లద్దాఖ్‌లోని లేహ్ సమీప పర్వత ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్న వైమానిక దళ ఫైటర్ జెట్ (ఇన్‌సెట్‌లో) విమానం
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా భారత్, చైనాల మధ్య రెండో విడత లెఫ్ట్‌నెంట్ జనరల్ స్థాయి చర్చలు సోమవారం జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లోని చూశుల్ సెక్టార్‌లో చైనా భూభాగంలోని మోల్డో వద్ద ఉదయం 11.30 గంటలకు ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. జూన్ 6న జరిగిన తొలి విడత చర్చల్లో కుదిరిన ఒప్పందాల అమలు సహా ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం పెరిగేందుకు చేపట్టాల్సిన పలు చర్యలపై ఈ భేటీలో చర్చించారని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
అలాగే, అన్ని ప్రాంతాల నుంచి మే 4 నాటి యథాతథ స్థితికి చైనా బలగాలు వెనుదిరగాలని భారత్ డిమాండ్ చేసిందని వెల్లడించాయి. ఏ రోజు నాటికి వెనక్కు వెళ్తారో వివరిస్తూ.. టైమ్‌లైన్ కూడా చెప్పాలని భారత్ కోరినట్లు తెలిపాయి. అయితే, ఆ భేటీలో గల్వాన్ ఘర్షణల అంశం చర్చించారా? లేదా అనే విషయంపై స్పష్టత లేదన్నాయి. ఈ చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి 14 కారŠప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా బృందానికి టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ నేతృత్వం వహించారు. దళాల ఉపసంహరణకు విధి విధానాలను రూపొందించే దిశగా చర్చలు జరిగినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
గల్వాన్ లోయ సహా అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని జూన్ 6న ఇదే ప్రదేశంలో జరిగిన చర్చల్లో ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే, ఆ తరువాత జూన్ 15న గల్వాన్ లోయలో ఇరుదేశాల జవాన్ల మధ్య తీవ్రస్థాయిలో హింసాత్మక ఘర్షణలు జరిగి, భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఆ ఘర్షణల్లో కల్నల్ సహా 20 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తమ సైనికుల మరణాలపై చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ 35 మంది చైనా సైనికులు చనిపోయారని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. తాజాగా, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ స్థాయి అధికారి ఆ ఘర్షణల్లో చనిపోయినట్లు తెలుస్తోంది.
ఆర్మీ చీఫ్ సమీక్ష
మరోవైపు, చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న క్షేత్ర స్థాయి పరిస్థితులపై సోమవారం జరిగిన సదస్సులో ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె, ఇతర ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా సైన్యం కదలికలు, భారత సైన్య సన్నద్ధతపై చర్చించారు. రెండు రోజుల పాటు ఈ సదస్స కొనసాగనుంది. ఈ సందర్భంగా లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో సరిహద్దుల వెంట భారత సైన్యం సన్నద్ధతపై సమగ్ర సమీక్ష జరిపారు.
ఆ సమాచారం తెలియదు: చైనా
గల్వాన్ లోయలో చోటు చేసుకున్న జూన్ 15 నాటి ఘర్షణల్లో భారత సైనికుల చేతిలో 40 మంది చైనా జవాన్లు చనిపోయారని కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు చైనా నిరాకరించింది. ఆ సమాచారం తమ వద్ద లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ సోమవారం మీడియా అడిగిన ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. భారత్‌లో సరిహద్దు వివాద పరిష్కారానికి దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని మరోసారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment