మా అమ్మను స్వదేశానికి రప్పించరూ ! | Daughter Request For Her Mother Return to India From Gulf | Sakshi
Sakshi News home page

మా అమ్మను స్వదేశానికి రప్పించరూ ప్లీజ్‌!

Published Thu, Feb 6 2020 9:17 AM | Last Updated on Thu, Feb 6 2020 9:17 AM

Daughter Request For Her Mother Return to India From Gulf - Sakshi

కువైట్‌ ఎయిర్‌పోర్టులో రాణి (ఫైల్‌), తన తల్లిని స్వదేశానికి రప్పించాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సుకన్య(ఫైల్‌ )

బతుకుదెరువు కోసం, నాలుగు రాళ్లు సంపాదించుకుని కుటుంబానికి ఆధారమవుదామని గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన జిల్లా వాసుల కలలు కల్లవుతున్నాయి. అక్కడ పనిచేసే ఇళ్లల్లో చిత్రహింసలకు గురై నరకం చవిచూస్తున్నారు. ఏజెంట్ల మోసాలకు తాము బలైపోతున్నామని గ్రహించేసరికి జీవచ్ఛవాలై పోతున్న దయనీయమైన పరిస్థితి. మరికొందరు ప్రాణాలే కోల్పోయి  శవాలై మోసుకొస్తున్న దీనగాథలెన్నో!!

మదనపల్లె : గల్ఫ్‌ జీవితాలు ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. కన్నవారిని, కట్టుకున్నవారిని, బంధువులను దూరం చేస్తున్నాయి. పుట్టిన ఊర్లో బతుకుదెరువు లేక ఎడారి దేశాల బాట పట్టి కష్టాల్లో ఇరుకున్న వారి కన్నీటిగాథలకు కొదువ లేదు. మొన్న రాణి, నిన్న మల్లిక.. రేపు మరెవరో.? రుణాల ఊబిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సగటుజీవుల కష్టాలే నకిలీ ఏజెంట్లకు కల్పతరువుగా మారుతున్నాయి. కష్టాల సుడిగుండం నుంచి కుటుంబాన్ని గట్టెక్కించాలన్న ఆశలు అనధికార ఏజెంట్ల చెరలో సమాధి అవుతున్నాయి. అందమైన భవితను ఊహించుకుంటూ ఎన్నో ఆకాంక్షలతో పరాయిగడ్డపై కాలుమోపిన క్షణం నుంచే వారికి కష్టాలు మొదలవుతున్నాయి. పర్యాటక వీసా, పని, ఒప్పంద పత్రాలు లేకుండా అనధికారకంగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లి అక్కడ చిక్కుల్లో పడి, వాటి నుంచి బయటకు వచ్చే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. పలువురు జైళ్లలో మగ్గడమో లేదా అక్కడే మృత్యువాత పడటమో జరుగుతోంది.  పొట్టకూటి కోసం ఊళ్లు వదిలిన సొంతమనుషులు చిక్కి శల్యమై జీవచ్ఛవాలుగా వస్తుండటంతో కుటుంబ సభ్యుల శోకానికి అంతులేకుండా పోతోంది.

అనధికార ఏజెంట్ల వలలో..
గ్రామ, పట్టణ ప్రాంతాలకు చెందిన పలువురు నకిలీ ఏజెంట్లు కొంతమంది దళారుల సాయంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని, నిరుద్యోగులను గుర్తించి విదేశాలకు వెళితే రూ.లక్షలు సంపాదించవచ్చని నమ్మిస్తున్నారు. వీసా, విమాన చార్జీలు తదితర వాటికి వేలల్లో వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో గల్ఫ్‌ వెళ్లే మహిళలకు అక్కడ యజమానులు ఉచితంగానే వీసాలు జారీ చేస్తున్నారు. అక్కడే స్థిరపడిన వారు ఇక్కడ వారికి ఆ వీసాలను అమ్ముకుంటున్నారు. గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారికి చివరకి వెట్టిచాకిరీ వెతలే మిగులుతున్నాయి. అక్కడి షేక్‌లు సకాలంలో జీతాలు ఇవ్వకుండా, చాలీచాలని తిండి పెడుతూ దాష్టీకం చేస్తున్నారు.

మదనపల్లె ప్రాంతంలోనిగత సంఘటనలు
మదనపల్లె మండలం కొత్త ఇండ్లుకు చెందిన రాణి(50)ని కురబలకోటకు చెందిన ఇద్దరు ఏజెంట్లు సౌదీకి పంపించారు. 10 రోజుల వ్యవధిలోనే అక్కడి షేక్‌లు పెట్టే చిత్రహింసలకు తట్టుకోలేక ఆమె అక్కడే అనుమానాస్పదంగా చనిపోయింది.  నెల రోజుల తర్వాత  గల్ఫ్‌లోని ఇండియన్‌ ఎంబసీ సాయంతో ఆమె మృతదేహం ఇంటికి చేరింది.

నీరుగట్టుపల్లెకు చెందిన చేనేత కార్మికుడు రామిశెట్టి మంజునాథ భార్య హేమలత(25)ఇక్కడ చేనేత రంగం కుదేలు కావడం, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఇల్లు గడవడం కష్టంగా మారడంతో ఉపాధి కోసం సౌదీ వెళ్లింది. అక్కడ యజమానిక పెట్టే చిత్రహింసలకు తాళలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శవాన్ని ఇండియాకు పంపించేందుకు రూ1.50 లక్షలు చెల్లిస్తేనే పంపుతానని షేక్‌ చెప్పడంతో చివరకు చేసేదిలేక ఎదురు డబ్బులు చెల్లించి నెల తర్వాత మృతదేహాన్ని తెచ్చుకోవాల్సి వచ్చింది. షేక్‌లు తనను చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారని.. ఎలాగైనా తనను తీసుకువెళ్లాలని, లేకుంటే చనిపోయేలా ఉన్నానంటూ.. పట్టణానికి చెందిన ఓ మహిళ ఉదంతంపై పత్రికల్లో కథనాలు రావడంతో అప్పటి జిల్లా జడ్జి జయరాజ్‌ స్పందించి ఎంబసీతో మాట్లాడారు. ఆమెకు నాలుగు నెలల తర్వాత విముక్తి కల్పించేలా చేశారు.

విదేశాలకు వెళ్లాలంటే..
అనుమతి ఉన్న ఏజెంటు ద్వారానే విదేశాలకు వెళ్లాలి. అక్కడ యజమాని వద్ద చేయాల్సిన పని ఒప్పంద పత్రం తప్పనిసరిగా ఉండాలి. అలా వెళ్తే పనులు చేసుకునే సమయంలో ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనా చట్టపరంగా రక్షణ ఉంటుంది. యజమానులు ఇబ్బందులకు గురిచేసినా, వేతనాలు చెల్లించకున్నా వారిపై చట్టపరంగా చర్య తీసుకునే వీలుంటుంది.

శిక్షణ కోసం హోంకేప్‌..
పలువురు కార్మికులు ఎలాంటి శిక్షణ లేకుండానే విదేశాల్లో ఉద్యోగం కోసం వెళుతున్నా అక్కడ పనిపై అవగాహన లేక మళ్లీ తిరుగుముఖం పడుతున్నారు. ఏజెంట్లు ఫలానా పని అని చెపితే ఆ పనిపై ప్రత్యేక శిక్షణ పొందాలి. శిక్షణ పొంది విదేశాలకు వెళ్తే నష్టం ఉండదు. కార్మికులు కచ్చితంగా ఉపాధి పొందే రంగంలో శిక్షణ పొంది ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారికి శిక్షణ ఇచ్చేందుకు హోంకేప్‌(ఓవర్‌సీస్‌ మేన్‌పవర్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌) సంస్థను ఏర్పాటుచేసింది. జిల్లా ఉపాధి కార్యాలయంలో దుబాయ్, సౌదీ అరేబియా ఇతర దేశాల్లో ఉద్యోగాలకు ఉపాధి కార్యాలయం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.  వీసాలు పొందిన తరువాత అవి నకిలీవా లేక సరైనవా? అని నిర్ధారించుకోవడానికి వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి. రిజిస్టర్డ్‌ ఏజెంట్ల ద్వారానే వీసాల కోసం ప్రయత్నం చేయాలి.

ఉపాధికి వెళ్లి గుండెపోటుతో మృతి
తిరుపతి సమీపంలోని దామినేడులోని అర్బన్‌ గృహ సముదాయంలో ఉంటున్న బాలాజీ(51) 13 ఏళ్ల కిత్రం భార్యతో సహా బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లా డు. ఆర్థికంగా నాలుగు డబ్బులు వెనకేసుకున్నా విపరీతమైన పనిఒత్తిడితో అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స నిమి త్తం సొంత ఊరికి తిరిగివస్తూ జనవరి 30న గుండెపోటుతో విమానంలోనే మృతి చెందాడు. చెన్నై విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

మా అమ్మను స్వదేశానికి రప్పించరూ ప్లీజ్‌!
మూడున్నరేళ్ల క్రితం తన తల్లిని ఇద్దరు ఏజెంట్లు మాయమాటలు చెప్పి సౌదీకి పంపేశారని, ఆమెను స్వదేశానికి పిలిపించాలని పెద్దమండ్యం మండలం గోపిదిన్నెకు చెందిన సుకన్య ఆమె అవ్వ నరసమ్మ ఇటీవల మదనపల్లె డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. రెండేళ్లపాటు తమతో మాట్లాడుతూ వచ్చిన రాధమ్మ ఏడాదిగా డబ్బు పంపడం, ఫోన్‌లో మాట్లాడకపోవడంతో ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు. సౌదీకి పంపిన ఏజెంటును వెళ్లి ప్రశ్నిస్తే హీనంగా మాట్లాడుతున్నాడని వాపోయారు. దీంతో ఏమిచేయాలో తెలియనిస్థితిలో డీఎస్పీని ఆశ్రయించారు. పోలీసులు ఏజెంట్‌ నూర్‌ను స్టేషన్‌కు పిలిపించి నెలరోజుల్లో రాధమ్మ స్వగ్రామానికి వచ్చేలా చేయాలని లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఏజెంట్ల ఇంటి ముందు ఆందోళన
మదనపల్లెలోని బసినికొండకు చెందిన కె.మల్లిక(35)కు 13 ఏళ్ల క్రితం ఎస్టేట్‌కు చెందిన ఆనంద్‌తో వివాహమైంది. నాలుగేళ్లకే అతను మల్లికను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె ముదివేడులోని తండ్రి వద్ద ఉండేది. ఏడేళ్ల క్రితం కురబలకోటకు చెందిన ఏజెంట్లు మల్లికకు మాయమాటలు చెప్పి సౌదీకి పంపేశారు. మల్లిక కనిపించకుండా పోయిందని 2014లో  కుటుంబసభ్యులు ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థానికుల ద్వారా ముగ్గురు ఏజెంట్లు ఆమెను సౌదీకి పంపారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను స్వదేశానికి పిలిపించాలని కోరారు. వెళ్లినప్పటి నుంచి మల్లిక ఫోన్‌ చేయలేదని, ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌ 24న సౌదీ ఎయిర్‌పోర్టు నుంచి ఎవరో ఫోన్‌ చేసి ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైందని, ఆమె వద్ద మదనపల్లె చిరునామాతో పాటు ఇండియాకు వచ్చే టికెట్టు ఉందని చెప్పారు. దీంతో బెంగళూరు ఎయిర్‌పోర్టుకు పంపితే తాము వెళ్లి తెచ్చుకుంటామని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుడు వెళ్లిపోయిన మల్లిక డిసెంబర్‌ 25న నడవలేని స్థితిలో చిక్కి శల్యమై బెంగళూరుకు చేరుకుంది. కుటుంబసభ్యులు  జిల్లా ఆస్పత్రిలో చేర్పిస్తే వైద్యులు ఆమెను పరీక్షించి చాలా కాలంగా భోజనం తినకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురికావడం, జీర్ణవ్యవస్థ దెబ్బతిందని నిర్ధారించారు. తిరుపతిలో ట్రీట్‌మెంట్‌ అనంతరం స్వగ్రామానికి వచ్చిన మల్లిక జనవరి 13న కన్నుమూసింది. తనను విదేశాల్లో షేక్‌లకు అమ్మేసిన ఏజెంట్లు చివరకు తనకు రావాల్సిన డబ్బును కూడా తీసేసుకున్నారని మల్లిక చెప్పడంతో ఆమె మరణాంతరం ఏజెంట్లు ఇంటిముందు మృతదేహంతో ఆందోళన చేశారు. మల్లిక మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

నకిలీ ఏజెంట్లపై నిఘా
లైసెన్స్‌ ఉన్న ఏజెంట్ల ద్వారా మాత్రమే గల్ఫ్‌ దేశాలకు వెళ్లాలి. నకిలీ ఏజెంట్ల బారిన పడి అన్నివిధాలా నష్టపోకండి. నకిలీ ఏజెంట్ల వ్యవహారాలపై నిఘా పెట్టాం. బాధితుల కోసం నిత్యం భారత ఎంబసీ కార్యాలయ అధికారులతో సంప్రదిస్తున్నాం. విదేశాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉంటూ అన్ని పత్రాలు పరిశీలించుకోవాలి. ఏమైనా అనుమానాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి.– రవిమనోహరాచారి, డీఎస్పీ, మదనపల్లె

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement