మల్యాల(చొప్పదండి): పెళ్‌లైన ఏడాదికే ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి.. అక్కడ హత్యకేసులో ఇరుక్కుని జైలుకెళ్లి 18 ఏళ్ల తర్వాత ఇంటికి చేరాడు జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతు. గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతుకు బుగ్గారం మండలం గోపులాపురానికి చెందిన పద్మతో 20ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్‌లైన ఏడాదికే ఉపాధి కోసం హనుమంతు దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పాప పుట్టిన తర్వాత పురుడు చేసిన మరునాడే దుబాయ్ వెళ్లాడు. మూడు నెలలకే హత్య కేసులో జైలుకెళ్లాడు.
అప్పటి నుంచి ఆయన భార్య పద్మ భర్త కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఆమె 18ఏళ్ల నిరీక్షణ ఫలించాయి. దుబాయ్ జైలు నుంచి విడుదలై ఇంటికి చేరిన భర్త హనుమంతును చూసి కడుపులో దాచుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. ‘మాది రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద వడ్డెర కుటుంబం. ఉపాధి కోసం ఆయన (హనుమంతు) దుబాయ్ పోయిండు. అక్కడ జైలులో పడ్డడు. పద్దెనిమిదేళ్లుగా భర్త కోసం ఎదురుచూసిన. నా ఐదుగురు అన్నలు, ఇద్దరు తమ్ముళ్ల సహకారంతో తల్లిగారింట్లో ఉంటూ.. బీడీలు చేస్తూ, వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ కాలం వెళ్లదీసిన.
మూడు, నాలుగు నెలలకు ఒకసారి భర్తతో ఫోన్‌లో మాట్లాడిన. భర్తను తలుచుకుని ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడిపిన. కూతురు గౌతమిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన. హనుమంతును ఇంటికి రప్పించేందుకు కేటీఆర్ సారును కలిసినం. కేటీఆర్ సారు కడుపు సల్లగుండ ఆయన చేసిన మేలుతో దుబాయ్ జైలు నుంచి నా భర్త బయటపడి ఇంటికి చేరిండు. ఆయన చేసిన మేలు జీవితకాలం మరిచిపోను..’ అని తన భర్త జైలు నుండి విడుదల కోసం కృషి చేసిన మాజీ మంత్రి కేటీఆర్‌కు హనుమంతు భార్య పద్మ కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment