఏజెంట్ల చేతుల్లో నష్టపోయిన వారిని ఆదుకోవాలి. వీలైనంత తొందరగా ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలి. – గంగుల మురళీధర్‌రెడ్డి,ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధి -
ఎంఎఫ్ఏ, డీటీపీ ఆధ్వర్యంలో దుబాయిలో వర్క్‌షాప్
గల్ఫ్ డెస్క్: గల్ఫ్ దేశాలకు ఉద్యోగుల భర్తీ ప్రక్రియను చేపట్టే రిక్రూటింగ్ ఏజెన్సీల వ్యాపార నైతికత, వలస కార్మికుల హక్కులు అనే అంశంపై జూన్ 23–25 వరకు దుబాయిలో ఒక వర్క్‌షాప్ జరిగింది. మైగ్రంట్ ఫోరమ్ ఇన్ ఏసియా(ఎంఎఫ్ఏ), డిప్లొమసీ ట్రైనింగ్ ప్రోగ్రాం (డీటీపీ), మిడిల్ ఈస్ట్ సెంటర్ అనే మూడు సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. అరబ్ గల్ఫ్ దేశాలు, ఆసియా దేశాలలోని సామాజిక కార్యకర్తలు, కార్మిక నాయకులు, యాజమాన్య సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. కార్యక్రమం చివరి రోజున దుబాయిలోని తెలంగాణ ప్రవాసులు కృష్ణ దొనికెని, మంద సుమంత్‌రెడ్డి పాల్గొన్నారు. అరబ్ గల్ఫ్ దేశాల ఆర్థికాభివృద్ధిలో వలస కార్మికుల పాత్ర గణనీయమైనది. వీరి హక్కుల గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించాలి. ప్రైవేటు రంగం ఇందుకు బాధ్యత తీసుకోవాలి అనే నేపథ్యంలో ఈ చర్చాగోష్టి జరిగింది. వలస కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం, సామాజిక సంస్థలు కలిసి పనిచేయడం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఇందుకు కావలసిన విజ్ఞానం అందించడానికి ఈ సామర్థ్య నిర్మాణ (కెపాసిటీ బిల్డింగ్) సదస్సు నిర్వహించారు. -
ప్రవాసీలను ఆదుకోని రైతు బీమా
ఎస్.వేణుగోపాలచారి–కామారెడ్డి, నాగమళ్ల శ్రీకర్–రాయికల్,జవ్వాడి చంద్రశేఖర్–మల్యాల : వాతావరణ పరిస్థితులు అనుకూలించక.. పండించిన కొద్దిపాటి పంటకు కూడా గిట్టుబాటు ధర రాకపోవడంతో సొంత ఊరిని వదిలి బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన రైతులకు ‘రైతు బీమా’ పథకం వర్తించడం లేదు. ఉపాధి కోసం గల్ఫ్‌తో పాటు వివిధ దేశాలకు వెళ్లిన వారిలో భూమి ఉన్న వారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది వరకు ఉంటారని అంచనా. వీరికి రైతు బీమా పథకం అందకుండా పోతోంది. దీంతో పొట్ట చేతపట్టుకుని విదేశాలకు వెళ్లిన రైతులకు నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు బంధు’ పథకం ద్వారా భూ యజమానులకు కొత్త పట్టా పాస్‌పుస్తకాలు, ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయంతో పాటు రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించింది. అయితే, స్వయంగా భూ యజమాని వచ్చి తమ పేరిట ఉన్న పాసు పుస్తకాన్ని, రైతు బంధు చెక్కు అందుకోవాలని, బీమా ఫారంపై సంతకం చేయాలనే నిబంధనలు వలస రైతుల పాలిట శాపంగా మారాయి. రైతు బీమా, రైతు బంధు పథకం వర్తించడానికి విదేశం నుంచి స్వదేశానికి రావాలంటే ఖర్చుతో కూడుకున్న పని. రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన మొదట్లో విదేశాల్లో ఉన్నవారికి రైతుబంధు ప్రయోజనాలను వర్తింపజేయకపోవడం వల్ల ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో రైతుబంధు పథకాన్ని గల్ఫ్‌లో ఉన్న సన్న, చిన్నకారు రైతులకు వర్తింపజేయాలని ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం(ప్రవాసీ సంక్షేమ వేదిక) ఆధ్వర్యంలో ప్రవాసులు వారి కుటుంబ సభ్యులు సైతం పోరాటాలు చేశారు. ఈ నేపథ్యంలో గతేడాది జూలై 7న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతి పత్రం సమర్పించారు. అయినా, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ అధ్యక్షుడు మంద భీంరెడ్డి, మాజీ భారత రాయబారి బి.ఎం.వినోద్‌కుమార్‌లు ప్రవాసంలో ఉన్న తెలంగాణ రైతుల పక్షాన ఉమ్మడి హైకోర్టులో గతేడాది జూలై 20న ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున ప్రముఖ న్యాయవాది బొల్లు రచనారెడ్డి వాదించారు. పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని, రెండు నెలల్లో గల్ఫ్‌లోని ప్రవాసీలకు ‘రైతుబంధు’ వర్తింపును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని గతేడాది జూలై 24న ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఎన్నారై కుటుంబ సభ్యులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు, చెక్కులను పంపిణీ చేయాలని అప్పట్లో ఉత్తర్వులు జారీచేసింది. అయితే, రూ.5లక్ష బీమా వర్తింపు విషయంలో ఇప్పటివరకు సానకూల నిర్ణయం తీసుకోకపోవడంతో వలస రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నిబంధనలను సడలించి వలస వెళ్లిన ప్రవాసీ రైతులకు రైతుబీమా వర్తింపజేయాలని వారి కుటుంబీకులు కోరుతున్నారు. విదేశాలకు వెళ్లిన రైతులను కూడా ఆదుకోవాలి విదేశాల్లో ఉన్న రైతులపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది. రైతులకు బీమా పథకాన్ని వర్తింజేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. స్వదేశంలో ఉన్న రైతులతో సమానంగా విదేశాలలో ఉన్న రైతులకు ఎల్ఐసీ వారి రూ.5లక్షల గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ (బృంద జీవిత బీమా)ను మెయిల్ ఆర్డర్ బిజినెస్ పద్ధతిలో వర్తింపజేయాలని కోరాం. విదేశాల్లో తెలంగాణ రైతులకు కూడా అన్ని రకాల ‘రైతు బంధు’ ప్రయోజనాలను కల్పించడానికి ఒక సిస్టమ్‌ను రూపొందించాలి. ఎన్నారై రైతుల వ్యవహారాలను పర్యవేక్షించడానికి వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. –మంద భీంరెడ్డి, ప్రవాసీ కార్మికుల హక్కుల కార్యకర్త వ్యవసాయం సరిగా లేకనే గల్ఫ్‌కు.. నా భర్త అయిత భూమయ్య పేరిట కట్కాపూర్ గ్రామంలో రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఇక్కడ వ్యవసాయం సరిగా లేకనే ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లాడు. యూఏఈలోని పుజీరాలో ఓ కంపెనీలో పనికి కుదిరాడు. అయితే, కంపెనీ యాజమాన్యం కొన్నేళ్లు జీతం ఇవ్వకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై తన రూమ్‌లో ఉరివేసుకొని మృతిచెందాడు. నా కొడుకు శశికుమార్ బీడీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కూతురు ప్రవళిక డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరి చదువుల కోసం మా ఆయన ఎంతో కష్టపడేవారు. ఇక్కడ సరైన నీటి సదుపాయం లేకపోవడంతో ఉన్న రెండున్నర ఎకరాల భూమిని ఏదో విధంగా సాగుచేశాం. అయినా, పంటలు సరిగా పండలేదు. పంటకు చేసిన అప్పుల గురించి, పిల్లల పోషణ గురించి భూమయ్య ఎప్పుడూ ఆలోచించేవాడు. ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని గల్ఫ్‌కు వెళ్లిన వారికి కూడా వర్తింపజేస్తే మాలాంటి నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు కలుగుతుంది. – సునీత, కట్కాపూర్, రాయికల్ మండలం, జగిత్యాల జిల్లా పెట్టుబడి సాయం అందినా.. బీమా రాలేదు నా భర్త రవీందర్ పేరిట 21గుంటల భూమి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కింద రెండు పర్యాయాలు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కూడా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. కానీ, స్థానికంగా లేడని.. రైతు బీమా బాండు ఇవ్వలేదు. ఉపాధి కోసం నా భర్త సౌదీ అరేబియాకు వెళ్లాడు. కొన్ని రోజుల క్రితం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మాకు రైతు బీమా వర్తించకపోవడంతో నష్టపోయాం. ఆపద్బంధుకు దరఖాస్తు చేసుకోలేదు.–నల్లపు మణెమ్మ, సర్వాపూర్, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా -
దుబాయిలో గాయపడిన ఎల్లాపూర్ వాసి
శంషాబాద్: బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లి అక్కడ రోడ్డు ప్రమాదంలో గాయపడిన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మోకాసి లక్ష్మణ్ గురువారం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. షార్జా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూసిన లక్ష్మణ్‌కు గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బసంత్‌రెడ్డి సహాయపడ్డారు. ట్రస్టులు, ఎంబసీ, తెలంగాణ ప్రభుత్వం చొరవతో అక్కడి నుంచి లక్ష్మణ్‌ను తీసుకొచ్చారు. రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మణ్‌ను ఎయిర్‌పోర్టులో ఆయన కుటుంబ సభ్యులు కలిసి కంటతడి పెట్టారు. తమ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
ఉపాధి మూత
గల్ఫ్ దేశాల్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో అనేక మంది కార్మికుల ఉద్యోగాలకు ముప్పు ఏర్పడింది. గల్ఫ్‌లో కొంత కాలం నుంచి సంక్షోభ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా వలస కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది. సౌదీ అరేబియాలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడ ఎన్నో కంపెనీలు మూతబడ్డాయి. ఫలితంగా వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు చేరుకున్నారు. ఆర్థిక సంక్షోభ సమయంలో కొన్ని కంపెనీలు మూతబడగా.. అనేక కంపెనీలు దశలవారీగా తమ కాంట్రాక్టులను నిలిపివేస్తున్నాయి. ఎప్పటికైనా ఆర్థిక పరిస్థితులు చక్కబడకపోతాయా తమ జీవన స్థితిగతులు మారకపోతాయా అని నమ్మిన కొంత మంది కార్మికులు మొండి ధైర్యంతో సౌదీలోనే ఉండిపోయారు. ఇప్పటికీ ఆర్థిక పరిస్థితులు చక్కబడకపోవడంతో కార్మికులు ఇంటికి చేరుకోక తప్పడం లేదు. అలాగే ఒమన్, కువైట్, ఇరాక్ దేశాల్లోనూ కంపెనీలు దివాళా స్థితికి చేరుకుంటుండటంతో ఆ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులు ఇంటిదారిపడుతు న్నారు. చమురు ధరలు తగ్గిపోవడం గల్ఫ్ దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సౌదీ, ఒమన్, కువైట్ తదితర దేశాల్లో ఆ దేశ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విస్తృపరచాలని అక్కడి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీంతో వలస కార్మికుల ఉపాధికి గండిపడుతుంది. అలాగే ఏదో ఒక దేశంలో ప్రతి ఏటా ఆమ్నెస్టీ(క్షమాభిక్ష) ప్రకటిస్తున్నాయి. ఆమ్నెస్టీ వల్ల అకామా, వీసా లేనివారు సొంత దేశాలకు వెళ్లడానికి సులభమైన మార్గం కలుగుతుంది. ఆమ్నెస్టీ అమలు చేయడానికి ఆర్థిక సంక్షోభం కూడా ఒక కారణం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగానూ అనేక మంది కార్మికులు ఉద్యోగాన్ని కోల్పోయి ఇంటి ముఖం పడుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం తెలంగాణ జిల్లాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా) కేరళ తరహాలోపునరావాసం కల్పించాలి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి అక్కడ పరిస్థితులు బాగాలేక ఇంటి ముఖం పట్టిన కార్మికుల సంక్షేమం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలో పునరావాస చర్యలు తీసుకోవాల్సి ఉంది. స్వగ్రామాలకు వచ్చిన తరువాత పునరావాసం లేకపోవడంతో కార్మికులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా చితికిపోయి కుటుంబ పోషణ భారం కావడంతో కొందరు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రవాస కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా లేదా వేర్వేరుగా పునరావాసం కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వలస కార్మికుల జీవన స్థితి గతులపై పరిశోధన చేసిన మేధావులు వెల్లడిస్తున్నారు. ప్రవాస కార్మికుల పునరావాసం కోసం ఏర్పాటు చేసే సంస్థ శాశ్వత ప్రాతిపదికన పనిచేసేదిగా ఉండాలని సూచిస్తున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన కార్మికులు గల్ఫ్ నుంచి తిరిగి వస్తే వారికి పునరావాసం కల్పించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంటోంది. కార్మికులు గల్ఫ్ దేశంలో పొందిన నైపుణ్యాన్ని కేరళ ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ఒక వేళ నేరుగా కార్మికుల నైపుణ్యాన్ని వినియోగించుకునే పరిస్థితి లేకపోతే వారికి రాయితీపై రుణాలు అందించి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కృషిచేస్తుంది. దీనికి ప్రధాన కారణం కేరళ ప్రభుత్వం ప్రవాసుల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడమే. అలాంటి మంత్రిత్వ శాఖను మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు నెరవేరలేదు. నైపుణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే.. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళుతున్న కార్మికులు ఇక్కడ ఎలాంటి నైపుణ్యం సంపాదించుకోకపోయినా ఆ దేశాలకు వెళ్లిన తరువాత కొంత నైపుణ్యం సాధిస్తున్నారు. గల్ఫ్ నుంచి తిరిగివచ్చిన కార్మికుల నైపుణ్యాన్ని ప్రభుత్వం వినియోగించుకోలేకపోతే.. కార్మికులకు తగిన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది. వారికి పునరావాసంతో పాటు పునరేకీకరణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. పునరావాస చర్యలు అవసరం ప్రవాస కార్మికులకు పునరావాస చర్యలు ఎంతో అవసరం. స్వదేశంలో ఉపాధి లేకనే పొరుగు దేశాలకు.. ప్రధానంగా గల్ఫ్ దేశాలకు వలసపోతున్నారు. ఆ దేశాల్లో పరిస్థితి బాగాలేకపోవడంతో ప్రతి ఏటా ఇంటికి చేరుకుంటున్న ప్రవాసుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి సందర్బంలో కార్మికులకు మన ప్రభుత్వం ఉపాధి చూపాల్సిన అవసరం ఉంది. పునరావాస చర్యల ద్వారానే ప్రవాస కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలి. అలాగే ప్రవాస కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.– ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ,విదేశీ వలసల పరిశోధకుడు స్వదేశంలో ఉపాధి చూపాలి విదేశాల నుంచి సొంత గ్రామానికి తిరిగి వస్తున్న కార్మికులకు ప్రభుత్వం స్వదేశంలో ఉపాధి చూపాలి. ఎంతో మంది కార్మికులు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి అక్కడ ఏర్పడిన ప్రతికూల పరిస్థితులతో స్వదేశానికి తిరిగి చేరుకుంటున్నారు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా సమా జంలో చులకన భావానికి గురవుతున్నారు. ప్రభుత్వం పునరావాస చర్యలు తీసుకుంటే స్వదేశానికి వచ్చే ప్రవాస కార్మికులు మానసికంగా ధైర్యంగా ఉంటారు. – నాగిరెడ్డి ప్రశాంతి,సౌమ్య ట్రావెల్ బ్యూరోనిర్వాహకురాలు రాయితీ రుణాలు ఇవ్వాలి గల్ఫ్ దేశాల్లో ఉపాధికి నోచుకోకుండా సొంత దేశానికి వస్తున్న కార్మికులకు ప్రభుత్వం రాయితీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. రుణాలు ఇవ్వడం వల్ల కార్మికులపై ఆర్థిక భారం తప్పుతుంది. ఫలితంగా వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ప్రవాస కార్మికులకు ఉపాధి చూపడం లేదా రాయితీ రుణాలు ఇవ్వడం వల్ల వారు సొంతంగా ఉపాధి చూసుకునే అవకాశం ఉంటుంది. – జక్కుల చంద్రశేఖర్,సర్పంచ్ భూపతిపూర్(ఒమన్ రిటర్నీ) పునరావాసం కల్పించడంప్రభుత్వ బాధ్యత గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ఉద్యోగాలు కోల్పోతున్నవారికి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది. విదేశాల్లో ఉపాధి కరువై గత్యంతరం లేక స్వదేశానికి చేరుకున్నవారికి ప్రభుత్వం పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకోవాలి. స్వదేశంలో ఉపాధి చూపించకపోతే కార్మికులు మనోవేదనకు గురై ఇబ్బందులు పడతారు. ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి పునరావాస కార్యక్రమాలను అమలు చేయాలి.– సూర్యప్రకాష్,ఐసీబీఎఫ్ మాజీ సభ్యుడు, ఖతార్ -
తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ
‘‘తెలంగాణ ప్రజల జీవితాలు.. ముంబయి.. దుబాయి.. బొగ్గుబాయి.. వలస బతుకులు.. కరువు కష్టాలు.. కన్నీటి యాతనలు.. ఈ బాధలు పోవాలంటే.. మన రాష్ట్రం మనకు రావాలి’’ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ అన్న మాటలివి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు సమీపిస్తోంది. ప్రవాస తెలంగాణ వాసుల కోసం ఒక పాలసీ వస్తుందని ఇన్నేళ్లు ఎదురు చూశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనైనా గల్ఫ్‌లోని తెలంగాణ వాసులకు ప్రయోజనం చేకూర్చే ఒక ప్రకటన వెలువడుతుందేమోననే ఆశతో ఉన్నారు. రాష్ట్రంలో మొన్నటి వరకు ఎన్ఆర్ఐ (ప్రవాస భారతీయ) మంత్రిత్వ శాఖ తారకరామారావు చేతిలోనే ఉండేది. ఆయ న 2016లో దుబాయి వెళ్లి అక్కడి కార్మికులతో మాట్లాడి వచ్చారు కూడా. గల్ఫ్ వలస జీవుల సంక్షేమం కోసం ప్రత్యేక విధానాన్ని ప్రకటిస్తామని కేటీఆర్ ప్రకటించారు. శాసనసభ ఎన్నిక ల సందర్భంగా దుబాయిలో ప్రవాస తెలంగాణ వాసులు సమావేశమై ఎన్ఆర్ఐ పాలసీ కావాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి వినతిపత్రం పంపించారు. తెలంగాణలోని ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రభావం చూపే ఎన్ఆర్ఐ పాలసీపై కథనమిది. – వూరడి మల్లికార్జున్, సిరిసిల్ల కన్నీటి పయనం గల్ఫ్‌కి వెళ్లే వాళ్లెవరూ ఆనందంగా వెళ్లరు. గుండెల నిండా దుఃఖంతో భారంగా పయనమవుతారు. ఆర్థిక అవసరాలే వారిని అరబ్బు దేశాల వైపు లాక్కెళతాయి. ఇంటి వద్దనే ఉండి దొరికిన ఏదో ఒక పని చేద్దామని మనసు పరితపిస్తున్నప్పటికీ అప్పుల బాధలు... కరువు పరిస్థితులే వారిని గాలిమోటార్ ఎక్కిస్తున్నాయి. ఉపాధి వేటలో కన్నవారిని, కట్టుకున్న భార్యను, పిల్లలను విడిచి విదేశాలకు వెళ్లిన ప్రవాస తెలంగాణ కార్మికుల సంక్షేమం... చివరికి నీటి మీద రాతగా మిగిలిపోయింది. తెలంగాణ జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లడం నాలుగు దశాబ్దాల కిందటే మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల పరిధిలో 13 లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. వారి ద్వారా ఏటా రూ. పదివేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం మనదేశంలోకి వస్తోంది. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఏటా సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. అయినా వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం చేసిందేమీ లేదు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రవాస తెలంగాణ కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి కొంతైనా వెచ్చించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కార్మికుల కుటుంబాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వలస కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తూ.. కొత్త విధానాలను రూపొందించేందుకు కేటీఆర్ ఆధ్వర్యంలో 2016 మే 27న హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించింది. గల్ఫ్‌లోని సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు, రిక్రూట్మెంట్ ఏజెంట్లు ఈ సమావేశంలో పాల్గొని కొత్త విధాన రూపకల్పన కోసం సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రభుత్వం గల్ఫ్ పాలసీ రూపకల్పనకు కసరత్తులు చేసింది. కానీ ఇంకా తుదిరూపు సంతరించుకోలేదు. తెలంగాణ సర్కారు రూపొందించే ఎన్ఆర్ఐ పాలసీ మీద వలస జీవులు కొండంత ఆశ పెట్టుకున్నారు. కాంగ్రెస్ హయాంలో గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవాసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. 2012లో అప్పటి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్ఆర్ఐ మంత్రిత్వశాఖకు బాధ్యత వహించారు. కొన్ని రోజుల పాటు జిల్లా కేంద్రాల్లో ప్రవాసుల కేంద్రాన్ని(గల్ఫ్ సెల్) కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ శాఖకు నిధులు కేటాయించకపోవడంతో ఆ శాఖ ఉండి కూడా ఉపయోగం లేకుండా పోయింది. అప్పట్లో వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది ప్రభుత్వం. అయితే కొన్ని కుటుంబాలకు ఇప్పటికీ ఆర్థిక సాయం దక్కలేదు. రాష్ట్ర స్థాయిలోనూ ప్రవాసీ మంత్రిత్వశాఖకు ప్రాధాన్యత లేకుండా పోయింది. గల్ఫ్ దేశాల్లోని వలస జీవులపై అధ్యయనాలు నిర్వహించారు. కానీ క్షేత్రస్థాయిలో కష్టాల్లో ఉన్న వారిని ఏ మాత్రం ఆదుకోలేక పోయింది అప్పటి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు దుబాయి వెళ్లి తెలంగాణ వలస కార్మికులు నివాసం ఉండే ప్రాంతాల్లో పర్యటించి వారి సంక్షేమంపై చర్చించారు. గల్ఫ్ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న కేటీఆర్ ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. గత కాంగ్రెస్ హయాంలో జరిగినట్లు మొక్కుబడి చర్యలు కాకుండా విధానపరమైన మేలు దక్కేలా పాలసీ రూపొందించాలని గల్ఫ్ వలస జీవులు కోరుతున్నారు. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. విధానపరమైన నిర్ణయాల్లో ఆయన పాత్ర కీలకంగా ఉంటుంది కాబట్టి గల్ఫ్ కార్మికులు కేటీఆర్ మీదనే ఆశలు పెట్టుకున్నారు. సంక్షేమంగా కేరళ... పంజాబ్ కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో గల్ఫ్ వలస కార్మికుల కోసం అమలులో ఉన్న సంక్షేమ పథకాలపై ప్రభుత్వం అధ్యయనం చేయించింది. ఆ రాష్ట్రాల్లో ప్రవాసుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలున్నాయి. తెలంగాణలో ప్రవాస మం త్రిత్వ శాఖ ఉన్నా సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ) పరిధిలో ఉంది. జీఏడీలో పలు విభాగాలు ఉండడంతో అధికారులు ఎన్ఆర్టీ (నాన్ రెసిడెంట్ తెలంగాణైట్స్) అంశాలపై ప్రత్యేకం గా దృష్టిపెట్టడం లేదు. జిల్లా స్థాయిలోనూ ప్రత్యేక ఆఫీ సులు లేవు. దీంతో పరిపాలన పరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. కేరళలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండగా, ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు ప్రత్యేకంగా వీసా అనుమతులు, తక్కువ వడ్డీతో బ్యాం కు రుణాలను కూడా ఇస్తోంది. ‘నోర్కారూట్స్’ పేరిట విదేశాలకు వెళ్లిన వారికి జీవిత బీమా, ఆరోగ్యబీమా సదుపాయం కూడా కల్పిస్తోంది. వలస కార్మికుల గుర్తింపు కార్డులు, ఎంచుకున్న రంగంలో నైపుణ్య శిక్షణ, విదేశాలకు వెళ్లే వారికి అక్కడి పరిస్థితుల గురించి ముందస్తు అవగాహన కల్పిస్తున్నారు. ఏ కారణంగానైనా ఆ దేశాల్లో ఇమడలేక తిరిగి వచ్చేస్తే.. వారికి పునరావాసం కల్పించడం, మరణించిన సందర్భాల్లో కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం కూడా కేరళలో అమలవుతోంది. అక్కడి విధానాలపై మన అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు. గల్ఫ్కివెళ్లేది పేదలే.. గల్ఫ్ దేశాలకు కార్మికులుగా వెళ్లేది ఎక్కువగా పేదలే. ఉన్న ఊళ్లో పని దొరక్క, చేతనైన పని చేసి ఉపాధి పొందాలని గల్ఫ్ బాట పడతారు. గల్ఫ్‌లో పనులు చేయడానికి అవసరమైన శిక్షణ ఇచ్చే సంస్థల గురించి చెప్పేవారు లేకపోవడంతో, పనుల్లో నైపుణ్యం లేకుండానే వెళ్లిపోతారు. గల్ఫ్ దేశాలకు వెళ్లడానికి ముందే శిక్షణ తీసుకుంటే, వారికి వెళ్లిన చోట మెరుగైన ఉపాధి లభిస్తుంది. ఎన్ఆర్ఐ పాలసీ కోసం చాలా ఏళ్లుగా కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం పాలసీ రూపొందిస్తే మంచిది.– కటుకం రవి,బండపల్లి గల్ఫ్ఎన్ఆర్ఐ పాలసీ నేను దశాబ్ద కాలంగా దుబాయ్‌లో ఉంటున్నాను. తెలంగాణ నుంచి ఎక్కువ మంది లేబర్ వీసాలపై గల్ఫ్‌కి వెళ్తుంటారు. వారికి గల్ఫ్ చట్టాల గురించి ఏ మాత్రం తెలియదు. అలాంటి పరిస్థితుల్లో గల్ఫ్ దేశాల్లో ఉన్న వారికి ఎన్ఆర్ఐ పాలసీ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్కిల్ ట్రైనింగ్ వంటివి సొంత ఊరిలో అందే విధంగా చూడాలి. అప్పుడే ఎక్కువ మందికి ప్రయోజనం దక్కుతుంది.– జువ్వాడి శ్రీనివాస్‌రావు, నర్సింగాపూర్, రాజన్న సిరిసిల్లజిల్లా ఎన్ఆర్ఐపాలసీతో ధీమా ఎన్ఆర్ఐ పాలసీ రూపొందిస్తే.. గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికులకు ఎంతో మందికి మేలు జరుగుతుంది. కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని దేశానికి ఆర్జించి పెడుతున్న గల్ఫ్ కార్మికులకు ఆ మాత్రం భరోసా ఉండాలి కదా. పాలసీ వస్తే అక్కడి చట్టాలు తెలుస్తాయి, అవగాహన పెరుగుతుంది. ప్రభుత్వ పరంగా సాయం దక్కుతుంది. గల్ఫ్ వెళ్లే వారికి ప్రభుత్వం మాకు అండగా ఉందన్న ధీమా ఉంటుంది.– పీచర కిరణ్‌కుమార్, వర్ధవెల్లి,రాజన్న సిరిసిల్లజిల్లా -
ఎడారి దేశాల్లోనూ మహిళా వికాసం..
గల్ఫ్ దేశాల్లోనూ తెలుగు మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతిభను కనబరుస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారు. డిపెండెంట్ వీసాలపై గల్ఫ్ దేశానికి వెళ్లిన ఎంతో మంది మహిళలు వంటింటికి పరిమితం కాకుండా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఎంతో మంది విద్యావంతులైన మహిళలు డిపెండెంట్ వీసాలపైనే గల్ఫ్ దేశాలకు వెళ్లినా తమ విద్యార్హతలకు సరిపడే ఉద్యోగ అవకాశాలను ఆయా దేశాల్లో దక్కించుకున్నారు. మన దేశ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ కార్యాలయాల్లో ఉద్యోగాలను నిర్వర్తిస్తున్నారు. జర్నలిజం, వైద్యం, విద్య, వ్యాపారం, బ్యాంకింగ్, న్యాయ రంగాల్లో ఎంతో మంది మహిళలు రాణిస్తున్నారు. అంతేకాకుండా రేడియో జాకీలుగా, టీవీ యాంకర్లుగా కార్పొరేట్ సంస్థల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా గల్ఫ్‌లో ఉపాధి కోసం వచ్చిన తమ వారికి అండగా ఉంటూ ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. సంస్కతి,సంప్రదాయాలపరిరక్షణలో.. ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన మహిళలు మన సంస్కతి, సంప్రదాయాలను పాటిస్తూనే సేవా కార్యక్రమాల్లోనూ తరిస్తున్నారు. తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ పండుగను ప్రతి ఏటా గల్ఫ్ దేశాల్లో నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి, దసరా, దీపావళి, వరలక్ష్మి వ్రతం, సంక్రాంతి, ఉగాది ఇతరత్రా పండుగలను నిర్వహిస్తూ సంప్రదాయాలను పరిరక్షిస్తున్నారు. వీటితో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో క్షమాభిక్ష అమలు చేసిన సమయంలో స్వదేశానికి వెళ్లే కార్మికులకు విదేశాంగ కార్యాలయాల్లో అవసరమైన కౌన్సిల్ సేవలను అందిస్తున్నారు. వివిధ కారణాల వల్ల జైలుపాలైన వారికి న్యాయ సహాయం అందించడంలో మహిళల పాత్ర అమోఘం. ఇంజనీరింగ్ చదివి.. ఆమె చదివింది సివిల్ ఇంజనీరింగ్ అయినప్పటికీ కార్పొరేట్ రంగంలో ఉన్నత ఉద్యోగం చేయాలనుకున్నారు. తాను ఆశించినట్లుగానే యూఏఈలోని ఒక ప్రముఖ బీమా సంస్థలో సీనియర్ మేనేజర్‌గా ఉద్యోగం సంపాదించి తన ప్రతిభతో రాణిస్తున్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన సుందర ఉపాసనకు పాల్వంచకు చెందిన రాబర్ట్‌తో వివాహమైంది. అప్పటికే రాబర్ట్ దుబాయ్‌లో ఒక ప్రముఖ కంపెనీలో చార్టర్ అకౌంటెంట్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వివాహం తరువాత దుబాయ్ వెళ్లిన సుందర ఉపాసనకు కన్స్ట్రక్షన్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయి. అయితే ఆమెకు ఆ రంగంలో ఉద్యోగం ఇష్టం లేదు. బీమా సంస్థలో ఉద్యోగం సంపాదించి సీనియర్ మేనేజర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సాంస్కతిక కార్యక్రమాలపై మక్కువ చూపే సుందర ఉపాసన.. తెలంగాణ గల్ఫ్ సాంస్కృతిక సంస్థలో సభ్యత్వం తీసుకున్నారు. పదేళ్ల నుంచి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే సాంస్కతిక, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కువైట్‌లో రేడియో జాకీగా అభిలాష కువైట్ ఎఫ్ఎం రేడియో జాకీగా రాణిస్తున్న అభిలాష గొడిషాల ఖమ్మం జిల్లా వాసి. హ్యూమన్ రిసోర్స్లో ఎంబీఏ పూర్తి చేసిన ఆమెకు వరంగల్‌కు చెందిన సురేష్ గొడిషాలతో వివాహమైంది. సురేష్ కువైట్‌లో స్థిరపడటంతో అభిలాష కూడా కువైట్‌కు పయనమయ్యారు. అక్కడ ఒక ప్రముఖ కంపెనీలో అకౌంటెంట్‌గా రెండేళ్ల పాటు విధులు నిర్వహించిన అభిలాష దృష్టి కమ్యూనికేషన్ రంగంవైపు మళ్లింది. దీంతో ఆమె కువైట్ ఎఫ్ఎం రేడియోలో జాకీగా చేరి టాలీవుడ్ టాక్స్ కార్యక్రమానికి వక్తగా వ్యవహరిస్తున్నారు. అలాగే తెలంగాణలోని ఒక న్యూస్ చానల్‌కు, ఆ చానల్ అనుబంధ పత్రికకు కువైట్ నుంచి జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. బతుకమ్మ సంబరాల నిర్వహణ బాధ్యతను ఆమెనే చూస్తున్నారు. అభిలాష ప్రతిభను మెచ్చి 2016లో ప్రవాసీ ఎక్స్‌లెన్స్ అవార్డు కూడా అందించారు. ‘తెలంగాణ ప్రజా సమితి’ ద్వారా విదేశాంగ సేవలు జనగామ జిల్లాకు చెందిన అనుపమ సంగిశెట్టి ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయంలో కాన్సులేట్ సేవలు అందించే ఉద్యోగిగా కొంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు. బీటెక్(కంప్యూటర్స్) పూర్తి చేశారు. భర్త క్రాంతికుమార్‌తో కలిసి ఆమె తొమ్మిదేళ్లుగా ఖతార్‌లో నివాసం ఉంటున్నారు. అనుపమ మూడేళ్ల పాటు మన రాయబార కార్యాలయంలో కాన్సులేట్ ఉద్యోగిగా విధులు నిర్వహించారు. కుటుంబ బాధ్యతల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఖతార్‌లోని తెలంగాణ ప్రజా సమితిలో సభ్యురాలిగా ఉంటూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నారు. మన వారికి అవసరమైన విదేశాంగ సేవలపై సలహాలు, సూచనలు అందిస్తున్నారు. బహ్రెయిన్‌లో వైద్యురాలిగా భ్రమర హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మద్దూరి భ్రమర దాదాపు 23 ఏళ్ల నుంచి బహ్రెయిన్‌లో పిల్లల వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. భ్రమర భర్త ప్రేమ్‌సాగర్ బహ్రెయిన్‌లోని ఓ బీమా కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తుండడంతో ఆమె కూడా బహ్రెయిన్‌కు పయనమయ్యారు. హైదరాబాద్‌లో ఎంబీబీఎస్, ఎండీ (పీడియాట్రిక్) చదివిన ఆమె బహ్రెయిన్‌కు వెళ్లిన తరువాత ఎంఆర్సీపీ ఇన్ చైల్డ్ హెల్త్ కోర్సును పూర్తిచేశారు. బహ్రెయిన్‌లో నివాసం ఉంటున్న తెలుగువారికి డాక్టర్ భ్రమర సుపరిచితురాలు. వైద్యురాలిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే చిన్మయి సొసైటీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా యోగ, ధ్యాన శిబిరాలను కొనసాగిస్తున్నారు. చిన్న పిల్లల కోసం రూపొందించిన ప్రత్యేక కోర్సులను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా చిన్నారులకు అంది స్తున్నారు. అలాగే యోగా ద్వారా యువత సన్మార్గంలో నడవడంతో పాటు వారి జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటా యని అవగాహన కల్పిస్తున్నారు. తెలుగు ప్రజలకు తన వంతు సేవలు చేస్తూ అందరి మన్నలను అందుకుంటున్నారు డాక్టర్ భ్రమర. సౌదీలో జర్నలిస్టుగా రాణిస్తున్న అమ్రినా ఖైసర్ గల్ఫ్‌లోని మిగతా దేశాల కంటే కొంత కఠిన నిబంధనలు ఉండే సౌదీ అరేబియాలో జర్నలిస్టుగా, కళాకారిణిగా రాణిస్తున్నారు అమ్రినా ఖైసర్. హైదరాబాద్‌కు చెందిన అమ్రినా ఖైసర్ పదహారేళ్ల నుంచి సౌదీ అరేబియాలోని జెద్దాలో అరబ్బి టైమ్స్ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. పలు సామాజిక ఆంశాలపై కథనాలు రాస్తున్నారు. కళారంగంపై ఉన్న మక్కువతో కళాకారులను ప్రోత్సహించే విధంగా వ్యాసాలను రాస్తూ ప్రశంసలను అందుకుంటున్నారు. సౌదీ అరేబియాలోని మహిళలు, భారతీయ మహిళల జీవన విధానంలో ఉన్న తేడాలపై పరిశీలనాత్మక కథనాలను అందించారు. పేయింటింగ్, రైటింగ్ స్కిల్స్, డ్రాయింగ్, మ్యూజిక్, కవిత్వం అంటే ఎంతో ఇష్టం అని ఆమె చెబుతున్నారు. గాయనిగా కూడా ఆమె తన ప్రతిభను కనబరుస్తున్నారు. సౌదీలో పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించిన అమ్రినా ఖైసర్.. హాస్పిటల్ మేనేజ్మెంట్, హెచ్‌ఆర్‌లలో ఎంబీఏ పూర్తిచేశారు. జర్నలిజంలో డిగ్రీ కూడా చేశారు. ఉత్తమ జర్నలిస్టుగా అవార్డు అందుకున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీలో పర్యటించిన సందర్బంలో కవరేజీ బాధ్యతలను నిర్వహించిన ఏకైక మహిళా జర్నలిస్టు అమ్రినా ఖైసర్ కావడం విశేషం. ‘వేవ్’ ద్వారాసేవా కార్యక్రమాలు చిత్తూరు జిల్లాకు చెందిన గీతారమేష్ దుబాయిలో 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. గీత భర్త రమేష్ ఓ కంపెనీలో ఉన్నత ఉద్యోగంలో ఉన్నారు. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్న గీత ‘వేవ్’ సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి పలు విధాల సేవలు అందిస్తున్నారు. అలాగే దుబాయిలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో తన వంతు పాత్రను పోషిస్తున్నారు. గల్ఫ్‌కు వెళ్లే మహిళలకు శిక్షణ ఇవ్వాలి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే మహిళలకు వివిధ రంగాల్లో ప్రభుత్వం శిక్షణ ఇవ్వాలి. కొందరు మహిళలను ఏజెంట్లు వంచించి ఇంటి పని కోసం షేక్‌ల ఇళ్లల్లో ఉంచుతున్నారు. పని సక్రమంగా చేసినా మహిళలపై భౌతికదాడులకు దిగుతున్నారు. దీంతో ఎంతో మంది మహిళలు అవస్థలు పడుతున్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలను గౌరవించడం కాదు.. మహిళలకు ఎప్పటికీ గౌరవం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గల్ఫ్ దేశాల్లో పనిచేసి సొంత గడ్డకు చేరుకునే మహిళలకు ప్రభుత్వం రాయితీ పథకాలను అందించాలి. – స్వప్నారెడ్డి కల్లెం, కువైట్ -
ఏజెంట్ల మాయమాటలు నమ్మొద్దు
తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్ సెంటర్): ఏజెంట్ల మాయమాటల్లో పడి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ప్రవాసాంద్రుల సేవా కేంద్రం అధ్యక్షులు గట్టిం మాణిక్యాలరావు సూచించారు. బుధవారం గల్ఫ్‌హెల్ఫ్ కార్యక్రమం తాడేపల్లిగూడెం పట్టణంలో కైండ్‌నెస్ సొసైటీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జీవనోపాధి నిమిత్త గల్ఫ్‌దేశాలకెళ్లి అక్కడ బాధపడుతోన్న వారి కుటుంబీకులు పలువురు మాణిక్యాలరావు వినతిపత్రాలను అందించారు. మస్కట్‌లో అనారోగ్యంతో బాధపడుతోన్న నిడదవోలు మండలం గోపవరానికి చెందిన ముప్పిడి పోసమ్మను స్వదేశానికి రప్పించాలని ఆమె కుమారుడు నరేష్ కుమార్ వినతిపత్రం అందించారు. 9 నెలల క్రితం మస్కట్ వెళ్లి అక్కడ యజమానితో ఇబ్బందులు పడుతోన్న విశాఖ జిల్లా ప్రాయకరావుపేటకు చెందిన ఎం.సూర్యవతిను స్వదేశానికి రప్పించాలని ఆమె భర్త శ్రీనివాసరావు, రెండేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లిన పాలకోడేరు మండలం గరగపర్రుకు చెందిన మేడిశెట్టి సాయిబాబును స్వదేశం రప్పించాలని ఆయన భార్య రాధ కోరారు. ఖత్తర్ వెళ్లి అనారోగ్యంతో పనిచేయలేకపోతోన్న పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన ఇ.మంగను స్వదేశానికి రప్పించాలని ఆమె భర్త సురేష్ వినతిపత్రం అందించారు. -
సెల్ఫోన్లు వాడుతున్నా ఉత్తరాలు రాస్తుండాలి..
‘కూలి కోసం.. కూటి కోసం.. పట్టణంలో బతుకుదామని.. తల్లి మాటను చెవిన బెట్టక.. బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం.. ఎంత నష్టం..’ అన్న శ్రీశ్రీ మాటలు ఇక్కడ మనకు స్ఫురణకు వస్తాయి.. ఎడారి దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి బతుకు పోరాటం సాగిస్తున్న అభాగ్యుల దీనగాథలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.. ఏజెంట్ల మోసాలు, గల్ఫ్ దేశాల్లో యాజమాన్యాల వేధింపులతో ప్రమాదకర పరిస్థితుల్లో అక్కడ ఉండలేక.. ఇక్కడకు రాలేక.. ఎందరో బాధితులు అల్లాడుతున్నారు. ఇలాంటి వారిలో జిల్లావాసులు వందల్లో ఉన్నారు. కొడుకు కోసం ఎదురుచూస్తున్న తల్లులు.. భర్త కోసం వేచిచూస్తున్న మహిళలు.. తండ్రి క్షేమంగా రావాలని కోరుకుంటున్న బిడ్డలు.. ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. విదేశాల్లో ఉద్యోగాలపై అవగాహన లేకపోవడం, సరైన పత్రాలు లేకుండా గల్ఫ్ వెళ్లడం వంటివి వీరి కష్టాలకు కారణమవుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు మరణిస్తే వారి మృతదేహాలు స్వగ్రామాలకు రావడం కూడా కష్టమవుతోంది. పశ్చిమగోదావరి , తాడేపల్లిగూడెం/పాలకొల్లు టౌన్ / పోడూరు: జిల్లాలోని పలువురు మహిళలు, నిరుద్యోగ యువకులు పొట్టచేత పట్టుకుని గల్ఫ్ దేశాలతో పాటు మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు వెళుతున్నారు. ఎడారి దేశాలకు వెళ్లిన తర్వాత వీరు పడేపాట్లు వర్ణనాతీతం. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి మృతి చెందితే వారి మృతదేహాలు కుటుంబ సభ్యులకు చేరడానికి నెలలు పట్టే పరిస్థితి. ఇదిలా ఉంటే జిల్లాలోని కొందరు ఏజెంట్లు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలను, యువకులను బుట్టలో వేసుకుని ప్రభుత్వ అనుమతి లేకుండా దొడ్డిదారిన విజిటింగ్ వీసాలపై పంపుతున్నారు. ఇలా వీరి వలలో చిక్కిన వారు అష్టకష్టాలు పడుతున్నారు. గల్ఫ్ పోలీసుల కంటపడి జైలు గదుల్లో ఎందరో మగ్గుతున్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏళ్లు గడుస్తున్నా వారి జాడ తెలియక ఇక్కడ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రం నుంచి 20 లక్షల మంది.. ప్రవాస భారతీయ మంత్రిత్వశాఖ ఇటీవల పార్లమెంటులో వివరాలు ప్రకటించింది. ప్రపంచంలోని 184 దేశాల్లో సుమారు మూడు కోట్ల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఆరు అరబ్ గల్ఫ్ దేశాల్లో సుమారు 60 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు గల్ఫ్‌లో సుమారు 20 లక్షల మంది ఉన్నారు. ప్రపంచంలోని 17 దేశాలకు ఉద్యోగాలకు వెళ్లాలనుకునే భారతీయ కార్మికులు ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ (పీఓఈ) (వలసదారుల సంరక్షకులు) వారి కార్యాలయం ద్వారా ఎమిగ్రేషన్ క్లియరెన్సు (వలస వెళ్లడానికి అనుమతి) తీసుకోవాలి. ఈ దేశాలకు వెళితే జాగ్రత్త బహెరిన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓమన్, యూఏఈ, ఆప్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేషియా, సూడన్, యెమెన్, ఇండోనేషియా, థాయిలాండ్ వెళ్లే వారు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ♦ ప్రవాస కార్మికుల హక్కులు స్వదేశం నుంచి విదేశానికి వెళ్లడానికి,రావడానికి స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు ♦ బానిసత్వానికి, బలవంతపు చాకిరీకి వ్యతిరేకంగారక్షణ పొందే హక్కు ♦ ఆలోచన, మనస్సాక్షి, మత విషయంలోస్వేచ్ఛగా ఉండే హక్కు ♦ హింస, అవమానమైన అణచివేత లేదా శిక్షల నుంచి స్వేచ్ఛగా ఉండే హక్కులు ప్రవాస కార్మికులకు ఉంటాయి. అండగా మహాసేన జిల్లాలోని ఉపాధి కోసం వెళ్లిన కొందరు ఉద్యోగులు మహాసేన స్వచ్ఛంద గ్రూపును ఏర్పాటు చేసుకుని కువైట్‌లో ఎవరికైనా ప్రమాదం జరిగితే సాయం అందిస్తున్నారు. ఎవరైనా మృతిచెందితే మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేలా కృషిచేస్తున్నారు. ఇలా పాలకొల్లు మండలం పెదగరువుకి చెందిన కోటి జోగామణి ఇటీవల కువైట్‌లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందితే మహాసేన స్వచ్ఛంద సంస్థ అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేయించి వారం రోజుల్లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చేరేలా చేశారని ఆమె భర్త రామకృష్ణ చెప్పారు. అవగాహన లేమితోనే కష్టాలు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి చేసే ఉద్యోగం, వచ్చే ఆదాయంపై అవగాహన ఉండటం లేదు. టూరిస్టు వీసాపై వెళ్లి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకు థాయిలాండ్ వెళ్లాలంటే ఈ దేశం వచ్చే వ్యక్తి వద్ద ఇంత సొమ్ము ఉండాలనే నిబంధన ఉంది. గల్ఫ్ దేశాల్లో అలాంటి నిబంధనాలు లేవు. గల్ఫ్ దేశం వెళ్లే వారికి అవగాహన కోసం రాష్ట్రంలో హోమ్ క్యాప్ అనే సంస్థను ఏర్పాటుచేశారు. ఇతర దేశాలకు వెళ్లే వారు కనీసం ఈ సంస్థను సంప్రదించడం లేదు. జిల్లా నుంచి ఏటా 12 వేల మంది వరకు గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. విజిటింగ్ వీసాలపై వెళ్లి మహిళలు కట్టు బానిసలుగా, వ్యభిచారం కూపంలోకి నెట్టబడుతున్నారు. పురుషులు ఎడారిలో ఒంటెల దగ్గర, గొర్రెల దగ్గర, ఎండ, చలి బాధలను తట్టుకోలేక అనారోగ్యానికి గురై ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి వారికి సహాయం కోసం ప్రవాసాంధ్రుల సేవా కేంద్రం పనిచేస్తుంది. రాష్ట్రం మొత్తంగా చూసుకుంటే మ్యాన్ పవర్ సరఫరాకు సంబంధించి అ««ధికారిక ఏజెన్సీలు లేవు. పోగొట్టుకున్న పత్రాలు సమకూర్చడం, బీమా భరోసా అందుబాటులోకి తేవడం, నైపుణ్య శిక్షణ, విద్యాసాయం, మృతి చెందిన వ్యక్తుల కుటుంబీకులకు ఖననం నిమిత్తం ఆర్థిక సాయం, మృతదేహాలను సొంత ప్రాంతానికి చేర్చడానికి ఉచితంగా ఎయిర్‌పోర్టు నుంచి అంబులెన్సు సదుపాయం వంటి సేవలు ప్రవాసాంధ్రుల సేవాకేంద్రం ద్వారా అందిస్తున్నాం. జాగ్రత్తలు తీసుకుని గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లాలి.– గట్టిం మాణిక్యాలరావు, ప్రవాసాంధ్రుల సేవా కేంద్రం, తాడేపల్లిగూడెం ఇవి పాటించాలి ♦ పాస్‌పోర్టు దరఖాస్తులో ఇంటిపేరు, పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, జీవిత భాగస్వామి (భర్త లేదా భార్య) పేరు స్పష్టమైన స్పెల్లింగ్‌తో రాయాలి. జన్మస్థలం. పుట్టినతేదీ, చిరునామా, విద్యార్హతలు సరిగా పేర్కొనాలి. తప్పులు లేకుండా పాస్‌పోర్టు పొందాలి. ♦ ప్రభుత్వం ద్వారా ఉచిత శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి. ♦ విదేశాలకు వెళ్లే ముందు వైద్యారోగ్య పరీక్షలు చేయించుకోవాలి. విదేశాల్లో మెడికల్ చెకప్‌లో ఫెయిల్ అయితే ఉద్యోగం నుంచి తొలగించిఇంటికి పంపిస్తారు. ♦ ఏ దేశానికి ఏ పనిమీద వెళ్లాలనుకుంటున్నారో స్పష్టత కలిగి ఉండాలి. ♦ విజిట్ వీసా, ఆజాద్ వీసా, ఫ్రీ వీసా, ఖఫాలత్ వీసా, ప్రైవేట్ వీసాలపై విదేశాలకు వెళ్లకూడదు. చట్టబద్ధమైన కంపెనీల వీసాలపై మాత్రమే వెళ్లాలి. ♦ ప్రవాసీ భారతీయ వ్యవహారాల శాఖ, ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఏమిగ్రెంట్స్తో జారీచేయబడ్డ లైసెన్స్ కలిగిన రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్లాలి. ♦ విదేశీ యాజమాన్యం నుంచి పొందిన డిమాండ్ లెటర్, పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలు ఉన్న ఏజెంట్ ద్వారా మాత్రమే వెళ్లాలి. ♦ ఇండియన్ ఎంబసీచే ధ్రువీకరించబడిన అరబ్బీతో పాటు ఇంగ్లిష్, తెలుగు భాషల్లో గల ఉద్యోగ ఒప్పందపత్రం కలిగి ఉండాలి. ఉద్యోగ ఒప్పంద పత్రం శ్రామికుడి హక్కులను కాపాడుతుంది. ♦ ఇమిగ్రేషన్ యాక్టు 1983 ప్రకారం సబ్ ఏజెంట్లకు అనుమతి ఉండదు. కాబట్టి విదేశాలకు వెళ్లేవారు వారితో సంప్రదించకూడదు. ♦ కనీసం ఆరు నెలలపాటు చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు ఉండేటట్టు చూసుకోవాలి. చెల్లుబాటులో ఉన్న వీసా తప్పకుండా పాస్‌పోర్టుపై స్టాంపింగ్ అయ్యి ఉండాలి. విడిగా వీసా అయినా ఉండాలి. ♦ విదేశాలకు ఉద్యోగానికి వెళ్లడానికి సర్వీస్ చార్జీగా 45 రోజుల వేతనం (రూ.20 వేలకు మించకుండా) మాత్రమే ఏజెంట్‌కు చెల్లించాలి. చెల్లింపులు డిమాండ్ డ్రాప్టు లేదా చెక్కు ద్వారా చెల్లించాలి. రసీదు తప్పక తీసుకోవాలి. ♦ విదేశాలకు వెళ్లేటప్పుడు పాసుపోర్టు, వీసా తదితర అన్నిరకాల డాక్యుమెంట్ల జెరాక్స్ సెట్‌ను కుటుంబసభ్యులకు ఇచ్చి వెళ్లాలి. ♦ ముఖ్యమైన టెలిఫోన్ నంబర్లను గుర్తుంచుకోవాలి. విదేశానికి వెళ్లిన తర్వాత.. ♦ విదేశానికి చేరిన తర్వాత సాధ్యమైనంత త్వరగా రెసిడెంట్ పర్మిట్, వర్క్ పర్మిట్, ఐడెంటిటీ కార్డు, లేబర్ కార్డు, అఖామా, బాతాకా పొందాలి. ♦ ఉపాధి కోసం విదేశాల్లో ఉన్న చట్టాలను సంప్రదాయాలను పాటించాలి, గౌరవించాలి. ♦ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. విలాసాలు వీడాలి. ♦ విదేశాల్లో ఉద్యోగాలు శాశ్వతం కాదు. ప్రపంచంలోని పరిస్థితులు, ఉద్యోగం చేస్తున్న దేశంలో సంభవించే పరిణామాల వల్ల ఏ క్షణంలోౖ¯ð నా ఉద్యోగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న çస్పృహతో అప్రమత్తంగా ఉండాలి. ♦ అరబ్, గల్ఫ్ దేశాల్లో యజమాని నుంచి పారిపోయి వేరేచోట పనిచేయడం వల్ల అక్రమ వాసులు(ఖల్లివెల్లి)గా మారి తమ హక్కులను కోల్పోతారు. ♦ ఓవర్ టైం పనిచేయమని ఒత్తిడి చేసే అధికారం యజమానికి లేదు. ఇష్టమైతే అదనపు పనికి, అదనపు వేతనం ఇస్తేనే ఓవర్ టైం చేయాలి. వారానికి ఒక రోజు సెలవు పొందడం హక్కు. ♦ గల్ఫ్ దేశాల చట్టాల ప్రకారం సమ్మె, ఆందోళనలు నిషేధం. ♦ మహాత్మాగాంధీ ప్రవాసి సురక్షా (ఎంజీపీఎస్‌వై), సాంఘిక భద్రతా పొదుపు పథకంలో చేరాలి. జీవిత బీమా, వాపసు వచ్చాక పునరావాసం, వృద్ధాప్య పింఛన్ సౌకర్యం పొందాలి. ♦ కార్మికుడి పొదుపునకు ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా కొంత ప్రోత్సాహక చందా జమచేస్తుంది. ♦ విదేశాల నుంచి డబ్బును పంపడానికి, పొదుపుకోసం సొంత ఊరిలో ఉన్న బ్యాంకులో ఎన్ఆర్ఐ ఖాతాను తెరవాలి. ♦ సెల్ఫోన్లు వాడుతున్నా రెండు, మూడు నెలలకు ఒకసారి కుటుంబసభ్యులకు ఉత్తరాలు రాస్తుండాలి. పోస్టు ద్వారా వచ్చే ఈ ఉత్తరాలపై ఉన్న ముద్రలు ఆపద కాలంలో ఉపయోగపడవచ్చు. ♦ విదేశాలలో ఇబ్బంది ఉంటే సమీపంలోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదించవచ్చు. జిల్లాలోని పోడూరు మండలం జిన్నూరుకి చెందిన కేతలి దుర్గారావు ఐదేళ్ల క్రితం ఆయిల్‌పామ్ తోటల్లో పనిచేసేందుకు మలేషియా వెళ్లాడు. అక్కడ నాలుగు నెలలు బాగానే పనిచేశాడు. తర్వాత ఏమైందో తెలియదు. అప్పటినుంచి దుర్గారావు నుంచి ఇంటికి సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అనారోగ్యంతో మంచాన పడిన భార్య రెండు రోజులక్రితం మృతిచెందింది. వృద్ధురాలైన తల్లి, ఇద్దరు పిల్లలు తేజ సత్యశ్రీ, షరీఫ్ అతడి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. దుర్గారావును పోలీసులు తీసుకువెళ్లారని ఓసారి తోటి కూలీ అక్కడి నుంచి ఫోన్ చేసి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. అప్పటి నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో అప్పట్లో కుటుంబసభ్యులు జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. బిడ్డ రాకకోసం తల్లి, తండ్రి రాకకోసం పిల్లలు ఆశగా ఎదురుచూస్తున్నారు. తన కోడలు దుర్గారావు కోసం బెంగపెట్టుకుని అనారోగ్యంతో రెండు రోజులక్రితం కన్నుమూసిందని తల్లి కేతలి కమల బోరుమంటున్నారు. -
గల్ఫ్ బాధితులను ఆదుకోవాలి
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం : గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని స్వగ్రామాలకు తీసుకురావాలని పలువురు బాధిత కుటుంబాలకు చెందిన వారు బుధవారం పట్టణంలో జరిగిన గల్ఫ్‌హెల్ఫ్ కార్యక్రమంలో కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావుకు వినతిపత్రాలు సమర్పించారు. ఆకివీడు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఎం.మరియమ్మ జీవనోపాధి నిమిత్తం పది నెలల క్రితం దుబాయ్ వెళ్లగా అక్కడ ఆమెను శారీరకంగా, మానసికంగాను ఇబ్బందులు పెడుతున్నారని, మరియమ్మను స్వగ్రామానికి రప్పించాలని తల్లి జి.రూతమ్మ మాణిక్యాలరావుకు వినతిపత్రం సమర్పించారు. పెంటపాడు మండలం బీసీ కాలనీకి చెందిన చిటికిన వెంకట సత్యవరప్రసాద్ ఏడాది క్రితం జీవనోపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లగా అక్కడ చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడని, అతడిని స్వదేశం రప్పించాలని తల్లి చిటికి వెంకట నరసమ్మ వినతిపత్రం సమర్పించారు. కడప జిల్లా రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట గ్రామానికి చెందిన కలిశెట్టి సుబ్రహ్మణ్యం జీవనోపాధి నిమిత్తం ఖతర్ వెళ్లగా అక్కడ యజమాని పాస్‌పోర్టు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని, అతడిని స్వదేశం తీసుకురావాలని అన్న కలిశెట్టి వెంకట చలపతి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ ఎన్ని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా ఏజెంట్ల మాయమాటలు నమ్మడం, ఎక్కువ జీతం వస్తుందని భావించి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ప్రభుత్వం నిర్దేశించిన విధానాలు ఆధారంగా గల్ఫ్ దేశాలకు వెళ్లాలని, అలా వెళ్లిన వారు రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా పాలసీ పొందవచ్చని చెప్పారు. సాయిశ్రీ, సత్యనారాయణ, శివ తదితరులు పాల్గొన్నారు. -
కువైట్‌లో రోడ్డుప్రమాదం
వైఎస్ఆర్ జిల్లా, సుండుపల్లె : గల్ఫ్ దేశమైన కువైట్‌లో శనివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో జి.కె.రాచపల్లెకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. సుండుపల్లె మండలం మడితాడు గ్రామ పంచాయతీ జీకే రాచపల్లెకు చెందిన గాదంశెట్టి లక్ష్మయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడికి వివాహమై సుండుపల్లె మండలంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రెండవ కుమారుడు జి.నాగరాజు (35) జీవనోపాధి కోసం కువైట్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి లగేజీని కారు డిక్కీలో పెడుతుండగా వెనుక నుంచి మరో కారు వచ్చి ఢీకొంది. ఈప్రమాదంలో అక్కడికక్కడే నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు. ఫిబ్రవరి నెలలో ఇంటికొచ్చి పెళ్లి సంబంధాలు చూసుకుని తిరిగి వెళ్తానని చెప్పిన కుమారుడు అంతలోనే రోడ్డుప్రమాదంలో మృతిచెందాడని తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా నాగరాజు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి ఆర్థిక వనరుల కోసం బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. -
మా వాళ్లను స్వదేశం రప్పించండి
తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్ సెంటర్): ‘పొట్ట కూటి కోసం విదేశం వెళ్లిన మా వాళ్లు.. అక్కడ నరకయాతన పడుతున్నారు.. వారిని స్వదేశం రప్పించండి’ అంటూ ఇక్కడ కుటుంబ సభ్యులు అందించే వినతులు రోజురోజుకు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు నిర్వహిస్తోన్న గల్ఫ్‌హెల్ప్ కార్యక్రమానికి బుధవారం బాధితుల నుంచి భారీ సంఖ్యలో వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ విజిటింగ్ వీసాలు, ఏజెంట్ల మాయమాటలు నమ్మి అనేక మంది గల్ఫ్ దేశాలకు వెళ్లి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఎక్కువ మొత్తంలో జీతం వస్తుందని ఆశపడి అక్కడ మోసపోయి నరకం చూస్తున్నారని తెలిపారు. అలా ఇండియా తిరిగి రాలేక బాధపడుతోన్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెళ్లిన వారు తిరిగి వస్తున్నారో లేదో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ♦ సౌదీ అరేబియా దేశంలో యాక్సిడెంట్ కారణంగా ప్రాణాలతో పోరాడుతున్న పంజా వెంకట రామారావును స్వదేశం రప్పించాలని వీరవాసరం మండలం, పంజా వేమవరానికి చెందిన బంధువులు, తండ్రి పంజా త్రిమూర్తులు మాణిక్యాలరావుకు వినతిపత్రం అందజేశారు. ♦ కృష్ణా జిల్లా పెడన్ మండలం కాకర్లమూడి గ్రామానికి చెందిన మువ్వల పాతిమా 3 సంవత్సరాల క్రితం ఖతర్ దేశం వెళ్లింది. అక్కడ ఏజెంట్ ఆమెను సౌది అరేబియాకు తీసుకొనిపోయి పని చేయిస్తున్నారు. ఆమె ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోందని, ఇండియాకు రప్పించాలని కుమారుడు మువ్వల రాహుల్ కోరారు. ♦ గూడెం మండలం నందమూరు గ్రామానికి చెందిన దర్శిపో సుబ్బాయమ్మ జీవనోపాధి నిమిత్తం మస్కట్ వెళ్లింది. అక్కడ ఆమెకు జీతం ఇవ్వకుండా బాధిస్తున్నారని, ఆమెను ఇండియాకు రప్పించాలని భర్త దర్శిపో కృపానందం వినతిపత్రం సమర్పించారు. ♦ మాధవరం గ్రామానికి చెందిన రాపాక శ్రీను 6 సంవత్సరాల క్రితం మలేషియా దేశం వెళ్లాడు. ఇప్పటి వరకు అతను ఎలా ఉన్నది సమాచారం అందలేదు. ఎక్కడ ఉన్నది తెలియని పరిస్థితులలో ఉన్నామని, భర్తను మలేషియా నుంచి ఇండియాకు రప్పించాలని భార్య ఉమాదేవి వినతిపత్రం సమర్పించారు. -
తల్లి రాక కోసం..
భర్త వైద్యానికి చేసిన అప్పులు తీర్చేందుకు, కూతుళ్ల పోషణకు ఆ మహిళ గల్ఫ్‌బాట పట్టింది. ఒమన్‌లోని మస్కట్‌లో ఓ ఇంట్లో పనిమనిషిగా విధుల్లో చేరింది. ఎంతో నమ్మకంగా పనిచేసింది. కూతురు పెళ్లి కోసం ఇండియాకు వచ్చిన ఆమెను మళ్లీ రావాలని ఒమన్ దేశంలోని యజమాని, యజమానురాలు ఫోన్ చేసి రప్పించుకున్నారు. ఆ నమ్మకస్తులే కఠినాత్ములుగా మారారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కూతురుని చూసివస్తానని, ఇండియాకు పంపించాలని యజమానులను వేడుకున్నా పంపండం లేదు. తల్లి కోసం ఇద్దరు కూతుళ్లు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కీసరి శ్రీనివాస్, మానకొండూర్ (కరీంనగర్ జిల్లా) కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన లక్ష్మికి అదే గ్రామానికి చెందిన గుండేటి కనకయ్యతో 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. కనకయ్యకు వ్యవసాయ భూమి ఏమీ లేకపోవడంతో కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించాడు. కొంత కాలం తర్వాత కనుకయ్యకు కామెర్ల వ్యాధి సోకింది. భర్తను బతికించుకునేందుకు లక్ష్మీ ఎన్నో కష్టాలు పడింది. అప్పులు చేసి భర్తకు చికిత్స చేయించింది. అయినా కనకయ్య బతకలేదు. 2000 సంవత్సరం నవంబరులో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం ఆమెపై పడింది. గీతాంజలి, శ్రీహరి, శ్రావణి వారి సంతానం. నాలుగేళ్ల వయస్సులో కుమారుడు శ్రీహరి ప్రమాదవశాత్తు చనిపోయాడు. పెద్ద కూతురు గీతాంజలి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు చదువుకుంది. ఇదే గ్రామంలోని లక్ష్మి ఆడపడుచు లస్మమ్మకు సంతానం లేకపోవడంతో గీతాంజలి ప్రస్తుతం ఆమె వద్ద ఉంటోంది. రెండవ కూతురు లక్ష్మి అమ్మమ్మ అయిన పోచమ్మ ఇంట్లో ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బంధువుల సహాయంతో గల్ఫ్‌కు... భర్త మరణించడంతో కూతుళ్ల భారం లక్ష్మిపై పడింది. ఈ తరుణంలో ఆమె గల్ఫ్‌కు వెళ్లాలని నిశ్చయించుకుంది. తన దూరపు బంధువుల ద్వారా 2014 సంవత్సరంలో గల్ఫ్ బాట పట్టింది. ఒమన్ దేశంలోని మస్కట్‌లో ఓ ఇంట్లో పనికి కుదిరింది. పిల్లల చదువుకు, పెళ్లిళ్ల కోసం డబ్బులు పోగుచేసుకుంది. ఈ క్రమంలో పెద్ద కూతురుకు వివాహం నిశ్చయం కావడంతో 2018 మార్చి 1న లక్ష్మి స్వగ్రామానికి వచ్చింది. కూతురుకు అదే నెల 10న వివాహం జరిపించింది. పెళ్లి తర్వాత ఒమన్ నుంచి ఫోన్ రావడంతో వెళ్లేందుకు మొదట ఆమె నిరాకరించింది. పదే పదే ఇంటి యాజమాని, యజమానురాలు ఎంతో నమ్మకంగా పనిచేసినవ్ నీవే రావాలని.. వచ్చిన తర్వాత విమాన టికెట్ డబ్బులు కూడా ఇస్తామని చెప్పడంతో వారి మాటలను నమ్మి 2018 ఏప్రిల్‌లో లక్ష్మి మళ్లీ ఒమన్‌కు వెళ్లింది. అయితే, అక్కడికి వెళ్లాక మొదటి నెల డబ్బులు కూడా వారు ఇవ్వలేదని లక్ష్మీ చెప్పింది. వెళ్లిన కొన్నాళ్లకే పెద్ద కూతురు గీతాంజలి భర్తతో విడాకులయ్యాయి. ఆమె గల్ఫ్‌లో ఉండగానే గీతాంజలికి లక్ష్మి తల్లిదండ్రులు మరో వివాహం చేశారు. కూతురుకు రోడ్డు ప్రమాదం.. ఆగస్టు నెలలో పెద్ద కూతురు గీతాంజలికి స్వగ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గాయాలయ్యాయి. ఈ విషయం లక్ష్మికి తెలియడంతో తల్లడిల్లిపోయింది. తన కూతురుకు యాక్సిడెంట్ అయ్యిందని, తాను ఇండియాకు వెళ్లివస్తానని యజమాని, యజమానురాలికి చెప్పింది. దానికి వారు ఒప్పుకోలేదు. ఇండియాకు పంపించడం కుదరదని, ఇక్కడే ఉండాలని తెగేసి చెప్పారు. వాట్సప్ మెస్సేజ్ ద్వారా వెలుగులోకి.. తన కూతురు రోడ్డు ప్రమాదంలో గాయపడిందని, తనను ఒమన్ దేశం నుంచి యజమాని పంపించడం లేదని రోదిస్తూ ఆమె వాట్సప్ ద్వారా వాయిస్ మెస్సేజ్ పెట్టింది. తనను ఎలాగైనా ఇండియాకు పంపించాలని కోరింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లక్ష్మిని ఇండియాకు పంపించేలా చూడాలని ఆమె కుటుంబ సభ్యులు స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను కలిసి విన్నవించారు. తల్లి కోసం లక్ష్మి కూతుళ్లు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కుటుంబంపై ఆర్థిక భారం కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న భర్త కనుకయ్య ఆనారోగ్యంతో చనిపోవడంతో లక్ష్మిపై కుటుంబ భారం పడింది. భర్తకు వైద్యం కోసం చేసిన అప్పులు, కూతురుకు పెళ్లి ఖర్చులు కలిపి సుమారు రూ.6 లక్షల వరకు అప్పులయ్యాయి. -
రూ.500 కోట్లతో గల్ఫ్ కార్పొరేషన్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.500 కోట్లతో గల్ఫ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికులకు, వారి కుటుంబాలకు అండగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ’గల్ఫ్ భరోసా యాత్ర’ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రవాసుల సంక్షేమం పేరిట ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కిందని విమర్శించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ బీఎం వినోద్ కుమార్, టీపీసీసీ గల్ఫ్ ఎన్నారై కన్వీనర్ నంగి దేవేందర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి మంద భీంరెడ్డి ఆధ్వర్యంలో గల్ఫ్ భరోసా యాత్ర కొనసాగుతుందన్నారు. గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. -
గల్ఫ్ గండం
ఈమె పేరు పార్వతమ్మ. గాలివీడు మండలం రెడ్డివారిపల్లె. కుటుంబ జీవనాధారం కోసం కువైట్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్లాక ఈమెకు తిప్పలు తప్పలేదు. కనీసం షేట్లు ఇంటికి ఫోన్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించలేదు. మూడేళ్ల క్రితం వెళ్లిన ఆమె ఒకట్రెండు సార్లు మాత్రమే ఫోన్ చేసింది. అక్కడ పెట్టిన ఇబ్బందులు అన్ని.. ఇన్నీ కావు. కుటుంబ పోషణ కోసం అక్కడికి వెళ్లిన పార్వతమ్మ అక్కడి కష్టాలు భరించలేక ఇంటికి వచ్చేందుకు ఆస్కారం లేక నరకయాతన అనుభవించింది. వారం రోజుల క్రితం ఆమె ఇంటికి చేరింది. సాక్షి కడప : జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వేళ్లే వారికి అడుగడుగునా గండాలు తప్పడం లేదు. ఎన్నో ఆశలతో అక్కడికి వెళితే చిత్ర హింసలు, వేధింపులు, చీదరింపులు, బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది కాదు.. అది కాదని చెప్పడానికి దేశం కానీ దేశం. భాష, యాస, కట్టుబాట్లు అన్ని మారుతాయి. అక్కడ చెప్పుకోవడానికి కూడా ఏమీ ఉండదు. షేట్లు చెప్పిందే వేదం.. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి జీతం పంపలేక.. అక్కడి పరిస్థితులు ఇక్కడి వారికి చెప్పే అవకాశం లేక వెళ్లిన వలస జీవులు పడుతున్న వేదన వర్ణణాతీతం. వీసా కోసం భారీగా ఖర్చు చేసుకుని ఇక్కడి ఏజెంట్ల ద్వారా వెళుతున్నా..మధ్యలో ఏమి జరుగుతుందో తెలియక అవస్థలు పడుతున్నారు. చెప్పేదొకటి.. చేసేదొకటి.. జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, బద్వేల్ తదితర ప్రాంతాలనుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారు అధికంగా ఉన్నారు. పులివెందుల, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప, కమలాపురం ప్రాంతాల్లో ఇతర దేశాలకు జీవనాధారం కోసం వెళ్లిన వారు తక్కువే. ఇక్కడ నుంచి వెళ్లే వారికి ఏజెంట్లు చెప్పే మాటలు వేరుగా ఉంటున్నాయి. ఏదో ఒక రకంగా ఇక్కడి నుంచి పంపిస్తే అంతో.. ఇంతో వస్తుందని అవతలి వారి సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నారు. తమ ఆదాయం కోసం ‘ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు’చెప్పి సరిహద్దులు దాటిస్తున్నారు. ఇంట్లో పని. తోట పని, డ్రైవర్, గొర్రెల కాపరి, ఫ్యాక్టరీలో ఉద్యోగాలంటూ అక్కడికి పంపుతున్నా.. అక్కడ మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. ఏజెంట్ల మోసాన్ని బయటకు చెప్పుకోలేక తల్లడిల్లిపోయేవారు కొందరైతే..తప్పని పరిస్థితిలో మళ్లీ స్వదేశానికి రావడం కోసం కష్టాలు ఎదుర్కొంటూ అడుగు ముందుకేస్తున్నారు. ఏజెంట్ల చేతిలో దెబ్బతిన్న చాలామంది బాధితులు ఇప్పటికి మన కళ్లముందే కనిపిస్తున్నారు. జిల్లాలో పేదలను టార్గెట్ చేసుకుని వల విసురుతున్నారు. రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేల్, రాయచోటి నియోజకవర్గాలలోని పల్లె సీమలలో నిరుపేదలను ఎంచుకుంటున్నారు. కుటుంబ పరిస్థితులు బాగలేక.. ఆర్థికంగా ఎదగాలంటే అవకాశాలు లేక గల్ఫ్ దేశాలకు వెళితే ఎంతో కొంత వెనుకేసుకోవచ్చున్న ఆశ కల్పించి ఏజెంట్లు వల విసురుతున్నారు. వారి ఆశలకు రూపం ఇస్తే ఫర్వాలేదు కానీ.. ఇక్కడి నుంచి పంపితే చాలు.. అక్కడ ఎలా ఉంటే మనకెందుకని వదిలేయటం ఏజెంట్లకు మంచిది కాదని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉపాధి కల్పించని ప్రభుత్వాలు.. పట్టణ, పల్లెలు అనే తేడా లేకుండా బాగా చదువుకున్న వారు ఉన్నప్పటికీ అనుకున్న మేర ఉపాధి అవకాశాలు లభించడంలేదు. ఈ కారణంగా కూడా ఇతర దేశాలకు వెళితే ఎక్కువ సంపాదించవచ్చని చాలామంది సిద్ధపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు గగనంగా మారుతున్నాయి. రోజు రోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నా పట్టించుకోకపోవడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. విదేశాలకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్పీ జీవనోపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఏజెంట్ల మోసం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ గుర్తింపు కలిగిన వారి ద్వారా వెళ్లడం ఉత్తమం. అంతేకాకుండా పోలీసులకు కూడా జీవనోపాధి నిమిత్తం వెళుతున్న వారి వివరాలు తెలియజేయాలి. వెళ్లిన తర్వాత బాధపడటం కంటే ఇక్కడ ఉన్నప్పుడే ఆలోచన చేయాలి. ఇప్పటికీ గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతూ ఇక్కడికి రాలేక నలిగిపోతున్న 72మందిని బంధం యాప్ ద్వారా రప్పించాం. మరికొంతమంది కోసం ప్రయత్నిస్తున్నాం. – బాబుజీ అట్టాడ, జిల్లా ఎస్పీ, కడప -
స్వదేశానికి చేరిన ఇద్దరు గల్ఫ్ బాధితులు
శంషాబాద్ రంగారెడ్డి : బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన ఇద్దరు నిజామాబాద్ జిల్లావాసులు ఆదివారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు. బాధితుల కథనం ప్రకారం.. 2015లో ఓ ఏజెంట్‌కు రూ. 80 వేల చొప్పున చెల్లించి నిజామాబాద్ జిల్లా పాకాల గ్రామానికి చెందిన సభావట్ మోహన్, భూక్యా అశోక్ యూఏఈ వెళ్లారు. ఏజెంట్ చెప్పిన విధంగా అక్కడ పనిలేకపోవడంతో పాటు వీరి వద్ద ఉన్న పాస్‌పోర్టులను ఓ కంపెనీ యజమాని తీసుకున్నాడు. దీంతో అక్కడే వేర్వేరు చోట్ల ఇంతకాలం పనిచేస్తూ గడిపారు. స్వదేశానికి చేరుకునేందుకు నానాకష్టలు ఎదుర్కొన్న వీరికి అక్కడి తెలుగు సేవాసమితితో పాటు తెలంగాణలోని ఎన్ఆర్ఐ స్వచ్ఛంద సంస్థలకు చెందిన గంగిరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు సాయం చేశారు. యూఏఈ ప్రభుత్వం వీరు స్వదేశం వెళ్లేందుకు అనుమతినిచ్చింది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో విమాన టికెట్లు పొందిన బాధితులు ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్లిపోయారు. -
కేరళ వరదలు : కారుకూత, తగిన శాస్తి
వరద బీభత్సంతో కేరళ ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతుంటే, వారి అవసరాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఉద్యోగికి ఓ గల్ఫ్ కంపెనీ యాజమాన్యం తగిన బుద్ధి చెప్పింది. కనీస మానవత్వాన్ని మరిచి వ్యాఖ్యానించాడు. నోటికొచ్చినట్టుగా అనుచితంగా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంపెనీ అతగాడిని ఉద్యోగంనుంచి తొలగించింది. తప్పయిందంటూ ఆనక లెంపలేసుకున్నా..ఆ కంపెనీ కనికరించలేదు. అటు ఈ వ్యాఖ్యలు చేసింది కేరళకు చెందిన వ్యక్తే కావడం గమనార్హం. కేరళకు చెందిన రాహుల్ లులు గ్రూప్ కంపెనీ ఒమన్ బ్రాంచ్‌లో కేషియర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కేరళలో వరద బాధితులకు వలంటీర్లు సహాయం చేస్తుండడంపై రెండు రోజుల క్రితం ఫేస్బుక్లో ఆయనో పోస్ట్ పెట్టాడు. సహాయక శిబిరాల్లో ఎవరైనా సానిటరీ నేప్కిన్స్ కోసం అడిగితే, తాను మాత్రం వాటికి బదులుగా కండోమ్స్ అడుగుతానంటూ బాధితులను అవహేళన చేస్తూ మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవడంతో రాహుల్ ఉద్యోగం చేస్తున్న సంస్థ స్పందించింది. తక్షణమే రాహుల్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. మద్యం మత్తులోఅలా మాట్లాడాను తప్పైపోయింది, క్షమించండంటూ నాలిక్కరుచుకున్నా.. కంపెనీ ఎంతమాత్రం ఉపేక్షించలేదు. రాహుల్‌కు తగిన శాస్తి చేసింది. కాగా కేరళ వరద బాధితుల పునరావాస కార్యక్రమాలకోసం విరాళమిచ్చిన గల్ఫ్ కంపెనీల్లో లులు గ్రూపు కంపెనీ కూడా ఉంది. కేరళకు చెందిన వ్యాపారవేత్త, లులు గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసుఫ్ అలీ 5కోట్ల రూపాయలును విరాళమిచ్చారు. అటు తమ ఆర్థిక వ్యవస్థ విజయంలో కేరళీయులది కీలక భాగమని, వారికి సహాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘యూఏఈ క్షమాభిక్షను వినియోగించుకోండి’
సాక్షి, హైదరాబాద్: యూఏఈలో ప్రకటించిన క్షమాభిక్ష అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్నారై, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు గల్ఫ్ ప్రవాసీయులకు ఆదివారం పిలుపునిచ్చారు. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు క్షమాభిక్ష ప్రసాదించనున్నారని మంత్రి తెలిపారు. గల్ఫ్‌లో అక్రమంగా నివాసముంటున్న వారు అక్కడి నిబంధనలకు అనుగుణంగా క్రమబద్ధీకరించుకోవడం, ఎలాంటి పత్రాలు లేకుండా యూఏఈలో ఉంటున్న వారు స్వదేశానికి తిరిగిరావడానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. మళ్లీ కావాంటే వీరు రెండేళ్ల నిషేధం తర్వాత చట్టబద్ధంగా యూఏఈకి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. క్షమాభిక్ష సంద ర్భంగా యూఏఈలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నారై శాఖ అధికారులను కేటీఆర్ ఆదే శించారు. ఎన్నారై శాఖ రాయబార కార్యాలయం నుంచి తెలంగాణ ప్రవాసీయుల సమాచారాన్ని సేకరిస్తుందని ఆయన తెలిపారు. క్షమాభిక్ష కాలంలో ఎవరికైనా ప్రభుత్వం నుంచి సహాయం అవసరమైతే 9440854433 హెల్ప్‌లైన్ నం బర్కు ఫోన్ చేయాలన్నారు. ఈ మెయిల్ ద్వారా సాయం కావాలంటే so_nri@ telangana. gov.inకి లేదా యూఏఈ కాన్సులేటులోని హెల్ప్‌డెస్క్ నంబర్ +71565463903 లేదా indiandubai.amnesty@gmail.com ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. -
ప్రవాసులకు ప్రాగ్జీ ఓటింగ్!
సాక్షి, నెట్వర్క్: సర్వీస్ ఓటర్ల (రక్షణ సిబ్బంది, భద్రతా దళాల) తరహాలోనే ప్రవాస భారతీయులకు ‘ప్రాగ్జీ ఓటింగ్’ (పరోక్ష ఓటింగ్.. అంటే ప్రతినిధి ద్వారా ఓటు వేయడం) సదుపాయం కల్పించేందుకు ఉద్దేశించిన ప్రజా ప్రాతినిధ్య (సవరణ) బిల్లు–2017ను లోక్‌సభ గత వారం ఆమోదించింది. ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్ట సవరణ అమలులోకి వస్తుంది. 2010లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి చేసిన సవరణ సెక్షన్ 20–ఎ ప్రకారం 18 సంవత్సరాలు నిండి విదేశీ గడ్డపై నివసిస్తున్న ఎన్నారైలు భారతదేశంలో ‘ఓవర్సీస్ ఎల క్టర్స్’గా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. కొత్త బిల్లు ఆమోదం పొందితే ఎంతో మంది ప్రవాస భారతీయులకు మన దేశంలో నిర్వహించే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన మన దేశ పౌరులకు ఈ ‘ప్రాగ్జీ’ ఓటింగ్ విధానం ప్రయోజనం కల్పిస్తుంది. గల్ఫ్ మినహా అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, ఇతర విదేశాల్లో ఉపాధి పొందుతున్న వారు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటే ఆ దేశ పౌరసత్వం లభించే అవకాశం ఉంది. ఒక్క గల్ఫ్ దేశాల్లో మాత్రం విదేశీయులకు పౌరసత్వాన్ని ఆ దేశాలు ఇచ్చే అవకాశం లేదు. గల్ఫ్ ఓటర్లు కీలకం ’ప్రాగ్జీ ఓటింగ్’ సౌకర్యం ద్వారా సుమారు కోటీ 50 లక్షల మంది ఎన్నారైలు భారత ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నారైలను పట్టించుకోవాల్సిన అవసరం అనివార్యమైంది. అరబ్ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న సుమారు 10 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు 25 అసెంబ్లీ, 2 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలరు. ఒక్కో గల్ఫ్ ఎన్నారైకి కుటుంబ సభ్యులందరు కలిపి కనీసం ఐదుగురు ఉంటారు. అంటే గల్ఫ్ ప్రవాసులు వారి కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 60 లక్షల మందితో ‘గల్ఫ్ ఓటు బ్యాంకు’ రూపు దిద్దుకుంటుంది. వీరు అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల ప్రవాస భారతీయులకు హక్కులు కల్పించేందుకు, సమస్యలు పరిష్కరించడానికి రాజకీయ పార్టీలు తమ మెనిఫెస్టోలో పేర్కొనే అవకాశం ఉంది. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రవాస భారతీయుల పేరిట ఉన్న భూములకు పెట్టుబడి సహాయం అందించలేదు. కానీ పరోక్ష పద్ధతిలో ఎన్నారైలకు ఓటు హక్కు లభించడం వల్ల ప్రభుత్వం తన ఆలోచన తీరును మార్చుకునే అవకాశం లేకపోలేదు. ఎన్నారైలు ఆన్లైన్లో ఓటు నమోదు ఇలా చేసుకోవచ్చు.. భారత ఎన్నికల సంఘం వెబ్సైట్ లింకు http:// www. nvsp. in/ Forms/ Forms/ form6 a? lang= en-GB ను క్లిక్ చేయగానే స్క్రీన్‌పై ఫామ్ 6ఎ కనిపిస్తుంది. ముందుగా ఓటరు నమోదు అధికారి రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ (పాస్‌పోర్ట్ ప్రకారం), ఆ ఊరిలో ఉన్న ఒక బంధువు పేరు, బంధుత్వం నమోదు చేయాలి. పుట్టిన స్థలం, జిల్లా, రాష్ట్రం, లింగం(స్త్రీ, పురుష, ఇతర), ఈ–మెయిల్, ఇండియా మొబైల్ నంబర్‌ను పేర్కొనాలి. ఇండియాలోని చిరునామా (పాస్‌పోర్టులో పేర్కొన్న విధంగా) ఇంటి నంబర్, వీధి పేరు, పోస్టాఫీసు పేరు, గ్రామం/పట్టణం, జిల్లా, పిన్‌కోడ్ తెలియజేయాలి. పాస్‌పోర్ట్ నంబరు, పాస్‌పోర్ట్ జారీ చేసిన ప్రదేశం పేరు, పాస్‌పోర్ట్ జారీ చేసిన తేదీ, గడువు ముగిసే తేదీ, వీసా నంబర్, వీసా కేటగిరీ (సింగిల్ ఎంట్రీ / మల్టిపుల్ ఎంట్రీ /టూరిస్ట్ /వర్క్ వీసా), వీసా జారీ చేసిన తేదీ, గడువు ముగిసే తేదీ, వీసా జారీ చేసిన అథారిటీ పేరు తెలియజేయాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు కావడానికి గల కారణం ఉద్యోగం కోసమా, విద్య కోసమా, లేదా ఇతర కారణాలా వివరించాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు అయిన తేదీ పేర్కొనాలి. దరఖాస్తుదారు ఈ విధంగా డిక్లరేషన్ (వాంగ్మూలం) ఇవ్వాలి ‘నాకు తెలిసినంతవరకు ఈ దరఖాస్తులో పేర్కొన్న వివరాలు నిజమైనవి. నేను భారత పౌరుడిని. నేను ఇతర దేశం పౌరసత్వాన్ని కలిగిలేను. ఒకవేళ నేను విదేశీ పౌరసత్వం పొందినట్లయితే వెంటనే భారత రాయబార కార్యాలయానికి తెలియజేస్తాను. ఒకవేళ నేను భారతదేశానికి పూర్తిగా తిరిగి వచ్చి సాధారణ నివాసిగా మారినట్లయితే మీకు వెంటనే తెలియజేయగలను. ఓటరు నమోదు కోసం ఇతర నియోజకవర్గాలలో దరఖాస్తు చేసుకోలేదు. ఇది వరకు నాకు ఓటరు గుర్తింపు కార్డు ఉన్నట్లయితే దానిని మీకు వాపస్ చేస్తాను. తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950 సెక్షన్ 31 ప్రకారం నేను శిక్షార్హుడిని’. బీఎల్ఓ విచారణ దరఖాస్తు చేసిన తర్వాత బూత్ లెవల్ అధికారి (బీఎల్ఓ) భారతదేశంలోని చిరునామాలో బంధువులను విచారిస్తారు. ఎలాంటి అభ్యంతరాలూ లేకపోతే ఏడు రోజుల్లో ఓటరుగా నమోదు చేస్తారు. ఏదైనా తేడా వస్తే దరఖాస్తుదారు నివసిస్తున్న దేశంలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిస్తారు. మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించారు ప్రవాస భారతీయులను ఓటర్లుగా ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించింది. మేము మా కోసమే కాదు దేశం కోసం కష్టపడుతున్నాం. మా వల్ల ఎంతో విదేశీ మారక ద్రవ్యం మన దేశానికి వచ్చి చేరుతుంది. ప్రవాస భారతీయులు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పార్లమెంట్ ఆమోదించడం ఎంతో సంతోషం కలిగించింది. – గద్దె శ్రీనివాస్, ఖతార్ (డిచ్పల్లి వాసి) ఓటు హక్కు కల్పించడం సంతోషం విదేశాల్లో ఉన్న ప్రవాసులందరికీ ఓటు హక్కు కల్పించాలన్న ఆలోచన మంచిది. అయితే ఓటును ఎలా వేయాలన్నదానిపై కూడా స్పష్టత అవసరం. టెక్నాలజీ ఎంతో అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్ ద్వారానైనా, ఇతర పద్ధతుల ద్వారానైనా ఓటును ప్రతీ ఒక్కరూ వినియోగించుకునే అవకాశం కల్పించాలి. –సిరికొండ నర్సింలు, మస్కట్ (గన్పూర్– ఎం. మాచారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా) 16 ఏళ్ల నుంచి ఓటు హక్కు వినియోగించుకో లేదు నేను 16 ఏళ్ల నుంచి గల్ఫ్‌కు వెళుతున్నాను అప్పటి నుంచి ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నాను. రెండేళ్లకు ఒకసారి ఇంటికి వచ్చి వెళుతున్నా మేము వచ్చిన సమయంలో ఎన్నికలు లేక పోవడంతో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేదు. పరోక్ష పద్ధతిలోనైనా మేము ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం దక్కనుంది. – శ్రీనివాస్ గుప్తా, బహ్రెయిన్ (నిజామాబాద్ జిల్లా) హక్కులు సాధించుకోవడానికి మంచి అవకాశం ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్ వల్ల తమ హక్కులను సాధించుకోవడానికి అవకాశం లభించింది. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారి గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మాకు ఓటు హక్కు లభించడంతో మా హక్కులను రాజకీయ పార్టీలు గుర్తించే అవకాశం ఉంది. ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్ ఆహ్వానించదగిన పరిణామం. – మహ్మద్ యూసుఫ్ అలీ, అధ్యక్షుడు తెలుగు అసోషియేషన్ ఆఫ్ జిద్దా, సౌదీ అరేబియా (కరీంనగర్ జిల్లా వాసి) ఓటింగ్‌లో పాల్గొనాలనే కల నిజమవుతున్నది స్వదేశంలో లేకున్నా ప్రతినిధి ద్వారా ఓటు వేసే అరుదైన అవకాశం రావడం సంతృప్తినిస్తుంది. ‘ప్రాగ్జీ ఓటింగ్’ అనే ప్రక్రియ ఒక వైవిధ్యమైన వర్ణమాల లాంటిది. మనం భారతీయులమైనందుకు గర్వించాలి. –అమ్రీనా ఖైసర్, జిద్దా, సౌదీ అరేబియా (హైదరాబాద్) రాజకీయాలను ప్రభావితం చేస్తారు పరాయి దేశంలో ఉన్న వారికి మన దేశంలో ఓటు వేసే అవకాశం కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం. గల్ఫ్ దేశాల్లో ఉంటూ మన దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్న ప్రవాసీయులకు రాజకీయంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం లభిస్తుంది. ప్రవాసీయులు అభ్యర్థుల కంటే.. పార్టీ మేనిఫెస్టోకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. – జువ్వాడి శ్రీనివాస్‌రావు, ఉమల్కోయిల్ (నర్సింగాపూర్, సిరిసిల్ల జిల్లా) ఓటర్లలో చైతన్యం వస్తే మేలు.. తెలంగాణ జిల్లాల్లో చాలా మంది ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఇది సరి కాదు.. ఓటర్లలో చైతన్యం వస్తేనే సమాజానికి మేలు జరుగుతుంది. అబుదాబీలో ఉంటున్న ప్రవాసీ శంషీర్ సుప్రీంకోర్టులో చేసిన పోరాట ఫలితంగానే ప్రవాసీయులకు ఓటు హక్కు లభించిందని భావిస్తున్నాను. ఓటు హక్కు కల్పించడం మంచిదే. సంక్షేమ పథకాలు దూరమవుతాయనే భయంతో ఓటర్లుగా నమోదు కావడం లేదు. దీనిపై చైతన్య పరుస్తాం. – సలాఉద్దీన్, షార్జా (జగిత్యాల) ఓటింగ్‌కు అవకాశం వల్ల గల్ఫ్ కార్మికులకు ప్రయోజనం ప్రవాస భారతీయులకు ఓటింగ్‌కు అవకాశం కల్పించడం వల్ల గల్ఫ్ కార్మికులకే ఎక్కువ ప్రయోజనం కలుగనుంది. గల్ఫ్ మినహా ఇతర దేశాల్లో ఉంటున్న వారికి ఆ దేశ పౌరసత్వం లభించే అవకాశం ఉంది. గల్ఫ్ కార్మికులకు మాత్రం గల్ఫ్ పౌరసత్వం ఎప్పటికీ లభించదు. బిల్లు ఆమోదం వల్ల గల్ఫ్ కార్మికులకు లాభమే. – ముత్యాల వినయ్‌కుమార్, కువైట్ (హైదరాబాద్ వాసి) ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం.. గల్ఫ్ దేశాల్లో ఉండే వారికి ఇది మంచి అవకాశం. ఎన్నో ఏళ్లుగా వివిధ దేశాల్లో ఉన్న వారు ఓటు హక్కుకు దూరమయ్యారు. ఇప్పుడు తొలిసారిగా అవకాశం రావడం స్వాగతించాల్సిన విషయం. దీనిపై వలస జీవులను చైతన్య పరిచి ఎక్కువ మంది ఓటు వేసే విధంగా చూస్తాం. – వంశీగౌడ్, గల్ఫ్ కార్మికుల ఆహ్వాన వేదిక ఉపాధ్యక్షుడు, దుబాయి (ఆర్మూర్) మార్గదర్శకాలు రాగానే అమలు చేస్తాం... భారతీయులకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశంపై పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన విషయం తెలుసు. కానీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మార్గదర్శకాలు ఇంకా అందలేదు. ప్రవాస భారతీయులు ఎవరైనా ఓటు హక్కు కోసం వస్తే ఫాం 6(ఏ)ని పూరించి హక్కును కల్పిస్తున్నాం. మార్గదర్శకాలు రాగానే వాటిని అమలు చేస్తాం. – వినోద్‌కుమార్, ఆర్డీఓ నిజామాబాద్ -
‘ఎల్లం’ రాక కోసం..
దుబ్బాకటౌన్ : అసలే నిరుపేద కుటుం బం.. దీంతో పుట్టి పెరిగిన ఊళ్లో పని లేక.. కుటుంబాన్ని పోషించుకునేందుకు భార్యపిల్లలను వదిలి గల్ఫ్ దేశం వెళ్లిన దుబ్బాకకు చెందిన చింతకింది ఎల్లం(50) తీవ్ర అస్వస్థతకు గురై ఈనెల 14న అక్కడే మృతిచెందారు. 17 సంవత్సరాలుగా సౌదీలో పనిచేస్తున్న ఆయన 8 నెలల కిత్రం స్వగ్రామానికి వచ్చి వెళ్లారు. ఇదిలా ఉండగా, ఎల్లం సౌదీలోని ఓ కంపెనీలో గతంలో జేసీబీ డ్రైవర్‌గా.. ప్రస్తుతం కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో 5 రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై కింద పడిపోయారు. దీంతో కంపెనీ యజమాని, తోటి కార్మికులు ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, ఎల్లం తలలో రక్తం గడ్డకట్టి స్పృహ తప్పిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10 గంటల(ఆగష్టు 14)కు ఎల్లం మృతిచెందారు. దీంతో సౌదీలోనే మరో చోట పనిచేస్తున్న ఎల్లం కుమారుడు నర్సింలుకు సమాచారం అందించడంతో ఆయన అక్కడకు చేరుకొని.. దుబ్బాకలో ఉంటున్న కుటుంబ సభ్యులకు విషయం చేరవేశాడు. మంచిగానే ఉన్నాడనుకున్నాం.. సౌదీలో ఎల్లం చనిపోయాడన్న వార్త తెలియడంతో దుబ్బాకలో ఉన్న కుటుంబసభ్యులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. మంగళవారం ఉదయం వీడియోకాల్‌లో మాట్లాడామని.. అప్పుడు మంచిగానే ఉన్నానని ఎల్లం చెప్పాడని.. ఇంతలోనే మృతిచెందాడన్న వార్త వచ్చిందని కంటతడి పెట్టారు. ఇదిలా ఉండగా, ఎల్లం మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎల్లం మృతి వార్త తెలుసుకొని ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే రామలింగారెడ్డితో పాటు నాయకులు ఓదార్చారు. ఎల్లంకు భార్యలు విజయ, ఎల్లవ్వతో పాటు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 10 వేల రియల్స్ అవసరం మృతదేహాన్ని ఇంటికి తీసుకురావాలంటే 10 వేల రియల్స్ ఖర్చు అవుతుందని సౌదీ అధికారులు చెప్పారని ఎల్లం కుమారుడు నర్సిలు తెలిపారు. తన తండ్రి పని చేసిన కంపెనీ యజమానిని అడిగితే అంత డబ్బు లేదని చెప్పాడని నర్సింలు ఫోన్లో ‘సాక్షి’కి వివరించారు. ఇండియన్ ఎంబసీ అధికారులను ఈ విషయమై కలుస్తానని చెప్పారు. మృతదేహం తీసుకొచ్చేందుకు చర్యలు సౌదీలో మరణించిన ఎల్లం మృతదేహాన్ని దుబ్బాకకు తెప్పించేందకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో మాట్లాడి.. వెంటనే చర్యలు తీసుకుంటానని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఎల్లం బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లి.. అక్కడే మృతిచెందడం బాధాకరమన్నారు. -
సౌదీలో దుబ్బాక వాసి మృతి
దుబ్బాక టౌన్: ఊళ్లో ఉపాధి లేక బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట పట్టిన ఓ కార్మికుడు అనారోగ్యం తో మృతిచెందాడు. దుబ్బాక పట్టణానికి చెందిన చింతకింది ఎల్లం (50) బతుకు దెరువు కోసం సౌదీకి వెళ్లి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 17 ఏళ్లుగా సౌదీలో పనిచేస్తున్నాడు. ఐదు రోజుల క్రితం ఎల్లం తీవ్ర అస్వస్థతకు గురవడంతో తోటి కార్మికులు ఆసుపత్రిలో చేర్చారు. ఎల్లంకు తలలో రక్తం గడ్డకట్టిపోయి స్పృహ తప్పి పడిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. దీంతో సౌదీలోనే మరో ప్రాంతంలో పనిచేస్తున్న ఎల్లం కుమారుడు నర్సింహులుకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు పది వేల రియాల్స్ కావాలని.. తన వద్ద అంత డబ్బు లేదని నర్సింహులు వాపోయాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు తమకు సహాయం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లతో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు.