కొద్ది రోజులుగా తవాంగ్ వద్ద భారత సైన్యం మోహరింపులు (ఎరుపు రంగు గీతలున్న ప్రాంతాల్లో)
న్యూఢిల్లీ: భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా చేసిన ప్రయత్నాలను మన సైన్యం పూర్తిస్థాయిలో తిప్పికొట్టిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ‘‘అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో యాంగ్‌ట్సే ప్రాంతం వద్ద వాస్తవాధీన రేఖను దాటేందుకు, తద్వారా యథాతథ స్థితిని మార్చేందుకు డిసెంబర్ 9న చైనా సైన్యం ప్రయత్నించింది. వాటన్నింటినీ మన సైనికులు చాలా గట్టిగా తిప్పికొట్టారు. మన సైనిక కమాండర్లు సకాలంలో స్పందించడంతో చైనా సైన్యం తోక ముడిచింది’’ అని చెప్పారు.
ఈ మేరకు మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆయన వేర్వేరుగా ప్రకటన చేశారు. ‘‘ఈ ఘర్షణ ఇరు సైనికుల నడుమ భౌతిక పోరుకూ దారి తీసింది. మనవాళ్లు వీరోచితంగా పోరాడారు. మన భూభాగాల్లోకి చొచ్చుకొచ్చేందుకు చైనా సైన్యం చేసిన ప్రయత్నాలను వమ్ము చేసి వారిని తరిమికొట్టారు’’ అని వివరించారు. ‘‘ఈ ప్రయత్నంలో మనవైపు ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. కొందరు సైనికులు స్వల్పంగా గాయపడ్డారు’’ అని స్పష్టం చేశారు.
‘‘ఈ ఘటన తర్వాత మన స్థానిక సైనిక కమాండర్, చైనా కమాండర్ మధ్య డిసెంబర్ 11న ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. దీనిపై మన ఆగ్రహాన్ని, అభ్యంతరాలను దౌత్య మార్గాల్లో కూడా చైనాకు తెలియజేశాం. ఇలాంటి దుందుడుకు చర్యలను పునరావృతం చేయొద్దని, సరిహద్దుల వెంబడి శాంతి, సామరస్యాలను కాపాడాలని గట్టిగా చెప్పాం’’ అని వెల్లడించారు. ‘‘మన భూభాగాన్ని ఆక్రమించేందుకు జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా పూర్తిగా తిప్పికొట్టేందుకు, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు సైన్యం నిత్యం సన్నద్ధంగా ఉంది. సభకు ఈ మేరకు హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. అంతకుముందు తాజా పరిస్థితిపై సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సమీక్ష జరిపారు.
గల్వాన్ తరహా ఘర్షణ
► డిసెంబర్ 9 నాటి చైనా ఆక్రమణ యత్నం మరోసారి రెండేళ్లనాటి ‘గల్వాన్ లోయ’ ఉదంతాన్ని తలపించింది. విశ్వసనీయ సమాచారం మేరకు... చైనా సైనికులు అచ్చం అప్పటి మాదిరిగానే ఇనుప ముళ్లతో కూడిన లావుపాటి ఆయుధాలు, కర్రల వంటివాటితో దాడికి దిగారు. అప్పట్లాగే పరిస్థితి మరోసారి బాహాబాహీకి కూడా దారితీసింది.
► తవాంగ్ పరిసరాల్లో యాంగ్‌ట్సే వద్ద 17 వేల అడుగుల పై చిలుకు ఎత్తున్న మంచు శిఖరాలపై పట్టు కోసం చైనా ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే దాదాపు రెండేళ్ల అనంతరం మరోసారి మన భూభాగాల్లోకి సైలెంటుగా చొచ్చుకొచ్చేందుకు డిసెంబర్ 9న దొంగ ప్రయత్నం చేసింది.
► అయితే అక్కడ ఎటు చూసినా మన సైన్యం భారీగా మోహరించిన తీరుతో చైనా దళాలు అవాక్కైనట్టు సమాచారం. వాటి చొరబాటు యత్నాలను మనవాళ్లు దీటుగా అడ్డుకోవడమే గాక పూర్తిస్థాయిలో తరిమి కొట్టారు.
► ఆ ప్రాంతంలో భారత సైన్యపు మోహరింపులు హై రిజల్యూషన్ కెమెరాలతో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కన్పిస్తున్నాయి.
► 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్ సమీపంలోని గల్వాన్ లోయ వద్ద చైనా, భారత దళాల మధ్య జరిగిన భీకర పోరు జరగడం తెలిసిందే. దానివల్ల ఇరుదేశాల సంబంధాలు బాగా క్షీణించాయి.
► అప్పటినుంచి తూర్పు ప్రాంతంలో వాస్తవా ధీన రేఖ వద్ద మోహరింపులను, యుద్ధ సన్నద్ధతను సైన్యం బాగా పెంచింది. నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది.
► ఆ తర్వాత ఇరు దేశాల మధ్య చోటుచేసుకున్న పెద్ద ఘర్షణ ఇదే. ఈ దురాక్రమణ యత్నంలో చైనా వైపు చాలామంది సైనికులు గాయపడ్డట్టు సమాచారం.
► 2012 అక్టోబర్లో కూడా యాంగ్‌ట్సే ప్రాంతంలోనే భారత, చైనా సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.
► కొంతకాలంగా ఈ ప్రాంతంలో చైనా డ్రోన్ల హడావుడి బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా రగడకు ముందే మన యుద్ధ విమానాలు తవాంగ్ పరిసరాల్లో గస్తీ కాయడం, డేగ కళ్లతో నిఘా వేయడం మొదలైంది.
► దాదాపు 3,500 కిలోమీటర్ల పొడవైన నియంత్రణ రేఖ పొడవునా పరిస్థితిపై, దళాల సన్నద్ధతపై త్రివిధ దళాధిపతులు సమీక్ష జరిపారు.
భారత సైనికులు అడ్డుకున్నందుకే...తవాంగ్ రగడ: చైనా సైన్యం
‘గల్వాన్ లోయ’ చేదు అనుభవం నేపథ్యంలో తవాంగ్ రగడపై చైనా ప్రభుత్వ ఆచితూచి స్పందించగా సైన్యం మాత్రం తెంపరి వ్యాఖ్యలకు దిగింది! సరిహద్దుల వెంబడి పరిస్థితి నిలకడగా ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ మంగళవారం వ్యాఖ్యానించారు. ‘‘భారత దళాలే అక్రమంగా ఎల్‌ఓసీ దాటాయి. చైనా వైపు డాంగ్‌జాంగ్ ప్రాంతంలో గస్తీ విధుల్లో ఉన్న మా సైనికులను అడ్డుకున్నాయి. అది డిసెంబర్ 9 రగడకు దారి తీసింది’’ అని చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) వెస్టర్న్ థియేటర్ కమాండ్ అధికార ప్రతినిధి కల్నల్ లోంగ్ షోహువా ఆరోపించారు.
నిజాలు దాస్తున్న కేంద్రం
రాజ్‌నాథ్‌ది అరకొర ప్రకటన: కాంగ్రెస్
‘తవాంగ్’పై అట్టుడికిన ఉభయసభలు
కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాల వాకౌట్
తవాంగ్ రగడ మంగళవారం పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. చైనాను నిలువరించడంలో కేంద్రం సమర్థంగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాలన్నీ దుయ్యబట్టాయి. ‘‘ఇది కచ్చితంగా దౌత్య వైఫల్యమే. సరిహద్దుల వద్ద పరిస్థితిపై తక్షణం సవివర చర్చకు ప్రభుత్వం సిద్ధపడాలి’’ అని డిమాండ్ చేశాయి. రాజ్‌నాథ్ ప్రకటనపై వివరణకు పట్టుబట్టాయి. ఇది సున్నితమైన అంశమంటూ వివరణ కోరేందుకు రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా అనుమతివ్వలేదు. అందుకు నిరసనగా కాంగ్రెస్, ఎస్పీ, జేఎంఎం, ఆర్జేడీ, శివసేన, సీపీఎం, సీపీఐ ఉభయ సభల నుంచీ వాకౌట్ చేశాయి. అనంతరం రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. చైనా సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్) గుర్తింపు రద్దు అంశాన్ని కావాలని మోదీ సర్కారు తెరపైకి తెస్తోందని ఆరోపించారు. ఉభయ సభల్లో వివరణ ఇవ్వకుండా పారిపోయిందని ఎద్దేవా చేశారు. చైనా దురాక్రమణ, ఉగ్రవాదం దేశ భద్రతకు, ప్రాదేశిక సమగ్రతకు పెను ముప్పుగా మారుతున్నా మౌన ప్రేక్షకునిగా చూస్తోందంటూ దుయ్యబట్టారు.
మంత్రుల వెనక దాక్కుంటున్న మోదీ
చైనా అంశంపై ప్రభుత్వ వ్యవహార శైలిని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. తవాంగ్ రగడపై రక్షణ మంత్రి అరకొర ప్రకటనతో సరిపెట్టారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. దీనిపై మోదీ ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందని పార్టీ నేతలు గౌరవ్ గొగొయ్, పవన్ ఖేరా ఆరోపించారు. ‘‘డిసెంబర్ 9న ఘర్షణ జరిగితే రక్షణ మంత్రి ప్రకటనకు ఇంత ఆలస్యమెందుకు? ప్రజల నుంచి ఏం దాస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. జాతీయ భద్రత అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా మోదీ తన మంత్రుల వెనక దాక్కుంటారని ఎద్దేవా చేశారు. పీఎం కేర్స్ నిధికి విరాళాలిచ్చిన చైనా కంపెనీల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
అంగుళం కూడా వదలం: అమిత్ షా
రాజీవ్ ఫౌండేషన్‌కు చైనా నిధులు
దాని గుర్తింపు రద్దయినందుకే నిరసనలు
కాంగ్రెస్‌కు హోం మంత్రి చురకలు
మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం భారత భూభాగంలో ఎవరూ ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎలాంటి చొరబాట్లనూ అనుమతించబోమన్నారు. ‘లోక్‌సభలో కార్యకలాపాలను కాంగ్రెస్ పదేపదే అడ్డుకోవడానికి అసలు కారణం తవాంగ్ రగడ కాదు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్)కు విదేశీ విరాళాల చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) గుర్తింపును కేంద్రం రద్దు చేయడమే!’’ అంటూ చురకలంటించారు. ‘‘సమాజ సేవ కోసమంటూ నమోదు చేసుకున్న ఆర్జీఎఫ్‌కు ఇండో–చైనా సంబంధాల అభివృద్ధి సంబంధిత అధ్యయనం పేరిట చైనా ఎంబసీ నుంచి రూ.1.35 కోట్లు అందాయి. అందుకే దాని గుర్తింపు రద్దు చేయాల్సి వచ్చింది.
విపక్షాల గొడవ వల్ల ప్రశ్నోత్తరాలు తుడిచిపెట్టుకుపోయాయి. లేదంటే ఈ విషయాన్ని సభలోనే చెప్పేవాన్ని. బహుశా ఆర్జీఎఫ్ తన అధ్యయనం ముగించే ఉంటుంది. ఇంతకూ, 1962 చైనా యుద్ధంలో ఎన్ని వేల హెక్టార్ల భారత భూ భాగాన్ని చైనా ఆక్రమించిందన్నది ఆ అధ్యయనంలో ఉందా?’’ అంటూ ఎద్దేవా చేశారు. చైనాపై మోదీ ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తోందన్న కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు. నిజానికి విదేశీ నాయకులతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాధినేతలకు ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగానే ఐరాస భద్రతా మండలిలో స్థానం చేజారిందంటూ ప్రత్యారోపణ చేశారు.
‘‘భద్రతా మండలిలో భారత్ స్థానాన్ని కాంగ్రెస్‌కు చెందిన దేశ తొలి ప్రధాని నెహ్రూ ఎందుకు ‘త్యాగం’ చేశారు? కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్‌సింగ్ అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తే చైనా అభ్యంతరపెట్టింది. ఆ రాష్ట్ర సీఎం దోర్జీ ఖండూకు వీసా నిరాకరించింది. జమ్మూ కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ అక్కడి ప్రజలకు స్టేపుల్ వీసాలిచ్చింది. వీటన్నింటిపై కూడా ఆర్జీఎఫ్ అధ్యయనం చేసిందా?’’ అంటూ ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ సారథ్యంలోని ఆర్జీఎఫ్‌కు ఉగ్రవాదులతో లింకుల ఆరోపణలపై నిషేధం ఎదుర్కొంటున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ నుంచి కూడా రూ.50 లక్షలందాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment