
రోమ్‌లో ముగిసిన ఇరాన్, అమెరికా రెండో దఫా చర్చలు
రోమ్: అణు కార్యక్రమాలను ఇరాన్ మరింతగా వేగవంతం చేసిన నేపథ్యంలో ఆ దేశంతో అమెరికా మొదలెట్టిన రెండో దఫా చర్చలు శనివారం రోమ్‌లో ముగిశాయి. తొలి దఫా చర్చలు ఒమన్‌లో ముగియగా రెండో రౌండ్ చర్చలు ఇటలీ వేదికగా శనివారం జరిగాయి. ఇటలీ రాజధాని రోమ్ నగరానికి సమీపంలోని క్యామిలూసియా ప్రాంతంలోని ఒమన్ రాయబార కార్యాలయంలో ఈ పరోక్ష చర్చలు జరిగాయి.
అమెరికా తరఫున అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగీ్చలు చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చలకు ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీ మధ్యవర్తిగా వ్యవహరించారు. అయితే రెండోదఫా చర్చల్లో ఎలాంటి పురోగతి ఉందనే వివరాలను ఇరుదేశాలు వెల్లడించలేదు. అయితే ఏప్రిల్ 26వ తేదీన ఒమన్‌లో స్టీవ్ విట్కాఫ్‌తో మూడో దఫా చర్చలు జరగనున్నాయని ఇరాన్ మంత్రి అబ్బాస్ చెప్పారు.
‘‘ఇరాన్ గొప్పగా, సుసంపన్నంగా ఉంటే సరిపోతుంది. అణ్వాస్త్ర సామర్థ్యంతో పనిలేదు. ఆ సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడమే మా లక్ష్యం’’అని ట్రంప్ శుక్రవారం వ్యాఖ్యానించారు. ‘‘మేం ఎల్లప్పడూ బాధ్యతాయుతంగానే మెలిగాం. సమస్యలకు దౌత్యమార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నాం. సంపత్రింపులు కొనసాగుతాయి’’అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ శనివారం తన ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. చర్చలు ముందు ఇరాన్ మంత్రి అరాగ్చీ ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీతో భేటీ అయ్యారు. తదుపరి చర్చల్లో రష్యా సైతం భాగస్వామి కానుందని వార్తలొచ్చాయి.