
ఈ ఏడాది సెప్టెంబర్‌లో టోర్నీ
న్యూఢిల్లీ: ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఈసారి 8 జట్లు పాల్గొననున్నాయి. ఒమన్ జట్టు తొలిసారి ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించింది. గత ఏడాది జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రీమియర్ కప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలువడం ద్వారా యూఏఈ, ఒమన్ జట్లు ఆసియా కప్ టోర్నీకి అర్హత పొందాయి. ఈ రెండు జట్లతోపాటు హాంకాంగ్ జట్టు కూడా ఆసియా కప్‌లో ఆడనుంది. 2026లో టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యలో ఈసారి ఈ టోర్నీని టి20 ఫార్మాట్‌లో నిర్వహిస్తారు.
2023 వన్డే ప్రపంచకప్‌నకు ముందు జరిగిన ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరిగే అవకాశమున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వర్గాలు వెల్లడించాయి. ఆసియా కప్ ఆతిథ్య హక్కులు భారత్ వద్ద ఉన్నప్పటికీ... తటస్థ వేదికపై టోర్నీ జరగనుంది.
ప్రస్తుతం పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లకుండా... దుబాయ్‌లోనే అన్నీ మ్యాచ్‌లు ఆడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో పాకిస్తాన్ జట్టు కూడా భారత్‌లో పర్యటించబోమని గతంలోనే వెల్లడించింది. దీంతో ఆసియా కప్‌ను యూఏఈ, శ్రీలంకలో నిర్వహించనున్నారు. ఆసియా కప్ చరిత్రలో భారత్ 8 సార్లు విజేతగా నిలిచి విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment