ఢిల్లీ: గల్వాన్ ఉద్రిక్తతల తర్వాత.. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి భారత్-చైనా సైనిక దళాల మళ్లీ ఘర్షణలు జరిగాయి. కనీసం మరో రెండుసార్లు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. తాజాగా.. భారత సైనిక పశ్చిమ దళం ఆధ్వర్యంలో సైనికులకు సాహస పురస్కారాల ప్రదాన కార్యక్రమం కారణంగా ఈ విషయం బయటపడింది. వారికి ఎందుకు ఈ పురస్కారాలు ఇస్తున్నదీ చెప్పే పత్రాల వల్ల విషయం బయటకు వచ్చింది.
ఇక ఈ నెల 13న జరిగిన కార్యక్రమానికి సంబంధించిన వీడియోను చాందీమందిర్‌లో ఉన్న ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ ప్రధాన కార్యాలయం యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేసింది. అయితే.. సోమవారం ఆ చానెల్ డీయాక్టివేట్ కావడం గమనార్హం. దీనిపై సైన్యం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ, 2021 సెప్టెంబరు- 2022 నవంబరు మధ్య చైనాతో ఘర్షణలు జరిగినట్లు పత్రాల్లో ఉంది. అయితే రెండుసార్లే ఘర్షణలు జరిగాయా? మరిన్ని జరిగాయా? అనేదానిపైనా సైన్యం స్పందించాల్సి ఉంది.
మే 2020లో తూర్పు లడఖ్ సరిహద్దు వరుస వివాదం తర్వాత.. వాస్తవాధీన రేక వెంట భారత్, చైనా దళాల మధ్య అనేక వాగ్వివాదాలు జరిగాయి. ఆ మరుసటి నెలలోనే గల్వాన్ లోయలో ఘర్షణలు జరగ్గా.. ఇరువైపులా గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి తర్వాత 3,488 కి.మీ. ఎల్‌ఏసీ వెంట భారత సైన్యం ప్రత్యేక అప్రమత్తతతో ఉంటోంది. తవాంగ్ సెక్టార్‌లో కూడా చైనా దళాలు అతిక్రమించడానికి ప్రయత్నించాయని.. చైనా ప్రయత్నాలన్నింటిని భారత సైనికులు దృఢంగా ఎదుర్కొన్నారని పార్లమెంట్‌లో ఆ సమయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ప్రకటన చేశారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment