ఢిల్లీ: నకిలీ వీసాలు తయారు చేసి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్న కేటుగాళ్ల గుట్టురట్టయింది. సెప్టెంబర్ 2 తేదీన సందీప్ అనే వ్యక్తి నకిలీ స్వీడిష్ వీసాతో ఇటలీ వెళ్లేందుకు ప్రయత్నించగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుబడ్డాడు. దీంతో ఓ భారీ నకిలీ వీసా రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు సుమారు నాలుగైదు వేలకుపైగా నకిలీ వీసాలు తయారు చేసి ఈ ముఠా రూ. 300 కోట్లు సందపాదించనట్లు అధికారులు పట్టుపడిన సందీప్ అనే వ్యక్తి తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫ్ అలీ అనే ఏజెంట్ ద్వారా రూ. 10 లక్షలకు సందీప్ నకిలీ వీసా పొందాడు. దీంతో పోలీసులు ఆసిఫ్ అలీతో పాటు అతని సహచరులు శివ గౌతమ్, నవీన్ రానాలను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో శివ గౌతమ్.. ఈ ముఠాతో సంబంధం ఉన్న మరో ఇద్దరు ఏజెంట్ల బల్బీర్ సింగ్ , జస్విందర్ సింగ్ పేర్లను చెప్పాడు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలోని మనోజ్ మోంగా అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఫ్యాక్టరీలో పలు దేశాలకు చెందిన నకిలీ వీసాలు తయారు చేసినట్లు వారు వెల్లడించారు.
పోలీసులు తిలక్ నగర్‌లోని ఫ్యాక్టరీపై దాడి చేసి గ్రాఫిక్ డిజైన్‌లో డిప్లొమా చేసిన మనోజ్ మోంగాను అరెస్ట్ చేశారు. ఐదు సంవత్సరాల క్రితం.. జైదీప్ సింగ్ అనే వ్యక్తిని మనోజ్ కలిశాడు. మనోజ్ గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ చూసి.. జైదీప్ నకిలీ వీసాలను తయారుచేయమని ప్రోత్సహించాడు. అంతేకాకుండా వాటిని సంబంధిచి అవసరమైన సామగ్రిని కూడా అందించాడు. ఈ ముఠా ప్రతి నెలా 30 నుంచి 60 నకిలీ వీసాలు తయారు చేస్తుంది. కేవలం 20 నిమిషాల్లో వీసా స్టిక్కర్‌ను సిద్ధం చేస్తారు. ప్రతి నకిలీ వీసాకు సుమారు 8 నుంచి 10 లక్షలకు విక్రయిస్తారు. టెలిగ్రామ్, సిగ్నల్, వాట్సాప్‌లను ద్వారా విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకునే వ్యక్తులతో మాట్లాడి నకిలీ వీసాలు అందిస్తారు.
ఇప్పటి వరకు ఈ ముఠాలో ఆరుగురిని అరెస్టు చేశామని, 16 నేపాలీ పాస్‌పోర్ట్‌లు, రెండు భారతీయ పాస్‌పోర్ట్‌లు, 30 వీసా స్టిక్కర్లు, 23 వీసా స్టాంపులను స్వాధీనం చేసుకున్నామని ఐజీఐ ఎయిర్‌పోర్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఉషా రంగరాణి తెలిపారు. నకిలీ వీసాల తయారీలో ఉపయోగించిన ప్రింటర్లు, లామినేటింగ్ షీట్లు, ల్యాప్‌టాప్‌ల ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment