talks again
-
భారత్–చైనామధ్య 13వ దఫా చర్చలు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో భారత్, చైనా ఆదివారం 13వ దఫా చర్చలు జరపనున్నాయి. చైనా బలగాలు ఇటీవల సరిహద్దులు దాటి ఉత్తరాఖండ్‌లోని బారాహోతీ సెక్టార్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లలోకి ప్రవేశించిన నేపథ్యంలో జరుగుతున్న ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తూర్పు లద్దాఖ్ ఘర్షణాత్మక ప్రాంతాల్లోని కొన్ని ఫార్వర్డ్ పోస్టుల్లో మోహరించిన బలగాల ఉపసంహరణే ఈ భేటీ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్ పాయింట్లో 10వ తేదీ ఉదయం 10.30 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయని వెల్లడించాయి. భారత బృందానికి లెహ్‌లోని 14 కారప్స్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నాయకత్వం వహించనున్నారు. డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల విషయం ప్రస్తుతానికి పక్కనబెట్టి, మిగతా ఘర్షణాత్మక ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ చేపట్టాలని చర్చల సందర్భంగా భారత్ ప్రతినిధులు పట్టుబట్టే అవకాశం ఉంది. 12వ విడత చర్చలు జూలై 31వ తేదీన జరిగాయి. ఫలితంగా కీలకమైన గోగ్రా పాయింట్ నుంచి రెండు దేశాల ఆర్మీ ఉపసంహరణ పూర్తయింది. చైనా మోహరింపులు ఆందోళనకరం ప్రతిష్టంభన కొనసాగుతున్న తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా మిలటరీ మోహరింపులు కొనసాగించడం, మౌలిక వసతులను పెంచుకోవడం ఆందోళన కలిగించే అంశమని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే అన్నారు. ఇండియాటుడే కాంక్లేవ్‌లో శనివారం ఆయన మాట్లాడారు. శీతాకాలం ఆసాంతం బలగాల మోహరింపులను చైనా కొనసాగించాలని చూస్తే, పాకిస్తాన్ వైపు ఎల్వోసీ (నియంత్రణ రేఖ) వెంబడి వంటి పరిస్థితికి దారితీయవచ్చని భావిస్తున్నామన్నారు. ఆ దేశ మిలటరీ పీఎల్ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆరీ్మ)కదలికలపై ఓ కన్నేసి ఉంచామన్నారు. చైనా సైన్యానికి సరితూగే స్థాయిలో భారత్ కూడా బలగాల మోహరింపులను కొనసాగిస్తుందని, ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. ప్రపంచమంతటా కోవిడ్ మహమ్మారి తీవ్రత కొనసాగుతుండటం, దక్షిణ చైనా సముద్రంలో ఒక వైపు వివాదాలను ఎదుర్కొంటున్న చైనా..మరో వైపు భారత్‌తో ప్రతిష్టంభనను ఎందుకు కొరుకుంటోందనేది అర్థం కాని విషయమన్నారు. ఏదేమైనప్పటికీ తూర్పు లద్దాఖ్ ప్రతిష్టంభనతో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు. కశ్మీర్లో పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ.. అఫ్గాన్ ఉగ్రవాదులు కశీ్మర్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చెలాయించిన సమయంలోనూ అక్కడి ఉగ్రమూకలు కశీ్మర్‌లోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారని ఆయన గుర్తు చేశారు. అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు, ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు మన బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడానికి, ఇటీవలి కాలంలో ఉగ్రవాదులు కశీ్మర్లో పౌరులను లక్ష్యంగా చేసుకోవడంతో సంబంధం ఉన్నట్లు భావించడం లేదని తెలిపారు. లోయలో అశాంతిని ప్రేరేపించాలని కుట్రపన్నిన ఉగ్రమూకలు చివరి ప్రయత్నంగా అమాయకులను పొట్టనబెట్టుకుంటున్నాయన్నారు. స్వేచ్ఛా నౌకాయానమే కీలకం: రాజ్‌నాథ్ భారతదేశ అభివృద్ధి స్వేచ్ఛా నౌకాయానంతోనే ఎక్కువగా ముడిపడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఎంతోకాలం నుంచి సముద్రంతోనే మనకు సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. మన వాణిజ్యం, ఆరి్థక వ్యవస్థ, మన పండుగలు, సంస్కృతి సముద్రంతోనే సాన్నిహిత్యం కలిగి ఉన్నాయి. అయినప్పటికీ, సముదప్రాంతానికి సంబంధించి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం’ అని శనివారం జరిగిన భారత తీర రక్షక దళం(ఐసీజీ) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సముద్రయాన భద్రత లేకుండా, దేశానికి సమగ్ర రక్షణ వ్యవస్థను సాధించడం అసాధ్యమన్నారు. -
రైతు సంఘాలతో చర్చల్లో పురోగతి
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రద్దు సహా నాలుగు ప్రధాన డిమాండ్లపై కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య బుధవారం జరిగిన చర్చల్లో కొంత పురోగతి చోటు చేసుకుంది. రైతుల ప్రధానమైన 4 డిమాండ్లలో.. సాగు చట్టాల రద్దుకు విధివిధానాలు రూపొందించడం, కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు చట్టబద్ధత కల్పించడమనే రెండు డిమాండ్ల అమలుపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. రైతులపై విద్యుత్ బిల్లుల భారం పెంచే విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌కు, అలాగే, పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు జరిమానా విధించే ప్రతిపాదనను విరమించుకోవాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్, సోం ప్రకాశ్ సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులైన 40 రైతు సంఘాల నేతలతో బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మధ్యాహ్నం 2 నుంచి దాదాపు ఐదు గంటల పాటు చర్చలు జరిపారు. ఇర వర్గాల మధ్య ఇవి ఆరో విడత చర్చలు. 50% అంశాలపై రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరిందని చర్చల అనంతరం తోమర్ వ్యాఖ్యానించారు. ప్రతిష్టంభన నెలకొన్న మిగతా రెండు డిమాండ్లపై వచ్చే సంవత్సరం జనవరి 4న చర్చిస్తామన్నారు. ‘చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. రెండు అంశాలపై ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చాయి. మూడు వ్యవసాయ చట్టాలు, ఎమ్మెస్పీపై చర్చలు జనవరి 4న కొనసాగుతాయి’ అన్నారు. రైతు నేతలు కొత్త సాగు చట్టాల రద్దుకు పట్టుపట్టారని, అయితే, చట్టాల వల్ల ప్రయోజనాలను వారికి వివరించామని తెలిపారు. చట్టాలకు సంబంధించి తమ అభ్యంతరాలను నిర్దిష్టంగా తెలపాలని కోరామన్నారు. ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌పై స్పందిస్తూ.. దీనిపై లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న వేలాది రైతులపై తోమర్ ప్రశంసలు కురిపించారు. వారు శాంతియుతంగా, క్రమశిక్షణతో నిరసన తెలుపుతున్నారన్నారు. చలి తీవ్రమవుతున్న దృష్ట్యా.. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలను ఇళ్లకు పంపించాలని కోరారు. విద్యుత్ చార్జీలు, పంట వ్యర్థాల దహనంపైనే బుధవారం నాటి చర్చలు ప్రధానంగా జరిగాయని రైతు నేత కల్వంత్ సింగ్ సంధు వెల్లడించారు. చర్చల్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సానుకూలంగా ఉందని రైతు నేతలు వ్యాఖ్యానించారు. ఎమ్మెస్పీని సమర్ధవంతంగా అమలు చేసేందుకు నిపుణులతో కమిటీ వేస్తామన్న ప్రతిపాదనను తిరస్కరించామని పంజాబ్ కిసాన్ యూనియన్ నేత రుల్దు సింగ్ మాన్సా వెల్లడించారు. ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. విద్యుత్ సవరణ బిల్లును వెనక్కు తీసుకుంటామని, పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు శిక్ష విధించే నిబంధనను తొలగిస్తూ సంబంధిత ఆర్డినెన్స్‌లో సవరణలు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై 2న రైతుల చర్చ కొత్త వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చిన తరువాత వరి సహా పలు పంటలను కనీస మద్దతు ధర కన్నా తక్కువకే అమ్మాలని రైతులపై ఒత్తిడి చేస్తున్నారని రైతు నేతలు బుధవారం తెలిపారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలు వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్‌లో పంటల మార్కెట్ ధరలు 50శాతానికిపైగా పడిపోయాయి. ఎమ్మెస్పీ కన్నా తక్కువ ధరకే అమ్మాలని రైతులను ఒత్తిడి చేస్తున్నారు. వరి క్వింటాల్‌కు రూ. 800లకు అమ్మాల్సి వస్తోంది. ఈ విషయాలను చర్చల్లో లేవనెత్తుతాం’ అని చర్చలు ప్రారంభమయ్యే ముందు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ వివరించారు. ‘మా డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేవరకు ఉద్యమం కొనసాగుతుంది. నూతన సంవత్సర వేడుకలను కూడా ఇక్కడే జరుపుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై జనవరి 2వ తేదీన రైతు సంఘాల ప్రతినిధులు సింఘు సరిహద్దు వద్ద అంతర్గత చర్చలు జరుపుతారని ఆల్ ఇండియా కిసాన్ సభ నేత హన్నన్ మొల్లా వెల్లడించారు. రైతులతో కలిసి భోజనం ఆరో విడత చర్చల సందర్భంగా రైతు నేతల కోసం దీక్షాస్థలి నుంచి వచ్చిన భోజనాన్నే కేంద్ర మంత్రులు సైతం భుజించారు. చర్చలు ప్రారంభమైన రెండు గంటల తరువాత రైతు నేతలకు నిరసన కేంద్రంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కిచెన్ నుంచి ఒక వ్యాన్‌లో భోజనం వచ్చింది. అదే ఆహారాన్ని చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు తోమర్, గోయల్, సోమ్ ప్రకాశ్ కూడా స్వీకరించారు. సాయంత్రం ప్రభుత్వం ఆఫర్ చేసిన టీ, స్నాక్స్‌ను రైతు నేతలు తీసుకున్నారు. గత చర్చల సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనాన్ని రైతు నేతలు తిరస్కరించి, తమ కోసం దీక్షాస్థలి నుంచి వచ్చిన ఆహారాన్నే స్వీకరించిన విషయం తెలిసిందే. రెండు కమిటీలు రైతుల అభ్యంతరాలపై నిపుణులతో రెండు కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రతిపాదన. కనీస మద్దతు ధరకు, మార్కెట్ ధరకు మధ్య అసమానతలను తొలగించేందుకు ఒక కమిటీని, వ్యవసాయ చట్టాలపై రైతులు వెలిబుచ్చుతున్న అభ్యంతరాలను తొలగించేందుకు, చట్టాల్లో సవరణలను సూచించేందుకు మరో కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించిన ప్రభుత్వం. ఈ ప్రతిపాదనలను రైతు నేతలు తోసిపుచ్చారు. వాయిదా చర్చల్లో పురోగతి నేపథ్యంలో నేడు తలపెట్టిన ట్రాక్టర్ మార్చ్‌ను వాయిదా వేసుకున్న రైతు సంఘాలు. మోదీది ‘అసత్యాగ్రహ’ చరిత్ర ప్రధాని మోదీపై రైతులు విశ్వాసం కోల్పోయారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ తన ‘అసత్యాగ్రహ’ చరిత్ర వల్ల దేశ ప్రజల నమ్మకం కోల్పోయారన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలను మోదీ ఎందుకు రద్దు చేయడం లేదనే అంశంపై జరిగిన ఆన్లైన్ సర్వేను రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ప్రతీ పౌరుడి బ్యాంక్ ఖాతాలో రూ. 15 లక్షలు’, ‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలు’, ‘50 రోజుల సమయమివ్వండి’, ‘కరోనాపై 21 రోజుల్లో విజయం సాధిస్తాం’, ‘మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేదు. చైనా మన పోస్ట్‌లను ఆక్రమించలేదు’.. ఇలాంటి ‘అసత్యాగ్రహ’ చరిత్ర కారణంగా రైతులు ప్రధాని మోదీని నమ్మడం లేదని రాహుల్ పేర్కొన్నారు. చర్చల వేళ విజ్ఞాన్ భవన్లో భోజనం చేస్తున్న రైతు ప్రతినిధులు సింఘు సరిహద్దు వద్ద మువ్వన్నెల జెండాతో రైతు -
30న చర్చలకు రండి
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది..ఈ నెల 30న చర్చలకు రావాల్సిందిగా కేంద్రం ఆహ్వానం పంపితే, తమ ఎజెండాను అంగీకరించకుండా కేంద్రం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి విమర్శించింది. అయితే ప్రభుత్వ ఆహ్వానాన్ని సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నామని సంఘాలు తెలిపాయి. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన 34వ రోజుకు చేరుకుంది. ప్రతిష్టంభన తొలగించేందుకు ఈనెల 30న చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చేస్తున్న 40 రైతు సంఘాలను ఆహ్వానించింది. సాగు చట్టాలకు సంబంధించిన అన్ని అంశాలు చర్చించి ఒక సరైన పరిష్కారం కనుగొనేందుకు చర్చిద్దామని తెలిపింది. వ్యవసాయ చట్టాలపై ఈనెల 29న చర్చిద్దామన్న రైతు సంఘాల ప్రతిపాదనకు ప్రభుత్వం బదులిస్తూ ఈ నెల 30న చర్చలకు సరేనంది. ఈ మేరకు బుధవారం విజ్ఞాన భవన్లో మధ్యాహ్నం 2గంటలకు చర్చలకు రావాలని రైతు సంఘాలకు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ లేఖ రాశారు. ఇప్పటివరకు ఇరు పక్షాల మధ్య ఐదు మార్లు చర్చలు జరిగాయి. ఇరు పక్షాల మధ్య ఈ నెల 5న జరిగిన చర్చలు ఫలితం లేకుండానే ముగిశాయి. తిరిగి డిసెంబర్9న చర్చలు జరగాల్సిఉండగా వాయిదా పడ్డాయి. ఆ సమయంలో హోంమంత్రి అమిత్‌షాతో జరిపిన చర్చలు ఫలితాన్నివ్వలేదు. కానీ చర్చల అనంతరం చట్టాలకు 7–8 సవరణలు చేయడంతో పాటు, ఎంఎస్పీపై రాతపూర్వక హామీ ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29న చర్చించేందుకు తయారని రైతు సంఘాలు కేంద్రానికి వెల్లడించాయి. మేం రెడీ, కానీ.. ఈనెల 30న చర్చలకు రావాలన్న కేంద్ర ప్రతిపాదనపై రైతు సంఘాలు సూత్రప్రాయ ఆమోదం తెలిపాయి. కానీ ముందుగా కేంద్రం చర్చల ఎజెండాను ప్రకటించాలని కోరాయి. తాము ప్రతిపాదించిన పూర్తి ఎజెండాకు అంగీకరించట్లేదని, సమస్యలను పరిష్కరించేందుకు ఏమాత్రం ఇష్టపడట్లేదనేది అర్థమౌతోందని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి విమర్శించింది. మూడు చట్టాలను పూర్తిగా రద్దు చేయడం, ఎంఎస్పీకి గ్యారెంటీ ఇవ్వడం అనే అంశాలను ఎజెండాలో ఉంచాలనేది తమ డిమాండని, కానీ ప్రభుత్వం తాజా లేఖలో ఇవేమీ ప్రస్తావించలేదని రైతు సంఘ నాయకుడు అభిమన్యు కోహార్ చెప్పారు. వచ్చే నెల్లో నిరసనలు వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ చట్టంపై ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న పోరాటాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా బలోపేతం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నిర్ణయించింది. ఈమేరకు జనవరి 6, 7 తేదీల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వివిధ స్థాయిల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి ఏఐఏడబ్ల్యూయూ పిలుపునిచ్చింది. జిల్లా స్థాయిలో వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ తెలిపారు. 1500 సెల్ టవర్లు ధ్వంసం పంజాబ్‌లో దాదాపు 1500కు పైగా సెల్ టవర్లను రైతులు ధ్వంసం చేసినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. దీంతో పలు చోట్ల సెల్ సేవలకు అంతరాయం కలిగినట్లు తెలిసింది. టవర్‌కు పవర్ సప్లై ఆపడం, కేబుల్స్ కట్ చేయడం వంటి చర్యలతో 1411 టవర్లు డ్యామేజీ అయ్యాయని, వాటి సంఖ్య ప్రస్తుతం 1500 దాటి ఉంటుందని సదరు వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా అంబానీ, ఆదానీలకు కొత్త సాగు చట్టాలు మేలు చేస్తాయన్న పుకార్లతో రైతులు విధ్వంసానికి దిగినట్లు చెప్పారు. మా ఎజెండా ఇదే.. సాగు చట్టాల రద్దు, ఎంఎస్పీకి లీగల్ గ్యారెంటీ, ఢిల్లీలో వాయుకాలుష్య నివారణ ఆర్డినెన్సుకు సవరణలు, విద్యుత్ బిల్లుకు కీలక సవరణలు చేయడమనేవి తమ ఎజెండాలో ముఖ్యమైన అంశాలని రైతు సంఘాలు తెలిపాయి. ప్రభుత్వం మాత్రం అస్పష్టమైన విధానంతో చర్చలకు ఆహ్వానిస్తోందని విమర్శించాయి. కాగా మూడు సాగు చట్టాలు, ఎంఎస్పీ, విద్యుత్ బిల్లు, ఢిల్లీలో వాయుకాలుష్య నివారణ ఆర్డినెన్సుపై కూలంకషంగా చర్చిస్తామని వ్యవసాయ కార్యదర్శి సంజయ్ చెప్పారు. అయితే రైతు సంఘాలు కోరినట్లు స్పష్టమైన వాగ్దానాలేవీ కేంద్రం చేయలేదు. మరోవైపు నెలపైగా ఆందోళన చేస్తున్న రైతుల్లో కొందరు సొంతవూర్లకు వెళ్లి కుటుంబాలతో కలిసి తిరిగి వస్తున్నట్లు తెలిసింది. -
భారత్, చైనా సుదీర్ఘ చర్చలు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య చర్చలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదలైన ఆరో విడత చర్చలు రాత్రి 9 గంటల తర్వాత కూడా ఒక కొలిక్కి రాలేదు. రెండు దేశాల మధ్య కుదిరిన ఐదు అంశాల ఒప్పందం అమలే లక్ష్యంగా జరుగుతున్న ఈ చర్చల్లో భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్‌తోపాటు మొదటిసారిగా విదేశాంగ శాఖ తరఫున జాయింట్ సెక్రటరీ నవీన్ శ్రీవాస్తవ కూడా పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన మాస్కోలో రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య కుదిరిన ఒప్పందంలోని ఐదు అంశాల అమలుకు కాలపరిమితిని ఖరారు చేయడంపైనే భారత బృందం దృష్టి పెట్టిందని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించిన చైనా బలగాలను సాధ్యమైనంత త్వరలో, పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఈ బృందం కోరుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఐదు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిగినా చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ లేకుండానే ముగిసిన విషయం తెలిసిందే. -
చైనా బలగాలు వెనుదిరగాలి
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా భారత్, చైనాల మధ్య రెండో విడత లెఫ్ట్‌నెంట్ జనరల్ స్థాయి చర్చలు సోమవారం జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లోని చూశుల్ సెక్టార్లో చైనా భూభాగంలోని మోల్డో వద్ద ఉదయం 11.30 గంటలకు ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. జూన్ 6న జరిగిన తొలి విడత చర్చల్లో కుదిరిన ఒప్పందాల అమలు సహా ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం పెరిగేందుకు చేపట్టాల్సిన పలు చర్యలపై ఈ భేటీలో చర్చించారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అలాగే, అన్ని ప్రాంతాల నుంచి మే 4 నాటి యథాతథ స్థితికి చైనా బలగాలు వెనుదిరగాలని భారత్ డిమాండ్ చేసిందని వెల్లడించాయి. ఏ రోజు నాటికి వెనక్కు వెళ్తారో వివరిస్తూ.. టైమ్‌లైన్ కూడా చెప్పాలని భారత్ కోరినట్లు తెలిపాయి. అయితే, ఆ భేటీలో గల్వాన్ ఘర్షణల అంశం చర్చించారా? లేదా అనే విషయంపై స్పష్టత లేదన్నాయి. ఈ చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి 14 కారŠప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా బృందానికి టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ నేతృత్వం వహించారు. దళాల ఉపసంహరణకు విధి విధానాలను రూపొందించే దిశగా చర్చలు జరిగినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గల్వాన్ లోయ సహా అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని జూన్ 6న ఇదే ప్రదేశంలో జరిగిన చర్చల్లో ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే, ఆ తరువాత జూన్ 15న గల్వాన్ లోయలో ఇరుదేశాల జవాన్ల మధ్య తీవ్రస్థాయిలో హింసాత్మక ఘర్షణలు జరిగి, భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఆ ఘర్షణల్లో కల్నల్ సహా 20 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తమ సైనికుల మరణాలపై చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ 35 మంది చైనా సైనికులు చనిపోయారని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. తాజాగా, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ స్థాయి అధికారి ఆ ఘర్షణల్లో చనిపోయినట్లు తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ సమీక్ష మరోవైపు, చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న క్షేత్ర స్థాయి పరిస్థితులపై సోమవారం జరిగిన సదస్సులో ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె, ఇతర ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా సైన్యం కదలికలు, భారత సైన్య సన్నద్ధతపై చర్చించారు. రెండు రోజుల పాటు ఈ సదస్స కొనసాగనుంది. ఈ సందర్భంగా లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో సరిహద్దుల వెంట భారత సైన్యం సన్నద్ధతపై సమగ్ర సమీక్ష జరిపారు. ఆ సమాచారం తెలియదు: చైనా గల్వాన్ లోయలో చోటు చేసుకున్న జూన్ 15 నాటి ఘర్షణల్లో భారత సైనికుల చేతిలో 40 మంది చైనా జవాన్లు చనిపోయారని కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు చైనా నిరాకరించింది. ఆ సమాచారం తమ వద్ద లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ సోమవారం మీడియా అడిగిన ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. భారత్‌లో సరిహద్దు వివాద పరిష్కారానికి దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని మరోసారి చెప్పారు.