fake agent
-
ఉండలేక.. తిరిగి రాలేక...
మోర్తాడ్ (బాల్కొండ): పొరుగు దేశాలతో వాణిజ్య వ్యాపార సంబంధాలను వృద్ధి చేయడానికి ఒమన్ ప్రభుత్వం విరివిగా జారీ చేసిన విజిట్ వీసాలను కొందరు దళారులు పక్కదారి పట్టించారు. ఒమన్ లో వ్యాపారం చేయడానికి విదేశీయులకు జారీ చేసిన విజిట్ వీసాలను నకిలీ ఏజెంట్లు నిరుద్యోగులకు అంటగట్టి సొమ్ము చేసుకున్నారు. ఫలితంగా ఒమన్‌కు విజిట్ వీసాపై వెళ్లిన వందలాది మంది తెలంగాణ వలస కార్మికులు ఆ దేశంలో ఇరుక్కుపోయారు. విజిట్ వీసా గడువు ముగిసిపోవడంతో అక్కడ ఉండలేక, ఇంటికి చేరాలంటే రూ.లక్ష చొప్పున జరిమానా చెల్లించలేక వలస కార్మికులు దిక్కుతోచని స్థితిలో మగ్గుతున్నారు. కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఒమన్ విదేశీ వ్యాపారులను ఆహ్వానించి పెట్టుబడులు పెట్టేలా చర్యలు చేపట్టింది. ఇలా ఐదు నెలల కింద విజిట్ వీసాలను ఎక్కువగా జారీ చేసింది. ఒకసారి జారీ చేసిన విజిట్ వీసాను రెండుమార్లు గడువు పొడిగించుకోవడానికి ఒమన్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి అవకాశాలు పొందాలనుకునే ఔత్సాహికులను నకిలీ ఏజెంట్లు ఆకర్షించారు. ఒమన్‌కు విజిట్ వీసాపై వెళ్లి వర్క్ వీసా పొందవచ్చని నమ్మించారు. 300 మంది తెలంగాణ వలస కార్మికులు ఉచితంగా జారీ చేసిన విజిట్ వీసాలను రూ.80 వేలకు ఒకటి చొప్పున విక్రయించి దాదాపు 300 మంది తెలంగాణ వలస కార్మికులను తరలించారు. విజిట్ వీసాలపై వచ్చినవారికి ఒమన్‌లోని కంపెనీలు పనులు ఇవ్వడానికి నిరాకరించాయి. ఒక నెల విజిట్ వీసా గడువు ముగిసిపోవడంతో మరో నెల రోజులకు పొడిగించుకుని ఉపాధి అవకాశాల కోసం కార్మికులు ప్రయత్నించారు. కంపెనీలలో ఉన్నవారికే సరైన పని లేకపోవడంతో విజిట్ వీసాలపై వచ్చిన వారికి పనులు ఇచ్చే అవకాశం అసలే లేకపోయింది. కొందరు వలస కార్మికులు తమ చేతిలో డబ్బు లేకపోవడంతో వీసా గడువు పొడిగించుకోలేక రహస్యంగా అక్కడే ఉండిపోయారు. పార్కులు, స్నేహితుల గదుల్లో కార్మికులు తలదాచుకుంటున్నారు. వీసా రెన్యూవల్, జరిమానా చెల్లించేందుకు డబ్బుల్లేకపోవడంతో వలస కార్మికులు స్వదేశం తిరిగి రావడానికి అవస్థలు పడుతున్నారు. వీసా ఉంటేనే రావాలి: గుండేటి గణేశ్ ఒమన్‌లోని ఇండియన్ సోషల్ క్లబ్ ప్రతినిధి గుండేటి గణేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ దేశానికి విజిట్ వీసాపై వచ్చిన వారికి పనులు ఇవ్వడం లేదన్నారు. కంపెనీ వీసా ఉంటేనే ఒమన్‌కు రావాలని సూచించారు. చిక్కుకుపోయిన వలస కార్మికులను మాతృభూమికి పంపించడానికి ఎంబసీ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని గణేశ్ వివరించారు. -
మా అమ్మను స్వదేశానికి రప్పించరూ !
బతుకుదెరువు కోసం, నాలుగు రాళ్లు సంపాదించుకుని కుటుంబానికి ఆధారమవుదామని గల్ఫ్ దేశాలకు వెళ్లిన జిల్లా వాసుల కలలు కల్లవుతున్నాయి. అక్కడ పనిచేసే ఇళ్లల్లో చిత్రహింసలకు గురై నరకం చవిచూస్తున్నారు. ఏజెంట్ల మోసాలకు తాము బలైపోతున్నామని గ్రహించేసరికి జీవచ్ఛవాలై పోతున్న దయనీయమైన పరిస్థితి. మరికొందరు ప్రాణాలే కోల్పోయి శవాలై మోసుకొస్తున్న దీనగాథలెన్నో!! మదనపల్లె : గల్ఫ్ జీవితాలు ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. కన్నవారిని, కట్టుకున్నవారిని, బంధువులను దూరం చేస్తున్నాయి. పుట్టిన ఊర్లో బతుకుదెరువు లేక ఎడారి దేశాల బాట పట్టి కష్టాల్లో ఇరుకున్న వారి కన్నీటిగాథలకు కొదువ లేదు. మొన్న రాణి, నిన్న మల్లిక.. రేపు మరెవరో.? రుణాల ఊబిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సగటుజీవుల కష్టాలే నకిలీ ఏజెంట్లకు కల్పతరువుగా మారుతున్నాయి. కష్టాల సుడిగుండం నుంచి కుటుంబాన్ని గట్టెక్కించాలన్న ఆశలు అనధికార ఏజెంట్ల చెరలో సమాధి అవుతున్నాయి. అందమైన భవితను ఊహించుకుంటూ ఎన్నో ఆకాంక్షలతో పరాయిగడ్డపై కాలుమోపిన క్షణం నుంచే వారికి కష్టాలు మొదలవుతున్నాయి. పర్యాటక వీసా, పని, ఒప్పంద పత్రాలు లేకుండా అనధికారకంగా గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ చిక్కుల్లో పడి, వాటి నుంచి బయటకు వచ్చే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. పలువురు జైళ్లలో మగ్గడమో లేదా అక్కడే మృత్యువాత పడటమో జరుగుతోంది. పొట్టకూటి కోసం ఊళ్లు వదిలిన సొంతమనుషులు చిక్కి శల్యమై జీవచ్ఛవాలుగా వస్తుండటంతో కుటుంబ సభ్యుల శోకానికి అంతులేకుండా పోతోంది. అనధికార ఏజెంట్ల వలలో.. గ్రామ, పట్టణ ప్రాంతాలకు చెందిన పలువురు నకిలీ ఏజెంట్లు కొంతమంది దళారుల సాయంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని, నిరుద్యోగులను గుర్తించి విదేశాలకు వెళితే రూ.లక్షలు సంపాదించవచ్చని నమ్మిస్తున్నారు. వీసా, విమాన చార్జీలు తదితర వాటికి వేలల్లో వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో గల్ఫ్ వెళ్లే మహిళలకు అక్కడ యజమానులు ఉచితంగానే వీసాలు జారీ చేస్తున్నారు. అక్కడే స్థిరపడిన వారు ఇక్కడ వారికి ఆ వీసాలను అమ్ముకుంటున్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికి చివరకి వెట్టిచాకిరీ వెతలే మిగులుతున్నాయి. అక్కడి షేక్‌లు సకాలంలో జీతాలు ఇవ్వకుండా, చాలీచాలని తిండి పెడుతూ దాష్టీకం చేస్తున్నారు. మదనపల్లె ప్రాంతంలోనిగత సంఘటనలు మదనపల్లె మండలం కొత్త ఇండ్లుకు చెందిన రాణి(50)ని కురబలకోటకు చెందిన ఇద్దరు ఏజెంట్లు సౌదీకి పంపించారు. 10 రోజుల వ్యవధిలోనే అక్కడి షేక్‌లు పెట్టే చిత్రహింసలకు తట్టుకోలేక ఆమె అక్కడే అనుమానాస్పదంగా చనిపోయింది. నెల రోజుల తర్వాత గల్ఫ్‌లోని ఇండియన్ ఎంబసీ సాయంతో ఆమె మృతదేహం ఇంటికి చేరింది. నీరుగట్టుపల్లెకు చెందిన చేనేత కార్మికుడు రామిశెట్టి మంజునాథ భార్య హేమలత(25)ఇక్కడ చేనేత రంగం కుదేలు కావడం, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఇల్లు గడవడం కష్టంగా మారడంతో ఉపాధి కోసం సౌదీ వెళ్లింది. అక్కడ యజమానిక పెట్టే చిత్రహింసలకు తాళలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శవాన్ని ఇండియాకు పంపించేందుకు రూ1.50 లక్షలు చెల్లిస్తేనే పంపుతానని షేక్ చెప్పడంతో చివరకు చేసేదిలేక ఎదురు డబ్బులు చెల్లించి నెల తర్వాత మృతదేహాన్ని తెచ్చుకోవాల్సి వచ్చింది. షేక్‌లు తనను చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారని.. ఎలాగైనా తనను తీసుకువెళ్లాలని, లేకుంటే చనిపోయేలా ఉన్నానంటూ.. పట్టణానికి చెందిన ఓ మహిళ ఉదంతంపై పత్రికల్లో కథనాలు రావడంతో అప్పటి జిల్లా జడ్జి జయరాజ్ స్పందించి ఎంబసీతో మాట్లాడారు. ఆమెకు నాలుగు నెలల తర్వాత విముక్తి కల్పించేలా చేశారు. విదేశాలకు వెళ్లాలంటే.. అనుమతి ఉన్న ఏజెంటు ద్వారానే విదేశాలకు వెళ్లాలి. అక్కడ యజమాని వద్ద చేయాల్సిన పని ఒప్పంద పత్రం తప్పనిసరిగా ఉండాలి. అలా వెళ్తే పనులు చేసుకునే సమయంలో ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనా చట్టపరంగా రక్షణ ఉంటుంది. యజమానులు ఇబ్బందులకు గురిచేసినా, వేతనాలు చెల్లించకున్నా వారిపై చట్టపరంగా చర్య తీసుకునే వీలుంటుంది. శిక్షణ కోసం హోంకేప్.. పలువురు కార్మికులు ఎలాంటి శిక్షణ లేకుండానే విదేశాల్లో ఉద్యోగం కోసం వెళుతున్నా అక్కడ పనిపై అవగాహన లేక మళ్లీ తిరుగుముఖం పడుతున్నారు. ఏజెంట్లు ఫలానా పని అని చెపితే ఆ పనిపై ప్రత్యేక శిక్షణ పొందాలి. శిక్షణ పొంది విదేశాలకు వెళ్తే నష్టం ఉండదు. కార్మికులు కచ్చితంగా ఉపాధి పొందే రంగంలో శిక్షణ పొంది ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి శిక్షణ ఇచ్చేందుకు హోంకేప్(ఓవర్సీస్ మేన్‌పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) సంస్థను ఏర్పాటుచేసింది. జిల్లా ఉపాధి కార్యాలయంలో దుబాయ్, సౌదీ అరేబియా ఇతర దేశాల్లో ఉద్యోగాలకు ఉపాధి కార్యాలయం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. వీసాలు పొందిన తరువాత అవి నకిలీవా లేక సరైనవా? అని నిర్ధారించుకోవడానికి వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే వీసాల కోసం ప్రయత్నం చేయాలి. ఉపాధికి వెళ్లి గుండెపోటుతో మృతి తిరుపతి సమీపంలోని దామినేడులోని అర్బన్ గృహ సముదాయంలో ఉంటున్న బాలాజీ(51) 13 ఏళ్ల కిత్రం భార్యతో సహా బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లా డు. ఆర్థికంగా నాలుగు డబ్బులు వెనకేసుకున్నా విపరీతమైన పనిఒత్తిడితో అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స నిమి త్తం సొంత ఊరికి తిరిగివస్తూ జనవరి 30న గుండెపోటుతో విమానంలోనే మృతి చెందాడు. చెన్నై విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మా అమ్మను స్వదేశానికి రప్పించరూ ప్లీజ్! మూడున్నరేళ్ల క్రితం తన తల్లిని ఇద్దరు ఏజెంట్లు మాయమాటలు చెప్పి సౌదీకి పంపేశారని, ఆమెను స్వదేశానికి పిలిపించాలని పెద్దమండ్యం మండలం గోపిదిన్నెకు చెందిన సుకన్య ఆమె అవ్వ నరసమ్మ ఇటీవల మదనపల్లె డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. రెండేళ్లపాటు తమతో మాట్లాడుతూ వచ్చిన రాధమ్మ ఏడాదిగా డబ్బు పంపడం, ఫోన్లో మాట్లాడకపోవడంతో ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు. సౌదీకి పంపిన ఏజెంటును వెళ్లి ప్రశ్నిస్తే హీనంగా మాట్లాడుతున్నాడని వాపోయారు. దీంతో ఏమిచేయాలో తెలియనిస్థితిలో డీఎస్పీని ఆశ్రయించారు. పోలీసులు ఏజెంట్ నూర్‌ను స్టేషన్‌కు పిలిపించి నెలరోజుల్లో రాధమ్మ స్వగ్రామానికి వచ్చేలా చేయాలని లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏజెంట్ల ఇంటి ముందు ఆందోళన మదనపల్లెలోని బసినికొండకు చెందిన కె.మల్లిక(35)కు 13 ఏళ్ల క్రితం ఎస్టేట్‌కు చెందిన ఆనంద్‌తో వివాహమైంది. నాలుగేళ్లకే అతను మల్లికను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె ముదివేడులోని తండ్రి వద్ద ఉండేది. ఏడేళ్ల క్రితం కురబలకోటకు చెందిన ఏజెంట్లు మల్లికకు మాయమాటలు చెప్పి సౌదీకి పంపేశారు. మల్లిక కనిపించకుండా పోయిందని 2014లో కుటుంబసభ్యులు ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థానికుల ద్వారా ముగ్గురు ఏజెంట్లు ఆమెను సౌదీకి పంపారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను స్వదేశానికి పిలిపించాలని కోరారు. వెళ్లినప్పటి నుంచి మల్లిక ఫోన్ చేయలేదని, ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 24న సౌదీ ఎయిర్‌పోర్టు నుంచి ఎవరో ఫోన్ చేసి ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైందని, ఆమె వద్ద మదనపల్లె చిరునామాతో పాటు ఇండియాకు వచ్చే టికెట్టు ఉందని చెప్పారు. దీంతో బెంగళూరు ఎయిర్‌పోర్టుకు పంపితే తాము వెళ్లి తెచ్చుకుంటామని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుడు వెళ్లిపోయిన మల్లిక డిసెంబర్ 25న నడవలేని స్థితిలో చిక్కి శల్యమై బెంగళూరుకు చేరుకుంది. కుటుంబసభ్యులు జిల్లా ఆస్పత్రిలో చేర్పిస్తే వైద్యులు ఆమెను పరీక్షించి చాలా కాలంగా భోజనం తినకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురికావడం, జీర్ణవ్యవస్థ దెబ్బతిందని నిర్ధారించారు. తిరుపతిలో ట్రీట్మెంట్ అనంతరం స్వగ్రామానికి వచ్చిన మల్లిక జనవరి 13న కన్నుమూసింది. తనను విదేశాల్లో షేక్‌లకు అమ్మేసిన ఏజెంట్లు చివరకు తనకు రావాల్సిన డబ్బును కూడా తీసేసుకున్నారని మల్లిక చెప్పడంతో ఆమె మరణాంతరం ఏజెంట్లు ఇంటిముందు మృతదేహంతో ఆందోళన చేశారు. మల్లిక మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ ఏజెంట్లపై నిఘా లైసెన్స్ ఉన్న ఏజెంట్ల ద్వారా మాత్రమే గల్ఫ్ దేశాలకు వెళ్లాలి. నకిలీ ఏజెంట్ల బారిన పడి అన్నివిధాలా నష్టపోకండి. నకిలీ ఏజెంట్ల వ్యవహారాలపై నిఘా పెట్టాం. బాధితుల కోసం నిత్యం భారత ఎంబసీ కార్యాలయ అధికారులతో సంప్రదిస్తున్నాం. విదేశాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉంటూ అన్ని పత్రాలు పరిశీలించుకోవాలి. ఏమైనా అనుమానాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి.– రవిమనోహరాచారి, డీఎస్పీ, మదనపల్లె -
దుబాయిలో కుల్కచర్ల మహిళ కష్టాలు
సాక్షి, కుల్కచర్ల: బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లిన ఓ మహిళ తను అక్కడ తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నానని, ఇక్కడి నుంచి తీసుకెళ్లకపోతే చనిపోతానంటూ సోషల్ మీడియా లో పోస్టు చేయడం కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రజాప్రతినిధులు బాధితురాలి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. వివరాలు.. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన సయ్యద్ మౌలానా కూతురు సయ్యద్ సమీనా బేగంను హైదరాబాద్‌కు చెందిన ఆటోడ్రైవర్‌కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. భర్త సక్రమంగా చూసుకోకపోవడంతో తిరిగి పుట్టిల్లు కుల్కచర్లకు వచ్చింది. కొడుకు ఆరోగ్యం బాగలేదని, డబ్బులు కావాలని వైద్యులు చెప్పడంతో స్థానికంగా ఉపాధి లేకపోవడంతో ఆమె తన కు మారుడిని సోదరి వద్ద ఉంచింది. ఓ నకిలీ ఏజెంట్ ద్వారా మూడు నెలల క్రితం దుబాయికి వెళ్లింది. అక్కడ ఓ షేక్ ఇంట్లో పనికి కుదిరింది. కొన్ని రోజులుగా షేక్ కుటుంబీకులు రేయింబవళ్లు పనిచేస్తుండడంతోపాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో ఆమె షేక్ ఇంటి నుంచి పారిపోయి వేరే వారి దగ్గరకు వెళ్లింది. అక్కడి నుంచి వాట్సప్ ద్వారా వీడియో సందేశాన్ని కుటుంబీకులకు పంపింది. తనను ఇక్కడ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమైంది. తాను ఇక్కడ ఉండలేనని, ఇండియాకు తీసుకెళ్లాలని కోరింది. లేదంటే చనిపోతానని చెప్పింది. ఈ విషయం గురువారం కుల్కచర్ల మండలంలో సోషల్ మీడియాలో హల్చల్ అయింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.సమాచారం అందుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్‌రావు, కుల్కచర్ల సర్పంచ్ సౌమ్యా వెంకట్రామిరెడ్డి తదితరులు బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబీకులతో మాట్లాడారు. వారికి భరోసా చెప్పి కొంతమేర ఆర్థికసాయం అందించారు. ఈ విషయమై ఆయన కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరించారు. తప్పనిసరిగా బాధితురాలిని ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని ప్రహ్లాద్‌రావు తెలిపారు. -
గల్ఫ్ గాయం
గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోతున్న వలస జీవుల బాధలు చెప్పలేకుండా ఉన్నాయి. బోగస్ ఏజెంట్లు, నకిలీ వీసాలు, విజిట్ వీసాలను ముట్టజెప్పి కంపెనీ వీసాలుగా నమ్మిస్తే.. గంపెడాశతో గల్ఫ్ వెళ్లిన అనేక మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గల్ఫ్‌లో ఎంత మంది ఉంటారనే కచ్చితమైన గణాంకాలు ప్రభుత్వం వద్ద కూడా లేకపోగా, గల్ఫ్ బాధితుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 240 గ్రామాల నుంచి 60 వేల మందికి పైగా గల్ఫ్ బాట పట్టారు. జగిత్యాల, రాయికల్, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి, సారంగాపూర్, ధర్మపురి, గొల్లపల్లి, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, కోనరావుపేట, గంభీరావుపేట, చందుర్తి, కోహెడ, బెజ్జంకి, గన్నేరువరం, రామడుగు, ధర్మారం, వెల్గటూరు, జూలపల్లి, కమలాపూర్ తదితర మండలాల నుంచి వలస వెళ్లారు. సౌదీ అరేబియా, దుబాయ్, షార్జా, మస్కట్, ఒమాన్, కువైట్, ఖతర్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన మనోళ్ల గోస వర్ణణాతీతంగా మారింది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో నకిలీ ఏజెంట్ వ్యవస్థనే శాసిస్తోంది. విదేశాల్లో ఉన్న ఉద్యోగ నియామకాలు జరిపే కంపెనీలు విధిగా కేంద్ర విదేశాంగ శాఖ లైసెన్స్ పొంది ఉండాలి. కేంద్రం వద్ద రూ.50 లక్షలు డిపాజిట్ చేయాలి. వారికి అనుమతించిన పరిధిలోనే నియామకాలు జరపాలి. ఉద్యోగ వివరాలతో పత్రిక ప్రకటన ఇవ్వాలి. స్థానికులు, అధికారుల అనుమతి పొంది ఉండాలనే నిబంధనలు కేంద్ర ప్రభుత్వం పెట్టింది. వీటిని పాటించని కంపెనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తే వాళ్ల డిపాజిట్ జప్తు చేస్తుంది. లైసెన్స్ రద్దవుతుంది. కానీ.. స్థానికంగా పోలీసు, రెవెన్యూ విభాగాలు బహిరంగంగా నకిలీ ఏజెంట్లు నిర్వహించే ఇంటర్వూ్యలు, జారీ చేసే ప్రకటనలపై కఠినంగా వ్యహరించటం లేదు. కాగా.. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తామని, పాస్‌పోర్టులు మొదలు వీసాలు, టికెట్ల సేవలందించే పేరుతో ఏర్పాటు చేసిన సంస్థల్లో బోగసే ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల వరకు ఇలాంటి ఏజెన్సీలు ఉంటే.. అందులో రెండు ప్రభుత్వ కంపెనీలను కలుపుకుని మొత్తం 31 కంపెనీలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన లైసెన్స్‌లు ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (ఓంకాం), తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నెలకొల్పిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టాంకాం)తోపాటు 29 కంపెనీలకు మాత్రమే ఈ లైసెన్స్ ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేవలం ఐదింటికీ మాత్రమే అనుమతి ఉండగా.. ఉపాధి వేటలో అలసిపోయిన వలస జీవులు బోగస్ ఏజెంట్ల బారిన పడి మోసపోతున్నారు. చిన్నచిన్న కంపెనీలు పంపే వీసాలు, విజిట్ వీసాలు చూపించి ఏజెంట్లు అమాయకులు ఇక్కడి యువకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు చేతిలో పడ్డాక మాయమాటలు చెప్పి సాగనంపుతున్నారు. తీరా అక్కడికి వెళ్లాక వీసాలు చెల్లక.. విజిట్ వీసాలపై వెళ్లిన వారికి పని దొరక్క.. ఇక్కడ ఏజెంట్లు చెప్పిన జీతానికి అక్కడ పొంతనలేక వలస జీవులు చిత్తవుతున్నారు. తిరిగి సొంత దేశం తిరిగి రాలేక అవస్థలు పడుతున్నారు. నామమాత్రంగా టామ్‌కాం పాత్ర..పత్తాలేని ఎన్ఆర్ఐ పాలసీ.. రెండేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్‌కాం పాత్ర నామమాత్రంగా మారింది. నకిలీ ఏజెంట్లకు అడ్డుకట్ట వేయటంతోపాటు గల్ఫ్‌లో ఉన్న ఉపాధి అవకాశాలకు తెలంగాణలోని యువతను ఎంపిక చేసేందుకు ఉద్దేశించిన ఈ సంస్థ క్రియాశీల పాత్ర పోషించడం లేదనే చెప్పొచ్చు. గల్ఫ్‌లో ఉన్న కంపెనీలతో ఒప్పందం చేసుకొని.. తెలంగాణలో ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే పాత్రను పోషించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఉన్న ఉపాధి కల్పన కేంద్రాలు, ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతకు టామ్‌కాం ఆధ్వర్యంలో ఇంటర్వూ్యలు నిర్వహించి వీసాలు ఇప్పించాల్సిన బాధ్యతను విస్మరించింది. దాదాపు మూడు వేల మంది యువకులు ఇప్పటికే టామ్కాంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్తుండగా, టామ్‌కాం క్రియాశీలంగా వ్యవహరించకపోవటంతో నకిలీ ఏజెంట్ల బారిన పడి అనేక మంది మోసపోతున్నారు. గడిచిన రెండేళ్లలో టామ్‌కాం ద్వారా రెండు వందల మందిని గల్ఫ్‌కు పంపించినట్లు చెబుతున్నప్పటికీ.. వీరిని కూడా వయా ప్రైవేటు ఏజెన్సీల ద్వారానే పంపించినట్లు ఆరోపణలున్నాయి. ఇదిలా వుంటే రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయటంతోపాటు మంత్రి కేటీఆర్‌కు అప్పగించడంతో గల్ఫ్‌లో ఉన్న పూర్వ కరీంనగర్ వాసుల్లో ఆశలు చిగురించాయి. నకిలీ ఏజెంట్లను అరికట్టడంతోపాటు మృతదేహాల తరలింపు, పెన్షన్లు, ఎక్స్‌గ్రేషియా తదితర అంశాలతో ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ పాలసీని రూపొందిస్తామని ప్రకటించారు. 2016 జూన్‌లో గల్ఫ్‌లో తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమానికి పాటుపడే సంస్థలు, వివిధ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీ ముసాయిదా తయారీకి ప్రత్యేకంగా సదస్సు నిర్వహించారు. ఇప్పటికీ ఈ పాలసీని ప్రభుత్వం ప్రకటించకపోగా.. సదస్సులో వివిధ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు అమలుకు నోచుకోలేదు. తగ్గని గల్ఫ్ చావులు.. ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఆశల సౌధంలో గల్ఫ్ బాట పడుతున్న పలువురు అక్కడే మృత్యువాతపడుతున్నారు. రోడ్డు ప్రమాదంలో కొందరు మృతి చెందితే.. అక్కడ చేసే పని సరిగా లేక, జీతం సరిగా రాక గుండె పోటుకు గురవ్వడం.. లేకుంటే అనారో గ్యం పాలవ్వడంతో చనిపోతున్నారు. దీం తో ఇంటి పెద్దను కోల్పోయి కుటుంబాలు దిక్కుతోచని స్థితి లో పడుతున్నాయి. గల్ఫ్‌కు వెళ్లే సమయంలో చేసిన అప్పులు తీర్చలేక.. పిల్లల్ని సాకలేక నానా యాతన అనుభవిస్తున్నారు. ఎట్లా బతికేది అంటూ దుఃఖసాగరంలో మునుగుతున్నారు. గడిచిన ఏడాదిలో సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోనే 54 మందికి పైగా మృతిచెం దారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గల్ఫ్ బాధితుల డిమాండ్లు ♦ రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. ♦ సచివాలయంలో ఉన్న ఎన్నారై సెల్‌ను అందరికీ అందుబాటులో ఉండేలా బయట ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రాల్లోనూ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి. ♦ విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ♦ విమానాశ్రయంలోనూ సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలి. ♦ తెల్లకార్డు ఉంటేనే.. మృతదేహాన్ని విమానాశ్రయం నుంచి వారి ఇళ్లకు చేర్చే నిబంధనను సడలించాలి. ♦ గల్ఫ్‌కు వలస వెళ్లిన వారి వివరాలు సేకరించా లి. అందులో వలసల కారణాలు, ఏయే జిల్లా ల నుంచి వలసలు ఉన్నాయో తెలుసుకోవాలి. ♦ కేరళ తరహాలో ప్రవాసీల రక్షణకు ప్రత్యేక ఇన్సూ్యరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలి. వలస కార్మికులకు పునరావాసం కల్పించాలి. వలస వెళ్లిన కార్మికుల పేర్లను రేషన్‌కార్డుల జాబితా నుంచి తొలగించవద్దు. ♦ వివిధ కారణాలతో విదేశాల్లోని జైళ్లలో మగ్గుతున్న వారి విడుదలకు కృషి చేయాలి. కేంద్రం చేయాల్సినవి.. ♦ ఎంబసీలలో తెలుగు అధికారులను నియమించాలి. ♦ హైదరాబాద్‌లో సౌదీ ఎంబసీని ఏర్పాటు చేయాలి. -
గల్ఫ్ నకిలీ ఏజెంట్ల అరెస్టు
మెట్పల్లి(కరీంనగర్): ముగ్గురు గల్ఫ్ నకిలీ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలో పలువురి నుంచి వేల రూపాయలు వసూలు చేసిన వీరిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వీరిని ఈ రోజు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 266 పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.