మోర్తాడ్ (బాల్కొండ): పొరుగు దేశాలతో వాణిజ్య వ్యాపార సంబంధాలను వృద్ధి చేయడానికి ఒమన్ ప్రభుత్వం విరివిగా జారీ చేసిన విజిట్ వీసాలను కొందరు దళారులు పక్కదారి పట్టించారు. ఒమన్ లో వ్యాపారం చేయడానికి విదేశీయులకు జారీ చేసిన విజిట్ వీసాలను నకిలీ ఏజెంట్లు నిరుద్యోగులకు అంటగట్టి సొమ్ము చేసుకున్నారు.
ఫలితంగా ఒమన్‌కు విజిట్ వీసాపై వెళ్లిన వందలాది మంది తెలంగాణ వలస కార్మికులు ఆ దేశంలో ఇరుక్కుపోయారు. విజిట్ వీసా గడువు ముగిసిపోవడంతో అక్కడ ఉండలేక, ఇంటికి చేరాలంటే రూ.లక్ష చొప్పున జరిమానా చెల్లించలేక వలస కార్మికులు దిక్కుతోచని స్థితిలో మగ్గుతున్నారు. కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఒమన్ విదేశీ వ్యాపారులను ఆహ్వానించి పెట్టుబడులు పెట్టేలా చర్యలు చేపట్టింది.
ఇలా ఐదు నెలల కింద విజిట్ వీసాలను ఎక్కువగా జారీ చేసింది. ఒకసారి జారీ చేసిన విజిట్ వీసాను రెండుమార్లు గడువు పొడిగించుకోవడానికి ఒమన్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి అవకాశాలు పొందాలనుకునే ఔత్సాహికులను నకిలీ ఏజెంట్లు ఆకర్షించారు. ఒమన్‌కు విజిట్ వీసాపై వెళ్లి వర్క్ వీసా పొందవచ్చని నమ్మించారు.
300 మంది తెలంగాణ వలస కార్మికులు
ఉచితంగా జారీ చేసిన విజిట్ వీసాలను రూ.80 వేలకు ఒకటి చొప్పున విక్రయించి దాదాపు 300 మంది తెలంగాణ వలస కార్మికులను తరలించారు. విజిట్ వీసాలపై వచ్చినవారికి ఒమన్‌లోని కంపెనీలు పనులు ఇవ్వడానికి నిరాకరించాయి. ఒక నెల విజిట్ వీసా గడువు ముగిసిపోవడంతో మరో నెల రోజులకు పొడిగించుకుని ఉపాధి అవకాశాల కోసం కార్మికులు ప్రయత్నించారు.
కంపెనీలలో ఉన్నవారికే సరైన పని లేకపోవడంతో విజిట్ వీసాలపై వచ్చిన వారికి పనులు ఇచ్చే అవకాశం అసలే లేకపోయింది. కొందరు వలస కార్మికులు తమ చేతిలో డబ్బు లేకపోవడంతో వీసా గడువు పొడిగించుకోలేక రహస్యంగా అక్కడే ఉండిపోయారు. పార్కులు, స్నేహితుల గదుల్లో కార్మికులు తలదాచుకుంటున్నారు. వీసా రెన్యూవల్, జరిమానా చెల్లించేందుకు డబ్బుల్లేకపోవడంతో వలస కార్మికులు స్వదేశం తిరిగి రావడానికి అవస్థలు పడుతున్నారు.
వీసా ఉంటేనే రావాలి: గుండేటి గణేశ్
ఒమన్‌లోని ఇండియన్ సోషల్ క్లబ్ ప్రతినిధి గుండేటి గణేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ దేశానికి విజిట్ వీసాపై వచ్చిన వారికి పనులు ఇవ్వడం లేదన్నారు. కంపెనీ వీసా ఉంటేనే ఒమన్‌కు రావాలని సూచించారు. చిక్కుకుపోయిన వలస కార్మికులను మాతృభూమికి పంపించడానికి ఎంబసీ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని గణేశ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment