Galwan Valley
-
మోదీ, జిన్‌పింగ్ భేటీ సఫలం.. భారత బోర్డర్లో కీలక పరిణామం
ఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తూర్పు లడఖ్ ప్రాంతం నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇటీవల బ్రిక్స్ సమావేశాల సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాల్లో భాగంగానే బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు స్పష్టం చేసింది.రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా భారత్, చైనా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా రెండు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగానే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైందని భారత రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు లఢఖ్ సెక్టార్‌లోని రెండు కీలక ప్రాంతాలైన డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు అధికారులు చెప్పారు.అలాగే, ఈ ప్రాంతంలోని సైనిక సామగ్రి, ఇతర పరికరాలను భారత బలగాలు వెనక్కి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. లడఖ్ నుంచి పశ్చిమ దిశగా భారత బలగాలు, తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. ఇదే సమయంలో ఎల్ఏసీ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల బలగాలు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. రెండు దేశాల బలగాలు అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత మరికొన్ని రోజుల్లోనే డెస్పాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను మళ్లీ ప్రారంభించనున్నట్టు సమాచారం.Disengagement of troops of India and China has started at two friction points in Demchok and Depsang Plains in Eastern Ladakh sector. As per the agreements between the two sides, the Indian troops have started pulling back equipment to rear locations in the respective areas:… pic.twitter.com/CzwAZs4sJG— ANI (@ANI) October 25, 2024ఇదిలా ఉండగా.. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో 2020 జూన్ 15న భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ సందర్బంగా భారత్‌కు చెందిన 20 మంది జవాన్లు వీర మరణం పొందారు. ఇదే సమయంలో చైనా కూడా తన సైన్యాన్ని కోల్పోయింది. దీంతో, నాటి నుంచి ఎల్ఏసీ వెంబడి రెండు దేశాల బలగాలు భారీ సంఖ్యలో మోహరించాయి. అయితే, గాల్వాన్ దాడిలోనే తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు. -
China: గల్వాన్ ఘటన తర్వాత మరిన్ని..?
ఢిల్లీ: గల్వాన్ ఉద్రిక్తతల తర్వాత.. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత్-చైనా సైనిక దళాల మళ్లీ ఘర్షణలు జరిగాయి. కనీసం మరో రెండుసార్లు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. తాజాగా.. భారత సైనిక పశ్చిమ దళం ఆధ్వర్యంలో సైనికులకు సాహస పురస్కారాల ప్రదాన కార్యక్రమం కారణంగా ఈ విషయం బయటపడింది. వారికి ఎందుకు ఈ పురస్కారాలు ఇస్తున్నదీ చెప్పే పత్రాల వల్ల విషయం బయటకు వచ్చింది. ఇక ఈ నెల 13న జరిగిన కార్యక్రమానికి సంబంధించిన వీడియోను చాందీమందిర్‌లో ఉన్న ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ ప్రధాన కార్యాలయం యూట్యూబ్ ఛానెల్ అప్లోడ్ చేసింది. అయితే.. సోమవారం ఆ చానెల్ డీయాక్టివేట్ కావడం గమనార్హం. దీనిపై సైన్యం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ, 2021 సెప్టెంబరు- 2022 నవంబరు మధ్య చైనాతో ఘర్షణలు జరిగినట్లు పత్రాల్లో ఉంది. అయితే రెండుసార్లే ఘర్షణలు జరిగాయా? మరిన్ని జరిగాయా? అనేదానిపైనా సైన్యం స్పందించాల్సి ఉంది. మే 2020లో తూర్పు లడఖ్ సరిహద్దు వరుస వివాదం తర్వాత.. వాస్తవాధీన రేక వెంట భారత్, చైనా దళాల మధ్య అనేక వాగ్వివాదాలు జరిగాయి. ఆ మరుసటి నెలలోనే గల్వాన్ లోయలో ఘర్షణలు జరగ్గా.. ఇరువైపులా గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి తర్వాత 3,488 కి.మీ. ఎల్ఏసీ వెంట భారత సైన్యం ప్రత్యేక అప్రమత్తతతో ఉంటోంది. తవాంగ్ సెక్టార్లో కూడా చైనా దళాలు అతిక్రమించడానికి ప్రయత్నించాయని.. చైనా ప్రయత్నాలన్నింటిని భారత సైనికులు దృఢంగా ఎదుర్కొన్నారని పార్లమెంట్లో ఆ సమయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ప్రకటన చేశారు కూడా. -
భారత – చైనా బంధం బలపడేనా?
సరిహద్దు సమస్యను పూర్తి స్థాయి సంబంధాలలో ఒక అంశంగా మాత్రమే ఉంచాలనీ, అది సంబంధాల మొత్తం స్వభావాన్ని నిర్వచించకూడదనీ చైనీయులు పట్టుబట్టడం కొనసాగిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ‘అసాధారణం’గా ఉందనీ, ఇది ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నదనే భారత వైఖరిని ఇది పరోక్షంగా తిరస్కరించడమే! అయితే గల్వాన్ ఘర్షణలు చైనా ప్రణాళికాబద్ధంగా జరిపినవన్న భారత్ అభిప్రాయం తప్పు అనీ, అది కేవలం ‘అనుకోని ఘటన’ అనీ పీఎల్ఏ అధికారి చెప్పిందే నిజమైతే, మరి యథాతథ స్థితిని ఎందుకు పునరుద్ధరించకూడదు? అయితే ఎల్ఏసీ అమరిక గురించి భారత్‌కు కచ్చితమైన ఆలోచన ఉంది. ఎల్ఏసీ గురించి సందేహం ఉందని మనం పరోక్షంగా కూడా సూచించకూడదు. వార్షిక వరల్డ్ పీస్ ఫోరమ్‌లో పాల్గొనడానికి నేను ఈ నెల ప్రారంభంలో బీజింగ్‌లో ఉన్నాను. ఆ సమావేశంలోనే అదనంగా భారత్–చైనా సరిహద్దు సమస్యపై ఒక ఆంతరంగిక చర్చ జరిగింది. దీనికి పలువురు చైనా విద్వాంసులు హాజరయ్యారు. ప్రస్తుత, మాజీ చైనా అధికారులు కొందరితో సంభాషణకు కూడా వీలు కలిగింది. ఇవి భారత్–చైనా సంబంధాలకు సంబంధించిన అవకాశాల గురించి చైనా అవగాహన విష యంలో ఒక కొత్త గవాక్షాన్ని అందించాయి. సరిహద్దు సమస్యను పూర్తి స్థాయి సంబంధాలలో ఒక అంశంగా మాత్రమే ఉంచాలనీ, అది సంబంధాల మొత్తం స్వభావాన్ని నిర్వచించకూడదనీ చైనీయులు పట్టుబట్టడం కొనసాగిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ‘అసాధారణం’గా ఉందనీ, ఇది ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నదనే భారత వైఖరిని ఇది పరోక్షంగా తిరస్కరించడమే. చైనీయుల ప్రకారం, సరిహద్దు పరిస్థితి ‘స్థిరీకరించబడింది’. ఘర్షణకు సంబంధించిన కొన్ని అంశాలను పరిష్కరించడంలో పురోగతి సాధించామనీ, అయితే మరికొన్ని మిగిలి ఉన్నా యనీ భారతదేశం గుర్తిస్తోంది. 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలకు ముందు ఉన్న యథాతథ స్థితికి తిరిగి రావడానికి చైనా సుముఖంగా ఉన్నట్లు ఎవరూ భావించడం లేదు. భారత–చైనా సరిహద్దు ప్రశ్న (2005) పరిష్కారానికిగానూ రాజకీయ పారామితులు, మార్గదర్శక సూత్రంతో సహా – వాస్తవాధీన రేఖను (ఎల్ఏసీ) స్పష్టం చేయడం కోసం ఉమ్మడి కసరత్తును చేపట్టేందుకు – అనేక శాంతి భద్రతల ఒప్పందాలను ఇరుపక్షాలు అంగీకరించినప్పటికీ, చైనీయులు అలా చేయడానికి నిరాకరించారు. భూభా గాన్ని ‘కొద్దికొద్దిగా కొరుక్కు తింటూ’ చైనాను భారతదేశం దూరంగా నెడుతోందని ఒక ఆరోపణ వచ్చినప్పుడు, భారత్ చేపట్టడానికి సిద్ధంగా ఉన్న ఎల్ఏసీ స్పష్టీకరణ ద్వారా అటువంటి కబళింపును కచ్చి తంగా నిరోధించవచ్చని ఎత్తి చూపడం ద్వారా ఒకరు దీనిని ప్రతిఘటించారు. దీనికి సమాధానం ఏమిటంటే, 2004లో జరిగిన సమా వేశంలో ఈ కసరత్తు ప్రారంభమైనప్పుడు, చైనా ప్రాదేశిక క్లెయిమ్‌లను బలహీనపర్చగల ‘అతిశయోక్తి’ క్లెయిమ్‌లను భారతదేశం పశ్చిమ సెక్టార్లో ముందుకు తెచ్చింది. ఎల్ఏసీని సరిగా స్పష్టం చేయకపోవడం వల్ల భారత్ అధీనంలో ఉన్న భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి సందిగ్ధతలను ప్రదర్శించగల వీలు చైనాకు కలుగుతుంది. అయితే ఎల్ఏసీ అమరిక గురించి భారత్‌కు కచ్చితమైన ఆలోచన ఉంది. కొన్ని అంశాల్లో ఎల్ఏసీకి సంబంధించి ‘భిన్నమైన అవగాహనలు’ ఉన్నాయని మనం చెప్పు కోకూడదు. భారత్ పేర్కొన్నట్లుగా ఎల్ఏసీపై పోటీ పడటంలో చైనా పక్షానికి కొంత సమర్థన ఉందని ఇది పరోక్షంగా అంగీకరిస్తుంది. ఎల్ఏసీ అమరికలో మనం పరిగణించే వాటిపై చైనీస్ పక్షాన్ని పోటీ పడనివ్వండి. ఎల్ఏసీ ఎక్కడ ఉందనే దాని గురించి మనకు సందేహం ఉందని మనం పరోక్షంగా కూడా సూచించకూడదు. మొత్తంమీద, సరిహద్దు వద్ద ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉంది. అయితే రెండు వైపులా భారీ సైన్యాన్ని మోహరించే అవకాశం లేదు. ఎల్ఏసీ వైపు చైనా నిర్మించిన తాజా శాశ్వత, పాక్షిక–శాశ్వత నిర్మాణాలను కూల్చి వేయడం, తొలగించడం కూడా అసంభవం. భారత్ అలవర్చుకోవా ల్సిన మెరుగైన సామర్థ్యానికి ఇవి సూచికలా పనిచేస్తాయి. భవిష్యత్‌లో ఏం జరగవచ్చో సూచించే రెండు ఘటనలు కూడా ఉన్నాయి. సరిహద్దు సమస్యపై తరచూ వ్యాఖ్యానించే చైనా మాజీ పీఎల్ఏ అధికారి ఒకరు, గల్వాన్ ఘర్షణలు చైనా బలగాలు ముంద స్తుగా, ప్రణాళికాబద్ధంగా జరిపిన ఆపరేషన్ అని భారత్ భావిస్తున్న అభిప్రాయం తప్పు అనీ, అది కేవలం ‘అనుకోని ఘటన’ అనీ నాతో అన్నారు. నేను ఇంతకు ముందు ఇది వినలేదు. పీఎల్ఏ అధికారి చెప్పిందే నిజమైతే, మరి యథాతథ స్థితిని ఎందుకు పునరుద్ధరించకూడదు? ప్రస్తుతం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కమిషన్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ ఆఫీస్ డైరెక్టర్‌గా ఉన్న వాంగ్ యీ(జూలై 25నే తిరిగి విదేశాంగ మంత్రి అయ్యారు) ఇటీవల జకార్తాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో జరిపిన భేటీలో, ‘నిర్దిష్ట సమస్యలు మొత్తం సంబంధాన్ని నిర్వచించనివ్వకుండా, సరిహద్దు సమస్యకు ఇరు పక్షాలు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలి’ అన్నారు. ఇది చైనా వైఖరికి పునఃప్రకటన. అయితే, ‘భారత పక్షం చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకునేలా, సరిహద్దు సమస్యకు ఇరుపక్షాలకు ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటుందని ఆశిస్తున్నట్లు’ ఆయన కొనసాగించారు. ఆ ప్రాంతం చైనా సార్వభౌమ భూభాగమనీ, దానిని కాపాడు కుంటామనీ చైనా ప్రకటనలు పేర్కొంటున్నాయి కాబట్టి గల్వాన్ సంఘటన నేపథ్యంలో, ఇది సాపేక్షంగా సామరస్యపూర్వకమైన భాషగా కనిపిస్తోంది. దీంతో సంబంధాలు ‘మెరుగుపర్చుకునే’ అవ కాశం లేకుండా పోయింది. మారిన భాషను మనం అతిగా వ్యాఖ్యా నిస్తున్నామేమో! కాలమే దీన్ని తేల్చి చెబుతుంది. ప్రధాని మోదీ వాషింగ్టన్ లో ఉన్నత స్థాయి అధికారిక పర్యటన విజయవంతంగా ముగించిన తర్వాత వెంటనే బీజింగ్‌లో నా సంభాషణలు జరిగాయి. భారత్–అమెరికా సంబంధాల్లో పురోగతిపై చైనా ఆందోళన స్పష్టంగా కనిపించింది. చైనాను నిలువరించే అమెరికా వ్యూహంలో భారత్ భాగమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియాలో ‘నాటో’ పాత్రకు భారతదేశం మద్దతు ఇస్తుందా అనేది నాకు వారు సంధించిన ఒక ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం, నాటో అనేది యూరోపియన్ భద్రతకు సంబంధించినదనీ, ఆసియాన్ నేతృత్వంలోని యంత్రాంగాలతో సహా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి ఆసియా అనేక యంత్రాంగాలను కలిగి ఉందనీ నేను చెప్పాను. గ్లోబల్ సౌత్ నుండి చైనాను మినహాయించాలని భారతదేశం ప్రయత్నిస్తున్నదా అనే ఆందోళన కూడా వారిలో ఉంది. తాము గ్లోబల్ సౌత్‌లో భాగమా, కాదా అనేది నిర్ణయించుకోవాల్సింది చైనాయేనని నేను చెప్పాను. త్వరలో జరగనున్న జీ20 సదస్సు సన్నాహాల్లో భాగంగా, గ్లోబల్ సౌత్ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు మోదీ చొరవ తీసుకోవడం చైనాను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్థికపరమైన చిక్కులను కలిగించవచ్చు కాబట్టి, చైనాకు ‘అభివృద్ధి చెందుతున్న దేశం’ హోదాను నిరాకరించే అమెరికా ప్రయత్నాల గురించి వారు ప్రస్తావించారు. చైనా చేసిన మరొక ఫిర్యాదు ఏమిటంటే, ‘షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్’ (ఎస్సీఓ) సమావేశాన్ని భారత్ వ్యక్తిగత స్థాయిలో కాకుండా, క్లుప్తంగా ఆన్ లైన్ సదస్సును నిర్వహించడం ద్వారా దాని ‘స్థాయిని తగ్గించింది’ అని. ఇది అమెరికా ప్రభావంతో జరిగిందనే అనుమానం చైనాకు ఉంది. మొత్తంమీద, చైనా తన గురించి తాను అస్పష్టంగానే ఉందనే భావన కలుగుతుంది. అదే సమయంలో భారత్ తన ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రావీణ్యతనూ, చురుకుదనాన్నీ ప్రదర్శించిందనే అభిప్రాయం ఉంది. పెట్టుబడి, సాంకేతికత ప్రవాహానికి భారతదేశం కొత్త గమ్యస్థానంగా మారినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో, ఇది చైనా ఆర్థిక అవకాశాల గురించి గుర్తించిన ఒక నిర్దిష్ట నిరాశా వాదానికి సంబంధించినది కావచ్చు. ఇది భారతదేశం పట్ల చైనా వైఖరిలో మార్పును సూచిస్తుందా? ఇకపై సంఘటనలు ఎలా వెల్లడవుతాయో చూద్దాం. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ మాజీ కార్యదర్శి,ఆనరరీ ఫెలో, సీపీఆర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రిలయన్స్‌తో ఒప్పందం.. భారత్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న చైనా కంపెనీ?
చైనాకు చెందిన ఫ్యాషన్ దుస్తుల దిగ్గజం షీఇన్ (Shein) భారత్‌లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. దేశ సరిహద్దుల్లో డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు గల్వాన్ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించింది. ఆ దేశానికి చెందిన యాప్స్, సంస్థలపై నిషేధం విధించింది. వాటిలో షీఇన్ సంస్థ సైతం ఉంది. షీఇన్ ప్రపంచంలో అతి పెద్ద ఆన్లైన్ ఫ్యాషన్ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్ డాలర్లు. ఫ్యాషన్ దుస్తులను తక్కువ ధరలతో అందుబాటులోకి తెచ్చి కుర్రకారుకు దగ్గరైన సదరు సంస్థ అనేక దేశాల నుంచి మార్కెట్లో దుస్తులను కొనుగోలు చేసి విక్రయించటంలో పేరుగాంచింది. దాని వెబ్సైట్, యాప్‌తోనే లావాదేవీలు జరుపుతుంది. అయితే, భారత్ షీఇన్ విభాగం దేశీయంగా ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుంది. ఈ ఒప్పందం తర్వాత దేశీయంగా చైనా కంపెనీ తన కార్యకలాపాల్ని పున:ప్రారంభించనుందని.. ఈ అంశంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. షీఇన్పై రీటైల్ చూపు రీటైల్ రంగంలో దూసుకెళ్తున్న రిలయన్స్ రీటైల్ భారత్ నిషేధం విధించిన షీఇన్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. 25,000 చిన్న మరియు మధ్య తరహా స్థానిక ఉత్పత్తి దారుల నుంచి కొనుగోలు చేసి వాటిని ఆన్లైన్లో విక్రయిస్తుంది. ఈ సంస్థను దక్కించుకుంటే ఫ్యాషన్ విభాగంలో మరింత వృద్ది సాధించవచ్చని రిలయన్స్ భావించింది. అందుకే ఆ సంస్థను కొనుగోలు చేసి ప్రపంచ వ్యాప్తంగా షీఇన్ బ్రాండెడ్ ఉత్పత్తుల్ని అమ్మే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పెరగనున్న మేడ్ ఇన్ ఇండియా వస్తువుల వాటా కానీ రిలయన్స్ షిఇన్ను కొనుగోలు చేయకుండా.. ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో షీఇన్ తన ప్లాట్‌ఫారమ్‌లో మేడ్ ఇన్ ఇండియా దుస్తులు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ ఒప్పందం, పున ప్రారంభం వంటి అంశాలపై ఇటు షీన్ ప్రతినిధులు, అటు రిలయన్స్ ఇతర వివరాల్ని వెల్లడించలేదు. నిషేధించబడిన యాప్‌లు గాల్వాన్ ఘర్షణలనేపథ్యంలో 2020లో భారత్ నిషేధించిన చైనీస్ యాప్‌లలో షీన్ కూడా ఒకటి. చైనాలో తన దుస్తులను విక్రయించని షీన్ 2021లో దాని ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్‌కు మార్చింది. షీన్ యాప్ ద్వారా జరిగే కార్యకలాపాలకు సంబంధించిన డేటా అంతా భారత్‌లో స్టోర్ అవుతుంది. డేటా భద్రతా సమస్యలపై భారత ప్రభుత్వ కఠినమైన నిబంధనలకు అనుగుణంగా ఆన్లైన్ రిటైలర్ (షీఇన్)కు అందుబాటులో ఉండదు. స్టాక్ మార్కెట్‌తో ప్రమేయం లేనందున షీఇన్‌కు రిలయన్స్ సంస్థ లైసెన్స్ రుసుముల్ని చెల్లించనుంది. రిలయన్స్ రిటైల్ రిలయన్స్ రిటైల్ (Reliance Retail) బిజినెస్ కింద రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్, జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్, రిలయన్స్ ట్రెండ్స్, ప్రాజెక్ట్ ఈవ్, ట్రెండ్స్ ఫుట్‌వేర్, రిలయన్స్ జువెల్స్, హామ్లేస్, రిలయన్స్ బ్రాండ్స్, రిలయన్స్ కన్జ్యూమర్ బ్రాండ్స్, 7-ఇలెవన్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. చదవండి👉 ఈషా అంబానీకి సరికొత్త వెపన్ దొరికిందా? -
సైన్యాధికారిణిగా గల్వాన్ అమరుని అర్ధాంగి
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో చైనా సైన్యంతో ఘర్షణల్లో అమరుడైన భారత సైనికుడు నాయక్ దీపక్ సింగ్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సతీమణి సైతం కదనరంగంలోకి దూకారు. చెన్నై కేంద్రంగా పనిచేసే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో విజయవంతంగా ఆర్మీ శిక్షణ పూర్తిచేసుకున్నాక 29 ఏళ్ల లెఫ్టినెంట్ రేఖా సింగ్.. ఆర్మీ ఆర్డ్‌నన్స్ కోర్ విభాగంలో శనివారం విధుల్లో చేరారు. తూర్పు లద్దాఖ్‌లో ఫ్రంట్‌లైన్ యూనిట్లో ఆమె కర్తవ్య దీక్షను మొదలుపెట్టారని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. ఆర్మీ మెడికల్ కోర్లో సభ్యుడైన నాయక్ దీపక్ సింగ్ ఆ తర్వాతికాలంలో బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్‌లో నర్సింగ్ అసిస్టెంట్‌గా చేరారు. 2020 జూన్‌లో గల్వాన్‌లోయలో చైనా సైనికులతో పోరాడింది ఈ బెటాలియన్ బృందమే. ఘర్షణల్లో గాయపడినా కూడా నాయక్ తోటి 30 మంది క్షతగాత్రులైన సైనికులకు అత్యవసర వైద్యసాయం చేసి అద్భుత ధైర్యసాహసాలు ప్రదర్శించారని నాడు కేంద్రం శ్లాఘించింది. -
గల్వాన్ లోయలో క్రికెట్ ఆడిన భారత జవాన్లు..
న్యూఢిల్లీ: 2020 జూన్ 15. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ. భారత్, చైనా సరిహద్దులోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ)–14. సరిగ్గా అక్కడే ఇరు దేశాల సైనికుల నడుమ భీకర స్థాయిలో ఘర్షణ జరిగింది. పదునైన ఆయుధాలతో చైనా జవాన్లు దాడి చేయగా, దెబ్బకు దెబ్బ అన్నట్లుగా భారత సైనికులు దీటుగా బదులిచ్చారు. ఈ కొట్లాటలో తమ జవాన్లు ఎంతమంది బలయ్యారో చైనా ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదు. 40 మందికిపైగానే చనిపోయి ఉంటారని అంచనా. భారత్ వైపు నుంచి దాదాపు 20 మంది చనిపోయారు. రణక్షేత్రంగా రక్తంతో తడిసిపోయిన పీపీ–14 ఇప్పుడు క్రికెట్ మైదానంగా మారింది. పటియాలా బ్రిగేడ్‌కు చెందిన త్రిశూల్ డివిజన్ క్రికెట్ పోటీ నిర్వహించింది. సైనికులు సరదాగా క్రికెట్ ఆడారు. పీపీ–14కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ పోటీ జరిగింది. జవాన్లు క్రికెట్ ఆడుతున్న ఫొటోలను భారత సైన్యం శుక్రవారం ట్విట్టర్లో పోస్టు చేసింది. గడ్డ కట్టించే తీవ్రమైన చలిలో పూర్తి ఉత్సాహంతో ఈ పోటీ జరిగిందని వెల్లడించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని ఉద్ఘాటించింది. జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు సందర్భంగా గురువారం ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఆ మరుసటి రోజే గల్వాన్‌లో భారత సైనికులు క్రికెట్ పోటీ నిర్వహించుకోవడం విశేషం. -
గాల్వాన్ అమర జవాన్ తండ్రికి అవమానం.. ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చిన పోలీసులు
రెండేళ్ల కిత్రం గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన హింసాత్మక ఘర్షణలో అమరుడైన బిహార్ సైనికుడు జై కిషోర్ సింగ్ తండ్రికి అవమానకర ఘటన ఎదురైంది. ప్రభుత్వ స్థలంలో కొడుకు కోసం స్మారకాన్ని నిర్మించినందుకు సింగ్ తండ్రిపై బిహార్ పోలీసులు అమానుషంగా ప్రవరించారు. ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి దూషించారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అసలేం జరిగిందంటే.. వైశాలి జిల్లా జండాహాలోని కజారి బుజుర్గ్ గ్రామానికి చెందిన రాజ్ కపూర్ సింగ్ కుమారుడు జై కిషోర్ సింగ్ 2020లో గాల్వన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో అమరుడయ్యాడు. గతేడాది ఫిబ్రవరిలోనే సింగ్ కుటుంబ సభ్యులు తమ ఇంటి ముందు ఉన్న ప్రభుత్వ భూమిలో సైనికుడి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఆవిష్కరించే కార్యక్రమంలో అనేకమంది ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. అనంతరం గతేడాది డిసెంబర్లో దీని చుట్టూ గోడ కట్టారు. అయితే ప్రభుత్వ భూమిలో అక్రమంగా స్మారకం ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ సోమవారం అర్థరాత్రి పోలీసులు రాజ్ కపూర్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి అతనిపై చేయిచేసుకున్నారు. అంతేగాక సింగ్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.ఇందులో పోలీసులు సైనికుడి తండ్రి రాజ్ కపూర్ సింగ్‌ను ఇంట్లో నుంచి ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది.. అంతేగాక పోలీసులు సింగ్‌ను కొట్టారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్మారక స్తూపం వద్దకుచ ఏరుకొని పోలీసుల చర్యకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా స్మారకం ఏర్పాటు చేశారని రాజ్ కపూర్ సింగ్ ఇంటి పక్కనే ఉండే హరినాథ్ రామ్ ఫిర్యాదు చేశారని తెలిపారు. తన భూమితోపాటు ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా విగ్రహాన్ని నిర్మించారని చెబుతూ.. హరినాథ్ రామ్ ఫిర్యాదు ఆధారంగా రాజ్ కపూర్ సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్డిపిఓ మహువా తెలిపారు. అంతేగాక సైనికుడి స్మారకం కారణంగా పొరుగువారు తమ పొలాల్లోకి వెళ్లకుండా అయ్యిందని గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఆర్మీలో పనిచేస్తున్న అమరవీరుడు సైనికుడి సోదరుడు నంద కిషోర్ సింగ్ మాట్లాడుతూ.. డీఎస్పీ తమ ఇంటికి వచ్చి 15 రోజుల్లో విగ్రహాన్ని తొలగించాలని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే గత రాత్రి జండాహా పోలీసు స్టేషన్ ఇన్చార్జి తమ ఇంటికి వచ్చి తండ్రిని అరెస్టు చేసి లాక్కెళ్లరని తెలిపారు. తండ్రిని చెంపదెబ్బ కొట్టి దుర్భాషలాడారని, పోలీస్ స్టేషన్లోనూ దాడి చేశారని ఆరోపించారు. అర్థరాత్రి ఇంటికి వచ్చి ఒక తీవ్రవాదిలా అరెస్ట్ చేశారని వాపోయారు. Galwan valley martyr’s father being dragged by @bihar_police @yadavtejashwi @NitishKumar @SpVaishali pic.twitter.com/oJjUnqtQET — Anish Singh (@anishsingh21) February 26, 2023 -
చైనా వ్యూహానికి దూకుడే విరుగుడా?
భారత, చైనా సైనికుల మధ్య తవాంగ్ ప్రాంతంలో జరిగిన ఘటన అనూహ్యమేమీ కాదు. తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై పట్టు సాధించేందుకు చైనా దూకుడుగా వ్యవహరిస్తుందన్నది నిర్వివాదాంశం. చైనా దృష్టిలో ఆసియాలో తన ఆధిపత్యానికి గండికొట్టగల దేశం భారత్ మాత్రమే. అందుకే తన షరతులతోనే సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని చైనా నాయకత్వం భావిస్తోంది. అయితే భారతీయ సైనికులు కైలాశ్ పర్వత శ్రేణిలోని కీలక ప్రాంతాలను ఆక్రమించినప్పుడు మాత్రమే చర్చలు కొంతైనా ముందుకు సాగాయి. చైనా మన మాటలు వినాలంటే, మనం దానిపై ఎంతో కొంత పట్టు సాధించాలి. యాంగ్సీలోనూ చైనా దళాలు వెంటనే వెనక్కు తగ్గడమూ ఈ విషయాన్నే సూచిస్తోంది! అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమభాగంలో... భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నెల తొమ్మిదిన తవాంగ్ ప్రాంతంలోని యాంగ్సీ వద్ద ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ ఘటన అనూహ్యమేమీ కాదు. ఏదో ఒక రోజు తప్పదన్న అంచనాలు చాలాకాలంగా ఉన్నాయి. వాస్తవాధీనరేఖ వెంబడి చాలాకాలంగా ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూండటం ఇందుకు కారణం. ఈ ఘర్షణకు ముందస్తు సూచన ఏదైనా ఉందీ అంటే... అది భారత – అమెరికా మిలటరీ ప్రదర్శనలకు పొరుగుదేశం చైనా పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేయడం! వాస్తవాధీన రేఖకు వంద కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్ సెంట్రల్ సెక్టర్లో భారత, అమెరికా మిలటరీ దళాలు కలిసికట్టుగా విన్యాసాలు చేసిన విషయం తెలిసిందే. యాంగ్సీ వద్ద చెలరేగిన ఘర్షణలు తూర్పు లదాఖ్ ఘటనల తరువాత రెండేళ్లకు జరిగాయి. ఈ రకమైన తోపు లాటలు, ఘర్షణలు, పరస్పర దాడులు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింల లోని వివాదాస్పద ప్రాంతాల్లో చాలాకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 2020 జూన్‌లో గల్వాన్ లోయలో రెండుపక్కల సైనికులకు ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో తాజా ఘటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులు ఈ మధ్యకాలంలో వీధిపోరాటల విషయంలో బాగా ఆరితేరినట్లు కనిపి స్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి వీరు ముళ్ల్లతో కూడిన కర్రలతో, టేజర్లతో(కరెంట్ షాక్ కొట్టే ఆయుధం) ప్రత్యర్థులపైకి విరుచుకుపడు తున్నారు. మందు గుండు ఆయుధాలు వినియోగించడం ఇక్కడ సాధ్యం కాదు మరి! గల్వాన్ ఘర్షణ... ఫలితంగా జరిగిన ప్రాణనష్టం... భౌతిక దాడుల విషయంలో పీఎల్ఏ చేసుకున్న మార్పుల తీవ్రత ఎలాంటిదో తెలిపింది. అయితే తవాంగ్ ఘటనకు భారతీయ సైనికులు సర్వసన్న ద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రత్యర్థి బలగాల మోహరింపును అడ్డుకోవడం, అదనపు సిబ్బందితో తమ స్థానాన్ని పదిలపరచు కోవడం, తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. చలికాలంలో తేమతో కూడిన దుస్తులపై టేజర్లు ప్రయోగిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పో వచ్చు. కాబట్టి... భారతీయ సైనికుల కోసం పెద్ద పెద్ద ఆయుధాలు, ఇతర వ్యవస్థలను సమకూర్చడంతోపాటు ఘర్షణలను ఎదుర్కొ నేందుకు ఉపయోగించే పరికరాలనూ అందించాల్సిన అవసర ముంది. పిడిగుద్దులు, ఘర్షణలతో బెదిరించాలని చూస్తున్న శత్రు వును ఎదుర్కునేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. వ్యూహాత్మక సంకేతం అగ్రరాజ్యాల్లో ఒకటైన అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశం... తన సరిహద్దుల్లో వీధిపోరాటాల స్థాయికి దిగజారడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ... ఇవన్నీ తమ అసలు ఉద్దేశాలను వ్యక్తం చేసేందుకు వ్యూహాత్మకంగా ఇస్తున్న సంకేతాలుగా పరిగ ణించాలి. చైనా నాయకత్వం మరింత దూకుడుగా, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పడం! చైనీస్ కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్ రెండు నెలల క్రితం బీజింగ్‌లో విజయవంతంగా ముగిసింది. ఇందులోనే ప్రపంచ వేదికపై చైనా వ్యవహారశైలి ఎలా ఉండబోతోందో స్పష్టమైంది. ఇండోనేసియాలో జరిగిన జీ20 సమావేశాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వైఖరి కూడా చైనా ఆధిపత్య ధోరణికి అద్దం పట్టేదే. సుదీర్ఘ శత్రుత్వం కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌లో స్థానిక సరిహద్దు వివాదాలతో ఎలా వ్యవహరించబోయేదీ అధికారికంగానే వివరించారు. సౌత్ చైనా సముద్రంలో తైవాన్‌తో ఉన్న వివాదాలు... కొన్ని ద్వీపాల విషయంలో జపాన్‌తో ఉన్న చిక్కులు, హిమాలయా ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ విషయంలోనూ తమ వైఖరి ఏమిటన్నది అక్కడే నిర్ణయమైంది. తైవాన్, ఇతర సముద్ర సంబంధిత సమస్యలను ఆర్థిక ప్రభా వంతో లేదా బలవంతంగానైనా పరిష్కరించాలని చైనా భావిస్తోంది. అయితే... భారత్ విషయంలోనే చైనా ఆందోళన. ఏకంగా 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖతో కూడిన సరిహద్దు.... దాని వెంబడే గుర్తించిన వివాదాస్పద, సున్నితమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ సరిహద్దుపై ఉన్న వివాదాలు అన్నీ ఇన్నీ కాదు. సద్దుమణిగేందుకు చైనా ఏ రకమైన అవకాశమూ ఇవ్వలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట అగ్గి రాజేస్తూ వివాదాన్ని కొనసాగిస్తోంది. ‘సెంట్రల్ టిబెటెన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఎక్సైల్’, దలైలామా భారత నేలపై ప్రవాసంలో ఉండటం భారత, చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో వివాదాస్పదమైన అంశంగా నిలుస్తోంది. అంతేకాకుండా... చైనా దృష్టిలో ఆసియా ప్రాంతంలో తన ఆధిపత్యానికి గండికొట్టగల దేశం భారత్ మాత్రమే. తద్వారా భారత్ అగ్రరాజ్యం స్థాయిని అందుకోగలదని చైనా భావిస్తోంది. అందుకే తన షరతులతోనే భారత్‌తో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇప్పుడప్పుడే సమసేది కాదు తూర్పు లదాఖ్ ప్రాంతంలో పీఎల్ఏతో 2020 మే నెల నుంచి వివాదం మొదలైంది. పలు దఫాలు చర్చలు నడిచినా సాధించింది ఏమీ లేదు. ఫలితంగా భారత సైనికులు దీర్ఘ కాలంపాటు అననుకూల వాతావరణంలో గస్తీ నిర్వహించాల్సి వస్తోంది. భారతీయ సైనికులు కైలాశ్ పర్వత శ్రేణిలోని కీలక ప్రాంతాలను ఆక్రమించినప్పుడు మాత్రమే చర్చలు కొంతైనా ముందుకు సాగాయి అని చెప్పవచ్చు. ఈ పరిణామంతో చైనా ఖంగుతింది. వెంటనే తాము నిర్మించిన ఆవాసాలను, ఇతర నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించింది. పాంగ్యాంగ్ సో ఉత్తరభాగ తీరం వెంబడి తన దళాలను ఉపసంహరించుకుంది కూడా. చైనా మన మాటలు వినాలంటే... మనం దానిపై ఎంతో కొంత పట్టు సాధించాలని చెబుతోంది ఈ ఘటన. యాంగ్సీలోనూ చైనా దళాలు వెనువెంటనే వెనక్కు తగ్గడం కూడా ఈ విషయాన్నే సూచిస్తోంది! ఒక్క విషయమైతే స్పష్టం. వాస్తవాధీన రేఖ వెంబడి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతూనే ఉంటాయన్నది మనమూ అంగీకరించాల్సి ఉంటుంది. తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై పట్టు సాధించేందుకు పీఎల్ఏ దూకుడుగా వ్యవ హరిస్తుందన్నదీ నిర్వివాదాంశం. అదే సమయంలో ద్వైపాక్షిక సంబంధాలనూ, సరిహద్దు వివాదాలనూ వేర్వేరుగా చూడాలని చైనా ఒత్తిడి తీసుకువస్తుంది. ప్రతిగా భారత్ సరిహద్దుల్లో శాంతి నెలకొంటేనే అన్ని విషయాలను సమగ్రంగా సమీక్షించవచ్చునని అంటోంది. అయితే ఈ పరిస్థితి వల్ల భారత ఆర్మీ ఏడాది పొడవునా... అననుకూల పరిస్థితుల్లో గస్తీ కాయాల్సిన పరిస్థితి కొనసాగనుంది. చైనా ఒకవైపు తన మిలిటరీ దూకుడును కొనసాగిస్తూనే... భారత్‌తో సరిహద్దు వివాదాలను దీర్ఘకాలం నాన్చే ప్రయత్నం చేస్తుందని ప్రస్తుత పరిణామాల ఆధారంగా అంచనా కట్టవచ్చు. ఇందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. దౌత్యం, మిలిటరీ రెండింటిలోనూ అన్నమాట. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుంటే... యాంగ్సీ, గల్వాన్ లాంటి ఘటనలు జరక్కుండా ముందస్తుగానే నివారించడం ఎంతైనా అవసరం. వ్యాసకర్త మిలిటరీ వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నమ్మలేని పొరుగు దేశం
భారత–చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత మరోమారు పార్లమెంట్ సహా దేశమంతటినీ కుదిపి వేస్తోంది. డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వద్ద యాంగ్సే ప్రాంతంలో చొచ్చుకొని రావడానికి చైనా సైన్యం చేసిన ప్రయత్నాన్ని భారత సైనికులు గట్టిగా తిప్పికొట్టిన తీరుపై వైనవైనాలుగా కథనాలు వస్తున్నాయి. అక్కడ నిజంగా జరిగిందేమిటో తెలుసుకొని, పరిస్థితిని సమీక్షించి, లోటుపాట్లను సరిదిద్దుకొని, రక్షణ దళాలను బలోపేతం చేసే పనిలో భారత ప్రభుత్వం ఇప్పటికే ఉంది. అయితే, సరిహద్దు వెంట శాంతి నెలకొనాలనీ, అనేక ఇతర అంశాల్లో సహకారం వెల్లివిరియాలనీ – ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని దశాబ్ద కాలంగా పొరుగుదేశం పదే పదే ఉల్లంఘించడం కీలకాంశం. పొరుగునే పొంచివున్న పాము పట్ల అప్రమత్తత అనివార్యం. రెండేళ్ళ క్రితం 2020 జూన్ 15 నాటి గల్వాన్ ఘర్షణల్లోనూ, తాజా తవాంగ్ ఘటనలోనూ చైనా తన తప్పేమీ లేదనే భావన కలిగించడానికి శతవిధాల ప్రయత్నించింది. వాస్తవాలు వెలికి రావడంతో డ్రాగన్ పాచిక పారలేదు. భారత – చైనాల మధ్య సైనిక ఘర్షణ 1962 నుంచి 60 ఏళ్ళుగా సాగుతోంది. లద్దాఖ్ పరిసర పశ్చిమ ప్రాంతం – టిబెట్‌తో మన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్ల సరిహద్దుతో కూడిన మధ్యప్రాంతం – అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దుతో కూడిన తూర్పు ప్రాంతం... ఈ మూడూ భారత–చైనా సరిహద్దులో ప్రధాన ప్రాంతాలు. అరుణాచల్‌తో ఉన్న 1126 కి.మీల తూర్పు సరిహద్దుపై చైనా ఎప్పుడూ పేచీ పెడుతూనే ఉంది. అరుణాచల్ తనదేనంటోంది. అధిక భాగాన్ని ‘దక్షిణ టిబెట్’ అని ప్రస్తావిస్తూ, అక్కడి ప్రదేశాలకు తన పేర్లు పెట్టి పిలుస్తోంది. అరుణాచల్‌పై రచ్చ రేపి, చివరకు పశ్చిమాన భారత్ అధీనంలో ఉన్న కీలక అక్సాయ్చిన్ని తమకు వదిలేస్తే, అరుణాచల్‌పై పట్టు వీడతామని బేరం పెట్టడం డ్రాగన్ వ్యూహమని ఓ విశ్లేషణ. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) తూర్పు ప్రాంతంలో వ్యూహాత్మక తవాంగ్ వద్ద చైనాకు ఎప్పుడూ పట్టు లేదు. 17వేల అడుగుల ఎత్తైన పర్వతప్రాంతాన్ని వశం చేసుకుంటే, ఎల్ఏసీకి ఇరువైపులా స్పష్టంగా చూడవచ్చు. ఆ గుట్టపై ఆధిక్యం సంపాదించి, భారత్‌కు చోటు లేకుండా చేయాలన్నది చైనా పన్నాగం. అలాగే అరుణాచల్‌లో వివాదాస్పద సరిహద్దు వెంట భారత దళాల బలమెంతో అంచనా వేయడానికీ తాజా చర్యకు దిగింది. అది ఫలించకపోవడంతో తవాంగ్‌లో ప్రస్తుతానికి భారత్‌దే పైచేయి. కానీ, మరోపక్క సిక్కిమ్ సరిహద్దులో 2017లో ఘర్షణ సాగిన కీలక డోక్లామ్ ప్రాంతంలో కొన్నేళ్ళుగా చైనా ఊళ్ళకు ఊళ్ళు కడుతోంది. వంతెనలు నిర్మిస్తోంది. ఇది ఆందోళనకరం. తవాంగ్‌లో 13 వేల అడుగుల ఎత్తైన చోట, మైనస్ 15 డిగ్రీల్లోనూ భారత్ నిర్మిస్తున్న సేలా సొరంగ మార్గం పూర్తి కావచ్చింది. ఇటు ప్రజలకూ, అటు ఆర్మీకీ పనికొచ్చే ఇలాంటివి చైనాను చీకాకుపరుస్తున్నాయి. ఆసియాపై ఆధిక్యం చూపాలంటే, హిమాలయ ప్రాంతంపై పట్టు బిగించడం చైనాకు కీలకం. పైగా, భవిష్యత్ దలైలామా తవాంగ్ ప్రాంతంలో జన్మిస్తారని ఓ నమ్మకం. అలా ధార్మికంగానూ ఆ ప్రాంతం తమకు కీలకమనీ, అదీ తమ దేశంలో భాగమైపోవాలనీ చైనా తాప త్రయం. మరోపక్క బ్రహ్మపుత్రా నదిపై ప్రాజెక్ట్‌లు కడుతూ, ఆ జలాలపై ఆధారపడ్డ ఇతర పొరుగు దేశాలను అడకత్తెరలో బిగిస్తోంది. ఇక, తవాంగ్ ఘటనలో భారత్‌ను అమెరికా సమర్థించడంతో పుండు మీద కారం రాసినట్టయింది. భారత, అమెరికాల బంధం బలోపేతమైతే తన ప్రాంతీయ ఆధిపత్యానికి గండి పడుతుందని చైనా భావన. అందుకే, ఢిల్లీ, వాషింగ్టన్లు దగ్గరవుతున్న కొద్దీ కవ్వింపు పెంచుతోంది. ప్రపంచవేదికలు శాంతివచనాలు పలుకుతున్నా, వాటి ప్రభావం శూన్యం. జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రతపై మన దేశమంతా ఏకతాటిపై ఉందని చాటాల్సిన సమ యమిది. కానీ తవాంగ్ ఘటన సైతం రాజకీయమవుతోంది. తమనూ విశ్వాసంలోకి తీసుకొని, సరిహద్దు రక్షణపై పార్లమెంట్లో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుంటే, కారణాలేమైనా అధి కార బీజేపీ అంగీకరించట్లేదు. 1962 చైనా యుద్ధవేళ నెహ్రూ విధానాన్ని కాషాయధ్వజులు తప్పు పడున్నారు. అప్పట్లో నెహ్రూ సభలో చర్చించి, ఏకంగా 165 మంది ఎంపీలకు మాట్లాడే అవకాశ మిచ్చి, ఆపైనే నిర్ణయం తీసుకున్నారని విస్మరిస్తే ఎలా అని కాంగీయులు ప్రతిదాడి చేస్తున్నారు. వెరసి, అప్పట్లో గల్వాన్ ఘటనలోనూ, ఇప్పుడీ తవాంగ్పైనా ఈ రాజకీయ వాగ్వాదపర్వం కీలకమైన దేశభద్రతలో లోటుపాట్లపై లోతైన చర్చకు దారి తీయకపోవడమే విచారకరం. సరిహద్దు వెంట చైనా లాగానే, టిబెట్, దక్షిణ మంగోలియా, హాంకాంగ్, తవాంగ్ లాంటి చోట్ల చైనాపై మనమూ దూకుడు చూపాలనేది కొందరి వాదన. అయితే, మన పాలకులు ‘ఆత్మనిర్భరత’ అంటూ రొమ్ము విరుచుకుంటున్నా, ఇవాళ్టికీ బొమ్మలు (86 శాతం), ఎలక్ట్రానిక్ విడిభాగాలు (37 శాతం), ఆటో విడిభాగాలు (30 శాతం) సహా అనేక అంశాల్లో మనం చైనా దిగుమతులపైనే ఆధార పడ్డాం. వస్తూత్పత్తిలో స్వీయపురోగతికి దీర్ఘకాలం పడుతుంది. అలా చూస్తే పొరుగున ఉన్న చైనాతో బద్ధశత్రుత్వంతో రోజులు గడవవు. దౌత్యపరమైన ఒత్తిడి పెడుతూనే, నేటికీ స్పష్టంగా అంగీకారం లేని సరిహద్దు రేఖపై చర్చించి, శాశ్వత పరిష్కారానికి ప్రయత్నించాలి. సరిహద్దుల్లో జరగనున్న భారత వైమానికదళ విన్యాసాలతో తోక తొక్కిన తాచులా చైనా బుసలుకొట్టవచ్చు. రానున్న రోజుల్లో ఉద్రిక్తతలూ పెరగవచ్చు. ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్‌లో సర్వర్లను స్తంభింపజేసిన సైబర్ దాడీ చైనా పనేనట. ఈ పరిస్థితుల్లో సైన్యం, భారత గూఢచారి దళాల అప్రమత్తతే మనకు రక్షాకవచం. -
చైనా సేనలను తరిమికొట్టాం
న్యూఢిల్లీ: భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా చేసిన ప్రయత్నాలను మన సైన్యం పూర్తిస్థాయిలో తిప్పికొట్టిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ‘‘అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో యాంగ్ట్సే ప్రాంతం వద్ద వాస్తవాధీన రేఖను దాటేందుకు, తద్వారా యథాతథ స్థితిని మార్చేందుకు డిసెంబర్ 9న చైనా సైన్యం ప్రయత్నించింది. వాటన్నింటినీ మన సైనికులు చాలా గట్టిగా తిప్పికొట్టారు. మన సైనిక కమాండర్లు సకాలంలో స్పందించడంతో చైనా సైన్యం తోక ముడిచింది’’ అని చెప్పారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆయన వేర్వేరుగా ప్రకటన చేశారు. ‘‘ఈ ఘర్షణ ఇరు సైనికుల నడుమ భౌతిక పోరుకూ దారి తీసింది. మనవాళ్లు వీరోచితంగా పోరాడారు. మన భూభాగాల్లోకి చొచ్చుకొచ్చేందుకు చైనా సైన్యం చేసిన ప్రయత్నాలను వమ్ము చేసి వారిని తరిమికొట్టారు’’ అని వివరించారు. ‘‘ఈ ప్రయత్నంలో మనవైపు ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. కొందరు సైనికులు స్వల్పంగా గాయపడ్డారు’’ అని స్పష్టం చేశారు. ‘‘ఈ ఘటన తర్వాత మన స్థానిక సైనిక కమాండర్, చైనా కమాండర్ మధ్య డిసెంబర్ 11న ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. దీనిపై మన ఆగ్రహాన్ని, అభ్యంతరాలను దౌత్య మార్గాల్లో కూడా చైనాకు తెలియజేశాం. ఇలాంటి దుందుడుకు చర్యలను పునరావృతం చేయొద్దని, సరిహద్దుల వెంబడి శాంతి, సామరస్యాలను కాపాడాలని గట్టిగా చెప్పాం’’ అని వెల్లడించారు. ‘‘మన భూభాగాన్ని ఆక్రమించేందుకు జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా పూర్తిగా తిప్పికొట్టేందుకు, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు సైన్యం నిత్యం సన్నద్ధంగా ఉంది. సభకు ఈ మేరకు హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. అంతకుముందు తాజా పరిస్థితిపై సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సమీక్ష జరిపారు. గల్వాన్ తరహా ఘర్షణ ► డిసెంబర్ 9 నాటి చైనా ఆక్రమణ యత్నం మరోసారి రెండేళ్లనాటి ‘గల్వాన్ లోయ’ ఉదంతాన్ని తలపించింది. విశ్వసనీయ సమాచారం మేరకు... చైనా సైనికులు అచ్చం అప్పటి మాదిరిగానే ఇనుప ముళ్లతో కూడిన లావుపాటి ఆయుధాలు, కర్రల వంటివాటితో దాడికి దిగారు. అప్పట్లాగే పరిస్థితి మరోసారి బాహాబాహీకి కూడా దారితీసింది. ► తవాంగ్ పరిసరాల్లో యాంగ్ట్సే వద్ద 17 వేల అడుగుల పై చిలుకు ఎత్తున్న మంచు శిఖరాలపై పట్టు కోసం చైనా ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే దాదాపు రెండేళ్ల అనంతరం మరోసారి మన భూభాగాల్లోకి సైలెంటుగా చొచ్చుకొచ్చేందుకు డిసెంబర్ 9న దొంగ ప్రయత్నం చేసింది. ► అయితే అక్కడ ఎటు చూసినా మన సైన్యం భారీగా మోహరించిన తీరుతో చైనా దళాలు అవాక్కైనట్టు సమాచారం. వాటి చొరబాటు యత్నాలను మనవాళ్లు దీటుగా అడ్డుకోవడమే గాక పూర్తిస్థాయిలో తరిమి కొట్టారు. ► ఆ ప్రాంతంలో భారత సైన్యపు మోహరింపులు హై రిజల్యూషన్ కెమెరాలతో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కన్పిస్తున్నాయి. ► 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్ సమీపంలోని గల్వాన్ లోయ వద్ద చైనా, భారత దళాల మధ్య జరిగిన భీకర పోరు జరగడం తెలిసిందే. దానివల్ల ఇరుదేశాల సంబంధాలు బాగా క్షీణించాయి. ► అప్పటినుంచి తూర్పు ప్రాంతంలో వాస్తవా ధీన రేఖ వద్ద మోహరింపులను, యుద్ధ సన్నద్ధతను సైన్యం బాగా పెంచింది. నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. ► ఆ తర్వాత ఇరు దేశాల మధ్య చోటుచేసుకున్న పెద్ద ఘర్షణ ఇదే. ఈ దురాక్రమణ యత్నంలో చైనా వైపు చాలామంది సైనికులు గాయపడ్డట్టు సమాచారం. ► 2012 అక్టోబర్‌లో కూడా యాంగ్ట్సే ప్రాంతంలోనే భారత, చైనా సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ► కొంతకాలంగా ఈ ప్రాంతంలో చైనా డ్రోన్ల హడావుడి బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా రగడకు ముందే మన యుద్ధ విమానాలు తవాంగ్ పరిసరాల్లో గస్తీ కాయడం, డేగ కళ్లతో నిఘా వేయడం మొదలైంది. ► దాదాపు 3,500 కిలోమీటర్ల పొడవైన నియంత్రణ రేఖ పొడవునా పరిస్థితిపై, దళాల సన్నద్ధతపై త్రివిధ దళాధిపతులు సమీక్ష జరిపారు. భారత సైనికులు అడ్డుకున్నందుకే...తవాంగ్ రగడ: చైనా సైన్యం ‘గల్వాన్ లోయ’ చేదు అనుభవం నేపథ్యంలో తవాంగ్ రగడపై చైనా ప్రభుత్వ ఆచితూచి స్పందించగా సైన్యం మాత్రం తెంపరి వ్యాఖ్యలకు దిగింది! సరిహద్దుల వెంబడి పరిస్థితి నిలకడగా ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మంగళవారం వ్యాఖ్యానించారు. ‘‘భారత దళాలే అక్రమంగా ఎల్ఓసీ దాటాయి. చైనా వైపు డాంగ్జాంగ్ ప్రాంతంలో గస్తీ విధుల్లో ఉన్న మా సైనికులను అడ్డుకున్నాయి. అది డిసెంబర్ 9 రగడకు దారి తీసింది’’ అని చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) వెస్టర్న్ థియేటర్ కమాండ్ అధికార ప్రతినిధి కల్నల్ లోంగ్ షోహువా ఆరోపించారు. నిజాలు దాస్తున్న కేంద్రం రాజ్‌నాథ్‌ది అరకొర ప్రకటన: కాంగ్రెస్ ‘తవాంగ్’పై అట్టుడికిన ఉభయసభలు కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాల వాకౌట్ తవాంగ్ రగడ మంగళవారం పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. చైనాను నిలువరించడంలో కేంద్రం సమర్థంగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాలన్నీ దుయ్యబట్టాయి. ‘‘ఇది కచ్చితంగా దౌత్య వైఫల్యమే. సరిహద్దుల వద్ద పరిస్థితిపై తక్షణం సవివర చర్చకు ప్రభుత్వం సిద్ధపడాలి’’ అని డిమాండ్ చేశాయి. రాజ్‌నాథ్ ప్రకటనపై వివరణకు పట్టుబట్టాయి. ఇది సున్నితమైన అంశమంటూ వివరణ కోరేందుకు రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా అనుమతివ్వలేదు. అందుకు నిరసనగా కాంగ్రెస్, ఎస్పీ, జేఎంఎం, ఆర్జేడీ, శివసేన, సీపీఎం, సీపీఐ ఉభయ సభల నుంచీ వాకౌట్ చేశాయి. అనంతరం రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. చైనా సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్) గుర్తింపు రద్దు అంశాన్ని కావాలని మోదీ సర్కారు తెరపైకి తెస్తోందని ఆరోపించారు. ఉభయ సభల్లో వివరణ ఇవ్వకుండా పారిపోయిందని ఎద్దేవా చేశారు. చైనా దురాక్రమణ, ఉగ్రవాదం దేశ భద్రతకు, ప్రాదేశిక సమగ్రతకు పెను ముప్పుగా మారుతున్నా మౌన ప్రేక్షకునిగా చూస్తోందంటూ దుయ్యబట్టారు. మంత్రుల వెనక దాక్కుంటున్న మోదీ చైనా అంశంపై ప్రభుత్వ వ్యవహార శైలిని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. తవాంగ్ రగడపై రక్షణ మంత్రి అరకొర ప్రకటనతో సరిపెట్టారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. దీనిపై మోదీ ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందని పార్టీ నేతలు గౌరవ్ గొగొయ్, పవన్ ఖేరా ఆరోపించారు. ‘‘డిసెంబర్ 9న ఘర్షణ జరిగితే రక్షణ మంత్రి ప్రకటనకు ఇంత ఆలస్యమెందుకు? ప్రజల నుంచి ఏం దాస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. జాతీయ భద్రత అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా మోదీ తన మంత్రుల వెనక దాక్కుంటారని ఎద్దేవా చేశారు. పీఎం కేర్స్ నిధికి విరాళాలిచ్చిన చైనా కంపెనీల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అంగుళం కూడా వదలం: అమిత్ షా రాజీవ్ ఫౌండేషన్‌కు చైనా నిధులు దాని గుర్తింపు రద్దయినందుకే నిరసనలు కాంగ్రెస్‌కు హోం మంత్రి చురకలు మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం భారత భూభాగంలో ఎవరూ ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎలాంటి చొరబాట్లనూ అనుమతించబోమన్నారు. ‘లోక్‌సభలో కార్యకలాపాలను కాంగ్రెస్ పదేపదే అడ్డుకోవడానికి అసలు కారణం తవాంగ్ రగడ కాదు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్)కు విదేశీ విరాళాల చట్టం (ఎఫ్సీఆర్ఏ) గుర్తింపును కేంద్రం రద్దు చేయడమే!’’ అంటూ చురకలంటించారు. ‘‘సమాజ సేవ కోసమంటూ నమోదు చేసుకున్న ఆర్జీఎఫ్కు ఇండో–చైనా సంబంధాల అభివృద్ధి సంబంధిత అధ్యయనం పేరిట చైనా ఎంబసీ నుంచి రూ.1.35 కోట్లు అందాయి. అందుకే దాని గుర్తింపు రద్దు చేయాల్సి వచ్చింది. విపక్షాల గొడవ వల్ల ప్రశ్నోత్తరాలు తుడిచిపెట్టుకుపోయాయి. లేదంటే ఈ విషయాన్ని సభలోనే చెప్పేవాన్ని. బహుశా ఆర్జీఎఫ్ తన అధ్యయనం ముగించే ఉంటుంది. ఇంతకూ, 1962 చైనా యుద్ధంలో ఎన్ని వేల హెక్టార్ల భారత భూ భాగాన్ని చైనా ఆక్రమించిందన్నది ఆ అధ్యయనంలో ఉందా?’’ అంటూ ఎద్దేవా చేశారు. చైనాపై మోదీ ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తోందన్న కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు. నిజానికి విదేశీ నాయకులతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాధినేతలకు ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగానే ఐరాస భద్రతా మండలిలో స్థానం చేజారిందంటూ ప్రత్యారోపణ చేశారు. ‘‘భద్రతా మండలిలో భారత్ స్థానాన్ని కాంగ్రెస్‌కు చెందిన దేశ తొలి ప్రధాని నెహ్రూ ఎందుకు ‘త్యాగం’ చేశారు? కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్సింగ్ అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తే చైనా అభ్యంతరపెట్టింది. ఆ రాష్ట్ర సీఎం దోర్జీ ఖండూకు వీసా నిరాకరించింది. జమ్మూ కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ అక్కడి ప్రజలకు స్టేపుల్ వీసాలిచ్చింది. వీటన్నింటిపై కూడా ఆర్జీఎఫ్ అధ్యయనం చేసిందా?’’ అంటూ ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ సారథ్యంలోని ఆర్జీఎఫ్కు ఉగ్రవాదులతో లింకుల ఆరోపణలపై నిషేధం ఎదుర్కొంటున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ నుంచి కూడా రూ.50 లక్షలందాయని ఆరోపించారు. -
వివాదంలో ఇరుక్కున్న నటి.. నా ఉద్దేశం అది కాదంటూ.. క్షమాపణలు..
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి రిచా చద్దా వివాదంలో చిక్కుకున్నారు. ఆమె చేసిన ఒక ట్వీట్ సైనికుల్ని అవమానించేలా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో రిచా క్షమాపణలు చెప్పారు. ఆ ట్వీట్‌ను కూడా తొలగించారు. ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, కేంద్రం ఆదేశాల కోసం చూస్తున్నామంటూ ఒక ట్వీట్ చేశారు. రిచా దీనిని ప్రస్తావిస్తూ ‘‘గల్వాన్ సేస్ హాయ్’’ అని పోస్టు పెట్టారు గల్వాన్ ప్రస్తావన తీసుకురావడంతో నెటిజన్లు మండిపడ్డారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసే సైనికుల్ని ఎగతాళి చేయడానికి ఈ ట్వీట్ చేశారంటూ విరుచుకుపడ్డారు. దీంతో రిచా ఆ ట్వీట్‌ను తొలగించారు. సైనికుల్ని అవమానపరచడం తన ఉద్దేశం కాదని క్షమాపణ కోరారు. చదవండి: 100 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం ఆరోపణలు.. -
దొంగదెబ్బ తీసిన కమాండర్లకు ప్రమోషన్.. టాప్ పోస్టులతో సత్కారం!
బీజింగ్: పొరుగు దేశం చైనా మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత సైనికులపై దొంగదెబ్బ తీయటంలో కీలకంగా వ్యవహరించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏ కమాండ్ జనరల్స్‌పై ప్రశంసలు కురిపించింది. చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. భారత సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు కమాండ్ జనరల్స్‌కు ప్రమోషన్ కల్పిస్తూ.. టాప్ పోస్టులు కట్టబెట్టారు. ప్రస్తుతం భారత సరిహద్దులోని వెస్టర్న్ థియోటర్ కమాండ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► జనరల్ హీ వెయిడాంగ్(65)ను సెంట్రల్ మిలిటరీ కమిషన్(సీఎంసీ) కొత్త వైస్ ఛైర్మన్‌గా నియమించారు జిన్‌పింగ్. సీఎంసీకు అధ్యక్షుడి హోదాలో జిన్‌పింగ్ నేతృత్వం వహిస్తారు. మరోవైపు.. సీఎంసీలో ఎలాంటి పదవులు చేపట్టకుండానే వైస్ ఛైర్మన్ పోస్టులోకి జనరల్ హీ వెయిడాంగ్ను నియమించటం గమనార్హం. ► జనరల్ ఝాంగ్ యూక్సియా(72).. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు సంపాదించారు. పదవీ విరమణ వయసు దాటినప్పటికీ ఆయనను ఫస్ట్ ర్యాంకింగ్ వైస్ ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించారు. పీఎల్ఏలో జిన్‌పింగ్‌కు కుడిభుజంగా ఝాంగ్‌ను చెప్పుకుంటారు. ► జనరల్ జు క్విలింగ్(60)ను 205 మంది సభ్యులుగా ఉన్న పార్టీ కొత్త సెంట్రల్ కమిటీలో నియమించారు జిన్‌పింగ్. మరోవైపు.. నియంత్రణ రేఖ వద్ద సంక్షోభం తలెత్తిన క్రమంలో జనరల్ జు క్విలింగ్ ఇంఛార్జిగా ఉన్నారు. దీంతో 2021 జులైలో డబ్ల్యూటీసీ హెడ్‌గా , లెఫ్టినెంట్ జనరల్ నుంచి జనరల్‌గా పదోన్నతి పొందారు. మరోవైపు.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ(69)కి సైతం పదవీ విరమణ వయసు దాటినప్పటికీ తనతోనే అట్టిపెట్టుకున్నారు జిన్‌పింగ్. పొలిట్ బ్యూరోలోకి వాంగ్ యీని తీసుకున్నారు. పార్టీ విదేశీ వ్యవహారాల సెంట్రల్ కమిషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: చరిత్రకెక్కిన జిన్‌పింగ్.. మావో జెడాంగ్ తర్వాత తొలినాయకుడిగా.. -
గోగ్రా నుంచి మూడు రోజుల్లో సైన్యం వెనక్కి
న్యూఢిల్లీ: తూర్పులద్దాఖ్‌లోని గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో సైన్యాన్ని వెనక్కి ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేయాలని భారత్, చైనా నిర్ణయించాయి. సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి ఈ నెల 12 సోమవారం వరకు గడువు ఉందని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి గత రెండేళ్లుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న గోగ్రా–హాట్‌స్ప్రింగ్స్ పెట్రోలింగ్ పాయింట్ 15 దగ్గర్నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకునే ప్రక్రియను మొదలు పెట్టామని భారత్, చైనా ప్రకటించిన ఒక్క రోజు తర్వాతే భారత్ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వచ్చేవారం ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంస్థ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశాలున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఇతర అంశాలను కూడా పరిష్కరించుకొని సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్టుగా విదేశాంగ శాఖ అధికారప్రతినిధి అరిందమ్ బగాచి చెప్పారు. గురువారం ఉదయం 8.30 గంటలకు మొదలైన సైన్యం ఉపసంహరణ సోమవారంతో ముగియాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలనూ ధ్వంసం చేస్తున్నటు చెప్పారు. 2020 జూన్ గల్వాన్‌లోయలో ఘర్షణలు జరగడానికి ముందు ఎలా ఉండేదో అలా ఉండేలా ఇరు పక్షాలు చర్యలు తీసుకుంటాయన్నారు. -
Rekha Singh: భర్త కన్న కలల కోసం.. భారత ఆర్మీలోకి రేఖా సింగ్
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లోని గల్వాన్ లోయలో 2020 జూన్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన నాయక్ దీపక్ సింగ్ భార్య రేఖా సింగ్ ఇండియన్ ఆర్మీలో చేరారు. తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్న ఆమె లెఫ్టినెంట్ అయ్యారు. ఆర్మీకి సంబంధించిన శిక్షణని మే 28 నుంచి చెన్నైలో రేఖా సింగ్ తీసుకోనున్నారు. దీపక్ సింగ్‌కు తన భార్య కూడా ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని బలమైన కోరిక ఉండేది. ఆయన జీవించి ఉన్నప్పుడు ఆమెను ఆ దిశగా ప్రోత్సాహించారు. వారిద్దరికీ పెళ్లయిన ఏడాదిన్నరలోనే గల్వాన్ ఘర్షణల్లో దీపక్ సింగ్ వీర మరణం పొందడం రేఖను బాగా కుంగదీసింది. భర్త పోయిన దుఃఖం నుంచి కోలుకున్న ఆమె టీచర్ ఉద్యోగం వీడి తన భర్త కన్న కలల్ని సాకారం చేయడానికి ఆర్మీలో చేరారు. అది కూడా ఏమంత సులభంగా ఆమెకి రాలేదు. రెండు సార్లు ప్రయత్నించిన మీద లెఫ్టినెంట్ పదవి దక్కింది. -
బోర్డర్లో భారత్‌తో కయ్యం.. అజిత్ ధోవల్‌కు చైనా ఆఫర్ ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య లఢక్ సహా మరిన్ని సరిహద్దు వివాదాస్పద ప్రాంతాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో భారత్ పర్యటనలో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. కాగా, శుక్రవారం విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో వాంగ్ యీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో.. పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. జైశంకర్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తోనూ సమావేశం అయ్యారు. మరోవైపు.. సమావేశంలో భాగంగా అజిత్ ధోవల్‌ను తమ దేశానికి రావాలంటూ చైనా విదేశాంగ మంత్రి ఆహ్వానం అందించారు. కాగా, ఆయన ఆహ్వానంపై అజిత్ ధోవల్ పాజిటివ్‌గా స్పందిస్తూ.. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు విజయవంతంగా పరిష్కారమైన తర్వాత కచ్చితంగా చైనాకు వస్తానని తెలిపారు. కాగా, ద్వైపాక్షిక సంబంధాలు బలపడాలంటే, లఢక్‌తో పాటు ఇతర వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా తమ దళాలను ఉపసంహరించాలని ధోవల్ ఈ సందర్భంగా వాంగ్ యీని కోరారు. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఉన్నాయని ఆమోదయోగ్యంగా లేవన్నారు. ఈ క్రమంలో శాంతి స్థాపనతోనే ఇరు వర్గాల మధ్య నమ్మకం ఏర్పడుతుందని రెండు దేశాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. 2020 జూన్ 15న భారత్, చైనా బలగాల మధ్య గాల్వాన్ లోయలో తలెత్తిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులవడంతో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. అప్పటి నుంచి ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నప్పటికీ.. అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. కాగా, గాల్వాన్ ఘటన తర్వాత సీనియర్ స్థాయి చైనా నేత భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక, రెండు రోజుల క్రితం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సమయంలో కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాంగ్ యూ.. తాజాగా భారత్‌లో పర్యటించడం గమనార్హం. ఢిల్లీకి రాకముందు వాంగ్ యి.. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో పర్యటించారు. -
మా ఎంపిక సరైనదే అంటూ చైనా కొత్త పల్లవి
Winter Olympic 2022: వింటర్ ఒలంపిక్స్‌లో టార్చ్‌బేరర్‌గా గల్వాన్‌లోయ ఘర్షణతో సంబంధం ఉన్న సైనికుడిని ఎంపిక చేయడాన్ని చైనా సమర్థించుకుంది. సదరు సైనికుడిని ప్రమాణాలకు అనుగుణంగా ఎంచుకున్నామని తెలిపింది. ఇందులో రాజకీయ దురుద్దేశాలు చూడవద్దని కోరింది. గల్వాన్ లోయ ఘర్షణలో గాయపడిన కమాండర్ క్వి ఫాబావోను చైనా టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. దీనికి నిరసనగా వింటర్ ఒలంపిక్స్ ఆరంభోత్సవాలను భారత్ బహిష్కరించింది. యూఎస్ సైతం చైనా చర్యను తప్పుబట్టింది. అయితే ఇది కేవలం ముందుగా అనుకున్న ప్రమాణాలకు లోబడి తీసుకున్న నిర్ణయమని చైనా విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి ఝావో లిజియన్ చెప్పారు. ఈ విషయాన్ని భారత్ హేతుబద్ద దృష్టితో చూడాలని, అనవసర రాజకీయ విమర్శలు చేయవద్దని కోరారు. అయితే ఒలంపిక్స్లాంటి కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేయాలని చూడడం చైనా కోరికని భారత ప్రతినిధి బాగ్చీ విమర్శించారు. -
చైనాతో వివాదం: మా మద్దతు భారత్‌కే.. స్పష్టం చేసిన అమెరికా
వాషింగ్టన్: గాల్వాన్ ఘర్షణలో పాల్గొన్న సైనికాధికారిని బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడంపై చైనాతో ఏర్పడ్డ వివాదంలో తమ మద్దతు భారత్‌కేనని అమెరికా పేర్కొంది. పొరుగు దేశాలను బెదిరించే, ఇబ్బంది పెట్టే చైనా చర్యలను గతంలో కూడా తప్పుబట్టామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ప్రైస్ అన్నారు. ఇలాంటి విషయాల్లో భారత్ వంటి మిత్ర దేశాలకు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తామని చెప్పారు. భారత్, చైనా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సీనియర్ యూఎస్ సెనేటర్లు మార్కో రూబియో, జిమ్ రిచ్ కూడా చైనా చర్యను దుయ్యబట్టారు. వింటర్ ఒలింపిక్స్‌కు చైనా రాజకీయ రంగు పూస్తున్న తీరుకు ఇది మరో నిదర్శనమని రూబియో విమర్శించారు. భారత దళాలపై దొంగచాటున దాడికి దిగిన సైనిక బృందంలోని అధికారిని టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడం కచ్చితంగా రెచ్చగొట్టే ప్రయత్నమేనని ట్వీట్ చేశారు. ఈ విషయంలో చైనా తీరు సిగ్గుచేటని రిచ్ ట్వీట్ చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు చేసే అన్ని ప్రయత్నాలకూ అమెరికా మద్దతుంటుందన్నారు. 2020 జూన్‌లో లడఖ్‌లోని గాల్వాన్ లోయ వద్ద మన దళాలపై చైనా జరిపిన దొంగచాటు దాడిలో పాల్గొన్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారిని శుక్రవారం నాటి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల టార్చిబేరర్ల బృందంలోకి చైనా ఎంపిక చేయడంపై దుమారం రేగింది. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలను బహిష్కరించాలని నిర్ణయించింది. దూరదర్శన్ కూడా ప్రారంభ, ముగింపు వేడుకలను ప్రత్యక్షప్రసారం చేయబోదని ప్రసారభారతి వెల్లడించింది. -
చైనా చేష్టలు.. భారత్ రియాక్షన్ ఇది
గల్వాన్ లోయ ఘర్షణల్లో పాల్గొన్న కమాండర్, ఉయిగర్ల ఊచకోతలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తిని టార్చ్‌బేరర్‌గా అర్హత ఇవ్వడం ద్వారా పెను వివాదానికే కేంద్రం బిందువుగా మారింది వింటర్ ఒలింపిక్స్ 2022. పైపెచ్చు ఇప్పుడు అథ్లెటిక్స్ను స్వేచ్ఛగా మాట్లాడేందుకు వీలు లేకుండా ఆంక్షలు పెట్టింది. ఇక గల్వాన్ లోయ ఘర్షణలకు కారణమైన సీపీఏల్ఏ కమాండర్ క్వీ ఫబోవోను టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడంపై భారత్, చైనా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సరిహద్దు అంశాన్ని కెలిగి.. రాజకీయం చేయాలని చూస్తోందని భారత్ అంటోంది. అందుకే వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత రాయబారి, దౌత్యవేత్తలు పాల్గొనడని స్పష్టం చేసింది. ఈ బహిష్కరణతో పాటు ఒలింపిక్స్ ఈవెంట్స్‌ను టెలికాస్ట్ చేయడంలో దూరదర్శన్ దూరంగా ఉంటుందని ప్రసారభారతి స్పష్టం చేసింది. Consequent to the announcement by @meaindia, @ddsportschannel will not telecast live the Opening and Closing ceremonies of the Winter Olympics being held in Beijing. https://t.co/sSP1EX9pSQ — Shashi Shekhar Vempati शशि शेखर (@shashidigital) February 3, 2022 పదహారు రోజులపాటు బీజింగ్ వేదికగా శీతాకాల ఒలింపిక్స్ జరగున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మునుపెన్నడూ లేనంతగా అథ్లెటిక్స్ మీద ఆంక్షలు విధించింది. అంతేకాదు చైనా చట్టాల మీద, రూల్స్‌కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే.. శిక్ష తప్పదని హెచ్చరించింది బీజింగ్ ఆర్గనైజింగ్ కమిటీ. అంతేకాదు నిరసనలు తెలిపే హక్కును తొలగిస్తూ.. అందుకు సంబంధించిన పోడియంలను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. -
చైనాకు కొంచెమైనా సిగ్గు ఉందా?
ఒకవైపు కరోనా కేసులు దాచి పెడుతూ.. ఎలాగైనా వింటర్ ఒలింపిక్స్ వేడుకల్ని నిర్వహించాలని చైనా తాపత్రయపడుతోంది. ఈ క్రమంలో సరిహద్దు అంశాన్ని కెలికి మరీ విమర్శలు ఎదుర్కొంటోంది. చైనా తాజాగా చేసిన పనిని అగ్రరాజ్యం తీవ్రంగా ఖండించింది. బుధవారం వింటర్ ఒలింపిక్ టార్చ్ రిలేను నిర్వహించిన ఆతిథ్య చైనా.. టార్చ్‌బేరర్‌గా క్వీ ఫబోవోను ఎంచుకుంది. ఇతను గల్వాన్ లోయ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన సీపీఏల్ఏ కమాండర్. ఈ విషయాన్ని డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన షిన్జియాంగ్ మిలటరీ కమాండర్, గల్వాన్ లోయ వీరుడు క్వీ ఫబోవో.. బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు వాంగ్ మింగ్‌తో కలిసి ఒలింపిక్ జ్యోతిని పట్టుకుని రిలేను ప్రారంభించారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. కాగా, ఈ చర్యను అమెరికా తీవ్రంగా ఖండించింది. ‘‘ఇది సిగ్గుమాలిన పని. గల్వాన్ లోయ దాడిలో పాల్గొన్న వ్యక్తిని.. అదీ ఉయిగర్ల ఊచకోతకు కారణమైన వ్యక్తి టార్చ్ బేరర్‌గా ఎంచుకోవడం వెనుక ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపింది. భారత సార్వభౌమత్వానికి, ఉయిగర్ల స్వేచ్ఛకు అమెరికా ఎప్పుడూ మద్ధతు ఇస్తూనే ఉంటుంది’’ అని యూఎస్ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ర్యాంకింగ్ మెంబర్ ఈ ఉదయం ఒక ట్వీట్ చేశారు. ఇక, శీతాకాల ఒలింపిక్స్‌ను భారత్ బహిష్కరించనప్పటికీ.. ప్రారంభ వేడుకలు సహా ఒలింపిక్ కార్యక్రమానికి మన దేశం నుంచి ఎవ్వర్నీ పంపడంలేదు. It's shameful that #Beijing chose a torchbearer for the #Olympics2022 who's part of the military command that attacked #India in 2020 and is implementing #genocide against the #Uyghurs. The U.S. will cont. to support #Uyghur freedoms & the sovereignty of India. — Senate Foreign Relations Committee Ranking Member (@SenateForeign) February 3, 2022 నష్టం ఎక్కువే! భారత్ సైన్యంతో గల్వాన్ లోయలో 2020 జూన్ 15న జరిగిన ఘర్షణల్లో 40 మందికిపైగా సీపీఎల్ఏ జవాన్లు చనిపోయినా.. పరువు పోతుందనే భయంతో నలుగురు మాత్రమే మరణించారని డ్రాగన్ తక్కువచేసి చెప్పింది. నలుగురు సైనికులకు మరణానంతరం గత సంవత్సరం గౌరవ బిరుదులు, ఫస్ట్-క్లాస్ మెరిట్ పతకాలను అందజేసింది. గతంలో రష్యా ఏజెన్సీలు చైనా నష్టంపై ఒక ప్రకటన చేయగా.. తాజాగా ఆస్ట్రేలియా పేపర్ ఒకటి ఏడాది విచారణ తర్వాత ఆ మరణాల సంఖ్య ఎక్కువేనని ప్రకటించింది. చీకట్లో శీతల వరద ప్రవాహాంలో పడి చాలామంది సైనికులు కొట్టుకు పోయి ఉంటారని, కానీ, చైనా ఆ విషయాన్ని దాస్తోందని ఆ వార్తా పత్రిక.. ఈ మేరకు చైనా నుంచే పలు ఆధారాలను సేకరించినట్లు మరీ వెల్లడించింది. ఇక గల్వాన్ ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారైన సంగతి తెలిసిందే. చదవండి: షిన్జియాంగ్ కాదు మొత్తం చైనాకే ముడిపెట్టిన బైడెన్ -
గల్వాన్‌లో మువ్వన్నెల జెండా
న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని గల్వాన్‌లోయలో భారీ భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తున్న ఆర్మీ బలగాల ఫొటోలను రక్షణ వర్గాలు విడుదల చేశాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా భారత సైనిక బలగాలు లోయలో భారత జెండాతో ప్రదర్శన నిర్వహించాయి. ఈ లోయ తమ అదీనంలో ఉన్నట్లు చూపుతూ చైనా ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలను తిప్పికొట్టేందుకే భారతీయ రక్షణ వర్గాలు తాజా ఫొటోలు విడుదల చేశాయి. చైనా బలగాలు చైనా జాతీయ జెండాతో గల్వాన్‌లోయలో ఉన్నట్లు చూపే చిత్రాలను ఆదేశం మూడు రోజుల కిందట విడుదల చేసింది. దీంతో ఈ ప్రాంతం మొత్తం చైనా అధీనంలోకి వచ్చిందన్న దుమారం రేగింది. అయితే ఇవన్నీ చైనా వక్రబుద్ధికి చిహ్నాలని, ఆ ప్రాంతంపై చైనా పట్టు లేదని కేంద్రం వివరణ ఇచ్చింది. చైనా విడుదల చేసిన చిత్రాలు గల్వాన్ లోయ అవతలి ప్రాంతంలోనివని, ఫొటోల్లోని ప్రాంతం నిస్సైనిక మండలం దగ్గరలో లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో భారతీయ ఆర్మీ గల్వాన్‌లోయలో ఉన్న చిత్రాలు విడుదలయ్యాయి. న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు సైతం తన ట్విట్టర్ అకౌంట్లో ఈ చిత్రాలను పోస్ట్ చేశారు. నూతన సంవత్సర సందర్భంగా గల్వాన్‌లోయలో వీర భారతీయ సైనికులు అని ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. భారతీయ వర్గాలు విడుదల చేసిన ఫొటోలను ఈనెల 1న గల్వాన్‌లోయలో తీసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒక ఫొటోలో అసాల్ట్ రైఫిళ్లు ధరించిన దాదాపు 30 మంది భారతీయ సైనికులు జాతీయ జెండాను ప్రదర్శిస్తున్నారు. మరో ఫొటోలో నలుగురు సైనికులు భారతీయ జెండాను ప్రదర్శిస్తున్నారు. ఇందులో డోగ్రా రెజిమెంట్ జెండా కూడా కనిపిస్తోంది. నూతన సంవత్సర సందర్భంగా సరిహద్దుల్లో భారతీయ రక్షణ వర్గాలు చైనా సైనికులకు స్వీట్లు పంచి సహృద్భా వం చాటారు. కానీ చైనా మాత్రం కుయుక్తితో నకిలీ ఫొటోలను, అభూత వీడియోను విడుదల చేసింది. -
డ్రాగన్ దుష్ట పన్నాగాలు
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా మరోసారి తన యుద్ధకాంక్షను బయటపెట్టింది. రణక్షేత్రంలో తమకు ఎదురు నిలిచే దేశంపై పైచేయి సాధించేందుకుగాను సరిహద్దులకు వేగంగా సైన్యాన్ని, శతఘ్నులను తరలించేందుకు పటిష్ట ప్రణాళికలతో దూసుకెళ్తోంది. భారత్–చైనా మధ్య 18 నెలలుగా తీవ్ర ఉద్రిక్తంగా తయారైన తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ ప్రాంతంలో ఒక వంతెనను నిర్మించింది. ప్యాంగాంగ్ త్సో సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలను కలుపుతూ ఈ బ్రిడ్జిని యుద్ధప్రాతిపదికన నిర్మించారని తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా బహిర్గతమైంది. భారత్‌తో ఘర్షణ తలెత్తితే హుటాహుటిన సైన్యాన్ని, భారీ ఆయుధాలను, యుద్ధ సామగ్రిని తరలించాలనే ఎత్తుగడతోనే చైనా దీన్ని నిర్మించిందని శాటిలైట్ ఫొటోలకు సంబంధించిన జియో ఇంటెలిజెన్స్ నిపుణుడు డామిన్ సైమన్ విశ్లేషించారు. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణం వైపున ఉన్న కైలాస్ శిఖరాలను ముందుగా చేరుకుని గత ఏడాది భారత సేనలు అక్కడ పట్టు సాధించాయి. దీంతో భవిష్యత్తులో భారత సైన్యానికి దీటుగా స్పందించేందుకే సైన్యం మోహరింపునకు వీలుగా కొత్త వంతెనను చైనా సిద్ధం చేసిందని తెలుస్తోంది. కొత్త వంతెన ద్వారా అదనపు ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో సైన్యాన్ని రంగంలోకి దింపి చైనా బరితెగించనుంది. 2020 తొలినాళ్ల నుంచే భారత్, చైనా చెరో 50 వేల సైన్యాన్ని తూర్పు లద్దాఖ్‌లో మోహరించాయి. 2020 జూన్‌లో గల్వాన్ నదీ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైన్యం ఘర్షణల్లో 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. దాదాపు ఏడాదిపాటు తూర్పు లద్దాఖ్‌లో తీవ్ర ఉద్రిక్తత రాజ్యమేలింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీల చర్చల తర్వాత ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్లాలని ఇరుదేశాల సైన్యాలు నిర్ణయించాయి. అటు వైపే బ్రిడ్జి కట్టారు సరిహద్దు వెంట చైనా అధీనంలోని ప్రాంతంలోనే బ్రిడ్జి నిర్మాణం జరిగిందని భారత ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. రెండు కి.మీల. నిస్సైనిక ప్రాంతంలో ఈ వంతెనను నిర్మించలేదని, గల్వాన్ ఘర్షణల తర్వాత కుదిరిన ఒప్పందాలను చైనా ఉల్లంఘించలేదని భారత సైనిక వర్గాలు తెలిపాయి. అంగుళం కూడా వదులుకోం: గ్లోబల్ టైమ్స్ కొత్త సంవత్సరం మొదలైన కొద్ది గంటలకే గల్వాన్ లోయ తమదేనంటూ తమ జాతీయ జెండాను చైనా గల్వాన్‌లో ఎగరేసిందని ఆ దేశ జాతీయ మీడియా సంస్థలు సంబంధిత వీడియోను ప్రముఖంగా ప్రసారం చేశాయి. ‘ఒక్క అంగుళం నేల కూడా వదులుకునేది లేదు’ అనే సందేశాన్ని చైనా సైనికులు తమ పౌరులకు కొత్త సంవత్సర కానుకగా పంపించారని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది. దీంతో విపక్షాలు మోదీ సర్కార్‌పై మండి పడ్డాయి. ‘గల్వాన్ లోయకు మన త్రివర్ణ పతాకమే సరిగ్గా సరిపోతుంది. ప్రధాని మౌనదీక్షను వీడి చైనా ఆక్రమణలపై మా ట్లాడాలి’ అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. 🇨🇳China’s national flag rise over Galwan Valley on the New Year Day of 2022. This national flag is very special since it once flew over Tiananmen Square in Beijing. pic.twitter.com/fBzN0I4mCi — Shen Shiwei沈诗伟 (@shen_shiwei) January 1, 2022 (చదవండి: మీ మనసులోకి తొంగి చూడలేను.. శిక్ష అనుభవించాల్సిందే!) (చదవండి: దక్షిణాఫ్రికా ‘పార్లమెంట్’లో అగ్ని ప్రమాదం) -
కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర పురస్కారం
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో వీర మరణం పొందిన కల్నల్ బిక్కమల్ల సంతోష్‌బాబుకు(37) మహావీర్‌చక్ర పురస్కారం లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ భార్య, తల్లి ఈ అవార్డును స్వీకరించారు. కాగా యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు అందజేసే రెండో అత్యున్నత పురస్కారమే మహావీర్ చక్ర. చదవండి: సిద్దిపేట లాల్ కమాన్‌పై ఉన్నట్టుండి వెలసిన కేసీఆర్ విగ్రహం కాగా భారత్, చైనా సైనికుల మధ్య తూర్పు లద్దాఖ్‌లోని గాల్వాన్ లోయ ప్రాంతంలో 2020 జూన్ 15వ తేదీ రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది బిహార్ రెజిమెంట్‌కు చెందినవారు. 16-బిహార్ రెజిమెంట్‌లో కమాండింగ్ ఆఫీసర్ సంతోష్ బాబు నేతృత్వం వహిస్తున్న దళంతోనే గల్వాన్ లోయలో చైనా సైనికులు ఘర్షణకు దిగారు. సంతోష్ బాబుది తెలంగాణలోని సూర్యాపేట. సంతోష్ 1982లో జన్మించారు. సంతోష్ బాబుకు భార్య మంజుల, కూతురు అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు. ఆయన చైనా సరిహద్దుల్లో ఏడాదిన్నరగా విధుల్లో ఉన్నారు. -
చైనీయులకు షాకిచ్చే త్రిశూల్.. వజ్ర..!
న్యూఢిల్లీ: పరమశివుని చేతిలో త్రిశూలం..ఇప్పుడిక భారత బలగాల చేతుల్లో ఆయుధంగా మారనుంది. డ్రాగన్ ఆర్మీకి షాకిచ్చేందుకు త్రిశూల్, వజ్ర పేర్లతో ప్రాణహాని కలిగించని ఆయుధాలను భారత సైన్యం సిద్ధం చేసుకుంటోంది. గల్వాన్ ఘటన సమయంలో చైనా బలగాలు ఇనుపరాడ్లు, ఇనుప ముళ్లు లాంటి ఆయుధాలతో భారత సైనికులపైకి దాడికి వచ్చిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఘర్షణల సమయంలో ప్రాణహాని కలిగించని ఆయుధాలనే వాడాలంటూ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు చైనా ఆర్మీ అప్పట్లో వీటిని ఉపయోగించింది. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా సరిహద్దుల్లోని భారత బలగాలు దీటైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. చైనా సైన్యం(పీఎల్ఏ) వాడిన మాదిరిగా సంప్రదాయ ఆయుధాలనే భారత సైన్యం కూడా సమకూర్చుకుంటోంది. ఈ మేరకు బాధ్యతలను నోయిడాకు చెందిన అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ త్రిశూల్, వజ్ర వంటి పేర్లతో ప్రాణహాని కలిగించని సంప్రదాయ ఆయుధాలకు రూపకల్పన చేసింది. దీనిపై అపాస్టెరాన్ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మోహిత్ కుమార్ ఏఎన్ఐతో మాట్లాడుతూ..‘చైనా బలగాలను ముఖాముఖి ఎదుర్కొనే సమయంలో ప్రాణహాని కలిగించని ఆయుధాలను తయారు చేయమంటూ భారత ఆర్మీ మాకు బాధ్యతలు అప్పగించింది. మేం రూపొందించిన త్రిశూల్, వజ్ర వంటి వాటిని చూసి ఆర్మీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ‘శివుని చేతిలో త్రిశూలం స్ఫూర్తిగా తీసుకుని ‘త్రిశూల్’ను తయారు చేశాం. త్రిశూల్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. దీనిని తాకిన శత్రు సైనికుడు కొద్ది సెకన్లలోనే షాక్‌తో పడిపోతాడు. శత్రువుల వాహనాలను అడ్డుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా, వజ్ర.. ఇనుపరాడ్లాగా కనిపించే ఈ ఆయుధం మెరుపులాంటి షాక్ కలిగిస్తుంది. శత్రు సైనికులపై ముఖాముఖి పోరులో దాడి చేసేందుకు, వారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల టైర్లకు పంక్చర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. చేతికి వేసుకునే గ్లవ్స్ మాదిరిగా ఉండే ‘సప్పర్ పంచ్’అనే ఆయుధం ధరించి శత్రు సైనికుడిని కొడితే ఒకటీ రెండు దెబ్బలకే అతడు షాక్‌తో పడిపోవడం ఖాయం’అని మోహిత్ చెప్పారు. ‘ఈ ఆయుధాలను కేవలం భారత సైన్యం, భద్రతాబలగాల కోసం మాత్రమే రూపకల్పన చేశాం. ఇతర వ్యక్తులు లేదా సంస్థలకు వీటిని విక్రయించం’అని ఆయన అన్నారు. అయితే, వీటి తయారీ బాధ్యతలను ఆర్మీ ఎప్పుడు అప్పగించిందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. కాగా, నూతన రూపకల్పనలపై ప్రభుత్వం నుంచి గానీ, ఆర్మీ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. #WATCH 'Trishul' and 'Sapper Punch'- non-lethal weapons-developed by UP-based Apasteron Pvt Ltd to make the enemy temporarily ineffective in case of violent face offs pic.twitter.com/DmniC0TOET — ANI (@ANI) October 18, 2021 చదవండి: గాల్వాన్ లోయలో అమరులైన మన దేశ ముద్దుబిడ్డలు.. -
రెచ్చగొడితే ధీటైన సమాధానం చెప్తాం
సాక్షి, న్యూఢిల్లీ: పొరుగు దేశాలతో వివాదాలను కేవలం చర్చల ద్వారానే పరిష్కరించాలని భారత్ కోరుకుంటోందని, అయితే దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తేలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పదునైన వ్యాఖ్యలు చేశారు. భారత్ శాంతి కాముక దేశమని, ఎలాంటి దూకుడును ఆశ్రయించదని తెలిపారు. అయితే ఎవరైనా రెచ్చ గొట్టినా, బెదిరింపులకు పాల్పడినా తగిన ధీటైన సమాధానం ఇచ్చేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం తూర్పు లద్దాఖ్ లోని క్యున్‌గమ్‌తోపాటు ఫార్వార్డ్ పోస్‌కరులో జవాన్లనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన, చైనా సహా అనవసరంగా కాలు దువ్వే ఇతర పొరుగు దేశాలకు అర్థమయ్యేలా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. కాగా గతేడాది జూన్‌లో గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన 20 మంది సైనికులకు రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఆ అమరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరచిపోదని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా, భారత్‌లు పాంగోంగ్ సరస్సు ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ తూర్పు లద్దాఖ్‌లోని కొన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకునేందుకు చైనా అయిష్టత చూపుతుండటంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ మూడు రోజుల పర్యటన ఒక ముందడుగుగా భావించాల్సి ఉంటుంది. ఏ సమస్యకు అయినా స్పష్టమైన ఉద్దేశం ఉంటే చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించవచ్చని రక్షణ మంత్రి తెలిపారు. ‘గతేడాది దేశ ఉత్తర సరిహద్దులో మనం పెద్ద సవాలును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మా సాయుధ దళాలు సవాలును ఎదుర్కొనే విషయంలో వారి ధైర్యాన్ని, అంకితభావాన్ని ప్రదర్శించాయి. ప్రతి సవాలుకు తగిన సమాధానం ఇచ్చే సామర్ధ్యం మన సైన్యానికి ఉంది. మనం ఎల్లప్పుడూ ప్రపంచ శాంతి కోసం పనిచేశాము. ఎవ్వరిపై దాడి చేయలేదు. మన లక్ష్యం ఎవ్వరిపై విజయం సాధించడం కాదు. భారతదేశం ఏ దేశంపై దాడి చేయలేదు సరికదా అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు. మన ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది’అని సైనికులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో భారత్ వైఖరిని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అంతేగాక ‘మనం యుగాలుగా పొరుగువారే అని విషయం మన పొరుగు దేశాల వారు గుర్తెరగాలి. ఇకపై అనేక యుగాలపాటు పొరుగువారిగా ఉంటాము. వివాదాస్పద సమస్యలకు చర్చల ద్వారా శాశ్వత పరిష్కారాలు దొరకలేదా? మన దేశానికి చుట్టుపక్కల ఉన్న పొరుగువారు అందరి గురించి మాట్లాడుతున్నాను. మనకు స్పష్టమైన ఉద్దేశం ఉన్నట్లయితే ఎలాంటి వివాదాలను అయినా పరిష్కరించుకోవచ్చు’అని రక్షణమంత్రి వ్యాఖ్యానించారు. అదే సమయంలో సాయుధ దళాలకు అన్ని విధాలా సహకరించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు. సరిహద్దుల్లో జరిగే ప్రతీ ఘటనను ఎదుర్కోగల బలమైన సైనికదళాన్ని కలిగి ఉండాలన్న ప్రభుత్వ ఆలోచనను ఆయన పునరుద్ఘాటించారు. గతేడాది జూన్ 15న గాల్వాన్ లోయలో జరిగిన ఘటనలో భారత సైన్యం ప్రదర్శించిన ధైర్యాన్ని ప్రశంసించిన రాజ్‌నాథ్ సింగ్, దేశానికి తన సాయుధ దళాల పట్ల గర్వంగా ఉందని అన్నారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిర్మించిన 63 వంతెనలను ప్రారంభించారు. కాగా ఆదివారం తూర్పు లద్దాఖ్‌లో భారత సైనిక సన్నద్ధతపై రాజ్‌నాథ్ సమీక్ష నిర్వహించారు. రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలకు ప్రస్తుత పరిస్థితులు, లద్దాఖ్–లేహ్ ప్రాంతంలో సైన్యం సంసిద్ధతపై ఆర్మీ చీఫ్ కమాండర్లు సమగ్రంగా వివరించారు. -
సరిహద్దు ఉద్రిక్తత: 50 వేల అదనపు బలగాల మోహరింపు
న్యూఢిల్లీ: గల్వాన్ ఘర్షణ అనంతరం భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో ఎన్నడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం చైనా సరిహద్దు వెంబడి సుమారు 50వేల అదనపు బలగాలను మోహరించినట్లు సమాచారం. బ్లూంబర్గ్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత కొద్ది నెలలుగా చైనా సరిహద్దు వెంబడి మూడు ప్రాంతాలకు దళాలను, స్క్వాడ్రాన్ ఫైటర్ జెట్లను చేరవేసినట్లు తెలిపింది. గతేడాదితో పోల్చుకుంటే.. ఇండియా ఈ ఏడాది 40 శాతం అదనంగా అనగా 20 వేల దళాలలను సరిహద్దులో మోహరించినట్లు నివేదిక వెల్లడించింది. గతేడాది తూర్పు లద్ధాఖ్‌లో నెలకొన్న ఘర్షణల తర్వాత కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ లోయ నుంచి అత్యుత్తన్న శిఖర ప్రాంతాలకు సైనికులను చేరవేయడం కోసం ఎక్కువ సంఖ్యలో హెలికాప్టర్లతో పాటు ఎం777 హోయిట్జర్ వంటి అత్యాధునిక ఆయుధాలను తరలించిందని బ్లూమ్‌బర్గ్ నివేదిక పేర్కొంది. ఇక భారత సరిహద్దు సమీపంలో చైనా ఇప్పటివరకు ఎన్ని దళాలను మోహరించిందో స్పష్టంగా తెలియదు. కానీ హిమాలయాల వెంబడి వివాదాస్పద ప్రాంతాలలో పెట్రోలింగ్ బాధ్యత వహించే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల టిబెట్ నుంచి జిన్జియాంగ్ మిలిటరీ కమాండ్‌కు అదనపు బలగాలను తరలించినట్లు తెలిసింది. చదవండి: శాంతి బోధకులమే కానీ, మా జోలికొస్తే ఊరుకోం..