గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోతున్న వలస జీవుల బాధలు చెప్పలేకుండా ఉన్నాయి. బోగస్ ఏజెంట్లు, నకిలీ వీసాలు, విజిట్ వీసాలను ముట్టజెప్పి కంపెనీ వీసాలుగా నమ్మిస్తే.. గంపెడాశతో గల్ఫ్ వెళ్లిన అనేక మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గల్ఫ్‌లో ఎంత మంది ఉంటారనే కచ్చితమైన గణాంకాలు ప్రభుత్వం వద్ద కూడా లేకపోగా, గల్ఫ్ బాధితుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 240 గ్రామాల నుంచి 60 వేల మందికి పైగా గల్ఫ్ బాట పట్టారు. జగిత్యాల, రాయికల్, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి, సారంగాపూర్, ధర్మపురి, గొల్లపల్లి, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, కోనరావుపేట, గంభీరావుపేట, చందుర్తి, కోహెడ, బెజ్జంకి, గన్నేరువరం, రామడుగు, ధర్మారం, వెల్గటూరు, జూలపల్లి, కమలాపూర్ తదితర మండలాల నుంచి వలస వెళ్లారు. సౌదీ అరేబియా, దుబాయ్, షార్జా, మస్కట్, ఒమాన్, కువైట్, ఖతర్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన మనోళ్ల గోస వర్ణణాతీతంగా మారింది.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో నకిలీ ఏజెంట్ వ్యవస్థనే శాసిస్తోంది. విదేశాల్లో ఉన్న ఉద్యోగ నియామకాలు జరిపే కంపెనీలు విధిగా కేంద్ర విదేశాంగ శాఖ లైసెన్స్ పొంది ఉండాలి. కేంద్రం వద్ద రూ.50 లక్షలు డిపాజిట్ చేయాలి. వారికి అనుమతించిన పరిధిలోనే నియామకాలు జరపాలి. ఉద్యోగ వివరాలతో పత్రిక ప్రకటన ఇవ్వాలి. స్థానికులు, అధికారుల అనుమతి పొంది ఉండాలనే నిబంధనలు కేంద్ర ప్రభుత్వం పెట్టింది. వీటిని పాటించని కంపెనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తే వాళ్ల డిపాజిట్ జప్తు చేస్తుంది. లైసెన్స్ రద్దవుతుంది. కానీ.. స్థానికంగా పోలీసు, రెవెన్యూ విభాగాలు బహిరంగంగా నకిలీ ఏజెంట్లు నిర్వహించే ఇంటర్వూ్యలు, జారీ చేసే ప్రకటనలపై కఠినంగా వ్యహరించటం లేదు. కాగా.. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తామని, పాస్‌పోర్టులు మొదలు వీసాలు, టికెట్ల సేవలందించే పేరుతో ఏర్పాటు చేసిన సంస్థల్లో బోగసే ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల వరకు ఇలాంటి ఏజెన్సీలు ఉంటే.. అందులో రెండు ప్రభుత్వ కంపెనీలను కలుపుకుని మొత్తం 31 కంపెనీలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన లైసెన్స్‌లు ఉన్నాయి.
సమైక్య రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (ఓంకాం), తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నెలకొల్పిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టాంకాం)తోపాటు 29 కంపెనీలకు మాత్రమే ఈ లైసెన్స్ ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేవలం ఐదింటికీ మాత్రమే అనుమతి ఉండగా.. ఉపాధి వేటలో అలసిపోయిన వలస జీవులు బోగస్ ఏజెంట్ల బారిన పడి మోసపోతున్నారు. చిన్నచిన్న కంపెనీలు పంపే వీసాలు, విజిట్ వీసాలు చూపించి ఏజెంట్లు అమాయకులు ఇక్కడి యువకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు చేతిలో పడ్డాక మాయమాటలు చెప్పి సాగనంపుతున్నారు. తీరా అక్కడికి వెళ్లాక వీసాలు చెల్లక.. విజిట్ వీసాలపై వెళ్లిన వారికి పని దొరక్క.. ఇక్కడ ఏజెంట్లు చెప్పిన జీతానికి అక్కడ పొంతనలేక వలస జీవులు చిత్తవుతున్నారు. తిరిగి సొంత దేశం తిరిగి రాలేక అవస్థలు పడుతున్నారు.
నామమాత్రంగా టామ్‌కాం పాత్ర..పత్తాలేని ఎన్‌ఆర్‌ఐ పాలసీ..
రెండేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్‌కాం పాత్ర నామమాత్రంగా మారింది. నకిలీ ఏజెంట్లకు అడ్డుకట్ట వేయటంతోపాటు గల్ఫ్‌లో ఉన్న ఉపాధి అవకాశాలకు తెలంగాణలోని యువతను ఎంపిక చేసేందుకు ఉద్దేశించిన ఈ సంస్థ క్రియాశీల పాత్ర పోషించడం లేదనే చెప్పొచ్చు. గల్ఫ్‌లో ఉన్న కంపెనీలతో ఒప్పందం చేసుకొని.. తెలంగాణలో ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే పాత్రను పోషించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఉన్న ఉపాధి కల్పన కేంద్రాలు, ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతకు టామ్‌కాం ఆధ్వర్యంలో ఇంటర్వూ్యలు నిర్వహించి వీసాలు ఇప్పించాల్సిన బాధ్యతను విస్మరించింది. దాదాపు మూడు వేల మంది యువకులు ఇప్పటికే టామ్‌కాంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్తుండగా, టామ్‌కాం క్రియాశీలంగా వ్యవహరించకపోవటంతో నకిలీ ఏజెంట్ల బారిన పడి అనేక మంది మోసపోతున్నారు.
గడిచిన రెండేళ్లలో టామ్‌కాం ద్వారా రెండు వందల మందిని గల్ఫ్‌కు పంపించినట్లు చెబుతున్నప్పటికీ.. వీరిని కూడా వయా ప్రైవేటు ఏజెన్సీల ద్వారానే పంపించినట్లు ఆరోపణలున్నాయి. ఇదిలా వుంటే రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయటంతోపాటు మంత్రి కేటీఆర్‌కు అప్పగించడంతో గల్ఫ్‌లో ఉన్న పూర్వ కరీంనగర్ వాసుల్లో ఆశలు చిగురించాయి. నకిలీ ఏజెంట్లను అరికట్టడంతోపాటు మృతదేహాల తరలింపు, పెన్షన్లు, ఎక్స్‌గ్రేషియా తదితర అంశాలతో ప్రత్యేకంగా ఎన్‌ఆర్‌ఐ పాలసీని రూపొందిస్తామని ప్రకటించారు. 2016 జూన్‌లో గల్ఫ్‌లో తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమానికి పాటుపడే సంస్థలు, వివిధ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐ పాలసీ ముసాయిదా తయారీకి ప్రత్యేకంగా సదస్సు నిర్వహించారు. ఇప్పటికీ ఈ పాలసీని ప్రభుత్వం ప్రకటించకపోగా.. సదస్సులో వివిధ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు అమలుకు నోచుకోలేదు.
తగ్గని గల్ఫ్ చావులు..
ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఆశల సౌధంలో గల్ఫ్ బాట పడుతున్న పలువురు అక్కడే మృత్యువాతపడుతున్నారు. రోడ్డు ప్రమాదంలో కొందరు మృతి చెందితే.. అక్కడ చేసే పని సరిగా లేక, జీతం సరిగా రాక గుండె పోటుకు గురవ్వడం.. లేకుంటే అనారో గ్యం పాలవ్వడంతో చనిపోతున్నారు. దీం తో ఇంటి పెద్దను కోల్పోయి కుటుంబాలు దిక్కుతోచని స్థితి లో పడుతున్నాయి. గల్ఫ్‌కు వెళ్లే సమయంలో చేసిన అప్పులు తీర్చలేక.. పిల్లల్ని సాకలేక నానా యాతన అనుభవిస్తున్నారు. ఎట్లా బతికేది అంటూ దుఃఖసాగరంలో మునుగుతున్నారు. గడిచిన ఏడాదిలో సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోనే 54 మందికి పైగా మృతిచెం దారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
గల్ఫ్ బాధితుల డిమాండ్లు
♦ రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.
♦ సచివాలయంలో ఉన్న ఎన్నారై సెల్‌ను అందరికీ అందుబాటులో ఉండేలా బయట ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రాల్లోనూ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి.
♦ విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
♦ విమానాశ్రయంలోనూ సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలి.
♦ తెల్లకార్డు ఉంటేనే.. మృతదేహాన్ని విమానాశ్రయం నుంచి వారి ఇళ్లకు చేర్చే నిబంధనను సడలించాలి.
♦ గల్ఫ్‌కు వలస వెళ్లిన వారి వివరాలు సేకరించా లి. అందులో వలసల కారణాలు, ఏయే జిల్లా ల నుంచి వలసలు ఉన్నాయో తెలుసుకోవాలి.
♦ కేరళ తరహాలో ప్రవాసీల రక్షణకు ప్రత్యేక ఇన్సూ్యరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలి. వలస కార్మికులకు పునరావాసం కల్పించాలి. వలస వెళ్లిన కార్మికుల పేర్లను రేషన్‌కార్డుల జాబితా నుంచి తొలగించవద్దు.
♦ వివిధ కారణాలతో విదేశాల్లోని జైళ్లలో మగ్గుతున్న వారి విడుదలకు కృషి చేయాలి.
కేంద్రం చేయాల్సినవి..
♦ ఎంబసీలలో తెలుగు అధికారులను నియమించాలి.
♦ హైదరాబాద్‌లో సౌదీ ఎంబసీని ఏర్పాటు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment