Karimnagar District Latest News
-
ఠాణా మెట్లెక్కిన కుల పంచాయితీ
● కుల బహిస్కరణ చేయలేదంటున్న పెద్ద మనుషులు ● కేసులు ఎత్తివేయాలని డిమాండ్ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తనను కులం నుంచి బహిష్కరించారంటూ మండల కేంద్రానికి చెందిన కొర్రి రమేశ్ శుక్రవారం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్పందించిన పోలీసులు ఏడుగురు కులపెద్దలపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కులసంఘం సభ్యులు దాదాపు వంద మంది శనివారం ఎల్లారెడ్డిపేట ఠాణాకు వచ్చారు. సంఘం పెద్దలపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కుల సంఘం పెద్దలు గడ్డం జితేందర్, బుర్క ధర్మేందర్, లింగాల దాసు, రేసు శంకర్, మంగురపు అశోక్, లింగాల సందీప్, కొప్పరి రమేశ్‌లపై కేసు నమోదు చేశారు. దీంతో కులసంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు వచ్చి కేసును ఉపసంహరించుకొని, కులంలో జరిగిన సంఘటనపై విచారించాలని కోరారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. -
మూడు కోణాలు.. 180 డిగ్రీలు
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలంలోని తక్కళ్లపెల్లి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన మామిడి శ్రీహిత అనే పదోతరగతి విద్యార్థిని రూపొందించిన గణిత ప్రాజెక్టు రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మనాక్ పోటీలకు ఎంపికై ంది. మ్యాథ్స్ టీచర్ గంగాధర్ ఆధ్వర్యంలో త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు, చతుర్భుజంలోని నాలుగు కోణాల మొత్తం 360 డిగ్రీలు అని కార్ట్ బోర్డుతో సహాయంతో వివరించింది. ఈ ప్రాజెక్టు వచ్చే నెలలో రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రదర్శించనున్నట్లు ఉపాధ్యాయుడు గంగాధర్ తెలిపారు. -
కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి
గోదావరిఖని: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జీడీకే–2ఏ గనిపై ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కార్మికుల సొంతింటి పథకాన్ని అమలు చేయాలని, ఆలవెన్స్లపై ఆదాయపు పన్ను రద్దు చేయాలని, పెండింగ్ విజిలెన్స్ కేసులు పరిష్కరించి డిపెండెంట్లకు ఉద్యోగాలివ్వాలని కోరారు. అసెంబ్లీ, సింగరేణి ఎన్నికలు జరిగి ఏడాదైనా ఇప్పటివరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని విమర్శించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ దశలవారీ పోరాటాలకు సిద్ధమైందని అన్నారు. కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గేట్ మీటింగ్‌లో నాయకులు ఆరెపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, తోట నరహరిరావు, బూర్గుల రాములు, పెండం సమ్మయ్య, వంగల శివరాంరెడ్డి, దుర్గాప్రసాద్, సమ్మయ్య, సుభాష్, తుమ్మ లక్ష్మణ్, శివరామకృష్ణ, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అర్బన్ ఎఫీషియెన్సీ టాయిలెట్స్
విద్యార్థి : అర్ఫా యుస్రా పాఠశాల : సాయి మానేరు, కరీంనగర్ గైడ్ టీచర్ : వి.ప్రజ్ఞ ఉపయోగించిన పరికరాలు : చార్ట్స్, మార్కర్స్, గమ్, గ్లూగన్, కార్ట్బోర్డ్, స్ట్రాలు, టీ కప్స్ తదితరాలు. ఉపయోగం : జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో తక్కువ స్థలంలో ఎక్కువ టాయిలెట్స్ నిర్మించి, ఉపయోగించుకోవచ్చు. సాధించిన బహుమతి : జిల్లాస్థాయి సీనియర్స్ కేటగిరీలో ప్రథమ స్థానం. -
డాక్టర్ ప్రదీప్‌కుమార్‌కు ప్రైడ్ ఆఫ్ ది నేషన్ అవార్డు
కరీంనగర్‌టౌన్: వైద్యరంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న ఆస్పత్రికి ఆసియా టుడే ఇండియా సంస్థ ఏటా అందించే ఫ్రైడ్ ఆఫ్ ది నేషన్ అవార్డును 2024 సంవత్సరానికిగానూ కరీంనగర్‌లోని శ్రీసాయి లైఫ్‌లైన్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌కు లభించింది. ఈ అవార్డుల ప్రదానోత్సవం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు సమక్షంలో గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ చేతుల మీదుగా లైఫ్‌లైన్ హాస్పిటల్ చైర్మన్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ప్రదీప్‌కుమార్ అవార్డు అందుకున్నారు. హాస్పిటల్ ఏవో డాక్టర్ కంచన్ పాల్గొన్నారు. బోధన వైద్యుల నిరసనసిరిసిల్లటౌన్: జిల్లా వైద్యశాల ఎదుట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భోదనా వైద్యుల సంఘం నిరసన చేపట్టింది. వారు మాట్లాడుతూ జగిత్యాలలో సీనియర్ వైద్యుడిపై విపరీత ఆరోపణలు మోపుతూ సరెండర్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అడిషనల్ డీఎంఈలు సకాలంలో రాకపోవడంతోనే ఆ పదవి బాధ్యతలు సైతం తీసుకున్నారన్నారు. గతంలో సదరు వైద్యుడే నిజామాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా సమర్థంగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. సమర్థులను ప్రోత్సహించాల్సింది పోయి అవమానపరచడం వ్యవస్థకు మంచిదికాదన్నారు. ఈమేరకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. వకీల్‌పల్లి గనికి బహుమతులు గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–2 పరిధిలోని వకీల్‌పల్లిగనికి బహుమతులు ప్రకటించారు. ఈనెల 23న కొత్తగూడెంలో జరిగే సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో సంస్థ సీ ఎండీ బలరాం చేతులమీదుగా బహుమతులు అందుకోనున్నారు. గనిలోని ఎల్‌హెచ్‌డీ విభాగం, కంటిన్యూస్ మైనర్ విభాగాల్లో బహుమతులను గని దక్కించుకుంది. ఈసందర్భంగా ఆర్జీ–2 జీఎం వెంకటయ్య గని అధికారులను అభినందించారు. -
ఉరిసిల్లగా మార్చొద్దు
● శాశ్వత ఉపాధి కల్పించాలి ● సిరిసిల్లలో రోడ్డెక్కిన నేతకార్మికులుసిరిసిల్లటౌన్: వస్త్రోత్పత్తి ఖిల్లాను మళ్లీ ఉరిసిల్లగా మార్చొద్దని రాష్ట్ర పవర్లూమ్ వర్కర్స్ యూని యన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ కోరారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం పవర్లూమ్ వార్పిన్, వైపని అనుబంధ సంఘాలు, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ గత, ప్రస్తుత ప్రభుత్వాల అసంబద్ధ విధానాలతోనే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవర్లూమ్ కార్మికులకు సరైన ఉపాధి లేకనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఏడాదిగా పనిలేకుండా కార్మికులు ఎట్లా బతుకుతారనే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. పని లేకనే చనిపోతున్నట్లు సూసైడ్‌నోట్‌లో రాసినా.. జౌళిశాఖ అధికారులు మాత్రం నివేదిక విరుద్ధంగా తయారు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు యజమానులకు మేలు చేసేలా ఉన్నాయని, కార్మికులను ఆదుకునేలా లేవన్నారు. ప్రభుత్వం ఉత్పత్తి చేయించే వస్త్రానికి కార్మికునికి రోజుకు రూ.వెయ్యి వేతనం వచ్చేలా కూలి నిర్ణయించాలని కోరారు. నాయకులు కోడం రమణ, అన్నల్దాస్ గణేశ్, సిరిమల్ల సత్యం, కుమ్మరికుంట కిషన్, రమేశ్చంద్ర, ఒగ్గు గణేశ్, మచ్చ వేణు, బూట్ల వెంకటేశం, బిజిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
వేద గణితం..
సిరిసిల్ల కల్చరల్: సిరిసిల్లకు చెందిన మడుపు ముత్యంరెడ్డి 57 ఏళ్లుగా బోధన వృత్తికే పరిమి తమై, గణితానికి జీవితాన్ని అంకితం చేశారు. 80 ఏళ్ల వయసులో సొంతంగా పాఠశాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. పూరీ పీఠాధిపతి శంకరాచార్యులు భారతీ కృష్ణ తీర్థ స్వామి ఆంగ్లంలో రాసిన వేదగణితాన్ని తెలుగులో రాశారు. 200 పేజీలున్న ఈ పుస్తకం హైస్కూల్ విద్యార్థులకు సంఖ్యా శాస్త్రంలో ఎదురయ్యే అంక గణిత పరికర్మలను దృష్టిలో పెట్టుకొని వేద గణిత సూత్రాలు, పద్ధతులను వివరించింది. ఇది ఎంతోమంది గణిత ఉపాధ్యాయులకు కరదీపికై ంది. ముత్యంరెడ్డి ఇప్పటికీ ప్రత్యక్షంగా, ఉత్తరాల ద్వారా, సెల్‌ఫోన్ ద్వారా సందేహాలను నివృత్తి చేస్తున్నారు. -
జిల్లాలోని పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచండి
● మాతా శిశు మరణాలను నివారించాలి ● ఆరోగ్య మహిళపై విస్తృత అవగాహన కల్పించాలి ● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్టౌన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వైద్యాధికారులు, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. మాతా శిశు మరణాలను నివారించాలని ఆదేశించారు. నెలాఖరులోగా తమకు నిర్దేశించిన ప్రసవాల లక్ష్యం చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్లు చేసిన ప్రసవాల గురించి అడిగి తెలుసుకున్నారు. డెలివరీ సమయంలో మెడికల్ ఆఫీసర్ ఉన్నది లేనిది రికార్డు నమోదు చేయాలన్నారు. ఆరోగ్య మహిళపై అవగాహన కల్పించాలి ఆరోగ్య మహిళ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. 13 ఏళ్లు దాటిన వారందరికీ ఆరు నెలలకోసారి అన్ని వైద్య పరీక్షలు చేయాలన్నారు. పారిశుధ్య కార్మికులకు తప్పనిసరిగా పరీక్షలు చేయించాలన్నారు. కేన్సర్‌ను మొదటిదశలో గుర్తిస్తే చికిత్సతో నయం చేయవచ్చన్నారు. శుక్రవారం సభకు మెడికల్ ఆఫీసర్లు విధిగా హాజరు కావాలన్నారు. తమ సెంటర్ పరిధిలో మందులు వృథా కాకుండా చూడాలన్నారు. ప్రతివారం సీడీపీవో, సూపర్ వైజర్, ఆశా వర్కర్లతో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలుసుకోవాలన్నారు. మాతా శిశు మరణాలు జరగకుండా చర్యలు ఆస్పత్రుల్లో మాతా శిశు మరణాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల సాయంతో గర్భిణులు ప్రతినెల పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు. హైరిస్క్ కేసుల విషయంలో నిపుణులను సంప్రదించాలన్నారు. అనంతరం ఎండీఆర్, సీడీఆర్ కేసుల గురించి చర్చించారు. ఈ కేసులకు సంబంధించి ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు 29,712 మందికి ఆరోగ్య మహిళ కింద పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో వెంకటరమణ తెలిపారు. ఎంసీహెచ్ పీవో డాక్టర్ సనా, డిప్యూటీ డీఎంహెచ్ఓ చందు, డీఐఓ సాజిదా, పీవో డీటీ టీ.ఉమశ్రీ పాల్గొన్నారు. -
గ్రామాల విలీన రగడ
● వాడీవేడిగా బల్దియా సమావేశం ● గ్రామాలను కలపొద్దన్న బీఆర్ఎస్ ● గతంలో మీరు చేసిందేమిటన్న కాంగ్రెస్ ● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ● అధికారులు వినడం లేదని ఆవేదనకరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలకసంస్థలో కొత్తపల్లి మున్సిపాలిటీ సహా, ఆరు గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బల్దియా సమావేశంలో వాడీవేడిగా చర్చ సాగింది. గ్రామాలను విలీనం చేయొద్దని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేయగా, గతంలో ఎనిమిది గ్రామాలను విలీనం చేసింది మీరు కాదా అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది. విలీనం చేసి వదిలేయకుండా నిధులు కేటాయించాలని బీజేపీ కోరింది. నగరంలో ప్రజా సమస్యలు గాలికొదిలేశారని, అధికారులు పట్టించుకోవడం మానేసారని సభ్యులు మండిపడ్డారు. విలీనానికి వ్యతిరేకం... కాదు అనుకూలం నగరపాలకసంస్థ సర్వసభ్య సమావేశం మేయర్ వై.సునీల్‌రావు అధ్యక్షతన శనివారం బల్దియా స మావేశ మందిరంలో జరిగింది. ఎజెండాలో లేనప్పటికీ నగరపాలకసంస్థలో కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు, ఆరు గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చర్చ చేపట్టారు. ఐదేళ్ల క్రితం విలీనమైన గ్రామాల్లో ఇప్పటివరకు వసతులు కల్పించలేకపోయారని, ప్రస్తుత విలీనాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. తమ గ్రామాలను విలీనం చేసి ఐదేళ్లయినా కనీసం తాగునీళ్లు లేవని, నిధులు కేటాయించాలని బీజేపీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ కోరారు. 2019లో ఎనిమిది గ్రామాలను బీఆర్ఎస్ ప్రభుత్వమే విలీనం చేసిందని, ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి ప్రశ్నించారు. మరి అభివృద్ధి జరకగపోవడానికి ఎవరు కారణమ ని బీజేపీ కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ నిలదీశా రు. ఇప్పటికే విలీనాన్ని వ్యతిరేకిస్తూ మేయర్ లేఖ రాశారని, చర్చతో ఒరిగేదేమీ లేదని మాజీ మేయర్, బీఆర్ఎస్ కార్పొరేటర్ రవీందర్ సింగ్ అన్నారు. స్మార్ట్సిటీలా ఉందా..? కరీంనగర్ స్మార్ట్సిటీలాగా ఉందా చెప్పాలని బీజేపీ కార్పొరేటర్ వంగల శ్రీదేవి ప్రశ్నించారు. అధికారు ల నిర్లక్ష్యంతో పథకం అక్రమాల పాలైందని ఆరో పించారు. స్మార్ట్‌సిటీ అక్రమాలపై విచారణ అటకెక్కిందని బీఆర్ఎస్ కార్పొరేటర్ బండారి వేణు విమర్శించారు. వన్‌టౌన్ జంక్షన్లో తెలంగాణ తల్లి విగ్రహం ఎప్పుడు పెడుతారని రవీందర్ సింగ్ ప్రశ్నించారు. తమ డివిజన్‌కు ఎల్ఆర్ఎస్ నిధులు కేటాయించలేదని ఆరోపించారు. ఏ డివిజన్లో ఏ మేరకు నిధులు పెట్టాలో అధికారులు చూసుకుంటారని మేయర్ బదులిచ్చారు. తమ డివిజన్లోని డంప్‌యార్డ్ తరలించాలని కార్పొరేటర్ ఐలెందర్‌యాదవ్ విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ డెయిరీ ట్యాక్స్ సమస్యను పరిష్కరించాలని బోనాల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఎఫ్ఎం రేడియో హౌస్ వద్ద నూతనంగా వాటర్‌ట్యాంక్ ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ కోరారు. అధికారులు పట్టించుకోవడం లేదు నగర ప్రజల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదంటూ పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగు నెలల నుంచి వీధిదీపాలు రావడం లేదని, కోతులు, కుక్కలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. మ్యుటేషన్ చేయడంలో జా ప్యం చేస్తున్నారన్నారు. అధికారులు తమ ఫోన్లు ఎత్తడం లేదని మరికొంతమంది వాపోయారు. మేయర్ సునీల్‌రావు జోక్యం చేసుకొని అధికారులు కార్పొరేటర్ల ఫోన్లకు స్పందించాలన్నారు. విలీనాన్ని విరమించుకోవాలి నగరపాలకసంస్థలో గ్రామాల విలీనాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని మేయర్ వై.సునీల్‌రావు డిమాండ్ చేశారు. గతంలో కలిపిన ఎనిమిది గ్రామాలతో నగర విస్తీర్ణం 65 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. ప్రస్తుత విలీనంతో 150 కిలోమీటర్ల విస్తీర్ణమవుతుందని, దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తాయన్నారు. నగరపాలకసంస్థ ప్రస్తుతం ఆర్థిక భారాన్ని మోపే పరిస్థితిలో లేదని, విలీనాన్ని రద్దు చేయాలన్నారు. తమ పాలకవర్గం ముగిసే నాటికి మరో రెండు సర్వసభ్య సమావేశాలు ఉంటాయని, మిగిలిన సమస్యలపై చర్చిస్తామన్నారు. కాగా నగరపాలకసంస్థ సర్వసభ్య సమావేశంలో 38 ఎజెండా అంశాలను ఆమోదించారు. కళాభారతి అద్దె సాధారణ వ్యక్తులకు రూ.10 వేలు, కళాకారులకు రూ.3వేలుగా సవరించారు. నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి పాల్గొన్నారు. -
మిషన్ మ్యాథమేటిక్స్
ఇల్లంతకుంట(సిరిసిల్ల): గణితం అంటే విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి, సబ్జెక్టును ఇష్టంగా నేర్చుకోవడానికి మిషన్ మ్యాథమేటిక్స్ అనే కాన్సెప్ట్‌తో ఒక బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇల్లంతకుంట మండలం అనంతగిరి హైస్కూల్ మ్యాథ్స్ టీచర్ ఫరీదుద్దీన్. కరోనా సమయంలో పదోతరగతి విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ తయారు చేసి, పీడీఎఫ్ రూపంలో వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని మ్యాథ్స్ టీచర్లతో గ్రూపు నిర్వహిస్తున్నారు. భరోసా మ్యాథ్స్ విజార్డ్ సంస్థ నిర్వహించిన గణిత కాన్సెప్ట్ వీడియో కాంపిటీషన్లో ఈ పాఠశాల విద్యార్థులు రక్షిత, అక్షిత జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. -
ఘనులు
గణితంలో● నూతన ఆవిష్కరణల వైపు అడుగులు ● మ్యాథ్స్‌లో ప్రతిభ చాటుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ● ఎగ్జిబిట్లతో అదరగొట్టిన స్టూడెంట్స్ ● నేడు జాతీయ గణిత దినోత్సవంగణితంలో ఎలాంటి లెక్కనైనా చటుక్కున తేల్చేస్తున్నారు. ఎక్కడ పోటీలు జరిగినా ప్రత్యేకత చాటుతున్నారు. టీచర్ల పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతూ చకాచకా లెక్కలు చేసేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. ఉపాధ్యాయుల సలహాలతో టాలెంట్ టెస్ట్.. మేథమెటిక్స్ ఒలింపియాడ్ పోటీల్లో ప్రతిభ చూపుతూ రాణిస్తున్నారు. పలువురు గణిత ఉపాధ్యాయులు సైతం సబ్జెక్టు బోధనలో వినూత్నంగా ఆలోచన చేస్తూ.. సరికొత్త పరిశోధనలు ఆవిష్కరి స్తున్నారు. నేడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని గణిత ఘనుల గురించి ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ.!!రాష్ట్రస్థాయి సెమినార్లో గణిత ఉపాధ్యాయులు సప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత టీచర్లలో సృజనాత్మకతను వెలికితీసేందుకు శనివారం హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీ ఆడిటోరియంలో స్టేట్ లెవెల్ మ్యాథమేటిక్స్ సెమినార్ నిర్వహించారు. దీనికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అడిగొప్పుల సదయ్య, జెడ్పీహెచ్ఎస్ చింతకుంట(కరీంనగర్), సముద్రాల హరికృష్ణ, బాలికల ఉన్నత పాఠశాల మానకొండూర్(కరీంనగర్), కాయితి అనిత, జెడ్పీహెచ్ఎస్ రామగుండం(పెద్దపల్లి), మంతెన వెంకటేశ్ బాబు, జెడ్పీహెచ్ఎస్ వెంకేపల్లి (కరీంనగర్), ఎర్రబెల్లి అశోక్, జెడ్పీహెచ్ఎస్ సుద్దపల్లి(జగిత్యాల) హాజరయ్యారు. పలు గణిత అంశాలపై పరిశోధన పత్రాలు సమర్పించారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈవీ.నరసింహారెడ్డి చేతులమీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు.సమగ్రంగా నేర్చుకోవాలి కొత్తపల్లి(కరీంనగర్): గణితం లేని సమాజాన్ని ఊహించలేం. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ చేసిన సేవలు అనిర్వచనీయం. గణితాన్ని సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా నేర్చుకోవడం ద్వారా వివిధ రంగాల్లో విజయం సాధించవచ్చు. – వి.నరేందర్‌రెడ్డి, చైర్మన్, అల్ఫోర్స్ విద్యాసంస్థలు -
త్రికోణమితి అనువర్తనాలు
విద్యార్థి : నల్గొండ రితిక పాఠశాల : జెడ్పీహెచ్ఎస్, రామడుగు, కరీంనగర్ గైడ్ టీచర్ : సంగోజు శ్రీనివాస్ ఉపయోగించిన పరికరాలు : అట్టపెట్టె, డ్రాయింగ్ షీట్లు, లో కాస్ట్, నో కాస్ట్ మెటీరియల్. ఉపయోగం : ఎత్తయిన భవనాలు, సెల్‌ఫోన్ టవర్లు, శిఖరాల ఎత్తును సులభంగా ఎలా కనుక్కోవచ్చో ఈ ప్రాజెక్టు ద్వారా చూపించారు. సాధించిన బహుమతి : జిల్లా స్థాయి సీనియర్స్ కేటగిరీలో ద్వితీయ స్థానం. -
సోలార్ పవర్ మల్టీ సేవ్ మెషిన్
విద్యార్థి : ఎం.చేగువేరా పాఠశాల : పారమిత హెరిటేజ్, కరీంనగర్ గైడ్ టీచర్ : లలిత్‌మోహన్ సాహూ ఉపయోగించిన పరికరాలు : ఐరన్, మోటార్స్, సోలార్ ప్యానల్, నెట్, ఫ్రేమ్, వైర్, వీల్స్ తదితరాలు. ఉపయోగం : ఇది తక్కువ ఆదాయం ఉన్న ప్రజలకు ఉపయోగపడే ఒక వినూత్న సోలార్ బహుళ జల్లెడ యంత్రం. నిర్మాణ స్థలాలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, భూసార పరీక్షా కేంద్రాల్లో నేల ధాన్యాలను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది. సాధించిన బహుమతి : జిల్లా స్థాయి జూనియర్స్ కేటగిరీలో ప్రథమ స్థానం. -
‘మా గ్రామాలు కలపొద్దు’
కరీంనగర్ అర్బన్/కరీంనగర్ రూరల్: కరీంనగర్ నగరపాలకసంస్థలో తమ గ్రామాలను విలీనం చేయొద్దని కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్, గోపాల్పూర్ వాసులు శనివారం కరీంనగర్ వచ్చి కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వ్యవసాయాధారిత గ్రామాలైన దుర్శేడ్, గోపాల్పూర్ను విలీనం చేసేందుకు జారీ అయిన ఆర్డినెన్స్ రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపినట్టు తెలిపారు. కార్పొరేషన్లో కలిపితే ఉపాధి పనులు చేసుకోవడానికి వీలులేకుండా పోతుందన్నారు. తామంతా పేద, మధ్యతరగతి ప్రజలమని, విలీనం అయిన గ్రామాలకు ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని, అభివృద్ధి జరగలేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకోనైనా విలీనాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ తోట తిరుపతి, గోపాలపూర్ మాజీ సర్పంచ్ ఊరడి మంజుల మల్లారెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌లు సుంకిశాల సంపత్ రావు, అరె శ్రీకాంత్, మంద రాజమల్లు, వేల్పుల నారాయణ కుమార్ పాల్గొన్నారు. యోగాతో ఆరోగ్యం కరీంనగర్‌స్పోర్ట్స్: యోగాతో ఆరోగ్యంగా ఉంటారని తెలంగాణ యోగా అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ పేర్కొన్నారు. జిల్లా స్పోర్ట్స్ అథారటీ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో సీఎంకప్ జిల్లాస్థాయి యోగా, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోనే కరీంనగర్ యోగా క్రీడాకారులు తిరుగులేని విజయాలు సాధిస్తుండడం స్ఫూర్తిదాయకమన్నారు. ఇదే ఒరవడిని రాష్ట్రస్థాయి సీఎంకప్ పోటీల్లో కొనసాగించాలన్నారు. అంతకుముందు పోటీలను డీవైఎస్వో శ్రీనివాస్ ప్రారంభించారు. తెలంగాణ యోగా అసోసియేషన్ ప్రధా న కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాబు శ్రీనివాస్‌గౌడ్, పెటా అధ్యక్షుడు సొల్లు సారయ్య, శ్రీనివాస్, పీఈటీలు పాల్గొన్నారు. వినూత్న నిరసన కరీంనగర్: సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 12వ రోజు శనివారం కలెక్టరేట్ ఎదుట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భజన చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. యాదగిరి శేఖర్ రావు, శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ చెల్లమల్ల చైతన్య వారికి సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా గౌరవాధ్యక్షుడు బెజ్జంకి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు గుండా రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్, రవిచంద్ర, బి.శ్రీకాంత్, కేజీబీవీ ప్రత్యేక అధికారులు ఎం.అజిత, బి.రమాదేవి, ఎన్.పూర్ణిమ, గౌతమి, పి.మాధవి, పి.కిరణ్‌జ్యోతి పాల్గొన్నారు. ‘కరచాలనం’ ఆవిష్కరణకరీంనగర్ సిటీ: తెలుగు విభాగం ఆధ్వర్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత, కవి, రచయిత వారాల ఆనంద్ రచించిన ‘కరచాలనం’ పుస్తకాన్ని ఎస్సారార్ కళాశాల ఆవరణలో రిటైర్డ్ ఆర్జేడీ బి.రామచంద్రరావు ఆవిష్కరించారు. కవులు, రచయితలు సమాజానికి దిశానిర్దేశం చేయాలన్నారు. పుస్తక రచయిత ఆనంద్ మాట్లాడుతూ తన మొదటి సాహిత్య ప్రయాణం కళాశాలలోని విశ్వనాథ కళామందిరంతో మొదలైందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కల్వకుంట్ల రామకృష్ణ మాట్లాడుతూ.. ఉత్తమ సాహితీ, కళావేత్తలను వారాల ఆనంద్ తన కరచాలనం పుస్తకంలో పరిచయం చేశారన్నారు. పుల్లూరి జగదీశ్వర్, బూర్ల చంద్రశేఖర్, ఇందిర, బూర్ల వెంకటేశ్వర్లు, డి.ప్రకాష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధంతోనే హత్య
వేములవాడ: వివాహేతర సంబంధంతోనే రషీద్ హత్య జరిగిందని వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి తెలిపారు. హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేములవాడరూరల్ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వేములవాడలో నివసించే మనోహర్ జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నాడు. ఈక్రమంలో పట్టణంలో నివసించే మహ్మద్ రషీద్(35)కు మనోహర్ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య పంచాయితీలు జరిగాయి. అయినా వారిద్దరిలో మార్పు రాకపోగా.. మనోహర్ భార్య పట్టణంలోని మరో ఇంట్లో ఉంటుంది. దీన్ని భరించలేకపోయిన మనోహర్ 45 రోజుల క్రితమే దుబాయ్ నుంచి ఇండియాకొచ్చాడు. ఈనెల 18వ తేదీ తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటకొచ్చిన రషీద్‌ను కత్తితో పొడిచి చంపి, పరారయ్యాడు. మల్లారం రోడ్డు ప్రాంతంలో శనివారం మనోహర్‌ను అరెస్ట్ చేసి, అతని నుంచి పాసుపోర్టు, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్, హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు మారుతి, రమేశ్ ఉన్నారు. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి నిందితుడి రిమాండ్ -
సిమ్స్‌కు పార్థివదేహం దానం
● నేత్రదానంతో ఇద్దరికి కంటి చూపు కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని యైటింక్లయిన్‌కాలనీకి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి దాసారపు మోహన్(59) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఆయన సభ్యులు మృతదేహాన్ని రామగుండం సింగరేణి మెడికల్ కాలేజీకి శనివారం దానం చేశారు. అంతకుముందు ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించడానికి, ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ ద్వారా మృతుని నేత్రాలు దానం చేశారు. సదాశయ ఫౌండేషన్, కమాన్‌పూర్ లయన్స్ క్లబ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో పార్థివదేహాన్ని స్వీకరించిన సిమ్స్ అనాటమీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కల్పన, టెక్నీషియన్లు లక్ష్మణ్ కుమార్, సిద్ధార్థ, తిరుపతితోపాటు సిబ్బంది, మృతుని కుటుంబ సభ్యులు, సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు గౌరవ వందనం చేసి నివాళి అర్పించారు. -
భూవివాదంలో మహిళ ఆత్మహత్యాయత్నం
● ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): భూవివాదంలో కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా పక్కనే ఉన్న వారు ఇబ్బందులకు గురి చేస్తుండడంపై మనస్థాపంతో ఓ మహిళ శని వారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన గడ్డం పద్మ, రెడ్డిమల్ల సత్యనారాయణ మధ్య కొంతకాలంగా పాత ఇంటికి సంబంధించిన రెండు గుంటల స్థలంపై వివాదం ఉంది. ఇరు కుటుంబాల మధ్య అనేకసార్లు కులపెద్దలు పంచాయితీలు చేశారు. సమస్య పరిష్కారం కాలేదు. దీంతో పద్మ కోర్టును ఆశ్రయించగా.. తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చింది. తనకున్న రెండు గుంటల స్థలంలో ఉన్న పాత ఇల్లు కూలిపోగా.. దాని స్థానంలో కొత్త ఇంటిని గ్రామ పంచాయతీ అనుమతితో నిర్మించుకుంటోంది. శనివారం అక్కడికి వెళ్లిన సత్యనారాయణ, అతని తండ్రి ప్రకాశ్, తల్లి సత్తవ్వ ఆమెను దుర్భాషలాడుతూ పురుగుల మందుతాగి చావుమని బెదిరించారు. దీంతో మనస్థాపం చెందిన పద్మ పురుగుల మందు తాగింది. ఆమె భర్త గతంలో అనారోగ్యంతో మృతిచెందగా, కుమారుడు గడ్డం సాయికుమార్ ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. -
గీత కార్మికుడి బలవన్మరణం
రామడుగు(చొప్పదండి): వెదిర గ్రామానికి చెందిన గీత కార్మికుడు గుర్రం లింగస్వామి(75) అప్పుల బాఽ దతోపాటు అనారోగ్యంతో బాధపడుతూ శనివారం సాయంత్రం ఇంట్లో ఎవ రూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడినట్లు రామడుగు పోలీసులు తెలిపా రు. మృతుడికి కొడుకు, ముగ్గురు కూతుళ్లున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతివీణవంక: బేతిగల్ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన బండారి చేరాలు(55)మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చేరాలు తన ద్విచక్రవాహనంపై జమ్మికుంట వైపు వెళ్తున్నాడు. జమ్మికుంట నుంచి బేతిగల్ వైపు వస్తున్న కారు డ్రైవర్ అతివేగంగా వచ్చి ఢీ కొట్టాడు. చేరాలుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108వాహనంలో జమ్మికుంట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేరాలు కాజీపేటలోని ఎఫ్‌సీఐలో హమాలీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. మృతుడికి భార్య లింగమ్మ, ముగ్గురు కూతుళ్లున్నారు. లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు. ఇటుక బట్టీ కార్మికురాలు..సుల్తానాబాద్‌రూరల్: మండలంలోని కదంబాపూర్ శివారులోని ఇటుక బట్టీలో ఓ కార్మికురాలు మృతిచెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన దంపతులు ము కుందో గౌరి–లక్ష్మీగౌరి 15 రోజుల క్రితం కదంబాపూర్ ఎస్బీఐ ఇటుకబట్టీలో పనిలో చేరా రు. లక్ష్మీగౌరి శనివారం పని ముగించుకొని, మధ్యాహ్నం స్నానం చేసేందుకు వెళ్లి, ప్రమాదవశాస్తు జారి పడింది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయమవగా, స్థానికులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్ప టికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భూమి కోసం డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు బోయినపల్లి(చొప్పదండి): గతంలో విక్రయించిన భూమికి మళ్లీ డబ్బులు డిమాండ్ చేస్తూ సాగుచేయకుండా ఇబ్బంది పెడుతున్న మండలంలోని దుండ్రపల్లికి చెందిన స్వామిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ శని వారం తెలిపారు. దుండ్రపల్లికి చెందిన స్వామి, నర్సమ్మలు తమ పేరిట ఉన్న భూమిని 1997లో అదే గ్రామానికి చెందిన కొమురమ్మ, పోచమల్లులకు విక్రయించారు. అప్పటి ధర ప్రకారం భూమికి డబ్బులు చెల్లించారు. కొన్ని రోజుల తర్వాత స్వామి తాను భూమి విక్రయంచలేదంటూ కొమురమ్మ, పోచమల్లులను ఇబ్బందులకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. డబ్బులు ఇస్తేనే భూమి దున్ననిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. రెవెన్యూ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ రిజిష్ట్రేషన్ క్యాన్సి ల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియడంతో రూరల్ సీఐ శ్రీనివాస్ ఆదేశాలతో కేసు నమో దు చేసినట్లు ఎస్సై వివరించారు. -
‘బిర్లా’లో బహుళ సాంస్కృతిక సమ్మేళనం
కరీంనగర్‌రూరల్: బొమ్మకల్ బైపాస్‌లోని బిర్లా ఓపెన్‌మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో శనివారం బహుళ సంస్కృతి సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణ, హరియాణా రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు, జానపద కళలకు సంబంధించిన నృత్యాలతో విద్యార్థులు సందడి చేశారు. పాఠశాల చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నేటితరం విద్యార్థులకు మన సంస్కృతితోపాటు ఇతర రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ బబితా విశ్వనాథన్‌తో కలిసి బహుమతి ప్రదానం చేశారు. -
కొండంతా రాతి విగ్రహాలే
రామగుండం: నగర సమీపంలోని కొండపై శ్రీరామునిగుండాలు.. శ్రీరామపాదక్షేత్రం ఆధ్యాత్మిక, చారిత్రక ఆనవాళ్లుగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిరోజులుగా ప్రత్యక్షమవుతున్న దేవతామూర్తుల రాతి విగ్రహాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శ్రీరాముడు–సీతాదేవి నడయాడిన నేలగా పిలుచుకునే ఈ ప్రాంతం వారు వనవాసం చేసిన ఆనవాళ్లు కూడా కొండపై ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. సుమారు రెండు దశాబ్దాల క్రితం శ్రీవేంకటేశ్వస్వామి రాత్రి విగ్రహం వెలుగుచూడడంతో శ్రీరామపాదక్షేత్రంగా నామకరణం చేశారు. అప్పటి నుంచి నేటివరకు పలుచోట్ల గణపతి, హనుమాన్ తదితర దేవతా రాతి విగ్రహాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కొండమీద రాళ్లపై చెక్కిన శ్రీరాముడు, హనుమాన్ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. మేకల కాపరికి కనిపించిన విగ్రహం.. 2006 ఏప్రిల్‌లో ఓ మేకల కాపరి కొండపై మేకలు మేపడానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే శ్రీవేంకటేశ్వరస్వామి రాతి విగ్రహం కింద పడి ఉండడాన్ని గుర్తించాడు. ఆ విషయాన్ని స్థానికుల దృష్టికి తీసుకెళ్లడంతో రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. 2009 డిసెంబర్ 28న శ్రీలక్ష్మీ నర్సింహస్వామి సుదర్శన హోమ కార్యక్రమాన్ని 50 మంది అహోబిల రామచంద్ర జీయర్‌స్వామి శిష్యులతో నిర్వహించారు. 2010 జనవరి 2న శ్రీత్రిదండి రామానుజన్ చినజీయర్‌స్వామి కొండను సందర్శించారు. దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. కొండపై ఆధ్యాత్మిక, చారిత్రక ఆనవాళ్లు ఉండడంతో ఏటా శ్రావణం, కార్తీకమాసంలో భక్తులు దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. దేవతా మూర్తులను దర్శించుకోవడంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదదీరుతున్నారు. ఎత్తయిన కొండపై చూస్తే రామగుండం నగరం సుందరంగా కనిపిస్తుండడంతో తనివితీరా తిలకిస్తున్నారు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే... రాముడు–సీతాదేవి స్నానమాచరించిన రామునిగుండాలు ఉండడంతోనే రామగుండం పేరు వచ్చి నట్లు చరిత్ర చెబుతోంది. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సింగరేణి బొగ్గు గనులు, రైల్వేస్టేషన్, కేశోరాం సిమెంట్ కర్మాగారం తదితర పరిశ్రమలన్నీ రామగుండం పేరిటనే కొనసాగుతుండడం గమనార్హం. వీటితోపాటు స్థానికంగా సహజ వనరుల లభ్యత కారణంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నిలయంగా మారుతోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కూడా రామగుండం పేరుకు సుస్థిర స్థానం లభించింది. పర్యాటకంలో చేర్చాలి.. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రాలను గుర్తించి మరింత అభివృద్ధి చేసిఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని యోచిస్తోంది. ఇందుకోసం పలు ప్రాంతాలను టూరిజం సర్క్యూట్ జాబితాలో చేర్చుతోంది. అదే జాబితాలో రామునిగుండాల కొండను చేర్చి, టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. రామగుండంలో వెలుగులోకి.. పరిశోధనలు చేస్తే మరింత సమాచారం పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతున్న నగరవాసులు -
వ్యక్తి ఆత్మహత్య
ధర్మపురి: కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందండంతో మనస్తాపానికి గరైన తండ్రి తాగుడుకు బానిసై.. మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ధర్మపురిలో చోటు చేసుకొంది. ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురికి చెందిన మామిడి రాజన్న కుమారుడు గణేశ్ కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటినుంచి రాజన్న తాగుడుకు బానిసయ్యాడు. శుక్రవారం ఇంటి నుంచి వెళ్లి పురుగుల మందు తాగి ఇంటికొచ్చాడు. కుటుంబ సభ్యులు వెంటనే ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందాడు. రాజన్న భార్య మంగ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మహిళతో బాబా అసభ్య ప్రవర్తన జగిత్యాలక్రైం: జగిత్యాలలోని హనుమాన్‌వాడకు చెందిన ఓ మహిళపై లైంగికదాడికి యత్నించిన ఫకీర్బాబాపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. మెట్పల్లి పట్టణానికి చెందిన మహ్మద్ చాంద్‌మియా బాబా వేషంలో ఓ మహిళ ఇంటికి వెళ్లి తావీదులు కడతానని చెప్పి నమ్మించి.. అసభ్య ంగా ప్రవర్తిస్తూ.. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని బాధితురాలు పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేసింది. బాబాపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
అడ్డం తిరిగిన సుపారీ
ధర్మపురి: ధర్మపురి మండలం నేరెళ్ల గుట్టల్లో గుర్తు తెలియని శవమంటూ కొద్దిరోజులుగా వినిపిస్తున్న వదంతులను పోలీసులు శనివారం చేధించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఓ యువకుడిని తీసుకొచ్చి దారుణంగా హత్య చేసి కాల్చివేశారని నిర్ధారించారు. పోలీసుల కథనం ప్రకారం.. నేరెళ్లకు చెందిన గోపాల్, ఇదే మండలం కమలాపూర్‌కు చెందిన గండికోట శేఖర్ స్నేహితులు. నేరెళ్లకు చెందిన మెరుగు లక్ష్మణ్ ముంబయిలోని ఓ బీచ్‌లో ఓ యువకుడిని చంపాల ని గోపాల్‌ను ఫోన్లో సంప్రదించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ సూర్యప్రకాశ్‌సింగ్ ఉన్నాడని, ఎంత పెద్ద పనైనా చేసి పెడతాడని, అతడు ప్రస్తు తం ముంబయిలో ఉంటున్నాడని, ఈ విష యం మధ్యవర్తి తనకు తెలిసిందని గోపాల్ లక్ష్మణ్‌కు తెలిపాడు. సూర్యప్రకాశ్‌తో హత్య వివరాలను ఫోన్లోనే మాట్లాడి రూ.4 లక్షలకు సుపారి కుదుర్చుకున్నారు. కొద్దిరోజులకు సూర్యప్రకాశ్ డబ్బులు ఇవ్వాలని గోపాల్‌ను అడగగా.. ఎవరినీ హత్య చేయాల్సిన అవసరం లేదని, ఇదే విషయాన్ని లక్ష్మణ్ చెప్పాడని కూడా సూర్యప్రకాశ్‌కు వివరించాడు. అయితే సుపారి మాట్లాడుకున్నాక డబ్బులు తప్పకుండా ఇవ్వాల్సిందేనని, లేకుంటూ మీ తండ్రి రమేశ్‌ను చంపేస్తానని గోపాల్‌ను బెదిరించాడు. సూర్యప్రకాశ్ హత్యకు పక్కా ప్రణాళిక తన తండ్రినే చంపుతానంటాడా.. అని కక్ష పెంచుకున్న గోపాల్ సూర్యప్రకాశ్ హత్యకు పథకం వేశాడు. ఇందుకు కమలాపూర్‌కు చెందిన గండికోట శేఖర్‌ను కలిశాడు. ముంబయికి వస్తే డబ్బులిస్తామని నమ్మబలికారు. ఇద్దరూ కలిసి ఈనెల 12న ముంబయి వెళ్లి సూర్యప్రకాశ్‌ను దొరకబుచ్చుకున్నారు. అదే రోజు కారులో నేరెళ్లకు తీసుకొచ్చారు. ఈనెల 13న అర్ధరాత్రి నేరెళ్ల సాంబశివ ఆలయం వద్దకు తీసుకెళ్లి సూర్యప్రకాశ్ తలపై గోపాల్ బండరాయితో మోదాడు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. శవాన్ని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సారంగాపూర్ మండలం బట్టపెల్లి, పోతారం వెళ్లే రహదారి మీదుగా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కట్టెల్లో పెట్టి పెట్రోలు పోసి దహనం చేశారు. ఇటీవల కొందరు అటవీప్రాంతానికి వెళ్లగా.. అక్కడ గుర్తు తెలియని వ్యక్తిని కాల్చివేసిన ఆనవాళ్లు కనిపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. గుర్తు తెలియని శవంగా భావించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిందితులు శనివారం పోలీసులకు లొంగిపోయి హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులకు వివరించారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు గోపాల్‌తోపాటు శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలను మరింత లోతుగా విచారిస్తున్నట్లు వెల్లడించారు. సీఐ రాంనర్సింహరెడ్డి, ఎస్సై ఉదయ్‌కుమార్ ఉన్నారు. ● ఓ వ్యక్తి హత్యకు ప్లాన్..? ● డబ్బులు ఇవ్వనందుకు బెదిరింపులు ● బెదిరించాడని హత్యకు పక్కా ప్లాన్ ● పెట్రోల్ పోసి నిప్పంటించి మర్డర్ ● నిందితులు ధర్మపురి వాసులు ● హతుడిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం -
కన్నారం టు కాకినాడ
● పక్క రాష్ట్రంలో మన బియ్యం ● ఉమ్మడి కరీంనగర్వాసిపై కేసు ● పలువురు వ్యాపారుల పేర్లు తెరపైకి! ● దందాలో ఎలిగేడు మిల్లర్‌దే కీలక భూమిక? ● రేషన్ మాఫియా డాన్లకు అడ్డుకట్ట పడేనా.? కరీంనగర్ అర్బన్: రేషన్ బియ్యం దందా జడలు విప్పుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో రాష్ట్రం దాటుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ పోర్టు నుంచి భారీ ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఇటీవల అక్కడి అధికారులు గుర్తించారు. కాగా, అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రేషన్ బియ్యం ఉన్నట్లు తేలడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు స్టేషన్లో ఉమ్మడి జిల్లాకు చెందిన శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. అయితే, అసలైన సూత్రధారులు ఈ కేసులో అనామక వ్యక్తినే బలి చేశారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే, సిద్దిపేట జిల్లాలోని ఓ మిల్లుపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేయగా విచారణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలువురు వ్యాపారుల పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఉమ్మడి జిల్లా నుంచి రేషన్ బియ్యం యథేచ్ఛగా తరలుతుంటే నిఘా వ్యవస్థ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సంబంధిత అధికారుల డొల్లతనం బట్టబయలవుతోంది. 50 శాతానికి పైగా అక్రమార్కులకే.. జిల్లాలో ప్రతీ నెల 4,909 టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. ఇందులో 50 శాతానికి పైగా రేషన్ బియ్యం అక్రమార్కులకే చేరుతోంది. రేషన్ డీలర్లు దుకాణంలోనే కార్డుదారు వద్ద కొనుగోలు చేసి, అక్కడికక్కడే డబ్బులు చెల్లిస్తున్నారు. వీరు పోనూ కార్డుదారులు బియ్యం తీసుకెళ్లి, దళారులకు విక్రయిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌కు చేరే బియ్యంలో 40 శాతం డీలర్ల వద్ద నుంచి, 60 శాతం పలువురు మిల్లర్లు, దళారుల నుంచి మాఫియాకు చేరుతోంది. ఆయా శాఖల అధికారులను మచ్చిక చేసుకొని, బియ్యం దందా సాగిస్తున్నారు. కిలోకు రూ.12 నుంచి రూ.14 వరకు వినియోగదారులకు చెల్లిస్తుండగా కమీషన్ రూపేణా పలువురు డీలర్లు, దళారులు రూ.5 నుంచి రూ.6 తీసుకుంటున్నారు. ఇతరత్రా ఖర్చులు కలిపి, మాఫియాకు, రైస్‌మిల్లులకు చేరేసరికి కిలోకు రూ.25 అవుతోంది. ఆ బియ్యాన్ని పాలిష్ చేసి, కొత్త సంచుల్లో నింపి, ఎగుమతి చేస్తున్నారు. సదరు బియ్యం కాకినాడ ఓడ రేపుకు చేరేసరికి క్వింటాల్‌కు రూ.3 వేల వరకు ఖర్చవుతుండగా.. అక్కడ రూ.3,500 వరకు ధర పలుకుతోంది. ఈ లెక్కన ఒక ఏసీకే(290 క్వింటాళ్లు) కాకినాడ ఓడరేవులో విక్రయిస్తే రూ.1.50 లక్షలకు మించి గిట్టుబాటవుతోంది. దీంతో, ఈ దందాకే మాఫియా మొగ్గు చూపుతోంది. సంబంధిత శాఖల్లోని పలువురు అధికారులకు భారీగా గిఫ్ట్‌లు, ఆరంకెల్లో మామూళ్లు ఇస్తుండగా అక్రమ వ్యాపారం అడ్డూఅదుపు లేకుండా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. తప్పించుకునేందుకు పైరవీలు.. అనువైన సమయంలో సీఎమ్మార్ లోటు ఉన్న మిల్లులకు రేషన్ బియ్యం చేర్చుతుండగా అనువు గాని సమయంలో పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారని సమాచారం. పత్రికాధిపతులే తనకు మిత్రులని బీరాలు పలికే ఎలిగేడు మండలానికి చెందిన ఓ రైస్‌మిల్లర్ ఇందులో కీలక భూమిక పోషించినట్లు మిల్లర్ల నుంచి వినిపిస్తున్న మాట. సదరు మిల్లర్, పౌరసరఫరాల శాఖలోని ఓ అధికారి, సుల్తానాబాద్‌కు చెందిన మరో వ్యక్తి పెట్టుబడితోపాటు అక్రమ రవాణాలో సిద్ధహస్తులు. బియ్యం కొనుగోలు చేసే దళారులను పెంచి పోషించడం, రైస్‌మిల్లులను తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు వివిధ రకాల ఒత్తిడులు తెస్తారన్న ఆరోపణలున్నాయి. అధికారులతో దాడులు చేయించడం, బియ్యం కొనుగోలు చేస్తే తమ వద్దే కొనుగోలు చేయాలని హుకూం జారీ చేస్తున్నారని సమచారం. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ఇదే విధానంతో సఫలీకృతులైనట్లు తెలుస్తోంది. ఇక ఇతర రాష్ట్రాల బడా వ్యాపారులతో సత్సంబంధాలుండటంతో దందా అప్రతిహతంగా సాగుతోందన్న విమర్శలున్నాయి. అయితే, కాకినాడ కేసులు తమ మెడకు చుట్టుకోకుండా వీలైనన్ని మార్గాల్లో పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడి అధికార పార్టీ నేతలతోపాటు పక్క రాష్ట్రం అధికార పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపగా కేసుల నుంచి దాదాపు తప్పుంచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
వేర్వేరు చోట్ల ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల మీదుగా వేర్వేరు చోట్ల నుంచి గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం వివరాలు వెల్లడించారు. పట్టణ శివారులోని రాజీవ్‌గాంధీ చౌరస్తా వద్ద పట్టణ ఎస్సై గీత ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా.. శివాజీనగర్‌కు చెందిన కల్యాణం ఉదయ్ ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. అతని నుంచి కిలో గంజాయి, ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఉదయ్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాడవి జనక్రావు వద్ద కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. అలాగే పట్టణ ఎస్సై మన్మథరావు ఆధ్వర్యంలో తహసీల్ చౌరస్తా వద్ద తనిఖీలు చేపడుతుండగా.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పిప్పిరి గ్రామానికి చెందిన మాడవి జనక్రావు పట్టుబడ్డాడని పేర్కొన్నారు. ఆయన నుంచి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ వేణుగోపాల్, ఎస్సైలు పాల్గొన్నారు. -
కలెక్టర్ నివేదిక ప్రకారమే
వ్యవసాయం తగ్గి, పరిశ్రమలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, కలెక్టర్ నివేదిక ప్రకారమే గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదించాం. ఆనాటి ప్రభుత్వం ఆరెపల్లి, వల్లంపహాడ్, సదాశివపల్లిలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేసి, పక్కనే ఉన్న బొమ్మకల్ను కలపలేదు. ఆనాడు అక్కడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, కలెక్టర్ నివేదిక ఇచ్చారు. అదే తరహాలో ప్రస్తుతం కలెక్టర్ నివేదిక ప్రకారమే కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేస్తున్నాం. – అసెంబ్లీలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి ల్యాండ్ గ్రాబర్స్ను రక్షించడానికే కరీంనగర్‌కు దూరంగా ఉండే మానకొండూర్ నియోజకవర్గంలోని సదాశివపల్లిని ఆనాటి ప్రభుత్వం కలిపింది. అలాగే, అల్గునూర్ దూరంగా ఉన్నప్పటికీ విలీనం చేశారు. దీనిపై హైకోర్టులో కేసు వేశాం. ల్యాండ్ గ్రాబర్స్ను సీపీ జైలుకు పంపారు. వారందరినీ రక్షించడానికే కొత్తపల్లి మున్సిపాలిటీ విలీనాన్ని అడ్డుకుంటున్నారు. – అసెంబ్లీలో కవ్వంపల్లి సత్యనారాయణ, మానకొండూర్ ఎమ్మెల్యే